గోధూళి ధూసరిత కోమల గోపవేషం

గోపాల బాలకశతైః అనుగమ్యమానం।

సాయన్తనే ప్రతి గృహం పశుబంధనార్థం

గచ్ఛన్తమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం ॥

(సమస్త గోవులు నడుచుట వలన లేచిన ధూళితో (గోధూళి) ధూసరితమైన (కప్పబడిన) కోమలమైన గోప వేషము కలిగినవాడూ, వందలాది గోప బాలురు తనను వెంట అనుసరించి నడుచుచుండగా, సాయంకాల సమయమున ఆవులను ఇళ్లలోని దొడ్లలో కట్టుటకు (లేదా మందకు తోలుకొనుచు) వెళుతున్న అచ్యుతుడైన (నాశనము లేని) ఆబాలగోపాలునికి ప్రతినిత్యము నమస్కరించుచున్నాను).

హైదరాబాద్‌కు 120 కి.మీ.ల దూరంలో, మారుమూల ప్రాంతంలో 104 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్. జాగృతి పత్రిక బృందంలో ఒకడిగా అక్కడి ప్రాంగణంలో పర్యటిస్తున్న సమయంలో దేశీయ గోవులు గుంపులు గుంపులుగా కనిపించినప్పుడు పై శ్లోకం గుర్తుకు వచ్చింది. దాదాపు పుష్కరకాల ప్రస్థానంలో గ్రామీణ వికాసం లోనూ, భారతీయతకు పట్టం కట్టడంలోనూ ఎన్నో విజయాలను సాధించింది ఫౌండేషన్. పల్లె ప్రగతి దిశగా మైలు రాళ్లను నెýకొల్పింది. ప్రాంగణం ఆరంభంలో ఆంజనేయస్వామి దేవాలయం మొదలుకొని ఏకలవ్య సేంద్రియ పాలిటెక్నిక్ కళాశాల, సభామందిరం, నిరామయ ఉత్పాదనల కేంద్రం, కపిల గోశాల, వ్యవసాయ క్షేత్రం, ఉద్యానవన పంటల మడులు, వర్షాభావ పరిస్థితుల్లోనూ నీటితో కళకళలాడుతున్న చెరువులు, చదువు చెప్పడంలోనూ, నేర్చుకోవడంలోనూ సనాతన భారతీయతను, ఆధునికతను మేళవించుకొని సత్ సంకల్పంతో కూడుకున్న సమాజ నిర్మాణం దిశగా విద్యార్థులతో ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్న సాందీపని గురుకులం వరకు ఫౌండేషన్ ధ్యేయనిష్ఠకు, అనిర్వచనీయమైన కృషికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అనాదిగా మన దేశానికి వెన్నెముకగా వ్యవసాయం నిలుస్తున్నది. గడచిన కొద్ది దశాబ్దాల కాలంలో ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థికవిధానాలు, ప్రైవేటీకరణ కారణంగా ఉపాధికి మూలాలుగా పట్టణాలు, నగరాలు వెలిశాయి. దీనికి తోడు పాశ్చాత్య జీవనశైలి పట్ల భారతీయులు వ్యామోహం పెంచుకున్నారు. కట్టూ బొట్టూ మారిపోయింది. వస్త్రధారణ వింతపోకడలు పోయింది. పాశ్చాత్యులను అనుకరించే క్రమంలో , పాంటూ, చొక్కా నలగని ఉపాధి అవకాశాల కోసమని పల్లె ప్రజలు పట్టణాలు, నగరాల బాట పట్టారు. బోసిపోయిన పల్లె బావురుమంది. కాయకష్టం చేసుకుంటూ నేలతల్లిని తరతరాలుగా నమ్మకుంటూ వస్తున్న అన్నదాతలకు సరైన ప్రోత్సాహం లేకుండా పోయింది. ఇదే కాకుండా ప్రకృతి కన్నెర్ర చేసిన కారణంగా వర్షాభావ పరిస్థితులలో నారు పోయడానికి కూడా రైతు నీరు వెదుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. అధిక దిగుబడి కోసమని మనదేశంలోకి ప్రవేశించిన రసాయన ఎరువులు, పురుగుమందులు భూసారాన్ని పీల్చి పిప్పి చేశాయి. కొన్ని తరాల కళ్లెదుటే చోటు చేసుకున్న ఈ పరిణామాలు రైతుకు శాపంగా మారాయి. ఈ నేపథ్యంలో భారతీయతకు నిదర్శనమైన సహజ వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ, గ్రామీణులు స్వంత ఊరిలోనే ఆత్మాభిమానం కలిగిన రైతులుగా జీవనం సాగించేలా మార్గం చూపడానికి ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండే షన్ ముందుకు వచ్చింది. కేవలం వారికి పూర్వవైభవం తీసుకురావ డంతో సరిపుచ్చక విద్య, వైద్యం వంటి రంగాల్లో గ్రామీణుల వెంట నడుస్తూ, తనతో నడిపిస్తూ గ్రామం కేంద్రంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఇదంతా గ్రామీణ వికాసం కోసం, నగరాలకు వలసలు పోకుండా స్వగ్రామంలోనే ప్రశాంత వాతావరణంలో రైతులకు ఆదాయాన్ని ఇచ్చే వృత్తి, వ్యాపకాలను కల్పించడంలో భాగం అని ‘జాగృతి’తో ముఖాముఖిలో ఫౌండేషన్ ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) వల్లభజోస్యుల శ్రీనివాస్ తెలిపారు.


మనం మనవారి కోసం పనిచేయాలి

గ్రామాలలో కష్టపడి పనిచేసే రైతులకు వ్యవసాయ ఉత్పత్తులు, నిత్యావసర వస్తువులు, షాంపూ, ఫినాయిల్, నూనెలు, సబ్బులు, మునగాకు, మొరింగ, అర్జున టీ లాంటి ఉత్పత్తుల ద్వారా గ్రామాలలో ఉంటూనే ఆర్థికసమృద్ధితో జీవించే స్థితి రావాలి. యోగ ద్వారా మంచి ఆరోగ్యం, సాంస్కృతిక కార్యక్రమాలు ద్వారా మానవ జీవన విలువల నిర్మాణం మనందరి బాధ్యత. గ్రామవికాసానికి పెద్దలు, యువతీయువకులు తమ అమూల్యమైన జీవితాన్ని సమర్పించాలి. జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. రండి, ముందుకు రండి.. చేయిచేయి కలుపుదాం. రసాయన విషాలులేని ఆరోగ్యవంతమైన భోజనాన్ని సమాజానికి అందిద్దాం.


ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఎలా ఆవిర్భవించింది. ఈ ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి?

ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ 2015లో ఆవిర్భవించింది. ఆరఎసఎస్‌లో ఉన్న చాలా మంది పెద్దలు కలిసి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటంలో వారి వంతు కృషిగా ఈ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. దీనిలో అనేక శాఖలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవిగా విద్య, వైద్యం, వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయం, గోవుల పోషణ, పరిరక్షణ, గో ఆధారిత ఉత్పత్తులు ఉన్నాయి. గ్రామీణాభివృద్ధికి దోహదపడే ఒక యజ్ఞంగా ఈ ఫౌండేషన్‌ను పరిగణనలోకి తీసుకొని ఇందులోని అన్ని శాఖలు గ్రామ జీవనానికి ప్రాముఖ్యతను ఇస్తాయి. విద్య విషయానికి వస్తే భారతీయ కళలు, సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించే విధంగా మా సాందీపని గురుకులం ఉంది. 2024లో ఈ గురుకులాన్ని స్థాపించాము. ఇందులో విద్యార్థులకు సర్వసాధారణమైన విద్యాబోధనతో పాటుగా 64 భారతీయ కళలను కూడా దశలవారీగా నేర్పించడం జరుగుతుంది. అలాగే ఇదే ప్రాంగణంలో ఏకలవ్య సేంద్రీయ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒక కళాశాల ఇక్కడ ఏర్పాటైంది. ఈ కళాశాలలో విద్యార్థు లకు సహజ వ్యవసాయం (నేచురల్ ఫామింగ్) నేర్పిస్తాము. ఇక్కడ నేర్చుకోవడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో ఆసక్తి ఉన్న రైతులకు ఈ వ్యవసాయ విధానం పట్ల అవగాహనను విద్యార్థులు కలిగిస్తుంటారు. నిరామయ పేరిట గో ఆధారిత ఉత్పత్తులు కూడా ఇక్కడ తయారవుతుంటాయి. దీని కోసం  ఇదే చోట కపిల గోశాలను నిర్వహిస్తున్నాము. గోశాలలో గిర్, పుంగనూరు, ఒంగోలు, దేవుని అనే నాలుగు రకాల ఆవులు ఉన్నాయి. ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్‌కు రెండు ప్రాంగణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది జింగుర్తి ప్రాంగణం. ఇది అనంతగిరి జిల్లా, తాండూరు మండలంలో 104 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ 104 ఎకరాలలో కళాశాల, గురుకుýం, వ్యవసాయం, గోశాల, వైద్య సేవలు, తదితర కార్యకలాపాలు నడుస్తున్నాయి. అదే విధంగా మెదక్ జిల్లా, తునికి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్ర పేరిట రెండవ ప్రాంగణం ఉంది. భారత ప్రభుత్వ పథకం కింద కృషి విజ్ఞాన కేంద్రం నడుస్తున్నది. సినీ నిర్మాత డాక్టర్ రామానాయుడు కుటుంబం ఇచ్చిన భూమిలో దాని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా వ్యవసాయానికి సంబంధించిన విభాగాలను ఏర్పాటు చేశాము.

దాదాపు ఈ పుష్కర కాలంలో, ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధికి ఫౌండేషన్ దోహదపడింది. ఈ కార్యకలాపాల్లో స్థానికుల భాగస్వామ్యం ఏ మేరకు ఉంది?

స్థానికుల భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడి గ్రామీణుల బాగోగుల కోసమే ఈ ఫౌండేషన్ ఏర్పాటైంది. అది నిర్దేశించుకున్న లక్ష్యాలలో ముఖ్యమైనది పట్టణాలు, నగరాలకు గ్రామీణుల వలసలను అరికట్టడం. గ్రామాలలో ఉన్నవారు నగరాలకు వెళ్లి వాచ్‌మెన్, డ్రైవర్ లాంటి ఉద్యోగాలు చేసే అవసరం లేకుండా, స్వగ్రామంలో ఉంటూ, గో ఆధారిత వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతమైన జీవనం సాగించవచ్చు అని నిరూపించడమే ఫౌండేషన్ ముఖ్యమైన ఉద్దేశ్యం. ఒక గ్రామీణుడు తన కాళ్ల మీద తాను స్వతహాగా నిలబడి, రైతుగా జీవించడానికి అవసరమైన ఆదాయాన్ని కల్పించ డానికి ఫౌండేషన్ కృషి చేస్తున్నది. వ్యవసాయం మీద తగినంత ఆదాయంరాని పక్షంలో గో ఆధారిత ఉత్పత్తులను తయారుచేయడంలో గ్రామీణులకు శిక్షణ ఇస్తుంది. వారి ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతుంది. వాటి అమ్మకాలతో అదనపు ఆదాయాన్ని అందిస్తున్నది. తద్వారా గ్రామీణ జీవనాన్ని ఆనందమయం చేస్తున్నది. ఇందుకోసమని చుట్టుపక్కల గ్రామాల్లో గ్రామవికాసం అనే కార్య క్రమాన్ని మేం నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా విద్యార్థి వికాస్ యోజన అనే కార్యక్రమం కూడా ఉంది. గతేడాది అనంతగిరి జిల్లాలో దీన్ని  ప్రారం భించాము. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా ట్యూషన్ తరగతులు నిర్వహిస్తున్నాము. అలా తరగతులు నిర్వహించడం పట్ల ఆసక్తి ఉన్న స్థానిక యువతీయువకులకు బోధనలో శిక్షణ ఇస్తున్నాము. విద్యార్థులకు భారతీయ సంస్కృతీ సంప్రదాయాల పట్ల అవగాహనను పెంచి, వారిలో వాటిని పాదుగొల్పడంతో పాటుగా వారిని యోగసాధకులుగా తయారుచేస్తున్నాము. నగరాలు, గ్రామాలలో మనం కోల్పోయిన  భారతీయ కళలను పునరుద్ధరించే పనిలో ఉన్నాము. ఆ క్రమంలో చుట్టుపక్కల గ్రామాలలో సాంస్కృతిక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇక్కడ ప్రధానంగా సామర్థ్య నిర్మాణ కార్యక్రమం (కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్) గురించి చెప్పుకోవాలి. ఈ కార్యక్రమంలో భాగంగా జింగుర్తి ప్రాంగణంలో నెలకు ఒకసారి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు, సర్పంచులకు సహజ వ్యవసాయంలో సాంకేతిక మెళకువలను నేర్పిస్తున్నాము. అలా నేర్చుకున్నవారు వారి వారి గ్రామాల్లో సుస్థిర సహజ వ్యవసాయానికి కారకులవుతున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం అనంతగిరి, మెదక్ జిల్లాలలో 100 గ్రామాలకు విస్తరించింది. తద్వారా సాగులో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతున్న అన్నదాతలను గో ఆధారిత వ్యవసాయం వైపునకు మళ్లించడంలో సఫలీకృతలమవుతున్నాము.


