‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
స్తంభాలపూండి గ్రామంలో ఓ శైవ మతావ లంబి అయిన రైతుపై వీర వైష్ణవులు దాడి చేశారు.
“చెప్పు.. ఆ శివుడు కైలాసంలో సోమరసం తాగి పడుకుని ఉంటాడు. చెప్పు… నా దైవం ఆ శ్రీమహావిష్ణువు.. మేం చెప్పమన్నట్లు చెప్పు. కేశవా అను. లేకుంటే ఇప్పుడే ఇక్కడే చంపేస్తాం.” అన్నారు
వారి మాటలకు రైతు నవ్వి, “ఆ శ్మశానం వాడే కైలాసనాథుడు. ఆ దేవదేవుని ప్రార్థించు. నీ సమస్యలన్నీ తొలగిపోతాయి..” అన్నాడు చేతులు జోడించి ఆకాశం కేసి చూసి చిన్మయంతో.
ఓ ఆగంతకుడు నెత్తిన ఉన్న కుండను శైవభక్తుని మీద కుమ్మరించాడు. అదే సమయానికి పక్కసందుల నుంచి మరికొందరు ఆగంతకులు అక్కడికి వచ్చేశారు. ఆ రైతుపై పడి అతని ముఖాన ఉన్న విబూదిని తుడిచేశారు. ఇద్దరు అతన్ని పెడరెక్కలు విరిచి పట్టుకోగా ఒకడు అతని ముఖాన సున్నంతో నిలువుగా నామం పెట్టాడు. మరో ఇద్దరు అతని బట్టల నిండా తిరుచూర్ణంతో నామాలు గీశారు.
అతడు “శివా శివా పాహిమాం.. రక్షించు. నన్ను రక్షించు..” అంటూ అరుస్తున్నాడు.
వాళ్లు అతన్ని బరబరా పక్కకు ఈడ్చుకుపోయి ఓ తాడి చెట్టుకు కట్టేశారు. ఒకడు అంటుంటే ముగ్గురు చురకత్తులు తీసి బుగ్గలపై గాట్లు పెట్టారు. బుగ్గల నుంచి రక్తం చివ్వున ఎగసింది.
అతడు కళ్లు మూసుకుని బాధగా ‘శివా..’ అన్నాడు కాని ‘కేశవా’ అనలేదు.
ఆ బృందంలో ఒకడు తీవ్రావేశంతో ఖడ్గంలాగి ఆ రైతు మెడపై బలంగా నరికాడు. అతడు కుప్పకూలిపోయాడు.
అటుగా వెళుతున్న ఒకరిద్దరు గ్రామీణులు ఈ గుంపు వద్ద ఏదో జరుగుతోందని సందేహంగా చూస్తున్నారు. అంతలోనే ఆ గుంపు మధ్యగా ఆ శైవ రైతు కిందికి జారిపోయి గిలగిలా కొట్టుకోవడం కనిపించింది. వెంటనే ఆ గ్రామీణులు అక్కడికి పరుగులు పెట్టారు కాని ఆ వీరవైష్ణవ బృందం చురకత్తులు, ఖడ్గాలు చూపుతూ “ఓం కేశవ.. ముకుందా.. మురారీ..” అంటూ అరుచుకుంటూ పరారయ్యారు.
* * * *
సత్తెనంపల్లి స్థల.. పలనాడు రాజ్యం.
ఓ పంచాణం వారి చావిడి. సగం సగం పూర్తయ్యి తయారీలో ఉన్న నాగళ్లు, బల్లలు, ఊయల తొట్టెలు, పీటలు, కత్తులు, బండి చక్రాలు.. అన్నింటి మధ్యగా కొలిమి. దానికి ఆవలగా ఊక పెద్ద గుట్టగా పోసి ఉంది. దానిపై ఓ రాతిశిల్పం.. విష్ణుమÖర్తి రూపం చెక్కినది.. పెట్టి ఉంది. దాని ముందు కొన్ని పువ్వులు, శిల్పానికి ఓ పూల దండ..
ఓ పదిమంది వైష్ణవులు ఆ ఊక గుట్టకు ముందు.. అంటే శిల్పానికి ముందు కూర్చుని వైష్ణవ గీతాలు ఏవో పాడుతూ భజన చేస్తున్నారు. అప్పుడప్పుడూ తలెత్తి స్వామిని చూస్తున్నారు.
అప్పటికి సమయం రాత్రి మొదటి జాము ముగుస్తోంది.. ఊరు దాదాపుగా నిద్రకు ఉపక్ర మించింది. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.
భక్తులంతా హరినామస్మరణతో పులకించి పోతున్నారు. అందరూ నుదుటన నామాలు.. భుజాలకు, ఉదరంపై నామాలు, తిరుచూర్ణంతో ఎర్రెర్రని నిలువుబొట్లూ, చెవుల్లో పువ్వులూ.. చేతుల్లో కంచుచిడతలతో ఊరు ఊరంతా గొంతెత్తి విష్ణు గీతాలు పాడుతూ భక్త సముద్రంలో ఓలలాడుతున్నారు.
అదే సమయంలో ఉన్ని కంబళ్లు కప్పుకున్న ఓ బృందం ఆ కర్మాగారాన్ని చుట్టు ముట్టడం గమనించలేదు.
ఆ ముసుగువీరులు..వీరశైవబృందం.. మౌనంగా ఆ ఊక గుత్తకు నిప్పంటించింది. తర్వాత ఆ విష్ణురూప శిల్పాన్ని ఎత్తి ఆ మంటల్లో పడేశారు. ఒకరిద్దరు భక్తులు అది గుర్తించి అరిచేసరికే కర్మాగారం చావిడి, ఊకగుట్ట భగ్గున మండు తున్నాయి.
ఆ ఆగంతుక బృందంలోని వారు.. “హరహర మహాదేవా.. శంభోశంకరా” అంటూ ఊరంతా వినిపించేలా అరచి పరారయ్యారు. అది వీరశైవ బృందం.. ఇలాంటి బృందాలు రానురానూ నియంత్రణ తప్పుతున్నాయి మహామాత్యా!
మరికాసేపట్లో నిప్పు మొత్తంగా ఆ చావిడిని చుట్టుముట్టి లిప్తలకాలంలోనే పూర్తిగా దహించి వేసింది. అందరూ బయటపడ్డారో ఒకరిద్దరు అగ్నికి ఆహుతయ్యారో.. అనూహ్యం!
* * * *
మరికొన్ని రోజుల అనంతరం సత్తెనంపల్లి గ్రామానికి కపర్దిభట్టు నాయకత్వాన ఓ హరిహర బృందం వెళ్లింది. శివకేశవులు ఒక్కరే అనే తత్వాన్ని ఆచరిస్తూ.. సాటివారిలో మత తీవ్రతను తగ్గించడమే ఈ హరిహరతత్వ బృందాల కార్యకలాపం.వీటికి రూపకల్పన చేసిన వాడు తిక్కనామాత్యుడు. బృంద సభ్యులంతా ‘విష్ణు రూపాయ నమశ్శివాయ..’అనే వాక్యంతో అందరిని పలుకరిస్తూ..
“శివకేశవా.. దేవదేవా..
హరిహరా.. మహానుభావా..
మము కటాక్షింపుము మహాదేవా..”
అని పాడుకుంటూ గ్రామమంతా.. వెలివాడలు సహా వీధివీధి.. సందూ గొందూ తిరుగాడారు. అనంతరం దేవాలయాల వద్ద కాకుండా గ్రామ సమయ కచేరి వద్ద ఆగారు. అప్పటికే అనేకమంది గ్రామస్తులు కూడా అక్కడికి చేరారు. బృందనాయకుడు కపర్దిభట్టు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, ‘గ్రామస్తులకు నమస్కారం. మేము మహాకవి తిక్కనామాత్యుల వారి హరిహర తత్వబృంద సభ్యులం. శివకేశవులకు భేదం లేదని.. ఇద్దరూ ఒక్కరేనని మహాకవులు ప్రతిపాదిస్తున్న సిద్దాంతం. అంటే అహింసా సిద్ధ్దాంతం…అలీన విధానం. మేము శివుని పూజిస్తామూ.. విష్ణువునూ కొలుస్తాము. రెండు భక్తి బృందాల ఘర్షణల వల్ల మన రోజువారీ జీవితం ప్రశాంతంగా సాగడంలేదు. వేళకు నాట్లు పడటంలేదు. వృత్తులవారికి దినమూ అడ్డంకులే. ఒకరినొకరు చంపుకోవడం సుతరామూ అంగీకరించం. ఈ భావనలు నచ్చినవారు ఉండొచ్చు… నచ్చనివారు వెళ్లిపోవచ్చు..” అన్నాడు.
ఆ మాటలకు స్పందిస్తున్నట్లు జనులు కాస్త అటూ ఇటూగా కదిలారు. ఒకరినొకరు చూసుకు న్నారు కాని ఎవ్వరూ వెళ్లలేదు. రానురానూ మరికొందరు వచ్చి చేరుతున్నారు. నిత్యమÖ తమతమ వృత్తులలో పూర్తిగా నిమగ్నమయ్యే రైతులు, ఇతర వృత్తిదారులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ బృందంలో మహిళలు కూడా ఉన్నారు. రానురానూ వచ్చి చేరుతున్న గ్రామస్తులలో ఎక్కువమంది జంటలే. అనవసరపు ఉద్రేకాల వల్ల కుటుంబాలలో.. తద్వారా సమాజంలో జరుగుతున్న నష్టాలను మొదట గుర్తించేది మహిళలే.
“నాకు బోలెడు పని ఉంది. రెక్కాడితే కాని డొక్కాడదు. రైతు కూలీని. కానీ నా పనంతా వదులు కుని ఎందుకు వచ్చాను?.. ఈ మారణకాండ చూడలేక. నేను నాకు నచ్చిన దేవుడిని తలచు కుంటాను. ఆయనపై పాటలు పాడుకుంటాను. మరో దేవుడిని తిట్టను. ఆ దేవుడిని పూజించేవాళ్లను ద్వేషించను. దూషించను. ఇదిగో ఈమెను చూడండి. ఈమె భర్త చాకలి. అందరి బాగు కోరే మడేలన్న. గ్రామంలోని వారందరి మురికి కడిగి వేసే రజకుడు. ఆయనను ఓ వీరశైవ బృందం చంపేసింది. అదిగో అవతల కొంగు నోట్లో పెట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్న ఆమె కొడుకును మరో బృందం.. అంటే వీర వైష్ణవ బృందం చంపేసింది. ఇపుడు ఈమెకు దిక్కెవరు?ఈమెకు పది మంది పిల్లలు..వాళ్లను ఎవరు చూస్తారు? ఆ పదిమంది అడుక్కు తినాల్సిం దేనా..!! తర్వాత వాళ్లు కూడ దొంగలుగా, దోపిడిదారులుగా బ్రతకాల్సిందేనా..? కార్చిచ్చులా వ్యాపిస్తున్న ఈ మత హత్యలను ఆపేదెవ్వరు? ఇక్కడ ఓ చిన్నరైతు.. శివభక్తుడు. ఆయనను గొంతు కోసి చంపేశారు. ఆయనకు ఇద్దరు భార్యలు. మొత్తంగా పాతికమంది పిల్లలు.. ముసలి తల్లిదండ్రులు. అతన్ని చంపేస్తే ఆ కుటుంబం సంగతి ఏవిటి? మనం ఇవన్నీ ఆలోచించాలి. అందుకే మనమంతా శివుడిని, అదే సమయంలో విష్ణువును పూజిద్దాం. అంటే హరిహరదేవుడిని పూజిద్దాం. ఒక్కసారి అందరూ చేతులు జోడించి హరిహరనాథా.. నమోన్నమః.. నమోన్నమః అనండి..”
అందరూ ముక్తకంఠంతో, అలాగే పలికారు పులకిత మనస్సులతో.. భక్తిభావం తొణికిసలాడే కంఠాలతో..
“శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే..” అనేది మా ప్రధాన విధానం. ఇకపై మీరంతా కూడా అందరిని.. శైవులను, వైష్ణవులకు కూడా “శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే..” అని పలకరించండి. మీ గ్రామంలో లేదా ఈ స్థలలో కూడా హరిహరతత్వ బృందాన్ని ఏర్పాటు చేద్దాం. తద్వారా ఈ మత విద్వేషాలను మీ గ్రామం నుండి తరిమికొట్టవచ్చు. మనకు అందరూ మిత్రులే. శివుడూ మన దేవుడే. కేశవుడూ మనకు ఆపద్భాంధ వుడే. మనం శివరాత్రిని, గోకులాష్టమిని ఒకే విధంగా జరుపుకుందాము. విభూతి పూసుకుని దానిపై శ్రీగంథాన్ని అలంకరించుకుందాము.”
ఆ తర్వాత ఆ స్థలలోని మరికొన్ని గ్రామాలలో కూడా పర్యటించి హరిహర తత్వాన్ని వివరిస్తూ.. దీనిద్వారా మత గొడవలు ఉండవని.. మన వృత్తులకు ఆటంకం ఏర్పడదని.. స్త్రీలు, పిల్లలు, వృద్దులు ప్రశాంతంగా ఉంటారని వివరించాక.. అందుకు సమ్మతించిన రైతులతో అక్కడొక హరిహర బృందాన్ని ఏర్పాటు చేశారు.
అయితే ఈ ఏర్పాటు నచ్చని మహానుభావుడు ఆ దగ్గరలోనే ఉన్నాడు.
* * * *
ఓ గృహస్తు నివాసం, సత్తెనంపల్లి స్థల..
అదొక శైవ ఆశ్రమంలాగుంది.
శైవ పాటలతో వీరశైవ నృత్యాలతో ఆ ఆశ్రమ ప్రాంగణం హోరేత్తిపోతోంది. ప్రాంగణం బయట కనిపిస్తున్న ఎడ్ల బళ్లు, గుర్రపు బళ్లు, ఎద్దులు, గుర్రాలు.. అలాగే రకరకాల పల్లకీలను పరిశీలిస్తే లోపల చాలామంది జనం ఉన్నట్లు తెలుస్తోంది.
బయట నుంచి ఆసక్తి ఉన్నవారు ఉరకలెత్తే ఉత్సాహంతో లోపలికి పరుగులు పెడుతుంటే.. ఆసక్తి లేని.. అసలు నచ్చనివారు తలవొంచుకుని చిరాగ్గా దూరంగా వెళ్లిపోతున్నారు.
కపర్ది నాయకత్వాన ఓ హరిహర బృందం ఆ గృహం ముందు కాసేపటి నుంచి నిలిచి ఉంది. లోపలికి వెళ్లేవారిని చూస్తూ.. లోపలి నుండి వినవచ్చే శైవ గీతాలను వింటూ.. మధ్య మధ్య వినవచ్చే ఆ గృహస్తు మాటలు వింటూ అక్కడే ఉన్నారు. వారిని బృందంగా ఎవ్వరూ గుర్తించకుండా అందరూ కాస్త దూరదూరంగా నిలబడ్డారు. కాసేపటికి కపర్ది లోపలికి వెళ్లడానికి సమాయత్తమౌగానే అందరూ ఆయన వెంట లోపలికి వెళ్లారు. లోపలి దృశ్యం చాలా ఉద్రేకంగా ఉంది.
ఆ గృహస్తు ఓ గుర్తింపు ఉన్న కవి.. పేరు నీలకంఠమయ. ప్రస్తుత కాకతీయ సమాజంలోనే కాదు మొత్తం ఎక్కడ తెలుగువారున్నా అక్కడల్లా పండితవర్గాల్లో మంచి పేరున్న సాహితీవేత్త, పండితుడు. అయితే ఆయన తనను తాను వీరశైవకవిగా చెప్పుకుంటాడు. అందరూ అలాగే పిలవాలని కోరుకుంటాడు. అలా పిలిస్తే సంతోషంతో పులకిస్తాడు.
నీలకంఠమయ గృహం అంతలా శైవపాటలతో నృత్తాలతో హోరేత్తిపోవడానికి కారణం ఆయన ఈరోజే కన్నడ సీమనుండి తిరిగివచ్చాడు. అక్కడ వీరశైవ ప్రబోధకుడు బసవణ్ణ తిరుగాడిన ప్రదేశాలను సందర్శించి ఆయన ఉద్రేకాన్ని, ఉద్వేగాన్ని మరింత పదిలంగా.. మనసులోనే కాదు ఒడలెల్ల రాసుకున్నట్లు వీరశైవ భావనలతో ఊగిపోతూ అనేకానేక కొత్త పాటలను భక్తి గీతాలను మనస్సులోనే అల్లుకుంటూ పాడుకుంటూ ఆ పారవశ్యంతో గంతులతో నాట్యాలతో పరవశిస్తూ ఈ రోజే గ్రామానికి తిరిగి వచ్చాడు. వెనువెంటనే ఆయన అనుయాయులైన వీరశైవులందరూ అక్కడికి చేరారు. ఆయన గొంతెత్తి పాడుతున్న కొత్త పాటలు వింటూ శిష్యులంతా పరవశించి పోతున్నారు.
“శివ యను.. శివ యను.. శివా యను।
శివా యనకపోతే.. పరమశివుని యానా॥
నిను భజించనివాడు పరమ మÖర్ఖుడు।
నిను కొలువని వాని నేనొదల.. నేనొదల।
నిను కొలువమని కైలసంబు కంపెద॥”
పాటకు రూపకల్పన చేస్తూనే రాగం కూడా కూరుస్తూ తన్మయత్వంతో పాడుతున్నాడు నీలకంఠమయ. భక్తులంతా అరమోడ్పు కన్నులతో ఆయనతో గొంతు కలుపుతూ.. కాలు కదిపి నర్తిస్తూ.. వీరావేశంతో ఊగిపోతున్నారు.
అప్పుడే హరిహర బృందనాయకుడు కపర్దిభట్టు ఆయన బృందం నిశ్శబ్దంగా లోపలికి ప్రవేశించింది.
తీవ్ర ఉద్వేగంతో ఊగిపోతున్న వీరశైవులు కొందరు.. ఈ హరిహర బృందాన్ని గుర్తించారు. . “ఎవర్రా.. మీరంతా??” అని ఒకడు తీవ్రకంఠంతో గర్జించాడు.
అది విన్న హరిహరబృంద సభ్యుల చేతులు నడబంధంలోని చురకత్తిని ఓసారి తడిమాయి. అన్నిటికి సిద్ధ్దమై ఉన్నారు వారంతా.
“మహాకవులను కలవాలని వచ్చాం. శ్రీశ్రీశ్రీ నీలకంఠమయ వారికి ప్రణామములు..” అంటూనే ఆయన పాదాలపై వ్రాలి నమస్కరించాడు కపర్ది.
ఆ చర్యతో ఆ మందిరమంతా నిశ్శబ్దమై పోయింది. కవి ముఖంలో ఉద్రేక తీవ్రత తగ్గి తనకు నమస్కరించిన వారి పట్ల ప్రసన్నత ఏర్పడింది.
“ఎవరు మీరు?? శైవుల్లా లేరే.. వేరే బొట్లు.. తిరుచూర్ణం..?? కొంపదీసి వైష్ణవులా??” అన్నాడు.
అంతే. అ మందిరమంతా ఒక్కసారిగా అరుపులతో కేకలతో మార్మోగి పోయింది.
కపర్దిభట్టు మరింత పెద్ద కంఠంతో “కాదు కాదు. మేము వైష్ణవులం కాదు.. కాదు. అంతా కాస్త సంయమనం పాటిస్తే మా ఆలోచనలు కవిగారికి విన్నవించుకుంటాము..” చెప్పాడు.
కవి సరే అన్నట్లు తల ఊపాడు.
కబర్ది గొంతు సవరించుకుని ఆయన బృందం వైపు తిరిగి అందుండి ఓ మహిళను ముందుకు లాగాడు.
“ఈమె శంఖమ. గోపులప్ప భార్య..” చెప్పాడు..
అంతా ఆశ్చర్యంగా చూశారు. శంఖమ ఎవరో.. గోపులప్ప ఎవరో ఎవరికీ గుర్తు రాలేదు. నీలకంఠ మయ కూడా ఆశ్చర్యంగా చూశాడు.
అప్పుడు చెప్పాడు కపర్ది. “ఈమె ఎవ్వరో మీకు తెలుసు కవివరేణ్యా! ఈమె మీరు.. అంటే మీ వీరశైవులు హత్యచేసిన గోపులప్ప భార్య. ఈమెకు అత్తమామలు, ఇద్దరు తలచెడిన ఆడపడచులు, ఇద్దరు సవతులు, పదిమంది పిల్లలు ఉన్నారు. ఈమె భర్తను మీ వీరశైవశిష్యులు.. వైష్ణవుడు అనే అభిప్రాయంతో చంపివేశారు. మరి ఇప్పుడు ఈ కుటుంబం పరిస్థితి ఏవిటి??” అని అడిగాడు.
“ఒక మహాకవిగా మీరు శివ మహాదేవుడ్ని కొలుస్తారు. ప్రార్థ్ధిస్తారు. అందుకు మాకేమీ అభ్యంతరం లేదు. కానీ శైవుడు కాని వాడిని చంపేస్తామని.. శివుడు ఒక్కడే దేవుడని.. ఆయనను పూజించని వాళ్లను పొడిచేస్తాం.. నరికేస్తాం.. అనడం ఎంతవరకు న్యాయం??” అన్నాడు.
తిరిగి మందిరమంతా ఉద్రేకం నెలకొంది.
ఒక భక్తుడు అతివేగంగా నడుము నుంచి చురకత్తి తీస్తూ కపర్ది పైకి దూసుకువచ్చి అతని పీకకు కత్తి ఆనించాడు. అంతే..!హరిహరబృందమంతా కూడా వేగంగా చురకత్తులు తీసి ఆతన్ని చుట్టు ముట్టింది. వీరశైవులు కూడా అంతే వేగంగా హరిహర బృందాన్ని కత్తులతో చుట్టుముట్టారు.
“ఆగండాగండి..” అంటూ నీలకంఠమయ అరిచాడు.
“మహాకవులయిన మీరు నలుగురి మంచి కోరాలి. సమాజపు హితం కోసం పాటలు రాయాలి. మీరు కొలిచే దేవుడిని ప్రార్థించమని చెప్పవచ్చు కాని కేవలం శివుడిని మాత్రమే కొలవాలపనడం, ఇతర దేవుళ్లను పూజిస్తే చంపేస్తాం అంటే ఎలా మహాకవి? సమాజ హితాన్ని కోరాల్సిన మీరే మీ బాధ్యతను మీ శైవవాదంతో ప్రక్కదారి పట్టిస్తున్నారు అని నేనంటాను.. మీరేమంటారు..?!” అని గట్టిగా ప్రశ్నించాడు.
వీరశైవులు మళ్లీ అరిచారు.
“మహాకవులనే అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? ఇక్కడికిక్కడే.. ఇపుడిప్పుడే నిన్ను ఆ మహారుద్రునికి బలికావిస్తాను.. ఎవడేఅడ్డు వస్తాడో రండి..” అని ఒకడన్నాడు.
అప్పుడే కపర్ది వీర శైవులలోని ఒకతన్ని పట్టి చూపాడు.
“వేరే ఎవరో వద్దు. ఇదిగో ఇతడు మీ పాటలకు, మీ ప్రవచనాలకు ఉత్తేజితమై నాలుకను ఆ శివునికి సమర్పించుకున్నాడు. ఇతడొక చాకలి. ఇంటింటికీ తిరిగి బట్టలు సేకరించి ఉతికి ఇస్తాడు. ఇప్పుడు మాట్లాడలేడు. దాంతో ఈయన వృత్తి బాగా దెబ్బతిన్నది. ఇతని కుటుంబం పరిస్థితి ఏవిటి కవివర్యా?.. ఎవరైనా అతని కుటుంబానికి సహాయం చేస్తున్నారా? అదుగో అతడు కాలు సమర్పించు కున్నాడు. ఇక్కడే మీ పాటలతో ఉత్తేజితులై ఎందరో తమ ప్రాణాలను ఆ శివుని అర్పించు కున్నారు. శ్రీశైలం వెళ్లి ఆ కొండ మీది నుంచి దూకి అత్మా ర్పణం చేసుకున్నారు. ఆ యా భక్తుల కుటుంబాల పరిస్థితి ఏవిటి.. చెప్పండి.. మీరేన్నడైనా వారి కుటుంబాల గురించి ఆలోచన చేశారా..??”
ఆయన మాట్లాడలేదు. ఎవరో మాట్లాడబోతే ఆయన చేయెత్తి వారించాడు.
అప్పుడే కపర్ది కదిలి వేగంగా చురుగ్గా వెళ్లి నీలకంఠమయ కంఠానికి చురకత్తి ఆనించాడు.
“ఈ వీరశైవులు ఇంతలా చెలరేగిపోవడానికి నీలాంటి కవులే కారణం. అందుకే నిన్ను ఆ శివునికి బలి ఇస్తే ఈ చుట్టుపక్కల నీ వల్ల జరిగే హత్యలు ఆగిపోతాయి.. ఏమంటావు మహాకవీ??”
వీరశైవులంతా ఒక్క ఉదుటన కపర్ది మీదికి దూకారు.
నీలకంఠమయ ఓ చేయి ఎత్తి కపర్దిని చుట్టు ముట్టిన వీరశైవులను ఆపాడు. రెండు చేతులు జోడించి కపర్దికి నమస్కరించాడు.
* * * *
తెలుగుచోడ రాజ్యం, సింహపురి పట్టణం.. పెన్నానదీతీరం.
పెన్నమ్మ ఏవో గాలిపాటల రాగాలు తీస్తూ హుందాగా.. మృదువుగా సాగిపోతోంది.
పెన్నమ్మకు దగ్గరగా మహాకవి తిక్కనామాత్యుని పండితారామం. పొందికైన ఉద్యానవనంలా ఉన్న ప్రాంగణంలో వివిధ ఫల పుష్పజాతి వృక్షాలు, చెట్లు, తీగెల మధ్యగా దాదాపు పది భవంతులు. రాజనగరిలా అలరారుతున్న ఓ బ్రాహ్మణ అగ్రహారం అది. ఓ భవంతిలో కవులు, పండితులు సాహితీ సేద్యం చేస్తుండగా.. మరో భవంతి ముందు రైతులు ఎడ్లబళ్ల నుంచి పెరిక బస్తాలు దింపి కోష్టాగారంలోకి చేర్చుతుండగా.. మÖలగా ఉన్న మరో భవంతి వద్ద కొందరు పెన్న రేవు నుంచి కావిళ్లతో తెచ్చిన నీళ్లు పెద్ద పెద్ద కంచు, ఇత్తడి, మట్టి గుండిగల్లో పోసి మళ్లీ నదివైపు పోతున్నారు కబుర్లు చెప్పుకుంటూ. ఆవలగా అనేక మంది స్త్రీలు దంపుడు పాటలు పాడుతూ వడ్లు దంచుతుండగా మరి కొందరు..పేడ, మట్టి కలిపి ఇంటిలోపలి నేలకు లోపలా బయటా గోడలకు అలుకుతున్నారు. అలికిన తడినేలపైనా, గోడలపైనా మరి కొందరు ముగ్గుతో రంగవల్లులు దిద్దుతున్నారు.
అందరి వెనగ్గా వంట భవంతి నుండి పైకి లేచిన పొగ ఆవలగా కనిపిస్తోన్న పెన్నమ్మ తోయ మాలికలను పలుకరిస్తోంది. ఆ రెండు, మÖడు మందిరాలలో స్త్రీలు చేస్తున్న వంటింటి పనిపాటలను పర్యవేక్షిస్తోంది జానమాంబ, తిక్కనామాత్యుని ధర్మపత్ని. ఆమె ఎక్కడున్నా ఎదురు భవంతి మొదటి అంతర్వులో తిరుగాడుతూ కనిపిస్తున్న భర్త చూపులతో చూపు కలుపుతూనే ఉంటుంది.
మొత్తం ప్రాంగణంలో జరుగుతున్న ప్రతి చర్యను తన సాహితీభవనం మొదటి అంతర్వునుండి నాలుగుమÖలలా తిరుగుతూ పర్యవేక్షిస్తూ.. లోలోన ఆంద్ర మహాభారత రచన రాత్రి ఎక్కడ ఆపామో.. ఆ తర్వాత ఏమి రాయాలో ఆ పద్యాలను చందోబద్ధంగా అమర్చుకుంటూ కూడా ఆయన భార్య చూపులతో చూపు కలుపుతూనే ఉన్నాడు.
పేరుకు తిక్కనామాత్యుడు పండితుడు. విక్రమసింహపురి రాజ్యానికి మహా ప్రధానిగా అందరికి తెలిసినా ఆయనకు ఓ పూర్తి మండలేశ్వరు నిస్థాయి వ్యవస్థ ఉంది. పటిష్టమైన శిష్య ప్రశిష్యుల బృందం, ఏ రాజ్యంతోనూ ప్రత్యేక సంబంధం లేకుండా.. మొత్తం తెలుగు రాజ్యాలలోని గ్రామ సమయశెట్టిలలో, వణిజులలో ఆయన అనుయాయు లున్నారు. ప్రస్తుతం తెలుగు భాషావాదుల బృందం కూడా పటిష్టంగా ఆయన వెంట ఉంది. ఏ రాజ్యానికి వెళ్లినా అపూర్వమైన రాజ గౌరవాలే కాక అతి సామాన్యులు కూడా ఆయనను అమితంగా ఆరాధిస్తారు. ఆయన సాహిత్యం తెలియని వారు కూడా ఆయనను ప్రేమిస్తారు. అందుకు కారణం ఆయన పండితుల్లో పండితుడు.. సామాన్యుల్లో సామాన్యుడు. మహారాజులకు ఆయనంటే ఎంత గౌరవమో సాధారణ గ్రామీణుడు కూడా తిక్కనా మాత్యుడు అనే పేరు చెవిన పడగానే వినమ్రంగా వంగి నమస్కరిస్తాడు.
నిజానికి ఆయన అజాతశత్రువు. పండితోత్త ముడు. కయ్యానికి కాలు దువ్వితే, ‘సరే.. అయితే నేనూ సిద్ధŠ్దం’ అంటాడు కానీ వెనక్కు తగ్గడు. ఇప్పుడు ఆయనకు పాలకుడు తిక్క భూపాలుడైతే.. అత్యంత నమ్మకస్తుడైన శిష్యుడు కాకతీయ గణపతిదేవుడు. తిక్కభూపాలుడు స్థానిక రాజ్యపాలకుడే కానీ కాకతీయరాజ్య మహామండలేశ్వరుడు గణపతిదేవుడు మొత్తం తెలుగుజాతి సమ్రాట్టు అని ఆయన భావన. ఏ విపత్కర పరిస్థితి వచ్చినా గణపతిదేవుడే దిక్కు అని ఆయన గట్టిగా నమ్ముతాడు.
తిక్కన తన కార్యకలాపాల నిమిత్తం ఓ గూఢచార బృందాన్ని నియమించుకున్నాడు. ఆ బృందం మొత్తం తెలుగురాజ్యాలన్నీ తిరుగుతుంటుంది. ఈ అంచున నెల్లూరు ఉంటే ఆ అంచున అనుమకొండ ఉంది. అటు వెళ్లి గణపతిదేవునికి.. ఇటు వస్తే తిక్కనకు వాళ్లు సమాచారం చేరవేస్తుంటారు.
గణపతిదేవునికి అనేకానేక కార్యకలాపాలు ఉండొచ్చు కాని తిక్కన గూఢచారులు తెచ్చే సమాచారం ఆయనకు ఆసక్తి మాత్రమే కాదు అవసరం కూడా. ఇద్దరి మధ్య ఉత్తరప్రత్యుత్తరాల కోసమే ప్రత్యేకంగా పదిమంది సమాచార భటు లున్నారు. వాళ్లు చెమటలు కక్కుకుంటూ తిరుగుతూ అంచె పద్ధ్దతిలో ఉత్తరాలను అటూ ఇటూ ఇచ్చి పుచ్చుకుంటారు. గొప్ప గురువుకు, మహావీరుడైన శిష్యునికి ఉన్న మానసిక అనుబంధం..అదే మానవ చరిత్ర తొలిపుట నుంచి లిఖితమైన భారతీయ విధ్యా విధానంలోనే కాదు రాజ్యపాలనలో కూడా గొప్ప ప్రభావాన్ని చూపిస్తున్న సంబంధం ఈ గురుశిష్య బంధం.
మరో భవంతి నుంచి బయటకు వచ్చిన శిష్యుడు కేతనభట్టు మెల్లగా మెట్లెక్కి తిక్కనకు దగ్గరగా వచ్చి వినయంగా వంగి పాద నమస్కారం చేసుకుని అక్కడున్న ఆసనంపై కూలబడ్డాడు.
కేతన వేంగీ రాజ్యంలోని వెంటిరాల గ్రామవాసి. తాతల నాటి నుంచి అగ్రహారీకులు, ఉపాధ్యాయులు. కేతన ఇటీవల వెంటిరాల అగ్రహారంలోని గురు కులాన్ని ఘటికగా పునర్నిర్మించాడు. తెలుగురాజ్యాల్లో తొలి ఘటికల్లో ఇది ఒకటి కావడంతో మూలఘటిక అని.. కేతనను మూలఘటిక కేతన.. అని సంబోధిస్తారు. పండితలోకంలో తిక్కనకు ఆంతరంగిక శిష్యుడిగా పేరుపడిన ఆయన…తిక్కన ఆదేశంపై ఇటీవల కుటుంబంతో సహా ఆయనతో నెల్లూరులోనే ఉంటున్నాడు.
“ఏమి.. ఏదో దిగులుగా కనపడుతున్నావ్ కేతనా?” మార్దవంగా పలుకరించింది తిక్కన గాత్రం.
“కరువు.. అని రాజ్యాలన్నీ అల్లల్లాడించి ఆ మహమ్మారి వెళ్లిపోయి, మళ్లీ చెట్లుపుట్టలు చిగురించి మాసాలు కాలేదే.. మళ్లీ వీరశైవ వర్గాలు.. వీరవైష్ణవ వర్గాలు విజృభించాయని మనవాళ్ల సమాచారం గురుదేవా..” అన్నాడు కేతన.
తెలిసిందన్నట్లుగా తల పంకించాడు తిక్కన.
(సశేషం)

మత్తి భానుమూరి