రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరం మొదలవుతున్న వేళ విద్యార్థులు, తల్లిదండ్రులపైకి రాష్ట్ర ప్రభుత్వం పిడుగులాంటి నిర్ణయాన్ని సంధించింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్య అందించే ఆశాదీపంగా కొనసాగుతోన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఆచరణలో నిర్వీర్యం చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పావులు కదుపుతోంది. జీవో నంబర్ 7 పేరిట జారీ చేసిన ఈ ఉత్తర్వులు పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసే పన్నాగంలో భాగమని విద్యార్థి సంఘాలు, విపక్షాలు, బీసీ కులసంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇక ‘చదువుపై ధ్యాస ఎలా పెట్టాలి’అని విద్యార్థులు,‘ఫీజులు ఎలా కట్టాలి’ అని తల్లిదండ్రులు ఆందోళనతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు పుస్తకాల సంచీకి బదులు అప్పుల మూట మోయాల్సిన దుస్థితిని సాక్షాత్తూ ప్రభుత్వమే కల్పిస్తోందన్న విమర్శలు చుట్టుముడుతున్నాయి. జీవో నంబర్ 7 పేరిట జారీ అయిన ఉత్తర్వులు పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేసేలా ఉన్నాయని తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇక్కడే మరో అంశం కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఉన్నత విద్యా సంస్థల్లో ఫీజులను 30శాతం పెంచుతూ.. ప్రభుత్వమే కొద్దిరోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడేమో… ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని, కాలేజీకి మీరే ఫీజులు కట్టుకోవాలని కొత్త జీవో జారీ చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవు తున్నాయి. ఉన్నత విద్యలు చదవాలన్న ఆశలతో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను మానసికంగా కుంగదీస్తున్నాయి. దాదాపు 14 లక్షల మంది విద్యార్థులపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపించనుంది.
గుదిబండగా జీవో నెంబర్ 7
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలులోకి వచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం విద్యార్థులు, ముఖ్యంగా తల్లిదండ్రులకు ఒక వరమైనది. ఆర్థికంగా వెనుకబడినవాళ్లు, నిరుపేదల పిల్లలు కేవలం ఫీజు కారణంగా ఉన్నత విద్యకు దూరం కాకుండా ఈ పథకం ఆదుకుంటూ వస్తోంది. తొలినాళ్ల నుంచీ ఈ పథకం స్వభావం రీత్యా.. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి అర్హులైన విద్యార్థులకు సంబంధించి.. ప్రభుత్వం నేరుగా కాలేజీల ఖాతాల్లో నిధులు జమ చేస్తూ వస్తోంది. అంటే విద్యార్థి తనకు ఇష్టమైన, లేదంటే తనకు సీటు వచ్చిన కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటే చాలు.. ఫీజు గురించి తల్లిదండ్రులకు గుబులు ఉండేది కాదు. మెరిట్ వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులపై ఆ భారం పడకుండా ప్రభుత్వమే ఫీజు చెల్లించేది. ఇది పేద, మధ్య తరగతి కుటుంబాలకు నిజంగా ఆసరాగా ఉంటూ వస్తోంది. కానీ, ఏప్రిల్ 29వ తేదీన ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 7 ప్రకారం ఇకపై ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన మొత్తాన్ని విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పద్ధతిలో ఇది అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. వచ్చే విద్యా సంవత్సరం అంటే.. 2026-27 నుండి ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులందరికీ ఈ విధానం వర్తింపజేయబోతున్నట్లు జీవో ద్వారా తెలియజేసింది. అయితే, సాధారణంగా వినడానికి ఇది బాగున్నట్టే కనిపించినప్పటికీ.. ఈ మార్పు వెనుక దారుణమైన మరో కోణం దాగి ఉంది. ప్రభుత్వం ఎప్పుడో డబ్బులు విద్యార్థి ఖాతాలో వేస్తుంది. కానీ, విద్యార్థి మాత్రం ముందుగానే కాలేజీకి ఫీజు కట్టాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంటుంది. అంటే.. అడ్మిషన్ సమయంలోనే కాలేజీలు డిమాండ్ చేసినంత ఫీజు చెల్లిస్తేనే సీటు దక్కుతుంది. లేదంటే సీటు కోల్పోవాల్సి వస్తుంది. ఇది పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆశనిపాతంలా పరిణమించబోతోంది.
ర్యాంకర్లూ, మెరిట్ వచ్చిరా ఫీజు కట్టాల్సిందే!
ఇప్పటివరకు పది వేల లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థులకు ఏ కాలేజీలో సీటు వచ్చినా పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లించేది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ప్రభుత్వ కాలేజీల్లో చదివిన వారికి ఇంజినీరింగ్ సహా అన్ని ప్రొఫెషనల్ కోర్సుల ఫీజు పూర్తిగా ప్రభుత్వం భరించేది. అయితే, కొత్త జీవో ప్రకారం పరిస్థితి మారబోతోంది. ర్యాంకర్లయినా, టాపర్లయినా అడ్మిషన్ సమయంలో ముందుగా ఫీజు కట్టాల్సిందే. ప్రభుత్వం తర్వాత వాళ్ల ఖాతాలో వేస్తుంది. కానీ, సర్కారు డీబీటీ పద్ధతిలో ట్రాన్స్‌ఫర్ చేసే డబ్బులు ఎప్పుడు ఖాతాలో జమ అవుతాయో, లేదో తెలియదు. కనీసం కోర్సు పూర్తయ్యే సమయానికి అయినా రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల అవుతాయో, లేదో హమీ లేదు. ఎందుకంటే.. ఇప్పుడు కాలేజీలకు కూడా అలాగే, ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ డబ్బులు బకాయి పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన రెండున్నరేళ్లలో 10 వేల కోట్ల రూపాయల బకాయిలు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. ఇలాంటి వాస్తవ పరిస్థితుల్లో ముందుగా ఫీజు చెల్లించాలని, తర్వాత ప్రభుత్వమే ఖాతాలో జమ చేస్తుందంటే వాళ్లను అప్పుల ఊబిలోకి దించడమే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను సందిగ్ధంలో పడేయడమే కాదు.. దెబ్బమీద దెబ్బ పడేలా చేస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీల్లో ఫీజును రాష్ట్ర ప్రభుత్వమే ఇటీవల భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎక్కువ ఫీజు వసూలు చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉదాహరణకు చూస్తే.. గతంలో రూ.లక్ష ఫీజు వసూలు చేసే కాలేజీల్లో ఇప్పుడు రూ.లక్షా 12 వేలకు పెంచేసింది. మరోవైపు.. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి అర్హులైన వాళ్లు కూడా ఎవరికి వాళ్లే ఫీజు చెల్లించాలని జీవో నెంబర్ 7 ద్వారా చెప్పింది. ఫలితంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో చేరే విద్యార్థులు ముందుగానే ఫీజు చెల్లించాల్సి వస్తే.. అప్పుల భారం తడిసి మోపెడయ్యే పరిస్థితి దాపురిం చింది. పైగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద పదివేల ర్యాంకు దాటిన ప్రతి విద్యార్థికీ ఇస్తున్న మొత్తం 35వేల రూపాయలు మాత్రమే. అంటే మిగతా మొత్తం విద్యార్థుల తల్లిదండ్రులపైనే భారం పడుతోంది.
బకాయిలపై హైకోర్టుకు కాలేజీలు
తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. గడిచిన రెండున్నరేళ్లుగా దాదాపు రూ. పదివేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయలేదని ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ విచారణ జరుగుతున్న సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 7ను తీసుకొచ్చిందని న్యాయ కోవిదులు అంటున్నారు. ఈ అంశం కోర్టు ధిక్కరణే అంటూ పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు.
బీసీ సంఘాల కన్నెర్ర
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చేందుకే ప్రభుత్వం జీవో నెంబర్ 7ను తెచ్చిందని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. హైకోర్టులో అడ్వకేట్ జనరల్ బలమైన వాదనలు వినిపించలేదని ఆయా సంఘాల నేతలు మండిపడు తున్నారు. విద్యార్థుల నుంచే కాలేజీలు నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని తీర్పులు వస్తుంటే బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అడ్మిషన్ సమయంలో తల్లిదండ్రులు ఫీజు కట్టాలని, తర్వాత విద్యార్థులు రీఫండ్ తీసుకుంటారని ప్రభుత్వం అనడం అనాలోచితమని విమర్శిస్తున్నారు. నెల జీతంతో బతికే కూలీలు, చిరు వ్యాపారులు, మధ్య తరగతి కుటుంబాలు అడ్మిషన్ సమయంలో ఒకేసారి వేలు, లక్షల రూపాయలు ఎక్కడ నుండి తెస్తాయని నిలదీస్తున్నారు. ఒకవేళ ఇదే నిర్ణయం అమలైతే,. పిల్లల ఉన్నత విద్య కోసం అప్పులు అనివార్యం అవుతాయి. ఫలితంగా వడ్డీలు మోయలేని భారంగా పరిణమిస్తాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోంది. ఈ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 2వేల 500కు పైగా ఉన్నత విద్యా సంస్థలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించాల్సిన రూ. 10 వేల కోట్ల బకాయిల్లో ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. వన్ టైమ్ సెటిల్‌మెంట్ పేరిట కొంత కాలం, ట్రస్ట్ టోకెన్ల పేరిట ఇంకొంత కాలం, కమిటీల పేరిట మరికొన్ని రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు ఆ బకాయిల కారణంగా విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీలు ఇవ్వడం లేదు.
ప్రభుత్వం రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాకే సర్టిఫికెట్లు ఇస్తామని కొన్ని కాలేజీలు కరాఖండిగా చెబుతున్నాయి. లేదంటే ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఫలితంగా సర్టిఫికెట్లు లేక కోర్సులు పూర్తయినప్పటికీ యువకులు ఉద్యోగాలు వెతుక్కోవడం ఇబ్బంది అవుతోంది.
సర్కారు అడుగులు ఎటువైపు?
జీవో నెంబర్ 7ను ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రగా విపక్షాలు అభివర్ణిస్తు న్నాయి. అందులో పేర్కొన్న అంశాలు, చేర్చిన నిబంధనలు విద్యార్థులకు, కాలేజీలకు కూడా కొన్ని సందర్భాల్లో అసాధ్యమయ్యే పరిస్థితి ఉందంటు న్నాయి. ఈ జీవో ప్రకారం చూస్తే.. విద్యార్థులకు ఆధార్ నెంబర్ తప్పనిసరి. అలాగే, బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉండాలి. డిజిటల్ వెరిఫికేషన్ ఉంటేనే, కాలేజీ అటెండెన్స్ ఆధారంగానే నిధులను విడుదల చేస్తారు.
అయితే, ఇవన్నీ ఒకేసారి అమలు చేయడం గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు ఇబ్బందిగా పరిణమించే ప్రమాదం గోచరిస్తోంది. ఆధార్ కార్డులో పేరు, పదో తరగతి సర్టిఫికెట్‌లో కొన్ని అంశాల్లో తేడాలున్నాయి. వాటిని ఇప్పటి కిప్పుడు అప్‌డేట్ చేసుకోవడం విద్యార్థులకు సమస్య అవుతుంది. నెట్ కనెక్షన్ సరిగ్గా పని చేయని గ్రామీణ కాలేజీల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ సాంకేతిక అడ్డంకులపై ప్రభుత్వం సరైన విధంగా అధ్యయనం చేయలేదన్న విమర్శలు చుట్టుముడుతున్నాయి. ఇలాంటి నిబంధనల కారణంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం నిర్వీర్యం అయ్యే ప్రమాదం పొంచి ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ఉన్నత చదువులపై ఆసక్తి ఉన్న పేద, మద్యతరగతి, బలహీర వర్గాల పిల్లలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంటుందన్న చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో ప్రతియేటా 13 నుంచి 14 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా లబ్ధి పొందు తున్నారు. ఈ పథకం వారికి కేవలం ఫీజుకు సంబంధించినదే కాదు.. వారి కలలకు, వారి కుటుంబాల ఆశలకు ఆధారం.
– సుజాత గోపగోని,
సీనియర్ జర్నలిస్ట్, 6302164068