లోకంలో కొందరు మహాపురుషులకు కొన్ని జనప్రియమైన సంబోధనలు ఉండడం మనకు తెలిసిన విషయమే. అటువంటి ప్రసిద్ధ సంబోధనలు సాధారణంగా వారికి ఇతర మహాపురుషుల నుంచి లభించినవై ఉంటాయి.  గాంధీగారికి ‘‘మహాత్మా’’ అనే పేరు లోకమాన్య తిలక్‌ ‌ద్వారా, ‘బాపూ’ అనే పేరు నేతాజీ ద్వారా ఇవ్వబడి ప్రచారంలోకి వచ్చింది. కాని మాధవరావు సదాశివ గోల్వల్కర్‌కు ‘గురూజీ’ అన్న సంబోధనను ఇచ్చి వాడుకలోకి తెచ్చినది ఆయన నుంచి ఎల్లలు లేని స్నేహాన్ని, ఆత్మీయతను, సహకారాన్ని పొంది కృతజ్ఞతాభిరతులైన కాశీ హిందూ విశ్వవిద్యాలయ విద్యార్థులు. ‘గురూజీ’ అనే ఉపనామం గోల్వల్కర్‌కు యువతరంలో గల జనప్రియత్వానికి సంకేతం. 

శ్రీ గురూజీ ఆర్‌ఎస్‌ఎస్‌కు రెండవ సర్‌సంఘచాలక్‌గా 1940లో బాధ్యత స్వీకరించి 33 సంవత్సరాలపాటు యావత్‌ ‌భారతదేశం పర్యటిస్తూ  భారతీయ ఆత్మను అర్థం చేసుకున్న గొప్ప సామాజికవేత్త. వారు ఆజన్మాంతము భారతజాతి నిత్య యవ్వనానికి ప్రతీకగా, ప్రేరణదాతగా నిలిచారు. గొప్ప మేధావి. సంఘటనాశిల్పి. వివిధ సందర్భాలలో ఆయన యువకులకు ఇచ్చిన మార్గదర్శనం, స్ఫూర్తి నేటికి కూడా అర్థవంతమైనదే. తత్సంబంధమైన అనేక విషయాలు ఆయన ప్రసంగాలలో, సార్వజనిక సభలలో, సమావేశాలలో విస్తారంగా ఉన్నాయి. గురూజీ తన ప్రసంగాల ద్వారానే కాక, పత్రికా రచనల ద్వారా, శుభాకాంక్షల సందేశాల ద్వారా ఎందరో యువకులకు మార్గదర్శనం చేస్తూ వచ్చారు.

గురూజీ 1940లో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌సంఘ చాలక్‌గా బాధ్యతను స్వీకరించారు. దేశంలోని యువశక్తిని సమకాలీన సమస్యలను ఎదుర్కొనడానికై జాగృతం చేయడంలో అప్పటినుంచే నిమగ్ను లయ్యారు.

జీవన సమర్పణకై ఉద్బోధన : 1940 జూన్‌ ‌నెలలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వ్యవస్థాపకులు డాక్టర్‌జీ పరమపదించిన ఆరు నెలల తరువాత నాగపూర్‌లో శీతాకాలం శిబిరం జరిగింది. అందులో గురూజీ మాట్లాడుతూ ఇలా వివరించారు : ‘‘ఇప్పుడు నేను స్పష్టంగా చెబుతున్నాను. డాక్టర్‌జీని మనం అసలు అర్థం చేసుకోలేకపోయాం. మనం మన వ్యక్తిగతమైన వృద్ధిగురించి, వ్యక్తిగతమైన సుఖాల స్వప్నాల గురించి పాకులాడకూడదని, వీటన్నిటికన్నా ఉన్నతంగా ఎదిగి సంఘకార్యాన్ని దేశవ్యాప్తం చేసేందుకై మనం ఏకమవ్వాలని ఆయన వాంఛించారు. డాక్టర్జీ జీవితం మనకేమి చెబుతోందో దానిని మనం అర్థం చేసుకోలేకపోయాం. మన ఈ జాతిని సంఘటితంగా, వైభవ సంపన్నంగా చేసేందుకు మనల్ని మనం సంఘకార్యానికి సమర్పించుకోవాలి.’’

ప్రభావిశాలియైన జీవన సూత్రం : గురూజీ హృదయంలో అందరిపట్లా అపారమైన స్నేహభావం ఉండేది. ఒకప్పుడు ఒక బాలుడు ఆయన ఆటోగ్రాఫ్‌ (‌సంతకం) సందేశం కావాలని అర్థించారు. గురూజీ వినమ్రతతో ‘‘బాబూ! నేను సందేశాలిచ్చేటంత మహా పురుషుడను కాను’’ అని చెప్పారు. కాని ఆ బాలుడు పట్టుబట్టి అర్థించాడు. అప్పుడు వారు చిరునవ్వుతో ‘మానవసేవే పరమాత్మ సేవ’ అని ఒకే ఒక వాక్యం రాసి సంతకం పెట్టారు.

