భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనదిమీ
-కలశపూడి శ్రీనివాసరావు
న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్ ఆఫీస్ 34 అంతస్తులో తన విశాలమైన ఆఫీసులో ఉన్నాడు శంకరం విష్ణుభట్ల. ఆతని బాస్ బ్రైన్వాలస్ తలుపు తీసుకొని వచ్చారు.
‘‘అభినందనలు శంకరం!’’ అన్నాడు చిరునవ్వుతో.
‘‘నీ బృందంతో రాత్రింబవళ్లు కష్టపడి, ఐటీ,ఏఐ సాధనాలతో అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను వెలికితీసి, పటిష్టమైన జాబితా రూపొందించి దొంగతనపు మార్గాలన్నీ మూసేశావు.అది అంతర్జా తీయంగా సంచలనం సృష్టించిన 2012లో ‘ఆపరేషన్ హై రోలార్కేసు’ను తలపించేంత క్లిష్టమైనది. ఆ కేసులోనూ హ్యాకర్లు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు దోచుకున్నారు.కానీ సాంకేతిక నిపుణులు డేటా విశ్లేషణతో వాటిని అడ్డుకున్నారు. నువ్వూ అదే తరహాలో పని చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అని మెచ్చుకున్నాడు.
‘‘నాకు అంతా ముఖ్యమైన పని ఇచ్చినందుకు కృతజ్ఞతలు’’ అన్నాడు శంకరం.
శంకరం తన సంస్థలో అత్యంత సున్నితమైన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అమెరికా పౌరులు కాని పెట్టుబడిదారుల చేతిలో ఉన్న అన్ని ఆస్తులు, షేర్లు, పెట్టుబడులను గుర్తించడం, అలాంటి ఆస్తులతో, గుప్తంగా లేదా హఠాత్తుగా ఏదైనా అమెరికా కంపెనీలను ఆక్రమించడానికి ఉపయోగపడకుండా పర్యవేక్షించడం ఆతని పని. అతని ఆఫీసు కిటికీలలో నుంచి దూరంగా కనిపిస్తున్న స్ట్యాచ్యూ ఆఫ్ లిబర్టీ సముద్రపు నీలిమలో మెరుస్తూ, స్వేచ్ఛకు ప్రతీకగా ఉన్న దృశ్యం అతని ఉద్యోగ ఉన్నతికి చిహ్నం.
ఆ రోజు ఉదయం శంకరం ఆఫీసు పని చేయకుండా మౌనంగా కూర్చొన్నాడు. అతని మౌనానికి కారణం ఆ రోజు వచ్చిన ఉత్తరం. 2025లో కాగితపు ఉత్తరాలు రావడం చాలా అరుదు. కానీ శంకరానికి ఆ రోజు వచ్చింది. అది అతని ఊరిలో వేణుగోపాలస్వామి ఆలయ ప్రధాన అర్చకులు అబ్బిగారు రాసినది.
‘‘నాయనా శ•ంకరం! ఆశీర్వచనములతో రాయునది ఏమనగా… నువ్వు చిన్నప్పుడు తిరుగాడిన వేణుగోపాలస్వామి ఆలయం పాడైపోతున్నది. ధూప దీప నైవేద్యాలకు తగిన ఆదాయం లేదు. మన దేవాలయానికి చెందిన వంద ఎకరాల పంట భూమి, చెరువులు ఒక్కొక్కటిగా స్థానిక రాజకీయ నాయకుల చేతుల్లోకిపోయాయి. ఈ ఆలయ వైభవం మిగిలింది భక్తుల జ్ఞాపకాలలో మాత్రమే. నీకు విజ్ఞానం ఉంది. నీకు శక్తి ఉంది. ఏదైనా చేయి నాయనా! నువ్వు సంకల్పిస్తే భగవంతుడు నీకు దారి చూపిస్తాడు.’’- ఇట్లు అంపోలుఅబ్బి శంకరం కళ్లు మూసుకున్నాడు. తన చిన్నప్పటి వేమవరం కళ్ల ముందు మెదిలింది.
శంకరం చిన్నప్పుడు వేణుగోపాలస్వామి ఆలయం ఉత్సవం అంటే పల్లె మొత్తం ఒక కుటుంబంలా మారేది. ఉదయాన్నే అర్చకుల స్వరంలో వేదమంత్రాలు ఘోషించేవి. ప్రతిరోజు పూజలతోపాటు ఆయా పర్వదినాలలో రథోత్సవం, వసంతోత్సవం, తెప్పోత్సవం లాంటివి జరిపించే వారు. ఆలయం ముందు వరుసలో మట్టి దీపాలతో కాంతులు నింపేది కుమ్మరి వర్గం. కార్తిక మాసంలో వేలాది దీపాలు రాత్రి చీకటిని పండుగలా మార్చేవి. పద్మశాలి వర్గం నేసిన పట్టు వస్త్రాలు దేవుడి విగ్రహానికి అలంకరించడంతో ఎంతో శోభ కలిగించేవి. రైతులు మొదటి కోతలోని ధాన్యం, పప్పులు, పండ్లు దానం చేసి అన్నదానంలో భాగం అయ్యేవారు. వడ్రంగులు రథానికి కొత్త చక్రాలు అమర్చడం, విశ్వకర్మలు బంగారు కిరీటాలను పునరుద్ధరించడం, బెస్తవారు తెప్పోత్సవంలో తమ వంతు పాత్ర పోషించేవారు. గౌడ వర్గం వారు ఉత్సవిగ్రహంతో ఊరేగింపు చేసేవారు. మాలీలు పూలమాలలు, తోరణాలతో ఆలయాన్ని తీర్చిదిద్దేవారు. చిత్రకారులు, శిల్పులు గోపురం చిత్రాలను కొత్త రంగులతో మెరిపించేవారు. ఇలా ప్రతి కులం వారు తమ ప్రత్యేక నైపుణ్యంతో, అర్పణభావంతో ఆలయం పనులు చేసేవారు. ఆలయానికి సొగసులని తీర్చిదిద్దేవారు. ఆలయం కేవలం పూజాస్థలమే కాదు? సమాజాన్ని ఒక కుటుంబంగా తీర్చిదిద్దే వేదిక. వే•ణుగోపాలస్వామి ఆలయం ఊరి హృదయం. అక్కడ భక్తి, స్నేహం, అన్నదానం, ప్రసాదాలు ఇంకా గుర్తు ఉన్నాయి శంకరానికి. తన ఊరు వెళ్లాలని నిశ్చయుంచు కున్నాడు.
* * *
తరువాతి వారంలోనే శంకరం వాల్‌స్ట్రీట్ వి•టింగ్‌లు అన్నీ వెనక్కి పెట్టి వేమవరం చేరుకున్నాడు. అబ్బిగారినికలిసాడు. తాను ప్రయత్నం చేస్తానని చెప్పాడు. అబ్బి గారు ఆనందంతో ఆశీర్వదించారు. శంకరం బంధుమిత్రులతో ఆలయం విషయం మాట్లాడడం మొదలు పెట్టాడు.
‘‘మన ఆలయ భూములు తిరిగి తెచ్చుకోవాలి’’ అని ఉత్సాహంగా చెప్పాడు. కానీ వారి సమాధానాలు చాలా నిరాశ కలిగించాయి. ‘శంకరమా! ఆ భూములన్నీ ఏళ్ల క్రితమే అన్ని పార్టీల స్థానిక నాయకులు పంచుకుని కూర్చున్నారు, వాళ్లతో పోరాడటం అంటే తలనొప్పే. కొరివితొ తల గోక్కున్నట్టే. పూజారి అడిగారని నువ్వు ఇంత పెద్ద సమస్యలో పడాల్సిన అవసరం లేదు’’ అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు.
అయినప్పటికీ, శంకరం ఆక్రమిత ఆలయ భూములని వెనక్కి తెచ్చే ప్రయత్నం మొదలు పెట్టాడు. అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ చరిత్రను చదవడం ప్రారంభించాడు. దాదాపు 500 సంవత్సరాల తరువాత, దీర్ఘకాల పోరాటం, రాజకీయ ఒత్తిళ్లు, సాక్ష్యాధారాల సేకరణ తర్వాత, 2019 నవంబర్ 9న భారత సుప్రీంకోర్టు తన తీర్పుతో ఆ స్థలాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు అప్పగించింది. ఈ విషయం అతనికి ధైర్యాన్ని ఇచ్చింది. అయోధ్య తీర్పు వివరాలు చదివాడు. ముఖ్యంగా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేసిన మాజీ అధికారి కె.కె.మహ్మద్ జీవితచరిత్ర ‘ నేను భారతీయుడిని’ చదివి, ఆయన అయోధ్యలో తవ్వకాల ద్వారా ఆలయం ఉనికిని నిరూపించిన విధానం, మతపరమైన పక్షపాతం లేకుండా నిజం కోసం చేసిన కృషి శంకరాన్ని బాగా ప్రభావితం చేసింది.‘సత్యానికి చరిత్ర మద్దతు ఇస్తే, ఏ అడ్డంకినైనా దాటవచ్చు’ అన్న విషయం బోధపడింది. ఆ ప్రేరణతో వేణుగోపాలస్వామి ఆలయ భూములను తిరిగి తేవడంపై మరింత నిశ్చయంతో ముందుకు వెళ్లాడు.
* * *
ఒకనాడు వైభవోపేతమైన ఆలయాలలు మరుగున పడిపోతున్నాయ్ధి కూలిపోతున్న గోడలు అశ్రద్ధ, వంచన, దోపిడీ, నమ్మకద్రోహపు మచ్చలను మోస్తున్నాయి. రెండు తెలుగు నేలలపై తరాల క్రితం రాజులు, భక్తులు, సమర్పించిన ఐదు లక్షల ఎకరాలకు పైగా ఆలయ భూములు, లోభుల పంజాలలో చిక్కుకొన్నాయి. దేవాలయాలలో నిత్యపూజలు, ఉత్సవాలు నిరాటంకంగా సాగేందు దానంగా వచ్చిన భూములు ఆక్రమణల పాలై, ఆలయాల ప్రాణాధారానికి అంతరాయం కలిగింది. భూములపై ఆదాయం ఆగిపోవడంతో, నిత్య ధూపదీపనైవేద్యాలు, ఆలయ మరమ్మతులకు అవకాశం లేకుండా పోతోంది. సాంత్వన కలిగించే పవిత్ర స్థలాలు, నిశ్శబ్దంగా కూలిపోతూ దుఃఖ చిహ్నాలుగా మారిపోయాయి.
శంకరం పాత భూముల రికార్డులు, దానపత్రాలు, కైఫియత్తులు, ప్రభుత్వ గెజిట్లు వెతికాడు. ఆన్‌లైన్‌లో పాత మ్యాపులు, సర్వే పత్రాలన్నీ తన వాల్‌స్ట్రీట్ ఉద్యోగపు అనుభవంతో డిజిటల్‌గా సంపాదించాడు. ఈ పనిలో అతనికి తెలుగువారే కాక అమెరికన్లు, దేశ, విదేశాలలో ఉన్న ఆర్కియాలజీ నిపుణులు, ఐటీ నిపుణులు సహాయ పడ్డారు.
శంకరం ఊర్లోని యువకులతో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. తాను సేకరించిన దేవాలయాల వివరాల గురించి వివరించాడు.
‘‘మన ఆలయాలు కేవలం రాళ్లతో కట్టిన గోడలు, గోపురాలు మాత్రమే కావు. అవి మన మహోన్నత మేధోవారసత్వాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి’’.
‘‘వీటిని ఎవరు కట్టించారు?’’ ఒక యువకుడు అడిగాడు.
‘‘మన పూర్వికులు….శాతవాహనులు, ఆంధ్ర ఇక్ష్వాకులు, పల్లవులు, తూర్పు చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయులు వంటి వారు వందల ఏళ్ల్ల క్రితం నిర్మించారు. ఇవి మన ఆధ్యాత్మిక శ్రద్ధ, శిల్పకళ వైభవానికి నిలువెత్తు సాక్ష్యం’’ అని శంకరం జవాబు ఇచ్చాడు.
‘‘అమరావతి సంగతేమిటి ?’’ అని అడిగాడు మరో యువకుడు.
‘‘అమరావతి 2,300 ఏళ్ల నిరంతర చరిత్రకు సజీవ సాక్ష్యం’’ అని జవాబు ఇచ్చాడు శంకరం.
‘‘ఇవి ఒక్క తెలుగు వారి ప్రతిభమాత్రమే కాదు? విశ్వ మానవమేధకి మచ్చుతునకలు. ఇవి మన పూర్వికుల నుంచి అందిన సంపద. ఇలాంటి మహత్తర సంపదను మనం కాపాడుకోకపోతే, ఎవరు కాపాడతారు? ఇప్పుడు మన బాధ్యత మొదలైంది,’’ అని ముగించాడు.
యువత అంతా ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు.
* * *
శంకరం అమెరికా తిరిగి వెళ్లాక ‘తరతరాల తెలుగు సంపద’ పేరిట, యూట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్ పేజీ, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ వి•డియా ప్రారం భించాడు. ప్రతి పోస్టులో ఒక దేవాలయం, పాత భూమి పత్రం, ప్రస్తుత ఆక్రమణ ఫొటో, చరిత్ర వివరాలు అందించాడు. ఆ వీడియోలు, వివరాలు వైరల్ అయ్యాయి. న్యూయార్క్ నుండే వారంవారం జూమ్ వి•టింగులు నిర్వహించాడు. సోషల్ వి•డియా, డిజిటల్ మార్కెటింగ్, ఏఐలను వాడి తగిన ప్రచారం చేశాడు. వేల సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. యువతీయువకులు దేశ , విదేశాలలో ‘‘ఆలయ రక్షణ యాత్ర’’లు నిర్వహించారు. కానీ శంకరానికి తెలుసు… సోషల్ వి•డియా హంగామాతో ఆక్రమిత ఆలయ భూములు తిరిగి రావని. అందుకే ఒక పటిష్టమైన ప్రణాళిక రూపొందించాడు.
వేణుగోపాలస్వామి వంద ఎకరాల భూమిని ఆక్రమించుకున్న వారిపై కోర్టులో కేసు వేశాడు. ఈ తరహా కేసు విచారణకు ఆధ్యాత్మిక భావన గల పతివాద భయంకర ప్రసాద్ గారిని ముఖ్య న్యాయవాదిగా నియమించాడు.
* * *
కేసు విచారణకు వచ్చింది. కోర్టు గది కిక్కిరిసిపోయింది.
‘‘గౌరవనీయ న్యాయమూర్తిగారూ! కొద్దిమంది రాజకీయ, దౌర్జన్యశక్తులు వేమవరంలోని వేణుగోపాలస్వామివారి ఆలయ భూములను ఆక్రమించాయి. ఈ భూములను వెంటనే విడిపించి ఆలయానికి తిరిగి అప్పగించవలసిందిగా కోర్టును వేడుకుంటున్నాను.’’ అన్నారు ప్రతివాద భయంకర ప్రసాద్.
‘‘ఇవిగో ప్రభుత్వ రికార్డులు! భూములు మా క్లయింట్ల పేర్లలోనే ఉన్నాయి. వీరే నిజమైన యజమానులు!’’ ప్రతివాదుల న్యాయవాది బిగ్గరగా అన్నారు.
వాదోపవాదనలు చాలా ఘర్షణాత్మకంగా జరిగాయి.
‘‘ఆవన్నీ నకిలీ రికార్డులు!’’ ప్రతివాద భయంకర ప్రసాద్ గట్టిగా అన్నాడు.
‘‘సాక్ష్యాలు చూపించండి’’అని ఎదిరి పక్ష లాయరు అడిగారు.
నిరూపించే గట్టి సాక్ష్యం అందించలేకపోయారు శంకరం లాయరు.
‘‘సాక్ష్యం చూపండి. కేవలం మాటలతో కేసు గెలవలేరు’’ న్యాయమూర్తి గళం గదంతా మారుమోగింది. అయితే ఆలయభూములు ఆక్రమణకు గురయ్యాయని కానీ న్యాయమూర్తికి తెలుసు. అందుకే కేసును మరో నెలకు వాయిదా వేసి, గట్టి సాక్ష్యాలను ప్రవేశపెట్టాలని సూచించారు.
భూములు ఆలయానికి చెందుతాయని నిరూపించే అదనపు మార్గాలని అన్వేషించాడు శంకరం. ఈ సమయంలో అతని స్నేహితుల్లో ఒకరు, ఆలయ శిల్పకళా నిపుణుడు, శిలాశాసనాల పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని సంప్రదించమని సూచించాడు.
శివనాగిరెడ్డి తెలుగు ప్రాంతాల ఆలయ వారసత్వ పరిరక్షణలో విశేష సేవలు అందించారు. ఆంధప్రదేశ్ పురావస్తు శాఖలో డైరెక్టర్‌గా పనిచేసి, వేలాది ఆలయాల్లోని శిలాశాసనాలను గుర్తించి, ఎన్నో పుస్తకాలు రాసారు. ఆయన పరిశోధనలు తెలుగునాటచారిత్రక ఆలయ నిర్మాణాలు, భూదానాలు తెలియబరిచే శిలాశాసనాలని వెలికితీసారు.
* * *
కేసు తిరిగి విచారణకు వచ్చిన రోజు…బట్టతో కప్పి ఉన్న ఒక బరువైన రాతిబండను కొద్దిమంది సహాయంతో శంకరం కోర్టు లోపలికి తీసుకువచ్చారు.
అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
‘‘గౌరవనీయ న్యాయమూర్తిగారూ! ఇదే సాక్ష్యం’ అంటూ బండరాతిపై గల వస్త్రం తొలగించాడు. అది ఒక పెద్ద శిల శాసనం. అది తెలుగు అక్షరాలతో చెక్కిన శాసనం.
‘‘ఇది సాక్ష్యం ఎలా అవుతుందో చెప్పండి’’ అడిగారు న్యాయమూర్తి.
శివనాగిరెడ్డి ముందుకు వచ్చి ‘‘అయ్యా వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో, 500 ఏళ్ల క్రితం వేసిన ఈ శిలాశాసనాన్ని మేము కనుగొన్నాం’’ అంటూ దానిపై గల అక్షరాలను చదివారు ‘‘ఈ భూములు శాశ్వతంగా వేణుగోపాలస్వామి దేవాలయానికి ధర్మార్థంగా సమర్పించబడినవి’’ అని మొదలుపెట్టి ఆ శాసనంలో స్పష్టంగా పేర్కొన్న భూమి విస్తీర్ణం, ఇతర విశేషాలు వివరించారు.
న్యాయమూర్తి సహా మొత్తం కోర్టు హాల్ ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. శిలాక్షరాలు, కాగితపు రికార్డుల కంటే శక్తిమంతమైనవని అందరికీ అర్థ్ధమైంది.
‘‘ప్రస్తుత రికార్డులు నకిలీవని, భూమి ఆక్రమణపాలైందని ఈ శిలాశాసనం వల్ల నిరూపితమైంది. కనుక ఆలయ భూములను ఆక్రమించుకున్న వారు వెంటనే వాటిని ఖాళీ చేసి వేణుగోపాలస్వామి ఆలయానికి అప్పగించాలి. దీనికి తగిన రికార్డులను ప్రభుత్వం తయారుచేయాలి. డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిగారిని సేవని న్యాయస్థానం అభిన్నది’’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.
శంకరం, ప్రసాద్, డాక్టర్ నాగిరెడ్డి, గ్రామస్తులు అందరూ ఆనందంతో ఒకరినొకరు చూసుకున్నారు. విజయం హర్షధ్వనిగా కాకుండా, ఒక లోతైన ఊపిరి పీల్చినట్టుగా అనిపించింది.
వేణుగోపాలుని దేవాలయంలో ధర్మ ఘంట నాదం మోగింది !
ఆలయ భూమి విజయం వార్త పరవళ్లు తొక్కిన నది ఊరూరా ప్రవహించి, సముద్రాన్ని చేరినట్టు ప్రపంచమంతా పాకింది.