పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల మొదటి దశలో అత్యధికంగా 92 శాతం పోలింగ్ జరగడం ఒక రికార్డు కాగా, గత పదిహేనేళ్లలో కనీవినీ ఎరుగని విధంగా తక్కువ స్థాయిలో హింస, విధ్వంసకాండలు చెలరేగడం మరో రికార్డు. మొదటి దశ ఎన్నికల్లో చెదురు మదురుగా మాత్రమే హింసాకాండ జరిగినట్టు ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. అక్కడ అధికారంలో ఉన్న తృణమÖల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు 2016, 2021 సంవత్సరాల్లో మాదిరిగా ఓటర్లను బెదిరించడానికి, బీజేపీ కార్యకర్తలను చెట్లకు తలకిందులుగా వేలాడదీయడానికి, ఇతర పార్టీల వారి ఇళ్ల మీద దాడులు చేసి అత్యాచారాలకు, బెదిరింపులకు పాల్పడడానికి, ఇతర పార్టీల అభ్యర్థులు ప్రచారం చేసుకోకుండా దాడులు చేయడానికి ఏ మాత్రం అవకాశం లేకుండా పోయింది.
మొత్తం మీద ఈసారి ఎన్నికల్లో ఒకటి రెండు కీలక పరిణామాలు స్పష్టంగా కనిపించాయి. పోలింగ్ శాతం అత్యధికంగా ఉండడాన్ని బట్టి పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నార న్నది స్పష్టమైంది. మరో విశేషమేమిటంటే, తృణమÖల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు గానీ, కార్యకర్తలకు గానీ, ఆ పార్టీకి చెందిన గూండాలకు గానీ రాష్ట్ర ప్రజలు భయపడడం లేదు. మరో పెద్ద మార్పు ఏమిటంటే, బాంగ్లాదేశ్ నుంచి చొరబడుతున్న రోహింగ్యాలు, ముస్లింల ఆధిపత్యం పట్ల స్థానిక ప్రజలు తిరగబడుతున్నారు. నిజానికి, ఈసారి బీజేపీ ఆ రాష్ట్రంలో బలం పుంజుకోవడాన్ని సహించలేని తృణమÖల్ కాంగ్రెస్ పెద్ద ఎత్తున హింసా, విధ్వంసకాండలకు తెర తీస్తుందని అంతా భావించారు. ఓటర్ల జాబితాలను సవరించడానికి అధికారులు వచ్చినప్పుడే తీవ్రస్థాయిలో అడ్డుకున్న అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికలను సవ్యంగా జరగనిస్తారా? అన్న అనుమానం పశ్చిమ బెంగాల్ ప్రజల్లో బాగా వ్యక్తమైంది.
మమతకు ఎదురు దెబ్బలు
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమÖల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గూండాలు హింసాకాండకు పథక రచన చేశారు. మైనారిటీలు అధికంగా ఉండే ముర్షీదాబాద్, మాల్దా తదితర ప్రాంతాల్లో హింసను బాగానే ప్రేరేపించారు. బీజేపీ అభ్యర్థి సుభేందు సర్కార్ మీద దాడి చేశారు. చాలా చోట్ల బాంబులు విసిరారు. ప్రజలను విపరీతంగా భయపెట్టే ప్రయత్నం చేశారు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా ఎన్నికల ప్రధాన కమిషనర్ ఆదేశాల మేరకు సి.ఆర్.పి.ఎఫ్ బలగాలు భారీ సంఖ్యలో మోహరించడం వల్ల అనేక ఉపద్రవాలు చివరి క్షణంలో తప్పిపోయాయి. తృణమÖల్ కాంగ్రెస్ గూండాలు ఒకపక్క ఇతర పార్టీల అభ్యర్థులను, కార్యకర్తలను, పోలింగ్ ఏజెంట్లను భయపెట్టే ప్రయత్నం చేస్తుండగా ముస్లిం నాయకుడు హుమయÖన్ కబీర్ మరోపక్క తన వంతుగా అల్లర్లు సృష్టించడానికి యథాశక్తి ప్రయత్నం చేశారు.
దేశంలో కనీవినీ ఎరుగని స్థాయిలో రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్న ప్రజలు గట్టి పట్టుదలతో వీటన్నిటినీ భరించి, తీవ్రస్థాయిలో ఎదుర్కొని 92 శాతం పోలింగ్ జరగడానికి కారకులయ్యారు. దక్షిణ దినాజ్‌పూర్‌లో సుభేందు సర్కార్ మీద తృణమÖల్ కార్యకర్తలు దాడి చేయడం, కొట్టడం రికార్డు కూడా అయి దేశ ప్రజలందరికీ చేరిపోయింది. తృణమÖల్ కాంగ్రెస్ కార్యకర్తల దాడులను ఇతర పార్టీలు తమకు వీలైనంతగా నిరోధించడం, ఇదివరకటి మాదిరిగా వారికి భయపడకపోవడం ఒక గొప్ప శుభసూచకంగా కూడా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 21 లక్షల మంది బెంగాలీ వలసదార్లు తమ రాష్ట్రానికి తిరిగి వచ్చి పోలింగ్‌లో పాల్గొనడం ఆసక్తికరం. పశ్చిమ బెంగాల్‌లో ఉద్యోగావకాశాలు లేకపోవడం, వేలాది పరిశ్రమలు, కర్మాగారాలు మÖతబడడం వల్ల వారంతా ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస పోవలసి వచ్చింది.
దీర్ఘకాలిక ప్రణాళికలు
పశ్చిమ బెంగాల్ కంటే కొద్దిగా ముందుగా ఎన్నికలు జరిగిన అసోం, కేరళ, పుదుచ్చేరి, బెంగాల్‌తో పాటే ఎన్నికలు జరిగిన తమిళనాడు రాష్ట్రాల్లో ఇటువంటి హింసా విధ్వంసకాండ దృశ్యాలు ఎక్కడా కనిపించలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల వ్యూహాలకు అద్దం పట్టే ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలను సాధారణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలుగా తీసిపారేయడానికి వీల్లేదు. అధికార పక్షాలే కాక, ప్రతిపక్షాలు కూడా తమ రాజకీయ శక్తియుక్తులన్నిటినీ ఇందులో పణంగా పెట్టాయి. తమ అర్థ బలాన్నీ, అంగ బలాన్నీ ఇక్కడ పరీక్షకు పెట్టాయి. ఈ ఎన్నికల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నికల రంగాన్ని రణ రంగంగా మార్చేశాయి. మంత్రులు, నాయకులు, మిత్రపక్షాలు, నటులు, ఇతర ప్రముఖులు ఈ రాష్ట్రాల్లో మోహరిం చారు. ఎన్నికల ప్రచారం తప్ప తమకు వేరే బాధ్యతలేవీ లేనట్టు ఒక రెండు నెలల పాటు పూర్తి సమయాన్ని వీటికే కేటాయించారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాల తీరుతెన్నులను, లౌకికవాదం ముసుగులో ఆ ప్రభుత్వాలు చేస్తున్న అక్రమాలను చాలా కాలంగా గమనిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇక ఇటువంటి అరాచకాలకు స్వస్తి చెప్పాలని కృతనిశ్చయంతో ఉంది. మోదీ, షాలు ఈ రాష్ట్రాల మీద తమ దృష్టినంతా కేంద్రీకరించడంతో ఈ ఎన్నికలు వారికి అగ్నిపరీక్షగా మారాయన్న అభిప్రాయం దేశమంతా వ్యక్తమవుతోంది. అసోంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం మూడవ పర్యాయం అధికారంలోకి రావాలని భావిస్తోంది. గతంలో 2016, 2021 సంవత్సరాల్లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఈశాన్య రాష్ట్రాలన్నిటినీ ప్రభావితం చేయడంతో పాటు ఈ రాష్ట్రాల్లో బీజేపీ బలాన్ని పెంచిన నాయకత్వం మÖడవసారి కూడా అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. పుదుచ్చేరిలో అధికారంలో ఎన్.డి.ఏ భాగస్వామ్య పక్షం ఈసారి కూడా అధికారంలో కొనసాగాలని ప్రయత్నిస్తోంది.
దక్షిణాదిపై దృష్టి
తమిళనాడు విషయానికి వస్తే, ఇక్కడ అన్నాడి. ఎం.కెతో చేతులు కలిపిన బీజేపీ అధికార పక్షమైన డి.ఎం.కె. ను ఈసారైనా గద్దె దించాలనే పట్టుదలతో ఉంది. అనేక సంవత్సరాలుగా ఇక్కడ బీజేపీని అడ్డుకుంటున్న ద్రవిడ పార్టీల కంచుకోటలను బద్దలు కొట్టి ఈసారి ఈ పార్టీ తన బలాన్ని పెంచుకునే అవకాశం ఉంది. కేరళలో అడుగుపెట్టడం కష్టమే అయినప్పటికీ, క్రమంగా ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తున్న బీజేపీ ఈసారి మరికొన్ని స్థానాలను తమ ఖాతాలో వేసుకోవడానికి అవకాశం ఉంది. అటు వామపక్ష కూటమికి, ఇటు కాంగ్రెస్ కూటమికి కంచుకోటలుగా ఉన్న కొన్ని స్థానాలు బీజేపీ చేజిక్కే సూచనలు కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం మమతా బెనర్జీ పార్టీని మట్టి కరిపించి అధికారంలోకి రావడమే పరమావధిగా బీజేపీ ప్రయత్నాలు సాగించింది. తృణమÖల్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నాలుగవసారి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది.
