భారతీయ నాగరికతకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్రకు సజీవ సాక్ష్యాలు.. మన దేవాలయాలు! కానీ, నేటికీ వాటి వెనక ఉన్న ఎన్నో విషయాలు అంతుపట్టని రహస్యాలుగా మిగిలిపోయాయి. సాధారణంగా అయితే ఆలయాలను భక్తికి, ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా భావిస్తాం. కానీ నిశితంగా పరిశీలిస్తే ఖగోళ విజ్ఞానం, లోహశాస్త్రం, శిల్పకళ వంటి అనేక విజ్ఞాన రంగాల సమన్వయం వాటి నిర్మాణంలో కనిపిస్తుంది. అందుకే భారతీయ దేవాలయాలను కేవలం ఆరాధనా కేంద్రాలుగా మాత్రమే కాకుండా, తత్త్వం, శాస్త్రం, కళ, సంస్కృతి కలగలిసిన ఒక సమగ్ర విజ్ఞానవ్యవస్థగా కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా దేవాలయాల వెనుక దాగి ఉన్న శాస్త్రీయ విశేషాలు, నిర్మాణ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
భారతీయ సంస్కృతిలో ప్రతి పదం వెనుక ఒక శాస్త్రీయపరమైన అర్థం దాగి ఉంటుంది. ఉదాహరణకు “గ్రహం” అనే పదం ‘గ్రహ’ అనే ధాతువు నుండి ఉద్భవించింది. గ్రహించడం, ఆకర్షించడం, తన గురుత్వంలో బంధించడం అని ఈ పదానికి అర్థం. ఖగోళశాస్త్రపరంగా చూస్తే.. విశ్వంలోని గ్రహాలు అన్నీ సూర్యుని గురుత్వా కర్షణ కారణంగా, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టే వాటిని మనం గ్రహాలు అని పిలుచుకుంటాం. ఈ “గ్రహం” అనే పదానికి “వి” అనే ఉపసర్గ చేరినప్పుడు “విగ్రహం” అనే పదం ఏర్పడుతుంది. “వి” అంటే విశిష్టమైనది, ప్రత్యేకమై నది అని అర్థం. అంటే.. విగ్రహం అనేది సాధారణ రాతి శిల కాదు; మన మనసును ఒక దగ్గర కేంద్రీకరించి, ఏకాగ్రతను పెంచే ఒక విశిష్టమైన ప్రతీక. భక్తుడు విగ్రహం చుట్టూ చేసే ప్రదక్షిణ కూడా ఒక తాత్త్విక సంకేతం. గ్రహాలు సూర్యుని చుట్టూ పరిభ్రమించినట్లే, జీవి తన జీవిత కేంద్రంగా భావించే పరమతత్వం చుట్టూ తిరుగుతూ తన అహంకారాన్ని విడిచిపెట్టాలనే భావన ఇందులో అంతర్లీనంగా ఉంటుంది.
అదే విధంగా “ప్రకృతి” అనే పదాన్ని పరిశీలించి నప్పుడు కూడా మన పూర్వికుల తాత్త్విక దృష్టి కోణం ఎంత గొప్పదో అర్థమవుతుంది. “కృతి” అంటే కూర్చినది అని అర్థం. ఈ పదానికి ప్రకృష్టంగా అనే అర్థం ఉన్న “ప్ర” అనే ఉప సర్గ చేరడం ద్వారా ప్రకృష్టంగా కూర్చినది అనే అర్థం వస్తుంది. అంటే… పంచభూతాల సమన్వయంతో ఏర్పడిన ఈ జగత్తులో ప్రతి రాయి,చెట్టు, పర్వతం, నది జీవనానికి ఆధారం. అందుకే భారతీయ సంస్కృతి ప్రకృతిని జయించాల్సిన వస్తువుగా కాకుండా ఆరాధించాల్సిన తల్లిగా చూసింది. చెట్టును దేవతగా, నదిని దేవిగా, పర్వతాన్ని పుణ్యక్షేత్రంగా, భూమిని భూదేవిగా భావించడం వెనుక ప్రకృతి పట్ల కృతజ్ఞతా భావమే ప్రధాన కారణం. ఈ ఆలోచనా విధానం నేటి పర్యావరణ పరిరక్షణ సిద్ధాంతాలకు కూడా చాలా దగ్గరగా కనిపిస్తుంది.
ఇక.. ఆధ్యాత్మిక విషయాల్లో అత్యంత విశిష్టమైన ప్రతీకలలో శివలింగం ఒకటి. లింగాన్ని కేవలం ఆరాధనా చిహ్నంగా మాత్రమే కాకుండా విశ్వసృష్టికి ప్రతీకగా కూడా అనేక తాత్విక గ్రంథాలు వ్యాఖ్యా నించాయి. శివలింగం గుండ్రటి ఆకారం భూమిని తలపిస్తుంది. శివుని జటాజూటంపై చంద్రుడు ఉండటం – శివుడి తలపై గంగాదేవి ఉండటం – భూమిపై వర్షం కురిస్తే సస్యశ్యామలం అవ్వడం వంటివన్నీ మన నిత్య జీవితచక్రానికి ఆధ్యాత్మిక రూపకాలు. ఈ మొత్తం ప్రక్రియను ప్రకృతి చక్రాలను ప్రతీకాత్మకంగా వివరించే భారతీయ చింతనకు ఒక ఉదాహరణగా చూడవచ్చు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే త్రిమూర్తుల భావన కూడా ప్రకృతి నిర్వహణలోని మూడు స్థితులను సూచించే తాత్విక రూపకాలుగా వివరించారు. “బ్రహ్మ” అనే పదం విస్తరణను, సృష్టిని సూచిస్తుంది. “విష్ణు” అనే పదం వ్యాపించడం, సర్వవ్యాప్తిని సూచిస్తుంది.“శివ” అనే పదానికి శుభం, మంగళం, కల్యాణం అనే అర్థాలు ఉన్నాయి. సృష్టి, స్థితి, లయం అనే ప్రక్రియలను వ్యక్తీకరించేందుకు భారతీయులు ఈ రూపకాలను ఉపయోగించారు. అందువల్ల దేవతలను కేవలం వ్యక్తులుగా కాకుండా విశ్వంలో నిరంతరం జరిగే సహజ ప్రక్రియలకు ప్రతీకలుగా కూడా భావించాల్సిన అవసరం ఉంది.
ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత దేవాలయ నిర్మాణాన్ని పరిశీలిస్తే… ఉత్తర భారతదేశంలోని గోపురాలు నాగుపాము ఆకారాన్ని పోలిన నాగర శైలిలో ఉంటాయి. మధ్యభారతదేశంలోని గోపురాల శైలి వేసర శైలి. అంటే.. ఉత్తర, ద్రావిడ నిర్మాణాల సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది. దక్షిణ భారతదేశంలోనివి ద్రావిడ శైలి గోపురాలు. విశాల ప్రాకారాలు, ఎత్తైన ధ్వజస్తంభాలు, లోహ కలశాలతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యకాలంలో, శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో నిర్మించిన దేవాలయాలు శిల్పకళా వైభవానికి అద్భుత నిదర్శనాలుగా నిలిచాయి.
ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఆధునిక కాలంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కమ్యూనికేషన్ టవర్లు అభివృద్ధి చెందిన తర్వాత మనం వాటిని అత్యాధునిక సాంకేతిక నిర్మాణాలుగా భావిస్తున్నాం. అయితే వేల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలలో కూడా ధ్వజస్తంభాలు, లోహ కలశాలు, గోపురాలు, పంచలోహ విగ్రహాలు, ప్రాకారాల వంటి నిర్మాణాలు ఎందుకు వాడాల్సి వచ్చింది? ఇవి కేవలం ఆధ్యాత్మిక అవసరాల కోసమేనా? లేక నిర్మాణశాస్త్రం, ధ్వనిశాస్త్రం, లోహశాస్త్రం, ఖగోళ విజ్ఞానం వంటి అనేక అంశాల సమన్వయ ఫలితమా? సంప్రదాయ విశ్వాసాలను గౌరవిస్తూనే, వాటిని ఆధునిక శాస్త్రీయ దృష్టి కోణంలో కూడా పరిశీలించడం కూడా చాలా అవసరం. భూమిపైన చంద్రుడు ఉండటం, అప్పుడే భారతీయ దేవాలయ వ్యవస్థ గొప్పతనాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ఈ ఆధునిక శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించినప్పుడు, మన ఆలయాలలో కనిపించే ప్రతి ఆచారం వెనుక సైన్స్ దాగి ఉందనే నిజం బోధపడుతుంది. మన పూర్వికులు ఆలయ వ్యవస్థను కేవలం పూజా మందిరాలుగా కాకుండా, ఒక పవర్ గ్రిడ్ తరహాలో ‘ఎనర్జీ మేనేజ్‌మెంట’ (శక్తి నిర్వహణ) కేంద్రాలుగా తీర్చిదిద్దారు. దీనికి ప్రధాన ఆధారాలు మనకు ఆధ్యాత్మిక పరిభాషలో వినిపించే ఔషధం, మంత్రం, తంత్రం, యంత్రాల రూపాల్లో కనిపిస్తాయి. ఉదాహరణకు, ఆలయ ప్రాంగణాల్లో పెంచే తులసి, మారేడు, రావి వంటి మొక్కలు వాతావర ణాన్ని శుద్ధిచేసే ఆయుర్వేద ఔషధాలుగా పనిచేస్తాయి. మనం పండగలలో, శుభకార్యాలలో ఉపయోగించే మామిడి ఆకులు చెట్టునుండి వేరు చేసినా 24 గంటల పాటు ఆక్సిజన్‌ను విడుదల చేస్తూనే ఉంటాయి. గుడిలో వందలమంది భక్తులు ఒక దగ్గర చేరినా అందరికీ సరిపడా ప్రాణవాయువు అందాలనే దూరదృష్టితోనే మామిడి తోరణాలు కట్టే సంప్రదాయాన్ని తెచ్చారు మన పూర్వీకులు. అలాగే అర్చకులు పూజావిధానాల్లో ప్రదర్శించే విభిన్న రకాల ‘ముద్రలు’ మన శరీరంలోని నాడీ వ్యవస్థను ఉత్తేజపరిచే సూక్ష్మ వ్యాయామాలుగా ఉపయోగపడతాయి. శరీరంలోని ప్రాణశక్తిని, ఏకాగ్రతను పెంచే ఈ ప్రక్రియనే ఆధ్యాత్మికంగా ‘తంత్రం’ అంటారు.
ఇక గర్భగుడిలో అర్చకుల నోటినుండి వచ్చే వేద మంత్రోచ్ఛారణలు (మంత్రం) సాధారణ శబ్దాలు కావు, అవి ఒక ప్రత్యేకమైన ధ్వనితరంగాలను, విద్యుదయా స్కాంత శక్తిని సృష్టిస్తాయి. ఈ శబ్ద తరంగాల సూక్ష్మ భావాలు అక్కడి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చి, మానవ మనస్సును ఉత్తేజపరుస్తాయి. ఈ విధంగా ఉత్పన్నమయ్యే మానసిక, ధ్వని శక్తులను గ్రహించి, భద్రపరచడానికి ఆలయాలలో ‘యంత్రాలు’ అనే లోహ వాహకాలను ఉపయోగించారు.
దేవాలయాల నిర్మాణ సమయంలో భూమి పూజలోనే వివిధ రకాల లోహా లను, నవరత్నాలను నిక్షిప్తం చేయడం మనం గమనించే ఉంటాం.. దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే, అవి భూగర్భ శక్తిని గ్రహించే రిసీవర్లుగా పనిచేస్తాయి. వాయు, ద్రవ పదార్థాలతో పోలిస్తే పంచలోహాల వంటి ఘన పదార్థాలలో అణువులు అత్యంత దగ్గరగా ఉండటం వల్ల శక్తి ఒక అణువు నుండి మరో అణువుకు సులభంగా ప్రసరిస్తుంది. అందుకే ధ్వజస్తంభాల కింద, మూలవిరాట్టు కింద లోహపు పలకలను ఉంచి, ఆలయ శిఖరాలపై లోహపు కలశాలను, తొడుగులను అమర్చారు. ఇవి మంత్ర తంత్రాల ద్వారా విడుదలయ్యే శక్తికి అద్భుతమైన వాహకాలుగా (్పుశీఅductశీతీs) పనిచేస్తాయి.
దేవాలయాలలో నిత్యం జరిగే అభిషేకప్రక్రియ వెనుక కూడా ఒక అద్భుతమైన భౌతికశాస్త్ర సూత్రం ఇమిడి ఉంది. గర్భగుడిలోని పంచలోహ లేదా శిలా విగ్రహంపై ఎత్తు నుండి పాలు, నీరు వంటి ద్రవ్యాలతో అభిషేకం చేసినప్పుడు, అక్కడ ‘స్థితి శక్తి’ కాస్తా ‘గతి శక్తి’గా మారుతుంది. ఆధునిక కాలంలో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో ఎతెí్తన ప్రదేశం నుండి నీరు టర్బైన్లపై పడినప్పుడు విద్యుత్ శక్తి ఎలా జనిస్తుందో, ఆలయాల్లో జరిగే ఈ అభిషేక ప్రక్రియ ద్వారా కూడా అదే తరహాలో సూక్ష్మశక్తి తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ఇలా మంత్ర, తంత్ర, యంత్రాల ద్వారా విశ్వవ్యాప్తంగా అంతర్గతంగా ఉన్న సకారాత్మక శక్తిని గ్రహించి, నిల్వ చేసుకొని, తమ వద్దకు వచ్చే భక్తులకు అందించే అద్భుతమైన శక్తి నిర్వహణ కేంద్రాలుగా మన ఆలయాలు విరాజిల్లుతున్నాయి.
ఈ మొత్తం ఆలయ వ్యవస్థను నిశితంగా గమనిస్తే, నేటి ఆధునిక విద్యుత్ సరఫరా వ్యవస్థకు ఇది ఒక ప్రతిరూపంగా కనిపిస్తుంది. పవర్ స్టేషన్‌లోని జనరేటర్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్, ట్రాన్స్‌ఫార్మర్ల ద్వారా సబ్-స్టేషన్లకు చేరి, అక్కడి నుండి విద్యుత్ స్తంభాల సహాయంతో ఇళ్లకు, పరిశ్రమలకు ఎలా చేరుతుందో, ఆలయాలలోనూ సరిగ్గా అదే ప్రక్రియ సాగుతుంది. విద్యుత్తును ఉత్పత్తి చేసే జనరేటర్ వంటి గర్భగుడి నుండి, అర్చకులనే ఎలక్ట్రీషియన్ల సహాయంతో శక్తి బయటకు వస్తుంది. అది అంతరాలయంలో ప్రయాణించి, పరివార దేవతల ద్వారా విస్తరిస్తూ, విద్యుత్ స్తంభాల వంటి ధ్వజస్తంభాల సహాయంతో సమాజంలోని సామాన్యుల నుండి మహాభక్తుల దాకా అందరికీ వారి వారి గ్రహణ శక్తిని బట్టి అందుతుంది. అందుకే గుడికి వెళ్లే భక్తులు అక్కడ మానసిక ప్రశాంతతను, ఒక తెలియని నూతన ఉత్తేజాన్ని పొంది, తమ జీవిత సమస్యలను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని సంపాదిస్తు న్నారు. వేలాది సంవత్సరాల క్రితమే ఇంతటి అద్భుతమైన సాంకేతిక దూరదృష్టి కలిగిన మన పూర్వీకులు అనాగరికులు ఎంతమాత్రం కాదు, వారు కాలం కంటే ముందు నడిచిన అసలైన ఆధునికులు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఒక్క మాటలో చెప్పాలంటే… దేవాలయాలు అనేవి భక్తిభావాన్ని పెంచే రాతి కట్టడాలు మాత్రమే కావు.. అవి ఆధ్యాత్మికత రూపంలో మన పూర్వికులు సమాజానికి అందించిన అధునాతన శాస్త్ర సాంకేతిక నిలయాలు. ఆధునిక విజ్ఞానం ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్న ఎన్నో విషయాలను, వేల సంవత్సరాల క్రితమే మన పెద్దలు జీవనవిధానంలో భాగం చేశారు. ఇలాంటి అద్భుతమైన వ్యవస్థను మూఢనమ్మకాల పేరిట కొట్టిపారేయడం ఎంత తప్పో, కేవలం పూజలకే పరిమితం చేసి వాటి వెనుక ఉన్న సైన్స్‌ను విస్మరించడం కూడా అంతే తప్పు. కనుక, సంప్రదాయాన్ని గుడ్డిగా కాకుండా, అందులోని శాస్త్రీయ దృక్పథాన్ని, తత్వాన్ని అర్థం చేసుకుని నేటి తరానికి అందించినప్పుడే మన సంస్కృతికి మనం నిజమైన గౌరవం ఇచ్చినట్లవు తుంది. ఆ అద్భుత విజ్ఞాన వారసత్వాన్ని కాపాడు కుంటూ ముందుకు సాగడమే ప్రస్తుతం మన అందరి బాధ్యత!
Reference Books:
- కమలాకర శర్మ, సాగి. జ్యోతిష కమలాకరం, తేజశ్రీ ప్రచురణలు
- దేవాలయం – హైందవ సంస్కృతికి ప్రతీక, మోహన్ పబ్లికేషన్స్
- వేంకటసత్య బ్రహ్మాచార్య, కందుకూరి. శ్రీ మయమత శిల్పశాస్త్రము – ప్రతిమా లక్షణం
- శివనాగిరెడ్డి, ఈమని. ఆలయ నిర్మాణం – ప్రాసాద లక్షణం.

మ్యాడం అభిలాష్
కంటెంట్ రైటర్, TAL Radio, 8142576346