పశ్చిమాసియాలో ఉద్రిక్తతలవేళ ఇటీవల కీలక పరిణామం చోటుచేసుకొంది. మే 1 నుంచి చమురు ఉత్పత్తి చేసే దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్- ఒపెక్, ఒపెకం నుంచి బయటకొస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించింది. ఒపెక్ నుంచి బయటకు వచ్చినప్పటికీ మార్కెట్ డిమాండ్, పరిస్థితులకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని క్రమంగా పెంచుతూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని, దేశీయ ఇంధన ఉత్పత్తిపై పెట్టుబడులను మరింత వేగవంతం చేస్తామని ఆ దేశం వెల్లడించింది. 1967 నుంచే ఒపెక్ సభ్యురాలిగా యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత మూడో అతిపెద్ద చమురు ఎగుమతిదారు. ఒపెక్ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది కూడా.
చమురు ఉత్పత్తి కోటాలపై ఒపెక్ కూటములు విధించే పరిమితుల వల్ల యÖఏఈ తన పూర్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని వాడుకోలేకపోతోంది. తమ చమురు ఆదాయాన్ని పెంచుకోవాలంటే కూటముల నుంచి బయటకు రావడం తప్పనిసరని ఆ దేశం భావించింది. ప్రస్తుతం యూఏఈ రోజుకు సుమారు 5 మిలియన్ బారెళ్ల చమురును ఉత్పత్తి చేయగలదు. విజన్ 2031లో భాగంగా తమ ఆర్థిక వ్యవస్థను చమురుతో పాటు టెక్నాలజీ, టూరిజం లాంటి రంగాలకు విస్తరించాలని యూఏఈ భావిస్తోంది. ఈ రంగాల ప్రాజెక్టులకు అవసరమైన భారీ నిధుల సమకూర్చుకునేందుకు చమురును అధిక మొత్తంలో విక్రయించాలని నిర్ణయించుకుంది. యూఏఈ తన మార్కెట్ వాటాను పెంచుకోవడానికి తక్కువ ధరకే చమురును విక్రయిస్తే, ఇతర దేశాలూ ధరలు తగ్గించాల్సి రావచ్చు. కానీ ప్రస్తుతం అమెరికా – ఇరాన్ యుద్ధం వల్ల సముద్ర మార్గంలో చమురు సరఫరాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు యూఏఈ చమురు ఉత్పత్తిని పెంచినా, చమురు సరఫరాలో పెద్దగా తేడా ఏదీ రాకపోవచ్చు. యూఏఈ ఉత్పత్తిని పెంచే ప్రభావం చమురు ధరలపై కనిపించడానికి మరో 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
కారణం ఇదేనా?
కాగా భౌగోళిక ఉద్రిక్తతలు, ఉత్పత్తి పెంపు విషయంలో ఒపెక్‌లో తలెత్తిన అంతర్గత కలహాల నేపథ్యంలో ఒపెక్ నుంచి బయటకు రావాలని, పొరుగు దేశం సౌదీ అరేబియాతో విభేదాల కారణంగా యూఏఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒపెక్ కూటమి దేశాల చమురు ఉత్పత్తి కోటాల కేటాయింపు విషయంలో గత కొన్నేళ్లుగా యూఏఈ, సౌదీ మధ్య విభేదాలు కొనసాగు తున్నాయి. చమురు ధరల నియంత్రణ, ఉత్పత్తి తగ్గింపు విషయంలోనూ ఈ రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. మరోవైపు ఇరాన్ దాడుల విషయంలో సౌదీ అరేబియా వంటి తన ప్రాంతీయ మిత్రదేశాలు సరైన రీతిలో స్పందించకపోవడం పట్ల యూఏఈ అసంతృప్తితో ఉంది. కాగా, ఒపెక్ నుంచి యూఏఈ బయటకు రావడం దానికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు ఇది అతిపెద్ద దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే హర్మూజ్ జలసంధి మూసివేతతో చమురు ఎగుమతిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒపెక్ దేశాలకు యూఏఈ నిర్ణయం ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం ఒపెక్ కూటమిలోని 11 దేశాల వద్ద దాదాపు 1,210 బిలియన్ బారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం ముడి చమురు నిల్వల్లో ఇవి 70 నుంచి 75 శాతానికి సమానం. వీటిలోనూ వెనెజువెలా, సౌదీ అరేబియా వద్దే అత్యధిక నిల్వలు ఉన్నాయి. యూఏఈ నిష్క్రమిస్తే ఒపెక్ కూటమి తన చమురు ఉత్పత్తి సామర్థ్యంలో సుమారు 15 శాతం కోల్పోతుంది. కూటమిలోని మొత్తం దేశాల వద్ద దాదాపు 1,350 నుంచి 1,400 బిలియన్ బారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. ప్రపంచ మొత్తం నిల్వల్లో ఇది 80శాతానికి సమానం. ఒపెక్ కూటమిలోని దేశాలూ ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి.రష్యా చేరికతో ఈ కూటమి చమురు సరఫరాపై అపారమైన నియంత్రణను కలిగి ఉంది.
భారత్‌కు మేలు చేస్తుందా?
యÖఏఈ మన దేశానికి మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఒపెక్ కూటమి నుంచి యూఏఈ వైదొలగడం భారత్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే 2027 నాటికి తన చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 5 మిలియన్ బ్యారెళ్లకు పెంచుకోవాలని యూఏఈ యోచిస్తోంది. మార్కెట్లో యూఏఈ చమురు లభ్యత పెరిగితే ముడి చమురు ధరలు తగ్గొచ్చు. బ్యారెల్‌కు 5 నుంచి 10 డాలర్ల వరకు ధర తగ్గినా భారత్‌కు బిలియన్ల రూపాయలు ఆదా అవుతాయి. భారత్ ఇప్పుడు రాయితీ ధరలపై నేరుగా యూఏఈ నుంచి చమురు కొనొచ్చు. అమెరికా – ఇరాన్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందువరకు, భారత్ ఎల్‌పీజీ దిగుమతులలో ఎక్కువ భాగం హర్మూజ్ జలసంధి మీదుగా యూఏఈ నుంచే వచ్చేవి. భారత్‌లోని ప్రభుత్వ రంగ రిఫైనరీలు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ప్రధాన రిఫైనింగ్ ప్రాజెక్టులపై యూఏఈకి చెందిన అడ్నాక్, ఇతర కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాయి. చమురు అన్వేషణ, మూల్యాంకనం కోసం అడ్నాక్ ఈ భారతీయ రిఫైనరీలతో ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియంలు ఏర్పాటుచేసిన సంయుక్త భాగస్వామ్య సంస్థ అడ్నాక్ ద్వారా అబుదాబిలోని ఆన్‌షోర్ బ్లాక్ 1లో చమురు అన్వేషణ హక్కులను పొందింది. మొత్తం మీద ఒపెక్ కూటముల నుంచి యూఏఈ వైదొలగడం అనే అంశం చమురు రంగాన్ని ప్రభావితం చేస్తుంది. అమెరికా – ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత ఈ పరిణామం ప్రభావం చమురు మార్కెట్లలో కనిపించే సూచనలు ఉన్నాయి.
ట్రంప్ హర్షం
ఒపెక్ కూటముల నుంచి యూఏఈ వైదొల గడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. యూఏఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు, గ్యాస్ ధరలు తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ పశ్చిమాసియాలో సైనిక సంక్షోభం తీవ్రరూపు దాలిస్తే యూఏఈకి ఆర్థిక, సైనిక సహాయాన్ని అందిస్తామని వెల్లడించారు. ఒపెక్ నుంచి బయటకు రావడం వల్ల యూఏఈపై ఎలాంటి ఒత్తిడి పడకుండా అమెరికా చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగా అమెరికా, యూఏఈ కేంద్ర బ్యాంకులు కరెన్సీలను సమాన మొత్తంలో మార్పిడి చేసుకునే అవకాశం ఉంది.
పేరుకుపోతున్న ఇరాన్ చమురు
ఇరాన్ ఓడరేవుల మీద అమెరికా నౌకాదళ నిర్బంధం కారణంగా ఆ దేశ చమురు నిల్వలు నిండిపోతున్నాయి. దిగ్బంధంతో ఎగుమతులు నిలిచిపోవడంతో ఉత్పత్తి అయిన చమురును ఎక్కడ నిల్వ చేయాలో తెలియక తలలు పట్టుకుంటోంది. ఒకవేళ ఉత్పత్తి ఆపివేస్తే చమురు బావులు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇరాన్ తన సముద్రంపై నిల్వ కేంద్రం 30 ఏండ్ల పాత చమురు ట్యాంకర్ ‘నషా’ను రంగంలోకి దించింది. ఇరాన్ చమురు ఎగుమతుల్లో 90 శాతం వాటా ఖర్గ్ ద్వీపం నుంచే వస్తోంది. ప్రస్తుతం అక్కడ నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరాయి.
నషా ట్యాంకర్‌ను ‘ఫ్లోటింగ్ స్టోరేజీ (సముద్రంపై నిల్వ కేంద్రం)ని అందుబాటులోకి తెచ్చినా.. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని తెలుస్తోంది. నషా ట్యాంకర్లలో చమురును నింపాలని నిర్ణయించి నప్పటికీ.. ఇవి పూర్తి స్థాయిలో ఉపశమనం కల్పించలేవు. నిల్వ సామర్థ్య పరిమితుల వల్ల జూన్ మధ్యలో ఇరాన్ ఉత్పత్తిని తగ్గించాల్సి రావచ్చని ఎఫ్‌జీఈ నెక్స్టాంట్ ఈసీఏ కన్సల్టెన్సీ అంచనా వేసింది.
సుముద్ర కేబుల్స్ కత్తిరించేస్తాం..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్ ఇటీవల ప్రపంచాన్ని కలవరపెట్టే హెచ్చరిక చేసింది. పర్షియన్ గల్ఫ్‌లోని కీలక డిజిటల్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు జరగొచ్చని చెప్పింది. హార్ముజ్ జలసంధి ఇంధన రవాణాకే గాక ప్రపంచ డేటా ప్రవాహానికీ అత్యంత కీలకం. ఇక్కడి సముద్రంలోని భారీ కేబుల్స్ ద్వారా ప్రపంచంలోని అత్యధిక ఇంటర్నెట్ ట్రాఫిక్ ప్రయాణిస్తోంది. ఎర్ర సముద్రం, హార్ముజ్ జలసంధి గుండా సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్ భారీ నెట్‌వర్క్ ఉంది. ఇది ఆసియా, యూరప్, ఆఫ్రికా మధ్య కీలక అనుసంధా నంగా నిలుస్తుంది. ఈ కేబుల్స్‌కు ముప్పు వాటిల్లితే దాని నష్ట ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండనుంది. అనేక దేశాల డిజిటల్ ఆర్థిక వ్యవస్థలకు ఈ కేబుల్సే అత్యంత కీలకం. పశ్చిమ దేశాలతో భారత్‌ను అనుసంధానించే ఐదు ప్రధాన సముద్రగర్భ కేబుల్ వ్యవస్థలు మన దేశ డిజిటల్ కమ్యూనికేషన్లకు మూల స్తంభాలుగా ఉన్నాయి. ఇందులో ఫాల్కన్ నెట్‌వర్క్, ఆసియా-ఆఫ్రికా-యూరప్-1, టాటా టీజీఎన్-గల్ఫ్, సౌతఈస్ట్ ఆసియా-మిడిల్ ఈస్ట్-వెస్టర్న్ యూరప్-4, ఇండియా-మిడిల్ ఈస్ట్-వెస్టర్న్ యూరప్ ఉన్నాయి. కేవలం ఎర్ర సముద్రం గుండానే 15-20 కేబుల్స్ వెళ్తున్నాయి. రిలయన్స్ అభివృద్ధి చేస్తున్న ఇండియా-యూరప్-ఎక్స్‌ప్రెస్, ఇండియా-ఆసియా-ఎక్స్‌ప్రెస్, గూగుల్‌కు చెందిన ధివారు సముద్ర కేబుల్ ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి.
కేబుళ్ల ల్యాండింగ్ స్టేషన్స్, క్లౌడ్ హబ్‌లను శత్రువుపై ఒత్తిడి పెంచే వ్యూహాత్మక కేంద్రాలని ఐఆర్జీసీ తెలిపింది. వీటికి ఎలాంటి అంతరాయం కలిగినా ఆయా దేశాల ఆర్థిక, సమాచార వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించింది. గల్ఫ్ దేశాల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ డేటా సెంటర్లు కేంద్రీకృతమై ఉన్నాయి. ఒకటి లేదా రెండు కేబుల్స్ దెబ్బతింటే ఆ అంతరాయాన్ని సాధారణంగా సరిచేయొచ్చు. అనేక కేబుల్స్ తెగిపోతే ఇంటర్నెట్ వేగం తగ్గడం, వెబ్‌సైట్స్ పనిచేయకపోవడం, బ్యాంకింగ్, క్లౌడ్ సిస్టమ్స్, డిజిటల్ పేమెంట్స్ వంటి సేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది. తరచుగా నౌకల లంగర్ల వల్ల జరిగే ప్రమాదవశాత్తు నష్టాలు కూడా ఇంటర్నెట్ అంతరాయాలకు కారణమవుతాయి. భారీ స్థాయిలో నష్టం జరిగితే వాటిని సరిచేయడానికి వారాలు లేదా నెలల సమయం పట్టవచ్చు.
మన దేశ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో సుమారు 60% ముంబై నుంచి గల్ఫ్ ప్రాంతం మీదుగా యూరప్ వైపు వెళ్లే మార్గాల ద్వారానే ప్రయాణిస్తుంది. మిగిలిన ట్రాఫిక్ చెన్నై నుంచి సింగపూర్ మీదుగా పసిఫిక్ మహాసముద్రం వైపు సాగే మరో మార్గం ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల నుంచి ఆసుపత్రి డేటా వరకు అన్నీ ‘క్లౌడ’లో భద్రపరచి ఉన్నాయి. కనెక్టివిటీ పోతే ఈ సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, టాటా కమ్యూనికేషన్స్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికం దిగ్గజాలు తమ అంతర్జాతీయ డేటా ప్రసారం కోసం ఈ హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్ర మార్గాలపైనే పూర్తిగా ఆధారపడుతున్నాయి. హార్ముజ్ గుండా వెళ్లే కేబుల్స్‌కు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా చూడటాTTనికి ఇరాన్ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు జరపాలని ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విజ్ఞప్తుల నేపథ్యంలో టెలికం శాఖ ఆపరేటర్లందరినీ తమ డేటా మార్గాల భద్రతపై ’రిస్క్ అనాలిసిస’ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ కేబుల్స్ దెబ్బతింటే డేటాను ప్రత్యామ్నాయ మార్గాలు అంటే సింగపూర్ లేదా పసిఫిక్ రూట్ ద్వారా ఎలా మళ్లించాలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది.

క్రాంతిదేవ్ మిత్ర
సీనియర్ జర్నలిస్ట్