విశాఖపట్నం నగరం భారీ పరిశ్రమలకు నిలయంగా, దేశ ప్రగతికి చోదక శక్తిగా పేరుగాంచింది. కానీ, తరచూ జరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలలో ఎందరో అమాయక కార్మికుల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. కర్మాగారాల యాజమాన్యాల బాధ్యతారాహిత్యం, ప్రభుత్వ పర్యవేక్షణా లోపం, సాంకేతిక సమస్యల పట్ల నిర్లక్ష్యం.. కలగలిపి కార్మికుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఏ రోజు ఏ కర్మాగారంలో ఎలాంటి విస్ఫోటనం జరుగుతుందో, ఎవరి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందో తెలియని భయానక వాతావరణంలో కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇటీవల జరిగిన వరుస ప్రమాదాలు పారిశ్రామిక భద్రత అనే అంశాన్ని ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మార్చాయి.
విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఉక్కును కరిగించే విభాగంలో జూన్ ఎనిమిదవ తేదీన అత్యంత ఘోరమైన ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులు విధుల్లో నిమగ్నమై ఉండగా, సుమారు పదిహేను వందల డిగ్రీల ఉష్ణోగ్రతతో మరిగిపోతున్న ద్రవ లోహాన్ని మోసుకెళ్లే భారీ ఇనుప పాత్రలు అకస్మాత్తుగా కుప్పకూలాయి. ఆ భయంకరమైన ద్రవపు ఉక్కు నేరుగా అక్కడ పనిచేస్తున్న కార్మికులపై పడటంతో, ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి శరీరాలు పూర్తిగా కాలిపోయి బొగ్గులా మారిపోయాయి. మరో ఏడుగురు కార్మికులు తీవ్ర గాయాలతో, ప్రాణాపాయ స్థితిలో వైద్యశాలలో చికిత్స పొందుతుండగా ఇద్దరు మరణించారు. ఈ దారుణ సంఘటన ఉక్కు నగరంలో తీవ్ర విషాదాన్ని నింపాయి. సంఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ముఖ్య మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, జిల్లా పాలనాధి కారితో స్వయంగా మాట్లాడి అత్యవసర సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. కేంద్ర పరిశ్రమల మంత్రి హెచ్‌డీ కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, నారా లోకేష్, హోం మంత్రి అనిత తదితరులు బాధితులను పరామర్శిం చారు. ఈ దారుణాన్ని మరువకముందే, కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే అదే కర్మాగారంలో మరో ప్రమాదం త్రుటిలో తప్పింది. జూన్ 12న తెల్లవారుజామున నిరంతర లోహ పోత విభాగా నికి పంపాల్సిన ద్రవపు ఉక్కు పాత్రకు అకస్మాత్తుగా పెద్ద రంధ్రం పడింది. దీని దెబ్బకు అందులో ఉన్న సుమారు ఎనభై టన్నుల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా నేలపాలై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ వరుస ప్రమాదాలతో విధులకు వెళ్లాలంటేనే కార్మికులు వణికిపోతున్నారు. పని వేళలు మారినప్పుడు లోపలికి వెళ్లడానికి సైతం సిబ్బంది జంకుతున్నారు.
యాజమాన్యాల నిర్లక్ష్యం
ఈ దుర్ఘటనలకు ముమ్మాటికీ యాజమాన్యాల నిర్లక్ష్యమే కారణమని కార్మిక సంఘాలు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నాయి. గత మూడేళ్లుగా కర్మాగారంలో మరమ్మతులు, యంత్రాల నిర్వహణ పనులు దాదాపుగా నిలిచిపోయాయి. యంత్రాల విడి భాగాలు పాడైపోయినా కొత్తవి సమకూర్చకుండా పాత వాటితోనే నెట్టుకొస్తున్నారు. ముడిసరకు రవాణా చేసే పట్టీలు తరచూ తెగిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. దీనికి తోడు, ఖర్చులను తగ్గించుకునే నెపంతో శాశ్వత ఉద్యోగుల సంఖ్యను దారుణంగా తగ్గించేశా రని, ఆ పని భారాన్ని మిగిలిన వారిపై రుద్దుతున్నారని కార్మికుల ఆరోపణ. కనీస సిబ్బంది లేకపోయినా నూరు శాతం ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలని యాజమాన్యం తీవ్రమైన ఒత్తిడి చేస్తోందంటున్నారు. నిర్దేశించిన లక్ష్యాలు చేరకపోతే వేతనాల్లో కోత విధిస్తామని బెదిరించడం పరిపాటిగా మారిందని, ఈ ఆరాటంలో కనీస భద్రతా నియమావళిని గాలికి వదిలేశారని విమర్శలొస్తున్నాయి. అంతేకాకుండా, ఒక విభాగంలో దశాబ్దాలుగా అనుభవం ఉన్న కార్మికులను, ఎలాంటి ముందస్తు శిక్షణ లేకుండా వేరొక అత్యంత క్లిష్టమైన విభాగానికి బదిలీ చేసి పనులు చేయించడం కూడా ప్రమాదాలకు ముఖ్య కారణమవుతోంది. కేవలం రక్షణ టోపీలు, పాదరక్షలు, ఫేస్ మాస్కులు ఇస్తే భద్రత కల్పించినట్లు యాజమాన్యాలు భావించడం ప్రభుత్వ కళ్లుగప్పే ధోరణికి నిదర్శనం.
ప్రమాదాలతో కార్మికుల బెంబేలు
గత ఏడాది కాలంగా ఈ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదాల చిట్టా విప్పితే గుండె తరుక్కు పోతుంది. మార్చి నెలలో ద్రవపు ఉక్కు మీద పడి ఒక ఉద్యోగి, జూన్ నెలలో విద్యుత్ తీగల విభాగం తొలగిస్తూ పైనుంచి పడి మరొకరు, ఆగస్టులో కంటైనర్ మీద పడి ఒక ఒప్పంద కార్మికుడు, ఇలా అనేక మంది తమ ప్రాణాలను పŸణంగా పెట్టారు. ఇదొక్క ఉక్కు కర్మాగారానికే పరిమితం కాలేదు. గతంలో (1997) హిందుస్థాన్ చమురు శుద్ధి కర్మాగారంలో జరిగిన భారీ విస్ఫోటనంలో అరవై ఒక్క మంది చనిపోయారు. 2013లో అదే పరిశ్రమలో కూలింగ్ టవర్ కూలిపోయి ఇరవై మందికి పైగా బలయ్యారు. 2020లో నౌకా నిర్మాణ కేంద్రంలో భారీ క్రేన్ కుప్పకూలి పది మంది మరణించారు. 2020 మే 7న వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి స్టైరీన్ అనే విషవాయువు లీకై.. అల్లకల్లోలం జరిగింది. పన్నెండు మంది నిద్రలోనే మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. ప్రాణాలు దక్కించుకునేందుకు వందలాది మంది చీకట్లోనే పరిగెత్తుతూ తొక్కిసలాటలో నరకం అనుభవించారు. వాంతులు చేసుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పరిశ్రమకు ఆనుకుని ఉన్న వెంకటాపురం గ్రామస్థులు నేటికీ తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలా పరవాడ, అచ్యుతా పురం వంటి ప్రత్యేక ఆర్థిక మండలాల్లోని మందుల తయారీ కర్మాగారాల్లో విషవాయువులు లీకై, పేలుళ్లు జరిగి కార్మికులు మృత్యువాత పడటం విశాఖలో సాధారణ విషయంగా మారిపోయింది.
ప్రమాదం జరిగిన ప్రతిసారీ పాలకులు, ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి రావడం, ఏదో రెండు ఊరట మాటలు చెప్పడం, ఒక విచారణ సంఘాన్ని ఏర్పాటు చేయడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. కానీ, ఆ సంఘాలు ఇచ్చిన నివేదికలు ఎన్నడూ బహిర్గతం కావు, వారి సూచనలు ఏనాడూ ఆచరణకు నోచుకోవు. కర్మాగారాల్లో జరిగే భద్రతా తనిఖీలు కేవలం మొక్కుబడిగా సాగుతున్నాయని స్వయంగా కార్మికులే ఆక్షేపిస్తున్నారు. కీలకమైన పర్యవేక్షణ విభాగాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల భద్రతలో జవాబుదారీతనం పూర్తిగా లోపించింది. పరిశ్రమల శాఖ అధికారుల పర్యవేక్షణ నామమాత్రంగా మిగిలిపోవడం వల్లే యాజమాన్యాలు ఇంతలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నాయి.
ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటులో జాప్యం
ఇంత భారీ స్థాయిలో పరిశ్రమలు ఉండి, నిత్యం ప్రాణాపాయం పొంచి ఉన్న ప్రాంతంలో, ప్రమాదం జరిగితే అత్యవసర వైద్యం అందించే కనీస సదుపాయాలు లేకపోవడం అత్యంత విచారకరం. సాధారణంగా గాయపడిన వారిని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలకు లేదా ప్రైవేటు వైద్యశాలలకు తరలిస్తుం టారు. కానీ, రసాయన, జీవ, రేడియోధార్మిక, అణు సంబంధిత ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు సాధారణ వైద్యం సరిపోదు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రత్యేక వైద్యం అత్యవసరం. ఈ లోటును పూరించడానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విశాఖలోని ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థ ప్రాంగణంలో ద్వితీయ స్థాయి ‘రసాయన, జీవ, రేడియోధార్మిక, అణు వైద్య నిర్వహణ కేంద్రం’ (సీబీఆరఎన్) ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రతినిధులు 2024లో స్థలాన్ని పరిశీలించి, రెండెకరాలు కేటాయించారు. ఒకేసారి అనేకమంది తీవ్రమైన రోగులకు చికిత్స అందించేలా ఇరవై అత్యవసర నిఘా పడకలు, ప్రత్యేక ఏకాంత గదులు నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇక్కడ రోగులకు వైద్యం అందించడానికి కొంతమంది వైద్యులకు తమిళనాడులోని అణు విద్యుత్ కేంద్రంలో ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించారు. కానీ, అంతా సిద్ధమై గుత్తేదారుల ఎంపిక దశలో, నిధుల లేమి కారణంగా ఈ బృహత్తర ప్రాజెక్టు అటకెక్కింది. విపత్తుల నిర్వహణ సంస్థ నుండి రావలసిన నిధులు మంజూరు కాకపోవడంతో ఈ ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. దీనివల్ల, అగ్ని ప్రమాదాల్లో శరీరం పూర్తిగా కాలిపోయిన వారికి, ప్రమాదకరమైన రసాయన వాయువులు పీల్చిన వారికి సరైన సమయంలో ఒకేచోట అత్యవసర వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు.
పరిశ్రమలు ఆర్థికాభివృద్ధికి మూలస్తంభాలైనా అవి అమాయక కార్మికుల రక్త మాంసాలపై నిర్మించినవి కాకూడదు. యాజమాన్యాల లాభాపేక్ష కారణంగా ఎన్నో కుటుంబాలు ఇంటి పెద్దలను పోగొట్టుకుని వీధిన పడుతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి పరిశ్రమల యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. భద్రతా తనిఖీలను పారదర్శకంగా, నిరంతరంగా సాగేలా నిర్వహించాలి. విచారణ సంఘాల నివేదికలను దాచిపెట్టకుండా బయటపెట్టి, దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలి. కర్మాగారాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి ప్రస్తుతం ఉన్న కార్మికులపై పని భారం అమానుషంగా పెరగకుండా ఆపాలి. వెంటనే నిధులు కేటాయించి, నిలిచిపోయిన ప్రత్యేక అత్యవసర వైద్య కేంద్రాన్ని యుద్ధప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురావాలి. కార్మికుల ప్రాణాలకు పూర్తి భరోసా కల్పించినప్పుడే పారిశ్రామి కాభివృద్ధికి నిజమైన సార్థకత చేకూరుతుంది. లేనిపక్షంలో ఇలాంటి హృదయ విదారక దుర్ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి.
– తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్