భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


దొండపాటి కృష్ణా

‘‘అన్నయ్యా! బారసాలకు నువ్వూ, వదిన, పిల్లలు తప్పకుండా రావాలి. మొన్ననే సంక్రాంతికి వచ్చాం కదా, ఇప్పుడు కాదంటే కుదరదు. రాకపోయావో.. నా సంగతి తెలుసుగదా..’’ ఒకలాంటి హెచ్చరికతో కూడిన ఆహ్వానం పంపింది చెల్లి మౌనిక.

ఒకరోజు ముందే వచ్చాను.వచ్చినప్పుడు పట్టుమని రెండు రోజులైనా ఉండనని నానమ్మ అలుగుతుంది. అందుకే పలకరించినా ముభావం గానే మాట్లాడింది.ఉద్యోగం లేనప్పుడు అవసరాలు వెంట పడతాయి. ఉపాధి దొరికాక‘నా’ అన్నవాళ్లను కలుసుకోవడానికి వేరే ఎవరి దగ్గరో అనుమతి తీసుకోవాలని ఆమెకు తెలీదు. చెప్తే వినదు.

కాళ్లూ, చేతులు కడుక్కున్నాకే ఇంటి లోపలికి అడుగు పెట్టాలన్నది నా నియమం. పిల్లల క్కూడా అలవాటు చేశాను. వసారాలోకి అడుగు పెట్టగానే అమ్మ కంగారు పడుతున్నట్లు గ్రహించాను. ఎందుకో కూడా ఊహించాను. వద్దనుకున్నా ఆ దృశ్యం కంట పడింది.

పెళ్లిళ్లయ్యాక ఇద్దరక్కలూ చర్చికి వెళ్లడం అలవాటు చేసుకున్నారు. పుట్టింటికి వచ్చినప్పుడు పూజగదిలో దేవుడు ఫొటోలు ఉంటే గడప దాటి లోపలికి అడుగుపెట్ట మని వసారాలోనే కూర్చునేవారు. ఇంటి ఆడపడుచును బాధ పెట్టకూడదని అక్కవాళ్లు వచ్చినప్పుడు పూజగదిలో ఉండాల్సిన ఫొటోలను బీరువాలోకి మార్చుతుంది అమ్మ. హైదరాబాద్‌ ‌నుంచి వచ్చినప్పుడు మేం బాధపడకూడదని బీరువాలోని వాటిని పూజగదిలోకి చేర్చుతుంది. నేను ఉన్నా, లేకున్నా పూజగది నుంచి దేవుని ఫొటోలు తీయెద్దంటే అమ్మ వినదు. ఇలా ఫొటోలు మార్చడం నా కళ్లముందే జరగడంతో భరించరాని బాధ కలిగింది.

‘‘ఏమ్మా!అక్కోళ్లు వెళ్లగానే మార్చొచ్చు కదా.. నా ముందే చేయాలా?’’ విసుక్కున్నాను.

‘‘మీతో ఎలారా ఏగేది? పేగు చించుకుని పుట్టినోళ్లే రెండు దారులయ్యారు’’ అందామె.

అమ్మ కదా.. అందరికీ సమానమైన ప్రేమను పంచే మాతృమూర్తి..మళ్లీ ఆమెను నేను ఇంకో మాట అని..గడ్డాలొచ్చిన బిడ్డల మాటలు తట్టుకోలేక ఆమె బాధ పడి..నేను ఓదార్చి..అత్తయ్యను ఎందుకు బాధపెట్టారని అక్షర నన్ను చూపుల్తో తిట్టి.. ఇదంతా ఎందుకులే అనుకుని చెల్లిని చూసొద్దామని వీధి గుమ్మం ఎక్కాను.

‘‘అలివేలూ.. అలివేలూ..ఉన్నావా?’’ మోపెడ్‌ ‌మీద కూర్చొన్న పెద్ద మనిషి పిలిచాడు.

