మూడేళ్ల సంక్షోభం తర్వాత రాష్ట్రంలో నూలు మిల్లులు లాభాల బాటలో పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో జౌళి ఉత్పత్తులకు పెరిగిన భారీ డిమాండ్, చైనా, బాంగ్లాదేశ్‌లకు  తిరిగి భారీగా ప్రారంభమైన ఎగుమతులు ఈ రంగానికి మళ్లీ ప్రాణం పోశాయి. నష్టాల ఊబిలో కూరుకుపోయిన మిల్లులు ఇప్పుడు గిట్టుబాటు ధరలతో లాభాల బాట పట్టాయి.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే నూలు మిల్లుల రంగం గత మÖడేళ్లుగా తీవ్రమైన సంక్షోభంలో కూరుకు పోయింది. 2022 నుంచి 2025 వరకు పెరిగిన విద్యుత్ ఛార్జీలు, ఖరీదైన ముడిసరకు ధరలు, పడిపోయిన ఎగుమతుల కారణంగా రాష్ట్రంలోని దాదాపు 30కి పైగా మిల్లులు పూర్తిగా మూతపడ్డాయి. వేలాది మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. కానీ, మూడేళ్ల సుదీర్ఘ చీకటి కాలం తర్వాత, అంతర్జాతీయ మార్కెట్‌లో జౌళి ఉత్పత్తులకు పెరిగిన భారీ డిమాండ్ కారణంగా 2026 ఏప్రిల్ నాటికి ఈ పరిశ్రమలో అనూహ్యమైన మార్పు చోటుచేసుకుంది. ఎగు మతులు పెరిగి మిల్లులు ఇప్పుడు గిట్టుబాటు ధరలతో లాభాల బాట పట్టాయి. కష్టాల కొలిమి నుంచి లాభాల తీరం వైపు సాగుతున్న ఏపీ నూలు మిల్లుల పునరుజ్జీవన ప్రయాణం మÖడేళ్లుగా ఇలా సాగింది.

ఆర్థిక వ్యవస్థ కీలకపాత్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో దశాబ్దాలుగా అత్యంత కీలక పాత్ర పోషిస్తూ, లక్షలాది మందికి జీవనాధారంగా నిలిచిన వస్త్ర, నూలు పరిశ్రమ, గత కొన్నేళ్లుగా ఊహించని రీతిలో అత్యంత తీవ్రమైన ఒడుదొడుకులను, భయానకమైన ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొని, ఎట్టకేలకు ఒక సానుకూలమైన మలుపు తిరిగింది. 2022 ఏప్రిల్‌లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచáవ్యాప్తంగా ఏర్పడిన సరఫరా గొలుసు అంతరాయాలతో ప్రారంభమైన ఈ చీకటి దశ, క్రమంగా 2025 నాటికి రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ఒక పీడకలగా పరిణ మించింది.

సుమారు 35 లక్షల స్పిండిల్ సామర్థ్యం కలిగి, ప్రత్యక్షంగా 70 వేల మంది కార్మికులకు, పరోక్షంగా మరో లక్ష మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న ఈ అతిపెద్ద రంగం కుప్పకూలే పరిస్థితికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 125 నూలు మిల్లులలో, మూడేళ్ల పాటు వరుసగా వచ్చిన భారీ నష్టాలను ఆర్థికంగా తట్టుకోలేక సుమారు 30 మిల్లులు శాశ్వతంగా మూతపడగా, మిగిలినవి మనుగడ కోసం కష్టాల కొలిమిలో అత్యంత దీన స్థితిలో నెట్టుకు రావాల్సి వచ్చింది. ఈ మూసివేతల కారణంగా అప్పటివరకు పరిశ్రమలపై ఆధారపడి బతుకుతున్న వేలాది మంది కార్మికులు రాత్రికి రాత్రే తమ జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు.

 వాస్తవానికి, ఒక నూలు మిల్లును ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆపివేస్తే, అందులో పనిచేసే 300 నుండి 800 మంది అత్యంత నిపుణులైన కార్మికులు ఉపాధి వెతుక్కుంటూ తమ స్వగ్రామాలకు వలస వెళ్లిపోతారు. దీనివల్ల వాతావరణం అనుకూలించి భవిష్యత్తులో ఆ మిల్లును తిరిగి ప్రారంభించాలను కున్నా, నైపుణ్యం ఉన్న కార్మికుల కొరత వల్ల అది దాదాపు అసాధ్యంగా మారుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో వచ్చిన అనూహ్యమైన ప్రతికూల మార్పులు, ముడిసరకు లభ్యత తగ్గిపోవడం, దేశీయంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల వలయంలో చిక్కుకుని, బ్యాంకుల నుంచి తీసుకున్న భారీ రుణాల వాయిదాలు కూడా చెల్లించలేని  స్థితిలో పలు ప్రతిష్టాత్మక మిల్లులు నిరర్ధక ఆస్తులుగా మిగిలిపోయాయి.

 మార్కెట్ ధరలు – ఉత్పత్తి ఖర్చుల  మధ్య భారీ వ్యత్యాసం

ఈ చారిత్రక సంక్షోభానికి ప్రధాన కారణం మార్కెట్ ధరలకు, ఉత్పత్తి ఖర్చులకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసమే అని  చెప్పవచ్చు. 2025 నాటి గడ్డు పరిస్థితులను నిశితంగా గమనిస్తే, మార్కెట్లో గిట్టుబాటు ధరలు పూర్తిగా పతనమవడం, మరోవైపు ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరగడంతో కిలో దారం ఉత్పత్తిపై మిల్లు యజమానులకు సగటున రూ. 10 నుంచి రూ. 15 వరకు కచ్చితమైన నష్టం వాటిల్లింది. అధిక పరిమాణంలో ఉత్పత్తి జరిగే ఈ రంగంలో ఇంత భారీ నష్టం రావడం పరిశ్రమ పునాదులనే కదిలించింది. ఇందులో విద్యుత్ ఛార్జీల భారం మిల్లుల పాలిట ఉరితాడులా మారింది. కిలో దారం ఉత్పత్తికి అయ్యే మొత్తం వ్యయంలో ఏకంగా 55 శాతం కేవలం విద్యుత్ బిల్లులకే సరిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఉదాహరణకు, ఒక కిలో 40-కౌంట్ దారం ఉత్పత్తి చేయడానికి రూ. 80 నుంచి రూ. 87 వరకు ఖర్చు అవుతుంటే, అందులో సగానికి పైగా, అంటే రూ. 42 నుంచి రూ. 43 కేవలం కరెంటుకే వెచ్చించాల్సి రావడం ఈ రంగం ఆర్థిక దుస్థితికి అద్దం పడుతోంది. దీనికి తోడు ప్రభుత్వాల నుంచి పారిశ్రామిక రాయితీల కింద రావాల్సిన రూ. 1,000 కోట్ల ప్రోత్సాహకాల బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడం, సొంత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు లేని చిన్న మిల్లులకు ప్రాణసంకటంగా మారింది. మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పరిశ్రమలకు మద్దతుగా విద్యుత్ ఛార్జీలు తక్కువగా నిర్ణయించ డంతో, ఏపీ మిల్లులు జాతీయ మార్కెట్ పోటీలో దారుణంగా వెనుకబడిపోయాయి. ఇక అత్యంత కీలకమైన ముడిసరకు విషయానికి వస్తే, అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక క్యాండీ దూది (356 కిలోలు) రూ. 50 వేలు తక్కువ ధరకు లభిస్తున్నప్పటికీ, ప్రభుత్వం విధించిన 11 శాతం అదనపు దిగుమతి సుంకం వల్ల ఆ ప్రయోజనం మిల్లులకు దక్కలేదు. దీంతో, స్థానిక మిల్లులు అనివార్యంగా దేశీయ మార్కెట్లోనే రూ. 56,000 అత్యధిక ధర వెచ్చించి పత్తిని కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇలా అడుగడుగునా ఖర్చులు పెరిగి పోవడంతో మిల్లులు నష్టాల ఊబిలో కూరుకు పోయాయి.

పెరిగిన డిమాండ్

అయితే, సుదీర్ఘమైన కారుచీకటి తర్వాత అనూహ్యంగా వెలుగు రేఖలు వచ్చినట్లుగా, 2026 ఏప్రిల్ నాటికి రాష్ట్ర నూలు మిల్లుల పరిస్థితిలో అనూ హ్యమైన, అత్యంత ఆశాజనకమైన మలుపు చోటుచేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో జౌళి ఉత్పత్తులకు అకస్మాత్తుగా తీవ్రమైన కొరత ఏర్పడటంతో, ప్రపంచ వ్యాప్తంగా నూలు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇది ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ నూలు మిల్లులకు నిజమైన సంజీవినిలా పనిచేసింది. దాదాపు రెండేళ్లుగా పూర్తిగా నిలిచిపోయిన విదేశీ ఎగుమతులు తిరిగి పూర్తి స్థాయిలో ఊపందుకోవడం ఈ ఆకస్మిక పునరుజ్జీవ నానికి ప్రధాన కారణం. ప్రస్తుతం మన దేశంలో ఉత్పత్తయ్యే మొత్తం దారంలో దాదాపు 20 శాతం చైనా దేశానికి, 5 శాతం బాంగ్లాదేశ్‌కు నేరుగా ఎగుమతి అవుతూ పరిశ్రమకు ఊపిరి పోస్తోందిట. ముఖ్యంగా రాష్ట్రంలో తయారయ్యే 21-కౌంట్ దారానికి చైనా మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే నాణ్యమైన టవళ్లు, కర్టెన్లు, ఇతర గృహాలంకరణ జౌళి ఉత్పత్తుల తయారీలో అత్యంత కీలకమైన ఈ 21-కౌంట్ దారాన్ని మన మిల్లులు ప్రస్తుతం కిలోకు రూ. 240 లాభదాయకమైన ధరకు భారీ ఎత్తున విక్రయిస్తున్నాయి. మరోవైపు, ప్రపంచంలోనే అతిపెద్ద వస్త్ర తయారీ కేంద్రంగా ఉన్న బాంగ్లాదేశ్, తమ దేశంలోని భారీ గార్మెంట్ పరిశ్రమ, ముఖ్యంగా టీ-షర్టులు, బనియన్లు, లోదుస్తుల తయారీ కోసం మన రాష్ట్రం నుంచి 30, 34, 40-కౌంట్ దారంతో పాటు అత్యుత్తమ నాణ్యత గల ముడి పత్తిని కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తోంది. వస్త్ర పరిశ్రమలో అత్యంత కీలకమైన నాణ్యమైన 40-కౌంట్ దారానికి అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం కిలోకు రూ.305 రికార్డు స్థాయి ధర పలుకు తుండటం విశేషం. దీనికి అదనపు బోనస్‌గా, భారత రూపాయి మారకపు విలువతో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ అనూహ్యంగా బలపడటం కూడా మన ఎగుమతిదారుల లాభాల శాతాన్ని గణనీయంగా పెంచి, వారు ఆర్థికంగా వేగంగా గట్టెక్కడానికి ఎంతగానో సహాయపడింది.

కొత్త సవాలు

ఈ విధంగా మిల్లులు తమ మూడేళ్ల సుదీర్ఘమైన,  బాధాకరమైన సంక్షోభం నుంచి విజయవంతంగా కోలుకుంటున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో వారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మరో కొత్త సవాలును ధైర్యంగా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏ విదేశీ ఎగుమతుల డిమాండ్ అయితే వారిని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించిందో, కచ్చితంగా అదే డిమాండ్ ఇప్పుడు ప్రధాన ముడిసరకు ధరల అమాంతం పెరుగుదలకు కూడా పరోక్షంగా దారితీస్తోంది. వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా పత్తి దిగుబడి  గణనీయంగా తగ్గడం, అంతర్జాతీయంగా జౌళి ఉత్పత్తులకు డిమాండ్ అత్యంత తీవ్రంగా ఉండటం వల్ల, దారం తయారీకి మూలాధారమైన ముడిపత్తి ధరలు మళ్లీ ఆకాశాన్నంటుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందంటే, 2026 జనవరి నెలలో రూ. 55,000 గా ఉన్న ఒక క్యాండీ దూది (356 కిలోలు) మార్కెట్ ధర, కేవలం మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే, అంటే ఏప్రిల్ నాటికి ఏకంగా రూ. 61 వేలకు పెరిగిపోయి ఉత్పత్తి దారులను కలవరపెడుతోంది. అయినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో నూలుకు ఉన్న బలమైన డిమాండ్,  ఎగుమతుల ద్వారా వస్తున్న అత్యంత అనుకూలమైన అధిక ధరలు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌లోని నూలు మిల్లులను నష్టాల నుంచి కాపాడి తిరిగి లాభాల బాటలోనే పయనించేలా చేస్తున్నాయి. అయితే, దీర్ఘకాలికంగా ఈ సానుకూల పరిస్థితులు స్థిరంగా కొనసాగాలంటే, ఉత్పత్తి వ్యయంలో సింహభాగం ఆక్రమిస్తున్న విద్యుత్ ఖర్చులను శాశ్వతంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగా, భవిష్యత్తులో పరిశ్రమలన్నీ గ్రీన్ ఎనర్జీ (సౌర, పవన విద్యుత్) యూనిట్లను సొంతంగా ఏర్పాటు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే సులభ వాయిదాల్లో రుణాలు ఇప్పించే ఒక సమగ్రమైన విధానాన్ని తీసుకువస్తే, 50 శాతంగా ఉన్న విద్యుత్ వ్యయాన్ని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. ప్రపంచవ్యాప్త వస్త్ర డిమాండ్ రాబోయే కాలంలో ఇదే విధంగా స్థిరంగా కొనసాగి, రాష్ట్ర ప్రభుత్వం గతంలో పెండింగ్‌లో పెట్టిన ప్రోత్సాహక బకాయి లను తక్షణమే విడుదల చేసి పారిశ్రామికవేత్తలకు పూర్తి స్థాయిలో నైతిక, ఆర్థిక మద్దతుగా నిలిస్తే, ఆంధ్రప్రదేశ్ వస్త్ర పరిశ్రమ తన కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి పొందడమే కాకుండా రాబోయే దశాబ్దంలో దేశంలోనే అగ్రగామిగా నిలవడం ఖాయం.

తురగా నాగభూషణం

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE