సంపాదకీయం
శాలివాహన 1948 శ్రీ పరాభవ అధిక జ్యేష్ఠ శుద్ధ విదియ – 18 మే 2026, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
భారత్ ఇప్పుడు కీలక మలుపులో నిలబడింది. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంటే, అమెరికా, ఇజ్రాయిల్- ఇరాన్ యుద్ధం కారణంగా నెలకొన్న అస్థిర పరిస్థితులు భారత్‌కు ప్రతిబంధకంగా మారాయి. అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు, ఎరువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. వాణిజ్య లోటు, దిగుమతుల భారం, రూపాయి మారకం విలువ ఒత్తిడికి గురవుతుండడం వంటి సవాళ్లు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగరం పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ దేశ ప్రజల ముందుంచిన ఏడు సూచనలు కేవలం సలహాలు కావు. అవి ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి ప్రతి పౌరుడు వేయాల్సిన పునాది రాళ్లు.
అయితే ఏడాది పాటు బంగారం కొనుగోలు వాయిదా వేయాలనే ప్రకటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మోదీ చేసిన ఈ సూచనను అటు కొందరు ఆర్థిక నిపుణులు సైతం దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేదే అని వ్యాఖ్యానిస్తున్నారు. గత రెండు మూడు ఏళ్లుగా బంగారం ధర సైతం కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. వీటి దిగుమతికే మన విదేశీ మారక ద్రవ్య నిల్వలలో అధిక శాతం ఖర్చు అయిపోయే పరిస్థితి నెలకొంది. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభానికంటే ముందు మన దేశ నిల్వలు 730 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని ట్రేడింగ్ ఎకనామిక్స్ గణాంకాలు చెబుతున్నాయి. ముడి చమురు, బంగారం, వంట నూనెలు, ఎరువులు దిగుమతి కారణంగా కేవలం రెండు నెలల్లో 690 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. మనం ఎక్కువ ఖర్చు చేసే కొద్దీ మన నిల్వలు మరింత వేగంగా కరిగిపోతాయి. డాలర్ విలువ పెరిగిపోయి రూపాయి విలువ తగ్గిపోతుంది. భారతీయులు ఏడాదికి సగటున కొనే పసిడి 8 టన్నులు అని ఒక అంచనా. 90 శాతం బంగారం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. బంగారం మన సంస్కృతిలో భాగం కావచ్చు కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా విచక్షణ కూడా అవసరం. ప్రధాని చెప్పినట్లు ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే కచ్చితంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై కాస్తయినా భారం తగ్గుతుంది. దేశానికి మేలు చేసిన వారమవుతాం.
రెండవది, ఇంధన వినియోగం. దేశ అవసరాల్లో 85% క్రూడ్ ఆయిల్ దిగుమతే. ఏటా 12 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఈ ఒక్క అంశానికే ఖర్చవుతోంది. వర్క్ ఫ్రమ్ హోం, ఆన్‌లైన్ సమావేశాలు, ప్రజా రవాణా వినియోగం వంటి చిన్న మార్పులు దేశ ఖజానాకు పెద్ద ఊరటనిస్తాయి. ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లడం ఇక విలాసం కాదు, దేశభక్తితో కూడిన బాధ్యత. ఒక ఎలక్ట్రిక్ కారు జీవితకాలంలో నాలుగు లక్షల రూపాయల పెట్రోల్ దిగుమతిని ఆపగలదు. మూడవది, మన వ్యవసాయం.., అటు వంటనూనెల కోసం మనం మలేషియా, ఇండోనేషియాలపై ఆధారపడుతున్నాం. రసాయన ఎరువుల కోసం చైనా, రష్యాల వైపు చూస్తున్నాం. ఈ దిగుమతుల బిల్లు ఏటా 4 లక్షల కోట్లు దాటుతోంది. ఇంట్లో నూనె వాడకం తగ్గించడం, పొలంలో సహజ ఎరువులు, సోలార్ పంపులు వాడటం వల్ల రైతుకు మేలు, భూమికి మేలు, దేశానికి మేలు. “Vocal for Local” అనేది నినాదంగా మిగిలిపోకూడదు. ప్రతి కొనుగోలు దేశ ఆర్థిక రంగానికి ఊతం ఇచ్చేదిలా ఉండాలి. మనం స్వదేశీ వస్తువు కొన్నప్పుడు, మనం ఒక భారతీయ ఉద్యోగాన్ని, ఒక భారతీయ కుటుంబాన్ని ఆదుకుంటున్నాం. విదేశీ విలాసాలను, అనవసర ఆడంబరాలను తగ్గించుకోవడం ద్వారా మధ్యతరగతి తన భవిష్యత్తును భద్రపరచుకోవడమే కాక, దేశ మూలధన నిర్మాణానికి తోడ్పడుతుంది. ఈ సూచనలను విమర్శనాత్మక దృష్టితో చూసేవారు ఉండవచ్చు. “ప్రజలపై భారం మోపుతున్నారు” అనవచ్చు. కానీ నిజం ఏమిటంటే, స్వాతంత్య్రం వచ్చిన 78 ఏళ్ల తర్వాత కూడా మనం ఇంధనం కోసం, నూనె కోసం, ఎరువుల కోసం, బంగారం కోసం ఇతర దేశాలపై ఆధారపడటం శోచనీయం. ఈ ఆధారపడటాన్ని తగ్గించుకునే శక్తి ప్రభుత్వ విధానాల కంటే, ప్రజల ప్రవర్తనలోనే ఎక్కువగా ఉంది. ఒక దేశం గొప్పగా తయారవ్వడం అనేది జీడీపీ గణాంకాల వల్ల కాదు, పౌరుల సామూహిక సంకల్పం వల్ల. జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయిల్ వంటి దేశాలు వనరులు లేకపోయినా ప్రపంచంలో తలెత్తుకు నిలబడ్డాయి. కారణం – ప్రజల క్రమశిక్షణ, పొదుపు, స్వదేశీ స్ఫూర్తి. ప్రధాని చెప్పిన ఏడు సూచనలు మనపై రుద్దిన నిబంధనలు కావు. అవి మనకు మనమే విధించుకోవాల్సిన ఆర్థిక లక్ష్మణ రేఖలు. ఈ రేఖ లోపల నడిస్తే, దేశం బాగుపడుతుంది, మన కుటుంబం బాగుపడుతుంది. ఒక లీటరు పెట్రోల్ ఆదా చేసినా, ఒక గ్రాము బంగారం కొనడం ఆపినా, ఒక స్వదేశీ వస్తువు కొన్నా – మీరు భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఒక ఇటుక పేర్చినట్టే. మన వంటింటి కోసం రూపొందించే సరకుల జాబితా దేశభవితకు కీలక నిర్ణయమవుతుంది. ఈ చిన్న చిన్న తెలివైన నిర్ణయాలే రేపటి “వికసిత్ భారత”కు బాటలు వేస్తాయి. ప్రజలకు మంచి సూచనలు, సలహాలు ఇవ్వడం అనేది ప్రధాని నరేంద్ర మోదీకి కొత్త కాదు. 2014లో ప్రధాని పదవిని చేపట్టిన నాటి నుంచి అలా సూచనలు చేయడాన్ని తన కార్యాచరణలో ఒక భాగంగా చేసుకున్నారు. అలా ఆవిర్భవించినవే రేడియోలో ప్రతి నెల చివరి ఆదివారం వినిపించే మన్‌కీ బాత్, ప్రతి సంవత్సరం పరీక్షలకు ముందు దేశవ్యాప్తంగా విద్యార్థులతో ప్రధాని స్వయంగా పాల్గొనే పరీక్షా పే చర్చ లాంటి కార్యక్రమాలు. అయితే దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాల్సిన విపక్షాలకు ఇది ఏ మాత్రం మింగుడుపడని వ్యవహారశైలి. ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసినప్పటికీ సాక్షాత్తూ ప్రధాని స్వయంగా చేసిన సూచనలపై దుమ్మెత్తిపోయడం విపక్షాల అధోగతికి నిదర్శనం.