సంపాదకీయం
శాలివాహన 1948 శ్రీ పరాభవ ఆషాఢ శుద్ధ త్రయోదశి – 27 జూలై 2026, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
సినిమా కేవలం వినోదాన్నేకాదు, జీవన విలువలను కూడా సమాజానికి అందించే సాధనం. కానీ, కొందరు వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడానికీ•, అసమానతలను, ఒక వర్గానికి చెందిన అన్యాయాలను విశేషంగా పట్టి చూపిస్తూ, మన దేశ పరిస్థితి ఇంతే, బాగుపడదు అనే నిరాశా వాదాన్ని వ్యాప్తి చేయడానికి సినిమాలను నిర్మించడం, వాటికే జాతీయ అవార్డులు రావడం ఈ మధ్యకాలంలో ప్రారంభమైన దురదృష్టకర పక్రియ. దీనికి భిన్నంగా, జాతీయ సమైక్యతను, జీవన విలువలను ప్రధానాంశంగా చేసుకొని నిర్మించిన సినిమాలను జాతీయ సినిమా అవార్డుల కమిటీ (జ్యూరీ) ఈసారి ఎంపిక చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం.
జాతీయ సినిమా అవార్డుల కమిటీ ఇటీవల ప్రకటించిన విజేతల జాబితాలో జాతీయభావం, విలువలతో కూడిన సినిమాలకు పెద్దపీట వేశారు. ప్రతి ఏడాదీ సినిమాఅవార్డులు ప్రకటన వెలువడగానే ఏదో ఒక వ•లనుంచి విమర్శలు వస్తుండేవి. కానీ ఈసారి అటువంటివాటికి జ్యూరీ అవకాశం ఇవ్వలేదు. దానికి ప్రధానకారణం వారు ఎంపికచేసిన చిత్రాలు అత్యంత ప్రజాదరణ పొందినవి కావడమే. ఇటీవలి కాలంలో దేశ హితానికి సంబంధించిన సినిమాలను ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. బలగం వంటి కుటుంబ కథాచిత్రాలు,దురంధర్ వంటి చిత్రాలకు బ్రహ్మరథం పడుతున్నారు.
ఉత్తమ చిత్రంగా ‘ఆర్టికల్ 370’ ఎంపిక, దేశం పట్ల ప్రేమ ఉన్న వారికి ఆనందాన్ని ఇచ్చింది. భారతదేశంలో అంతర్భాగమైన కశ్మీర్‌ను ఆర్టికల్ 370తో దూరం చేసిన కుట్రను ఎన్నో తరాలు చూసి ఉన్నాయి. ఈ ఆర్టికల్ ద్వారా కశ్మీర్‌ను ఈ దేశానికి దూరం చేసే ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయాలని నాటి భారతీయ జనసంఘ్ నేత శ్యామాప్రసాద్ ఉద్యమించారు. ఆ పోరాటంలోనే తన ప్రాణాలను సైతం త్యాగం చేశారు. ఇంతటి చరిత్ర గల ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికి దక్కింది. ఇందుకోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేసింది, విజయవంతంగా దానిని ఎలా రద్దు చేయగలిగిందనే కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘ఆర్టికల్ 370’. దేశ సమైక్యత, సమగ్రతలకు మోదీ ప్రభుత్వం ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుందనేది ఈ సినిమాలో దర్శకుడు ఆదిత్య సుహాగ్ కళ్లకు కట్టినట్టు చూపించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ‘ఆర్టికల్ 370’కి ఉత్తమచిత్రంగా అవార్డు రావడం విశేషం. ఇదే చిత్రంలో ఎన్.ఐ.ఎ. ఏజెంట్ జూనీ హక్సర్ పాత్రకు జీవంపోసిన యామీ గౌతమ్ ఉత్తమ నటిగా జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఈ సినిమాకు స్వరాలు సమకూర్చిన శాశ్వత్ సచిదేవ్‌కు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు లభించడం ఆహ్వానించదగినది.
ఈసారి అవార్డులు లభించిన చిత్రాలలో భారతీయసంస్కృతీ సంప్రదాయలకు, పురాణేతిహాసాలకు ప్రాధాన్యమిచ్చిన చిత్రాలు ఉన్నాయి. అలానే సామాజి కాంశాలకు, స్ఫూర్తిదాయక కథాంశాలకు జ్యూరీ పెద్ద పీట వేసింది. భారతీయ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన తెలుగు సినిమా ‘కల్కి 2898 ఎ.డి.’ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అవార్డు గెలుచుకుంది. నేటి విద్యావిధానంలోని ప్రధాన లోపాలను ఎత్తిచూపుతూ, ఎలాంటి విద్యాబోధన ద్వారా పిలల్ల మనుసుల్ని వికసింప చేయవచ్చో తెలిపే ‘35:చిన్నకథ కాదు’ ఉత్తమ బాలలచిత్రంగా ఎంపికైంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రాల్లో తెలుగు నుంచి ఎంపికైన ‘కమిటీ కుర్రోళ్ళు’ కూడా సామాజిక అంశాల నేపథ్యంలో తెరకెక్కింది. ఇదే కేటగిరిలో హిందీ నుంచి ఎంపికైన బయోపిక్ ‘శ్రీకాంత్’ సైతం గొప్పచిత్రం. పుట్టుకతోనే అంధుడైన శ్రీకాంత్‌బొల్లా పట్టుదలతో, తల్లిదండ్రుల సహకారంతో అమెరికాలోని ఎం.ఐ.టీ.లో మేనేజ్‌మెంట్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం భారత్‌కు తిరిగివచ్చి, ఇండస్ట్రీని స్థాపించి, పారిశ్రామికవేత్తగా ఎదిగారు. శ్రీకాంత్ జీవనప్రస్థానాన్ని ఈ చిత్రంలోచూపించారు. శ్రీకాంత్ పాత్రను రాజ్‌కుమార్‌రావు సమర్థవంతంగా పోషించారు. అలానే ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ ముకుంద్‌వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘అమరన్’ చిత్రానికి వ•డు అవార్డులు లభించాయి.
ఉత్తమనటుడిగా తొలిసారి అవార్డు అందుకున్న కార్తీక్ ఆర్యన్ పోషించిన పాత్ర కూడా ఈ తరానికి స్ఫూర్తినిస్తుంది. కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించిన ‘చందుఛాంపియన్’లో కార్తీక్ ఆర్యన్ 1972లో భారతదేశపు మొట్టమొదటి పారాఒలింపిక్ స్వర్ణపతాక విజేత మురళీ కాంత్ పెట్కర్ పాత్రను పోషించాడు. ఎన్నో సంవత్సరాలపాటు అజ్ఞాతంతర్వాత ఈ క్రీడాకారుడికి 2018లో పద్మశ్రీ పురస్కారం లభించింది. అతడి పాత్రలో జీవించిన కార్తీక్ ఆర్యన్‌ను జాతీయ అవార్డుకు కమిటీ ఎంపికచేసింది. అలానే సీనియర్ నటుడు మమ్ముట్టి సైతం ‘భ్రమయుగం’లోని నటనకుగానూ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఈసారి ధనుష్‌కూ జాతీయ అవార్డులలో ప్రత్యేక స్థానం దక్కింది. ప్రముఖ నటుడు రణదీప్ హూడా ‘స్వాతంత్య్ర వీర్ సావర్కర్’ చిత్రానికిగానూ ఉత్తమ నూతన దర్శకుడు అవార్డుకు ఎంపిక కావడం విశేషం.
ప్రజల అభిరుచులు మారిన విషయాన్ని ఇప్పుడు నిర్మాతలు, దర్శకులే కాదు జ్యూరీ కూడా గుర్తించినట్టుంది. ఒక సినిమా చూపే ప్రభావానికి జ్యూరీ అవార్డే కొలమానంకాకపోవచ్చు. కానీ, ఆ సినిమా ఇచ్చిన సందేశానికి విస్తృత స్థాయిలో దీనివల్ల ఆమోదం లభించిందని భావించవచ్చు. విలువలు లేకుండా తీసిన సినిమాలను నేడు ‘సి’సెంటర్లలో కూడా ఆడించలేని పరిస్థితులు నెలకొన్నాయి. సహజంగా యువత వినోదాన్ని కోరుకుంటుంది, కానీ దాని ముసుగులో చూపే అశ్లీలతను,అరాచకాలను ఇప్పుడు వారే తోసి పుచ్చుతు న్నారు.ఈ అవార్డులు సినిమాప్రపంచంలో ఒక మేలిమలుపుకావాలని ఆశిద్దాం.