కార్యకర్త బాధ్యత : గురూజీ తన జీవితంలోని ఒక సంఘటన ఇలా వివరించారు : ‘‘ఇదివరకు మా వద్ద ఒక సంఘ కార్యకర్త ఉండేవాడు. అతడు విద్యార్థి. కాని ఏమీ చదివేవాడు కాదు. తన పాఠ్యాంశాలేవో కూడా అతనికి తెలియవు. అతనివద్ద పుస్తకాలు కూడా ఉండేవి కావు. ఆ విద్యార్థి పరీక్షలలో ఉత్తీర్ణుడు అయి తీరాలని నేను అనుకున్నాను. ఎందుకంటే సంఘకార్యకర్త పరీక్షలలో విఫలమైతే అది ఒక చెడు ఉదాహరణగా ఉండిపోతుంది. చాలామంది పెద్దలు ఇక తమ పిల్లలను అతనితో కలిసి ఉండనివ్వరు. అందుకని నేను విశ్వవిద్యాల యానికి వెళ్లి అతని కొరకై అభ్యాసక్రమం, పుస్తకాన్ని తీసుకువచ్చాను. కొంతమంది అధ్యాపకులను కూడా కలుసుకున్నాను. ఆ విద్యార్థికి చదువు చెప్పడానికై నేను చాలా విషయాలు నేర్చుకోవలసి వచ్చింది. ఎందుకంటే అవి నేను చదువుకున్నవి కాదు. రోజూ ఉదయం 5.30 గంటలకు అతనికి చదువు చెప్పే వాడిని. చివరికి అతడు పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ రోజుల్లో అన్నిశాఖలలోను ఈ అలవాటు ఉండేది. జ్యేష్ఠ విద్యార్థులు కొత్త విద్యార్థులకు చదువులో సహాయపడుతూండేవారు.

‘‘మన స్వయంసేవకుల మంచి, చెడ్డలను మనం పట్టించుకోకపోతే, వారి స్వయంసేవకత్వం వారి మంచికేనన్న నమ్మకాన్ని మన చేతల ద్వారా కల్పించకపోతే వారిని మనం కలిపి ఉంచలేము.

నాగపూర్‌లోని విద్యార్థి స్వయంసేవకులు తనను కలుసుకోవడానికి వచ్చినపుడు వాళ్లతో పరీక్షలు సమిపించి, మీరు చదువులో నిమగ్నులై ఉన్నపుడు దగ్గరలో ఏదో ఊరేగింపు వెళుతూందనుకోండి, దానివైపు చూస్తారా? అది అసలు మీకు వినపడనే కూడదు. అలా మీకు అలవాటైపోవాలి అన్నారు.

మన సంఘ కార్యక్రమాల ద్వారా ఈ అలవాటు ఏర్పడుతుంది. శ్రేష్ఠత్వం, యోగ్యత కలుగుతాయి. ‘దక్ష’ చేసే అలవాటు నుంచి క్రమంగా ప్రతి పనిని చక్కగా చేసే గుణం నిర్మాణమవుతుంది. మనం పైసల విషయంలో జాగ్రత్తగా ఉంటే రూపాయలు తమ జాగ్రత్త తామే పడతాయి. చిన్న పనులు చక్కగా చేస్తే పెద్ద పనులు ఎప్పుడూ పాడు కావు.

నవయువకులు కావాలి: తను, మన, ధన సమేతంగా యౌవన భరితమైన శక్తి సామర్థ్యాలతో వికసించిన జీవితాలు ఈ సంఘకార్యానికి కావాలి. చీకిపోయిన జీవితం దీనికి పనికిరాదు. జీవితంలోని పొంగు ఉత్సాహం చల్లారాక మిగిలిన నిస్తేజమైన, నీరసమైన జీవితాన్ని దేశానికి సమర్పిస్తామని ఎవరైనా అనవచ్చు. కాని అది పొసగదు. అది పని చెయ్యని సిద్ధాంతం. మన జీవితంపై అన్నిటికన్నా మొదటి అధికారం సమాజానిదని అర్థం చేసుకుని మనం ముందుకు సాగాలి. ఈ ఆలోచనతోనే మనం జీవితాన్ని యోజన చేసుకోవాలి.

నిష్ఠ, సత్ప్రవర్తన అలవరచుకోవాలి: మద్రాసులో జూన్‌ 26, 1966‌న విద్యార్థుల కార్యక్రమంలో గురూజీ విద్యాభ్యాసం గురించి ప్రసంగిస్తున్నారు.  ‘విద్యను అభ్యసించడమంటే కేవలం చదవడం, వ్రాయడం, నేర్చుకోవడం మాత్రమే కాదు. విద్య నేర్చుకున్నందుకు సమాజ పరిణామంగా దేశభక్తి జాగృతంకావాలి. తన కర్తవ్యం గురించిన అవగాహన కలగాలి. విద్యాభ్యాసంవల్ల మనిషి దేశభక్తుడు కానట్లయితే, అది విద్యకాదు. అది కేవలం అక్షర జ్ఞానం మాత్రమే అనవచ్చు. సరైన అర్థంలో మన సమాజాన్ని సుశిక్షితం చెయ్యాలని మనం కోరు కుంటున్నాం. అది మన శాఖా కార్యక్రమాల ద్వారా జరుగుతుంది. మనకు లభించే స్వయంసేవకులు చదవడం, వ్రాయడం తెలిసినవారు కాకపోవచ్చు; కాని వాళ్లు తప్పకుండా సుశిక్షుతులవు తారు.

‘‘నాకు ఒక కార్యకర్త గుర్తుకు వస్తున్నాడు. అతడు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తుండేవాడు. 11 శాఖలను నిర్వహిస్తూ ఉండేవాడు. అతడికి తన పేరు వ్రాసుకోవడం కూడా రాదు. కాని సమాజంలో ప్రతి ఒక్కరితోను అతనికి ఆత్మీయ సంబంధం ఉండేది. అనేకమంది స్వయంసేవకులకు అతడు సమాజం పట్ల గల కర్తవ్యాన్ని బోధించి వారికి పనిలో ప్రేరణ ఇస్తూండేవారు. అందువల్ల ఆ క్షేత్రంలో ఆ కార్యకర్తకు మంచి విలువ ఉండేది. అతడితో సంప్రదించిన తరువాతనే ఊళ్లో ఇతర సార్వజనిక కార్యక్రమాలు వేటినైనా జరిపితే మంచిదని అందరికీ అనిపిస్తూ ఉండేది. అతడు అంత విశ్వాసపాత్రుడయ్యాడు. ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు ఆ ఊరికి వెళ్లి ఉపన్యాసాలు ఇవ్వడం సాధ్యమయ్యేది కాదు. ‘‘ఈ కార్యకర్త చదువు లేనివారు కదా, ఇతడిని మీరు ఎందుకు అంతగా విశ్వసిస్తున్నారు’’ అని ఒక నేత ఊరివారిని అడిగాడు. ‘‘అతడు చదువులేనివాడు కావచ్చు, కాని ఎప్పుడూ మా మంచి గురించే ఆలోచిస్తాడు. అందుచేత ఊళ్లో అందరూ అన్ని పనులనూ ఒక్క ఆలోచనతో చేయడం జరుగుతుంది. అతడి ప్రవర్తన నిష్కళంకమైనది. అందుచేత అతడంటే మాకు విశ్వాసం’’ అని ఊరి ప్రజలు చెప్పారు. అంతా విని ఆ నాయకుడు ఆ కార్యకర్తను ‘‘ఎన్నికలను ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? మమ్మల్ని మాట్లాడనిస్తే నీకు వచ్చే నష్టమేమిటి?’’ అని అడగగా ఆ కార్యకర్త ‘‘అయ్యా! ఎన్నికల ప్రసంగాలలో మీరు ఒకరినొకరు ద్వేషించుకునే మాటలే చెబుతారు. అటువంటి మాటలవల్ల గ్రామానికి ఏమి జరుగు తుంది?’’ అని జవాబిచ్చాడు. సూటిగా అన్నప్పటికీ, స్వచ్ఛ హృదయంతో అన్న ఆ మాటలను విన్న ఆ రాజకీయ నేత ఏ సమాధానం చెప్పకపోవడమే తనకు మేలని భావించి తిరిగిపోయాడు.

యువతకు పిలువు: అనేక ప్రసంగాలలో  గురూజీ యువకులకు ఉత్సాహాన్ని వృద్ధి చేస్తూ ఇలా పిలుపునిచ్చారు. ‘‘మనం సమస్త శక్తితో ఈ దేశభక్తి జ్యోతిని వెలిగించాలి. దానిని దేశ వ్యాపితమైనదిగా, ప్రగాఢమైనదిగా చెయ్యాలి.  దాని ప్రకాశంలో అజ్ఞా నాంధకారం తొలగిపోతుంది. ఈ జ్యోతి లోకంలోని అసురశక్తులన్నిటినీ సవాలు చేస్తుంది. ఈ మార్గంలో మాత్రమే మనం సాఫల్యం పొందగలం.’’

సంఘకార్యం-ఆరోగ్యం : ‘‘పరిశ్రమపూర్వకంగా సంఘకార్యంతో మమేకం కావాలంటే కష్టాలను సహించవలసే ఉంటుంది. కష్టించి పనిచేసేటప్పుడు మన శరీర దారుఢ్యం సరిగ్గాలేక కాస్త అటూ ఇటూ గబగబా వెళ్లి వచ్చేసరికి తట్టుకోలేని పరిస్థితి వస్తే మనం సంకల్పించిన మహాకార్యం నెరవేరదు. కనుక శరీరం ఆరోగ్యంగా శక్తిసంపన్నంగా ఉండాలి’’ అని  గురూజీ అనునిత్యం యువకులకు చెబుతూండేవారు.

‘‘నేను ఎన్నో ఏళ్లుగా నా స్వయంసేవక బంధు వులకు ఇలా చెబుతున్నాను : ‘‘ఎక్కువగా వద్దుగానీ రోజూ కనీసం 25 సూర్యనమస్కారాలు చేస్తూ ఉండండి. ఎవరివద్దనైనా నేర్చుకుని మీ శరరానికి అనుకూలంగా ఉండే ఆసనాలు రెండో మూడో వెయ్యండి. అయిదు నిమిషాలు కూర్చొని దీర్ఘశ్వాసలు తీసుకోండి. దానితో శరీరానికి కావలసినంత శక్తి, చైతన్యస్ఫూర్తి ఎప్పుడూ అలిసి పోకుండా ఉండే సామర్థ్యం కలుగుతాయి.’’

‘‘ఈ రోజుల్లో పడుచుతనంలో తమ శరీరాలను సౌందర్య దృష్టితో అలంకరించి తీర్చిదిద్దుకొనడానికి వెచ్చిస్తున్న సమయంలో కనీసం వందవ వంతు అయిన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు వినియోగిస్తే బలిష్ఠంగా తయారుకాగలరు. అయినా అందరూ చెప్పేది మాకు సమయంలేదనే.’’

‘‘నా జీవితంలో నాకు సొంతంగా అనుభవంలోకి వచ్చిన విషయం ఇది. ఈ రోజు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కొన్నాళ్ల క్రితం డాక్టర్లంతా కలిసి నా శరీరంలోని ఒక భాగాన్ని కోసివేశారు. అందుచేత 2 సంవత్సరాలనుంచీ సూర్యనమస్కారాలు చెయ్య లేకపోతున్నాను. అంతకుముందు వాటిని చేస్తూనే ఉండేవాడిని. అంటే నాకు 65 సంవత్సరాలు వచ్చే వరకూ ఇదంతా జరుగుతూనే ఉండేది. నేను ఇన్నేళ్లుగా దేశమంతా పర్యటిస్తూన్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు నా గురించి నా సహచరులు మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. కాని ఇంతకు ముందు నేను కాలినడకనే పల్లెపల్లెకు తిరిగాను. కారు, ఎడ్లబండి, లేకపోతే సైకిలు, ఏదీ దొరకకపోతే కాలినడక-ఇలా అన్నిరకాల ప్రయా ణాలు చేశాను. ఉదయమైనా, రాత్రి అయినా, అన్నం దొరికినా,దొరక్కపోయినా అలాగే కాలంవెళ్లబుచ్చాను. అయినా, ఇప్పటికీ మీ ముందు సజీవంగానే ఉన్నాను. మళ్లీ ఈ అన్నిరకాల ప్రయాణాలు చేస్తూనే ఉన్నాను.

చాలామంది తమ వయసు ఉడిగిపోయిందని అలసిపోయి చతికిలబడే వయసులో నేను పూర్తి ఉత్సాహంతో కార్యరతుడనై ఉన్నాను. ఇందుకు కారణం నేను చిన్నప్పటి నుంచీ వ్యాయామం చెయ్యడమే. యౌవనంలోను, ఆ తరువాతి దేశలోను, మొన్నమొన్నటివరకు నా వ్యాయామసాధన సాగు తూనేఉంది. నాకు వ్యాయామంవల్ల ఇంత ప్రయో జనం కలిగింది. అందుచేత అన్ని పరిస్థి తులనూ ఢీ కొనగల శరీరాన్ని మనం పొందేందుకు ఆలోచిం చాలి.

– శ్రీ గురూజీ – యువత పుస్తకం నుండి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.