విద్యార్థుల న్యాయమైన సమస్యలను ఆలకించడం ప్రభుత్వ బాధ్యత. అయితే అదే సమయంలో ఆందోళనను హింస, వదంతులు, అధికారం కోసం జరిగే పోరాటంగా మార్చే ప్రయత్నాలను గుర్తించడం కూడా అంతే అవసరం. ఒక పరీక్ష విశ్వసనీయత అనేది కేవలం ఒక అభ్యర్థి ఫలితానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. అది ప్రతిభ, సమాన అవకాశాలు, ప్రభుత్వ సంస్థల ప్రతిష్ట, దేశ భవిష్యత్తు మానవ వనరులతో ముడిపడి ఉన్న ఒక విస్తృతమైన జాతీయ అంశం. ప్రస్తుత విద్యార్థి ఉద్యమం వెనుక ఉన్న ప్రధాన సమస్య వాస్తవమైనది. వాస్తవికతపై ఆధారపడి ఉంది. పరీక్షల సమగ్రత, ఫలితాల విశ్వసనీయత, డిగ్రీల ప్రామాణికత,  నియామక ప్రక్రియలలోని నిష్పాక్షికత ఒక యువతి లేదా యువకుడి జీవితాన్ని నిర్ణయిస్తాయి అనడంలో ఎలాంటి సందేహానికి తావులేదు. ఆ క్రమంలో పరీక్షల సంస్కరణల కమిటీ ఏర్పాటు, పర్యవేక్షణ యంత్రాంగాలు,  వేగవంతమైన విచారణ కోర్టుల ఏర్పాటు వంటి కీలక చర్యలను ప్రభుత్వం చేపట్టింది. అయితే నిర్ణయాత్మక చర్యల అమలులో జాప్యం కారణంగా విద్యార్థులలో నెలకొన్న అసంతృప్తి దేశం నలుచెరుగులా విస్తరించడానికి అవకాశం ఏర్పడింది. మరోవైపు రాజకీయ పార్టీలు, భావజాల ఆధారిత సమూహాలు ,సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు విద్యార్థుల నిజమైన అసంతృప్తిని తమ విస్తృత అధికార పోరాటాలతో ముడిపెట్టడానికి ప్రయత్నించాయి. ఇంతటి భావోద్వేగపూరితమైన వాతావరణం నుంచి పుట్టుకొచ్చిన అద్వితీయమైన యువశక్తిని సంస్కరణలు, చర్చలు, వ్యవస్థాగత పరిష్కారాల దిశగా మళ్లించవలసిన బాధ్యత ప్రస్తుతం ప్రభుత్వం, నిరసన తెలుపుతున్న యువత, జాతీయ పౌర సమాజ సంస్థలు అనే ఈ మÖడింటిపైన ఉంది.


“పేపర్ లీక్ అనేది ఒక సాధారణమైన విషయం కాదు. అది లక్షలాది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అత్యంత బాధాకరమైనది. ఆ కారణంగానే రెండున్నర నెలలుగా అనేక చర్యలు చేపట్టాము. నిందితులను అదుపులోకి తీసుకున్నాము. ప్రస్తుతం వారు చెరసాలలో ఉన్నారు. విద్యార్థులు వారి విలువైన సమయాన్ని నష్టపోకుండా చూడటం మా బాధ్యత. అందుకనే అతి తక్కువ కాలంలోనే 22 లక్షలమంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించాము. ఫలితాలు కూడా వచ్చాయి. అలాగని మేం దీనితో సంబరపడిపోయేవారము కాము. ఆ కారణంగానే ఫాస్ట – ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశించాం”


నా యువ మిత్రులారా,

నాలుగు దశాబ్దాలకు పైగా విద్యార్థులు, బోధన, విద్యా సంస్కరణల కోసం నన్ను నేను అంకితం చేసుకున్నాను. ఒక బలమైన, సమ్మిళితమైన, దూరదృష్టితో కూడిన విద్యా వ్యవస్థే ఒక బలమైన దేశానికి పునాది అని నేను ఎప్పుడూ విశ్వసిస్తాను.

 దేశ యువత ఆశయాలు, భావోద్వేగాలు, న్యాయమైన ఆకాంక్షలను నేను ఎంతగానో గౌరవిస్తాను. భారత యువత కలలను సాకారం చేయడం అనేది మా రాజకీయ, సామాజిక జీవితాల్లో ఒక నైతిక బాధ్యతగా ఉంటూ వచ్చింది. గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

అయితే, మే 3, 2026న జరిగిన నీట్ పరీక్షకు సంబంధించి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయాన్ని వెంటనే పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, దీనిపై దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. పరీక్షను రద్దు చేయడంతో పాటు పునఃపరీక్ష తేదీని కూడా ప్రకటించింది. అంతేకాకుండా, వచ్చే ఏడాది నుండి ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ యావత్ ప్రక్రియలో 20 లక్షల మందికి పైగా విద్యార్థులకు పరీక్షను సజావుగా నిర్వహించడమే మా ప్రధాన ప్రాధాన్యతగా ఉన్నది. దీనిని సాధించడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా జిల్లా యంత్రాంగాలను కలుపుకొని ఒక సమగ్రమైన ప్రభుత్వ విధానాన్ని అనుసరించాము. చివరికి, విద్యార్థులు, తల్లిదండ్రుల సహకారంతో జూన్ 21, 2026న పరీక్ష విజయవంతంగా ముగిసింది.

మొదటి రోజు నుంచే నేను ఈ వ్యవహారంలో బాధ్యత తీసుకున్నాను. అలా తీసుకున్న బాధ్యత నుంచి ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. ‘పరీక్షల మాఫియా’ వల్ల ఏ ప్రతిభావంతుడైన విద్యార్థి భవిష్యత్తు దెబ్బతినకూడదని, అలాగే ఏ విద్యార్థికి అన్యాయం జరగకూడదనే ఒక దృఢమైన నిశ్చయంతో నేను ఉన్నాను.

జూలై 16న ప్రకటించిన నీట్ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. వెనుకబడిన వర్గాలకు చెందిన అనేకమంది ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా ఇందులో విజయం సాధించారు.

అయితే, ఈ కాలంలో కూడా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొందరు వ్యక్తులు అనేకమంది విద్యార్థులను తప్పుదోవ పట్టించేలా అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించారు. ఇది నాలో తీవ్ర ఆవేదనకు కారణమైంది.

మన ప్రజాస్వామ్య శక్తిపై నాకు ఎల్లప్పుడూ అచంచలమైన విశ్వాసం ఉంది. అలాగే యువత ఆశయాలు, కలలు ఆకాంక్షల పట్ల నాకు ప్రగాఢమైన గౌరవం ఉంది. వారు కేవలం భారతదేశ భవిష్యత్తు మాత్రమే కాదు. వారు నవ, వికసిత భారత్‌కు దిక్సూచులు, నిర్మాతలు, రూపకర్తలు కూడా.

గత పది రోజులుగా జరిగిన పరిణామాలు నన్ను బాధించాయి. ఇది నాకు వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు.

భారతదేశ యువశక్తే దేశానికి నిజమైన బలం.

దేశ యువత గందరగోళ వలయంలో చిక్కుకుపోకుండా చూడాలన్నది నా సంకల్పం.

జంతర్ మంతర్ వద్ద, దేశవ్యాప్తంగా తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, దేశ వ్యతిరేక శక్తులు దీనిని తమకు అనుకూలంగా మలుచుకోకుండా అడ్డుకోవడం, జాతీయ సమైక్యతను కాపాడటం, ఏ ఒక్క భారతీయ విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకుండా చూడటం, అలాగే మన పిల్లలు తమ సమయాన్ని చదువులకు కేటాయించి కెరీర్‌ను నిర్మించుకోవడంపై దృష్టి సారించేలా చేయడం వంటి లక్ష్యాలతో నేను గౌరవనీయులైన ప్రధానమంత్రికి నా రాజీనామాను సమర్పించాను.

గౌరవనీయులైన ప్రధానమంత్రిగారి మార్గదర్శకత్వం, విశ్వాసం, నిరంతర మద్దతుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే, మంత్రివర్గంలోని నా సహచరులు, మంత్రిత్వ శాఖ అధికారులు, సిబ్బందికి, నాతో కలిసి పనిచేసిన వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా దేశ సేవ ఉంది. దీనిపట్ల నేను ఎల్లప్పుడూ అంకిత భావంతో ఉంటాను.

జగన్నాథ స్వామి ఆశీస్సులతో, భారతమాత, ఒడిశా ప్రజలు, దేశ యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి అన్ని విధాలుగా నన్ను నేను అంకితం చేసుకుంటూనే ఉంటాను.

మీ,

ధర్మేంద ప్రధ్రాన్


ఒక వ్యాఖ్యతో మొదలు

‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో ఆవిర్భవించిన ఉద్యమానికి సుప్రీంకోర్టులో చేసిన ఒక మౌఖిక వ్యాఖ్యే తక్షణ ప్రేరకంగా నిలిచింది. మీడియాలో వచ్చిన వార్తలు, సోషల్ మీడియా పోస్టులు ఈ వ్యాఖ్యను నిరుద్యోగ యువతను ఉద్దేశించినదిగా విస్తృతంగా అన్వయించాయి. సహజంగానే, ఇది తీవ్రమైన ప్రతిచర్యను రేకెత్తించింది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఉపయోగించిన భాషను యువత అవమానకరంగా భావిస్తే, దానిపై సున్నితమైన సమీక్ష జరగాలి. ఈ వివాదానికి మరో కోణం కూడా ఉంది. మే 16న తన వ్యాఖ్యలు దేశంలోని సాధారణ నిరుద్యోగ యువతను లేదా విద్యార్థులను ఉద్దేశించినవి కావని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. నకిలీ లేదా బూటకపు డిగ్రీల ఆధారంగా న్యాయవాద, పాత్రికేయ లేదా ఇతర వృత్తులలోకి ప్రవేశించి వ్యవస్థను దుర్వినియోగం చేసే వ్యక్తులపైనే ఆ విమర్శలు చేశానని పేర్కొన్నారు. యువతను ‘వికసిత్ భారత’ (అభివృద్ధి చెందిన భారతదేశం)కు పునాదిగా అభివర్ణించారు. మీడియాలో తన వ్యాఖ్యలను అసంపూర్ణంగా ప్రస్తావించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవులలో ఉన్న వ్యక్తులు పలికే మాటలు సమాజంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి, ఈ వివరణ వివాదాన్ని పూర్తిగా పరిష్కరించదు. అయినప్పటికీ, అసలు వ్యాఖ్య, దాని సందర్భం, తదనంతర వివరణ అన్నీ కూడా నిష్పాక్షికమైన చర్చలో ప్రస్తావనకు నోచుకోవాలి. నిజమైన అర్హతలు కలిగిన యువతకు సంబంధించి ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉంది. నకిలీ డిగ్రీల ఆధారంగా వృత్తిలోకి ప్రవేశించిన వారిపై విచారణ జరిపితే, నిజమైన పరీక్షలో ఉత్తీర్ణులై, సరైన శిక్షణ పొంది, కఠిన శ్రమతో అర్హతలు సాధించిన వ్యక్తే ప్రధానంగా లబ్ధిపొందుతారు. అందువల్ల, అభ్యంతరకరమైన భాషపై విమర్శలు సమంజసమే అయినప్పటికీ, నకిలీ డిగ్రీలు, బూటకపు ధృవపత్రాలపై జరుగుతున్న విచారణను వ్యతిరేకించడం మాత్రం యువత ప్రయోజనాలకు అనుకూలమైన చర్యగా పరిగణించలేము. ఒక నిర్దిష్ట వ్యాఖ్య పట్ల కలిగే ఆగ్రహం కారణంగా, అర్హులైన, కష్టపడి పనిచేసే యువతకు మేలు చేసే సంస్కరణలనే వ్యతిరేకించే పరిస్థితి రాకుండా యువజన ఉద్యమం జాగ్రత్త వహించాలని ఢిల్లీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వివేకానంద పేర్కొన్నారు. భాషలో హుందాతనాన్ని పాటించాలని కోరుతూనే, అదే సమయంలో మోసపూరిత అర్హతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం సాధ్యమేనని అన్నారు.


ప్రజాస్వామ్యంలో అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను విమర్శించడం, తమ డిమాండ్లను శాంతియుతంగా తెలియజేయడం వంటి రాజ్యాంగబద్ధమైన హక్కులు పౌరులకు ఉన్నాయి. ప్రజాస్వామ్య సమాజంలో విద్యార్థి ఉద్యమాలు అత్యంత సహజమైన వ్యక్తీకరణలలో ఒకటిగా వర్థిల్లుతున్నాయి. ఎందుకంటే, తమ జీవితాలను తీర్చిదిద్దే వ్యవస్థలలోని లోపాలను అందరికంటే ముందుగా యువతకు అనుభవంలోకి వస్తుంది. వాటి దుష్ప్రభావానికి పెను బాధితులుగా నిలిచేది యువతే. ప్రస్తుత ఉద్యమాన్ని కేవలం ప్రభుత్వంపై వ్యతిరేకత గానో లేదా సోషల్ మీడియా కారణంగా తలెత్తిన తాత్కాలిక అసంతృప్తిగానో కొట్టిపారేయడం పెద్ద పొరపాటు అవుతుంది. దీని మూలాల్లో పరీక్షల విశ్వసనీయత, ఫలితాల్లో ఆరోపిత అక్రమాలు, నియామక ప్రక్రియల్లో పారదర్శకత, నిరుద్యోగం, విద్యావ్యవస్థలో జవాబుదారీతనం వంటి కీలకమైన అంశాలు ఉన్నాయి. విద్యాసంస్కరణలు, నీట్ ప్రశ్నపత్రాల లీకేజీలు, నిరుద్యోగానికి సంబంధించిన ఆందోళనలతో ఈ ఉద్యమం ప్రారంభమైనప్పటికీ కాలక్రమేణా దీనికి రాజకీయ డిమాండ్లు, ఇతర అంశాలు కూడా జతకూడాయి.

పరీక్షాపత్రం లీక్ అయినప్పుడు, దానివల్ల కలిగే నష్టం కేవలం ఆ రోజు పరీక్ష రాసే అభ్యర్థులకే పరిమితం కాదు. విద్యార్థి వెచ్చించిన సమయం, కుటుంబం కడుపు కట్టుకొని మరీ పైసా పైసా పొదుపు చేసి కూడబెట్టిన సొమ్ము, కోచింగ్ కోసం ఖర్చు చేసిన డబ్బు, వయోపరిమితి అర్హత ,మానసిక శ్రమ.. ఇలా ఇవన్నీ ఒకేసారి దెబ్బతింటాయి. అనేక పోటీ పరీక్షలకు పరిమిత సంఖ్యలోనే ప్రయత్న అవకాశాలు ఉంటాయి. కాబట్టి, పరీక్ష రద్దు కావడం లేదా ఏళ్ల తరబడి న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుపోవడం అనేది ఒక అభ్యర్థి జీవితంలో ఒక పూర్తి అవకాశాన్ని కోల్పోవడంతో సమానం.

అదేవిధంగా, నకిలీ డిగ్రీ అనేది కేవలం పత్రపరమైన నేరం మాత్రమే కాదు. నకిలీ సర్టిఫికేట్ ఆధారంగా ఉద్యోగం సంపాదించిన వ్యక్తి, చట్టబద్ధమైన చదువు, శిక్షణ, పరీక్ష ప్రక్రియలను పూర్తి చేసిన అర్హతగల అభ్యర్థి హక్కులను హరిస్తాడు. ఒకవేళ అర్హత లేని వ్యక్తి డాక్టర్, ఉపాధ్యాయుడు, ఇంజనీర్, న్యాయవాది, పాత్రికేయుడు లేదా సాంకేతిక నిపుణుడు వంటి వృత్తిలోకి ప్రవేశిస్తే, ఆ ప్రమాదం కేవలం ఉపాధి వ్యవస్థకే పరిమితం కాదు. అది ప్రజారోగ్యం, న్యాయం, విద్య, మౌలిక సదుపాయాలు, పరిపాలన చివరికి సామాజిక విశ్వాసంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి, పరీక్షా విధానం విశ్వసనీయతను కేవలం విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఒక చిన్న అంశంగా పరిగణించలేము. ఇది సమాన అవకాశాల రాజ్యాంగ సూత్రం, పరిపాలనాపరమైన చిత్తశుద్ధి, దేశ నైపుణ్య సామర్థ్యానికి సంబంధించిన విషయం. పరీక్షావ్యవస్థపై నమ్మకం సన్నగిల్లిన దేశంలో ప్రతిభావంతులు నిరాశకు గురవుతారు. అవినీతికర శక్తులు బలపడతాయి .సంస్థల పట్ల సామాజిక విశ్వసనీయత తగ్గుతుంది.

చర్చలతోనే పరిష్కారం

జూలై 24న ప్రభుత్వం, కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశం అనంతరం, రాజీనామాల డిమాండ్‌పై స్పందించేం దుకు ప్రభుత్వం జూలై 25 మధ్యాహ్నం వరకు సమయం కోరిందని సీజేపీ తెలిపింది. ఆత్మహత్య చేసుకున్న నీట్ అభ్యర్థుల కుటుంబాలకు పరిహారం అందించడం, విద్యార్థులపై నమోదు చేసిన ఎఫఐఆర్‌లు, న్యాయపరమైన కేసులను ఉప సంహరించుకోవడం అనే రెండు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది. సీజేపీతో సమావేశం దాదాపు రెండు గంటలపాటు కొనసాగిందని ప్రభుత్వం తెలిపింది. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. పరీక్షల సంస్కరణలకు సంబంధించి వారు మూడు ప్రధాన డిమాండ్లను, ఐదు సూచనలను సమర్పించారు. చర్చల ఫలితాలను వారికి తెలియజేయడానికి మళ్లీ సమావేశమవు తామని వారికి చెప్పాము అని ప్రభుత్వం వెల్లడిం చింది. దీనికి ముందు ఎక్కడ చర్చలు జరపాలనే విషయమై వివాదం నెలకొంది. సామాజిక రంగ నిపుణుల ప్రకారం ప్రభుత్వం చర్చల ప్రక్రియను ప్రతిష్టాత్మక అంశంగా మార్చుకోకూడదు. అదే సమయంలో, చర్చలు ఎక్కడ జరగాలనే దానిపై తలెత్తే చిన్నపాటి వివాదాలు అసలు చర్చలకు ఆటంకం కలిగించకుండా ఉద్యమ నాయకత్వం చూసుకోవాలి. సమస్యకు పరిష్కారం చర్చల వేదికపైనే లభిస్తుంది. ఆ పరిష్కారం కోసం ఒత్తిడిని పెంచడానికి మాత్రమే వీధి పోరాటాలు ఉపయోగపడతాయి.

పరస్పర అంగీకారంతోనే ప్రయోజనం

విద్యార్థుల అసంతృప్తికి ఒక వాస్తవమైన కారణం ఉందని అంగీకరించడానికి ప్రభుత్వ మద్దతుదారులు వెనుకాడకూడదు. అదేవిధంగా, ఒక నిజమైన సమస్య ఉందన్నంత మాత్రాన ఆ ఉద్యమానికి సంబంధించిన ప్రతి వాదన, వ్యక్తి, నినాదం లేదా రాజకీయ వ్యూహం సరైనవిగా ఉంటాయని అనుకోవడానికి వీలులేదనే విషయాన్ని ఉద్యమ మద్దతుదారులు కూడా అంగీక రించాలి. ఈ రెండు వాస్తవాలను గుర్తించడంలోనే జాతీయ ప్రయోజనాలకు అనుగుణమైన సమతుల్య దృక్పథం ఇమిడి ఉంది. పరీక్షలో అవకతవకలు జరిగితే, జవాబుదారీతనాన్ని నిర్ధారించాలి. పోలీసులు ఎక్కడైనా మితిమీరిన బలప్రయోగం చేస్తే ఆ విషయంపై నిష్పాక్షిక విచారణ జరపాలి. అదేవిధంగా నిరసనకారులు బారికేడ్లను ఛేదించినా, పోలీసు సిబ్బందిపై గానీ, పాత్రికేయులపై గానీ దాడి చేసినా, లేదా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా, అటువంటి చర్యలను కేవలం విద్యార్థుల అశాంతి అని ముద్ర వేసి సమర్థించలేము.

జూలై 20న ఢిల్లీలో పార్లమెంటు దిశగా నిరసన కారులు సాగిన తీరు ఈ సంక్లిష్టతకు ఒక ఉదాహరణగా నిలిచింది. నిరసనకారులు పార్ల మెంటు వైపు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా, వారిని అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు, భాష్పవాయుగోళాలు, లాఠీలు ఉపయోగించారు. దీంతో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. నిరసనకారులు, పోలీసు సిబ్బంది, ఇతరులు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్త తలకు దారితీసే రాజకీయ వాతావరణం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ ఘటనలకు సంబంధించి తుది, నిష్పాక్షిక నిర్ణయం అనేది కేవలం కొన్ని ఎంపిక చేసిన వీడియో క్లిప్‌లు లేదా రాజకీయ ప్రకటనల ఆధారంగా కాకుండా, సమగ్ర విచారణ ఆధారంగా జరగాలి. ఉద్యమ ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న సమయంలోనే, గుంపులోని ఒక వర్గం పార్లమెంట్ వైపు కదలడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది.రాళ్ల దాడి, పాత్రికేయులపై దాడులు, పోలీసు చర్యల మధ్య, అసంపూర్ణమైన లేదా స్వప్రయోజనపూరితమైన సోషల్ మీడియా కథనాలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయి. పోలీసు రికార్డులు, వైద్య నివేదికలు, ఎఫఐఆర్‌లు, స్వతంత్ర వీడియోలు, ప్రత్యక్ష సాక్షుల వివరాలతో ఈ వాదన లను సరిచూసుకోవడం ఇప్పటికీ అత్యవసరమే.

విద్యార్థుల ఆవేదనను గౌరవిస్తూనే, దానికి ఒక స్పష్టమైన లక్ష్మణ రేఖ ఉండాలనేది తల్లిదండ్రుల అభిప్రాయంగా వినిపిస్తున్నది. శాంతియుత నిరసన అనేది ప్రజాస్వామ్య హక్కు. కానీ హింస వల్ల ఉద్యమ నైతిక బలం పెరగదు. అలాగని ప్రభుత్వ బాధ్యతను కూడా అది ఏమాత్రం తగ్గించదు. అంతిమంగా, హింస అసలు సమస్యను పక్కన పెడుతుంది. పరిష్కారం కంటే ఘర్షణకే ప్రాధాన్యత నిచ్చే రాజకీయ శక్తులను తెరపైకి తెస్తుంది.

పార్లమెంట్‌కు వీధులు ప్రత్యామ్నాయం కాదు

ఈ ఉద్యమ నేపథ్యంలో, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ చేసిన ఒక వ్యాఖ్య ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన చేసిన ఈ వ్యాఖ్యను అరాచకవాద ప్రకటనగా పరిగణించాలి. “ఇకపై ఈ దేశంలో ప్రజాస్వామ్యం భవిష్యత్తును పార్లమెంటు నిర్ణయించదు, అది వీధులే నిర్ణయిస్తాయి. దీనిని ఎన్నికలు కాకుండా ప్రతిఘటన నిర్ణయిస్తుంది. జూలై 20న మనం దానిని కొంతమేర చూశాము” అని ఆయన అన్నారు. రానున్న కాలంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాట వేదిక పార్లమెంటు కాకుండా వీధులే అవుతాయని యోగేంద్ర యాదవ్ గతంలో రాశారు. ఆ వ్యాసంలో ఆయన సంస్కృతి, రాజ్యాంగ విలువల కోసం సాగే పోరాటాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పోరాటం పార్ల మెంటు, వీధుల పరిధిని దాటి విస్తరించి ఉంటుందని అభిప్రాయపడ్డారు. సందర్భం ఏదైనప్పటికీ, పార్లమెంటుకు, వీధులకు మధ్య ఉన్న సంబంధం గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో వీధులకు ఒక స్థానం ఉంది. స్వాతంత్య్రం కోసం, అవినీతికి వ్యతిరేకంగా, రైతులు, కార్మికుల హక్కుల కోసం, సామాజిక సంస్కరణల కోసం జరిగిన ఉద్యమాలన్నీ ప్రజా ఒత్తిడి వల్లే వీధుల్లో ముందుకు సాగాయి. అయితే, వీధులు పార్లమెంటుకు ప్రత్యామ్నాయం కాదనే విషయాన్ని మనం ఇక్కడ గమనంలోకి తీసుకోవాలి. సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధుల రాజ్యాంగబద్ధమైన వేదిక పార్లమెంటు. వీధుల్లో ఎంత పెద్ద జనసమూహం గుమిగూడినా, అది దేశంలోని మొత్తం ఓటర్ల స్థానాన్ని భర్తీ చేయలేదు. నిరసనలు ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురాగలవు. ప్రజాభిప్రాయాన్ని మార్చగలవు. విధానాల పునఃపరిశీలనకు దారితీయగలవు. పార్లమెంటులో చర్చ జరిగేలా చేయగలవు.అయితే, చట్టాలను రూపొందించడం, ప్రభుత్వాలను కూలదోయడం లేదా రాజ్యాంగ బద్ధమైన సంస్థలను నిర్వీర్యం చేయడం వంటి అధికారాలను వీధి పోరాటం పొందలేదు. అత్యధిక జనసందోహాన్ని సమీకరించి, తీవ్రమైన ఒత్తిడిని ప్రయోగించే సమూహమే ప్రజాస్వామ్య చట్టబద్ధతకు అసలైన మూలం అనే సూత్రాన్ని గనుక అంగీకరిస్తే, ప్రతి ఎన్నికల తర్వాత ఓడిపోయిన పక్షం వీధుల్లో ‘రెండవ ఎన్నిక’ను నిర్వహించడం మొదలుపెడు తుంది. అప్పుడు ప్రజాస్వామ్యం అనేది చర్చలు, ఓటు ద్వారా కాకుండా, దిగ్బంధనాలు, ముట్టడి సంఖ్యా పరమైన బల ప్రదర్శనల ద్వారా నడిచే పరిస్థితి ఏర్పడుతుంది. యువత ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. రాజ్యాంగం వారికి నిరసన తెలిపే హక్కును కల్పిస్తుంది. అదే సమయంలో, వ్యవస్థ పట్ల పూర్తి అపనమ్మకాన్ని కలిగించే రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, యువత హక్కులకు అదే రాజ్యాంగం, సంబంధిత సంస్థలు రక్షణ కల్పిస్తాయి. వ్యవస్థలో సంస్కరణలు కోరడం, ఆ వ్యవస్థనే పూర్తిగా చట్టవిరుద్ధమని ప్రకటించడం.. ఈ రెండూ కూడా భిన్నమైన రాజకీయ వైఖరులనే విషయాన్ని యువత అవగతం చేసుకోవాలి. ఒక ఉద్యమం లక్ష్యం ఒక సంస్థను జవాబుదారీగా మార్చడమే కానీ, దానిని నాశనం చేయడం కాదని రచయిత డాక్టర్ ఆనంద్ సింగ్ రాణా పేర్కొన్నారు. పార్లమెంటరీ చర్చ, వీధుల్లోని ప్రజా ఒత్తిడి పరస్పర ఆధారితాలుగా ఉండగలవు. అదే ఆ రెండూ నువ్వా.. నేనా? అంటూ ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా నిలబెడితే అలాంటి విపరిణామం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందే తప్ప ఎవరికీ ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చదు.

ఎన్‌టీఏ నిర్మాణాత్మక బలహీనత

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాటు ఒక అవసరమైన సంస్కరణే అయినప్పటికీ, ఒక సంస్థ ఉపయోగం దాని పేరు మీద కాకుండా దాని సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. జూలై, 2026లో రాజ్యసభకు సమర్పించిన సమాచారం ప్రకారం, ఆవిర్భావించిన నాటి నుంచి 270కు పైగా పరీక్షలను ఎన్‌టీఏ నిర్వహించింది. 6.6 కోట్లకు పైగా అభ్యర్థుల నమోదు ప్రక్రియను చేపట్టింది. అయినప్పటికీ, ఆ సంస్థలో శాశ్వత అధికారులు 24 మంది మాత్రమే ఉన్నారు. ఆ సంస్థ 197 మంది కాంట్రాక్టు, అవుట్‌సోర్స్ సిబ్బందిపై ఆధారపడింది. ఈ నిష్పత్తి తీవ్రమైన సమీక్షకు అర్హమైనది. లక్షలాది మంది అభ్యర్థులు, వేలాది కేంద్రాలు, కీలకమైన ప్రశ్నపత్రాలు, డేటా భద్రత, సైబర్ నిఘా, సేవా ప్రదాతలతో కూడిన ఒక విస్తారమైన నెట్‌వర్క్‌ను ఇంత పరిమితమైన శాశ్వత సిబ్బందితో నిర్వహించడం సంస్థాగత ప్రమాదాన్ని సృష్టిస్తుంది. అవుట్‌సోర్సింగ్ స్వతహాగా తప్పు కాదు. అయితే, ఒక రహస్య పరిశీలన ప్రక్రియలో బాధ్యతల గొలుసు ఎంత పొడవుగా ఉంటే, సమాచార లీకేజీలు, కుమ్మక్కు, సాంకేతిక లోపాలు, జవాబుదారీతనం నుండి తప్పించుకునే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. అందువల్ల, ఎన్‌టీఏ చేపట్టే సంస్కరణలు కేవలం కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయడం లేదా అదనపు సీసీటీవీ కెమెరాలను అమర్చడానికి మాత్రమే పరిమితం కాకూడదు. దీనికి శాశ్వత పరీక్షా భద్రతా విభాగం, సైబర్ ఫోరెన్సిక్స్ విభాగం, అంతర్గత నిఘా వ్యవస్థ, ప్రశ్నపత్రాల ముద్రణకు సురక్షితమైన విధానం, సేవా ప్రదాతల ఆడిటింగ్, డేటా లాగ్ భద్రపరచడం, రాష్ట్ర పోలీసులతో శాశ్వత సమన్వయం అవసరం. అలాగే, ప్రతి ప్రధాన పరీక్ష తర్వాత భద్రతా ఆడిట్‌లు, ఫలితాలకు సంబంధించిన నివేదికలను ప్రజాబాహుళ్యంలో ఉంచాలి.

డిజిటల్ పోరాటం

ప్రస్తుత ఉద్యమంలో గణనీయమైన భాగం సోషల్ మీడియా ద్వారా రూపుదిద్దుకుని ముందుకు సాగింది. ఇది వేగంగా పరస్పరం అనుసంధానం కావడానికి, తమ సమస్యలను పంచుకోవడానికి, జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించడానికి యువతకు ఒక అవకాశాన్ని కల్పించింది. ఈ సాంకేతికత ఉద్యమం ఒక బలంగా మారినప్పటికీ, అదే సమయంలో తప్పుడు సమాచారం, ఎడిట్ చేసిన వీడియోలు, రెచ్చగొట్టే కంటెంట్‌కు సంబంధించిన ముప్పును కూడా ఇది పెంచిపోషించింది. అనుమానాస్పద మరణాలు, జాతీయ భద్రతా చట్టం (ఎనఎసఏ) ప్రయోగం, నిర్బంధంలో ఉన్న వేలాది మంది విద్యార్థులకు ఆహారం, నీరు నిరాకరించడం, అలాగే పోలీసు చర్యలకు సంబంధించి సోషల్ మీడియాలో వివిధ వదంతులు వ్యాపించాయి. వీటిలో కొన్నింటిని అవాస్తవమని ఢిల్లీ పోలీసులు కొట్టిపారేశారు. సంబంధిత పోస్ట్‌లను తొలగించారు. ధృవీకరణ లేకుండా ప్రచారంలోకి వచ్చిన రాజకీయ పోస్టులను కూడా సాక్ష్యంగా పరిగణించలేము. అరెస్టులు, విడుదలకు సంబంధించిన గణాంకాలు, గాయపడిన వారి అధికారిక వివరాలు, నమోదైన ఎఫఐఆర్‌లు, ఆసుపత్రుల స్థితిగతులను ప్రభుత్వం సకాలంలో బహిరంగపరచాలి. సమాచార శూన్యతే పుకార్లకు అత్యంత సారవంతమైన నేల అవుతుంద నడంలో ఎలాంటి సందేహం లేదు.

విదేశీ జోక్యం.. జాతీయ భద్రతకు ముప్పు

నిరసనల సమయంలో సంభవించిన మరణం కారణంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోందనే నకిలీ సమాచారం లేదా హింస కోసం ముందుగా పన్నిన ప్రణాళికను సూచిస్తున్న కొన్ని వాట్సాప్ చాట్‌లను, లోతైన విశ్లేషణ లేకుండా పూర్తిగా కొట్టిపారేయడం సరికాదు. పరికరాలు, ఫోన్‌లు, మెటాడేటా, గ్రూప్ నిర్వాహకులు, సందేశాల టైమ్‌స్టాంప్‌లు, పంపినవారి గుర్తింపునకు సంబంధించిన ఫోరెన్సిక్ పరీక్ష అత్యవసరంగా జరపాలి. ఏది సరైనది, ఏది తప్పు అనేది కేవలం ఒక విచారణ మాత్రమే నిర్ధారించగలదు. నిజమైన నేరపూరిత సంభాషణలను కేవలం రాజకీయ ఆరోపణలుగా కొట్టిపారేయడం, వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడం పెను ముప్పులకు దారితీయవచ్చు.విదేశీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తప్పుదోవ పట్టించే కంటెంట్ వ్యాప్తి చెందుతోందని ఢిల్లీ పోలీసులు ఆరోపించారు. ఈ ఆరోపణను అంతర్జాతీయ మీడియాలో కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో, విదేశీ జోక్యం ఆరోపణలపై ఖాతా వివరాలు, డిజిటల్ ఫోరెన్సిక్స్, సమన్వయ ప్రవర్తనకు సంబంధించిన ఆధారాలను పరిశీలించి క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలి. డిజిటల్ రంగంలోని అంతర్గత అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి భారత వ్యతిరేక శక్తులు ప్రయత్నించవచ్చు. ఇది జాతీయ భద్రతకు ముప్పును కలిగిస్తుంది.

న్యాయవ్యవస్థ వర్సెస్ యువత కారాదు

జూలై 20న పోలీసు చర్య నేపథ్యంలో, సుప్రీంకోర్టు తక్షణ జోక్యాన్ని కోరుతూ కోర్టులో ఒక సాధారణ పిటిషన్ దాఖలైందని, దానిని విచారించ డానికి ప్రధాన న్యాయమూర్తి నిరాకరించారనే మీడియా కథనాలు విస్తృతంగా వ్యాపించాయి. జూలై 24న, ఈ కథనాలను తప్పుగా న్యాయస్థానంలో ప్రధానన్యాయమూర్తి పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ ప్రకారం ఎటువంటి అధికారిక రిట్ పిటిషన్ దాఖలు కాలేదు. కేవలం లేఖ రూపంలో సమర్పించిన విన్నపం గురించి ఒక న్యాయవాది మౌఖికంగా ప్రస్తావించారు. ఒక వీడియోను పరిశీలించి, ఈ అంశంపై తక్షణమే విచారణకు చేపట్టాలని కోర్టును అభ్యర్థించారు. అధికారిక పిటిషన్, అవసరమైన చట్టపరమైన ప్రక్రియ లేకుండా ఒక లేఖను సుమోటో రిట్ పిటిషన్‌గా పరిగణించలేమని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ సంఘటనపై వచ్చిన వార్తలను బాధ్యతారహితమైనవిగా తప్పుదోవ పట్టించేవిగా అభివర్ణించారు. ఈలోగా, పోలీసు చర్యను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఖండిం చింది. న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేసింది. విద్యార్థులు, యువతపై మితిమీరిన బలప్రయోగం జరిగిందన్న ఆరోపణలపై సుప్రీం కోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనలను కేవలం “న్యాయ వ్యవస్థ వర్సెస్ యువత” అనే సరళమైన విభజనకు పరిమితం చేయకూడదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది యోగేష్ దహియా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో కూడా దీనిపై భిన్నమైన సంస్థాగత స్పందనలు వ్యక్తమయ్యాయి. ఒకవైపు చట్టపరమైన ప్రక్రియకు సంబంధించిన అంశం ఉంటే, మరోవైపు పోలీసు చర్యల సమంజసత (జూతీశీజూశీతీtఱశీఅaశ్రీఱty), పౌర హక్కులకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో, ఈ రెండింటిపైనా స్వతంత్ర పరిశీలన సాధ్యమే అనే వాస్తవాన్ని గమనంలోకి తీసుకోవాలి.

పరీక్షలకు టాస్క్‌ఫోర్స్.. స్వాగతించిన ఏబీవీపీ

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో సమగ్ర సంస్కరణలను చేపట్టేందుకు బహుళ-విభాగాల ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) స్వాగతించింది. నీట్ సహా వివిధ పోటీ పరీక్షలలో చోటుచేసుకున్న అక్రమాల నేపథ్యంలో, దేశంలోని పరీక్షా విధానంలో పారదర్శకత, జవాబుదారీతనం, విశ్వసనీయతను పెంపొందించేలా సంస్థాగత సంస్కరణలు చేపట్టాలని ఏబీవీపీ నిరంతరం డిమాండ్ చేస్తూ వచ్చింది. ఈ నిరంతర పోరాటంలో భాగంగా, పోటీ పరీక్షల విధానాన్ని సమగ్రంగా సమీక్షించి, నిర్దిష్ట కాలపరిమితితో కూడిన నిర్మాణాత్మక సంస్కరణలను సూచించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ఏబీవీపీ గట్టిగా కోరింది. కాబట్టి, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈ ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు ఒక ముఖ్యమైన, స్వాగతించ దగిన నిర్ణయం అని ఏబీవీపీ పేర్కొంది. అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం మాత్రమే కాకుండా, పరీక్షా వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఇంకా కఠినమైన చర్యలు చాలా అవసరమని ఏబీవీపీ విశ్వసిస్తోంది. సమర్థవంతమైన అమలుతో కూడిన సమగ్ర సంస్థాగత, నిర్మాణాత్మక, సాంకేతిక, పరిపాలనా సంస్కరణలు అవసరమని పేర్కొంది. ఇటీవలి నెలల్లో, పరీక్షల మాఫియాను అరికట్టడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, పరిపాలనా సంస్కరణలు, పటిష్టమైన శాసన నిబంధనల కోసం చేపట్టిన కార్యక్రమాలు, సాంకేతిక నిపుణుడు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, నందన్ నీలేకని అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం వంటివన్నీ కలిసి పరీక్షా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా తీసుకున్న ముఖ్యమైన చర్యలను సూచిస్తున్నాయని ఏబీవీపీ అభిప్రాయపడింది.

ఈ టాస్క్ ఫోర్స్‌లో సభ్యులుగా ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్. సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ దేకా, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి, విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనిత కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణులు అమృత్ లాల్ మీనా ఉన్నారు.

పరీక్షా విధానాన్ని మరింత పారదర్శకంగా, సురక్షితంగా, జవాబుదారీగా, సాంకేతికత ఆధారితంగా, విద్యార్థి కేంద్రీకృతంగా మార్చేందుకు, టాస్క్ ఫోర్స్ నిర్దేశిత కాలపరిమితిలోగా తన సిఫార్సులను సమర్పించి, నిర్దిష్ట సంస్కరణలను సులభతరం చేస్తుందని ఏబీవీపీ ఆశిస్తోంది.

ఇదే విషయమై ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీరేంద్ర సింగ్ సోలంకి మాట్లాడుతూ, “తమ కష్టానికి ఒక నిష్పక్షపాతమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన వ్యవస్థ ద్వారా మూల్యాంకనం జరుగుతుందనే నమ్మకంతో దేశంలోని ప్రతి విద్యార్థి పరీక్షలకు హాజరవుతారు. అందువల్ల, పరీక్షా ప్రక్రియ సమగ్రతను కాపాడటం ఒక సామూహిక బాధ్యత. ఎన్‌టీఏలో సమగ్ర సంస్కరణల కోసం ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఒక ముఖ్యమైన ముందడుగు. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, సంస్థాగత సంస్కరణల కోసం ఏబీవీపీ నిరంతరం వాదిస్తూ వస్తోంది. పరీక్షా ప్రక్రియను మరింత విశ్వస నీయంగా, సురక్షితంగా, సాంకేతికత ఆధారితంగా, విద్యార్థి కేంద్రీకృతంగా మార్చడంలో కీలక పాత్ర పోషించే సకాల, ప్రభావవంతమైన సిఫార్సులను ఈ టాస్క్ ఫోర్స్ సమర్పిస్తుందని మేము విశ్వసిస్తున్నాము. జాతీయ ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ, విద్యార్థుల న్యాయబద్ధమైన ఆందోళనలను పరిష్కరించడానికి ఏబీవీపీ ఎల్లప్పుడూ నిర్మాణాత్మక సంభాషణలు, అర్థవంతమైన సంస్కరణల ద్వారా పనిచేసింది. అదే నిబద్ధతతో ముందుకు సాగుతుంది” అని తెలిపారు.

జంతర్ మంతర్‌లో పాశ్చాత్య మీడియా ఆగడాలు

దేశరాజధాని, జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), సామాజిక కార్యకర్తగా చెప్పుకునే సోనమ్ వాంగ్‌చుక్ నిరసన చేపట్టినప్పుడు మన దేశంలోని సామాజిక రాజకీయ పరిణామాలపై పాశ్చాత్య మీడియా కవరేజీ దారుణాతి దారుణంగా ఉంది. దేశ సార్వభౌమత్వం, రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నది. నకిలీ కథనాల నెట్‌వర్క్‌ను నడిపింది. భారత సమాజంలో చీలికలను తేవడానికి శాయశక్తులా ప్రయత్నించింది. ఇలాంటి ఒక కుట్రపూరితమైన కార్యక్రమాన్ని కొనసాగించడంలో అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేనంతగా బరి తెగిం చింది. నిరసన తీవ్రమవుతున్నప్పుడు అంతర్జాతీ యంగా పేరున్న పాత్రికేయులు వీధుల్లోకి వచ్చి కట్టుకథలను వార్తలుగా వండి వడ్డించారు. వారు తమను తాము భారత్ యువత గొంతుకగా చిత్రీకరించుకున్నారు. అయితే వారు అమలు చేసింది భారత్‌ను అన్నివిధాలుగా అతలాకుతులం చేయడా నికి అజ్ఞానంతో కూడుకున్న అజెండా మాత్రమే.

వాంగ్‌చుక్ తరలింపుపై అసత్య కథనం

అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ సోనమ్ వాంగ్‌చుక్‌ను పర్యావరణవేత్త, విద్యా సంస్కర్తగా కొనియాడింది. ప్రధానమంత్రి రాజీనామా కోరుతున్న జెన్ జడ్ ఉద్యమ ముఖంగా ఆయన్ను ప్రశంసిం చింది. మూడు వారాల నిరాహార దీక్ష తర్వాత సోనమ్ వాంగ్‌చుక్‌ను ప్రభుత్వం నిర్బంధంగా ఆసుపత్రికి తరలించిందని రాయిటర్స్, బీబీసీ రాసుకొచ్చాయి. ఇలాంటి నిర్బంధపు ఆసుపత్రి చేరిక కథనంతో భారతదేశంలో మానవ హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు క్షీణిస్తున్నాయని ప్రచారం చేయడమే లక్ష్యంగా పాశ్చాత్య మీడియా పెట్టుకుంది.

అయితే వాస్తవానికి సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రికి తరలించారు. ఇది నిరసన కారుని ఆరోగ్యాన్ని రక్షించే చర్య. నిరాహార దీక్ష ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నందున ఆయన ప్రాణాలను కాపాడే చర్య ఇది. తర్వాత ఢిల్లీ హైకోర్టు సోనమ్ వాంగ్‌చుక్‌ను ప్రభుత్వం నిర్వహణలోని నడిపే సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి గురుగ్రామ్‌లోని మెదాంతా ఆసుపత్రికి తరలించాలని కూడా ఆదేశించింది. ఈ ఆసుపత్రిని సోనమ్ వాంగ్‌చుక్, ఆయన సహచరులు చికిత్స కోసం ఎంచుకున్నారు. ఆరోగ్యానికి సంబంధించిన ఈ అంశాలను పాశ్చాత్య మీడియా పూర్తిగా విస్మరిం చింది. సోనమ్ వాంగ్‌చుక్‌ను నిర్బంధంగా ఆసుపత్రికి తీసుకెళ్లారని నకిలీ కథనాలను ప్రచారం చేసింది.

సినిమాతో సోనమ్‌కు అనుసంధానం

సోనమ్ వాంగ్‌చుక్‌ను బాలీవుడ్ సినిమా 3 ఇడియట్స్‌తో కూడా రాయిటర్స్ కథనాలు అనుసంధానించాయి. ఆ సినిమాలోని ప్రధాన పాత్ర సోనమ్ పనుల నుంచి ప్రేరణ పొందిందని పేర్కొన్నాయి. అయితే సినిమా తీసేటప్పుడు సోనమ్ వాంగ్‌చుక్ ఎవరో తనకు తెలియదని సినిమా ప్రధాన నటుడు ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. తన పాత్ర సోనమ్ వాంగ్‌చుక్ నుంచి ప్రేరణ పొందిందన్న వాదనలను కూడా ఆయన తిరస్కరించారు.

పోలీసులపై అపవాదు

నిరసనకారులపై పోలీసులు, భద్రతా సిబ్బంది హింసాత్మక చర్యలు చేపట్టారని కూడా పాశ్చాత్య మీడియా నివేదిస్తుంది. ఉదాహరణకు వాంగ్‌చుక్ నిద్రిస్తున్న వేదికపైకి డజన్ల కొద్దీ పోలీసులు, పారామిలటరీ సిబ్బంది దూసుకెళ్లారని బీబీసీ నివేదించింది. వారిని ఆపాలని ప్రయత్నించిన నిరసనకారులను తోసేశారు. ఆయన్ను దుప్పట్లు, కర్టెన్లతో కప్పి వేదిక నుంచి తప్పించారు. కొన్ని నిమిషాల్లోనే అంబులెన్స్ వేగంగా వెళ్లిపోయినట్లు కనిపించిందని పేర్కొంది. బీబీసీ ఇలాంటి తీవ్రమైన భాషను ఉపయోగించడం ద్వారా భారతదేశంలో పోలీసులు ఎలా ప్రవర్తించిందీ, సోనమ్ వాంగ్‌చుక్‌ను నిర్బంధంగా ఆసుపత్రికి తీసుకెళ్లారంటూ అతిశయోక్తిగా చూపించడానికి బీబీసీ ప్రయత్నిం చింది. అయితే కోర్టు ఆదేశాలు, ఆరోగ్యం పట్ల పెరుగుతున్న ఆందోళనల మధ్య ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారన్న విషయాన్ని మాటవరసకు కూడా చెప్పలేదు.

న్యూయార్క్ టైమ్స్ అత్యుత్సాహం

అదేవిధంగా నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు భాష్పవాయుగోళాలు, లాఠీలు ఉపయోగించారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అయితే అదే పాశ్చాత్య మీడియా నిరసనకారులు హింసాత్మకంగా మారి రాళ్లు విసిరి దాడులు చేసినప్పుడు పోలీసు అధికారులు, భద్రతా సిబ్బంది గాయపడిన విషయాన్ని ప్రస్తావించలేదు. న్యూయార్క్ టైమ్స్ తప్పుడు సంఖ్యలను కూడా ప్రదర్శించింది. 60 మందికి పైగా అరెస్టయ్యారని పేర్కొంది. పోలీసు చర్యలో తీవ్ర గాయాలు కావడంతో 100 మందికి పైగా ఆసుపత్రిలో చేరారంటూ అంతర్జాతీయ వేదికపై భారత్‌ను అప్రతిష్ట పాల్జేయడంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది.

వివాదాస్పద ప్రాంతంగా లడఖ్

సోనమ్ వాంగ్‌చుక్ మూలాలను వివరిస్తూ లడఖ్‌ను భారత్ పాలనలోని వివాదాస్పద ప్రాంతంగా బీబీసీ పేర్కొంది. లడఖ్‌ను వివాదాస్పద ప్రాంతంగా పేర్కొనడం భారత సార్వభౌమత్వం, భూభాగ సమగ్రతకు స్పష్టంగా ఉల్లంఘించడం తప్ప మరొకటి కాదు. లడఖ్ చైనాతో సరిహద్దు కలిగి ఉంది . భారత జాతీయ భద్రతకు అది కీలకమైనది. ఈ ప్రాంతం గురించి ఏదైనా ప్రతికూల ప్రకటన చేయడం భారత భూభాగ సమగ్రతను తప్పు పట్టడంతో సమానం. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ మనదేశంలో అంతర్భాగం. వివాదాస్పద ప్రాంతం కాదు. భారత్`చైనా మధ్య భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇలాంటి నకిలీ నివేదికలు కనిపిస్తాయి.

యువతను రెచ్చగొట్టే కథనాలు

అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్, ది గార్డియన్, డాయిష్ వెల్లే, ది వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూయార్క్ టైమ్స్ వంటి అమెరికా, ఐరోపాలకు చెందిన వార్తాపత్రికలు, వార్తాసంస్థలు భారత్‌ను అప్రతిష్టపాల్జేసే వార్తలను ప్రచురించాయి. సీజేపీ నిరసనను భారతదేశంలోని విద్య, నిరుద్యోగం, పాలన సమస్యలకు అనుసంధానించాయి. ఇది తీవ్రమైన నిర్మాణాత్మక సమస్యగా రాసుకొచ్చాయి. తద్వారా యువతను రెచ్చగొట్టి, ప్రభుత్వంపై ఉసిగొల్పడంలో చేయవలసినది అంతా చేశాయి.

డీప్ స్టేట్ సాధనాలు

సోనమ్ వాంగ్‌చుక్, సీజేపీపై అంతర్జాతీయ ప్రెస్ కవరేజీ నిరసనను సంస్థాగత వైఫల్యాల నేపథ్యంలో భారీ ప్రభుత్వ వ్యతిరేక సమీకరణగా చూపడమే లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో నిరసనకారుల ఆరోపిత విదేశీ లింకులు, ఫోర్డ్ ,సోరోస్ ఫౌండేషన్ నిధులు వంటి అంశాలను విస్మరిస్తుంది. ఈ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా డీప్ స్టేట్ సాధనాలుగా కీర్తి పొందాయి.

పాశాత్య నిధుల నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆరఏ) సవరణ భారత్ జాతీయ భద్రత, సార్వభౌమత్వానికి ఎందుకు కీలకమనే విషయాన్ని కూడా పాశ్చాత్య మీడియా తెలివిగా దాటవేస్తుంది. ఇది దేశ సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలకు ముప్పుగా పరిణమించే కార్యకలాపాలకు నిధుల మార్గాలను కత్తిరించడానికి ఉఉద్దేశించింది. దేశ నాగరికతా మూలాలను రక్షించడానికి నిధుల మార్గాలు, వాటి ఉద్దేశిత ఉపయోగాన్ని మరింత పరిశీలించడం ఈ చట్టం లక్ష్యం.

జాతీయ గౌరవం అవమాన నివారణ సవరణ బిల్లు`2026ను పార్లమెంటు సమయం వృథా చేసే హాస్యాస్పదమైన విషయంగా పాశ్చాత్య మీడియా సంస్థలు విమర్శిస్తాయి. ఆ బిల్లుకు చట్టబద్ధత కల్పించిన పక్షంలో అది పోలీసులకు శక్తివంతమైన ఆయుధంగా మారే అవకాశం ఉన్నదనే దుష్ప్రచారం చేస్తాయి. అయితే వాస్తవంలో ఈ చట్టం జెండా, చిహ్నాలు, రాజ్యాంగం, జాతీయ గీతం వంటి జాతీయ చిహ్నాలపై ఉద్దేశపూర్వక అగౌరవాన్ని నిషేధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇప్పటికే ప్రాథమిక కర్తవ్యంగా పాతుకుపోయి ఉంది.

భారతదేశాన్ని, ప్రస్తుత ప్రభుత్వాన్ని చిన్నాభిన్నం చేయడం, దేశంలో చీలికలు, విభేదాలను పెంచడం, సుస్థిరమైన ప్రజాస్వామ్య, పాలనా యంత్రాంగంతో ప్రపంచ వేదికపై అద్వితీయ శక్తిగా ఎదుగుతున్న భారత్ ప్రతిష్ఠను దెబ్బతీయడం పాశ్చాత్య మీడియా అంతిమ లక్ష్యం. ఈ దిశగా అంతర్జాతీయ మీడియా నకిలీ కథనాలు, తప్పుడు వార్తలను విశ్వవ్యాపితం చేయడంలో అది నిరంతరం నిమగ్నమై ఉంటుంది.


జూలై 20.. దేశ చరిత్రలో దుర్దినం

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన జూలై 20న సీజేపీ నిర్వహించిన చలో సంసద్ మార్చ్ దేశరాజధాని నడిబొడ్డున హింసాత్మకంగా మారింది. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ నిరసనకారులు పార్లమెంటు వైపు కదలడానికి ప్రయత్నించి భద్రతాసిబ్బందితో ఘర్షణకు దిగారు. ఈ సంఘటనలో 118 మందికి పైగా పోలీసు, పారామిలటరీ సిబ్బంది గాయపడగా సుమారు 60 మంది నిరసనకారులు కూడా గాయపడ్డారు. పలు ఎఫఐఆర్‌లు నమోదయ్యాయి.

పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన జరిగింది. ఇది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజున జరగడంతో దేశ రాజధానిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ పోలీసుల ప్రకారం వేలాది మంది నిరసనకారులు జంతర్ మంతర్ వద్ద గుమిగూడి పార్లమెంటు వైపు రావడానికి ప్రయత్నించారు. భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 163 అమలులో ఉన్నప్పటికీ, మార్చ్‌కు అనుమతి లేనప్పటికీ ఇలా జరిగింది.

పార్లమెంటు స్ట్రీట్, పటేల్ చౌక్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, శాస్త్రి భవన్ వంటి పటిష్టమైన భద్రతను సంతరించుకున్న ప్రాంతాల చుట్టూ ఏర్పాటు చేసిన బహుళ అంచెల బారికేడ్లను పదేపదే దాటడానికి నిరసనకారులు ప్రయత్నించారు. కొందరు రాళ్లు విసరడం, భద్రతా సిబ్బందిపై దాడి చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు. ఘర్షణలు అనేక గంటలపాటు కొనసాగాయి.

సామాజిక మాధ్యమాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చూపించే వీడియోలు వ్యాప్తి చెందాయి. వాటి ప్రామాణికతను పరిశీలిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ఢిల్లీ పోలీసులు తర్వాత గాయపడినవారి సంఖ్యను సవరించి 118 మందికి పైగా పోలీసు, పారామిలటరీ సిబ్బంది గాయపడినట్లు తెలిపారు. వీరిలో స్పెషల్ కమిషనర్, జాయింట్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషన ర్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారులు ,మహిళా పోలీసు సిబ్బంది ఉన్నారు. షాంగ్రీలా హోటల్ సమీపంలో హింసాత్మక గుంపు పోలీసు వాహనంపై దాడి చేయడంతో ఒక మహిళా హెడ్ కాన్‌స్టేబుల్ గాయపడ్డారు. గాయపడిన 60 మంది నిరసనకారులను కూడా ఆసుపత్రులకు తరలించారు.

నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసులకు చెందిన రెండు బస్సుల అద్దాలు పగిలిపోయాయి. 15 నుంచి 20 ప్రభుత్వ వాహనాలు దెబ్బతిన్నాయి. జన్‌పథ్‌లో కొన్ని దుకాణాలు కూడా ధ్వంసమై పోయాయి.

70 మందికి పైగా నిరసనకారులను నిర్బంధించారు. పార్లమెంటు స్ట్రీట్ ,పటేల్ చౌక్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, శాస్త్రి భవన్ ప్రాంతాల నుంచి 100 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని వివిధ పోలీసుస్టేషన్లు తాత్కాలిక నిర్బంధ కేంద్రాలకు తరలించారు.

పార్లమెంటు వైపునకు నిరసనకారులు రాకుండా నివారించేందుకు దేశ రాజధానిలో అపూర్వమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 5000 మందికి పైగా పోలీసు, పారామిలటరీ, రాపిడ్ రెస్పాన్స్ బలగాలను మోహరింపజేశారు. పార్లమెంటు, సెంట్రల్ విస్తా, జంతర్ మంతర్, కనాట్ ప్లేస్ వైపు వెళ్లే రోడ్లను మూసివేశారు. రాజీవ్ చౌక్, జన్‌పథ్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ ,సేవా తీర్థ్ వంటి మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు.

సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని ఢిల్లీ పోలీసులు తిరస్కరించారు. పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మోపై దాడి జరిగినట్లు చేసిన ఆరోపణలను నిరాకరించారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను నిర్బంధించినట్లు చేసిన ప్రచారాలను కూడా తిరస్కరించారు. ఆయన నిరసన ప్రదేశంలోనే ఉన్నట్లు తెలిపారు. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ ఘర్షణలు రాజకీయ అంశంగా మారాయి. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా నిరసనకారులపై బలప్రయోగాన్ని ఖండించారు. ప్రజాస్వామ్య నిరసనలను అణచి వేస్తున్నారని వామపక్షాలు ఆరోపించాయి. నిరసనకారులు హింసాత్మకంగా మారి భద్రతా సిబ్బందిపై దాడి చేసి, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి, బారికేడ్లను దాటడానికి పదేపదే ప్రయత్నించిన తర్వాతే వారిపై చర్యలు తీసుకున్నామని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

  • జాగృతి డెస్క్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.