సంపాదకీయం

శాలివాహన 1948 శ్రీ పరాభవ ఆషాఢ శుద్ధ షష్ఠి – 20  జూలై 2026, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్


ఒక వ్యక్తి శారీరకంగా, మానసికంగా, ఇరుగు పొరుగువారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలని ఆరోగ్యకరమైన మానవుని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచిస్తున్నది. ఇదే దేశానికి కూడా వర్తిస్తుంది.

ప్రస్తుత ప్రపంచీకరణ యుగంలో ఏ దేశ ప్రగతి అయినా కేవలం దాని అంతర్గత విధానాలపైనే కాకుండా ప్రపంచ దేశాలతో దాని సంబంధాలు ఎలా ఉన్నాయనే దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. గత దశాబ్దకాలంలో భారత్ విదేశాంగ విధానంలో అపూర్వమైన వేగం, చైతన్యం కనిపించింది. అయితే ప్రధాని మోదీ నిరంతర విదేశీ పర్యటనలు తరచుగా దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఒకవైపు ప్రతిపక్షాలు ఈ పర్యటనల ఔచిత్యాన్ని ఆర్థిక ఖర్చులను ప్రశ్నిస్తుంటే, మరోవైపు వ్యూహాత్మక నిపుణులు దీనిని భారత్ క్రియాశీల దౌత్యపు ‘స్వర్ణయుగం’గా భావిస్తున్నారు.

ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక మాంద్యం, సాంకేతిక మార్పులగుండా పయనిస్తున్న నేపథ్యంలో, ఈ పర్యటనల ద్వారా భారత్‌కు నిజంగా ఏమి లాభించిందనేది సమీక్షించుకోవడం అవసరం. ఇవి కేవలం అధికారిక సమావేశాలేనా? లేదా వీటివల్ల మన దేశానికి దీర్ఘకాలిక, వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనం ఏదైనా చేకూరిందా? మోదీ ప్రభుత్వం దౌత్యాన్ని నేరుగా దేశ ఆర్థికరంగంతో ముడిపెట్టింది. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక శక్తులైన అమెరికా, యÖరప్ మొదలైన దేశాల పర్యటనలో మోదీ స్వయంగా అక్కడి అగ్రశ్రేణి సీఈఓలు, పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు. ఫలితంగా భారత్‌లోకి రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు వచ్చాయి. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ వంటి ఆర్థిక విధానాలను ప్రపంచవేదికలపై ప్రమోట్ చేయడం ద్వారా ఆపిల్, మైక్రాన్ వంటి దిగ్గజ కంపెనీలు భారత్‌లో తమ ఉత్పాదక యÖనిట్లు ప్రారంభించేందుకు ఆసక్తి చూపాయి.

మోదీ దౌత్యం భారత్‌కు ప్రపంచ అగ్రరాజ్యాల మధ్య ఒక ప్రత్యేకమైన సమతుల్య స్థానాన్ని తెచ్చిపెట్టిందనడంలో సందేహం లేదు. పొరుగుదేశాలకే మొదటి ప్రాధాన్యత విధానంతోపాటు గల్ఫ్ దేశాలతో సంబంధాలను పూర్తిగా మార్చివేయడం ఈ దౌత్యంలోనే అతిపెద్ద విజయాలలో ఒకటి. ఇంధన భద్రతను బలోపేతం చేసింది మోదీ దౌత్యం. రష్యా, ఆఫ్రికా దేశాల పర్యటనలు భారతీయ ఇంధన వనరులను వైవిధ్యభరితం చేసాయి. దీనితో ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు హెచ్చుతగ్గులవల్ల అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతుంటే మన దేశం సురక్షితంగా ఉంది. బ్రిటన్‌తో కలసి వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ చొరవను ప్రారంభించడం ద్వారా భారత్ ప్రపంచ వాతావరణ దౌత్యంలో అగ్రగామిగా నిలిచింది.

ఈ నెల 6-11 తేదీ వరకు మోదీ జరిపిన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటన ద్వారా మనకు రక్షణ, భద్రతా సహకారం, కీలక ఖనిజాల సరఫరా, ఇండో – ఫసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్య వ్యాపారం, సాంకేతికత, విద్య, సముద్రతీర భద్రత వంటి పలు రంగాలలో అత్యంత కీలకమైన ఒప్పందాలు కుదరడం గొప్ప పరిణామం. అంతేకాదు ఈ విశేష దౌత్య పర్యటన భారత్ ‘యాక్ట్ ఈస్ట’ విధానానికి సరికొత్త శక్తినివ్వడమే కాకుండా ఇండో`ఫసిఫిక్ ప్రాంతంతో భారత్‌ను ఒక ‘నెట్ సెక్యూరిటీ ప్రొవైడర’ (రక్షణ కల్పించే ప్రధాన దేశం)గా, ఆర్థికశక్తిగా నిలబెట్టింది. ఈ పర్యటన కేవలం – కొన్ని ఒప్పందాలకో, దైపాక్షిక సమావేశాలకో పరిమితం కాలేదు. భారత్ సుదూర వ్యూహాత్మక దృక్పథమైన విజన్ మహాసాగర్ అమలుకు శ్రీకారంగా దీనిని మనం భావించాలి. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఇండో`ఫసిఫిక్ ప్రాంతంలోని సముద్ర భౌగోళిక సరిహద్దులలో ఉన్నాయి. ఇక్కడ నుండి భారత్‌లో మÖడింట రెండువంతుల వ్యాపారం, ఇంధన మార్గాలు ప్రయాణిస్తాయి. ఈ పర్యటన ద్వారా భారత్ రక్షణ ఎగుమతులు, కీలక ఖనిజాల భద్రత, అణుఇంధన కొత్త మార్గాలు, స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాల వంటి బలమైన వ్యూహాన్ని సిద్ధంచేసింది. ఇది రాబోయే దశాబ్దాలలో భారతదేశాన్ని 55 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ కంటే ముందుకు తీసుకెళ్లి, గొప్ప అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

ప్రధానమంత్రి ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. నిరంతర పర్యటనలు, వ్యక్తిగత సంబంధాల కారణంగా ప్రపంచవేదికలపై భారత్ గౌరవ, ప్రతిష్ఠలు గణనీయంగా పెరిగాయి. మన దేశాన్ని ఇపుడు అంతర్జాతీయ సమస్యలలో భాగంగా కాకుండా ఆ సమస్యలకు పరిష్కారంగా చూస్తున్నారు. భారత్ నేతృత్వంలో జి-20 అధ్యక్ష బాధ్యతలు విజయవంతంగా నిర్వహించడం, అందులో అభివృద్ధి చెందుతున్న దేశాలు (గ్లోబల్ సౌత్) తమ స్వరాన్ని బలంగా వినిపించడం ప్రధానమంత్రి ప్రపంచ యోగ్యతకు నిలువెత్తు నిదర్శనం-ఆఫ్రికన్ యÖనియన్‌ను జి-20లో శాశ్వత సభ్యునిగా చేర్చడం భారత్ దౌత్య నైపుణ్యానికి అద్దం పడుతుంది. యÖఎనఓలో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తింపు తీసుకురావడం, ఆయుర్వేదాన్ని విశ్వవ్యాపితంగా ప్రచారం చేసి, ప్రోత్సహించడం, ముఖ్యంగా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఉన్న భారతీయుల హృదయాలను తట్టిలేపి వారందరినీ దేశ ప్రగతితో ముడిపెట్టడం మొదలైనవన్నీ భారతదేశ సాంస్కృతిక ముద్రను, సాఫ్ట్‌పవర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయి. ‘వికసిత భారత’ దిశగా అడుగులేస్తున్న మనకు వీటన్నిటినీ శుభపరిణామాలుగా ఆశిద్దాం.

About Author

By editor