ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, కానీ, తెలంగాణ రాష్ట్రం మీదుగా అప్పుల వరద మాత్రం ఆగడం లేదు. ఒకనాడు భారీ రుణాలతో విమర్శలకు గురైన భారత రాష్ట్ర సమితి (బీఆరఎస్) ప్రభుత్వం స్థానంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమూ అదే బాటలో నడుస్తోందనే ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి సగటున గంటకు రూ.13.6 కోట్ల చొప్పున రాష్ట్ర ప్రజలపై రుణభారాన్ని మోపుతున్నదని లెక్కలు చెబుతున్నాయి. సగటున రోజుకు రూ.327 కోట్ల అప్పు చేస్తూ రాష్ట్ర పాలన నిర్వహిస్తున్నదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) సంవత్సరం మొదలైన మొదటి 21 రోజుల్లోనే భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) ద్వారా నిర్వహించిన పెన్ మార్కెట్ బాండ్ వేలంలో ఏకంగా రూ.6,900 కోట్లు రుణంగా సమీకరించింది. ఏప్రిల్ 7న రెండు విడతల్లో రూ.3,900 కోట్లు తీసుకుంది. అందులో 17 సంవత్సరాల కాలపరిమితికి రూ.2,000 కోట్లు , 30 సంవత్సరాల కాలపరిమితికి రూ.1,900 కోట్లు సేకరించింది. వీటిలో 17 సంవత్సరాల కాల పరిమితి కోసం తీసుకున్న రూ. 2వేల కోట్లకు 7.97శాతం వడ్డీకి అంగీకరించగా, 30 సంవత్సరాల కాలపరిమితి రుణాలకు 1900 కోట్ల రూపాయలకు వడ్డీని 8.07 శాతంగా ఖరారు చేసుకుంది. ఏప్రిల్ 21న మరో రూ.3,000 కోట్లు సమీకరించింది. వీటిని వరుసగా 7, 11, 21 సంవత్సరాల కాలపరిమితుల్లో తలా రూ.1,000 కోట్ల చొప్పున మూడు విడతల్లో అప్పు తీసుకుంది. వీటికి సంబంధించి వడ్డీ రేట్లు వరుసగా 7.54 శాతం, 7.70 శాతం, 7.82 శాతంగా ఉన్నాయి. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి అంటే.. ఏప్రిల్ నుంచి జూన్ నెల మధ్యలోనే మొత్తంగా రూ.18,900 కోట్లు రుణ సమీకరణ చేస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ ఆర్బీఐకి ముందుగానే ఇండెంట్ సమర్పించింది. అందులో మూడోవంతుకు పైగా రుణం మొదటి నెలలోనే అదీ.. తొలి 21 రోజుల్లోనే సేకరించింది.
గత బడ్జెట్ అంచనాకు మించి అప్పు
గత ఆర్థిక సంవత్సరం(2025-26)లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా ఓపెన్ మార్కెట్ రుణాలుగా రూ.85,840 కోట్లు తీసుకుంది. అయితే, ఆ సంవత్సరపు బడ్జెట్ అంచనాల్లో రుణ సమీకరణ కేవలం రూ.54,009 కోట్లుగా ప్రతిపాదించింది. నిజానికి బడ్జెట్ అంచనాలకంటే 158.93 శాతం అధికంగా అప్పు తీసుకోవడం అంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా కోల్పోయిందన్న వాస్తవాన్ని నిరూపిస్తోందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్ల రుణ సమీకరిస్తామని బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదిం చింది. అయితే, గత అనుభవాన్ని బట్టి అసలు అప్పు దీన్ని దాటే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
రూ.8.64 లక్షల కోట్లకు చేరనున్న రాష్ట్ర రుణభారం
ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర మొత్తం రుణభారం రూ.8.64 లక్షల కోట్లకు చేరనుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ఎఫఆర్‌బీఎం పరిధిలోని ప్రభుత్వ ప్రత్యక్ష రుణాలు రూ.5,62,363 కోట్లు ఉండగా, కార్పొరేషన్లు, గ్యారంటీలు కలిపి నాన్-ఎఫఆర్‌బీఎం అప్పులు మరో రూ.3,01,835 కోట్లకు చేరాయి. ఈ నాన్-ఎఫఆర్‌బీఎం అప్పుల్లో ప్రభుత్వ గ్యారంటీ ఉన్న రుణాలు రూ.2,41,743 కోట్లు కాగా, గ్యారంటీ లేని కార్పొరేషన్ అప్పులు రూ.60,092 కోట్లు ఉన్నాయి.
ప్రత్యక్ష రుణాలు రాష్ట్ర జీఎస్‌డీపీలో ఏకంగా 29 శాతానికి చేరాయి. సాధారణంగా ఈ మొత్తం 25 శాతంలోపే ఉండాలి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 27 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి కేవలం మూడు సంవత్సరాల్లో 29 శాతానికి పెరగడం రాష్ట్ర ఆర్థిక పతనానికి అద్దం పడుతున్నదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపై రూ.2.46 లక్షల అప్పు ఉందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4.18 లక్షలతో దేశంలోనే ముందున్నామని గొప్పగా చెప్పుకుంటున్నా, అదే సమయంలో ప్రతి పౌరుడిపై లక్షలాది రూపాయల రుణభారం పేరుకుపోతోంది. వస్తున్న ఆదాయంతో అప్పులు తీర్చలేని పరిస్థితి నెలకొంటే, ఆ భారం నేరుగా పడేది రాష్ట్ర ప్రజలపైనే అన్న వాస్తవాన్ని ఎవరూ విస్మరించకూడదంటున్నారు విశ్లేషకులు.
రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.1,48,186 కోట్లుగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కానీ, అందులో దాదాపు సగం మొత్తం పాత అప్పుల వడ్డీలు, చెల్లింపులకే వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. అంటే.. సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమా లకు మిగిలేది చాలా తక్కువ. ఆ లోటు పూడ్చడానికి మళ్లీ అప్పే శరణ్యం, అనివార్యమయ్యే పరిస్థితి నెలకొంది.
అప్పుల్లో దొందూదొందే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అప్పుల వేట ప్రారంభమైంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేసింది. ఒకవైపు కల్యాణలక్ష్మి, రైతుబంధు, దళితబంధు వంటి పథకాలకు నిధులు సమకూర్చడానికి, మరోవైపు.. భారీ సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థికంగా ఊతం ఇవ్వడానికి రుణాలపై అధారపడింది. ఆ అప్పులు భావి తరాల నెత్తిమీద పడతాయని నాటి ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది.కానీ, 2023 చివరిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అదే రుణ సంస్కృతిని కొనసాగిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, మహాలక్ష్మి, ఉచిత విద్యుత్ తదితర ఆరు గ్యారంటీ పథకాల, సంక్షేమ కార్యక్రమాల కొనసాగింపునకు భారీ ఎత్తున నిధులు అవసరం అన్నది కాదనలేని సత్యం. ఆ నిధులు రాష్ట్ర ఆదాయం నుంచి రాబట్టుకోగలిగితే సమస్య ఏమీ లేదు. కానీ, అందుకు తగినంత మొత్తంలో ఆదాయం లేకపోవడం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్లీ మార్కెట్ రుణాలనే నమ్ముకుంటోంది. అంతేకాదు.. అప్పటికే బీఆరఎస్ ప్రభుత్వం హయాంలో పెద్దమొత్తంలో తెచ్చిన పాత అప్పులకు సంబంధించిన వడ్డీలు చెల్లించేందుకూ కొత్తగా అప్పు చేయాల్సిన దుస్థితి నెలకొంది. అటు.. పాత అప్పుల వడ్డీలు కట్టేందుకు కొత్తగా అప్పులు, ఇటు.. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కొత్తగా మరిన్ని అప్పులు చేయక తప్పని అనివార్య పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఫలితంగా రాష్ట్రం అప్పుల సుడిగుండంలో చిక్కుకున్నట్లు రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మెట్రో స్వాధీనంతో రూ.13,615 కోట్ల రుణభారం
రాష్ట్రానికి ఉన్న అప్పుల తాకిడి సరిపోదన్నట్టు హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ టేకోవర్‌తో రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ రుణ సంకెళ్లను అదనంగా తగిలించుకుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో (పీపీపీ) ఎలఅండ్‌టీ, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నిర్మించి నిర్వహిస్తున్న మెట్రో మొదటి దశను అప్పులతో కలిపి రూ.15 వేల కోట్ల వ్యయంతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దానికి సంబంధించిన లాంఛన ప్రక్రియలు కూడా పూర్తి చేసింది. ఇందులో రూ.13 వేల కోట్లు అప్పులు, రూ.2,000 కోట్ల ఈక్విటీ వాటా ఉన్నాయి. మెట్రో రైలు స్వాధీనానికి కీలకమైన రూ.13,615 కోట్ల రుణం ఇవ్వడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆరఎఫ్‌సీ) అంగీకరించింది. ఈ అప్పును 20 సంవత్సరాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఒప్పందానికి రాక్క్ష్మ కేబినెట్ ఆమోదం తెలిపింది. మిగిలిన మొత్తాన్ని హెచఎండీఏ ద్వారా సమకూర్చు కోనుంది. అలాగే మెట్రో నిర్వహణ నిరంతరాయంగా కొనసాగేందుకు ఎలఅండ్‌టీ ఉద్యోగులు 115 మందిని ఏడాది పాటు హెచఎంఆరఎల్ పే-రోల్‌పై కొనసాగించనున్నారు. అందుకు అయ్యే వేతనాల ఖర్చు రూ.24.3 కోట్లు హెచఎంఆరఎల్ భరించాల్సి ఉంటుంది.
ఈ పరిస్థితులపై ఆర్థిక నిపుణులు ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అప్పులు నియంత్రి స్తామని, తక్కువ వడ్డీ రుణాల వైపు మళ్లుతామని, ఆఫ్-బడ్జెట్ రుణాలను బడ్జెట్ పరిధిలోకి తెస్తున్నామని ప్రభుత్వం ఫిస్కల్ పాలసీ స్టేట్‌మెంట్‌లో తన ఆర్థిక విధాన ప్రకటనలో పేర్కొంది. కానీ, క్షేత్రస్థాయిలో, వాస్తవ పరిస్థితిలో సంఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వచ్చే సంవ త్సరంలోనే బహిరంగ మార్కెట్ నుంచి రూ.73,383 కోట్ల రుణాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా కేంద్రం నుంచి రూ.5,500 కోట్లు, ఇతర రుణాలు రూ. వేయి కోట్లు, ఇతర డిపాజిట్లు, అడ్వాన్స్‌లతో రూ.2,986 కోట్లు తీసుకోనున్నట్టు వెల్లడించింది. ఇవన్నీ కలిపి 2026-27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రుణ సమీకరణ రూ.82,000 కోట్లు దాటనుంది. కార్పొరేషన్లు, ఇతర సంస్థల గ్యారంటీ అప్పుల వడ్డీలు, కిస్తీల చెల్లింపు కూడా ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఇదే పరిస్థితి కొనసాగితే, రాబోయే రోజుల్లో రాష్ట్ర ఖజానాపై వడ్డీల భారం మరింత పెరిగే ప్రమాదం పొంచి ఉంది.
జవాబుదారీతనం ఏది?
బీఆరఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై విమర్శలు చేస్తూనే ఆ అప్పులకు తోడు.. ప్రస్తుత ప్రభుత్వం మరిన్ని అప్పులు చేయడం పట్ల ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం అప్పు ఆర్థిక వ్యవస్థకు అప్పు అవసరమని, సంక్షేమ పథకాల అమలుకు అనివార్యమని సమర్థించు కుంటోంది. కానీ, ఒక్క విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అర్థం కావడమే కాదు.. వాస్తవమూ అదే.. ఏంటంటే… అప్పు చేసేది పాలకులు, భరించేది ప్రజలు. నేటి ప్రభుత్వాలు చేస్తున్న అప్పులకు రేపటి భవిష్యత్ తరాలు వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్నది నిజం. తెలంగాణ ప్రజల నెత్తిపై ఇలా అప్పుల కుప్ప మరింత భారంగా మారకముందే.. అర్థవంతమైన ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత అత్యంత అవసరం అని రాజకీయ, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068