రష్యా-ఆఫ్ఘనిస్తాన్‌లు మే 27న సహకార ఒప్పందంపై సంతకాలు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. తనకు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్‌లో పనిచేస్తున్న ఐసిస్‌-‌కే ఉగ్రవాద సంస్థను అణచివేయడం ఈ ఒప్పందం కుదుర్చుకోవడంలో రష్యా ముఖ్య లక్ష్యం. పశ్చిమ దేశాలు తప్పుకున్నాక, ఈ ప్రాంతంలో రష్యా తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. ఇందులో భాగమే తాలిబన్‌ ‌ప్రభుత్వంతో ఒప్పందాలపై సంతకాలు చేయడం.రష్యా సెక్యూరిటీ కౌన్సిల్‌ ‌సెక్రటరీ సెర్గీ షోయిగ్‌,  ‌తాలిబాన్‌ ‌రక్షణ మంత్రి మౌలావీ మహ్మద్‌ ‌యాకూబ్‌ ‌ముజాహిద్‌లు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. రష్యా గత ఏడాది జూలైలో తాలిబాన్‌ ‌ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా నిలిచిన సంగతి తెలిసిందే.

రష్యా-ఆఫ్ఘనిస్తాన్‌ ‌మధ్య కుదిరిన తాజా ఒప్పందం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న పాత సోవియట్‌, ‌రష్యన్‌ ‌సైనిక పరికరాలు, ఆయుధాల మరమ్మతులకు రష్యా సహాయం చేస్తుంది. రష్యాలోని ‘తాతర్‌స్తాన్‌’ ‌ప్రాంతానికి చెందిన కంపెనీలు దీనికి అవసరమైన విడిభాగాలను అందిస్తాయి. రష్యా సహాయంతో ఏర్పాటు చేసే సైనిక మరమ్మతు సెంటర్ల ద్వారా స్థానిక ఆఫ్ఘన్‌ ‌ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉగ్రవాద నిర్మూలన కోసం ఇరుదేశాల మధ్య నిఘా సమాచార మార్పిడి జరుగుతుంది. తజికిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌ ‌వంటి మధ్య ఆసియా దేశాల సరిహద్దులను సురక్షితంగా ఉంచడమూ రష్యా ప్రధాన లక్ష్యం. ఈ దేశాలను రష్యా తన రక్షణ వలయంగా భావిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్‌ ‌నుండి రష్యా, ఇతరదేశాలకు హెరాయిన్‌, ‌మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఇరు దేశాలు సరిహద్దు భద్రతను పటిష్టం చేయనున్నాయి. ఆఫ్ఘన్‌ ‌భద్రతా సిబ్బందికి రష్యా రక్షణ నిపుణులు సాంకేతిక శిక్షణను అందిస్తారు. ఆఫ్ఘనిస్తాన్‌లోని విలువైన ఖనిజాలు (ముఖ్యంగా లిథియం, రాగి, గ్యాస్‌ ‌వనరులు) తవ్వకాలకు పెట్టుబడులు పెట్టడానికి రష్యన్‌ ‌కంపెనీలు ఆసక్తి చూపుతుండటం విశేషం.

ముందు వరుసలో చైనా

రష్యాతో పాటు చైనా కూడా తాలిబన్‌ ‌ప్రభు త్వంతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో ముందు వరుసలో ఉంది. అయితే, రష్యా సైనిక పరంగా అడుగులు వేస్తుంటే, చైనా ఆర్థిక పరంగా వ్యవహరిస్తోంది. చైనా తన ప్రతిష్టాత్మక బెల్ట్ అం‌డ్‌ ‌రోడ్‌ ఇనిషియేటివ్‌ ‌పరిధిలోకి ఆఫ్ఘనిస్తాన్‌ను చేర్చాలని చూస్తోంది. చైనా కంపెనీలు ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్‌లోని రాగి, చమురు క్షేత్రాల తవ్వకాల ఒప్పందాలను దక్కించుకోవడం గమనార్హం. అమెరికా సేనల ఉపసంహరణ తర్వాత, ఆ ప్రాంతంలో భద్రతా బాధ్యతలను ప్రాంతీయ శక్తులే చూసుకోవాలనేది చైనా-రష్యాల ఉమ్మడి వ్యూహం. రష్యా, చైనా, ఇరాన్‌, ‌పాకిస్తాన్‌లతో కూడిన చతుర్భుజ కూటమి ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌ ‌స్థిరత్వాన్ని పర్యవేక్షిస్తు న్నారు. చైనాకు ఉన్న ఏకైక భద్రతా భయం ‘తూర్పు తుర్కిస్తాన్‌ ఇస్లామిక్‌ ఉద్యమం’ ఉగ్రవాదులు. తాలిబన్లు తమ భూభాగాన్ని చైనాకు వ్యతిరేకంగా ఉపయోగించ నివ్వబోరనే హామీపైనే చైనా వీరికి మద్దతు ఇస్తోంది.

