సంపాదకీయం
శాలివాహన 1948 శ్రీ పరాభవ భాద్రపద శుద్ధ చవితి – 14 సెప్టెంబర్ 2026, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
చిట్టచివరకు బొద్దింకల దండు బదాబదలైంది. రెండుగా విడిపోయి.. రాజకీయ చర్చల్లో నిమగ్నమైంది. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో విభేదించిన మనీష్ బ్రహ్మభట్ వర్గం సెప్టెంబర్ 3న సీజేపీ-డెమోక్రటిక్ పేరిట చీలిక గ్రూపును ఏర్పాటు చేసింది. ఆకాశానికి నిచ్చెన వేసిన అభిజీత్ దీప్కే అసలు రంగు ఇంత త్వరగా బయటపడుతుందని…పాపం వామపక్ష మేధావులు గ్రహించలేదు. అంతర్జాతీయస్థాయిలో…అహరహం శ్రమించి తయారు చేసిన ప్రణాళిక..అర్థంతరంగా అభాసుపాలు కావడంతో కుట్రదారుల గొంతులో వెలక్కాయ పడినట్టయింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మాధ్యమాలను మచ్చిక చేసుకుని మరీ..హస్తిన వేదికగా ఆడిన కృతక నాటకం..ఆఖరు అంకంలోనే అవమానాన్ని మూటగట్టుకుంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఇక దేశాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నామనే ధీమాను వ్యక్తం చేసిన బొద్దింకల పార్టీ..అంతర్గతంగానే ప్రత్యర్థులను తయారు చేసుకుంది. అంతిమంగా చీలిపోయింది.
సద్యోజనితంగా కనిపించే ఉద్యమాలు, ఆందోళనలేవీ అంతస్సారంలో.. స్వచ్ఛందమైనవి కావు. వ్యక్తమయ్యే రూపం వెనుక అందుకు పూర్తిగా భిన్నమైన సారం ఉంటుంది. రూపసారాల మధ్య వ్యత్యాసాన్ని పసిగడితే..బొద్దింకల అసలు రంగు అర్థమవుతుంది. అందుకే మన పూర్వీకులు ‘మెరిసేదంతా బంగారం కాదు’ అన్నారు. బొద్దింకల ఆందోళనల వెనుక రాజకీయ ప్రయోజన కాంక్ష ఉందని..సాక్షాత్తూ సోనమ్ వాంగ్‌చుక్ తేల్చేసిన తర్వాత ఇప్పుడిప్పుడే యథాలాపంగా రైలెక్కి వెళ్లిపోయిన బొద్దింకలకు సత్యం ఆలస్యంగా అయినా బోధపడుతోంది.
ఢిల్లీ జంతర్‌మంతర్ ఆందోళనల్లో పాల్గొని, నిరాహార దీక్ష చేసి..నాటకీయతను దట్టించిన సోనమ్ వాంగ్‌చుక్ తాజా వ్యాఖ్యలు..కాక్రోచ్ జనతా పార్టీ అసలు రంగును బయట పెట్టాయి. అంతటితో ఆగలేదు, కాక్రోచ్ పార్టీ నేతలు కొత్త పార్టీ పెట్టినా, ఇప్పుడున్న పార్టీల్లో చేరినా వారికి తన తోడ్పాటు ఉంటుందని.. భరోసా ఇచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ చీలిక వర్గం నేత మనీష్ బ్రహ్మభట్..సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై చేసిన ఆరోపణలను బొద్దింకల ఆందోళనల్లో పాల్గొన్నవారు నిశితంగా పరిశీలించి, ఆత్మావలోకనం చేసుకోవాలి. అప్ప్పుడు ఇలాంటి ప్రాయోజిత ఆందోళనలబారిన పడకుండా ఉంటారు. సామాజిక మాధ్యమాల వేదికగా ‘సీజేపీ’ ఆరంభమైనప్పుడే చాలామంది దీప్కే…కేజ్రీవాల్ బంటు అని తేల్చి చెప్పారు. ఆందోళనల ఉధృతిలో ఉన్న విద్యార్థి, యువకులు దాన్ని పెడచెవిన పెట్టారు.
ఆగస్టు చివరివారంలో సీజేపీకి రాజకీయ లక్ష్యాల గురించి మాట్లాడిన సోనమ్ వాంగ్‌చుక్..సెప్టెంబర్‌లో మాటమార్చి…సీజేపీ నిష్పక్షపాత సంస్థ అని, ఏ రాజకీయపార్టీకి సంబంధం లేకుండా తటస్థంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. వాంగ్‌చుక్ అభిప్రాయాలు మారుతున్న దశలోనే మనీష్ బ్రహ్మభట్ అసలు గుట్టు బయటపెట్టాడు. అభిజీత్ దీప్కే స్థాపించిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’… కేజ్రీవాల్ నేతృత్వంలోని ‘ఆమ్ ఆద్మీ పార్టీ’కి మరో రూపమని తేల్చేశాడు. సీజేపీలోకి కేజ్రీవాల్ పరకాయ ప్రవేశం చేశాడని స్పష్టంగానే ప్రకటించాడు.
కాక్రోచ్ జనతా పార్టీ చీలికకు సరిగ్గా నెల రోజుల ముందు ఓ ఆంగ్ల వార్తా సంస్థ..సీజేపీకి ‘గ్లోబల్ టూల్ కిట’-డీప్ స్టేట్‌కి ఉన్న సంబంధాన్ని తేటతెల్లం చేసింది. టూల్ కిట్‌కు ప్రధాన పరికరమైన స్వీడిష్ పర్యావరణ కార్యకర్త..గ్రెటా థన్‌బర్గ్ సీజేపీ ఆందోళనలను..భారతదేశంలో విద్యాసంస్కరణ ఉద్యమంగా కీర్తిస్తూ..ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు ప్రయత్నించిందని సదరు వార్తా సంస్థ తన పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది. సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎసఎఫఐసీజేపీ ఆందోళనలకు సంఘీభావంగా లండన్‌లో నిర్వహించిన ఊరేగింపులో గ్రెటా థన్‌బర్గ్ ఈ ఆందోళనలకు మద్దతు తెలిపింది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ఆరంభ సమయంలో, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు విసురుతున్న సవాళ్ల మధ్య కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న దశలో…ఈ స్థితిని అదనుగా చూసుకుని బొద్దింకలు జంతర్‌మంతర్ సహా పార్లమెంట్ భవనాల సముదాయాలను చుట్టు ముట్టాయి. మరోవైపు కాంగ్రెస్‌పార్టీ కేంద్రం చేపట్టిన ‘గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు’ పై విష ప్రచారం మొదలు పెట్టింది. ఇదే సమయంలో బాంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ రాడికలిస్టులు సీజేపీ ఆందోళనలకు సంఘీభావంగా ప్రదర్శనలు నిర్వహించారు. కెనెడాలోని ఖలిస్థానీ వేర్పాటువాదులు కూడా సీజేపీకి మద్దతు ప్రకటించారు. మరోవైపు జంతర్‌మంతర్‌లో సీజేపీ చేపట్టిన ఆందోళనల్లో అమెరికా పౌరులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. బ్రిటీష్ లేబర్‌పార్టీ నేత జెరెమీ కార్బిన్ సీజేపీ ఆందోళనలకు సంఘీభావం ప్రకటించారు.
జూలైలో ఢిల్లీ కేంద్రంగా సీజేపీ చేసిన ఆందోళనలకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన మద్దతు, సంఘీభావం వెనుక డీప్‌స్టేట్ ఉందనేది బహిరంగ రహస్యం. అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరాలకు నిర్మాణానికి అంగీకరించకపోవడం, పహెల్గాం దాడి తర్వాత భారత్ ప్రతిదాడి, విదేశాంగ విధానం, దౌత్య సంబంధాల విషయంలో భారత్ స్వతంత్రంగా వ్యవహరించడంతో ‘డీప్‌స్టేట’ రంగంలోకి దిగింది. భారత ప్రభుత్వాన్ని అస్థిరతకు గురిచేయడం, సామాజిక జీవితంలో అనిశ్చితిని, అశాంతిని రేకెత్తించడం వ్యూహాత్మక అవసరమని డీప్‌స్టేట్ భావించింది. ఇందుకు విద్యార్థులే సరైన ఆయుధమని అంచనా వేసింది. విద్యార్థులు, నిరుద్యోగులను స్వచ్ఛంద ఉద్యమకారులుగా భ్రమింపచేయడం వల్ల తమ ఎత్తులు పారతాయని డీప్‌స్టేట్ భావించింది. అయితే, కథ అడ్డం తిరిగి… సీజేపీ రెండు ముక్కలైంది. ప్రాయోజిత ఉద్యమాలెప్పుడూ దీర్ఘకాలం మనలేవనడానికి బొద్దింకల ఆందోళన ప్రబలమైన ఉదాహరణ.