సంపాదకీయం

శాలివాహన 1948 శ్రీ పరాభవ శ్రావణ శుద్ధ ద్వాదశి – 24  ఆగస్ట్ 2026, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్


విశృంఖల స్వేచ్ఛను నియంత్రించే చర్యలు మొదలు కాగానే వామపక్ష మేధావులు, తీవ్రవాద అనుకూల సూడో బుద్ధిజీవి బృందాలు బెంబేలెత్తి పోతున్నాయి. దేశంలోని విశ్వవిద్యాలయాలను అడ్డాగా చేసుకుని దశాబ్దాలుగా యువతరాన్ని పెడదోవ పట్టిస్తున్న వామపక్ష తీవ్రవాద అనుకూల మేధో బృందాలకు ముకుతాడు వేసే చర్యలు ఉధృతం కావడంతో కంగాళీ ప్రచారాన్ని లంకించుకుంటున్నాయి. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలోని ‘దిమాగీ నక్సల’ అనే పదబంధం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

వామపక్ష మేధోవర్గం, ముఖ్యంగా తీవ్రవాద అనుకూల మేధావులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ప్రధాని మోదీ ఏదైనా కొత్త పదాన్ని, పదబంధాన్ని ఉపయోగించారంటే దాని ప్రతిక్రియలు ప్రమాదకరంగా ఉంటాయని వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అయితే, 2013లోనే కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలైట్లు, నక్సలిజంపై సుప్రీం కోర్టుకు నివేదించిన అఫిడవిట్‌లో, నగరాల్లో పనిచేస్తున్న మావోయిస్టు ‘ప్రజా/ఫ్రంట్ సంస్థలు,’ సీపీఐ (మావోయిస్ట్)తో ‘సహజసిద్ధంగా ముడిపడి ఉన్నాయి’ అంటూ వారిలో విద్యావేత్తలు, కార్యకర్తలు, సిద్ధాంతకర్తలు ఉన్నారంటూ వివరించింది. వీరంతా ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులను ప్రతికూల దృష్టిలో చూపుతూ తప్పుడు ప్రచారం చేశారని పేర్కొంది. ఈ సిద్ధాంతకర్తలే మావోయిస్టు ఉద్యమాన్ని సజీవంగా ఉంచుతున్నారని, అనేక విధాలుగా వీరు ‘పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ’కన్నా ప్రమాదకరమైనవారంటూ కూడా అభివర్ణించింది. అంతేకాదు, వీరికి వ్యతిరేకంగా ప్రభుత్వసంస్థలు చట్టపరమైన చర్యలు చేపట్టినప్పుడు, సిపిఐ (మావోయిస్టు) పార్టీ ప్రాపగాండా యంత్రాంగంవల్ల  ప్రతికూల ఫలితాలు వచ్చాయని  మొరపెట్టుకుంది.

అంతేనా, ప్రధానంగా ‘మానవ హక్కుల ఎన్జీవోల’ ముసుగులో పనిచేసే ఈ ‘ప్రజా సంస్థలు’, సీపీఐ (మావోయిస్టు) పార్టీ నిర్మాణంతో సహజంగా ముడిపడి ఉన్నప్పటికీ, చట్టపరమైనచర్యల నుండి తప్పించుకునే ప్రయత్నంలో ఎన్జీవో అనే ప్రత్యేక గుర్తింపులను కొనసాగిస్తాయని వివరించింది. ఈ ‘ప్రజాసంస్థల’కు సాధార ణంగా పార్టీ సిద్ధాంతానికి పూర్తిగా కట్టుబడి ఉండే విద్యావేత్తలు, కార్యకర్తలతో సహా సిద్ధాంతకర్తలు నాయకత్వం వహిస్తారు. ఇలాంటి సంస్థలు పైకి మానవ హక్కులకు సంబంధించిన సమస్యలను అనుసరిస్తున్నట్లు నటిస్తాయి. భద్రతాదళాల  చర్యలను బలహీనపరచడానికి, నిర్వీర్యం చేయడానికి చట్టపరమైన ప్రక్రియలను ఉపయోగించడంలోనూ, అలాగే తమ ‘విప్లవం’ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రచారం, తప్పుడు సమాచారం ద్వారా ప్రభుత్వ సంస్థల ప్రతిష్టను దెబ్బతీయడంలోనూ ఇవి నిపుణులై ఉంటాయంటూ వివరించింది.

ఇంత వివరణాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ‘దిమాగీ నక్సల్స’ ఎలా పని చేస్తున్నారో సుప్రీంకోర్టుకు వివరించింది. ఇప్పుడు హఠాత్తుగా తమకు ఆ విషయాలే తెలియనట్టు, కాంగ్రెస్ నేత పి.చిదంబరం మాట్లాడుతూ, తాను కూడా దిమాగీ నక్సల్ అని ప్రకటించుకోవడం విడ్డూరం. అటువంటివారు, సుప్రీం కోర్టులో అదే దిమాగీ నక్సల్స్‌కు వ్యతిరేకంగా ఎందుకు ఫిర్యాదు చేశారో ప్రశ్నించడం అసమంజసం కాదు. ముఖ్యంగా, ఆ అఫిడవిట్ చూడాలనుకున్నవారికి అందుబాటులో ఉన్న సందర్భంలో వారు ఇలా మాట్లాడటం అంటే, ప్రజల మేధస్సును తక్కువగా అంచనా వేయడమే. అలాగే, ఒకస్థాయిలో మండిపడుతున్న మేధావులు అప్పుడు ఎందుకు ఇటువంటి హడావిడి చేయలేదో ఆశ్చర్యమే!

నిజానికి, ప్రధాని మోదీ ప్రయోగించిన ‘దిమాగీ నక్సల’ మాటకు ఇటీవలి పరిణామాలే ప్రాతిపదిక. దేశ రాజధాని వేదికగా జరిగిన ఆందోళనల అంతరార్థమే ఈ పదబంధం పుట్టుకకు మూలం. అంతే కాదు, ‘సర’ ప్రక్రియపై, ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై, ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలపై నిందలు వేయడం తీవ్రమైన నేపథ్యంలోనే ప్రధాని మోదీ దీనిని సంధించారు. సాధారణ సమయంలో కాక స్వాతంత్య్ర దినోత్సవ వేళ, దేశమంతా ప్రధాని మాటలను ఉత్సుకతతో చెవొగ్గి వింటున్న వేళ, నిర్దిష్ట లక్ష్యాన్ని చెప్పడం కోసమే ‘దిమాగీ నక్సల’ మాటను ప్రధాని ప్రయోగించారు. ప్రధాని నరేంద్ర మోదీ గతంలో అర్బన్ నక్సల్, ఆందోళన్ జీవి, టుక్డే టుక్డే గ్యాంగ్, ప్రొఫెషనల్ పెసిమిస్ట్ అనే మాటలను వాడారు. ఈ పదబంధాలన్నీ దేశ వర్తమాన రాజకీయ స్థితిని ప్రతిబింబించేవే తప్ప కేవలం రాజకీయ విమర్శ కోసం చేసినవి కావని.. ఇంగితం ఉన్నవారికి అర్థమవుతుంది. రాజ్యాంగపరమైన రక్షణలు, చట్టపర మైన హక్కులను ఆసరాగా చేసుకుని ఏళ్లుగా దేశంలోని మేధో నక్సల్ బృందాలు, సంస్థలు ఇష్టారీతిన విపరీత భావ ప్రకటనా స్చేచ్ఛను అనుభవిస్తున్నాయి.

 కేంద్రం అనుకున్నట్టే ఈ ఏడాది మార్చి 31లోపు వామపక్ష తీవ్రవాదం పీచమణచింది. ఇక రాబోయే రోజుల్లో నగరాలు, పట్టణాలను కేంద్రంగా చేసుకుని, వామపక్ష తీవ్రవాదాన్ని పెంచి, పోషించి, సామాజిక అశాంతికి కారణమవుతున్న మేధో తీవ్రవాదుల ఆటకట్టించేందుకు సిద్ధమవుతోంది.  పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ‘దిమాగీ నక్సల’ పదబంధం గురించి వివరణ ఇచ్చారు. ఎటువంటి వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ ఆ మాటెందుకు వాడారో స్పష్టం చేశారు. దేశ అంతర్గత భద్రతకు సవాలు విసిరే శక్తులు నానాటికీ పేట్రేగిపోతున్నాయి. కేంద్రం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పట్టణాల్లో తిష్ఠవేసిన ఉగ్రవాద, తీవ్రవాద అనుకూల శక్తుల మద్దతుతో జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. దేశంలోని ప్రతిపక్షాలు అందుకు సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తున్నాయి. పౌరసమాజం మేల్కొని మేధో తీవ్రవాద ప్రమాదాన్ని అర్థం చేసుకుని, వారిని ఏకాకిని చేయడం ద్వారా దేశాన్ని రక్షించుకోవడం తక్షణ కర్తవ్యం.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.