మనదేశంపై మిశ్రమ ప్రభావం

రష్యా-తాలిబాన్ల సాన్నిహిత్యం ప్రభావం మనదేశంపై మిశ్రమంగా ఉండనుంది. గతంలో తాలిబన్‌లను పాకిస్తాన్‌ ‌తన వ్యూహాత్మక కీలుబొమ్మ లుగా భావించేది. అయితే, ఇటీవల పాకిస్తాన్‌-‌తాలిబన్‌ల మధ్య సరిహద్దు ఘర్షణలు పెరిగాయి. ఇప్పుడు రష్యా రంగంలోకి దిగడం వల్ల, ఆఫ్ఘనిస్తాన్‌ ‌పూర్తిగా పాకిస్తాన్‌ ‌లేదా చైనా చేతుల్లోకి వెళ్లకుండా సమతుల్యత ఏర్పడుతుంది. ఇది భారత్‌కు అనుకూలాంశం. ఇరాన్‌లోని చబ్బహార్‌ ‌పోర్ట్ ‌ద్వారా మధ్య ఆసియా మార్కెట్లకు చేరుకోవాలనేది భారతదేశ దీర్ఘకాలిక వ్యూహం. రష్యా-ఆఫ్ఘన్‌ ఒప్పందం వల్ల ఆ ప్రాంతంలో స్థిరత్వం వస్తే, భారత్‌ ఆఫ్ఘనిస్తాన్‌ ‌గుండా రష్యాకు రవాణా మార్గాలను మెరుగు పరుచుకోవచ్చు. భారత్‌ ఇప్పటికీ తాలిబన్‌లతో దౌత్య, సాంకేతిక సంబంధాలను కొనసాగిస్తున్న ప్పటికీ, వారిని అధికారికంగా గుర్తించలేదు. రష్యా తాలిబన్‌ ‌ప్రభుత్వాన్ని గుర్తించినట్లే భారత్‌పై కూడా అలాంటి ఒత్తిడి పెరుగుతున్నది. కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాలిబన్‌ల వైఖరిని భారత్‌ ‌నిశితంగా గమనిస్తోంది. రష్యా ద్వారా తాలిబన్‌ల సైనిక సామర్థ్యం పెరిగితే, అది భవిష్యత్తులో ఇతర తీవ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్లకుండా చూడటం భారత్‌కు రక్షణపరంగా కీలకమైన సవాలు.

భారత్‌ ‌వ్యూహాత్మక అడుగులు

రష్యా-ఆఫ్ఘనిస్తాన్‌ ‌సైనిక ఒప్పందం, ప్రాంతీయ సమీకరణల మార్పుల నేపథ్యంలో, భారతదేశం అత్యంత జాగ్రత్తగా, తన ప్రయోజనాలు దెబ్బతిన కుండా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. పాకిస్తాన్‌ ఒం‌టరిగా మారుతున్న తరుణంలో, భారత్‌ ‌తన భద్రతను కాపాడుకుంటూనే ప్రాంతీయం గా పట్టును సాధించడానికి తాలిబన్‌ ‌ప్రభుత్వంతో ప్రయోగాత్మక దౌత్యం నెరపుతూ, కాబూల్‌లోని తన ‘టెక్నికల్‌ ‌మిషన్‌’ ‌ద్వారా సంబంధాలను కొనసాగిస్తోంది. తాలిబన్‌లను అధికారికంగా గుర్తించకపోయినప్పటికీ, వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌కు గోధుమలు, మందులు, వైద్య పరికరాలను సరఫరా చేయడం ద్వారా భారత్‌ అక్కడి ప్రజల్లో, ఆ ప్రభుత్వంలో తనపై గల సానుకూలతను కాపాడుకుంటోంది. తాలిబన్‌లు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మారడం వల్ల, భారత్‌కు వ్యతిరేకంగా పని చేసే లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ ‌వంటి ఉగ్రవాద సంస్థలకు ఆఫ్ఘనిస్తాన్‌ ‌మద్దతు లభించ కుండా భారత్‌ ‌దౌత్యపరమైన ఒత్తిడి తెస్తోంది. పాకిస్తాన్‌ ‌మీదుగా కాకుండా, ఇరాన్‌లోని చబ్బహార్‌ ‌పోర్ట్ ‌ద్వారా ఆఫ్ఘనిస్తాన్‌-‌మధ్య ఆసియా దేశాలకు రవాణా మార్గాన్ని బలోపేతం చేయడం భారత్‌ అనుసరిస్తున్న అతిపెద్ద వ్యూహం. ఇటీవల ఇరాన్‌తో కుదుర్చుకున్న దీర్ఘకాలిక ఒప్పందాల నేపథ్యంలో భారత్‌ ‌తన వ్యూహాన్ని మరింత వేగంగా అమలు చేస్తోంది. రష్యా-ఆఫ్ఘన్‌ ‌సైనిక ఒప్పందం కుదిరి నప్పటికీ, రష్యాతో మనదేశానికున్న బలమైన సంప్ర దాయ రక్షణ సంబంధాల ద్వారా తన ఆందోళనలను మాస్కోకు తెలియజేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో రష్యా సైనిక ఉనికి భారత్‌కు ముప్పుగా మారకుండా ఉండేలా తెరవెనుక దౌత్యం నెరపుతోంది.

పాక్‌ ‌కట్టడి, ఉగ్ర సవాళ్లు

ఈ ఒప్పందం వల్ల ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్తాన్‌కు ఉన్న పట్టు పూర్తిగా తగ్గిపోయింది. తాలిబన్‌లు ఇప్పుడు పాకిస్తాన్‌పై ఆధారపడకుండా రష్యా, చైనాల మద్దతు పొందుతున్నారు. ఇది భారత్‌కు అనుకూ లాంశం. ఆఫ్ఘనిస్తాన్‌ ‌పూర్తిగా పాక్‌ ‌నియంత్రణలోకి వెళ్లకుండా ఇది అడ్డుకుంటుంది. ఐసిస్‌-‌కే వంటి ఉగ్రవాద సంస్థలను అణచివేయడానికి రష్యా-తాలిబన్లు చేతులు కలపడం వల్ల ఆ ప్రాంతంలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంది.

రష్యా సహాయంతో ఆఫ్ఘనిస్తాన్‌లోని పాత సోవియట్‌ ‌సైనిక పరికరాలు, ఆయుధాలను మళ్లీ ఆధునీకరించనున్నారు. భవిష్యత్తులో ఈ ఆయుధాలు లేదా సాంకేతికత పాకిస్తాన్‌ ‌మద్దతు ఉన్న జైషే మహ్మద్‌, ‌లష్కరే తోయిబా వంటి భారత్‌ ‌వ్యతిరేక ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్లకుండా భారత్‌ ‌జాగ్రత్తలు తీసుకోవాలి.

పశ్చిమ దేశాలనుంచి రక్షణ కొనుగోళ్లు

 సంప్రదాయకంగా భారత్‌ ‌తన రక్షణ అవసరాల కోసం రష్యాపైనే ఎక్కువగా ఆధారపడేది. అయితే, రష్యా ఇప్పుడు తాలిబన్లతో రక్షణ ఒప్పందం చేసుకోవడం, ఉక్రెయిన్‌ ‌యుద్ధం కారణంగా ఆయుధాల సరఫరాలో ఆలస్యం అవుతుండటంతో, భారత్‌ ‌రష్యాపై ఆధారపడటాన్ని తగ్గిస్తోంది. అమెరికా, ఫ్రాన్స్, ఇ‌జ్రాయెల్‌ ‌నుండి రక్షణ పరికరాలను భారత్‌ ఎక్కువగా కొనుగోలు చేస్తోంది. దౌత్యపరమైన వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, రష్యా నుండి భారత్‌ ‌కొనుగోలు చేసే చౌక ముడిచమురు వ్యాపారం యధావిధిగా కొనసాగుతోంది. రష్యా-ఆఫ్ఘనిస్తాన్‌ ‌సరిహద్దులు సురక్షితంగా ఉంటే, భారత్‌ ‌నిర్మిస్తున్న ఇంటర్నేషనల్‌ ‌నార్త్-‌సౌత్‌ ‌ట్రాన్స్‌పోర్ట్ ‌కారిడార్‌ ‌మరింత విజయవంతమవుతుంది.

అమెరికాతో పెరుగుతున్న బంధం

రష్యా-ఆఫ్ఘనిస్తాన్‌ ‌రక్షణ ఒప్పందం, ఆ ప్రాంతంలో చైనా-రష్యాల ప్రాభవం పెరుగుతున్న నేపథ్యంలో, భారత్‌-అమెరికా మధ్య రక్షణ బంధం మునుపెన్న డూ లేనంతగా బలపడుతోంది. చైనా, రష్యా, తాలిబన్‌ ‌కూటమిని సమతుల్యం చేయడానికి భారత్‌ను ఆసియాలోనే అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామిగా అమెరికా గుర్తిస్తోంది. భారత్‌, అమెరికాలు ‘‘ఐసిట్‌’’ (ఇనిషియేటివ్‌ ఆన్‌ ‌క్రిటికల్‌ అం‌డ్‌ ఎమర్జింగ్‌ ‌టెక్నాలజీ)ద్వారా రక్షణ సాంకేతికతను పంచుకుంటున్నాయి.

ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్, ‌క్వాంటం కంప్యూటింగ్‌, అం‌తరిక్ష రక్షణ రంగాలలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. గతంలో కేవలం ఆయుధాలను విక్రయించిన అమెరికా, ఇప్పుడు భారత్‌లోనే వాటిని తయారు చేయడానికి అంగీక రించింది. ఇరు దేశాల మధ్య ‘‘బీఈసీఏ’’, ‘‘సీఓఎంసీఏఎస్‌ఏ’’ ‌వంటి వ్యూహాత్మక ఒప్పందాల ద్వారా అమెరికా తన ఉపగ్రహ సమాచారాన్ని, మ్యాప్‌లను భారత్‌తో పంచుకుంటున్నది. సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలను లేదా పొరుగు దేశాల సైనిక వ్యూహాలను ముందే గుర్తించడానికి ఇది భారత్‌కు ఎంతో సహాయ పడుతుంది.లాజిస్టిక్స్ ఒప్పందం ప్రకారం భారత్‌, అమెరికా సైన్యాలు పరస్పరం ఒకరి సైనిక స్థావరాలను, ఓడరేవులను ఇంధనం నింపుకోవడానికి, మరమ్మతుల కోసం ఉపయోగించుకోవచ్చు. మలబార్‌ ‌వంటి ఉమ్మడి నావికాదళ విన్యాసాల ద్వారా ఇరుదేశాల సైన్యాల మధ్య సమన్వయం పెరుగుతోంది. తాలిబన్‌ల భూభాగం నుండి అంతర్జాతీయ ఉగ్రవాదం మళ్లీ విజృంభించకుండా చూడటంలో భారత్‌, అమెరికాల లక్ష్యాలు ఒక్కటే.

పాక్‌పై ప్రతికూల ప్రభావం

రష్యా-తాలిబన్‌ల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం పాకిస్తాన్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. ఒకప్పుడు తాలిబన్‌లను తన వ్యూహాత్మక భాగస్వామిగా భావించిన పాకిస్తాన్‌కు, ఈ తాజా పరిణామం అశనిపాతంగా మారింది. గతంలో తాలిబన్లకు అంతర్జాతీయ మద్దతు లేదా దౌత్యపరమైన గుర్తింపు కావాలంటే పాకిస్తాన్‌పైనే ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రష్యా (చైనా) నేరుగా తాలిబన్‌లతో చేతులు కలపడం, రష్యా వారిని అధికారిక ప్రభుత్వంగా గుర్తించడంతో తాలిబన్‌లకు అంతర్జాతీయ వేదిక దొరికింది. రష్యా సహాయంతో ఆఫ్ఘన్‌ ‌సైనిక పరికరాలు, ఆయుధాలు బలోపేతం కావడం వల్ల భవిష్యత్తులో పాకిస్తాన్‌కు సరిహద్దు భద్రతా ముప్పు మరింత పెరుగుతుంది. ఐసిస్‌-‌కే ఉగ్రవాద నిర్మూలన కోసం రష్యా గతంలో పాకిస్తాన్‌ను ఒక ముఖ్యమైన భాగస్వామిగా చూసేది. కానీ ఈ కొత్త ఒప్పందం ద్వారా రష్యా నేరుగా తాలిబన్లకే సైనిక, ఇంటెలిజెన్స్ ‌మద్దతు ఇస్తోంది. రష్యా ఇప్పుడు పాకిస్తాన్‌కు బద్ధ శత్రువుగా మారుతున్న ఆఫ్ఘన్‌ ‌తాలిబన్‌ ‌ప్రభుత్వంతో వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం పాకిస్తాన్‌కు దౌత్యపరంగా మింగుడుపడని అంశం. రష్యా-ఆఫ్ఘన్‌ ఒప్పందం వల్ల ఆఫ్ఘనిస్తాన్‌ ఇరాన్‌లోని చబ్బహార్‌ ‌పోర్ట్ ‌వైపు లేదా చైనా వైపు మొగ్గు చూపితే, పాకిస్తాన్‌లోని గ్వాదర్‌ ‌పోర్ట్ ‌ప్రాధాన్యత తగ్గి ఆర్థిక నష్టం తప్పదు.

ఇదిలావుండగా ఉద్రిక్తతల కారణంగా కీలకమైన చామన్‌, ‌తోర్ఖామ్‌ ‌సరిహద్దు వాణిజ్య మార్గాలను పాకిస్తాన్‌ ‌తరచుగా వ•సివేస్తోంది. దీనివల్ల ఇరుదేశాల మధ్య వ్యాపారం దెబ్బతింటోంది. ఇదే సమయంలో పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచడానికి తాలిబన్లు రష్యా, చైనాల వైపు చూస్తున్నారు. పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్‌, ‌ఖైబర్‌ ‌ఫక్తుంక్వా ప్రాజెక్ట్ ‌సైట్లలో పనిచేస్తున్న చైనా ఇంజనీర్లపై బలూచ్‌ ‌తిరుగుబాటు దారులు దాడులు చేస్తున్నారు. ప్రాజెక్టులకు పూర్తి రక్షణ కల్పించడంలో పాకిస్తాన్‌ ‌విఫలం కావడంపై చైనా తీవ్ర అసంతృప్తితో ఉంది. పాకిస్తాన్‌లో అస్థిరత పెరగడంతో, చైనా ఇప్పుడు సీపెక్‌ను ఆఫ్ఘనిస్తాన్‌కు విస్తరించాలని చూస్తోంది. రష్యా కూడా తాలిబన్‌లక• మద్దతు ఇవ్వడంతో, చైనా నేరుగా ఆఫ్ఘనిస్తాన్‌లోని నిజ వనరుల ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడుతోంది. దీనివల్ల సీపెక్‌ ‌ప్రాజెక్టుల ద్వారా పాకిస్తాన్‌కు రావాల్సిన ప్రత్యేక ప్రాధాన్యత తగ్గుతోంది.

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE