సమున్నత లక్ష్యం, సదుద్దేశంతో విధాన నిర్ణయాలు తీసుకున్నా..అమలు చేసే యంత్రాంగంపై అదుపు లేకపోతే వ్యవస్థలు సాంతం అభాసు పాలవుతాయనడానికి ఇటీవల జరిగిన ఘటనలను ఉదాహరణగా చెప్పాలి. ఈ రెండు ఉదంతాలు దేశ విద్యా,వైద్య రంగాలను కుదిపేశాయి. నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎం‌ట్రెన్స్ ‌టెస్ట్-యూజీ 2026 పేపర్‌ ‌లీకేజీ ఘటన ఒకటైతే మరొకటి సీబీఎస్‌ఈ ‌పోర్టల్‌ ‌పై జరిగిన సైబర్‌ ‌దాడి ఘటన.

స్వయంగా ప్రధాన మంత్రే ‘నీట్‌’‌లీకేజీలో ఏం జరిగిందో పర్యవేక్షిస్తున్నారంటే నిర్వహణ యంత్రాంగంలోని లోపాలు అర్థమవుతాయి. సీబీఎస్‌ఈ ‌రీవాల్యువేషన్‌ ‌పోర్టల్‌పై కేవలం రెండు నిమిషాల వ్యవధిలో సుమారు 15లక్షల సైబర్‌ ‌దాడులు జరిగాయి. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి చైర్మన్‌, ‌సెక్రటరీలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీ వ్యవహారంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం నీట్‌ ‌నిర్వహించే నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీకి మొట్టికాయలు వేసింది. యూపీఎస్సీని చూసి నేర్చుకోవాలంటూ హితవు పలికింది. పటిష్ఠమైన నిఘా వ్యవస్థలు ఉన్నా.. లీకేజీ ఎలా జరిగిందంటూ నిలదీసింది. సివిల్స్ ‌పరీక్షలు నిర్వహించే యూపీ ఎస్సీలో ఇలాంటి ఉదంతాలు ఎప్పుడూ వెలుగు చూడలేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. యూపీఎస్సీని చూసి నేర్చుకోవాలని నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ ఎన్టీఏకు సూచించింది. పేపర్‌ ‌సెట్టింగ్‌ ‌పక్రియలో సమస్య తలెత్తిందని ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.

నీట్‌ ‌లీకేజీ తర్వాత దేశంలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరికొంత మంది ఆత్మహత్యా యత్నాలు చేశారు. చివరకు నీట్‌ ‌వ్యవహారంలో విచారణకు సీబీఐ రంగంలోకి దిగింది. లీకేజీకి కారణమైన వారిని కటకటాల్లోకి నెట్టింది. పుణెకు చెందిన బోటనీ లెక్చరర్‌ ‌మనీషా మందారే, కెమిస్ట్రీ లెక్చరర్‌ ‌పీవీ కులకర్ణిలు కేసులో ప్రధాన నిందితులని సీబీఐ తేల్చింది. వీరు పరీక్షకు సంబంధించిన ప్రశ్నలను ముందుగానే సేకరించి బయటకు పంపినట్లు సీబీఐ అనుమానిస్తోంది. పరీక్ష ప్రశ్నపత్రాన్ని మొదట చేతితో రాసి, తర్వాత స్కాన్‌ ‌చేసి పీడీఎఫ్‌ ‌రూపంలో పంపినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ ప్రశ్నపత్రాలను అందించేందుకు భారీ మొత్తాలు వసూలు చేశారు. ఒక్కో మధ్యవర్తి నుంచి రూ.పది నుంచి పాతిక లక్షల వరకు వసూలు చేసినట్టు సీబీఐ గుర్తించింది. రాజస్థాన్‌, ‌మహారాష్ట్ర, హరియాణా, కేరళం వంటి రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ ‌విస్తరించినట్లు అధికారులు భావిస్తున్నారు. పుణె నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రశ్నపత్రం లీక్‌ ‌కావడంలో శుభమ్‌ ‌ఖైర్నార్‌ ‌కీలక పాత్ర పోషించారని సీబీఐ ఒక అంచనాకు వచ్చింది. ఫిజిక్స్, ‌కెమిస్ట్రీ, బయాలజీ ప్రశ్నపత్రాలను పీడీఎఫ్‌ ‌ఫార్మాట్లో టెలిగ్రామ్‌ ‌ద్వారా తమ ముఠాలోని వారికి బట్వాడా చేశారు. సోషల్‌ ‌మీడియా, టెలిగ్రామ్‌ ‌గ్రూపులు, కోచింగ్‌ ‌సెంటర్లను  లీకేజీ ముఠా ఉపయోగించుకుంది. కోచింగ్‌ ‌సెంటర్ల నిర్వాహకులు, కొందరు తల్లిదండ్రులు కూడా మధ్యవర్తులుగా వ్యవహరించారని సీబీఐ గుర్తించింది.

