సంపాదకీయం
శాలివాహన 1948 శ్రీ పరాభవ వైశాఖ బహుళ నవమి – 11 మే 2026, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
అల్లుడుగారు అమీనై ఇల్లు గుర్రాలశాల చేశాడని కళింగ దేశంలో సామెత. ప్రజలు ఐచ్ఛికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే.. జనం తాత్కాలిక మౌనం పాటిస్తారు. తమ వంతు వచ్చేవరకు వేచి చూస్తారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాలు దీనినే సూచిస్తున్నాయి.
దక్షిణాదిలోని రెండు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి; తూర్పు భారతంలోని పశ్చిమ బెంగాల్, ఈశాన్యంలోని అసోం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కేవలం భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయాలను మాత్రమే సూచించడం లేదు. ప్రాచీనతను, దేశీయ తాత్వికతను, సనాతన ధర్మాన్నీ ఈసడించే రాజకీయ పక్షాలకు ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. కేంద్రంలో అధికారం చేపట్టాలని ఉబలాటపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఇకపై ప్రాంతీయ పార్టీలతోనూ పోటీ పడజాలదని ఈ ఎన్నికలు తేల్చేశాయి. అబద్ధపు పునాదులపై నిర్మించిన శతాబ్ద కాలపు ద్రవిడవాద రాజకీయ మైదానం ఒకే ఒక ఎన్నికతో కంపించిపోయింది.
సంస్కరణోద్యమానికి, సాంస్కృతిక పునరుజ్జీవానికి, స్వాతంత్య్రోద్యమానికి జీవగడ్డగా చరిత్రకెక్కిన వంగభూమి కాలగతిలో అనేక సామాజిక, రాజకీయ జాడ్యాలకు నెలవుగా మారింది. 17వ శతాబ్దం నాటికి శాంతచిత్తాన్ని, సేద్యాన్నీ నమ్ముకున్న బెంగాల్ గ్రామీణ సమాజం 1770 నాటికి కరువు, దుర్భిక్షం బారిన పడింది. అసహజ మరణాలను చూసింది. హింసకు గురైంది. బెంగాల్ కరువు కాలంలో చెలరేగిన హింస గురించి బంకింబాబు తన ‘ఆనంద మఠం’ నవలలో ప్రస్తావించారు. సర్ విలియమ్ విల్సన్ హంటర్ 1868లో ప్రచురించిన The Annals of Rural Bengal పుస్తకంలో బీర్భూమ్, విష్ణుపురి జిల్లాల్లో 18,19వ శతాబ్దాల్లో చోటు చేసుకున్న పరిణామాలను, బెంగాల్ గ్రామీణ వ్యవసాయక జీవితం గురించి వివరంగా రాశారు.
బంకీంచంద్ర ఛటర్జీ మొదలు రాజారామ్ మోహన్‌రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రామకృష్ణ పరమహంస, వివేకానంద, నేతాజీ, అరవింద ఘోష్, రవీంద్రనాథ్ టాగూర్, ఆచార్య జగదీష్ చంద్రబోస్, ప్రపుల్ల చంద్ర రే, సత్యేంద్రనాథ్ బోస్, నందలాల్ బోస్ వంటి చిత్రకారులు, బహుముఖ ప్రజ్ఞాశాలి అశుతోష్ ముఖర్జీ, జాతీయవాద రాజకీయాలకు దారితెన్నులు నిర్దేశించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వంటి నేతలు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, విప్లవకారులు, సంఘ సంస్కర్తలు, జాతి జీవనాన్ని సుసంపన్నం చేసినవారు పుట్టిన గడ్డ.. కాలక్రమంలో అనేక అనారోగ్యకర ధోరణులకు, హింసాచరణకు చిరునామాగా మారింది.
బెంగాల్ కేంద్రంగా కమ్యూనిస్టు ఉద్యమం వెర్రితలలు వేసి.. వామపక్ష తీవ్రవాదంగా పరిణమించింది. మధ్య భారతంలోకి విస్తరించి అనేక మంది ప్రాణాలు బలిగొంది.
1972లో కాంగ్రెస్ నేత, నాటి ప్రధాని ఇందిరా గాంధీ అనుయాయి సిద్ధార్థ శంకర్ రే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత పశ్చిమబెంగాల్‌లో చెలరేగిన హింస, హత్యాకాండలను ప్రజలు నేటికీ గుర్తు చేసుకుంటారు. 34ఏళ్ల వామపక్ష పార్టీల పాలనలో రాజకీయ హింస తారాస్థాయికి చేరింది. మూక హత్యలు బెంగాల్ సమాజంలో సర్వసాధారణమయ్యాయి. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత హింసాత్మక రాజకీయాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అధికారం, అహంకారం, అశ్రిత పక్షపాతం కలగలిస్తే మమతా బెనర్జీ రాజకీయం. ఏలికకు ఉలికిపాటు ఎక్కువైతే..పాలితులు అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. పశ్చిమ బెంగాల్ అట్లా దశాబ్దాల తరబడి హింస, ప్రతిహింస; దాడులు, ప్రతిదాడులతో రక్తమోడింది. రాజకీయ హింస సామాజిక జీవితంలోకి ప్రవేశించడంతో… దౌర్జన్యకాండ రక్తగతమైంది.
స్థలకాలాలు పాలకులను దూరంగా విసిరేయడం అకస్మాత్తుగా జరగదు. ప్రత్యామ్నాయం లేక, కమ్యూనిస్టుల హింస భరించ వశంకాక పశ్చిమ బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీని దశాబ్దన్నర కాలంపాటు భరించారు. దీదీ మనసు బెంగపడినా..వంగదేశ ప్రజలు తృణమూల్‌ను నిర్దాక్షిణ్యంగా ప్రజాక్షేత్రం నుంచి గెంటేశారు. మమతా బెనర్జీ బెంగాల్ ను చీకటి గుయ్యారం చేసి..చిరువెలుతురు కోసం కిటికీలు బిగించింది. విధేయతను శాశ్వత కప్పంగా మార్చాలని విఫల యత్నం చేసింది.
బెంగాలీల రక్తంలో చెంగావి చైతన్యం ఉరకలేసింది. పశ్చిమ బెంగాల్ ఓటర్లు కేవలం బీజేపీని మాత్రమే గెలిపించలేదు. భారత్-బంగ్లా సరిహద్దులకు తాము కాపలా అని హామీ పడ్డారు. వంగదేశపు ప్రజలు మమతా బెనర్జీ వద్ద నుంచి కేవలం అధికారాన్ని మాత్రమే లాక్కోలేదు, భవిష్యత్తులో ఇలాంటి తరహా పాలన సాధ్యపడదని తేల్చి చెప్పారు.
బెంగాల్‌లో 13వ శతాబ్దం నుండి భక్తియార్ ఖిల్జీతో ప్రారంభమైన హిందూ వ్యతిరేక పాలన దాదాపు నేటివరకు కొనసాగిందని, 726 సంవత్సరాల తరువాత హిందువుల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం వచ్చిందని బిజెపి నేత ఒక వ్యాఖ్యానించడం గమనార్హం.
రాష్ట్రాలను సామంత రాజ్యాలుగా మార్చుకుని, ఇష్టారీతిన పాలించిన ప్రాంతీయ పార్టీలు ఒక్కొక్కటిగా సుప్తావస్థలోకి జారుకుంటున్నాయి. అధికార యావ వాటి స్వభావంలో భాగం కావడం వల్ల అంత సులభంగా అవి ఓటమిని అంగీకరించవు. శాసన ‘సభాపర్వం’లో వాటికి జరాసంధ వధ జరగాలి. అంగ, వంగ, కళింగ రాజ్యాల్లోని రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టిన భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలకు అడ్డుకట్ట వేసి, ప్రజలకు సవ్యమైన పాలన అందించినప్పుడే విజయానికి సార్థకత ఏర్పడుతుంది.