‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
“నిజం. నన్ను గణపతిదేవులవారికిచ్చి వివాహం చేయాలని ఆమె తలపోత. అందుకు అడ్డుగా ఉన్న పెద్ద కవ్వలను వివాహం రోజునే చంపవలసినదిగా ఆమె మనుష్యులను నియ మించింది. అయితే మెరుపుదాడి కూడా ఆ రోజే జరగడంతో కవ్వలను చంపింది కాకతీయ సైనికులా? దేవగిరి సైనికులా? అని అందరూ శంకించారు కానీ, మూడో వ్యక్తి చంపారని ఎవరికీ అనుమానం రాలేదు. అమ్మే ఇంత దారుణానికి సిద్ధపడిందని నాకూ తెలియదు. బందీగా ఉన్న ఆయనను రాజప్రాసాదంలోనికి మార్పించింది అమ్మే. హోయసల బల్లాల మహారాజుతో మంత్రాంగం నెరపి ఆయన ద్వారా వివాహం జరిపించింది ఆమె. మా తండ్రిగారు మా వారికి ఉరిశిక్ష విధిస్తే దానిని ఆపించింది అమ్మే. నిజం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇవన్నీ నిజం. అమ్మ చనిపోయే ముందు నాకు చెప్పింది కూడా. ఆమె చెప్పకుండా చనిపోతే ఆ నెపం నా భర్త పైనే ఉండేది. ఆయన ఈ విషయంలో అమాయకుడు. కవ్వలను ఆయన నిజంగానే ప్రేమించారు. అనుకోకుండా ఆ రాత్రి ఇద్దరూ ఇక్కడికి రావడం,ఇక్కడే ఆమెను చంపడం జరిగిపోయాయి. జరిగింది ఒకటైతే అందరూ భావించింది మరొకటి. ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ నీది అర్థంపర్థం లేని పగ. ఆయనను చంపుతాన నడం చాలా అన్యాయం కవ్వలా! ఇప్పటికైనా అర్థం చేసుకో..”
చేతులు జోడించి ఏడుస్తూ ఆమె చెబుతున్నది వింటే ఎవరికైనా గతం పూర్తిగా అర్థం అవుతుంది.
అర్థÁ్ధమైనా తన మూర్ఖంతో చివ్వున కదిలి కింద కూలబడి ఉన్న గణపతిదేవుని మెడ నరకడానికి చటుక్కున కత్తి ఎత్తింది బాలకవ్వల.
కానీ లిప్తకాలపు ఆలస్యం జరిగిపోయింది.
అప్పుడే రుద్రమ చేసిన ఖడ్గ ప్రహారంతో కవ్వల మెడ ముప్పాతిక భాగం తెగిపోయింది. ఆమె తూలి కిందికి జారిపోయింది. కానీ ఆమె విసిరిన కత్తి ప్రహారం గణపతిదేవునికి తగలకుండా దివిటీ పట్టుకున్న ఆగంతుకుడు వేగంగా కదిలి ఆయనను తన శరీరంతో కప్పేశాడు. అతని వీపు మొత్తంగా చీరుకుపోయి వీపు భాగమంతా రక్తం పొంగింది.
అతడు ఆ దివిటీ వదలి వెనక్కు విరుచుకుపడి పోయాడు.
అప్పటికే కిరాతకులనందరిని మట్టుపెట్టిన రుద్రమ రక్షణ లెంకలు గణపతి దేవుని వద్దకు పరుగున వచ్చారు. ఆగంతుకుడు నొప్పిని అణచుకుంటూ గణపతిదేవునే చూస్తున్నాడు సజలనయనాలతో.
గణపతిదేవుడు చకితుడై అతనినే చూస్తూ అన్నాడు. “నువ్వూ.. నువ్వు??”
“కుంటోడిని మహారాజా..” అన్నాడు.
ఆ గొంతు కూడా గణపతిదేవుని కదిలించింది.. ఎవరు. ఎక్కడో.. చూసినట్లు.. విన్నట్లు??
అప్పుడే అక్కడికి పరుగున వచ్చింది రుద్రమ. అతన్ని చూస్తూ అరిచింది.
“నాగతిస్యా.. ఏమైంది??”
అంతే. చివ్వున తిరిగి చూశాడు గణపతిదేవుడు. ఆయన గుర్తించినట్లు వణికిపోతూ అతన్నే రెప్పవెయ్యకుండా చూస్తుంటే నాగతిస్య చేతులెత్తి ఆయనకు మొక్కాడు. గణŸతిదేవుడు నాగతిస్యను కింది నుండి పైకి వివరంగా చూసి గాఢంగా హత్తుకుని గుక్కలుపట్టి వలవలా ఏడ్వసాగాడు.
ఇద్దరి అన్యోన్యత కట్టలు తెంచుకుని ఆ ప్రాంగణమంతా ప్రసరించసాగింది.
ఆత్మీయంగా పెనవేసుకున్న ఆ ఇద్దరిని సోమల, రుద్రమ, లెంకలు, దివిటీల వారు.. అంతా ఆనందబాష్పాలతో చూడసాగారు.
“కొన్నేళ్లుగా రాత్రుళ్లు ఇక్కడికి వచ్చి నాగతిస్య ఈ రక్షణ వలయమంతా ఏర్పాటు చేశాడు తండ్రీ! మమ్మల్ని అందరిని అతడే లోపలికి ప్రవేశపెట్టాడు..” చెబుతోంది రుద్రమ. అవతలగా తన పిచ్చి పగతో ఎన్నో జీవితాలను నాశనం చేసిన బాలకవ్వల నేత్రాలు మిణుకుమిణుకుమంటూ నాగతిస్యను చూస్తూ మెల్లగా నిర్జీవమయ్యాయి.
* * *
మంగళాశాసనం
ఆంధ్రనాథో మహావిష్ణు ర్నిశుంభ ధనుజాపః
పురా స్వాయంభువ మనోహ కాలే కలియుగే హరిహి
కాకుళే రాజవర్యస్య సుచంద్రస్య తమాభవః
అభవ త్సర్వ దేశైశ్చ వేష్టితో లోకపూజితః
“బ్రహ్మాండపురాణంలోని ఈ శ్లోకం ఏమి చెబుతున్నదంటే… పూర్వయుగంలో సుచంద్రుడు అనే మహారాజు నిశశీభుడు అనే రాక్షసుని సంహరించి కృష్ణాతీరంలో శ్రీకాకుళం రాజధానిగా ఆంధ్రŠ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన వైష్ణవాన్ని అభిమానించి ఆంధ్రమహావిష్ణువు బిరుదు ధరించి ఉండవచ్చు. ఆ ఆంధ్ర సామ్రాజ్యమే పూర్తిగా స్పష్టమైన రూపం పొందిన తెలుగు భాషతో పునీతమై ఇప్పుడు.. తిరిగి మహాపాలకుడు శ్రీశ్రీశ్రీ కాకతీయ గణపతిదేవుని ఆధŠ్వర్యంలో ఆంధ్రŠసామ్రాజ్యంగా ఏర్పడింది.మనమంతా ఆంధ్రులం. మన భాష స్పష్టమైన, స్వచ్ఛమైన తెలుగుభాష. ఇప్పుడిది తెలుగుజాతి రాజ్యం.. ఆంధ్ర సామ్రాజ్యం..”
మహా పండితుడు తిక్కనసోమయాజి ఒక్కొక్క అక్షరం ఒత్తి పలుకుతూ స్పందనతో పులకిస్తున్న గొంతుకతో చెబుతున్నప్పుడు ఆ సభలోని యావన్మంది ఊపిరి బిగబట్టి విన్నారు. ఆయన ఆపగానే ఆ నిండు పెరోలగం హర్షధ్వానాలతో మార్మోగిపోయింది.
తృప్తి నిండిన మోముతో కుడి పక్కనున్న పట్టమహిషి సోమలదేవి చేయితో చేయి కలిపి, ఎడమ చేతితో నారమాంబ చేయితో కలిపి ముగ్గురూ చేతులెత్తి విజయగర్వంతో పిడికిలి బిగించి చూపారు.
అనంతరం ఆయన మాట్లాడారు.
“మహాకవులు, మహాపండితులు, తెలుగురాజ్య విధివిధాన దురంధరులు నా గురుదేవులు తెలుగు జాతికొక సంపూర్ణ రాజ్యం కోసం అహరహమూ తపించి నన్ను క్షణక్షణమూ అప్రమత్తం గావిస్తూ ఇన్నేళ్లూ నాకు దిశా నిర్దేశం చేసిన మహానుభావులు తిక్కనార్యులు చెప్పింది అక్షరాలా నిజం. ఆయన మనస్సులో రూపుదిద్దుకున్న తెలుగు రాజ్యం. తెలుగు జాతికొక రాజ్యం అనేది ఇవ్వాళ సంపూర్ణమైనది. తెలుగు రాజ్యాన్ని సుసాధ్యం చేసిన మా కాకతీయ వంశం పునీతమైనది. ఈ మహాయజ్ఞానికి ప్రధాన కేంద్రమైన మన రాజధాని నగరం ఓరుగల్లు ఇకపై ఆంధ్రŠనగరిగా సగర్వంగా నిలుస్తుంది.”
సభామందిరమంతా “ఆంధ్రనగరి”.. “ఆంధ్ర రాజ్యం”.. తెలుగు రాజ్యం” ..అనే నినాదాలతో మారుమోగింది.
ఆంధ్రనగరితో పాటు సామ్రాజ్యమంతా సంబరాల్లో మునిగితేలుతోంది. అది సామాన్యమైన విజయం కాదు. నాలుగు తరాలుగా తన కాకతీయవంశ పెద్దలు తీవ్రంగా కలలు కని సాధించలేకపోయిన సుదూర లక్ష్యాన్ని గణపతి దేవుడు సాధించిన అపూర్వ.. అద్భుత చారిత్రాత్మక సామ్రాజ్య రూపం.
మొత్తంగా తెలుగువారి సామ్రాజ్యస్థాపన. తెలుగు మాట్లాడే భాషీయులైన ఆంధ్రులు అనే జాతి వేల సంవత్సరాల తర్వాత తిరిగి ప్రపంచానికి గుర్తు చేస్తు న్నారు. తాము ఆంధ్రులమని, తమ భాష తెలుంగు లేదా తెలుగు లేదా తెనుగు.. ఏదైనా అది మాతృ భాషగా కలిగిన తాము తెలుగువారమని, విశ్వామిత్ర మహర్షి పుత్రుల వారసులని,ఇకపై తాము ఆంధ్రులుగా, తెలుగువారిగా.. చెలామణి అవుతా మని, తమ సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యమని.. తమ ప్రధాన రాజధాని ఓరుగల్లు ఆంధ్రనగరి.. అని గొంతెత్తి అరచి చెబుతున్నారు.
అప్పుడే ఓ వేదికపై వేదపండితుల బృందం వేద పఠనం ప్రారంభించింది. రుద్రమదేవి, మురారి దేవుడు అతిథులకు ప్రత్యేకంగా అల్పాహార పదార్ధాలను అందిస్తూ పెద్దల ఆశీస్సులను అందుకుంటున్నారు.
ప్రక్క పల్యంకాలలో కూర్చుని ఆత్మీయంగా కబుర్లు చెప్పుకుంటున్న తిక్కనార్యుడు, జాయ సేనాపతి, మరికొందరు కవి పండితులు, ఆస్థాన విషయ నిపుణులు, మధ్య మధ్య గణపతిదేవుని చూపులతో చూపులు కలుపుతూ ఆ ఉద్విగ్న క్షణాలను అనుభూతిస్తున్నారు. మరో పక్క అంకాలశెట్టి తదితర వాణిజ్యశ్రేణి ముఖ్యులు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు.
అందరి మధ్య గణపతిదేవుడు నిండు హృదయంతో కల నెరవేర్చుకున్న తృప్తితో, ప్రశాంత వదనంతో వేదపఠనం, ఆవలగా పండితుల ఆశుకవిత్వ పఠనాలను వింటూ, అటూఇటూ ఆనందంగా తిరుగాడుతున్న పరిచారికలు, భటులు, ఉద్యోగుల ముఖాలలో తేజరిల్లుతున్న తెలుగు భావనను చూస్తూ.. విభిన్న వాద్యాల ఉద్విగ్నతల సంగీతహోరు అనుభూతిస్తూ మౌనంగా ప్రశాంతంగా కదలుతున్నాడు.
హఠాత్తుగా ఆయనకు ఎవరో గుర్తుకువచ్చారు.
ఆ సదరు మనిషి ఇక్కడకు రాలేదు. ఎక్కడున్నాడో…!అసలు ఉన్నాడో.. లేడో కూడా తెలియదు. ఊహించలేడు. కాని అతని ఆగమనం కోసం ఆశగా ద్వారం వైపు చూస్తున్నాడు.
ఊహు!!…అతని జాడ లేదు. రాడు.. రాడు గాక రాడు.. వస్తాడన్నది ఆశ కావచ్చు.. ఊహ కావచ్చు!!
తెలుగుప్రపంచం పట్టపగ్గాలులేని ఆనంద సంద్రాల్లో తెలియాడుతుంటే తెలుగుసామ్రాజ్య సాధకుడు,మహారాజ్యాంగవేత్త, మహాయోధుడు గ·ణపతి దేవమహారాజు కించిత్ ఆశతో బోలెడు నిరాశతో ద్వారం వైపు చూస్తూ అటూ ఇటూ తిరుగు తున్నాడు.
ఆయన ఎదురుచూస్తున్న ఆ ఆత్మీయుడు రాలేదు కాని ఊహాతీతంగా మరో పెద్దమనిషి ప్రత్యక్ష మయ్యాడు.
ఆయన ఓ ముదుసలి. మిగల ముగ్గిన పండు శరీరుడు. కాని ఏదో శక్తి, ఏదో ఊహాతీతమైన కోర్కె అతన్ని బతికించాయని ఆయనను చూసిన వారు ఎవరైనా భావిస్తారు.
ఆ ముదుసలిని ఓ పల్లకిలో ఉంచి తీసుకు వచ్చాడు ఓ యువకుడు. బహుశా మనవడు కావచ్చు.
పల్లకిని బోయీలు క్రిందికి దించగా నృత్యసంగీత వేడుకల్లో ఉర్రూతలూగుతున్న కాకతీయ సామ్రాజ్య వీరులు ఒక్కసారిగా నిశ్శబ్దులయ్యారు.
ఆ యువకుడు గణపతిదేవునికి వినమ్రంగా నమస్కరించి, మౌనంగా ఆ పల్లకి వైపు తిరిగి అందుండి ఆ ముదుసలిని ఎత్తుకుని బయటకు తెచ్చాడు.
గణపతిదేవుడు కాస్త కదిలి ఆశ్చర్యంగా కళ్లు చికిలించి అతనిని గుర్తించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
ఆ ముదుసలి కాస్త కదిలి శరీరాన్ని విప్పార్చుకుని తలెత్తి చూశాడు. గణపతిదేవుని గుర్తించాడు.
మనుమడు ఆయనను అలాగే ఎత్తుకుని అక్కడే ఉన్న ఓ పెద్ద ఎత్తైన బల్లపై నిలబెట్టి పట్టుకున్నాడు.
అప్పుడా ముదుసలి గొంతెత్తి అరిచాడు..
“చక్రవర్తీ!ఓ తెలుగు సామ్రాజ్య స్థాపకుడా! గణపతిదేవ చక్రవర్తీ! గణపతిదేవ చక్రవర్తీ! చక్రవర్తి చక్రవర్తీ..!”
వృద్ధాప్యం వల్ల ఆయన చిన్నగా అంటుం టే దానిని అందరికి వినిపించేలా ఆయన మనుమడు ఆయన మాటలను తిరిగి మరింత బిగ్గరగా అరుస్తున్నాడు.
“చక్రవర్తీ.. చక్రవర్తీ!!” “నువ్వు చక్రవర్తివి కాదు అని నిన్ను అవమానించాను. నువ్వు తప్పక తెలుగుసామ్రాజ్యాన్ని సాధిస్తావని, నిన్ను ‘చక్రవర్తీ’ అని పిలిచి మరణించాలని, నా తెలుగుసామ్రాజ్యంలో మరణించాలని బతికి ఉన్నానయ్యా చక్రవర్తీ..!”
అప్పుడు గుర్తించాడు గణపతిదేవుడు ఆ ముదుసలిని. వేగంగా వెళ్లి ఆయనను ఒడిలోకి హత్తుకున్నాడు.
ఆ ముదుసలి..“చక్రవర్తీ.. చక్రవర్తీ..” అని మంత్రంలా ఉచ్చరిస్తున్నాడు.
ఆయన ప్రాణాలతో అంటున్నాడో! ఆయన మరణించినా ఆయన పాంచభౌతిక శరీరం అలా “చక్రవర్తి” అని పలుకుతుందో.. పలవరిస్తుందో ఇదమిత్థంగా తెలియడం లేదు గణపతిదేవునికి.
విప్పార్చుకుని చూస్తోన్న ఆ ముదుసలి చూపులు.. గణపతిదేవుని చూపులతో కలుసుకున్నాక అవి అలా ఉండిపోయాయి.
“మిత్రమా!నాగతి మండలేశ్వరా! నన్ను చక్రవర్తి అని సంబోధించడానికే బతి ఉన్నారా మహాశయా?!” అన్నాడు గణపతిదేవ చక్రవర్తి,
ఆ మాటలు చెవిన పడ్డాయేమో ఆ ముదుసలి నాగతిమహారాజు ముఖంలో ఓ చిద్విలాసం, ఓ సంతృప్త భావన అలా నిలిచిపోయింది శాశ్వతంగా.. కాకతీయ ఆంధ్రసామ్రాజ్యంలా.
(సమాప్తం)