ఎలా జరిగింది ఈ ఘోర తప్పింది?

యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక తర్జన భర్జనలు, సీబీఎస్‌ఈ-‌మెడికల్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇం‌డియా మధ్య పరస్పర అభిప్రాయభేదాల నేపథ్యంలో 2012-13 మధ్య అనేక చర్చలు జరిగాయి. ఎట్టకేలకు 2013లో తొలిసారి నీట్‌ ‌పరీక్షను నిర్వహించారు. నీట్‌ ‌కు ముందు దేశంలో ప్రఖ్యాత వైద్య విద్యా సంస్థలు స్వంతంగా ప్రవేశ అర్హత పరీక్షలు నిర్వహించేవి.

ఎయిమ్స్, ‌జిప్‌ ‌మర్‌, ‌సీఎంసీ వెల్లూరు కళాశాలలు ఎంట్రెన్స్ ‌టెస్టులు పెట్టేవి. అయితే వీటి నిర్వహణలో అవకతవకలు ఉన్నాయని, లోపాయికారి ఒప్పందాలు ఉండే అవకాశం ఉందనే వాదనలు, విమర్శల మధ్య దేశ వ్యాప్తంగా ఒకే ప్రవేశ అర్హత పరీక్ష నిర్వహించాలని గత యూపీఏ ప్రభుత్వం భావించింది. దీంతో 2013లో తొలిసారి నీట్‌ ‌ను అమలులోకి తెచ్చినా..సాంకేతిక కారణాల వల్ల తిరిగి పాత పద్ధతినే ఆశ్రయించారు. చివరకు 2014లో సుప్రీంకోర్టు జోక్యంతో నీట్‌ ‌నిర్వహణపై స్పష్టత వచ్చింది.

2016లో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి నీట్‌ ‌ను నిర్వహించాలని భావించింది. 2019లో కేంద్రం ‘నేషనల్‌ ‌మెడికల్‌ ‌కమిషన్‌ ‌చట్టం’ తెచ్చే వరకు సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలోనే నీట్‌ ‌నిర్వహణ జరిగేది. కేంద్రం నిర్దిష్టంగా ఒక చట్టం తీసుకు వచ్చి నీట్‌ ‌నిర్వహణకు ‘నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ’ని ఏర్పాటు చేసింది. నీట్‌ ‌వ్యవహారంలో అనేక రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అయితే దేశ వ్యాప్తంగా అన్ని ప్రముఖ మెడికల్‌ ‌కాలేజీల్లో సీటు సంపాదించాలంటే నీట్‌ ఒకటే ఆధారం కావడంతో కాలక్రమంలో తమిళనాడు మినహా ఇతర రాష్ట్రాలు కూడా తమ సమ్మతి ప్రకటించాయి.

పొరపాటు ఎక్కడ జరిగింది?

నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ నీట్‌ ‌పేపర్‌ ‌తయారీ వ్యవహారం చూసుకుంటుంది. దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో ఉండే రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రంలో విశేషమైన కృషి చేసిన వారిని ఎంపిక చేసి అత్యంత రహస్యంగా నీట్‌ ‌పేపర్‌ ‌తయారు చేస్తుంది. ప్రధానంగా ఎన్‌.‌సి.ఈ.ఆర్‌.‌టి పుస్తకాలను ప్రాతిపదిక చేసుకుని ప్రశ్నపత్రాలు రూపొందిస్తారు. నిపుణుల ఎంపికలోనే పొరపాటు జరగడం ఒక కారణమైతే…కేంద్రం విధాన నిర్ణయం చేసి నీట్‌ను నిర్వహించినా…నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ యంత్రాంగంలో పెద్దగా మార్పులు చేయలేదు. చాలా కాలం నుంచి పాతుకుపోయిన యంత్రాంగమే ఎన్‌.‌టి.ఏలో రాజ్యమేలుతోంది.

దీంతో నిపుణుల ఎంపిక వ్యవహారంలోనే భారీ లొసుగులున్నాయని తాజా లీకేజీతో బట్టబయలైంది. ప్రశ్నపత్రాలను రూపొందించే విషయ నిపుణులే స్వయంగా కోచింగ్‌ ‌సెంటర్లు నడుపుతున్నట్టు తాజా విచారణలో సీబీఐ గుర్తించింది. కేంద్రం నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ ఏర్పాటు చేసినప్పుడే సిబ్బంది ఎంపిక విషయంలో జాగ్రత్త పాటించాల్సింది.

ప్రశ్నపత్రాలు రూపొందిస్తున్న సమయంలో నిఘా విభాగాలను అప్రమత్తం చేసి, ప్రత్యేక శ్రద్ధ పెట్టేలా చర్యలు తీసుకోవాల్సిందంటారు నిపుణులు. తాజా నీట్‌ ‌లీకేజీ వ్యవహారం సాంతం పుణె, లాతూర్‌ ‌లోని కోచింగ్‌ ‌సెంటర్లు కేంద్రంగా జరిగింది. బహుశా మహారాష్ట్రలో  ప్రింటింగ్‌ ‌దశలోనే ప్రశ్న పత్రాలను సేకరించారా లేదా ప్రింటింగ్‌ ‌సిబ్బంది ప్రమేయంతో ప్రశ్నలను ఫోన్ల ద్వారా తెలుసుకున్నారా అనేది తేలాల్సి ఉంది. ప్రశ్నపత్రం రూపొందిస్తున్న దశలోనే తస్కరణ జరిగి ఉండవచ్చనే అనుమానాలూ ఉన్నాయి.

లీకేజీ నివారణకు నిపుణులు ఇస్తున్న సూచనలేంటి?

ప్రశ్నపత్రాలు రూపొందించే నిపుణుల ఎంపిక లోనే నిఘా విభాగాల పాత్ర ఉండాలంటారు. కార్పోరేట్‌ ‌కాలేజీలు, కోచింగ్‌ ‌సెంటర్లలో పనిచేసే ప్రొఫెసర్లను ఎంపిక చేయడం పొరపాటనేది నిపుణుల అభిప్రాయం. కోట్ల మంది విద్యార్థుల భవితవ్యంతో ముడివడిన అంశంలో ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలంటారు. ఎంపిక సమయంలో నిఘా విభాగాల అభిప్రాయాన్ని సైతం పరిగణనలోకి తీసుకోవాలంటారు. అంతే కాదు ప్రశ్నాపత్రాలను ముందుగానే తయారు చేసి పరీక్షా కేంద్రాలకు తరలించే సమయంలో కూడా లీకేజీ జరిగిన సందర్భాలున్నాయి. ప్రశ్నపత్రాలు తరలించే వాహనాలకు జీపీఎస్‌ ‌ట్రాకర్లు అమర్చి, వాటి ప్రయాణాన్ని పర్యవేక్షించినా..లీకేజీ నిరంతరాయంగా జరగడం మరింత సవాలుగా మారింది.

అందుకే ప్రభుత్వం పరీక్షా కేంద్రాల్లోనే కేవలం కొద్ది గంటల ముందు మాత్రమే అక్కడే ముద్రించడం ఉత్తమం అంటారు. అయితే దీని సాధ్యా సాధ్యాలపై నిపుణుల్లోనే అనేక భిన్నాభిప్రాయా లున్నాయి. పరీక్షా కేంద్రాల్లో వేల సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నప్పుడు… అప్పటికప్పుడు ప్రశ్నపత్రాల ముద్రించడం సాధ్యపడదనేది ప్రభుత్వం వాదన. అసలు ముద్రణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలోనూ నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ అప్రమత్తంగా లేదనే వాదనలూ ఉన్నాయి.

గతంలో నాషిక్‌, ‌జైపూర్‌ ‌లో కమర్షియల్‌ ‌ప్రెస్‌ ‌లను ఎన్‌.‌టీ.ఏ ఎంపిక చేయడంపై  సైతం విమర్శలు తలెత్తాయి. ప్రింట్‌ ఎక్కడ అవుతున్నాయో బహిర్గతం కావడం కూడా లీకేజీకి ఒకానొక కారణంగా పేర్కొం టారు. కమర్షియల్‌ ‌ప్రింటింగ్‌ ‌ప్రెస్‌ ‌సిబ్బంది ఫోన్ల, కదలికలపై నిఘా లేకపోవడం మరోలోప మంటారు. ప్రింటింగ్‌ ‌పక్రియను అవుట్‌ ‌సోర్స్ ‌చేయడమే సమస్యకు కారణమనే అభిప్రాయం కూడా ఉంది.

ముద్రణ సమయంలో ఎన్‌.‌టి.ఏ ప్రెస్‌ ‌పరిసరాల్లో భద్రతను, గార్డులను నియమించినా.. లీకేజీ జరిగిన ఉదంతాలున్నాయి. అంతే కాదు ముద్రణలో పొరపాట్లు దొర్లిన ప్రశ్నపత్రాలను వెంటనే వాటిని కాల్చివేయాలి. దేశ వ్యాప్తంగా లక్షల కొద్ది ప్రశ్నపత్రాలను పంపాలి, కాబట్టి భారీ స్థాయిలో ప్రింటింగ్‌ ‌జరుగుతుంది. ఏ ఒక్క ప్రశ్నాపత్రం పొరపాటున ప్రెస్‌లో ఉండిపోయినా.. భారీ నష్టానికి కారణమవుతోంది. జేఈఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్‌ ఆధారంగా సీబీటీ పద్ధతిలో జరగడంతో లీకేజీకి అస్కారం లేకుండా ఎన్‌ ‌క్రిప్షన్‌ ఉం‌టుంది (ఎవరూ చూడకుండా ఉండే సాంకేతిక పద్ధతి).

అదే నీట్‌లో ఇంకా పెన్‌-‌పేపర్‌ అనే పాత పద్ధతి అమలు కావడం కూడా సమస్యకు కారణమంటారు నిపుణులు. దేశ వ్యాప్తంగా ఒకే ప్రశ్నపత్రం ఉండటంతో ఒక్కచోట లీకేజీ జరిగినా… ఫోన్లు ఇతర సాంకేతిక కారణంగా క్షణాల వ్యవధిలో దేశమంతా ప్రశ్నపత్రం వెళ్లిపోతుంది. దీంతో ఈ ప్రభావం అంతటా ఉంటుంది. ఇటీవల జరిగిన నీట్‌ ‌లీకేజీ మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. కానీ గంట వ్యవధిలో గుజరాత్‌, ‌బీహార్‌ ‌దాకా వెళ్లిపోయింది. జేఈఈ తరహాలో సీబీటీ తరహాలో కొన్ని రోజుల పాటు, అనేక దఫాలు జరపాలనే అభిప్రాయం కూడా ఉంది. అంతే కాదు జేఈఈ పరీక్ష అనేక దఫాల్లో జరిగినప్పుడు ప్రశ్నలు కూడా మారతాయి. దీంతో లీకేజీకి అవకాశం లేకుండా పతుంది.

గతంలో చిన్న చిన్న అక్షర దోషాలు వచ్చిన ప్రశ్నపత్రాలను ప్రెస్‌ ‌నుంచి బయటకు తరలించి.. లీకేజీకి పాల్పడిన ఘటనలను దర్యాప్తు సంస్థలు గతంలో గుర్తించాయి. న్యూఢిల్లీలో ఎన్‌.‌టి.ఏ ఆధ్వర్యంలోని టెర్మినళ్లలో ఎంత భద్రత మధ్య జాగ్రత్త చేసినా..ప్రింటింగ్‌ ‌సమయంలో, ప్రశ్నావళి రూపొం దించే సమయంలో లీకేజీ జరిగితే ఏం చేయాలనేది ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలు.

ఎంత పకడ్బందీ వ్యవస్థలు ఏర్పాటు చేసినా.. నీట్‌ ‌ప్రశ్నాపత్రం లీక్‌ ‌కావడానికి ప్రధాన కారణం దేశంలో వైద్యవిద్య బిలియన్‌ ‌డాలర్ల వ్యాపారంగా మారడమే. ప్రైవేట్‌ ‌మెడికల్‌ ‌కాలేజీల్లోని సుమారు 30వేలకు పైగా సీట్లను వేలకోట్లుగా మార్చు కుంటున్నాయి యాజమాన్యాలు. భారత వైద్యం రంగం వ్యాపారీకరణ చెందడంతో 1.8 బిలియన్‌ ‌డాలర్ల నుంచి దశాబ్దం తిరిగే సరికి అదికాస్తా 5.2 బిలియన్‌ ‌డాలర్లకు ఎగబాకింది. దేశంలోని 800 మెడికల్‌ ‌కాలేజీల్లో సుమారు లక్షాపాతిక వేల ఎంబీబీఎస్‌ ‌సీట్లున్నాయి. వీటిలో అత్యధిక ప్రవేట్‌ ‌రంగంలోనే ఉన్నాయి. ఇందులో 450 మెడికల్‌ ‌కాలేజీల్లో ఎంబీబీఎస్‌ ‌చదవడం అత్యంత ఖరీదైన వ్యవహారం. దీంతో ఏటా నీట్‌ ‌పరీక్ష కోసం మెడికల్‌ ‌మాఫియా ఎదురు చూస్తూ ఉంటుంది. మెడికల్‌ ‌మాఫియాకు ప్రశ్నావళి రూపొందించే నిపుణుల డబ్బు కక్కుర్తి, విద్యార్థుల తల్లిదండ్రుల అత్యాశలు జతకావడంతో లీకేజీ అతి సులభంగా మారుతోంది.

కోట్లాది మంది విద్యార్థులకు వైద్యవిద్య అందని ద్రాక్షగా మారి..సంపన్నులకే అందుతున్నది. ఇలాంటి సమయంలో ఒక్కో విద్యార్థి రెండేళ్లు, వ•డేళ్లు వరుసగా నీట్‌ ‌రాస్తూ.. ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో లీకేజీ వ్యవహారం ముందుకు రావడంతో తీవ్ర నిరాశకు, నిస్పృహకు గురవు తున్నారు. కేంద్రం ఇకపై నీట్‌ ‌వ్యవహారంలో చిన్న తప్పిదానికి కూడా ఆస్కారం లేకుండా పకడ్బందీగా నీట్‌ ‌పరీక్షను నిర్వహించడం వల్ల ప్రభుత్వంపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడుతుంది.

– ‌జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE