రాజకీయాల్లో విభేదాలు సహజం. రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంతపరమైన వ్యత్యాసాలు కూడా సహజమే. అలాగే, ఒకే పార్టీలోని నేతల మధ్య అభిప్రాయ భేదాలూ సర్వ సాధారణమే. కానీ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో నాయకుల వ్యవహారం మరింత అదుపు తప్పుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒకే సమయంలో రెండు విస్ఫోటనాలు సంభవించాయి. పార్టీ అధిష్ఠానం, ముఖ్య నేతల విషయంలో ఆ పార్టీ నాయకులకు గల భావనలు, అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టంగా అద్దం పట్టే పరిణామాలు అవి. పార్టీ నాయకత్వం పట్ల, పార్టీలోని మహిళల గౌరవం పట్ల కొందరు నాయకులకు ఉన్న ఆలోచనలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తాయి. ఇది మాములు విషయం కాదని, పార్టీకి మచ్చతెచ్చే అంశంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ కోవర్టు ఉదంతంతో పాటు, పార్టీ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆడియో టేపు కలకలం అందరినీ విస్మయ పరచాయి. రోజుల వ్యవధిలోనే బయటపడ్డ ఈ రెండు అంశాలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ వ్యవహారం పార్టీలో ఏకంగా అంతర్గత విచారణకు దారి తీసింది. పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు రాజ్యసభ సభ్యత్వం కోసం మధ్యప్రదేశ్ నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేశారు. అయితే, కొన్ని సాంకేతిక కారణాలు చూపి రిటర్నింగ్ అధికారి ఆ నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. తొలుత ఇది సాధారణ పరిణామమే అనుకున్నప్పటికీ.. దీని వెనుక రాష్ట్రానికి చెందిన నేతల కుట్ర ఉందని మీనాక్షి నటరాజన్ గట్టిగా నమ్ముతున్నారు. నామినేషన్ తిరస్కరణ కేవలం పత్రాల లోపం వల్ల జరిగిందని బయటకు చెప్పుకుంటున్నా.. అసలు కారణం మరొకటి ఉందని మీనాక్షి నటరాజన్ స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందు మొరపెట్టుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలే తనకు వెన్నుపోటు పొడిచారని ఆమె నేరుగా రాహుల్ గాంధీతో చెప్పారని తెలుస్తోంది. ప్రత్యేకంగా పార్టీ లీగల్ సెల్ ఉన్నప్పటికీ, నామినేషన్ పత్రాల వ్యవహారాలు చూసుకొనేందుకు కొందరు తెలంగాణ నేతలు తనకు సహకారం అందకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. కోవర్టు రాజకీయాల వల్లే ఈ అంశం మధ్యప్రదేశ్ దాకా వెళ్లిందని, ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయమేనని ఆమె స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
తన నామినేషన్ తిరస్కరణకు సొంత పార్టీ నేతలే కారణమని సాక్షాత్తూ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పార్టీ అగ్రనేతల వద్ద ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం వ్యక్తిగత ఆరోపణ కాదని, పార్టీలోనే ఒక ఇన్‌చార్జి పట్ల నైతికత కోల్పోయిన నేతల అసలు స్వరూపం అన్న విమర్శలు వస్తున్నాయి. నాయకత్వం పట్ల అవిశ్వాసం, అంతర్గత సమన్వయ వైఫల్యానికి ఇది నిదర్శనంగా చెప్పుకో వచ్చంటున్నారు. మీనాక్షి నటరాజన్ ఆవేదనలో వాస్తవం ఉందని గ్రహించిన రాహుల్ గాందీ,ó అదే సమయంలో తనను కలిసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంటే ఢిల్లీ అధిష్ఠానం ఈ వ్యవహారాన్ని మామÖలు రాజకీయ విభేదంగా కాక, పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన తీవ్ర అంశంగా పరిగణిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది.
కోవర్టు సంస్కృతిపై ఆరా
మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో కోవర్టు రాజకీయాల అంశం ప్రస్తావనకు రావడం ఆ పార్టీకి అత్యంత ఆందోళనకరమైన అంశంగా చెప్పుకోవచ్చు. పార్టీలోనే ఉంటూ ప్రతిపక్షాలకు మేలు చేస్తున్న కోవర్టులెవరో గుర్తించే పనిలో నాయకత్వం ఉన్నదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టంగా చెప్పారు. పార్టీ అంతర్గత సమాచారం,వ్యూహాలను బయటకు చేరవేస్తున్న వారిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో లీకుల వీరులు ఎవరో, త్వరలోనే బయటపడుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ మాటలను బట్టి పార్టీ లోపలే అంతర్గత శత్రువులున్నారని, వారిని గుర్తిస్తున్నామని, బాధ్యులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు స్పష్టమవుతోంది. నామినేషన్ తిరస్కరణకు కారణమైన బాధ్యులు, పార్టీకి నమ్మక ద్రోహం చేసిన వారిపై అధిష్ఠానం కఠిన చర్యలకు సిద్ధమవుతున్నదని, ఈ అంతర్గత విచారణ ముమ్మరంగా సాగుతున్నదని మహేశ్‌కుమార్‌గౌడ్ పేర్కొన్నారు. సాక్షాత్తూ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జికి సహకారం అందకుండా చేసే స్థాయికి పార్టీ అంతర్గత కుమ్ములాటలు, రాజకీయాలు దిగజారడాన్ని, కేవలం వ్యక్తిగతంగా చూడాల్సిన అంశం కాదని, ఇది సంస్థాగతంగా తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తెగేసి చెబుతున్నారు.
షబ్బీర్ అలీ ఆడియో కలకలం
మీనాక్షి నటరాజన్ కోవర్టు ఆరోపణల నుంచి పార్టీ ఇంకా తేరుకోకముందే.. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరో బాంబు పేలింది. ప్రభుత్వ సలహాదారు, సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడినట్టుగా బయటకు వచ్చిన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆ పార్టీ కార్యాలయం గాంధీభవన్‌ను వణికించింది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి తనకు రాలేదన్న ఆవేదనతో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీకి ఫోన్ చేసినట్టు ఆ ఆడియోలో తెలుస్తోంది. ఆ నాయకుడిని ఓదారుస్తూ షబ్బీర్ అలీ చేసినట్టుగా ఉన్న వ్యాఖ్యలు పార్టీకి తలవంపులు తెచ్చేలా ఉన్నాయంటున్నారు. ఈ అంశం పార్టీ పెద్దలను తలలు పట్టుకునేలా చేసింది. డబ్బులు పెడుతున్నా రని, మహిళలను ఎరగా వేసి పదవులు తీసుకుంటు న్నారనే కోణంలో అనూహ్యంగా వ్యాఖ్యలు ఉండటంతో పాటు, కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీగా మారిపోయిందంటూ అందులో వ్యాఖ్యానించడం వైరల్ అయ్యింది. అంతేకాదు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ పేరును కూడా అందులో ప్రస్తావిం చారు. ఆ ఆడియో ఎప్పటిదో అయినా.. ఇప్పుడు, ఈ సమయంలో బయటకు రావడం సంచలనం సృష్టించింది. మొత్తానికి ఈ వ్యాఖ్యలు కూడా పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. మహిళలను కించపరిచే రీతిలో వ్యాఖ్యలు చేయడం అంగీకారయోగ్యం కాదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీరియస్ అయ్యింది. పీసీసీ అధ్యక్షుడి ప్రతిష్ఠకు భంగం కలిగేలా, పార్టీలో పనిచేస్తున్న మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని క్రమశిక్షణ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, షబ్బీర్ అలీకి సంజాయిషీ నోటీసు పంపింది. దానికి షబ్బీర్ అలీ స్పందిస్తూ, ఆ గొంతు తనది కానే కాదని, ఎవరో ఏఐ సాయంతో తాను మాట్లాడినట్లుగా సృష్టించి, తనకు చెడ్డపేరు తెచ్చేందుకు ప్రయత్నించారని వాదిస్తున్నారు.
పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ షబ్బీర్ అలీ ఆడియో విషయంలో స్పందిస్తూ, పార్టీకి సంబంధించి ఎలాంటి ఆరోపణలు వచ్చినా తొందర పడబోమంటూ ఆ ఆడియోలో తన గురించి కూడా ప్రస్తావన ఉండటంతో వివరణ ఇచ్చారు. తన వ్యక్తిత్వం, ఆస్తిపాస్తులు, తన పుట్టుక ఏంటో రాష్ట్ర ప్రజలకు, అందునా నిజామాబాద్ ప్రజలకు బాగా తెలుసని అన్నారు.
40 ఏళ్లుగా లేని అవినీతి ఇప్పుడెక్కడ నుంచి వస్తుందని మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఆడియోలో మాట్లాడినట్లుగా ప్రస్తావన ఉన్న నాయకుడు పార్టీలో చేరడం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. షబ్బీర్ అలీనే ఆ వ్యక్తిని రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేర్పించారని, ఎందుకు చేర్పించారో ఆయనే సమాధానం చెప్పాలని మహేష్ కుమార్ అన్నారు. రేవంత్‌రెడ్డి సిఫారసు చేసినందుకే ఆయనకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి వచ్చిందని కూడా స్పష్టం చేశారు. అయితే, షబ్బీర్ అలీ అయినా, ఎవరైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, మహిళల పరువు తీసేలా వ్యాఖ్యానాలు చేయకూడదని హితవు పలికారు. ఈ వ్యవహారాన్ని పార్టీ చూసుకుంటుందని ఘాటుగా బదులిచ్చారు. అదే సమయంలో మీనాక్షి నామినేషన్ తిరస్కరణ అంశాన్ని పార్టీ అధిష్ఠానంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నదని వివరించారు.
పీసీసీ చీఫ్‌ను టార్గెట్ చేస్తున్నారా?
ఈ రెండు పరిణామాలనూ పరిశీలిస్తే.. ఆందోళనకరమైన సంకేతాలు కనిపిస్తున్నాయంటు న్నారు రాజకీయ విశ్లేషకులు. పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల పదవీ కాలం ముగియకముందే మహేశ్ కుమార్‌గౌడ్‌ను పార్టీలోని కొందరు టార్గెట్ చేస్తున్నారా? అనే ప్రశ్న గాంధీభవన్ వర్గాల్లో తీవ్రంగా చర్చకు వస్తోందని అంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌గౌడ్ ఫెయిల్ అయ్యారంటూ ఇటీవలే ఒక మీడియా చానెల్‌లో పెద్ద ఎత్తున వార్తలు రాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఒక నాయకుడే దీనికి కారణమన్న ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం పూర్తిగా సమసిపోక ముందే ఒక ఆడియో ఇప్పుడు బయటకురావడం చర్చనీయాంశమవుతోంది. అది కూడా ముఖ్య మంత్రికి సన్నిహితుడైన నాయకుడే మాట్లాడినట్టు అందులో ఉండడం తేలిగ్గా తీసి పారేయగలిగే అంశం కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మహేశ్‌కుమార్ గౌడ్ పద్మవ్యూహంలో చిక్కుకుంటు న్నారా? లేదా బలహీనపడ్డారా? అన్న ప్రశ్నకు ఇప్పటి కిప్పుడు సమాధానం చెప్పడం కష్టమే అయినప్పటికీ.. టార్గెటెడ్ అటాక్ జరుగుతోందని మాత్రం స్పష్టంగా తెలుస్తోందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.
అంతర్గత ప్రజాస్వామ్యమేనా ?
కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఆ పార్టీ నాయకులు తరచూ వల్లెవేస్తుం టారు. అయితే, అదే తీరులో ఆ పార్టీలో విభేదాలు, వర్గ రాజకీయాలు, కుమ్ములాటలు ఉంటాయన్నది ఎవరూ కొట్టిపారేయలేరన్న చర్చ ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు అనేక సంఘటనలు, వీటిని బలపరిచే ఆనవాళ్లు, సంకేతాలు బయటపడ్డాయి. అందుకే.. ఇప్పుడు కూడా ఇవేమీ కొత్తేమీ కాదని సమర్థించే వాళ్లు కూడా అదే పార్టీలో ఉన్నారని చెబుతున్నారు. అంటే.. కాంగ్రెస్ పార్టీలో క్రమ శిక్షణకు ఈ పరిణామాలు, వాదనలు అద్దం పడతాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఒకేసారి రెండు తీవ్రమైన పరిణామాలు బట్టబయలు కావడం, పార్టీని కుదుపునకు గురిచేయడం యాదృచ్ఛికంగా కనిపించినా, అవి రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత సమన్వయం, పరస్పర విశ్వాసం, క్రమశిక్షణ లోపించిన తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పార్టీ ఇన్‌చార్జ్‌కే సహకారం లేకుండా చేయడం, వ్యూహాలను ప్రతిపక్షాలకు లీక్ చేయడం, మహిళా నేతలపై అభ్యంతరకరంగా వ్యాఖ్యా నించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, ఎప్పటిలాగే, కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయ తపై ప్రశ్నలు అలుముకుంటున్నాయి. ఇకముందైనా పార్టీ సంస్కృతిలో, నాయకుల మనస్తత్వంలో మార్పు వస్తుందా? పార్టీలో నాయకుల మధ్య ఐక్యత అనేవి కేవలం ప్రకటనలకే పరిమితమా? లేదంటే ఆచరణలో మార్పు వస్తుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
– సుజాత గోపగోని
సీనియర్ జర్నలిస్ట్, 6302164068