“లెక్చర్లు ఇచ్చి జనాలను మెప్పించడం నాకు వెన్నతో పెట్టిన విద్య” అని గిరీశం కన్యాశుల్కంలో చెప్పిన వ్యాఖ్యలు ఆమఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సరిగ్గా సరిపోతాయి. మద్యం స్కాంకు సంబంధించి ఆయన ఢిల్లీ హైకోర్టులో స్వయంగా వాదించడం చూస్తే కేసులో అసలైన విషయాలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నా రని అర్థమవుతోంది. అవినీతిపై పోరాటం పేరుతో అధికారంలోకి వచ్చిన ఆయన మద్యం స్కాంలో జైలుకు వెళ్లారు.ఆ తర్వాత ఆయనపై కేసును కోర్టు కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది. అనంతరం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన కేసు విచారిస్తున్న న్యాయమూర్తినే మార్చాలని కేజ్రీవాల్ కోర్టును కోరడం సంచలనం రేపింది. కేసును పక్కదారి పట్టించడంతో పాటు ప్రజల్లో లేనిపోని అనుమానాలు సృష్టించి, సానుభూతి పొందడం లక్ష్యంగానే ఆయన న్యాయమÖర్తిపైనే వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయ, న్యాయవ్యవస్థల మధ్య సున్నితమైన సమతుల్యతను మరోసారి పరీక్షించిన ఘటనగా ఢిల్లీ మద్యం పాలసీ కేసు నిలిచింది. కేవలం ఒక కేసు పరిధిలోనే కాకుండా, న్యాయవ్యవస్థ స్వతంత్రత, రాజకీయాల పాత్ర, పార్టీ అంతర్గత పరిస్థి తులన్నీ కలిపి ఒక పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.
ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో తీసుకొచ్చిన మద్యం పాలసీపై అవినీతి ఆరోపణలు రావడంతో దీనిపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ప్రారంభించాయి. నవంబర్ 17, 2021న మద్యం పాలసీని తీసుకొచ్చిన ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్, 2022లో దానిని వెనక్కి తీసుకొంది. ఈ మధ్యకాలంలోనే ఆప్ నేతలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. మద్యం పాలసీని సవరించే టప్పుడు అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ, ఈడీలు ఆరోపించాయి. లైసెన్స్‌దారులకు అవసరమైన సాయం చేసి వారి నుండి ప్రతిఫలం పొందినట్టు దర్యాప్తు సంస్థలు చెప్పాయి. ఈ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇతర ఆప్ నేతలు, తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ, కేసీఆర్ కూతురు కవిత జైలుకు వెళ్లి విడుదలయ్యారు. అనంతరం మద్యం పాలసీపై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు మొత్తం 23 మంది నిందితులపై నమోదు చేసిన కేసులను కొట్టివేసింది. అభియోగాలపై తగిన ఆధారాలను సీబీఐ చూపించలేకపోయిందని పేర్కొంది.. అయితే ఈ తీర్పును సీబీఐ హైకోర్టులో సవాలు చేయడంతో ఢిల్లీ మద్యం స్కాం కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది.
సీబీఐ దాఖలు చేసిన పిటీషన్‌ను స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్, సిసోడియా, కవిత సహా మొత్తం 23 మంది నిందితులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సీబీఐ అధికారిపై విచారణ జరపాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ స్టే ఇచ్చారు. దీంతో కలరవపడిన కేజ్రీవాల్ ఈ అప్పీల్ కేసును జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి మరో ఇతర బెంచ్‌కు బదిలీ చేయాలని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవంద్ర కుమార్ ఉపాధ్యాయకు లేఖ రాయగా ఆయన తోసిపుచ్చారు. రోస్టర్ ప్రకారం కేసును బెంచ్‌కు కేటాయిస్తారని కోర్టు తెలిపింది. అయితే దీనిపై అసంతృప్తి చెందిన కేజీవ్రాల్ సీబీఐ పిటీషన్‌పై జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ ప్రారంభించడానికి ముందే సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
కేజ్రీవాల్ తన వాదనల్లో ప్రధానంగా జస్టిస్ స్వర్ణకాంత శర్మపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి లాయర్లుగా పనిచేస్తున్నారని, ఈ పరిస్థితిలో కేసు విచారణలో నిష్పక్షపాతంపై అనుమానం కలుగు తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ కేసులో భాగస్వామిగా ఉన్నందున, న్యాయమూర్తి కుటుంబ సంబంధాలు ప్రభావం చూపవచ్చని ఆయన వాదించడం విడ్డూరం. “న్యాయం జరిగితే సరిపోదు, న్యాయం జరిగినట్టు కనిపించాలి” అన్న సూత్రాన్ని కూడా తన వాదనలో ప్రస్తావించారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైందని, కేంద్ర ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా కాకుండా రాజకీయ ప్రభావంతో పనిచేస్తున్నాయన్నారు. ఇక్కడ ఆయన వాదన చాలా విచిత్రంగా ఉంది. ఒక కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు వృత్తుల్లో ఉండడం సహజం. వృత్తిరీత్యా వారు చేసే పనులు కుటుంబంలోని ఇతర వ్యక్తులపై పడుతుందని చెప్పడం హాస్యాస్పదం. న్యాయమూర్తి కుటుంబ సభ్యులు ప్రభుత్వ విధులు నిర్వహిస్తే సర్కారు వారిపై ఒత్తిడి తెచ్చి కేసును ప్రభావితం చేస్తుందని చెప్పడం ఆశ్చర్యకరం. ఇది న్యాయమూర్తిని శంకించడమే. తనకు అనుకూలంగా వస్తే న్యాయం గెలిచిందని వ్యాఖ్యలు చేసే వీరు, కొంచెం అననుకూలత కనిపిస్తే న్యాయమÖర్తిపై, న్యాయ వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేయడమంటే అసలైన విషయాలను పక్కదారి పట్టిస్తూ కేసుపై ప్రభావం చూపించేందుకు ప్రయత్నించడం దిగజారుడుతనమే.
ఇదే సమయంలో కేజ్రీవాల్ మరో అడుగు ముందుకేసి సంఘపరివార్ గురించి కేసులో ప్రస్తావించారు. తాను బీజేపీ, ఆరఎసఎస్ సిద్ధాంతా లకు వ్యతిరేకం కాబట్టి న్యాయం విషయంలో అనుమానాలున్నాయని చెబుతున్న కేజ్రీవాల్ కేసును మరో న్యాయమూర్తికి బదిలీ చేయాలని కోరారు. ఇక్కడ బీజేపీకి, ఆరఎసఎస్‌కు కేసుతో సంబంధ మేమిటి? అనే అనుమానాన్ని ఉద్దేశపూర్వకంగా రేకెత్తించారు. కేసు విచారిస్తున్న జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఆరఎసఎస్‌కు అనుబంధంగా ఉన్న పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారని కేజ్రీవాల్ వాదించారు. ఆయన చేసిన వాదన విడ్డూరంగా ఉంది. ఉన్నతాధి కారులు, పదోన్నతుల్లో ఉన్న వారు స్వచ్ఛంద, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఆక్షేపించడం సమంజసం కాదు. నిజంగా కోర్టు వ్యవహారాల్లో బీజేపీ ప్రభుత్వం జోక్యం చేసుకొని ఉంటే కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టులో ఊరట లభించేదా..? ఆరఎసఎస్ ఒక సాంస్కృతిక స్వచ్ఛంద సంస్థ. అది ఇతర అంశాల్లో జోక్యం చేసుకోవడమే కనిపించదు. న్యాయమూర్తిపై వారి ప్రభావం ఉంటుందనే అనుమానాలు రేపడం కేసును పక్కదారి పట్టించడమే. ఉన్నతస్థానంలోని న్యాయమÖర్తి ప్రభావితమవుతారని చెప్పడం వారిని అవమానించడమే. మరింత విచిత్రం ఏమిటంటే జస్టిస్ స్వర్ణ క్రాంత శర్మ గతంలో తాను తన అరెస్టును సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటీషన్‌ను తిరస్కరించారని, సిసోడియా, కవితలకు బెయిల్ కూడా ఇవ్వలేదని అన్నారు. ఈ వాదన చూస్తే న్యాయమూర్తులందరూ తనకు అనుకూలంగా ఉండాలని కేజ్రీవాల్ కోరుకుంటున్నారు. లేకపోతే వారిపై అభాండాలు వేస్తున్నారని స్పష్టమవుతోంది. న్యాయమూర్తులు తమ వద్దకు వచ్చిన కేసుల్లో న్యాయాన్యాయాలను అంచనావేసి తీర్పులు ఇస్తుం టారు. అంతే కానీ వ్యక్తులను, హోదాలను బట్టి తీర్పులివ్వరనే కనీస అవగాహన లేకుండా క్రేజీవాల్ న్యాయమూర్తి అంశాన్ని రాజకీయం చేశారు.
కేజ్రీవాల్ అసంబద్ద వ్యాఖ్యలను కోర్టు ఖండించడంతో దేశ ప్రజలకు న్యాయస్థానాలపై విశ్వాసం మరింత పెరిగింది. వ్యక్తిగత అభిప్రాయాలు, అనుమానాల ఆధారంగా న్యాయమూర్తిని మార్చలేమని హైకోర్టు స్పష్టం చేయడం ఆహ్వానించ దగ్గ పరిణామం. న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు స్వతంత్ర వృత్తిపరమైన హక్కులు కలిగుంటారని, వారికి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని కోర్టు తేల్చింది. న్యాయమూర్తులపై చేసే వ్యక్తిగత ఆరోపణలు వ్యవస్థపై చేస్తున్న దాడిగా పరిగణించాల్సి వస్తుందని కోర్టు తీవ్రంగా హెచ్చరించింది. కేజ్రీవాల్‌తో పాటు మనీష్ సిసోడియా, ఆప్ నేత దుర్గేష్ పాఠక్ దాఖలు చేసిన ఇటువంటి పిటీషన్లను హైకోర్టు కొట్టివేయడం వీరికి చెంపపెట్టు. ఒక రాజకీయ నాయకుడు న్యాయమÖర్తి సామర్థ్యాన్ని నిర్ణయించలేడని, ఇటువంటి వాదనలు న్యాయ వ్యవస్థపై అనవసరమైన అనుమానాలను పెంచే ప్రమాదం ఉందని కోర్టు అభిప్రాయపడింది. సరైన ఆధారాలు లేకుండా ఏకపక్షంగా ఆరోపణలు చేయడం న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆక్షేపించిన కోర్టు కేజ్రీవాల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ అదే న్యాయమూర్తితో విచారణ కొనసాగించాలని నిర్ణయించడం స్వాగతించాల్సిన అంశం.
హైకోర్టు తీర్పుతో తన పాచిక పారలేదని గ్రహించిన కేజ్రీవాల్ బృందం న్యాయమూర్తిని మార్చాలని కోరుతూ సుప్రీం కోర్టు తలుపు తట్టడం న్యాయపోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడమే. హైకోర్టు సీబీఐ పిటీషన్‌ను స్వీకరించి నోటీసులు జారీ చేయడం, సీబీఐపై విచారణ ఆపివేయడంతో పాటు కింది స్థాయి కోర్టు చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ వ్యాఖ్యానించడంతో కేజ్రీవాల్‌లో అభద్రతా నెలకొంది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో తనపై మోదీ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు నమోదు చేసిందని వ్యాఖ్యా నిస్తూ కేజ్రీవాల్ కోర్టులోనే కన్నీరు పెట్టుకున్నారు. సెంటిమెంట్‌తో ప్రజల మనస్సును గెలుచుకోవడానికి ప్రయత్నించారు. అయితే హైకోర్టు ప్రాథమికంగానే నోటీసులు ఇవ్వడంతో పాటు సీబీఐపై విచారణను ఆపివేయడంతో అవి తనకు వ్యతిరేక సంకేతాలుగా ఆయన భావించారు. ఫలితంగా న్యాయమÖర్తినే మార్చాలని కోరారు. దీంతో ఆయన రెండు ఆశయాలను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకటి తానే స్వయంగా వాదిస్తే ప్రజలకు తనపై సానుభూతి వస్తుందని, మరొకటి జడ్జీని మార్చాలని కోరితే అక్కడ తనకు అన్యాయం జరుగుతుందనే అపోహను ప్రజల్లోకి పంపించవచ్చని ఆయన భావించారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే రాజకీయాలతో న్యాయ వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు ముందు స్పష్టమైన ఆధారాలు చూపకుండా, కేవలం అనుమానాలతో వాదించడం న్యాయపరంగా చెల్లదనే అభిప్రాయాలున్నాయి. కేసులో ఎదుర్కొంటున్న బలమైన ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కోర్టులో కేజ్రీవాల్ రాజకీయ కథనం నిర్మించే ప్రయత్నం చేశారు. అధికారం కోల్పోయిన కేజ్రీవాల్ రాజకీయంగా బలహీనపడుతున్న దశలో ట్రయల్ కోర్టు తీర్పు ఆయనకు ఊరటనిచ్చింది. దాన్ని ఆసరాగా చేసుకొని ఆయన తిరిగి బలపడాలని చూస్తున్నా రాజకీయంగా కలిసి రావడం లేదు. ఇదే సమయంలో ఆమఆద్మీ పార్టీలో అంతర్గత రాజకీయ పరిస్థితులపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ చద్దాతో పాటుగా మరో ఆరుగురు ఆప్ రాజ్యసభ సభ్యులు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ సమక్షంలో బీజేపీలో చేరిన విషయం కేజ్రీవాల్‌కు మింగుడుపడటం లేదు.
ఆయన రాజకీయ ప్రస్థానంలో గతంలో కూడా వివాదాలు ఎదుర్కొన్న సందర్భాల్లో కూడా అసలు విషయాలను పక్కదారి పట్టించేవారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రారంభమైన ఆయన ప్రయాణం తరువాత కొన్ని నిర్ణయాలపై విమర్శలను ఎదుర్కొంది. ఢిల్లీ మద్యం పాలసీ వివాదం, అధికార వినియోగంపై వచ్చిన ఆరోపణలు, కేంద్ర సంస్థలతో ఘర్షణలు వంటి అంశాలు తరచూ చర్చకు వచ్చాయి. అదనంగా, ప్రతి విచారణను రాజకీయ కోణంలో చూపించడం, కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. ఇలాంటి ప్రయత్నాల్లో పలుమార్లు భంగపడి అధికారం కోల్పోయిన కేజ్రీవాల్‌కు మరోసారి భంగపాటు తప్పేలా లేదు.
మద్యం స్కాంలో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టులో ఊరట లభించినా హైకోర్టులో ఎదురుదెబ్బ తగులుతుందేమోననే భయం ఆయన్ను వెంటాడు తోందని పలు పరిణామాలు నిరూపిస్తున్నాయి. అందుకే ఆప్ అధినేత రాజకీయ ఎత్తుగడలు వేస్తూ, వాటిలో భాగంగా కేసులో ప్రధాన అంశాలను పక్కదారి పట్టించడం, న్యాయమÖర్తులపై వ్యక్తిగత ఆరోపణýతో ఒత్తిడి తేవడం వంటి అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. అవినీతిపై పోరాటం అంటూ అధికారంలోకి వచ్చిన ఆయన అదే అవినీతి రాజకీయాల్లో కూరుకుపోయారు. ఇప్పుడు అదే పంథాలో కోర్టులతో కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అంతిమంగా గెలిచేది సత్యమే.
– శ్రీపాద