సంపాదకీయం
శాలివాహన 1948 శ్రీ పరాభవ ఆషాఢ బహుళ ద్వాదశి – 10 ఆగస్ట్ 2026, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
డెబ్భై తొమ్మిదవ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారత్ ఎదుట ఇంకా ఎన్నో సవాళ్లు. ప్రత్యక్ష వలసవాదం నుంచి ముక్తమైనా మానసికంగా కాలేదన్న విషయాన్ని పౌరులు గుర్తిస్తున్న కాలమిది. గత జూలై 20న పార్లమెంటు ముట్టడి పేరిట జరిగిన పరిణామాలనేపథ్యంలో ఈ జాతి తన అస్తిత్వంగురించి కొన్ని ప్రశ్నలు వేసుకొంటున్న సందర్భమిది. సుమారు 8 దశాబ్దాల కాలంపాటు నినాదాల ఇజాలనే ఎండమావుల వెంట పరుగులు తీసి, నేటి వేడి నడుమ నిలబడి ఎందుకిలా అయింది? దేశభవితవ్యం ఎలా ఉంటుంది? తిలక్‌జీ,గాంధీజీ,నేతాజీల కలలు కల్లలుగా ఎందుకు చితికిపోతున్నాయి? అని పలువురు ప్రశ్నించుకుంటున్న సమయమిది.
ప్రపంచంలో ఏ దేశమైన తమ జాతీయభావాన్ని పెంపొందించుకొనేందుకే ప్రాధాన్యతనిస్తుంది. కానీ మన దేశంలో మాత్రం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి 50ఏళ్లలో పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉంది. నేటి పరిస్థితులకు అదే కారణం. తాను ఇంగ్లీష్‌వాడినని గర్వంగా చెప్పుకొన్న తొలి ప్రధాని నెహ్రూ జాతీయ పునరుజ్జీవనం పేరుతో అమలుచేసిన విధానాలలో చాలావరకు మనను మానసికంగా తిరిగి వలస భావనకు గురిచేయడానికి ఉద్దేశించినవే. అందుకే, నెహ్రూ విధానాలన్నీ బ్రిటీష్ ప్రభుత్వ పద్ధతులకు కొనసాగింపే అయ్యేది. నేటి పరిస్థితికి ప్రధాన కారణం ఇదే. భారత్ ప్రపంచంలోనే మహోన్నత వారసత్వం కలిగి ఉండి కూడా తమ చరిత్ర, సంప్ర దాయాలపట్ల సిగ్గుపడే విధంగా విద్యార్థులు తయారవడమే సమస్యలకు కారణం. ఇది జాతీయవాదులకు ఎంతో బాధ కలిగిస్తున్నది.
అంటే, స్వాతంత్య్రంవచ్చి ఇంతకాలంగడిచినా భారత్‌లో వలసవాద బ్రిటీష్ ప్రభావం ఇంకా అంతరించిపోలేదు. వలసవాద శాశ్వత ప్రభావానికి ఆంగ్ల భాషయే కారణమన్నది నిర్వివాదం. వలసవాదాన్ని మనం తరచుగా బ్రిటీష్ వారితోనే ముడిపెట్టి చూసినా, ఇది రెండు రకాలు. ఒకటి ప్రత్యక్షవలసవాదం. దానిని అంతచేశాం. రెండవది పైకి కనపడకుండా చాపకింద నీరులా సాగే వ్యవహారం. ఇది ప్రమాద కరమైనది. ఎందుకంటే, ఇది మన బుద్ధిని, ఐకమత్యాన్ని సర్వనాశనం చేస్తుంది. అది మనకు అనుభవమే.
భారత్‌తోపాటు స్వాతంత్య్రం పొందిన ఇతర దేశాలు వలసవాదాన్ని తుద ముట్టించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం చూశాం. అయితే మన దేశంలో దీని విలువను మన నాయకులు గుర్తించలేదు. స్వధర్మం ప్రాముఖ్యత తెలియక అది దేశ ప్రగతిని నిరోధిస్తుందని, దానిని అడ్డుకున్నవారు ఒకరకం. ఇక, రెండవ రకంవారు సమస్యలను పరిష్కరించే శక్తి దేశానికి లేదనుకుని ప్రత్యామ్నాయంగా వివిధ కాపిటలిస్టు, కమ్యూనిస్గు దేశాలలో ఇక్కడ సమస్యలకు పరిష్కారం వెతికారు. ఈ రెండు పంథాలూ విధ్వంసకరమైనవే అయినా అవి దేశీయమైనవి. ఇక మూడవ వర్గం మన దేశానికి అసలైన శత్రువు,అదే భారత్‌ను ముక్కలు చేయాలన్న దళం. వీరు కాంగ్రెస్ పాలనాకాలంలో విద్యారంగంలోకి ప్రవేశించి మూడు నాలుగు తరాల యువత బుర్రలను విషంతో నింపారు. ఇటీవల నీట్ పేపర్ లీక్‌ను సాకుగా తీసుకుని, దేశానికి వ్యతిరేకంగా నినాదాలతో నిరసన చేసిన బొద్దింకలు ఆ తానులో ముక్కలే.
అందుకే, ఒక స్వాతంత్య్ర జాతిగా భారతదేశం మొదటి అర్ధశతాబ్దం రెండు ప్రముఖమైన వైఫల్యాలకు ప్రతీకగా నిలిచింది. ఒకటి, భారత్ అనే భావనను ఒక జాతిగా నిర్వహించలేకపోవడం, రెండవది, విద్యారంగంలోను, మేధో జీవితంలో జాతీయ సంస్థలను రూపొందించకపోవడం. మరో విధంగా చెప్పా లంటే ఈ దేశ చరిత్ర సంస్కృతులలో పాతుకొన్నదే జాతీయభావం అనే వారి అవగాహనా వైఫల్యం. దీని ఫలితంగా ఈ రోజున జాతి వ్యతిరేక శక్తులు దేశభద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తూ స్వైరవిహారం చేస్తున్నాయి. కాంగ్రెస్ 50 ఏళ్ల పాలన నిర్వాకం ఇది.
మతం కన్నా, మార్క్సిజం కన్నా తమకు జన్మనిచ్చిన ఈ దేశం మిన్న అన్న సత్యాన్ని నేర్వకపోతే ఎన్ని స్వాతంత్య్ర దినోత్సవాలొచ్చినా, ఎన్ని ఆర్డినెన్స్‌లొచ్చినా అలాంటివారంతా భారతీయ జీవనదిలో విషనాగులుగానే మిగిలిపోతారు. ఇది వారికి, ఈ దేశానికి మంచిది కాదు.
ఈ వలస రాజరికపు వారసులు తమ పూర్వ ప్రభువులకు ఎంతగా అంకితమైపోయారంటే… ఏ విషయమైనా, భారతీయమైనది, అందులోను హిందువులదైతే చాలు బద్ధవైరంతో భగ్గుమంటారు. ఆర్కియాలజీ, తదితర శాస్త్రాలలో సాధించిన వైజ్ఞానిక ఆవిష్కరణలు నిజాలను బయటపెట్టినప్పుడైనా తెలివితెచ్చుకొని గతకాలపు వలసపాలకుల హేయమైన రాతలను, అసత్యాలను వదలివేయాలి. కానీ అలా జరగలేదు. ఫలితంగా ఒక గొప్ప జాతికి ఎంతమాత్రం తగనిది, అబద్ధాల పుట్ట అయిన ఆ దిక్కుమాలిన చరిత్ర అలాగే ఉండిపోయింది. గత దశాబ్దకాలంలో దీనిని సరిదిద్దే ప్రయత్నం ప్రారంభం కావడం ఒక శుభపరిణామం.
ఈ పరిణామాల నేపథ్యంలో మనం అప్రమత్తం కావాలి. నిజానికి, మన దేశంలోని బానిస సంస్కృతిని, బానిస చరిత్రను వదిలించుకొనే యత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న నూతన జాతీయ విద్యావిధానం కూడా అందులో భాగమే. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సమాజం కూడా సహకరిస్తున్నది. అయినప్పటికీ చేయవలసింది ఎంతో ఉంది. కుటుంబాలలో బాల్యం నుండే భారతీయత పట్ల, సంస్కృతి, నాగరికత, మహాపురుషుల పట్ల గౌరవాన్ని, విశ్వాసాన్ని పాదుకొల్పాలి. ఈ గురుతరమైన బాధ్యతను యావత్ సమాజం శీఘ్రాతి శీఘ్రంగా గుర్తించి ఆ దిశవైపు వడివడిగా అడుగులు వేయగలిగినపుడే మన దేశం అమృతకాలాన్ని సార్థకం చేసుకుంటు ప్రపంచానికి శాంతిని అందించగలదు.