అతను తెల్లటి చొక్కా,ప్యాంటు ధరించాడు. దుస్తులు తెల్లగా ఉండటంతో ఆయన నలుపన్న సంగతి చక్కగా తెలుస్తోంది. జుట్టు కూడా ఆయన దుస్తుల్లాగానే మెరిసిపోతుంది. చక్కగా పాపిడి తీశాడు. మీసాలు దిట్టంగా, సూటిగా మొనదేలి ఉన్నాయ్‌. ఎత్తు ఐదున్నర అడుగులు. వయస్సు యాభై పైనే ఉండొచ్చని ఇట్టే చెప్పెయ్యొచ్చు. మోపెడ్‌ ‌హ్యాండిల్‌ ‌కింది భాగంలో చిన్న బ్యాగు తగిలించాడు. అందులో ఏదో పుస్తకం ఉన్నట్లనిపించింది. స్పష్టంగా కనిపించలేదు. ఆయన్ని అంతకుముందు ఎక్కడో చూసినట్లు గుర్తుస్తోందిగానీ పేరే గుర్తు రావట్లేదు. మా ఇంటి ఎదురుగా ఉంటోన్న అలివేలు వదిన్ని మళ్లీ పిలిచాడతను.

నేనే కల్పించుకుని,‘‘వదిన లేనట్లుందండి.. వచ్చాక చెప్తాను’’ అన్నాను. అతను నావైపు తీక్షణంగా చూశాడు.

ఏదో గుర్తొచ్చినట్లు,‘‘ఈ ఇంటి గోవర్ధనరావు నీకేమవుతాడు?’’ మా ఇల్లు వంక చూశాడు.

‘‘మా నాన్నగారండి..’’ అన్నాన్నేను. ఊహ తెలిసిన దగ్గర్నుంచి చదువు పేరుతో, ఉద్యోగం పేరుతో స్వగ్రామానికి దూరంగా ఉంటుండటంతో ముఖపరిచయాలు తక్కువ.

‘‘నువ్వూ.., ప్రార్థనా…’’ అర్ధోక్తిగా ఆగిపోయా డతను.

ఆయన అంతరంగమేమిటో అర్థమై,‘‘నేను హిందువునండి..’’ ఖరా ఖండిగాచెప్పాను.

మాపేటలోని జనమంతా బెల్లం చుట్టూ మూగే చీమల్లా చర్చికి వెళ్తుండటంతో అప్పుడప్పుడు నాకిలాంటి ప్రశ్నలు ఎదురవుతుంటాయి.

‘‘రాయుడుగారి స్థలంలో మూడు రాత్రులపాటు స్వస్థత కూటములు పెడుతున్నాం.నువ్వూరా..’’ ఆహ్వానించాడతను.

‘‘నేను రానండి..’’ గ్యాప్‌ ఇవ్వకుండా చెప్పాను. ఇతనే కాదు… ఎవరొచ్చి అడిగినా ఇదే నా సమాధానం. అందులో ఇసుమంతైనా మార్పుండదు.

‘‘ఒకసారొచ్చి వింటేనే కదా ఇందులోని మంచి ఏంటో తెలుస్తుంది’’ అన్నాడతను.

‘‘ఆల్రెడీ విన్నానండి. నాకు హిందూ మతమే నచ్చింది. ఇంకెక్కడికీ వెళ్లను, గుళ్లకే వెళ్తాను.’’ చెప్పాను. అంత దీటుగా చెప్పడం నచ్చలేదను కుంటా..అతని మొహం కందగడ్డలా మారింది. అటుఇటు చూశాడు.

నా అభిప్రాయాన్ని అక్కడెవరూ వినలేదని నిర్ధారించుకున్నాక, ‘‘నీకు చెప్పినోళ్లేం చెప్పారో, ఎలా చెప్పారో..’’ అన్నాడు.

‘‘ఎవరేం చెప్పినా సారం ఒకటే కదండీ..’’ అతనికి ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా వెంటనే అన్నాన్నేను.

‘‘అందుకే రమ్మంటున్నాను. ఎంత మంది మారారో చూడు. మీకూ మంచే జరుగుతుంది.’’ పేట జనాన్ని ఉద్దేశిస్తూ ఆయనన్న మాట గుండెల్లో కలుక్కుమంది. ‘‘కన్నవాళ్లను ఎవరో మార్చుకున్నారని నేను మార్చుకోలేనండి..’’ పరోక్షంగా నేనన్న మాట గునపంలా దిగినట్లుంది.

‘‘నచ్చిన దేవుణ్ణి ఆశ్రయించడం తప్పు కాదే.. వీలైతే ఈ రాత్రి ప్రార్థనకు రా..’’ మొహం బిగబట్టి బండి స్టాండ్‌ ‌తీశాడు.

అప్పుడే అలివేలు వదిన వచ్చింది. ఆమె అప్పుడక్కడికి రాకపోయి ఉంటే ఏం జరిగుండేదో..

ఆయన్ని చూసి, ‘‘అయ్యగారూ.. మీరా… రండి, రండి..’’ అంటూ లోపలికి ఆహ్వానించింది.

‘‘ఏమీ లేదు అలివేలూ… రేపట్నుంచి కూటములు పెడుతున్నాం కదా… మళ్లీ గుర్తు చేద్దామని.. మీవోళ్లకి చెప్పావా?’’ మోపెడ్‌ ‌హ్యాండిల్‌కి తగిలించిన బ్యాగులోంచి బయటకు తీశాడు..బైబిల్‌..

‌దాన్ని చంకలో పెట్టుకుని వదిన్ని అనుసరిం చాడు. కానీ,ఇంటి లోపలికి వెళ్లలేదు. వదిన కుర్చీ తీసుకొచ్చి వేసింది. అతను అందులో కూర్చోలేదు. లోటాతో మంచి నీళ్లు ఇచ్చింది వదిన. అతను అందుకోలేదు. ఇది అలవాటేనన్నట్లు లోటాను పక్కనే అరుగుమీద పెట్టింది. అతను చంకలో నుంచి బైబిల్ని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. వెంటనే వదిన పైటకొంగును తల చుట్టూరా కప్పుకుంది. అతను కళ్లు మూసుకుని, తల పైకెత్తి ప్రార్థన మొదలెట్టాడు. వదిన తల దించుకుని దేవుణ్ణి స్తుతించింది. ఒక నిమిషంలో ప్రార్థన పూర్తయ్యింది. అవగానే లోటా నిండా బియ్యం నింపి, అందులో యాభై రూపాయల కాగితం పెట్టి ఇచ్చింది వదిన. ఆనందంగా స్వీకరించాడతను.

ఇంట్లోంచి నాన్న ఫోన్‌ ‌రింగయ్యింది. ‘నారాయణ నారాయణ అల్లా అల్లా / మా పాలిటి తండ్రీ మీ పిల్లలమేమెల్లా’ పాట వినిపించింది. స్మార్ట్ ‌ఫోన్‌ ‌కొన్న దగ్గర్నుంచి కృష్ణశాస్త్రిగారు రాసిన ఆ పాటే నాన్నగారి రింగ్‌ ‌టోన్‌! అక్షర బయటకొచ్చింది. కర్ర పోటు వేసుకుని నానమ్మ కూడా జత కలిసింది.బాబాయ్‌ ఇం‌టికి బయల్దేరాము.

* * *

మెయిన్‌ ‌రోడ్డుకి ఒకవైపు మా ఇల్లు, ఇంకోవైపు బాబాయిగారి ఇల్లు. వాళ్లది రోడ్డు నుంచి ఇరవై మీటర్ల దూరం ఉంటుంది. మెయిన్‌ ‌రోడ్డుకు వెళ్లేసరికి పుష్ప సినిమా నుంచి ‘కిస్‌, ‌కిస్‌ ‌కిసుక్కు’ పాట హోరెత్తేలా వినపడింది.

గుమ్మం దాటి లోపలికి వెళ్లాం. నానమ్మ సరాసరి వసాట్లో ఉన్న మంచం దగ్గరికి వెళ్లింది. అక్షర మాత్రం బావి దగ్గరికెళ్లి కాళ్లు కడుక్కుంది. కళ్లు కడుక్కుంది. దోసిట్లోకి నీళ్లు తీసుకుని తల చుట్టూ మూడుసార్లు తిప్పింది. వాటిని తలపై జల్లుకుంది. చుట్టింటి నుంచి అదంతా చూసిన మా రోజీ పిన్ని మొహం మాడ్చుకుంది. అక్కడ్నుంచి లేచి చెల్లెలు మౌనిక దగ్గరకు వెళ్లింది. పొత్తిళ్లలోని బిడ్డను అక్షర తీసుకుంటుంటే పిన్ని వద్దంది.

‘‘దూరాబారం మీదొచ్చారు కదా… పసిబిడ్డను కాసేపయ్యాక ఎత్తుకుందువు గానిలే..’’ పిన్ని అనడంతో అక్షర నొచ్చుకుంది.

కోడలితో పిన్నికేం గొడవలు లేవు. అక్షర తల్లో పూలు పెట్టుకుంటుంది. పిన్ని పెట్టుకోదు. అక్షర బొట్టు పెట్టుకుంటుంది. పిన్ని పెట్టుకోదు. అక్షర గాజులు, పట్టీలు, మెట్లు వేసుకుంటుంది. పిన్ని వాటన్నింటిని దగ్గరకు రానివ్వదు. అక్షర శ్లోకాల్ని మననం చేసుకుంటుంది. పిన్ని బైబిల్‌ ‌చదువు తుంటుంది. మెడలో పుస్తెల తాడు ఒక్కటే ఇద్దరికున్న సారూప్యత. బాబాయ్‌ ‌గొడవ చేయకుండా ఉండాలే గానీ పిన్ని దానికీ స్థానభ్రంశం కలగజేస్తుంది.

కుర్చీలో కూర్చుని పనుల్ని పర్యవేక్షిస్తున్నాడు బాబాయి. వేపచెట్టు కింద కుర్చీ వేసుకుని ఫోన్లో మాట్లాడుతున్నాడు బావ. రేపటి కార్యక్రమం గురించి చర్చలు నడుస్తున్నట్లున్నాయి. పలకరించాను. ఫోన్‌ ‌పక్కన పెట్టేసి కార్యక్రమ వివరాలు చెప్పాడు.

‘‘ఏం బావా?స్టేజీని ఇలా అడ్డంగా రెడీ చేసారు. గుమ్మంవైపు కదా ఉండాలి..’’ సందేహమొచ్చి అడిగాను.

‘‘వాస్తు ప్రకారం అక్కడైతేనే బాగుంటుందని పాస్టర్‌ ‌గారు చెప్పారు బావా..’’ అన్నాడు.

‘‘పాస్టర్లు వాస్తు కూడా చూస్తారా?’’ నా మాటకు నొచ్చుకున్నాడేగానీ నోరు విప్పలేదు.

‘‘ఉదయం ఎనిమిదింటికి ముహూర్తం..లేట్‌ ‌చేయకుండా వచ్చెయ్యండి బావా..’’ చెప్పేసి పనిలో నిమగ్నమయ్యాడు.

మతం అంటారు. మళ్లీ వాస్తులు, ముహూర్తాలు అంటారు. ఇలా అన్ని మతాల్లోనూ ఉంటాయేమో నాకైతే తెలీదు. మౌనం వహించాను. పిన్ని, అక్షర కబుర్లలో పడ్డారు. ఒకరి పద్ధతులు ఒకరికి నచ్చవు గానీ ప్రవర్తనలైతే నచ్చుతాయి. కలిసిపోతారు. పాపతో కాసేపు గడిపాము. నానమ్మ అక్కడే ఉంటానంది. నేను, అక్షర బయలుదేరాం. రోడ్డుమీద, అభయాంజనేయ స్వామి వారి దేవస్థానపు అరుగు మీద కూర్చుని ఆ‘పెద్దాయన’ ఎవరితోనో మాట్లాడు తున్నాడు.

‘‘మీరంతా ఈ దేవుడినే నమ్ముకున్నారు. ఈ గుళ్లో పూజలు జరిగి ఎన్నాళ్లయ్యిందో చెప్పు? ఆంజనేయుడితోపాటుగా రాముడు, లక్ష్మణుడు, సీత, వినాయకుడి విగ్రహాలు పెట్టారు.వీళ్లెవరూ మిమ్మల్ని ఆదుకోరు.నా మాట

ఇను.ఏసయ్యను నమ్ముకో.. ఆత్మను శుద్ధి చేసుకో.. రేపు రాత్రి రాయుడిగారి స్థలంలో పెట్టే కూటమికి రా..’’ పెద్దాయన చెప్తున్నాడు.

ముసలాయన..రోజూ వినే భాగవతమే కదా అన్నట్లు ఒక చెవితో వింటూ ఇంకో చెవితో వదిలేస్తున్నాడు. తను వినడం లేదని పెద్దాయన కనిపెట్టకూడదని మధ్యమధ్యలో ‘ఊ’ కొడుతున్నాడు. రోజుల్ని వెనక్కి తవ్వగా, తవ్వగా ఆ పెద్దాయనెవరో ఇప్పుడు గుర్తొచ్చింది. ఆయన పక్కూరి వీరాచౌదిరి.

* * *

‘‘నాన్నా.. ఇందాక రోడ్డుమీద నాతో మాట్లాడింది వీరాచౌదిరి కదా..’’ అడిగాను. అవునన్నట్లు తలూపాడు నాన్న.

‘‘వాళ్ల కులదైవం ఏడుకొండలవాడు కదా.. మరేంటిప్పుడు..?’’ తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది.

‘‘డబ్బు చేసే మాయ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు మన పేట వాళ్లు ఆళ్ల అండదండలతో బతుకీడ్చేవారు. చుట్టుపక్కల ఫ్యాక్టరీలొచ్చాక కూలి పనులు మానుకున్నారు. ఆళ్ల మాటకు విలువ తగ్గింది. మనరేమల్లె, సింగన్నగూడెం, మల్లవల్లి, వేలేరులకు న్నది ఒక్కడే పాస్టర్‌ ‌శామ్యూల్‌.ఆ ‌పాస్టర్‌ ‌మొదట్లో చిన్న స్కూటర్‌ ‌మీదొచ్చేవాడు. ఇప్పుడు పెద్ద కారులో వత్తన్నాడు. మనకులపోడు హుందాగా ఆళ్ల ముందే తిరుగుతుంటే కన్ను కుట్టింది.

ఈ వీరాచౌదిరి డబ్బు మనిషాయే.. పీనాసోడని అందరికీ తెలిసిందే. ఆయన పిల్లలిద్దరూ పరాయి దేశంలో ఉన్నారు. అంత పెద్ద ఇంట్లో భార్యతో ఉంటాడు.ఆళ్లిద్దరికీ పాలేరు ఎందుకని.. ఆ డబ్బులు కూడా కలిసొత్తాయని ఆణ్ణి తీసేసి చాకిరంతా ఆయనే చేత్తన్నాడు. అలాంటోడికి పిండికొద్దీ రొట్టెలాగా డబ్బులు వచ్చి పడతాయని తెలిత్తే ఆగుతాడా?

ఒకరోజు ఇంటిముందు ఖాళీ స్థలంలో పాక కట్టాడు. దేవుని బొమ్మలు పెట్టాడు. శిలువను నిలబెట్టాడు. జనాన్ని పోగేశాడు. ఆళ్ల చేతుల్లో బైబిల్పెట్టాడు. ఆ ఫొటోలు సంఘానికిపంపాడు. పై వోళ్లు వచ్చి చూశారు. అది నిజమేనని రిపోర్ట్ ‌రాశారు. ఆయన్ని పాస్టర్‌గా ఉండమని చెప్పి డబ్బులు పంపారు. జనం పెరిగితే డబ్బులూ పెరుగుతాయనీ చెప్పారు. సంకోచం లేకుండా అన్య మతాన్ని స్వీకరించాడు.ఆరోజు నుంచి అందర్నీ ప్రార్థనకు రమ్మని అడుగుతున్నాడు. కూటములు పెడుతూ జనాన్ని పోగేస్తున్నాడు’’తానువిన్నది, కన్నది, చూసింది కలగలిపి చెప్పాడు నాన్న.

‘‘మరి, నిన్నుఅడగలేదా?’’ కుతూహలం కొద్దీ అడిగాను.

కారణం, నాన్న చర్చిలోంచి వచ్చే బైబిల్‌ ‌వాక్యాలు వింటాడు. పాస్టర్‌ ఏదన్నా చెప్తుంటే నవ్వుతూ తలూపుతాడు.పాస్టర్‌ ఎన్నిసార్లు ఇంటికొచ్చినా మర్యాద చేస్తాడు. చందా అడిగితే కాదనకుండా, లేదనకుండా ఇస్తాడు. ఆయన మతం మారాడేమోనన్న చిన్న సందేహంతో అడిగాను.

‘‘ఒకరోజు ఆ వీరాచౌదిరి ఓ గంటసేపు బుర్ర తిన్నాడు. ఎప్పట్నుంచి వత్తావని అడిగాడు. ఆయన చెప్పింది ఒక్క ముక్క అర్థం కాలేదన్నాను. కనిపించి నప్పుడల్లా అడగడం మానలేదు. అర్థమయ్యాక వస్తాననిఅంటూనే ఉన్నా..’’ చెప్పాడు నాన్న.

మనసు స్థిరంగా ఉన్న మనిషిని దేవుడుకూడా కదిలించలేడేమో! నాన్న రింగ్‌టోన్‌ ‌గుర్తు తెచ్చుకునైనా ఈ ప్రశ్న అడక్కుండా ఉండాల్సింది.

* * *

అలంకరణలతో వేదిక శోభిల్లుతోంది. నేను, అక్షర ముహూర్తానికి అక్కడున్నాం. అప్పటికే వీరాచౌదిరి వచ్చేశాడు.‘కలములతో రాయగలమా! కవితలతో వర్ణించగలమా’ అనే పాట వినిపించింది. పాట చాలా బాగుంది. ఎప్పుడూ విన లేదు.

పక్కనే ఉన్న పాపని, ‘‘ఈ పాట ఏ సినిమా లోది?’’ అని అడిగాను. ఆమె నావంక అదోలా చూసింది.

‘‘ఇది యేసయ్య పాట..’’కోపంగా అరిచినట్లు చెప్పింది. దేవుడి పాటను సినిమా పాట అనుకోవడం ఆమెకు కోపం తెప్పించినట్లుంది. ఆ పాట అవ్వగానే ‘షారోను రోజావే..నా ప్రాణ స్నేహమే’ అనే పాట వినిపించింది. ఈసారి ఆ పాపని అడగలేదు. నిన్న సినిమా పాటలు మార్మోగితే నేడు దేవుని పాటలు స్వస్థత మార్గంలో ఓలలాడిస్తున్నాయి.

బాబాయ్‌, ‌పిన్ని హడావిడిగా ఉన్నారు. అత్తగారు పాపను ఎత్తుకుంది. మామగారు పనులు పురమాయి స్తున్నారు. బావగారు వీరాచౌదిరితో మాట్లాడు తున్నాడు. చెప్పిందానికి తలూపుతూ ‘ఊ’ కొడుతోంది చెల్లెలు. నాన్న ఓ పక్కన కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. అమ్మ పిన్నికి సాయం చేస్తోంది. వాళ్లకు తోడుగా ఉంది అక్షర. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో కనిపెట్టు కుంటూ ముహూర్తం వంక చూస్తున్నాను, నిజంగానే ఆ సమయానికి ప్రారంభిస్తారా లేదా అని!

మైకులో వచ్చే పాటల్ని ఆపమని వీరాచౌదిరి సైగ చేశాడు. ఫోన్‌ ‌చూశాను. సమయం ఉదయం ఎనిమిది గంటల మూడు నిమిషాలయ్యింది.

‘‘దైవప్రార్థన చేసుకుందాం. అందరూ తల దించుకుని, కళ్లు మూసుకోండి..’’ చెప్పాడు వీరాచౌదిరి.

మగవాళ్లు కళ్లు మూసుకున్నారు. చేతులు రెండింటిని కలిపి పట్టుకున్నారు. వాటిని నాభిపై పెట్టుకుని నిలబడ్డారు. నాన్న మాత్రం ఏమీ స్పందించకుండా అలానే కుర్చీలో కూర్చున్నాడు. ఆడవాళ్లూ కళ్లు మూసుకున్నారు. పైట కొంగుల్ని తలపై కప్పుకున్నారు. ఒక చేత్తో బైబిల్‌ ‌పట్టుకుని నిలబడ్డారు. వాళ్లల్లో అమ్మ కూడా ఉంది. అక్షరకాస్త దూరంగా కూర్చొని చూస్తోంది.

‘‘మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామముతో ప్రార్థన మొదలు పెట్టుదాం’’ అంటూ ప్రార్థన మొదలైంది.ఆ ప్రార్థనలోనే పాపకు ‘లహరిక’ అనే పేరుపెట్టారు. కోరికలు కోరుకున్నాక, ‘‘ఆమేన్‌.. ఆమేన్‌.. ఆమేన్‌..’’ అం‌టూ ముగించారు.

మగవాళ్లు కుర్చీల్లో కూర్చున్నారు. ఆడవాళ్లు కళ్లు తెరిచారుగానీ తలపై గల పైట కొంగుల్ని కిందకు దించలేదు.అప్పు ప్రార్థనను ముగించడం మనస్క రించని వారు కాసేపు దేవుణ్ణి స్తుతించుకున్నారు.

ప్యారాచూట్కొబ్బరి నూనె డబ్బాను తీసుకొచ్చి, ‘‘అమ్మా మౌనికా, ఈ యేసు రక్తాన్ని క్రమం తప్పకుండా ‘లహరిక’కు రాయి..రోజూ ప్రార్థన చేయి. ఇదిగో అబ్రహం, నువ్వీ దేవుని బిడ్డను మన నూజివీడు సెయింట్‌ ఆన్స్ ‌స్కూల్‌లోనే చదివించాలి.సరేనా..’’ తగు సలహాలు సూచనలు ఇస్తున్నాడు వీరాచౌదిరి. మైకులో దేవుని పాటలు మొదలయ్యాయి.

వీళ్లందరికన్నా నానమ్మ భిన్నంగా కనిపించింది. అంతమంది ఆనందంగా ఆ ప్రాంగణంలో ఉంటే ఆమె మాత్రం ఏదో పోగొట్టుకున్నదానిలా ముడుచుకుని కూర్చుంది. చేతికర్రను నేలకు రాస్తూ నిట్టూర్పులు విడుస్తోంది.

ఆమె దగ్గరికెళ్లి ‘‘ఏంటి మామ్మ, టిఫిన్తినలేదా? మొహం అలా ఉంది?’’ అడిగాను.

‘‘టిఫినా, పాడా… కాటికి కాళ్లు జాపుకున్నదాన్ని.. తింటే ఎంత..తినకపోతే ఎంత..’’ కాస్త ఘాటుగానే స్పందించింది.

శుభం జరిగేచోట పెదోళ్లు ఇలా అశుభపు మాటలు ఎందుకు మాట్లాడతారో అర్థం కాక, ‘‘ఇప్పుడేమైంది?’’ అడిగాను.

‘‘ఏమైందా? సామూయేలును కాదని ఆ ఈరా చౌదిరిని తీసుకొచ్చారు. బైబులు గురించి ఈడికేం తెలుసని.. ఏవో రెండు ముక్కలు సదివితే సరిపోతుందా? పాటించొద్దా? మన పిల్లల పేర్లూ ఆడే సెప్తాడా? ఎక్కడ సదవాలో కూడా ఆడే చెప్తాడా?మన పద్ధతులు తెలీనోడు మనతో ఎలా కలిసిపోతాడు? మనల్ని ఎలా కలుపుకుంటాడు?’’ అందినానమ్మ.

అలివేలు వదిన మంచినీళ్లు ఇచ్చినప్పుడు అందుకోని పాస్టర్‌, ‌బియ్యం అందుకున్న సంగతి గుర్తుకొచ్చింది. నానమ్మ ఆవేదనలో నిజముంది.నాకు పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఇలాంటి ఆవేదనే అమ్మ దగ్గర చూశాను. పూజలు చేసే అమ్మాయే కావాలని పట్టుబట్టాను.

‘బైబిలు పట్టుకుని చర్చిలకు పోయే మన కులంలో పూజలు చేసేవారు మిగల్లేదురా..’ అని ఒప్పించడానికి అమ్మ, అక్క వాళ్లు ప్రయత్నించారు. నేను వినక పోయేసరికి అమ్మ ఒక మాటంది.

‘ఒరే నాయనా, రాముడూ దేవుడే.. క్రీస్తూ దేవుడే.. కానీ ఆళ్లిద్దరూ మీ కాపురంలోకి అడ్డుగా ఉండకూడదు. నువ్వు చెప్తే వినే అమ్మాయి ఉండాలి. నీకన్నీ చూసి పెట్టాలి. మాట రాకుండా, గుట్టు చప్పుడుగా కాపురం చెయ్యాలి. అలాంటి అమ్మాయి దొరికితే సుఖపడతావ్‌. ‌కాబట్టి అమ్మాయి సుగుణవతో కాదో చూసుకో, చాలు.. ఇంకేం పట్టించుకోమాక..’ అని అంది.

అమ్మ, పిన్ని, నానమ్మల ఆవేదనలన్నీ ఒకవైపున.. తమ వాదాన్ని రుద్దకుండా భరిస్తున్న నాన్న, బాబాయ్ల మనోవేదనలు మరోవైపున పోల్చిచూశాను. మనిషికి, మనసుకి ‘మతం’అనేది అడ్డగీతగా మారుతుందేమో ననిపించింది.

‘నారాయణ నారాయణ అల్లా అల్లా / మా పాలిటి తండ్రీ మీ పిల్లలమేమెల్లా’ అంటూనాన్న ఫోన్‌ ‌రింగయ్యింది. మైకు శబ్దాల్లో రింగ్‌ ‌టోన్‌ను పట్టించుకోలేదెవరూ!

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE