దక్షిణ గంగగా, జీవనదిగా ఖ్యాతిపొందిన గోదావరి నది నేడు కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మీదుగా ప్రవహించే ఈ నది లక్షల ఎకరాలకు సాగునీరు, కోట్లాది మందికి తాగునీరు అందిస్తూ పారిశ్రామిక అవసరాలను సైతం తీరుస్తోంది. కానీ పారిశ్రామిక వ్యర్థాలు, గృహ మురుగు, ప్లాస్టిక్ వినియోగం వల్ల ఈ పుణ్యనది ‘గరళ గోదావరి’గా మారుతోంది.
గోదావరి నదికి సంబంధించి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మÖడు ప్రధాన కాలువలు ఉమ్మడి జిల్లాలో తూర్పు, మధ్య డెల్టాల పరిధిలో సుమారు 2,400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. మధ్య డెల్టా కింద కోనసీమకు అమలాపురం కాలువ, గన్నవరం కాలువల ద్వారా అమలాపురం, రావులపాలెం, కొత్తపేట ప్రాంతాలకు సాగు,తాగునీరు సరఫరా అవుతోంది. తూర్పు డెల్టా కింద ధవళేశ్వరం నుంచి కాకినాడ వరకు కాలువల ద్వారా గోదావరి నీరు ప్రవహిస్తోంది. ఈ కాలువ ద్వారా కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, రామ చంద్రాపురం మునిసిపాలిటీలతో పాటు వందలాది గ్రామాలకు ఈ నీళ్లే ప్రధాన దిక్కు. పశ్చిమ డెల్టా కాలువ పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు, భీమవరం, ఏలూరు, నరసాపురం, పాలకొల్లు ప్రాంతాలకు కాలువ ద్వారా నీరు అందుతోంది. సురక్షితంగా కాపాడుకోవాల్సిన ఈ కాలువలను ఎక్కడికక్కడ వ్యర్థాలతో నింపేస్తున్నారు. కోళ్ల ఫారాల దగ్గర నుంచి రొయ్యల చెరువుల వ్యర్థాల వరకు, ఇంట్లో చెత్తాచెదారం నుంచి వాణిజ్య దుకాణాల వృథా వస్తువుల వరకు అన్నీ కాలువల్లోనే కలిపేస్తున్నారు. అనపర్తి, కడియం, బిక్కవోలు, ద్వారపూడి, సామర్ల కోట, కాకినాడ, కోనసీమ పరిధిలోని కాలువల్లో ఈ తరహా వ్యర్థాలు భయంకరంగా కలుస్తున్నాయి. పరిశ్రమల సైతం కాలుష్య జలాలను గుట్టుచప్పుడు కాకుండా కాలువల్లోకే మళ్లించేస్తున్నాయి. ఈ కాలువలన్నీ కలిసేది గోదావరి పాయల్లోనే. ఇక గోదావరి నదీతీరాన్ని ఆనుకొని ఉన్న సూక్ష్మ, భారీ పరిశ్రమలు, ప్రధానంగా పేపరు మిల్లుల నుంచి రసాయనాలతో కూడిన వ్యర్థ జలాలను శుద్ధి చేయకుండానే నేరుగా పైపుల ద్వారా వెంకటనగరం, తొర్రేడు ప్రాంతాల్లో వదిలేస్తున్నారు. వేమగిరి నుంచి సామర్లకోట వరకు అనేక గ్రామాల్లోని డ్రెయినేజీ అవుట్‌లెట్లు, సెప్టిక్ ట్యాంకుల పైపులు కాలువల్లోనే ఉంటున్నాయి.
విషపూరితమవుతున్న జలాలు
ప్రజారోగ్యంపై ప్రభావం కాలువల వెంబడి ఉన్న పంచాయతీలు, మునిసిపాలిటీలు మురుగును కాలువల్లోకి వదలడంవల్ల పవిత్ర జలాలు విషతుల్యంగా మారుతున్నాయి. తూర్పు, మధ్య డెల్టాల పరిధిలో 175 చోట్ల గోదావరి కాలువల నీళ్లు విషతుల్యంగా మారినట్లు మూడున్నరేళ్ల కిందటే జలవనరుల శాఖ గుర్తిం చింది. కాలువల వెంబడి వ్యర్థాలపై డ్రోన్లతో పంచాయతీలు, మునిసిపాలిటీలు సర్వే చేశాయి. కోనసీమ పరిధిలో రొయ్యల చెరువుల్లో వాడిన నీటిని పైపులతో గోదావరి కాలువలకు మళ్లించడం వల్ల నీరు విషమయం అవుతుండగా, ఆ నీటిని తాగే మూగజీవాలు తరచూ మృత్యువాత పడుతున్నాయి. నదీ జలాల్లో సాధారణ స్థాయి కంటే 10 రెట్లు అధికంగా ఇకోలీ, ఇతర బ్యాక్టీరియా ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇంతటి విషపూరితమైన నీటినే, నల్లాచానల్ నుంచి సుమారు 800 మీటర్ల దూరం ప్రవహించగానే ప్రధాన మంచినీటి విభాగం ఇంటెక్ పాయింట్ నుంచి లిఫ్ట్ చేసి, ఆ నీటినే శుద్ధిచేసి రోజుకు 175 ఎంఎల్‌డీ తాగునీరుగా రాజమహేంద్రవరం ప్రజలకు సరఫరా చేస్తున్నారు. అలాగే నగర పరిధిలో రోజుకు సగటున విడుదలయ్యే 60 ఎంఎల్‌డీల మురుగుకు గమ్యస్థానం గోదావరే అవుతోంది. ప్రతి రోజు సగటున 200 ఎంఎల్‌డీ వ్యర్థ జలాలు గోదావరిలో కలిసిపోతున్నాయి. కైలాసభూమిలో శవాల అవయ వాలు గోదావరిలోకి తోసేసే పరిస్థితి ఉంది. కళేబరాలు నదిలో కలుస్తున్నాయి.
విజృంభిస్తున్న ప్లాస్టిక్ మహమ్మారి
గోదావరికి ప్లాస్టిక్ వ్యర్థాలు పట్టిన అతిపెద్ద పీడ. రాజమహేంద్రవరం నగరంలో రోజుకు 160 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తవుతుంటే, అందులో 40 మెట్రిక్ టన్నుల మేర ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజుకు 5 టన్నుల వరకూ ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతుండగా, కనీసం 3 టన్నుల వరకూ నేరుగా గోదావరిలో కలిసిపోతున్నాయి. కాకినాడ జిల్లాలో ప్రధానంగా 150 టన్నులు, తూర్పుగోదావరి జిల్లాలో రోజుకు 200 టన్నులు, కోనసీమ జిల్లాలో 100 టన్నుల వరకూ చెత్త ఉత్పత్తి అవుతోంది. మొత్తం 450 టన్నుల చెత్తలో ప్లాస్టిక్ వ్యర్థాల వాటా 50 శాతం పైనే ఉంటుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క ప్లాస్టిక్ కవరు భూమిలో కలవడానికి సుమారు 10 లక్షల ఏళ్లు పడుతుంది. వర్షం నీటిని భూమిలో ఇంకనివ్వక భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి, డ్రైన్లు పూడికతో నిండిపోతున్నాయి, జలచరాలు మరణిస్తున్నాయి.
గత (2015) పుష్కరాలకు నదీ తీర ప్రాంతంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించినా రెండేళ్ల తర్వాత పరిస్థితి మామూలే అయిపోయింది. గతేడాది మేలో ప్లాస్టిక్ కట్టడికి 370 దుకాణాల్లో దాడులు చేసి 4.75 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ స్వాధీనం చేసుకొని, రూ. 10.65 లక్షల అపరాధ రుసుము విధించారు. అయినప్పటికీ రాజమహేంద్రవరంలో ఎస్వీజీ మార్కెట్, మెయిన్ రోడ్డు లాంటి ప్రాంతాల్లో ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రెండేళ్ల కిందట అమృత్ 2.0లో ‘నమామి గోదావరి’ పేరిట కేంద్రం రూ.89 కోట్లు విడుదల చేయగా ఆవలో 50 ఎంఎల్‌డీ ఎస్‌టీపీ నిర్మిస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న 30 ఎంఎల్‌డీ ప్లాంట్‌ను వినియోగంలోకి తీసుకురావడంతో పాటు, కాతేరు, మోరంపూడి వద్ద 20 ఎంఎల్‌డీ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదన లున్నాయి. గతంలో రాజమహేంద్రవరం వ్యర్థ జలాలను శుద్ధిచేసి సముద్రంలోకి తరలించేందుకు రూ. 1500 కోట్లతో చేసిన ప్రతిపాదనలు, రూ. 400 కోట్లతో భూగర్భ కాలువ వ్యవస్థ ఏర్పాటు ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మే 25, 26 తేదీల్లో గోదావరి నదీ తీరంలో పర్యటించి, నదిలో మురుగు, ప్లాస్టిక్ వ్యర్థాలు కలవడాన్ని ప్రత్యక్షంగా చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆంధ్ర పేపర్ మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాల నమÖనాలను సేకరించాల్సిందిగా అధికారులను ఆదేశించిన ఆయన, పరిశ్రమలు కాలుష్య నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. ఈ కలుషిత నీటిపై స్పందిస్తూ, “ఈ నీళ్లలో స్నానం చేస్తే పుణ్యం కాదు.. రోగాలు వస్తాయి” అని హెచ్చరించిన పవన్ కల్యాణ్, రాష్ట్రానికి పారిశ్రామిక అభివృద్ధి ఎంత ముఖ్యమో పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. వెంటనే అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, 2027 గోదావరి పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రూ. 8,600 కోట్లతో చేపట్టాల్సిన పనుల జాప్యంపై అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత పుష్కరాల నాటి తొక్కిసలాట వంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రణాళికాబద్ధంగా, నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కాలుష్య మహమ్మారి నుంచి నదికి విముక్తి కలిగించేందుకు ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ పేరిట ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. ఇందులో భాగంగా 5 జిల్లాల పరిధిలో గోదావరిలోకి రోజుకు కలుస్తున్న 104 మిలియన్ లీటర్ల పట్టణ మురుగు, 8.38 మిలియన్ లీటర్ల గ్రామీణ మురుగు, 32 మిలియన్ లీటర్ల పేపర్ మిల్లు వ్యర్థాలు, 13.24 మిలియన్ లీటర్ల ఆక్వా కాలుష్యాన్ని అడ్డుకోవడానికి కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాల నాటికి 262 గ్రామ పంచాయతీలను మురుగు రహితంగా తీర్చిదిద్దాలని, గృహ మురుగు నీటి నిర్వహణకు వీబీజీ రాంజీ పథకం కింద మ్యాజిక్ డ్రైన్లు, బ్లాక్ వాటర్ కోసం సామాజిక ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. పట్టణాల్లో మురుగునీటిని ప్లాంట్ల ద్వారా పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతే నదిలోకి వదలాలని, ఇందుకోసం పీసీబీ మంజూరు చేసిన రూ. 100 కోట్లతో పాటు స్వచ్ఛాంధ్ర నిధులను వాడుకోవాలన్నారు. అలాగే, కాలుష్యాన్ని నిరంతరం పర్యవేక్షించడానికి ఆర్టీజీఎస్ తరహాలో సీసీ కెమెరాలతో అనుసంధా నించిన కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, దీని పర్యవేక్షణ బాధ్యతను అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌కు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై దశల వారీగా నిషేధాన్ని పక్కాగా అమలు చేయాలని గోదావరి ప్రాంత మున్సిపాలిటీలను ఆయన ఆదేశించారు.
నదీ జలాలను కాలుష్య కాసారంగా మార్చుకోవడం మొత్తం జీవావరణానికే ప్రమాదకరం. గోదావరిని కాపాడుకోవాలంటే అధికారులలో చిత్త శుద్ధి,ప్రజల్లో చైతన్యం అవసరం. జూట్, వస్త్ర సంచుల వినియోగంపెంచాలి, ఇతర వస్తువుల తయారీకి కుటీర పరిశ్రమలు ప్రోత్సహించాలి. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేస్తేనే జీవనది అయిన గోదావరికి నిజమైన ప్రక్షాళన జరుగుతుంది.

తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్