భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
చైతన్యం నశించిన ఆకాశం అంచులా, చచ్చుబడిపోయిన శరీర అవయంలా కోనసీమలో చివరి రైల్వేస్టేషన్ అది. దాని పక్కనే వందలాది మైళ్ల నుంచి అనాదిగా పయనిస్తూ సాగరంలో సమ్మిళితమయ్యే ఘనమైన గోదావరి పాయ మరొకటి.
సముద్రానికి ఒకే ఒక్క చిరకాల స్నేహితుడిలా లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం అపురూపంగా అగుపిస్తూ ఉంటుంది. దాని ప్రాభవ చిహ్నంగా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతిసంవత్సరం ఫెళఫెళ లాడుతూ సాగుతూన్న తీర్థం మరిక మూడు రోజు ల్లోనే అందర్నీ అలరించేలా ఆరంభం కాబోతోంది.
తీర్థానికి ముందే నూతిలో మోటారు సైకిళ్లు నడిపేవాళ్లూ, మాజిక్కులూ, చిన్నిచిన్ని సర్కసులు చేసేవాళ్లూ రకరకాల వేషాలు వేసేవాళ్లూ, దొమ్మరోళ్లూ, గంగిరెద్దులోళ్లూ, కుంటీ గుడ్డ ఇతరత్రా రకరకాల యాచకులూ ఎక్కడెక్కడి నుంచో పొట్ట చేతపట్టుకుని తీర్థ సమయానికి ముందే చేరిపోతారు. పాత పరిచయాలుంటే వాటిని పంచుకుంటారు. ఇక ఈ జన్మకి ఇదే చాలని సరిపెట్టుకుని కొత్త ఆలోచనల కుత్తుకల్ని కోసి పారేసి చావుబతుకుల మధ్య సాగిపోతూంటారు.
జాతర్లూ, తీర్థాలూ తిరుగుతూ దొమ్మరాట ఆడే రుక్కుది కూడా ఆ తానులో ముక్కలాంటి బరువైన బతుకు.ఆరు, ఏడు సంవత్సరాల వయస్సున్న ఇద్దరి ఆడపిల్లలతో మూటా మూళ్లూతో, గుడివాడలో పూటుగా నాటుకొట్టిన మొగుడుతో ఆ స్టేషన్ రెండో నెంబరు ప్లాట్ ఫాం మీదికి చేరింది.రుక్కు పిల్లల్నీ, మూటల్నీ రైల్లోంచి తొరగా దింపేందుకు సిద్ధమవుతూ బల్లమీద చాచుకుపడుకున్న మొగుడు ఫకీర్ని ‘నీ తాగుడు నాశనమవ్వా- టేషనొచ్చింది కిందికి దిగు’ అంటూ చేత్తో అతణ్ని పొడిచింది. బయట రైలు కిటికీకి కట్టిన నాలుగు వెదురుగెడల నిట్రాళ్లూ చకచకా విప్పేసి ప్లాట్ ఫాం మీద వేసింది. తీర్థంలో ఆడే దొమ్మరాటకి తాడుమీద నడవాలంటే అవి ముఖ్యం. అదే రైల్లోంచి దిగిన బిచ్చగాళ్లూ, బుడగలూ, బూరలూ అమ్ముకునేవాళ్లూ టీసీ¾కి దొరక్కుండా మెల్లిగా మరో తోవంట బయటకెళ్లిపోయారు. రుక్కు తన మూటల్నీ, పిల్లల్నీ ఒకటో నెంబరు ప్లాట్ ఫాం వైపుకి మధ్యనున్న పట్టాలమీంచే గబగబా దాటిం చేసింది. ఫకీరు మాత్రం తూలుతూ ఆ రెండో నెంబరు ప్లాట్‌ఫాం మీదే అటూఇటూ తచ్చాడు తున్నాడు.
“యేంటలా తిరుగుతున్నావ్. కిందికి దూకు, అవతల ప్లాట్‌ఫాం మీదికి పోదాం- లేపోతే ఈలోగా ఇంకోబండి రావొచ్చు… ఊ… కిందికి దూకు” అంది రుక్కు
తాగిన మత్తులో ఉన్న అతను తనను తాను కంట్రోలు చేసుకోలేక పోతున్నాడు. ఒంట్లో గుప్పెడు కండ లేదు. రుక్కు ఓ పదిక్షణాలు చూసింది. విసు గొచ్చింది. నీరసించి ఉన్నాడాయె-అతనికది సాధ్యం కాదని లోలోన ఏదో సణుక్కుంటూ అతణ్ణి అంది పుచ్చుకుని సందిట్లోకి రెండు చేతుల్తోనూ తీసుకుని, ఎత్తుకొచ్చి ఒకటో నంబరు ప్లాట్‌ఫాం మీదకు తెచ్చి కూర్చోబెట్టింది. క్షణం ఆలస్యం చేయకుండా ఆమె పైకి రెండుచేతుల సాయంతో ఎగిరి ప్లాట్‌ఫాం ఎక్కింది. పెనిమిటి ఫకీర్ని చెయ్యిపట్టుకుని కాస్త వెనక్కి లాగింది. మరో ప్రమాదమేమీ రాకుండా ముందు చూపుతో. అవసరార్థం మగాడు చెయ్యాల్సిన పని పది సెకండ్లలో ఆడది అంత చురుగ్గా చక్కబెట్టి నందుకు చూసిన వాళ్లంతా ‘అమ్మో, ఆడది!’ అంటూ ఆశ్చర్యపోయారు.
స్టేషన్ బయట లగేజ్ వాన్ మరొకటి రేవు కెళ్తుంటే రుక్కూ అందులో ఎక్కింది అందర్నీ తీసుకుని. తీర్థం సమయం. కిరాయిలు ఎక్కువగా ఉండే రోజులేమో…ఓ లాంచీ గోదావరి రేవు నుంచి తీర్థం దరి ఏటిగట్టు వరకూ ట్రిప్పులేస్తుంటే, ఇంకా చాలామందితో పాటు రుక్కు లాంచీ ఎక్కింది. తన దగ్గరున్న దొమ్మరాట సామానూ, పెద్ద డోలక్ డప్పూ కంటే మొగుడు ఫకీర్ని లాంచీ ఎక్కించడానికి నానా అవస్థలూ పడింది.
ఆ చుట్టుపక్కల తీర్థాల్లోనూ, జాతర్లలోనూ భోజన హోటల్ నడిపే సూరపరాజు రుక్కూనీ, ఫకీర్నీ గతంల ఓ చాలాసార్లు చూశాడు. తల ముగ్గుబుట్ట. తెల్లటి బుగ్గ మీసాలు. ఎనభై ఏళ్లొచ్చినా మంచి ఆరోగ్యవంతుడు.
“యేం అమ్మాయ్! తీర్థానికా?” సూరపరాజు పలకరించాడు.
రుక్కూ ఆయన్ని భోజన హోటల్ రాజుగారిగా గుర్తించి “మీరా రాజుగారూ! నమస్కారం బాబూ… మాకు బతకడానికి ఈ దొమ్మరాటే దిక్కైపోయింది”.
“అవున్లే… నిండుగర్భంతో కూడా ఆ తాడుమీద నడకా సర్కస్సూ చేశావు పాపం! మీ ఆయన ఇంకా తాగుడు మాన్లేదన్నమాట. ఇద్దరు పిల్లల తండ్రయ్యాడు” అన్నాడు సానుభూతిగా.
“ఆయనికే ఆ బుద్ధుంటే మాకీ బాధలెందుకు!… కడకి ఈ చిన్నపిల్లల్ని కూడా దొమ్మరాట ఆడించాల్సి వస్తుంది” అంది రుక్కు బాధగా.
“మీ ఆయనకి గత సంవత్సరం కన్నా ఆరోగ్యం బాగా దెబ్బతింది సుమీ” అన్నాడు సూరపరాజు ఫకీర్ని పరీక్షగా చూస్తూ.
“యేం చెప్పను రాజుగారూ! పొద్దున్నే మందు తోనే ముఖం కడుగుతాడు. తాగి తొంగుంటాడు. పిల్లల్నీ నన్నూ పట్టించుకోడు. నేను పిల్లల్తో మధ్య మధ్య బయట కెక్కిడికైనా పోయి దొమ్మరాట ఆడి నాలుగురాళ్లు తెచ్చి, మేమెలాపోయినా ఆయన్ని మాత్రం పోషించాల్సి వస్తుంది” అంది తెలిసిన పెద్దాయన కనుక.
లాంచీలో ఓ వర్తకుడు “ఈళ్ల గురించి తెలుసా బాబాయ్?” అంటూ ప్రశ్నించాడు సూరపరాజుని.
తెలుసు అన్నట్లు తలూపి “ఈ పిల్ల వీళ్ల తాతకి ఓ జాతర్లో దొరికింది. అప్పట్లో అతగాడూ, భార్యా దొమ్మరాటలు ఆడేవారు. ఈ పిల్ల కూడా వాళ్లతో తిరుగుతూ పెద్దదయింది. వాళ్ల తాతామామ్మలకి సాయంగా ఉంటూ దొమ్మరాటలో ఆరితేరింది. వాళ్లు ముసలాళ్లయిపోయారు. ఈలోగా యెక్కన్నుంచో వచ్చి వీళ్లతోపాటే ఉంటూ వచ్చాడు ఈ కుర్రోడు. ఈ పిల్లకి వయసొచ్చింది కనుక ఈ కుర్రోడికిచ్చి పెళ్లి చేశారు ఆ ముసలోళ్లు. ఇప్పుడు వాళ్లూ లేరు పాపం” అన్నాడు సూరపరాజు గతంలోకెళ్లి.
సూరపరాజు తమ గురించే మాట్లాడుతున్నాడని గ్రహించాడు ఫకీర్.
“యేంటే నా గురించి చెబుతున్నావ్?” అంటూ కస్సుమన్నాడు.
“నీ గురించేమీ చెప్పనవసరం లేకుండానే తెలుస్తుంది. ఇక ఆ తాగుడు మానేయ” అన్నాడు సూరపరాజు ఓ పెద్దమనిషిగా.
“అలా చెప్పండి రాజుగారూ! – డాక్టర్లు ఈయనకి లివర్లని చెప్పారు. తాగుడు మానకపోతే పేణానికి ముప్పన్నారు. అయినా ఇంటంలేదు” అంది రుక్కు.
“…. నోర్ముయ” అంటూ రుక్కుని ఓ బూతు తిట్టాడు ఫకీర్.
* * *
తీర్థం జాగాకి చేరుకుని చిన్న గుడారం లాటిది వేసింది రుక్కు పిల్లల సాయంతో.
రుక్కూను గతంలో ఇతర తీర్థాలలో చూసిన బిచ్చగాళ్లూ, వేషగాళ్లూ పలకరించారు.
“నీకు సాయంగా పిల్లలందొచ్చారన్నమాట” అందో బిచ్చగత్తె.
“ఈళ్లు కూడా ఈ దొమ్మరాటతోనే మట్టి పాలవుతారేమోనని భయంగా ఉంది.అందర్లా నాలుగక్షరం ముక్కలు చదుకొని గౌరవంగా బతికే రోజులు రావాలని ఆశ పడుతున్నాను పెద్దమ్మా” తన మనసులోది చెప్పుకుంది రుక్కు
“ఈ దొమ్మరాట గడిగడి గండం-యెప్పుడు చెయ్యిరిగితాదో…యెప్పుడు కాలిరిగితాదో యేంటో నీ బతుకుతో పాటు నీ ఇద్దరాడపిల్లల బతుకూ యిందులోనే తెల్లారిపోతాదేమో. పాపం” అంటూ వెళ్లిపోయింది.
రుక్కూకి ఆ మాట గునపంలా గుచ్చుకుంది.
మర్నాడు ఉదయం సముద్రస్నానాలతో తీర్థం ప్రారంభమైంది. రెండోరోజు రథయాత్ర ఆఖరయ్యే వరకూ తీర్థం ఎడతెరిపి లేకుండా సాగుతూనే ఉంటుంది.
రుక్కూ ప్రతి సంవత్సరం లాగే అదే చోటు ఎంచుకొని తాడుమీద నానా రకాల విన్యాసాలూ చేస్తోంది. ఏడేళ్ల కూతురు కూడా తాడు మీద అవలీలగా నడుస్తోంది. ఆరేళ్ల కూతురు మంటల రింగులోంచి జంపింగ్ చేస్తుంది. మొగ్గలూ, పల్టీలు వేస్తుంది. మధ్య మధ్య డప్పుకొడుతుంది.
రుక్కు నాపరాయి ఛాతీమీద పెట్టుకుని సుత్తితో బద్దలు గొట్టించుకొంటుంది. భగభగమండే అగ్గి తూటాని నోట్లో పెట్టుకుని సునాయాసంగా ఆర్పేస్తుంది. కంఠానికి ఇనుపచువ్వను ఆనించి అవలీలగా వంచేస్తుంది.
“ఇది ఆడదా? మగోడా?” అన్నాడో ప్రేక్షకుడు.
“రెండు కలిసిన ఇనపముక్క రాబాబూ!” అన్నాడు దానికి సమాధానంగా మరొకడు.
ఆ మాటలు రుక్కు చాలాసార్లు విన్నవే. చిన్నప్పట్నుంచీ దొమ్మరాటలో కండరాలన్నీ ఉక్కుగా మారిపోయాయేగాని మనసు కాదు. అలా ఎందుకాలేదా అనుకుంది రుక్కు చాలాసార్లు.
దొమ్మరాటకి మధ్యలో రుక్కు..సూరపరాజు భోజన హోటల్ నుంచి ఓ పాకెట్ మీల్స్ కట్టించుకెళ్లి ఫకీర్ని లేపింది. భోంచెయ్యమని బతిమా లింది. ‘పిల్లలు అలసిపోయారు వచ్చి డప్పయినా ఆడించు’ అని అడిగింది. ‘రెండొందలిచ్చి వెళ్లు’ అన్నాడు. భర్త చేతిలో రెండొందలు పెట్టి పిల్లల దగ్గరకు పరుగెత్తింది రుక్కు, చినŸ్న వయసులో ఉన్న ఆడపిల్లలు చేసే విన్యాసాలు చూసి కాదనకుండా లేదనకుండా జనం పల్లెంలో డబ్బులిస్తూనే ఉన్నారు.
దొమ్మరాట కట్టేసి రాత్రి తొమ్మిదిగంటలకు గుడారానికే రుక్కు పిల్లల్తో- మొగుడు ఫకీరు ఆమె ఇచ్చి వెళ్లిన అన్నం రెండు ముద్దలు తిని తక్కింది అలాగే వదిలేశాడు. కాని అతని పక్కన ఖాళీ మద్యం బాటిల్ పడుంది.
తన శరీరమూ, మనసూ దొమ్మరాటతో అలిసి పోయాయి. పసిపిల్లలు పొద్దున్నుంచీ ఎడతెరిపి లేకుండా ఎముకలు విరిగేలా సర్కస్ ఫీట్లు చేసి అలసి సోలి పోయారు. రెండ్రోజుల తీర్థంలో వచ్చే సంపాదనతో కొన్ని రోజులు బతకాలి. బాధ్యత తీసుకోవలసిన భర్త తాగి పడున్నాడు. ఓ పక్క తీర్థమంతా సంబరం! రుక్కు హృదయం మాత్రం కన్నీటి మయం!
తన ఆలోచనల్ని అవతలపెట్టి బయటికెళ్లి పిల్లలకూ భర్తకూ భోజనం తెచ్చింది. పిల్లలిద్దరూ ఆకల్తో ఉన్నారేమో తిని అక్కడే నిద్రపోయారు. భర్తని భోజనానికి లేపింది. అతను లేవలేదు. ఆమే అతణ్ణి పొదివి పట్టుకుని అన్నం తినిపించేందుకు ప్రయత్నిం చింది. రెండు ముద్దలు బలవంతంగా తిని, భళ్లున వాంతి చేశాడు. మద్యం వాసన ఆమె భరించలేక పోయింది. అదంతా కడిగి శుభ్రం చేసింది.
అమాయకంగా నిద్రపోతున్న కూతుళ్ల ముఖంలోకి చూస్తుంటే తన బాల్యం గుర్తొచ్చింది. తనను కన్నవాళ్లెవరో తెలియదు. తాను కనుక్కున్నా బిడ్డలు మాత్రం అనాథŠలు కాకూడదు. రేపు తనకేదైనా అయితే పిల్లలు రోడ్డున పడకూడదు. కొందరు తల్లిదండ్రుల్లా పిల్లల్ని పెంచలేక, తమ క్కూడా సంపాదించుకుని రమ్మని నిత్యన్ని బయటకు తోలెయ్యకూడదు. వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి? ఆమెకేనాటి నుంచో మనసులో-“నా బిడ్డలకు నాలాటి బతుకు రాకూడదు. వాళ్లు చదూ కోవాలి. సొతంత్రంగా సుఖంగా గొప్పగా బతకాలి” అని ఉంది.
అంతులేని ఆలోచనల సుడిగాలుల్లో నిస్సహా యంగా, వాటికో మార్గం కనుచూపు మేర కనిపించకా, అలసటగా కళ్లు మూసింది.
రాత్రి రెండు గంటలు. ఊపిరి పీల్చుకోడానికి తెగబాధ పడుతున్నాడు ఫకీరు. రుక్కు లేచి సపర్యలు చేసింది. కాసిని నీళ్లు పట్టించి పడుకోబెట్టింది.
తెల్లారితే రెండోరోజు తీర్థం. నరసింహస్వామి గుడి దగ్గర నుంచి గుర్రాలక్క గుడి వరకూ రథయాత్రకు జనం ఉరకలేస్తారు. సాయంత్రానికి జనం తిరుగు ముఖం పడతారు.
ఇక ఆ ఒక్కరోజూ సంపాదన కూడా జత చేసుకోవాలి. దొమ్మరాటలు యెన్ని యెక్కువ వేస్తే అంత సొమ్ము దొరుకుతుంది. ఏదిగే పిల్ల” రేపటి కోసం ఉపయోగిస్తే ఎంత బావుంటుంది! నోట్లో అక్షరం ముక్క లేకుండా, మీదపడే యవ్వనాన్ని దాచుకోలేక, రోడ్డుమీద దొమ్మరాట్లతో పిల్లలు ఈ మృగాల మధ్య ఎలా? ఎంతకాలం బతుకుతారు?- ఇవన్నీ రుక్కుకీ సవాల్లే!
గత రోజు పొద్దున్నుంచి రాత్రి వరకూ దొమ్మరాట ఆడి అలసి నిద్రిస్తున్న కూతుళ్లను పొద్దున్నే లేపి రుక్కు “ఈ ఒక్కరోజు కష్టపడండమ్మా ఈ వేళతో తీర్థమయి పోతాది” అంటూ బతిమాలింది, బుజ్జగించింది. వాళ్లకి ఆ కబురూ ఈ కబురూ చెప్పి తయారుచేసింది. ఆవేళ రెక్కలు ముక్కలు చేసుకోవ డానికి తానూ నడుం బిగించింది. తన పిల్లలకో మంచి దారి చూపించాలి!
భర్త ఫకీర్ని ఉద్దేశించి, “ఆ పాడు సారా తప్ప, తిండి మానేశావులే. కాస్త టీ టిఫినూ తెస్తాను, తిందువుగాని” అంది.
ఆమె రెండుమూడుసార్లు ఫకీర్ని పలకరించింది గట్టిగా.
అతన్లో ఉలుకులేదు, పలుకూ లేదు.
“నిన్నే” అంటూ భుజం మీద చెయ్యేసి కదిపింది. ఏదో మార్పు కనిపిస్తోంది. తనకు చల్లగా తగిలింది అతని ఒళ్లు. ముక్కుకి దగ్గరగా చెయ్యెట్టి చూసింది. ఇక అతనికి గాలిపీల్చే అవసరం తీరిపోయిందని ఆమెకు అర్థమైంది. భోరున ఏడుపొచ్చేదే కాని తన గొంతు తానే నొక్కుకుంది.
ఆమెలో వేదన లావాలా పొంగి, పొర్లి, కరిగి, చల్లగా భయంకరమైన లోయల లోతుల్లోకి జారి పోతోంది. కాస్సేపటికి తేరుకుని ఆలోచించింది. అతని మరణం తనకి తప్ప మరెవ్వరికీ తెలియ కూడదు. భర్త చావు ఆవేళ తన దొమ్మరాటకు అడ్డం కాకూడదు. అదో అవాంతరం అవకూడదు.
దుఃఖాన్ని దూరంగా తరిమేసి ధైర్యాన్ని నింపుకుంది!
రుక్కు డప్పు తన భుజాన తగిలించుకుంది. కూతుళ్లను చెరో చెయ్యి పట్టుకుని గుడారం బయటకి తీసుకొచ్చేసింది. ఇక ఆ గుడారం తనది కాదను కుంది. దొమ్మరాట ఆడే చోటుకి పిల్లల్తో చేరిపోయింది. ఉదయం ఏడు గంటలు. తీర్థంలో యెక్కడివాళ్లక్కడ ఇంకా కాలకృత్యాలు తీర్చుకుంటు న్నారు. రుక్కు తన ఆవేదన, ఆవేశం పట్టలేక ఆ డప్పు మెడకు తగిలించుకుని పిచ్చెక్కినట్టు బాదు తోంది.
భర్త మరణాన్ని అలా ఆ నాదంతో తుడిచెయ్యా లనుకుంటూ ప్రకృతితో మొరపెట్టుకున్నట్టుంది.
అది విన్న వాళ్లు కొందరు “దొమ్మర రుక్కీ ఆట తెల్లారకముందే ఆరంభిం చింది” అనుకున్నారు. ఆవేళ పిల్లలకంటే తానే ఆటమీద ఆటగా పిచ్చిదానిలా ఆడేస్తుంది. దొమ్మరాట బరి తానొక్కర్తే దున్నేస్తుంది. ఇక తనకు అదే ఆఖరి దొమ్మరాటన్న నిర్ణయానికొచ్చేసింది. అలాగే తన పిల్లలకూ అదే ఆఖరి దొమ్మరాట కావాలి. ఇక దొమ్మరి రుక్కు సంతానం దొమ్మరోళ్లు కాకూడదు. వాళ్ల చేతుల్లో రాళ్లూ రప్పలూ ఉండకూడదు. బుక్కులుండాలి. వాళ్ల గుండెలమీద రాళ్లు బద్దలు గొట్టించుకోనవసరం లేదు. వాళ్ల హృదయాల్లో మంచి బుద్దులుండాలి. అదే ఆమె ఆలోచన!
రథయాత్ర ముగిసింది. తీర్థం ప్రజలు తిరుగుముఖం పట్టారు.
చెమట్లతో తన శరీరం నానిపోయింది. తనలాగే చెమట్లతో నానిపోయిన ఇద్దరి కూతుళ్లను తన మీదున్నా బట్టతో తుడిచి గుండెలకు హత్తుకుంది. ఎన్నడూ లేంది అపుడెందుకు తల్లి తమనంత ప్రేమగా హత్తుకుందో వాళ్లకీ తెలియలేదు.
ఇపుడు ఏ గవర్నమెంటు బడి వరకైనా వెళ్లి పిల్లల్ని బడిలో చేర్పించేందుకు అవసరానికి తన దగ్గర కొంత డబ్బుంది. మట్టిలోంచి మాణిక్యాలను తయారు చేసే సంకల్పబలం తనలో పొంగి పొర్లుతోంది.
తనకు తానే నిబ్బరపడి… పోయిన పెనిమిటికి మనసులోనే ఓ దండం పెట్టుకుని పిల్లల కోసం ముందుకు సాగడమే ముఖ్యమని నమ్మింది. చనిపోయిన భర్త కంటే బతికున్న బిడ్డల భవిష్యత్తు ఆలోచించాల్సిన అవసరం తనకుందన్న కఠిన నిర్ణయానికొచ్చేసింది. తనకోదారి కనిపిస్తోంది.
జనం పల్చపడుతున్నారు. చీకట్లు ముసురుతు న్నాయి. తన దొమ్మరాట సామాను గెంటేసింది. అంతవరకూ తన జవసత్వాల్నీ, ఓర్పునీ, సహనాన్నీ చాటుతూ నిరంతరంగా మోగిన మెడలో ఉన్న డప్పును దూరంగా విసిరేసింది.
తీర్థ ప్రయాణీకుల కోసం కాస్తదూరంలో వరసగా నిలబడ్డ బుస్సుల వేపు పిల్లల్తో గబగబా ముందుకు నడిచింది. తనకో దారిదొరికింది .
– జి. నరసింహమూర్తి