వాస్తవానికి అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. హోం మంత్రి అమిత్ షా కోల్‌కతాలో 15 రోజుల పాటు బస చేసి, ఎన్నికల వ్యూహాలను పర్యవేక్షించడం, అధికారులకు ఆదేశాలివ్వడం వంటివి చేశారు. ఇదివరకటి ఎన్నికల్లోనే అంచనాలకు మించి స్థానాలు సంపాదించిన బీజేపీ ఆ తర్వాత కూడా అనేక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయాలు సాధించడం ఆ పార్టీలో ఉత్సాహాన్ని పెంచింది. ఈసారి ఎన్నికల్లో ఏ అవకాశాన్నీ, ఏ మార్గాన్నీ జారవిడుచుకోకూడదని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది.
పురోగతి దిశగా అడుగులు
నిజానికి, 2016లో 10 శాతం ఓట్లతో మÖడు స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఆ తర్వాత 2021 ఎన్నికల్లో 39 శాతం ఓట్లతో 77 స్థానాలను సంపాదించుకోగలిగింది. అయినప్పటికీ, 48 శాతం ఓట్లు, 200కు పైగా సీట్లతో తృణమÖల్ కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. రాష్ట్రంలో తమకు అనుకూలంగా ప్రజాభిప్రాయం మారుతోందన్న వాస్తవాన్ని గమనించిన బీజేపీ ఆ రాష్ట్రం మీద మరింతగా దృష్టి పెట్టడం ప్రారంభించింది. ఈ రాష్ట్రాల్లో విజయం సాధించడమనేది తాత్కాలిక ప్రయోజనాలనే కాక, 2029 లోక్‌సభ ఎన్నికల ప్రయోజనాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అసోంలో అధికారంలో కొనసాగడం, పశ్చిమ బెంగాల్ లో అధికారంలోకి రావడం, కేరళలో కొన్ని సీట్లయినా సంపాదించడం, తమిళనాడులో చక్రం తిప్పగలగడం, పుదుచ్చేరిని నిలబెట్టుకోవడం బీజేపీ ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి.
ఇది మోదీ జనాకర్షణను, విశ్వసనీయతను మరింతగా పెంచుతుందనడంలో సందేహం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థను నాలుగవ స్థానంలో తీసుకు వెళ్లడంతో పాటు, అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ, అటు జాతీయంగానూ, ఇటు అంతర్జాతీయంగానూ ఉన్నత స్థానానికి చేరుకుంటూ, అనేక సంక్షోభాల నుంచి దేశాన్ని గట్టెక్కిస్తున్న మోదీ ప్రతిష్ఠ ఈ విజయాల వల్ల మరింతగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఇక ప్రాంతీయ స్థాయిలో ఉన్న పార్టీని అంతర్జాతీయంగా అతి పెద్ద పార్టీగా తీర్చిదిద్దిన అమిత్ షా బీజేపీని మున్ముందు మరింతగా బలోపేతం చేయడానికి అవకాశం కలుగుతుంది. బీజేపీని బలోపేతం చేయడంతో పాటు ఇతర ప్రధాన ప్రతిపక్షాలను కకావికలు చేయడానికి కూడా ఆయనకు అవకాశం ఉంటుంది. అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని విస్తరించగలగడం వల్ల బీజేపీ కొన్ని కొత్త చట్టాలను తీసుకురావడంతో పాటు రాజ్యాంగ సవరణలు చేయడానికి కూడా అవకాశం కలుగుతుంది.
ఎన్నికలతో వచ్చే మార్పులతో పాటు ప్రభుత్వ పరంగా, సంస్థాగతంగా కూడా మోదీ కొన్ని కీలక మార్పులు చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సాంస్కృతిక సంబంధమైన ఆధిపత్యంతో పాటు, ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ఆయన ఇప్పటికే అడుగులు వేస్తున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని, పాలనా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించి, దేశాన్ని 2029 నాటికి మÖడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఇవన్నీ ఈ ఎన్నికల ఫలితాల మీద ఆధారపడి ఉన్నాయి. మోదీ, షాల ద్వయం ఈ ఎన్నికల మీద సర్వశక్తులూ ఒడ్డడానికి ఇటువంటివే కారణాలుగా కనిపిస్తున్నాయి.

జి.రాజశుక
సీనియర్ జర్నలిస్ట్