భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


– టిఎస్‌ఏ ‌కృష్ణమూర్తి‌

పూజ ముగిసింది. పెద్దల పేరిట పెట్టిన బట్టల దొంతరల వి•ద నిప్పులు పడకుండా పిల్లలు, పెద్దలు అందరూ జల్లికంటిలో ఉన్న నిప్పుల వి•ద సాంబ్రాణి వేస్తూ పటాల చుట్టూ వరుసగా తిప్పి ఒకపక్కగా ఉంచారు. సాంబ్రాణి పొగ పటాల వి•దికి వెళ్తుంటే సంతృప్తిగా నిట్టూర్చాడు రాజారావు. అందరూ తీర్థం తీసుకున్న తర్వాత వంటగదికేసి కదిలారు.

పూజలో ఉంచిన  మూడు విస్తరాకుల నైవేద్యాల లోంచి ఒక విస్తరిని జాగ్రత్తగా తీసుకుని మిద్దె మెటికలు ఎక్కాడు రాజారావు. అతని భార్య రమాదేవి ఒక చిన్న చెంబుతోను, మరి ఒక పెద్ద గ్లాసుతోను మంచినీళ్లు పట్టుకుని అతన్ని అనుసరిం చింది.

మిద్దె మీదకు చేరుకున్నాక మంచినీళ్ల గ్లాసు పిట్టగోడ వి•ద ఉంచి చెంబులోని నీళ్లను  పిట్టగోడ మధ్యలోని పెద్ద జాయింట్‌ ‌వి•ద చల్లి శుద్ధి చేసి మూడుసార్లు శుద్ధంగా నీళ్లు చల్లింది. ఇక అప్పుడు రాజారావు తన చేతుల్లోని విస్తరిని  భక్తితో శ్రద్ధగా ఆ శుద్ధి అయిన  ప్రదేశంలో  ఉంచాడు. రమాదేవి విస్తరి పక్కగా నీళ్ల గ్లాసును ఉంచింది.

ఇద్దరూ కాసేపు ఆకాశంకేసి చూస్తూ నిలబడ్డారు.

ఆకాశంలో ఎక్కడా కూడా కాకి జాడలేదు.

‘‘ఇంకా ఎక్కడ కాకులండీ? ఊరునిండా పెరిగిపోయిన సెల్‌ ‌టవర్ల దెబ్బకు మొదట గువ్వలు కనపడకుండాపోయాయి. ఆ తరువాత క్రమంగా కాకులు మాయమైపోయాయి’’ అంది రమాదేవి.

‘‘నిజమే కానీ మొన్న ఉదయం పది గంటలప్పుడు ఇంటి ముందర పైన ఎక్కడో అరచి వెళ్లింది కదా?’’

‘‘అదే ఆశ్చర్యం..పండగలకు రెండు మూడు రోజులకు ముందు ఇంటి ముందో ఇంటిపైనో ఏదో ఒక కాకి అరచి వెళ్తుంది.. కానీ కళ్లకు  కనపడదు. మన పూర్వికులు ఎవరైనా అలా వచ్చి హెచ్చరించి వెళ్తారేమో?’’ అంది ఆమె.

‘‘మనకెలా తెలుస్తుంది రమా? మన పిల్లలేమో నవ్వేస్తారు.. వాళ్ల పిల్లలేమో చాదస్తం, మూఢవిశ్వా సాలు అంటూ పరిహసిస్తారు’’ అన్నాడు రాజారావు కాస్త బాధగా.

‘‘మనవరకు ఉన్న తరం వేరండీ.. ఇప్పుడు మన పిల్లలలోనే అనేక ఆధునిక భావాలు వచ్చేసాయి. వాటిలో కొన్నైతే మంచివీ ఉన్నాయి.. పిల్లల్ని పక్కదోవ పట్టించగలిగినవి కూడా చాలా ఉన్నాయి. కానీ మనం దేన్నీ చక్కదిద్దలేని పరిస్థితులయితే వచ్చేశాయి’’ అంది రమాదేవి.. ఆమె స్వరంలో కూడా ఇంచుక బాధ.

తరువాత దాదాపు ఐదు నిమిషాలపాటు వారి మధ్య మౌనం రాజ్యమేలింది.

‘‘ఇక రావండీ.. అసలు ఊర్లో కాకులే లేవు కదా?

నేను వెళ్తాను. నా కాళ్లు బొబ్బలెక్కేలా ఉన్నాయి’’ అంటూ చెంబు, గ్లాసు పట్టుకుని కిందకు నడిచింది రమాదేవి.

కాళ్లు మంటలెక్కుతున్నా ఆశగా ఆకాశంకేసి చూస్తూ చాలాసేపు నిలబడ్డాడు రాజారావు. తరువాత గాఢంగా నిట్టూర్చి అసంతృప్తిగా మిద్దెమెట్లు దిగాడు.

అతడు ఒక్క పొద్దు తీర్చుకుంటున్నప్పుడు, తరువాత హాల్లో కూర్చున్నప్పుడు, సాయంకాలం కాఫీ తాగుతున్నప్పుడు, లైబ్రరీ కేసి బయలుదేరుతున్నప్పుడు కూడా కాకి అరుపు ఏమైనా వినవస్తుందేమోనని చెవులు రిక్కించుకుని ఎదురు చూస్తూనే ఉన్నాడు.

అయితే ఆ శబ్దం మాత్రం వినిపించలేదు.

* * *
గ్రంథాలయం కేసి నడుస్తున్న రాజారావుకు తన చిన్నతనం నాటి సంఘటన ఒకటి గుర్తుకు వచ్చింది. ఆ ఘటనను చుట్టుకుంటూ అనేక జ్ఞాపకాలు…

అప్పట్లో పూర్వికు లకు చెందిన ఒక పాత పెద్ద ఇంటిలో పన్నెండుమంది సభ్యులతో కాపురం ఉండేవారు. ఒకరోజు స్కూలుకు సెలవు అయినందున అన్నదమ్ములతో, అక్కచెల్లెళ్లతో కలిసి ఇంటి ముందర ఖాళీ స్థలంలో ఆడుకుంటు న్నాడు రాజారావు. మధ్యలో దాహం వేయడంతో వంట గదికేసి పరుగు తీశాడు. దాహం తీర్చుకుని ఇటు తిరిగేసరికి ముక్కాలి టేకుపీటవి•ద కూర్చున్న తన తల్లి చాటతో బియ్యం చెరుగుతూ బియ్యంలో వస్తున్న వడ్ల గింజలను నేల వి•ద వేస్తుంటే రెండు గువ్వలు ఎలాంటి భయం లేకుండా వచ్చి ముక్కులతోటే గింజలు వలచుకుని బియ్యం తింటూ పొట్టు చక్కగా వదిలేస్తున్నాయి. ఆ దృశ్యం అతని కళ్లకు  అద్భుతంగా కనిపించడంతో కాసేపు ఆ గువ్వల చర్యలకు భంగం కలిగించకుండా అలా చూస్తుండిపోయాడు. అదే సమయంలో వెనక గుమ్మం గుండా అవతల నీళ్ల తొట్టి గోడవి•ద నిశ్శబ్దంగా కూర్చుని ఉన్న పెద్ద కాకి కనిపించింది.

‘‘అమ్మా కాకి.. తరిమేస్తాను’’ అంటూ అటు వెళ్లబోయాడు.

‘‘ఒరేయ్‌ ఒరేయ్‌ ‌వద్దురా.. ఏమీ అనకు’’ అంటూ వారించింది తల్లి.

‘‘ఎందుకమ్మా?’’ ప్రశ్నించాడు ఆశ్చర్యంగా.

‘‘ఎందుకంటే మీ జేజో, మీ తాతో, ముత్తాతో ఆ రూపంలో వచ్చి కూర్చుని ఉండవచ్చు’’

‘‘ఎందుకమ్మా?’’

‘‘అవతల మర్నాడు ఉగాది పండగ కదరా? మనం ఎక్కడ మర్చిపోతామో అని జ్ఞాపకం చేయడానికి వచ్చి ఉంటారు’’

తన జేజి మరణించడం లీలగా జ్ఞాపకం అతనికి. తాతయ్య మరణించడం మాత్రం బాగా గుర్తుంది. ముత్తాతను మాత్రం చూసి ఉండలేదు. ఎందుకంటే తను పుట్టకమునుపే ఆయన మరణించి ఉన్నాడు.

తాతను, జేజిని జ్ఞాపకం చేసుకుంటూ కాసేపు దిగులుగా కాకిని చూసిన తరువాత ఆడుకోవడానికి వెళ్లిపోయాడు. ఆ తరువాత కొన్ని పండగలకు ముందు పెరటివైపు గోడల వి•ద రెండు కాకులు నిశ్శబ్దంగా కూర్చుని కనిపించేవి. పెద్దల పండగ నాడు మాత్రం పూజ ముగిశాక ఒక ఆకుపళ్లెం తీసుకువెళ్లి మిద్దివి•ద శుద్ధి చేసి పెట్టేవారు పెద్దవాళ్లు. ఒకటేమిటి ఆరేడు కాకులు గబగబా వచ్చేసి పళ్లెంలోని పదార్థాలలో తమకు నచ్చినవి పట్టుకుని వెళ్లిపోతే, ఒకటి రెండు కాకులు మాత్రం మనుషులు ఉన్నారని కూడా లెక్కచేయకుండా పల్లెం పక్కన కూర్చుని సావధానంగా తిని నీళ్లు కూడా తాగి వెళ్లేవి.

రాజారావు పెరిగి పెద్దవాడయ్యాక అతని తండ్రి ఆ ఇంటిని అమ్మి ఆడపిల్లల పెళ్లిళ్లు, మగ•పిల్లల చదువు సంధ్యలు చూడాల్సి వచ్చింది. ఇక ఆపైన అవిభక్త కుటుంబం కాస్తా ఉద్యోగాలు, వ్యాపారాలతో ఎవరి కుటుంబం వారిదవుతూ వచ్చింది. తల్లిదండ్రులు మాత్రం పిల్లల అవసరాల నిమిత్తం ఒక్కొక్కరి వద్ద కొంతకాలం చొప్పున అలా అలా ఉంటూ వారి కాలం ముగించుకు వెళ్లిపోయారు. రాజారావు అన్నదమ్ముల కుటుంబాలలో దసరా, దీపావళి, సంక్రాంతి పండగల వి•ద ఉన్నంత శ్రద్ధ, పెద్దల పండుగ వి•ద అంతగా కనిపించదు. రాజారావు మాత్రం ఇతర పండగలు ఎలా జరిపినా పెద్దల పండగ మాత్రం అతి శ్రద్ధగా, భక్తిశ్రద్ధలతో జరిపిస్తాడు. తన తల్లిదండ్రుల నుండి లభించిన శ్రద్ధాసక్తులు అవి.

పెందలాడే ఇంటి ముందు కాకి అరిస్తే ‘ఈరోజు ఎవరో బంధువులు దిగుతారు’ అనేది అతని తల్లి. చాలాసార్లు అలా నిజంగానే బంధువులు దిగేవారు. చిన్నతనం నుండి అదంతా చాలా ఆసక్తికరంగా ఉండేది రాజారావుకు. ప్రస్తుతం పెద్దల పండుగలో పెద్దలకు బట్టలు పెట్టి సాంబ్రాణి వేసినా, సంక్రాంతికి తర్పణాలు వదిలినా మరణించిన తల్లిదండ్రుల, పూర్వికుల ఆశీస్సులు తప్పక లభిస్తాయి అనే విశ్వాసం అతని నరనరాల్లో జీర్ణించుకు పోయింది.

పెద్దల పండగ నాడు టెంకాయ కొట్టి హారతి ఇచ్చి సాంబ్రాణి వేసిన వెంటనే ఆ విస్తరిని  తీసుకు వెళ్లి శుద్ధిచేసి పెట్టడం ఆలస్యం ఎక్కడెక్కడ నుంచో  కొన్ని కాకులు వచ్చి ఆ ఆహారాన్ని తీసుకువెళ్లేవి.

అయితే గత ఐదారు సంవత్సరాలుగా కాకులు కనిపించకుండా పోయాయి. ఆహారాన్ని ముట్టడానికి కనీసం ఒక్క కాకైనా రావడంలేదు. ఆ విషయం మాత్రం రాజారావును విపరీతంగా బాధిస్తూ తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది.

ఉమ్మడి కుటుంబం కాస్తా విడిపోయి ఎవరి కుటుంబం వారిదైపోయాక ప్రైవేట్‌ ‌కంపెనీ ఉద్యోగంలో వచ్చే జీతంతో కుటుంబ అవసరాలు, పిల్లల బరువు బాధ్యతలు ఎన్ని సమస్యలు సృష్టించినా ఉన్నంతలో పండగలు నిలపకుండా జరిపించేది రమాదేవి. పెద్దల పండగ మాత్రం కచ్చితంగా, ఘనంగా జరుగుతుంది రాజారావు ఇంట. ఎటోచ్చీ ఇటీవల కాలంలో నైవేద్యం స్వీకరించే కాకులు కరవవడం అంతులేని అసంతృప్తి.

* * *
లైబ్రరీ దగ్గర పడటంతో రాజారావు ఆలోచనలు తాత్కాలికంగా ఆగిపోయాయి.

* * *
ప్రతి రెండవ ఆదివారం జ్ఞానోదయ ఉన్నత పాఠశాల సమావేశమందిరంలో వయోవృద్ధుల సమావేశం జరుగుతుంది. క్రమం తప్పకుండా హాజరవడం రాజారావుకు అతని మిత్రులకు అలవాటు.

ఐదు పది నిమిషాలు అటూ ఇటూగా రాజారావు, అతని మిత్రులం దరూ మీటింగ్‌ ‌హాల్‌ ‌చేరుకున్నారు.

ఆ మధ్యనే రాజధానిలో జరిగిన స్టేట్‌ ‌సీనియర్‌ ‌సిటిజన్స్ అసోసియేషన్‌ ‌మీటింగుకు వెళ్లి వచ్చిన అధ్యక్షులు గోపాలకృష్ణగారు అక్కడ జరిగిన కార్య క్రమాలు, సభాముఖంగా తీసుకున్న నిర్ణయాలు మొదలైన వాటిని వివరించారు.

కొందరు సభ్యులు ప్రభుత్వపరంగా తమకు రావాల్సిన కరవు భత్యం మొదలైన బకాయాలను గూర్చి ప్రశ్నించడం కార్యదర్శి ఇచ్చిన సమాధానాలతో అసంతృప్తి చెంది నిరాశపడడం జరిగాక, ఒక సభ్యుడు తన కుటుంబంలో తనపట్ల జరుగుతున్న అవమానాలను, హింసను  కన్నీటితో వివరించాడు.

ఆ విషయంలో సభ్యులందరూ తీవ్రంగా స్పందించారు. అధ్యక్షులు, కార్యదర్శి కొందరు సభ్యులతో కలసి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని, ఫలితం లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.

సమావేశం ముగిశాక మిత్రులందరికీ వెలుపల చెట్ల కింద కుర్చీలు వేయించాడు దినేష్‌. అం‌దరూ కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడడం మొదలు పెట్టారు.

రాజారావు మాత్రం పరధ్యానంగా ఉండడం చూసి ‘‘రాజా ఏమిట్రా ఏదో కొంపలు మునిగినట్లు దీర్ఘాలోచనలో ఉన్నావు’’ అని ప్రశ్నించాడు కరుణాకర్‌.

‘‘ఏం ‌లేదు’’ అన్నాడు క్లుప్తంగా రాజారావు.

‘‘వాని ఆలోచన ఎప్పుడూ ఒకటే.. పండగలకు కాకులు కనపడటం లేదని!’’ నవ్వుతూ అన్నాడు సుబ్బయ్య.

‘‘నిజమేరా ఈ రేడియేషన్‌ ‌ప్రభావం వల్ల గువ్వలు, కాకులు మొదలైన పక్షులు అంతరిస్తు న్నాయి. దాదాపు ప్రతి ఇంట్లో సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌ ‌లు, చార్జర్లు ఉంటున్నాయి. ఇక ఇంటి నిండా, ఇంటి చుట్టూ రేడియేషన్‌. ‌వీటికి కనెక్టవిటీగా పవర్ఫుల్‌ ‌సెల్‌ ‌టవర్లు సరేసరి. కొన్నేళ్ల క్రితం వరకు మా ఇంట్లో ఎక్కడ చూసినా గువ్వలు గూళ్లు కట్టేవి. కరెంట్‌ ‌వి•టర్ల వి•ద, ఫ్యాను పైకప్పుల్లో, పుస్తకాల షెల్ఫుల మీద గూళ్లు పెట్టేసేవి. పొదిగిన గుడ్ల లోంచి పిల్లలు రాకపోతే ఆ గుడ్లను కిందికి తోసేసేవి. అవి పగిలి ఒకటే నీచువాసన. అంతేకాక ఆడ గువ్వల కోసం మగ గువ్వలు ఇల్లంతా తిరుగుతూ యుద్ధాలు చేసేవి. మాకెవరికీ భయపడేవి కూడా కాదా సమయంలో. గువ్వలను తరిమేస్తానంటే నా భార్య పిల్లలు ఒప్పుకునే వారు కాదు. క్రమంగా ఇంట్లోకి రావడం మానేశాయి. ఇప్పుడైతే కనపడటమే మానేశాయి. ఒకటి రెండు వడ్రంగి పిట్టలు మనీ ప్లాంట్‌లో గూడు కట్టాయి. కానీ వాటిని పిల్లి భయపెట్టి తరిమేసింది. తర్వాత అవి కనపడ లేదు. కొన్నాళ్లు కాకులు అరుదుగా అక్కడక్కడ కనబడేవి. ఇప్పుడు అవీ కనపడటం లేదు. ఊరి వెలుపల రహదారుల పక్కన ఇదివరకు వరుసగా చెట్లు ఉండేవి. నాగరికతను సూచిస్తూ రోడ్లు విస్తరిస్తు న్నాయి కానీ రోడ్ల ప్రక్కన చెట్టు చేమా కనిపించడం లేదు. ఇక ఎలా మనుగడ సాగిస్తాయి పక్షులు?’’ అన్నాడు శ్రీధర్‌.

‘‘‌పక్షులు కనపడకుండా పోవడానికి రేడియేషన్‌ ‌కాక మరో కారణం కూడా ఉంది’’ అన్నాడు తిరుపతిరావు.

‘‘ఏమిటది?’’

‘‘గతంలో అయితే దీపావళికి మాత్రమే టపాకాయలు కాల్చేవారు మన ప్రాంతంలో. ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు, అంత్యక్రియలకు, రాజకీయ నాయకుల ఆగమనాలకు, చివరకు కౌన్సిలర్‌ ‌వార్డులోకి వచ్చినా కూడా విపరీతంగా పటా కాయలు కాలుస్తున్నారు. చెవులు చిల్లులు పడేలా విపరీతమైన శబ్దాలతో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట పటాకాయలు పేలుతూనే ఉంటాయి. ఆ పేలుళ్ల మోతలను, శబ్ద కాలుష్యాలను, మనుషులే భరించలేకపోతున్నారు.. ఇక పక్షులేమి భరిస్తాయి? అడవులనైనా వెతుక్కుంటుంటాయి లేదా అంతరించిపోతుంటాయి’’ అన్నాడు తిరుపతిరావు.

కఠోరమైన వాస్తవాలను వినడం వల్ల కాసేపు మౌనం రాజ్యమేలింది ఆలోచనాపరులైన మిత్రుల మధ్య.

‘‘ఒరేయ్‌ ‌రాజా! నీవు కాకిని చూడాలంటే మా ఊరికి తీసుకువెళతాను. నేనూ చాలా ఏండ్లైంది మా ఊరికి వెళ్లి. బంధువులంతా గోల పెడుతున్నారు. మా గ్రామం అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండడం వల్ల అక్కడ పక్షులకు, నీ కాకులకు కూడా కరవు లేదు. పైగా అక్కడ దీపావళికి కూడా పెద్దగా మతాబులు, పటాకాయలు కాల్చరు. ఎందుకంటే అక్కడ పేద కుటుంబాలే ఎక్కువ’’ అన్నాడు కృష్ణమూర్తి.

‘‘పట్టుకు పోరా బాబూ.. వీడికి పుణ్యక్షేత్రంలో దేవుని చూడడం కన్నా కాకులను చూడాలనే కోరిక ఎక్కువైపోతున్నట్లుంది’’ అన్నాడు సుబ్బయ్య.

‘‘ఏరా.. ఏమంటావు?’’ అని ప్రశ్నించాడు కృష్ణమూర్తి.

‘‘తప్పకుండా ఓసారి వెళ్లొద్దాం లేరా’’ అన్నాడు రాజారావు.

* * *
పది రోజులు గడిచాక ఓ రోజు ఉదయం తన మోటార్‌ ‌సైకిల్‌ ‌వి•ద రాజారావు ఇంటికి వచ్చేసాడు కృష్ణమూర్తి. అప్పటికే స్నానం సంధ్య ముగించుకుని సిద్ధంగా ఉన్న రాజారావును తీసుకుని రైల్వే స్టేషన్‌ ‌కేసి బయలుదేరాడు బయలు దేరాడు.

ఆరు గంటల ప్రయాణం తర్వాత ఘంటాపురం రైల్వే స్టేషన్లో రైలు దిగారు. చాలా చిన్న స్టేషన్‌ అయినా చాలా ఆధునికంగా కనిపిస్తోంది.. అభివృద్ధికి సంకేతంలా!

స్టేషన్‌ ‌వెలుపలికి రాగానే నాలుగైదు ప్యాసింజర్‌ ఆటోలు కనిపించాయి.

‘అబ్బో మా ప్రాంతానికి ఆటోలు కూడా వచ్చేశాయి’’అంటూ ఆశ్చర్యపోయాడు కృష్ణమూర్తి.

కొండ కిందపల్లెకు పోవాలనగానే ‘‘వరుసలో మూడో ఆటో ఎక్కండి సార్‌ ఆ ‌రూట్లో ఈరోజు అదొక్కటే పోతుంది’’ అంటూ చెప్పాడు ఒక ఆటో డ్రైవర్‌.

ఆ ఆటోలో అప్పటికే మరో ముగ్గురు ఉన్నారు! కృష్ణమూర్తి, రాజారావులు కూడా ఎక్కి సర్దుకుని కూర్చున్నారు. ఆటోలో కూర్చున్న వారి ముందర ఉన్న చెక్క వి•ద నలుగురిని, ఆటో వెనుక లగేజ్‌ ‌పెట్టే డిక్కీ మీద మరో నలుగురిని కూర్చోబెట్టుకున్నాక పది నిమిషాలకు ఆటో బయలుదేరింది.

‘‘అబ్బో కొత్త తారు రోడ్డు’’ అన్నాడు కృష్ణమూర్తి సంబరంగా.

‘‘కొత్త రోడ్డు కాదయ్యా పాతదే.. చానా వానలు పడి పాడయింది. కీలు, కంకరతో అతుకులేస్తున్నారు’’ అన్నాడు పక్కన కూర్చున్నాయన.

ఊరు దగ్గర పడగానే మరింత ఆశ్చర్యంతో తలమునకలయిపోతూ అన్నాడు కృష్ణమూర్తి..

‘‘ఇది మా ఊరేనా? ‘‘

‘‘ఎందుకు సావి• అట్టా అంటా ఉండావు?’’ ఎదురుగా చెక్క వి•ద కూర్చున్న ముసలాయన నవ్వుతూ అడిగాడు.

‘‘ఆరేడేండ్లకు ముందు నేను వచ్చినప్పుడు కూడా అన్నీ గుడిసెలు, అడ్డ పిండ్లు, సున్నారం రాతిమిద్దెలే. పెద్దిండ్లు మూడో నాలుగో ఉన్నాయి అంతే. ఇదేమిటి ఇన్ని మిద్దెలు, మేడలు ఇంత కలర్‌ఫుల్‌గా టౌన్‌ ‌లెక్కన కనిపిస్తున్నాయి! ఇంత డబ్బు ఎలా వస్తోంది?’’

‘‘కాలం మారింది కదా సావి•.. అదున్లో పదున్లవువుతున్నాయి, ఒక పంటకు ధర రాకపోయినా ఇంకో పంటకు వస్తోంది, ఆడోళ్లందరూ నాటావుల నిడిసిపెట్టేసి సింధీ ఆవులను పట్టుకుని ఫ్యాక్టరీ పాలవ్యాన్లకు పాలు పోస్తున్నారు, మగవాళ్లంతా తెల్లార్తే అన్నం కట్టుకుని రైలెక్కిపోయి రాజపురంలో బేల్దారుపనో, చెక్క పనో, కూలిపనో సేసి నాలుగు దుడ్లు సంపాదించుకుని రేయి అన్నానికి ఇంటికొచ్చే త్తున్నారు. ఇంగా ఇంట్లో ఒకరో ఇద్దరో ముసలోళ్లుంటే ఆళ్లూ ఎవరికీ బరువు గాకుండా వారికి వారి వృద్ధాప్య పెన్షన్‌ ‌వస్తుంది. ఇంతో అంతో నేలుంటే అడపాదడపా పంట డబ్బులు పడతాయి.. ఇంగా ఏం గావాలి సావి•? గుడిసిండ్లు మేడల య్యాయి, బుద్ధున్న బుడ్డోల్లు బాగా సదువుకునేసి కొలువులు సేసేస్తున్నారు, బుద్ధి లేనోళ్లు దళారి పనులు చేసుకుని బతికేస్తున్నారు’’ అంటూ వివరంగా చెప్పాడు ముసలాయన.

ఇంత సంభాషణ జరుగుతున్నా ఆటో నుంచి వెలుపలికి చూస్తూనే ఉన్నాడు రాజారావు కాకులేవైనా కనిపిస్తాయేమోనని. కానీ అతనికి నిరాశ ఎదురయింది. ఊర్లోకి ప్రవేశించాక పెద్ద పెద్ద మిద్దెలు మేడలు తప్ప కాకులు కాదు కదా కనీసం పచ్చని చెట్లయినా కనిపించలేదు.

* * *
మొదట కృష్ణమూర్తి మేనమామ ఇంటికి వెళ్లారు వారు. కృష్ణమూర్తి మేనమామ పండు ముదుసలి. మేనత్తకు కూడా బాగా వయసయిపోయింది. ఆశ్చర్యమేమంటే ఇద్దరూ బాగా ఆరోగ్యంగా ఉన్నారు.

పెద్దంతయింటినిండా జనాలు. ముసలాయన ఉమ్మడి కుటుంబాన్ని చెక్కు చెదరకుండా కాపాడు కొస్తున్నట్లుంది. కృష్ణమూర్తి వచ్చినందుకు సంబరపడిపోయి రకరకాల వంటకాలు చేయడం మొదలుపెట్టారు.

‘‘మీ వాళ్లు ప్రేమతో నిన్ను, వంటకాలతో నన్ను చంపేసేలా ఉన్నారే?’’ అన్నాడు రాజారావు. అతడు అన్నంత పని అయింది. భోజనాలకు కూర్చున్న ప్పుడు.. ఒక్కొక్కరు వచ్చి కొసరి కొసరి వడ్డిస్తుంటే.

భోజనాలు ముగిశాక హాల్లోకి వచ్చి కూర్చున్నారో లేదో…. బాంబులు పేలుతున్నట్టుగా పెద్ద పెద్ద శబ్దాలు వినిపించ సాగాయి.

‘‘ఏమిట్రా ఈ శబ్దాలు?’’ అని కంగారుగా ప్రశ్నించాడు కృష్ణమూర్తి.

‘‘ఏం లేదు మామా! రాజధానికి వెళ్లిన సర్పంచ్‌ ‌తిరిగి వచ్చినట్లు ఉన్నాడు. స్వాగతం చెబుతూ టపాకాయలు పేలుస్తున్నట్టున్నారు. ఇంతకూ, అంతకూ ఇదైతే ఎప్పుడూ ఉండే గోలేలే’’ అన్నాడు మేనల్లుడు గణేష్‌.

‘‘అత్తా!పెద్దమ్మ ఇంటికి పోయెస్తాము. రాత్రికి అక్కడే పడుకుని ఉదయాన్నే వస్తాము’’ అని మేనత్తకు చెప్పేసి రాజారావుని తీసుకుని బయలుదేరాడు కృష్ణమూర్తి.

* * *
‘‘అరేబిడ్డా ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి? తెల్లార్తో నీళ్లపోయ్యి మోరుస్తుంటే ఎవరో చుట్టాలు వస్తారులే అనుకున్నాను. నాబిడ్డే వచ్చేస్తాడని అనుకోలేదు’’ అంటూ కృష్ణమూర్తిని వాటేసుకుని కన్నీళ్ల పర్యంత్రం అయిపోయింది అతని పెద్దమ్మ లక్ష్మీదేవి.

రాజారావుకు తన తల్లి గుర్తుకు వచ్చింది. అప్పుడప్పుడు ఆమె అంటుం టుండిన..

‘‘ఇంట్లో పొయ్యి వార్చినా, ఇంటిముంగిట కాకి అరచినా బంధుజనాలు దిగుతారురా’’ అన్న మాటలు గుర్తుకు వచ్చి అప్రయత్నంగా కళ్లు  చెమ్మగిల్లాయి.

పెద్ద• ఇంట్లో కృష్ణమూర్తి పెద్దమ్మ, కొడుకు కోడలు ముగ్గురే! పెద్దమ్మ ఇతర బిడ్డలు, మనవళ్లు, మనవరాళ్లు చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, తిరుపతి, విశాఖ ఊర్లలో ఉద్యోగ వ్యాపారాల్లో కొనసాగుతున్నారు. ఈ ముగ్గురు అయితే ఉండూరును, పల్లె జీవితాన్ని వదులుకోలేక స్వగ్రామంలోనే ఉండిపోతున్నారు.

గ్రామమంతా బంధువులే కృష్ణమూర్తికి. సాయంకాలం వరకు ఆ ఇల్లు ఈ ఇల్లు తిప్పుతూనే ఉన్నాడు రాజారావును.

రాత్రి భోజనాలు చేస్తున్నప్పుడు పెద్దమ్మను అడిగాడు రాజారావు..

‘‘అమ్మా! ఇక్కడ కూడా అందరూ క్యాన్‌ ‌వాటరే తాగుతున్నట్లు ఉన్నారే?’’

‘‘అలవాటె•పోయిందయ్యా ఏం చేయాలి? అందరితో పాటే మనమూ కదా?’’ అంది పెద్దమ్మ.

పెద్దమ్మ కుమారుడు గోపాలయ్య నవ్వాడు.

‘‘అలవాటు కాలేదయ్య.. అలవాటు చేశారు.. ఊరి చెరువులో, కోనేట్లో, బావుల్లో, బోర్లలో చాలా మంచి నీళ్లు ఉన్నాయి.చెరువులో పశువులు కడుగుతారు, కోనేట్లో పిల్లోల్లు ఈతలు కొడతారు. ఆ నీళ్లు వదిలేస్తే బావుల్లో, బోర్లలో మంచి నీరు ఉంది. అయితే ఇప్పుడు ఎవరూ ఆ నీళ్లు తాగరు. రెండు రోజులు నీళ్ల కాను ఆటోలు రాకపోతే తల్లడిల్లి పోతారు తప్ప అమృతం లాంటి ఈ నీరు తాగరు. అంతే!’’ అన్నాడు.

భోజనాలు ముగిశాక ‘‘మీ గ్రామంలో గువ్వలు గానీ, కాకులు గాని కనపడడం లేదే!’’ అని ప్రశ్నించాడు రాజారావు.

‘‘ఎక్కడ నాయనా! నిన్న మొన్నటిదాకా కొండల నిండా అడవులుండె. అడవులు తినేసిరి. కొండలను కరిగించేస్తా ఉండారు. అడవులున్నన్నాళ్లు  అన్ని రకాల పక్షులు ఊర్లోనే ఉంటా ఉండె. ఇప్పుడేవి• అగపడవు’’ అంది పెద్దమ్మ.

గోపాలయ్య మళ్లీ నవ్వాడు.

‘‘అప్పుడప్పుడు ఒకటో, రెండో గద్దలు ఆకాశంలో ఊరి వి•ద తిరుగుతూ కనిపిస్తాయయ్యా! అడపా దడపా, ఉడతలు కనిపిస్తాయి. తొండలు కూడా కనిపి స్తాయి. ఇండ్లలో అయితే బల్లులు ఉన్నాయి. వాటితో జాగ్రత్తగా ఉండాల్సిందే వంటల్లో పడకుండా. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రతి ఏడాది ఏప్రిల్‌-‌జూన్‌ ‌మధ్యలో స్కూల్‌ ‌కాంపౌండ్‌లో ఉన్న రావి చెట్టు వి•ద నుండి ఒక నెల రోజుల పాటు కోయిల కూత మాత్రం క్రమం తప్పకుండా వినిపిస్తుంది.’’ అన్నాడు.

‘‘ఇక్కడ కూడా ప్రకృతి, వాతావరణం క్రమం తప్పుతోందన్నమాట’’ అన్నాడు రాజారావు.

‘‘వాస్తవం చెప్పావయ్యా! రాబోయే తరాల వాళ్లు ప్రాణవాయువు డబ్బాలను వీపునకు కట్టుకొని, రబ్బరు గొట్టాలను ముక్కులకు తగిలించుకొని బతకాల్సి వస్తుందేమో?’’ అన్నాడు గోపాలయ్య.

‘ఈయన చాలా ఆలోచనపరుడు’ అని మనసులో అనుకున్నాడు రాజారావు.

* * *
రాజారావు కృష్ణమూర్తి వాళ్ల ఊరు నుండి తిరిగి రాగానే ‘‘అక్కడయినా కాకులు కనిపించాయా’’ అంటూ ఆసక్తిగా ప్రశ్నించింది అతని శ్రీమతి.

లేదు అన్నట్లుగా తల అడ్డంగా ఆడించి విసుగ్గా సోఫాలో కూర్చున్నాడు రాజారావు బ్యాగు పక్కనపెట్టి. అతని విసుగును పట్టించుకోకుండా..

‘‘మా పిన్నమ్మ వాళ్లు టూర్‌ ‌పోయి వచ్చారు కదా? నిన్న ప్రసాదాలు పట్టుకు వచ్చారు. వారు త్రివేండ్రంలో దిగినప్పటినుండి తిరిగి బస్సు ఎక్కేంతవరకు వందల వందల కాకులను చూశారట’’ అంది రమాదేవి.. కాఫీ పట్టుకు రావడానికి వెళ్తూ.

‘మనమూ త్రివేండ్రం వెళ్లాలి కాకి కోసం.. మరి ఎప్పుడు వెళతామో ఏమో తెలియదు. అంతవరకూ’

అయినా అక్కడ కాకులు ఉంటాయా? ఉంటాయా?’ అని మనసులో అనుకున్నాడు రాజారావు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.