భారత అంతరిక్ష రంగంలో స్వావలంబన దిశగా సరికొత్త చరిత్ర నెలకొంది. జూలై 18న దేశ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్`1 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ మహత్తరమైన ఘట్టానికి ఆంధ్రప్రదేశ్, శ్రీహరికోట, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో మొదటి లాంచ్ పాడ్ వేదికగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ రాకెట్ రూపుదిద్దుకుంది. పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతరించుకుంది. నిర్దేశించిన అన్ని లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. పేలోడ్‌లను భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో భారత్ ప్రైవేట్ అంతరిక్ష రంగం అధికారికంగా ఆర్బిటల్ ప్రయోగాల యుగంలోకి అడుగుపెట్టినట్టయింది.
ఈ విజయం అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో మనదేశానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఉదయం 11.30 గంటలకు జరగాల్సిన ప్రయోగం ఇంధన వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయింది. అయితే శాస్త్రవేత్తలు 35 నిమిషాల్లోనే లోపాన్ని సరిచేశారు. మధ్యాహ్నం 12.05 గంటలకు రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు. రాకెట్‌లో నాలుగు దశలు నిర్దేశించిన విధంగా పనిచేసి మిషన్‌ను విజయవంతం చేశాయి. భారత్ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో ఆర్బిటల్ ప్రయోగాలకు నాంది పలుకుతున్న ఈ ప్రయోగానికి మిషన్ ఆగమన్ అని స్కైరూట్ నామకరణం చేసింది. 2022లో మిషన్ ప్రారంభ్‌తో విక్రమ్`ఎస్ ద్వారా తొలి అడుగు వేసింది. ఇప్పుడు విక్రమ్`1 విజయంతో మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ఈ రాకెట్ ద్వారా మొత్తం ఆరు పేలోడ్‌లను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్ సంస్థలకు చెందిన ఐదు పేలోడ్‌లతో పాటు ఆరవ పేలోడ్‌గా జర్మనీకి చెందిన డీక్యూబ్డ్ జీఎంబీహెచ్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వహస్తాలతో రాసిన వందేమాతరం పోస్టుకార్డు, కాస్మిక్ బ్లూమ్ ఆర్ట్ వర్క్, భారత్ అంతరిక్ష రంగానికి ఎనలేని సేవలు అందించిన విక్రమ్ సారాభాయ్, సర్ సీవీ రామన్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూక్ష్మ ప్రతిరూపాలను కూడా రోదసిలోకి పంపించారు.
స్పేసఎక్స్‌ను తలదన్నిన స్కైరూట్
ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో ఇలాంటి విజయం సాధించడం చాలా అరుదుగా జరుగు తుంటుంది. అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ కంపెనీ స్పేసఎక్స్ ఎదుర్కొన్న ప్రారంభ వైఫల్యాలకు భిన్నంగా ఈ కంపెనీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తన స్పేసఎక్స్‌తో చేసిన మÖడు ప్రయత్నాల్లోనూ అంతరిక్షంలోకి రాకెట్‌ను పంపించలేకపోయారు. ఎలాన్ మస్క్ సాధించలేని దానిని పవన్ కుమార్ చందన నేతృత్వంలోని స్కైరూట్ ఏరోస్పేస్ సాధించింది. యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఈ రాకెట్ స్వదేశీ, విదేశీ వినియోగదారులకు సేవలు అందించనుంది. అంతరిక్ష ప్రయోగ సాంకేతికతలో ప్రపంచ అగ్రగామి ప్రైవేట్ సంస్థగా ఉన్న స్పేసఎక్స్ 2008లో తన ఫాల్కన్`1 రాకెట్‌ను విజయ వంతంగా రోదసిలోకి పంపించడానికి ముందు మÖడుసార్లు ప్రయోగాలు చేసి విఫలమైంది. అదే ఒక భారతీయ స్టార్టప్ సంస్థ తన తొలి ప్రయత్నంలోనే నింగిలోకి రాకెట్‌ను పంపించింది. చరిత్రను సృష్టిం చింది. విక్రమ్`1 పూర్తిగా కార్బన్ కాంపోజిట్‌తో నిర్మితమైన నాలుగు దశల రాకెట్. ఇది కక్ష్యలోకి ప్రవేశించడంలో మÖడు ఘన ఇంధన దశలు, ఒక ద్రవ ఇంధన ఆర్బిటల్ అడ్జెస్ట్‌మెంట్ శక్తిని అంది స్తాయి. దీనిని 450 కి.మీ.ల వరకు భూకక్ష్యలోకి గరిష్టంగా 350 కేజీల పేలోడ్‌లను మోసుకొని వెళ్లేలా తయారు చేశారు.
టీ-హబ్‌లో స్కైరూట్‌కు పునాది
ఇస్రోలో పనిచేసిన పవన్‌కుమార్ చందన తన తోటి ఇస్రో ఇంజినీర్ నాగభరత్ డాకాతో కలిసి 2018లో స్కైరూట్‌ను ప్రారంభించారు. దీనిని హైదరాబాద్‌లోని టీ`హబ్‌లో అంకుర సంస్థగా మొదలుపెట్టారు. అంతకుముందు ఆయన ఆరు సంవత్సరాలపాటు శాస్త్రవేత్త హోదాలో ఇస్రోలో పనిచేశారు.అంతరిక్ష ప్రయోగాలను తక్కువ ఖర్చుతో, వేగంగా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ స్టార్టప్ ప్రారంభమైంది. 2020లో దేశంలో మొదటిసారిగా ప్రైవేటుగా పరీక్షించిన రాకెట్ ఇంజిన్‌ను స్కైరూట్ సమర్పించింది. నవంబర్, 2022లో దేశంలో మొట్టమొదటి ప్రైవేటు సబ్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్`ఎస్‌ను ప్రారంభ్ మిషన్ పేరుతో ప్రయోగించింది. విజయం సాధించింది. స్కైరూట్ ప్రస్తుతం విక్రమ్`1 పేరిట చిన్న ఉపగ్రహాలను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు, మధ్యస్థ సామర్థ్యం కలిగిన ఉపగ్రహాల కోసం విక్రమ్`2, భారీ పేలోడ్‌ల కోసం విక్రమ్`3 అనే మÖడు రాకెట్‌లను అభివృద్ధి చేస్తున్నది. మే, 2026లో 60 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. దీని తర్వాత స్కైరూట్ విలువ 1.1 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఇది 28 ఏళ్ల యువత ఘనత: ప్రధాని మోదీ
హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష రంగ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస’ విజయవంతంగా రాకెట్‌ను ప్రయోగించిన సందర్భంగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఈ విజయం సగటున 28 ఏళ్ల వయసున్న యువ ఆవిష్కర్తల బృందానికి దక్కుతుందని, “56 ఏళ్ల వయసున్న యువకుడికి” కాదని ఆయన పేర్కొన్నారు.
జూలై 20న పార్లమెంటు వర్షాకాల సమావేశా లకు ముందు చేసిన సంప్రదాయ ప్రసంగంలో దేశంలోని స్టార్టప్ వ్యవస్థను ప్రధాని మోదీ ప్రశంసించారు. స్కైరూట్ సాధించిన మైలురాయిని భారత యువతకు గర్వకారణమైన ఘట్టంగా అభివర్ణించారు. “అంతరిక్షంలోకి ఒక కొత్త ప్రయాణాన్ని భారత యువత ప్రారంభించింది. ‘స్కైరూట’ స్టార్టప్‌లో పనిచేస్తున్న మొత్తం బృందం సగటు వయసు కేవలం 28 ఏళ్లు అని నాకు తెలిసింది. ఇలాంటి యువతే ఈ ఘనతను సాధించారు. నేను 56 ఏళ్ల వయసున్న యువకుడి గురించి మాట్లాడటం లేదు” అని ఆయన అన్నారు. ఆయన రాహుల్ గాంధీ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఈ వ్యాఖ్యలు స్పష్టంగా 56 ఏళ్ల వయసున్న కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిని ఉద్దేశించి చేసినవేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. “ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే ఇలాంటి ప్రైవేట్ రంగ కృషిని చూశాయి. ఇది అద్భుతమైన విజయం. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు గుర్తింపు, ఆదరణ లభిస్తున్నాయి. ఇది యాదృచ్ఛికం కాదు. మన దేశ యువత సామర్థ్యం, ఆశయాలు అంతరిక్షం అంత విశాలమైనవనే బలమైన సందేశాన్ని ఈ విజయం ప్రపంచానికి ఇచ్చింది” అని మోదీ అన్నారు. దేశంలోనూ, విదేశాల్లోనూ భారతదేశ ప్రతిష్టను పెంచే అనేక మైలురాళ్లతో గత నెల నిలిచిపోయిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.“కేవలం ఒక్క నెలలోనే దేశం అనేక మైలురాళ్లను అధిగమించింది. ఈ విజయాలు ప్రతి భారతీయుడికి గర్వకారణంగా నిలిచాయి. జాతీయ స్థాయి కావచ్చు, అంతర్జాతీయ వేదిక కావచ్చు లేదా ఇప్పుడు అంతరిక్ష రంగం కావచ్చు… ఇవన్నీ భారతదేశానికి నిజంగా గర్వించదగ్గ క్షణాలు” అని మోదీ అన్నారు.
“ప్రపంచంలో చాలా తక్కువ దేశాలకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది. దేశం కోసం ఒకే లక్ష్యంతో పనిచేస్తున్న భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, కార్మికుల అంకితభావానికి ఈ విజయం ఒక నిదర్శనం” అని ప్రశంసించారు. ప్రభుత్వ సంస్కరణల ఎజెండాతో ఈ విజయాలను ముడిపెట్టిన ప్రధానమంత్రి, విధానపరమైన సంస్కరణల ద్వారా ఏర్పడిన వ్యవస్థ నుండి దేశంలోని యువ ఆవిష్కర్తలు ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు.
‘సంస్కరణల ప్రయాణం’లో దేశం భాగం కావడంవల్లే, భారతీయ యువత ఇంతటి ధైర్యాన్ని ప్రదర్శించి విజయాలు సాధించగలుగుతున్నారు” అని అన్నారు.
ఇటీవలి మౌలిక సదుపాయాలు, సాంకేతిక విజయాలను ప్రస్తావిస్తూ, రాజస్థాన్‌లో ఒక భారీ చమురు శుద్ధికర్మాగారం, దేశంలో మూడవ సెమీకండక్టర్ ప్లాంట్ ప్రారంభమైందని తెలిపారు. దేశంలో తొలి హైడ్రోజన్ రైలుకు పచ్చజెండా చూపినట్టు ప్రధాని పేర్కొన్నారు.
– జాగృతి డెస్క్