పాతికేళ్లు కారాగారశిక్ష అనుభవించాక విడుదలైన నాగతిస్య అక్కడే అడుక్కుని తింటూ బతుకుతున్నాడు.

అప్పటికే అతని శరీరం శిథి•లమయ్యింది. ఓ గూఢచారిగా అద్భుతమైన ఆలోచన నైపుణ్యం, అమాయకంగా కనిపించే శారీరంపై అదుపు, చురుకైన• బలిష్టమైన ఆకృతి, వాక్చాతుర్యం, సమయ స్ఫూర్తి, దేనికైనా వెనుకాడని నిబ్బరత, కారాగారవాస భయం లేకపోవడం.. ఇన్ని ప్రత్యేకతలు ఉంటేనే శత్రురాజ్యకోటలో గూఢచారిగా ప్రవేశ పెడతారు. అన్ని లక్షణాలతో ఒకప్పుడు ప్రభువుల ఆదరణ కూడా చూరగొన్న నాగతిస్య ఇప్పుడొక చిన్న నల్లని కొండలాంటి ఆకారంతో వంకర కాళ్లతో, కనిపించని చూపుతో ఓ అతిసాధారణ జీవిగా మిగిలాడు. ఎక్కడికి వెళ్లలేడు. ఎవ్వరూ గుర్తించరు.. చెప్పినా కనికరిస్తారని నమ్మకం లేదు. భార్యాపిల్లలు లేరు. స్వగ్రామం అనుమకొండలోని బంధువులు నాగతిస్య ఏమయ్యాడని ఆరా తీసినట్లు తెలియరాలేదు.

ఇక కేవలం దేవగిరి వీధుల్లో అడుక్కోవడమే అతనికి మిగిలిన ఏకైక అవకాశం. అదే చేస్తూ పొట్ట పోషించుకుంటున్నాడు. కుంటుతూ అడుక్కుంటూ తిరుగుతున్నాడు కాబట్టి అందరూ ‘కుంటోడు’ అనే పిలుస్తున్నారు. పేరు ఏవిటి అని అడిగేవాళ్లు లేరు. అడిగితే.. అతడు కూడా కుంటోడు అనే చెబుతాడు.

అయితే నాగతిస్యకు తన జీవితాన్ని పాతాళానికి పంపిన ఆనాటి ముఖ్య సంఘటనలు.. కాకతీయుల మెరుపుదాడి.. దాని అనంతర సంఘటనలన్నీ ఖచ్చితంగా గుర్తున్నాయి.

ముఖ్యంగా ఆనాడు ఆ కోష్టాగారం ముందు పడివున్న కవ్వల శరీరభాగాలు.. ఆమె నిర్జీవ చూపులు.. అవే అవే.. నిరంతరం నిర్విరామంగా అవే కళ్లముందు.. మనసు అంతటా.. అవే అవే!

అప్పట్లో గణపతిదేవుని పట్టి బంధించారని.. ఉరి తీయబోతున్నారని.. ఆఖరి నిమిషంలో వాయిదా పడిందని కూడా విన్నాడు. చివరికి రకరకాల అంశాలు పరిగణనలోకి తీసుకుని గణపతిదేవునికి జైత్రపాల మహారాజు ఏకైక కుమార్తె సోమలదేవినిచ్చి వివాహం జరిపించి గణపతిదేవుని సతీసమేతంగా అనుమకొండ పంపారని విన్నాడు.

గణపతిదేవుని పేరు స్మరిస్తే చాలు.. పొంగి పోతాడు. కాకతీయ మహాప్రభువు ఇక్కడ కారాగారవాసిగా ఉన్నప్పుడు తనే ఆయన రక్షణ బాధ్యత వహించానని.. ఆయన తనను ఆత్మీయ మిత్రుడుగా భావించేవాడని అనుకుంటే చాలు.. వొళ్లంతా పులకింత.. తనకు అంతకంటే ఏమి కావాలి.ఆ తృప్తి చాలు!!

ఆ ఉద్వేగంతో ఓసారి అనిపించింది.. అనుమ కొండ వెళ్లి ఆ ప్రభువును కలిస్తే??

అతని బతుకు చూసి అతనికే నవ్వొచ్చింది. ఉన్నవి రెండు గోచీగుడ్డలు. ఓ చిరుగుల పంచె. ఓ చేతిలో బొచ్చె. మరో చేతిలో కర్ర. కుంటి నడక.. గుడ్డి చూపు. అసలు అనుమకొండ కోటలోకి ప్రవేశమే దొరకదు. ఇక మహాప్రభువును చూసే భాగ్యం ఎలా కలుగుతుంది.?!!

చూస్తే మాత్రం ఆ బంగారుతండ్రి తనను గుర్తిస్తాడు. కళ్లనిండా నీళ్లు నింపుకుంటాడు. నాగతిస్యా! బాగున్నావా అంటాడు.. హత్తుకుంటాడు. పంచభక్ష్య పరమాన్నాలు పెట్టి పట్టుబట్టలతో సత్కరిస్తాడు. గ్రామాలా.. భవనాలా.. మడులా మాన్యాలా ఏమి కావాలి అని అడుగుతాడు.

కాని కాని ఆయన, ‘నాగతిస్యా.. నా కవ్వల ఏది.. ఏమైంది’ అని అడిగితే తను ఏమి సమాధానం చెప్పాలి.. ప్చ్.. ఏ ‌చెట్టుకో జేరగిలబడి కుళ్లికుళ్లి ఏడుస్తాడు.

ఆకలి వేస్తే వీధుల వెంట బిచ్చమెత్తుకుంటాడు. ఏ అమ్మో గుప్పెడు మెతుకులు వేస్తే ఎక్కడో కూర్చుని తింటాడు. కూర్చున్నా, నిలుచున్నా, పడుకున్నా అవే దృశ్యాలు.. కవ్వల నిర్జీవ శరీర భాగాలు!!

అడుక్కుని తినే అందరు సంచార బిచ్చగాళ్లలాగే సంధ్యవేళకు మెల్లమెల్లగా కోట ప్రాంగణం బయట దట్టంగా ఓ మాదిరి అడవిలా పెరిగిన చెట్ల క్రిందకు చేరతాడు. ఎవ్వరి వంకా చూడకుండా మెల్లగా ఓ చెట్టుకు జారగిలబడతాడు. ఒంటరిగా ఉండటమే ఇష్టం. కాని దేవగిరికోటలో, అనుమకొండ కోటలో ఏమేమి జరుగుతున్నాయో.. నిద్ర వచ్చేవరకు బిచ్చగాళ్లు కబుర్లు చెప్పుకుంటుంటారు. అవి వినడం ఇష్టం.

కాసేపటి తర్వాత వాళ్లకు దూరంగా మరో చెట్టు కింద పడుకుంటాడు.

అందరూ నిద్రపోతున్నా ఒక్కడే మేల్కొని కోటపై నడిచే కాపలాదార్లను, కదిలే కాగడాలను చూస్తూ.. గాలిలో తేలివచ్చే వారి మాటల సవ్వడి, నవ్వుల అలికిడి వింటూ ఎప్పుడో నిద్రలోకి జారుకుశీటాడు.

ఏ రాత్రి వేళో చటుక్కున మెలకువ వస్తుంది మళ్లీ నిద్ర పట్టదు. అప్పుడు లేచి కోట ప్రహరీ వద్దకు వెళతాడు. కోట లోపలికి వెళ్లి ఆ కోష్టాగారాన్ని చూడాలని ఏదో వెర్రి ఆవేశం కలుగుతుంది.

ఎలా వెళ్లడం?!

తీవ్రమైన కోరిక మార్గాన్ని చూపుతుంది.

యోజనాల కోట ప్రహరి మొత్తంగా చుట్టూ తిరిగి మొత్తంగా జాగ్రత్తగా పరిశీలించి చూశాడు. రక్షణ కోసం కోట ప్రహరి చుట్టూ అగడ్తలు, లోతైన నీటిలో మొసళ్లు ఉంచుతారు. రాజ్యానికి శత్రుభయం లేనప్పుడు మహరాజుల్లో, కోటరక్షణ చూసే దండనాయకుల్లో ఈ రక్షణవ్యవస్థ పట్ల జాగ్రత్తలు తగ్గి ఉదాసీనత ఎక్కువౌతుంది. ఇప్పుడూ అదే పరిస్థితి. మొసళ్లు చచ్చి చాలా కాలామయ్యింది సరికదా నీళ్లు కూడా నింపడం లేదు. అగడ్తల నిండా మట్టి, రాళ్లు పేరుకు పోయాయి. కుంటోడులాంటి బిచ్చగాడు ప్రహరీ వద్ద కూర్చున్నా పడుకున్నా పైనున్న కాపలాభటులు చూసి చూడకుండా వదిలేస్తున్నారు.

అదే నాగతిస్యకు వరమయ్యింది.

అర్ధరాత్రుల వేళ మౌనంగా ఎవరికీ సందేహం కలగకుండా ప్రహరీ మొత్తం రాయి రాయి తడిమి చూశాడు. ఎక్కడో చిన్నరాయి ఊడి కనిపించింది. రోజూ ఆ దగ్గరగా పొడుకుంటూ.. అనేక రాత్రుళ్లు కొద్ది కొద్దిగా రాళ్లను కదపసాగాడు. అలా కొంతకాలా నికి ఓ రహస్య మార్గాన్ని సృష్టించుకున్నాడు. అప్పటి నుంచి ప్రతి రాత్రి ఆ రాళ్లను తొలగించుకుని లోపలికి వెళతాడు.

కోష్టాగారాన్ని, కొన్నేళ్లు గడిపిన కారాగారాన్ని తడిమి చూసుకుంటాడు. కవ్వల శరీర భాగాలు ఇంకా అక్కడే ఉన్నట్టుంటుంది. ఆమె నిర్జీవ నేత్రలు తనతో వాదనకు దిగినట్లుంటుంది. ఆమెకు తను తప్పు చేసినట్లు చెంపలు వేసు కుంటాడు. ఏవేవో మాటలు అల్లుకుని చెప్పుకుని మెల్లగా బయటకు వస్తాడు.

ఇలా దాదాపు నిత్యమూ.. పాతికేళ్లుగా చేస్తున్నాడంటే ఎవ్వరూ నమ్మరు. కానీ నిజం.

రానురానూ నాగతిస్యకు అనుమకొండ పోవాలనే కోరిక పుట్టి వటవృక్షంలా పెరుగుతోంది. మహారాజు గణపతిదేవుని చూడటం, కలవడం అలా ఉంచి ఆయన పాలనా రాజధాని.. పైగా తన స్వగ్రామమైన అనుమకొండలో తిరుగా డుతూ అక్కడ అడుక్కుని బతకడం.. గొప్ప ఆనందమని భావించ సాగాడు.

దానికి కారణం తోటి బిచ్చగాళ్లు అనుమకొండ గురించి.. అక్కడి బిచ్చగాళ్ల అద్భుత జీవనం గురించి కథలు కథలుగా చెప్పుకోవడం వింటూ తానూ కూడా అక్కడ బతకాలన్నవాంఛను పెంచుకున్నాడు. ఒక చోట బిచ్చగాళ్లకు కొత్త బట్టలు ఇస్తున్నారని తెలిసి వెళ్లి ఓ రెండు పంచెలు తెచ్చుకున్నాడు. కొత్త పంచె కట్టడంతో నడక కూడా కొంత మారింది. నిస్తేజంగా బతకడం తగ్గింది. ఉత్సాహం హెచ్చింది.

ఇవ్వాళో రేపో అనుమకొండకు వెళ్లిపోవాలని ప్రయాణం పెట్టుకున్నాడు కాని ఇంతలో అనుకోని దృశ్యం కంట పడింది.

ఒకరోజు వీధిలో అడుక్కుంటూ పోతుండగా ఓ పల్లకిలో ఓ రాచయువతిని చూశాడు.

ఆమెను గుర్తించగానే మతిపోయింది.

ఆమె కవ్వల!

అంతే!! నాగతిస్య జీవితం మరో మలుపు తిరిగింది.

* **

ఆ రోజు అర్ధరాత్రి ఎప్పటిలాగే ప్రహరి రాళ్లు తొలగించి లోపలికి వెళ్లాడు నాగతిస్య. కాని ఈసారి బయటకు రాలేదు. ఆ శిథి•ల కోష్టాగారంలోనే దాగి ఉండి పోయాడు.

అది అప్పటికే పాడుపడి ఉంది. దానిని ఎవ్వరూ ఉపయోగించడం లేదు. అది కూడా కారాగారాల పక్కన ఉండటంతో బంధీల మలమూత్రాదులతో ఆ ప్రదేశమంతా భరించలేని దుర్గంధంతో ఉండడంతో అటు వైపు ఎవ్వరూ రారు. కోట లోపలే ఆ రాత్రి, పగలు కూడా గడిపి సంధ్యవేళకు మెల్లగా బయటకు వచ్చి రాజప్రాసాదం లోపలికి వెళ్లాడు. గూఢచారిగా రాజప్రాసాదమంతా అతనికి కొట్టిన పిండి.

అనుమకొండ ప్రయాణం పెట్టుకున్న సమయం లోనే ఓరోజు పల్లకిలో ఓ పరిచిత మహిళ.. కవ్వలను చూశాడు.

ఇదేవిటి చనిపోయి తనతో ప్రతి రాత్రి తన కళ్లముందు కదలాడుతున్న కవ్వల బ్రతికి పల్లకిలో కనిపించింది ఏవిటి?

కాసేపటికి వాళ్లు కవల సోదరీమణులని గుర్తొచ్చింది.. ఆమె చెల్లెలు.. బాల కవ్వల అని గ్రహించాడు.

మళ్లీ నాగతిస్య జీవితంలో పెద్ద కదలిక మొదలయ్యింది. బాలకవ్వల కనిపించడంతో ఆసక్తి పెరిగి అనుమకొండ ప్రయాణం వాయిదా వేసుకున్నాడు. అతనిలో చనిపోయిన గూఢచారి మళ్లీ జీవం పోసుకున్నాడు.

దినమూ కవ్వల కనిపించిన రాచబాటలోనే తచ్చాడసాగాడు.

ఆమె ఒక్కరుగానే కాదు మహారాజు సింఘణ దేవునితో ఆయన పల్లకిలో కలిసి కూర్చుని తిరగడమూ.. అలాగే మహారాణి చిల్లాదేవితో కలసి దేవాలయాలకు, మంత్రవేత్తల వద్దకు వెళ్లడమూ, రావడమూ చూసి ఆసక్తి మరింత పెరిగింది.

ఊహతీతంగా ఓరోజు కవ్వల, కేయూర కలసి వెళ్లడం చూసి నివ్వెర పోయాడు. కేయూరను కూడా సరిగానే పోల్చాడు. వారిద్దరూ భార్యాభర్తలుగా కనిపించగా మరింత మ్రాన్పడిపోయాడు. వారి పెళ్లి మహారాజు సింఘణ దేవుడు జరిపించాడని బిచ్చగాళ్లు చెప్పుకోవడం విన్నాడు. ఆమె అక్కను ఎవరో చంపేశారని.. ఆమె శవాన్ని చూసి ఈ చెల్లెలు మూర్చపోయి చాలాకాలం మంచంలో ఉన్నదని.. అప్పుడు ఆమెకు ప్రత్యేక వైద్యం చేయించాడని.. అనేక మంది పురోహితులు, మంత్రవేత్తల సలహాపై సింఘణ ఈ వివాహం జరిపించాడని బిచ్చగాళ్ల కబుర్లలో విన్నాడు.

కారాగారం నుండి బయటపడి ఓ అనామకుడిగా బిచ్చమెత్తుకుని బతుకుతున్నాడు కాని సహజంగా గొప్ప గూఢచారి అయిన నాగతిస్యకు బాలకవ్వలను చూశాక దేవగిరికోటలో కవ్వల విషయంలో ఏమి జరుగుతోంది అనే ఆసక్తి పెరిగింది.

ఈ సమయంలో తను రాజప్రాసాదంలో ఉంటేనా.. అనుకున్నాడు. అనుకుని ఊరుకోలేదు.

లోపలికి కేవలం శిథిలమైన కోష్టాగారం వద్దకు వెళ్లడం కాదు.. రాజ ప్రాసాదంలో పగలు లేదా రాత్రి అందరూ మేలుకుని ఉన్నప్పుడే పరిశీలించాలనే ఉబలాటం పెరిగింది.

అందుకే ఓరోజు కోటలోపలికి వెళ్లి కోష్టా గారంలో ఉండిపోయి మర్నాడు తొలి జామునే బయటకు వచ్చి తలవంచుకుని రాజప్రాసాదం వైపు కదిలాడు. అందులో తనకు తెలియని ప్రదేశం లేదు. కాపలాభటులు ఎక్కడెక్కడ ఎలా ఉంటారు. వాళ్లు ఉద్యోగ సమయాలు మారే విధానం.. ఎక్కడ దుస్తులు మార్చుకుంటారు.. ఎక్కడెక్కడ రాజోచిత బట్టలు పడి ఉంటాయి.. భటులు ధరించే శూలాలు మొదలైన ఆయుధాలు ఎక్కడ ఉంటాయి.. వారికి భోజనాలు ఏర్పాట్లు ఏవిటి.. ఎక్కడెక్కడ జన కదలికలు ఉండవు.. ఇలా… తెలియని అంశం లేదు.

అవన్నీ మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మననం చేసుకుంటూ పోయి దుస్తులు మార్చుకునే చోట నక్కి ఎవ్వరూ లేని సమయంలో అక్కడున్న భటుల రాజోచిత దుస్తులు తొడిగి ఓ శూలం పుచ్చుకుని మరోవైపు వెళ్లాడు. అట్లా ఎవరికీ అనుమానం రాకుండా అటూ ఇటూ తిరుగుతూ ఆకలి దహించుకు పోవడంతో అంతఃపుర వంటశాల వైపు వెళ్లి వంటవాళ్లను అడిగి ఇంత అన్నం తిన్నాడు. అలా తిరుగుతూ పాతికేళ్లనాటి భవనాలలో వచ్చిన మార్పులను చూస్తూ ఎవరికీ అనుమానం కలగకుండా అందరి మధ్య తిరగసాగాడు. రాత్రి వచ్చి శిథి•ల కోష్టాగారంలో పడుకొంటూ రెండు మూడు రోజులుగా అక్కడే ఉన్నాడు.

ఇప్పుడు నాగతిస్య అసలు సిసలు అనుభవజ్ఞుడైన వృద్ధ గూఢచారిగా అప్రమత్తతతో కోటలో ఓ కాపలా భటుడిలా తిరుగాడుతున్నాడు. అంతఃపురం నుంచి బయటకు వచ్చే నడవ మార్గం అతనికి తెలుసు. గతంలో అటు నుంచే కవ్వల బయటకు వచ్చేది. ఆ నడవాలో బయటకు వచ్చే మహిళలపై ఓ కన్ను వేయడమే ఇప్పుడు అతని ఆసక్తి.

మూడో రోజు అతని ప్రయత్నం ఫలించింది.

అతనికి బాలకవ్వల బయటకు వస్తూ కనిపిం చింది. ఆమె నిటారుగా బయటకు వచ్చి వేగంగా బయటకు వెళుతోంది. ఆమె నుంచి కాస్త ఆవలగా నడుస్తూ..ఆమెను అనుసరించసాగాడు. ఆమె ఆ శిథి•ల కోష్టాగారం వద్దకు వెళ్లింది.

అక్కడ.. ఎక్కడ అక్క కవ్వల శరీరభాగాలను అందరూ చూశారో అక్కడే కూలబడిపోయింది. వెక్కివెక్కి ఏడ్వసాగింది. భవనం మరో పక్కగా వెళ్లి చాటుగా ఆమెను చూడసాగాడు నాగతిస్య.

ఆమె ఆ గడ్డిలో పడి ఆ గడ్డిని వణికే వేళ్లతో స్పృశిస్తూ వలవలా ఏడుస్తోంది. నాగతిస్యకు కూడా ఏడుపు తన్నుకొచ్చింది. ఆమె కూడా తనలాగే స్పంది స్తోందే అనుకున్నాడు. హఠాత్తుగా లేచి నిలబడింది. గట్టిగా అరచింది. ‘‘రేయ్‌.. ‌పాపాత్ముడా..! కాకతీయ నీచుడా..! ఎంత దారుణం చేశావురా? నా అక్క ఏమి పాపం చేసిందిరా?నిన్ను ప్రేమించడమే ఆమె చేసిన తప్పు కదూ. అందుకే ఆమెను దారుణంగా చంపించావ్‌. ఇం‌తకు ఇంత నాశనమై పోతావురా. మా కుటుంబం ఉసురు నీకు తగులుతుంది. నువ్వూ నీ కుటుంబమూ. నీ రాజ్యమూ సర్వనాశనమై పోతాయి. మా ఉసురు నీకు తగులుతుంది. ఇదే నా శాపం. నిన్ను ఏనాటికైనా ఇక్కడికే రప్పించి.. నిన్నూ.. ఇలాగే ఖండఖండాలుగా నరక్కపోతే నేను అక్క కవ్వలకు తోడబుట్టిన దాననే కాను’’ ఇదే నా సవాల్‌.

‌నడుముకున్న చురకను బయటకు లాగి బొటన వేలిని చివ్వున కోసుకుంది. రక్తం చిందిన వేలితో నుదుటన రక్తతిలకం దిద్దుకుంది. అంతే వేగంగా వెనుదిరిగి వెళ్లిపోయింది.

దిమ్మెరపోయి నిలబడిపోయాడు నాగతిస్య.

ఇదేవిటి?? గణపతిదేవునిపై ఇంత అభాం డాలా!.. ఇదంతా ఆయనే చేశాడని ఈమె ప్రగాఢంగా నమ్ముతున్నట్లుంది. నమ్మితే మాత్రం ఇంతకంటే అన్యాయం మరి లేదు.

అక్కడే కూలబడ్డాడు.

ఈమె గణపతిదేవుని తప్పు పడుతుందని నాగతిస్యకు మొదట తోచలేదు. సమస్య తిరిగి తిరిగి గణపతిదేవునిపై పడుతుందని అతడు అస్సలు ఊహించ లేదు.

నాగతిస్యకు కవ్వల అప్పాచెల్లెళ్ల పట్ల జాలి, అభిమానం ఉన్నాయి కాని గణపతిదేవుని తప్పుపడితే సహించడానికి, అంగీకరించడానికి అతడు సిద్ధంగా లేడు. బాలకవ్వల గణపతిదేవునిపై పగబట్టడం అతనికి సుతరామూ నచ్చలేదు.

ఆమె మర్నాడు కూడా వచ్చింది. ఆ తర్వాతా వచ్చింది. చాలా రోజులు.. బహుశా అక్కడున్నన్ని రోజులు రోజూ వచ్చి ప్రతిజ్ఞ చేసి వెళుతోంది.

నాగతిస్య కూడా లోపలే ఉండి రోజూ కవ్వల రావడం, ఏడవటం, ప్రతిజ్ఞలు చేయడం వినివిని చివరికి ఆమె పట్ల భయం పట్టుకుంది. ఈమె నిజంగానే అన్నంత పని చేసేలా ఉందే అనుకున్నాడు.

అనుకోవడమే కాదు అది నిజమయ్యే సన్నివేశం ఒకటి చూశాడు.

ఒకానొక రోజు బాలకవ్వలతో పాటు వృద్ధురాలు చిల్లాదేవి, మహారాజు సింఘణదేవుడు కూడా వచ్చారు. ఆమె ప్రతిజ్ఞ చేశాక చిల్లాదేవి ఆమె దగ్గరకు వెళ్లి ఆమె కన్నీరు తుడిచి హత్తుకుంది.

సంఘణదేవుడు ఆమె భుజం తట్టి అభినందిం చాడు.

‘‘నీ క్రోధం చూస్తుంటే నీ ప్రతిజ్ఞ నిజం చేసుకునేలా ఉన్నావ్‌.. ‌కవ్వలా..’’ అంది చిల్లాదేవి.

‘‘తప్పక నిజం అవుతుంది. ఇక్కడే అతన్ని నువ్వు ఖండఖండాలుగా నరకడం నేను చూడాలి కవ్వలా..’’ అన్నాడు మహారాజు సింఘణదేవుడు.

మతిపోయింది నాగతిస్యకు.

ఇదేవిటి.. వీళ్ల సహకారం ఏవిటి? ఇలాంటి పిచ్చిపిచ్చి ప్రతిజ్ఞలు పక్కన పెట్టి నీ కాపురం నువ్వు ప్రశాంతంగా చేసుకో అని చెప్పాల్సింది పోయి ఆమెను అభినందిస్తూ ప్రోత్సహించడం ఏవిటి! పైగా ఆయనిప్పుడు ఆమెకు అల్లుడు, ఈయనకు స్వయానా బావమరిది..అలాంటి స్వంత బంధువును ఈమె చంపుతానని ప్రతిజ్ఞలు చేస్తుంటే వీళ్లు ప్రోత్స హించడం??

స్వయంగా ఆ ఇంటికి అల్లుడైనా.. కాకతీయ మహారాజుగా ఆయనను వీళ్లు శత్రువుగానే చూడటం గుర్తించి నాగతిస్య కుమిలిపోయాడు.. రాజ్యా క్రమణకు ఎలాంటి భవబంధాలు, రాగబంధాలు, ఆత్మీయతలు.. ఉండవని తెలిసిన నాగతిస్య కూడా ఈ దేవగిరి, కాకతీయ విద్వేషాల పట్ల చలించి పోయాడు.

వీళ్లంతా గణపతిదేవునికి కీడు తలపెడుతున్నా రని స్పష్టంగా కనిపిస్తోంది. బాలకవ్వల తీవ్రత చూస్తుంటే, ఆమె పగ సాధనలో తీవ్రంగా మమేకమై ఉందనిపిస్తోంది. అందుకు మహారాజైన సింఘణ సహకారం, చిల్లాదేవి ప్రోత్సాహం ఉన్నాయి. కాబట్టి ఏమి జరిగినా జరగవచ్చు. గణపతిదేవుడు మహా యోధుడు, యుద్ధతంత్రజ్ఞుడు కావచ్చు కాని ఆడదాని దెబ్బకు.. అంతఃపుర కుట్రలను తట్టుకోగలడా.. సందేహమే!!

తను ఇక్కడే ఉండాలి.. దేవగిరిలోనే ఉండి బాలకవ్వల ప్రయత్నాలను గుర్తించాలి. వీలయితే వీళ్ల కుట్రలను గణపతిదేవుని వద్దకు చేర్చాలి.

గట్టిగా నిర్ణయించుకుని అనుమకొండ వెళ్లడం ప్రస్తుతానికి విరమించుకున్నాడు నాగతిస్య.

ఒకవేళ ఆమె ప్రయత్నాలు ఫలించి.. ఆమె గణపతిదేవుని బందీగా ఇక్కడివరకూ తెస్తే తానెంటో చూపాలని.. ప్రాణాలు పణంగా పెట్టి అయినా గణపతిదేవుని రక్షించుకోవాలని అక్కడే ప్రతిజ్ఞ చేశాడు.. కాకతీయ గూఢచారి ఒకప్పటి గణపతి దేవుని రక్షకుడు అయిన నాగతిస్య!

‘‘అమ్మా.. మహాతల్లి కవ్వలా.. గణపతిదేవుల వారు తమర్ని ఎంతగా ప్రేమించారో.. మీరు ఆయనను ఎంతగా ప్రేమించారో స్వయంగా చూసిన వాడిని.. సహాయపడినవాడిని. తమరిని ఏ మహమ్మరి.. ఎందుకు హత్య చేసిందో నాకు తెలియదు. కానీ తెలుసుకుని తీరతాను. ఆ మహమ్మారిని పట్టి బంధించి ఇక్కడే మీకు బలి ఇస్తాను. మీ కోసం తల్లడిల్లిపోతున్న గణపతిదేవుల వారిని రక్షించుకుంటాను. ఇదే నా ప్రతిజ్ఞ!!’’

* **

ఏడవ మెట్టు: మతం – తిక్కన హరహరతత్వం

శ్రీయన గౌరీనా బరగు చెల్వకు జిత్తము పల్లవింప భ / ద్రాయిత మూర్తియై హరిహరంబగు రూపమ్ము దాల్చి విష్ణురూ

పాయ నమశ్శివాయ అని పల్కెడు భక్త జనంబు వైదిక / ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్వము గొల్చెద నిష్ఠసిద్ధికిన్‌

(‌భక్తి ముఖ్యం కాని హరిహర భేదము లేదు. హరిహరులు సమ్మిళితమై రూపం దాల్చినదే పరతత్వం. అదే హరిహరతత్వంగా కొలుస్తున్నాను.)

‘‘విష్ణు రూపాయ నమశ్శివాయ..

దేవుడు ఓ మహాశక్తిగా తొలినాటి ప్రజలు నమ్మిన రోజున మతం లేదు. సమాజానికి రాచపుండు ఈ మత వ్యవస్థ. దేవుడు అనే శక్తిని ఎందుకు పూజిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. దేవుడు అనే మహాశక్తికి అర్చనా విధానమే శైవం.. లేదా వైష్ణవం. శైవ సంప్రదాయాలకు దైవం శివుడు అయితే వైష్ణవ సంప్రదాయాలకు దైవం విష్ణువు. ఎవరి నమ్మకం వారిదిగా ఈ సమాజం ఎందుకు తీసుకోదు?! తీసుకోకుండా ఎవరు అడ్డగిస్తున్నారు? నా దేవుడే గొప్ప… నా దేవుడినే అందరూ పూజించాలి అనే ధోరణి ఉన్నవాళ్లు ఈ అసహ్యమైన మత దుర్గంధానికి కారణం. ఈ పిచ్చి ఎంతవరకు పోయిందంటే…మరో దేవుడిని పూజించేవాళ్లకు అడ్డంకులు సృష్టించడం.. దాటి ఇప్పుడు మరో దేవుడి భక్తులను చంపేసేవరకు వెళ్లింది. శైవభక్తులు, వైష్ణవభక్తులు అనే రెండు గుంపులు ఏర్పడ్డాయి. మళ్లీ ఇందులో వీరశైవులు, వీరవైష్ణవులు అనే తెగలు పుట్టుకొచ్చాయి. ఎదుటి దేవుడి భక్తులను చంపడమే వీళ్ల ధ్యేయం. ఈ అసహ్యకరమైన సంస్కృతి ఏ విజ్ఞానానికి పరాకాష్ట?

అతి జుగుప్సాకరం!! దీనిని తక్షణమే నివారించాలి. మాటలతో చాలదు. దీనిని అసహించు కుంటున్న వ్యక్తిగా సమాజంలో మార్పు తేవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. పాలక వర్గంగా మీరు దీనిని తక్షణమే నివారించవలసిన అంశంగా స్వీకరించాలని మనవి మహారాజా.. – తిక్కనామాత్యుడు

‘‘కాకతీయ మహారాజులు ఏనాడూ ఏ మతాన్ని ప్రోత్సహించలేదు. వారికి వారు ఇష్టదైవంగా మహాశివుడిని కొలుస్తారు. అంతమాత్రం చేత వైష్ణవులను చంపడాన్ని.. కనీసం అణచివేతను కూడా అంగీకరించరు. వారిది అలీన విధానం. వారు త్రికూటాలయాలు, పంచకూటాలయాలు నిర్మించారు. నిర్మిస్తున్నారు. అంతెందుకు..నేనే వైష్ణవ దేవాలయాలు నిర్మించాను. బుద్ధుడికి కూడా గుడి కట్టించాను. అది నాటి మహారాజు రుద్రదేవులవారికి, ఇప్పటి పాలకులు గణపతిదేవులవారికి కూడా తెలుసు. కానీ వారు నన్నెన్నడూ అడ్డుకోలేదు. మతం అనేదొక రావణకాష్టం. దానిని అధికారవర్గాలు కట్టడి చేయలేవని నా అభిప్రాయం. ప్రజలే తన దైవాలుగా భావించే గణపతిదేవుల వారు ప్రజల బలమైన మత దృక్పథా విషయంలో కలగజేసుకుంటారని నేను భావించలేను. -మహాప్రధాని వెల్లంకి గంగాధరుడు

తొలుత శిబిరం ప్రారంభంలోనే మహామాత్యులు తిక్కన పండితులు చెప్పారు. రాచవ్యవస్థ, వాణిజ్య వ్యవస్థ, మత వ్యవస్థ చెట్టాపట్టాలు వేసుకుని బలిష్ట మౌతున్నాయని. చిన్నరాజ్యాలవల్ల జరుగుతున్న దారుణాలలో ఈ మతాలకు లభిస్తున్న ప్రోత్సాహం ఒకటి. వణిజులే కాదు అక్కడక్కడా మహారాజులు కూడా మతాలను ప్రోత్సహించడంతో మత ద్వేషాగ్ని సమాజాన్ని మరింత మండిస్తోంది. అలాంటి స్వతంత్రరాజులను అడ్డుకోవడం కష్టం. ఈ మత చీడను నాశనం చేయాలంటే తెలుగుసామ్రాజ్య స్థాపనే దానికి తరుణోపాయం.

చిన్నరాజ్యాల సమస్యల నిపుణుడు శాంభవరాయడు.

వణిజులకు మతం అంటగట్టి కొన్ని గ్రామాల లోకి అమ్మకాలకు రానివ్వడం లేదు. కొన్ని సంతలలో, కొన్ని పేటలలో వర్తకబిడారు రాబోయే ముందే ఆ వర్తకశెట్టి ఏ మతమో.. తెలుసుకుని మరీ సరుకు అమ్మడానికి అనుమతిస్తున్నారు. ఇప్పుడు వణిజుని భాషను కూడా.. అంటే ఆయన తెలుగువాడా.. మరాఠమా.. కన్నడమా..తమిళమా.. అనీ అడుగు తున్నారు. ఆయా గ్రామాల సమయశెట్టిలు. సంత సుంకాధికారులు కూడా కిమ్మనడం లేదు. కాబట్టి మేము శ్రీతిక్కనామాత్యుల హరిహరతత్వాన్ని ప్రభోదిస్తున్నాము. వారికి సహకరిస్తాము.’’

వస్త్రవ్యాపారశ్రేణి సభ్యుడు చెల్లప్పసెట్టి, చింతనా శిబిరంలో.

* **

మానుకోట రాజ్యం.. సంభాలపూండి స్థల. ఐదు గ్రామాల కూడలి.

పగలు మూడవజాము.. రైతులు పొలాలకు వెళ్లి తిరిగివచ్చి బువ్వ తిని కాస్త విశ్రాంతిగా పడుకోగా గ్రామమంతా మాగన్నుగా కునుకు తీస్తోంది. ఓ శివభక్తుడు.. చిన్నరైతు ఇంటివైపు నడుస్తున్నాడు. దగ్గరలో ఉన్న శైవ మహాపండితుని ఉపదేశం.. శివలీలలు విని తన్మయుడై.. విన్న శైవగీతాలను కూనిరాగాలు తీస్తూ పోతున్నాడు. అప్పుడే ఎవరో ఆగంతుకుడు ఎదురుగా వచ్చాడు.

అతని నెత్తిపై పెద్దకుండ. ఖచ్చితంగా ఎదురుగా వచ్చి ముందుకు వెళ్లకుండా అడ్డంగా నిలబడ్డాడు.

‘‘ఎవరు నువ్వు?? శివ శివా.. అలా అడ్డుగా నిలబడతావేమయ్యా.. తొలగు తొలగు..’’ అన్నాడు శైవ రైతు.

అతన్ని ఆ ఆగంతుకుడు ఎగాదిగా చూస్తూ అన్నాడు.

‘‘అయితే నువ్వు ఆ శ్మశానం గాడి భక్తుడివన్నమాట..’’

అతని మాటలో కరుకుతనం, ముఖంలో కాఠిన్యం తెలుస్తోంది.

(సశేషం)

‌మత్తి భానుమూరి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE