సంపాదకీయం
శాలివాహన 1948 శ్రీ పరాభవ ఆషాఢ బహుళ పంచమి – 3 ఆగస్ట్ 2026, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నిరసన ప్రదర్శనలలో యువత చురుగ్గా పాల్గొనడం ఒక ఎత్తు అయితే, వారు మీడియా కెమెరాల ముందు వాడిన భాషతో దేశం యావత్ బిత్తరపోయింది. ముఖ్యంగా యువతులు ఉపయోగించిన పదాలు, హావభావాలతో అందరి దృష్టి వారి తల్లిదండ్రుల పెంపకంపైకి మళ్లింది. నిరసనలు చేయవద్దని ఎవరూ చెప్పరు, నాయకులను విమర్శించడాన్ని ఎవరూ కాదనరు. మన రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ కూడా. అయితే ఈ స్వేచ్ఛకు పరిమితులు ఉంటాయి. ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారు, అభ్యసించాలనుకుంటున్న వారూ, సివిలైజ్డ్ అని భావించే యువత అలాంటి భాషను ఉపయోగించడానికి కారణం ఏమిటి? కుటుంబానికి కూడా ఇబ్బందికరంగా పరిణమిస్తున్న ఈ ప్రవర్తనను నిలవరించడానికి, ఆ కుటుంబమే బాధ్యత తీసుకోవాలన్నది నిస్సందేహం. తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించకపోవడం, విలువలు నేర్పకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడు తున్నాయన్నది నిర్వివాదం.
ప్రతి తరం తనకంటూ ఒక ప్రత్యేక స్వభావాన్ని కలిగి ఉంటుంది. నేటి యువత సమాచార విస్ఫోటన యుగంలో పెరుగుతోంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండడం కారణంగా ప్రపంచం మొత్తం వారి ముందే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం “మేము చెప్పిందే చేయాలి” అనే ధోరణి ఆశించిన ఫలితాలను ఇవ్వదని తల్లిదండ్రులు గుర్తించాలి. వారి మనసును గెలవాలంటే ముందుగా వారిని అర్థం చేసుకోవాలి.
కుటుంబం అనేది పిల్లలకు మొదటి పాఠశాల. తల్లిదండ్రులే తొలి గురువులు. అయితే గురువు అంటే కేవలం ఆదేశాలు ఇచ్చేవాడు కాదు; సందేహాలను పోగొట్టే వాడు, ఆలోచింపజేసేవాడు. పిల్లల ప్రశ్నలకు సమాధానంచెప్పే సహనం తల్లిదండ్రులకు ఉండాలి. నేడు కుటుంబసభ్యులు ఒకే ఇంట్లోఉన్నా, అందరూ మొబైల్‌లో మునిగిపోతున్నారు. మాటలుతగ్గుతున్నాయి. సంభాషణ లేకపోవడంవల్ల అపార్థాలు పెరుగుతున్నాయి.అలాంటి సమయంలో కుటుంబసభ్యులు ప్రతిరోజూ కొంత సమయం కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, పిల్లలభావాలను తెలుసుకోవడం ఎంతో అవసరం.
యువతకు విలువలు నేర్పాలంటే ఉపన్యాసాల కంటే ఆచరణ గొప్పది. నిజాయితీ, క్రమశిక్షణ, పరస్పర గౌరవంవంటి విలువలను తల్లిదండ్రులు తమ జీవితంలో పాటిస్తే పిల్లలు వాటిని సహజంగానే అలవర్చుకుంటారు. భారతీయ కుటుంబ వ్యవస్థ బలమైన బంధాలపై నిర్మితమైంది. ఆ బంధాలను నిలబెట్టేది ప్రేమ, పరస్పర గౌరవం, సంభాషణ. ఆదేశాలు భయాన్ని కలిగించవచ్చు; కానీ సంభాషణ విశ్వాసాన్ని పెంచుతుంది. విశ్వాసమే కుటుంబాలను బలంగా నిలబెడుతుంది.
నేటి సమాజంలో యువతను సరైన దిశలో నడిపించాలంటే వారి భావాలను వినడం, వారితో మాట్లాడడం, వారి ఆలోచనలకు గౌరవం ఇవ్వడం అనివార్యం. కుటుంబంలో సంభాషణ సంస్కృతి పెరిగితేనే బాధ్యతాయుతమైన, విలువలతో కూడిన కొత్తతరం రూపుదిద్దుకుంటుంది. అదే సమాజానికి, దేశానికి శుభపరిణామం అని ఆరఎసఎస్ సర్‌సంఘచాలక్ మోహన్‌భాగవత్ ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు.
ఇటీవల కాలంలో దేశంలో అనేక రాష్ట్రాలలో ప్రశ్నాపత్రాలు లీకు కావడంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విషయంలో కలతచెందిన కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. సాధారణంగా అవినీతి అంటే డబ్బు విషయానికి సంబంధిం చినది అని భావిస్తుంటాం. ఈ అవినీతి ఇతర పనులలో కూడా గమనిస్తుంటాం. కేవలం చట్టాలు మాత్రమే అవినీతిని అరికట్టలేవు. కుటుంబం నుండే జీవన విలువలు నేర్పబడాలి. చిన్న చిన్న పనులు కూడా నీతివంతంగా జరిగేటట్లు బాల్యంలోనే తల్లిదండ్రులు తర్ఫీదు ఇవ్వాలి. మొక్కై వంగనిది మానై వంగునా అన్న సామెత ప్రకారం ప్రతి మంచి అలవాటును బాల్యం నుండే నాటుకునేటట్లు చూసే బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది.
ఈ క్రమంలో డా॥ కలాంను ఒకసారి గుర్తు చేసుకోవాలి. లక్షమంది విద్యార్థులలో ‘శాస్త్రీయ దృక్పథం’, అంకురింపచేసి, వారు దేశానికి ఉపయోగపడే ‘దేశభక్తులు’గా తయారుచేయాలనే ఉద్దేశ్యంతో ఒక ‘ఉద్యమం’ సాగించారు. అందుకని తరచుగా పిల్లలూ, యువకులతో సమయం వచ్చినప్పుడల్లా సమావేశాలు నిర్వహిస్తూ వారి సందేహాలు తెలుసుకునేవారు, సమాధానాలు ఇచ్చేవారు. డా॥ కలాం ఒక్కొక్కప్పుడు, వారి సందేహాలను ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా తెలుసుకొని, వారి అనుమానలు నివృత్తి చేయడంలో ఎంతో శ్రద్ధ చూపేవారు. ఇలా పిల్లలకు, యువకులకు దగ్గరగా ఉండి, డా॥కలాం తప్పవారి అభిప్రాయాలకు గొప్ప విలువనిచ్చిన నాయకులూ, అధికారులెవ్వరూ లేరు. అందుకే పిల్లలు, ఆయనతో ఎంతో చనువుగా ఉండి, నిర్భయంగా ప్రశ్నలు వేసేవారు. డా॥ కలాంవలె బాలలతో, యువ కులతో ‘మన్ కీ బాత’ వంటి కార్యక్రమాల ద్వారా సంభాషించడంలో మోదీ కొంతవరకు కృతకృత్యులవుతున్నారు. నీట్ నిరసన సమయంలో కూడా యువత అధికంగా ఉండే ఇన్‌స్టాగ్రామ్‌లో తన సందేశాన్ని పోస్ట్ చేయడం ద్వారా వారిని చేరుకునే యత్నం ప్రధాని చేసి, యువత నుంచి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే, రాజకీయనాయకులకన్నా సమాజంలోని ప్రాథమిక యÖనిట్ అయిన కుటుంబం, దాని విలువల ప్రభావం యువతపై అధికంగా ఉంటే, దేశ భవిష్యత్తుకు ఢోకా ఉండదన్నది ఖాయం.