నేచురల్ ఫామింగ్(సహజ వ్యవసాయం), ఆర్గానిక్ ఫామింగ్(సేంద్రియ వ్యవసాయం)ల గురించి తరచుగా ప్రస్తావిస్తుంటారు. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి?

సేంద్రియ వ్యవసాయం.. ఆర్గానిక్ అని మనం ప్రత్యేకంగా చెప్పి చేయాల్సిన పనిలేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను పనిచేస్తున్న ఈ సంస్థ అభిప్రాయం కూడా అదే. ఆర్గానిక్ అని ఎలాఅంటారు మీరు? రసాయనాలు లేకుండా ఏదీ ఉండదు. మానవ శరీరం రసాయనాలతో నిర్మితమైనది. మనం చేస్తున్న వ్యవసాయంలో రసాయనాలు లేవని మీరు ఎలా చెప్పగలరు? సహజ (నేచురల్) పద్ధతిలో చేసే వ్యవసాయంలో కూడా రసాయనం ఉంటుంది. మనల్ని ఇబ్బంది పెట్టకుండా చేసే రసాయనాలతో చేసేదే సహజ వ్యవసాయం (నేచురల్ ఫామింగ్) అవుతుంది. అదే భారతీయత. ఇది ఇప్పటిదికాదు. అనాదిగా ఉంది. కాకపోతే మనం దానిని మర్చిపోయాం. అంతే. అందరూ ఇళ్లలోని ఆవులను ఎప్పుడో అమ్మేశారు. అదే ఆవులను ఆధారంగా చేసుకొని ఉత్పత్తులను తయారు చేయవచ్చు.  వానపాములతో ఎరువు (వర్మి కంపోస్ట్) చేయవచ్చు. చివరకు ఆవు పేడతో బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఇన్ని విధాలుగా గోమాత మనకు సేవలు అందిస్తున్నది. అందుకు కృతజ్ఞతగా గోమాతకు మనం సేవ చేయాల్సిన అవసరం ఉంది.


సహజ వ్యవసాయానికి దేశీయ విత్తనాలను ఎలా సమకూర్చుకుంటున్నారు?

దేశవ్యాప్తంగా సహజ వ్యవసాయం సాగిస్తున్న అనేక మంది రైతులు రకరకాలైన దేశీయ విత్తనాలను ఎప్పటికప్పుడు భద్రపరుస్తున్నారు. అలాంటి రైతులతో మా ఫౌండేషన్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. ఉదాహరణకు మీరు మా బొప్పాయి తోటను చూశారు. దేశవ్యాప్తంగా ఫిలిప్పైన్స్, థాయ్‌ల్యాండ్ దేశాలకు చెందిన బొప్పాయి మాత్రమే అందుబాటులో ఉంది.  ఇక్కడ మాత్రం దేశీయ బొప్పాయి లభిస్తుంది. ఇదేదో లాభార్జన కోసం చేస్తున్న సాగుబడి కాదు. దేశంలో ఎక్కడ బొప్పాయిని రుచిచూసినప్పటికీ దాని రుచి గడ్డి తిన్నట్టుగా ఉంటుంది. మీరు మా బొప్పాయిని రుచి చూడండి. ఇక్కడ దొరికేది మన దేశపు బొప్పాయి. దీనికి సంబంధించిన విత్తనాలను మా నర్సరీలోనే అభివృద్ధి చేస్తాం. వాటిని భద్రపరుస్తాం. అదే విధంగా కృషి విజ్ఞాన కేంద్రలో వరికి సంబంధిం చిన దేశీయ వంగడాలను అభివృద్ధి చేయడం మొదలుపెట్టాం. కలిసివచ్చే రైతులను కలుపుకొని ముందుకు సాగడమే దీనికి శ్రేయదాయకంగా ఉంటుంది.

నీటి వనరుల లభ్యత ఎలా ఉంది?

నీటి వనరులకు సంబంధించి మేం భూగర్భ జలాల కన్నా కూడా వర్షాల మీదనే ఎక్కువగా ఆధార పడుతుంటాం. వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడంపైన దృష్టిని కేంద్రీకరిస్తుంటాం. ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్‌కు చెందిన జింగుర్తి ప్రాంగణంలో ఏడు చెరువులున్నాయి. ఇవి అంతర్గతంగా అనుసంధానమై ఉంటాయి. వర్షాలు పడినప్పుడు ఆయకట్టుకు సమీపంలో ఉండే చెరువులో నీరు చేరుతుంది. అది చుట్టపక్కల ఉన్న బోరుబావులలో భూగర్భ జలాల మట్టాన్ని పెంచుతుంది. మిగిలిన చెరువులలో నీటి మట్టం పెరిగేలా చూస్తుంది. అలా మా ప్రాంగణం అంతా నీటి తడుపునకు నోచుకుంటుంది. ఇప్పుడైతే ఎలాంటి వర్షాలు లేవు. అయినప్పటికీ మా చెరువులలో నీరు పుష్కలంగా ఉంది.

ఇక్కడ బిందుసేద్యం(డ్రిప్ ఇరిగేషన్) వినియోగానికి ప్రత్యేక కారణం ఉందా?

బిందుసేద్యం అనేది లక్ష్యాన్ని దృష్టిలో ఉంచు కుంటుంది. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ నీటి వృథా ఉండదు. పంటకు ఎంత కావాలో అంతే తేమను అందిస్తుంది. దీనిని ఐదు నుంచి పదేళ్లుగా వాడుతున్న రైతులు ఉన్నారు. మేం ఐదేళ్లుగా బిందుసేద్యాన్ని ఆచరణలో పెడుతున్నాం. చివరకు వర్మికంపోస్ట్(వానపాములతో ఎరువు తయారీ)లో తేమను నిలకడగా ఉంచడానికి బిందుసేద్యాన్ని వాడుతున్నాం.

సాందీపని గురుకులంలో సనాతనం, ఆధునికతల మేళవింపును వివరిస్తారా?

భారతీయ విద్యావిధానాన్ని పరిపుష్టం చేసే దిశగా 2024లో ప్రారంభమైన సాందీపని గురుకులంలో ప్రవేశాలు నాల్గవ తరగతి నుంచి మాత్రమే ఉంటాయి.కేంద్ర ప్రభుత్వం పరిధిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎనఐఓఎస్)కు లోబడి గురుకులం పాఠ్య ప్రణాళిక ఉంటుంది. ఎన్ ఐఓఎస్ అందించే కోర్సులకు, సాందీపని గురుకులం ధ్యేయానికి ఎంతో సారూప్యం  ఉంది. ప్రస్తుతం కోర్సుల నుంచి భవిష్యత్తులో నైపుణ్యాల అభివృద్ధి, ఆంట్రో పెన్యూర్ (ఔత్సాహిక పారిశ్రామికవేత్త) కోర్సుల వరకు విద్యార్థులకు అందించాలని అనుకుంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే గురుకులంలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని బయటి ప్రపంచంలో అడుగుపెట్టే విద్యార్థులు 10 మందికి ఉద్యోగాలను అందించే వారిగా(జాబ్ గివర్స్) అవతరించాలే తప్ప ఉద్యోగాలను ఆశించేవారిగా(జాబ్ సీకర్స్) ఉండ కూడదనే దిశగా ఇక్కడి విద్యావిధానం పనిచేస్తుంది. అందుకనే గురుకులం విద్యార్థులు ఒకవైపు వేదాలను చదువుకుంటూనే మరోవైపు డ్రోన్లు ప్రయో గిస్తుంటారు. ఇక్కడ విద్యార్థులు తెల్లవారుజామున నాలుగన్నర గంటలకే నిద్ర లేస్తారు. వారి దినచర్య ఉదయం నాలుగున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు యజ్ఞాలు చేస్తారు. దాంట్లో మీకు భారతీయత కనిపిస్తుంది. మధ్యాహ్నం కంప్యూటర్ ల్యాబ్‌లో కృత్రిమ మేధస్సు(ఏఐ)ను నేర్చుకుంటారు. ఏడవ తరగతి నుంచి కంప్యూటర్ ల్యాబ్‌తో పాటుగా జీవశాస్త్రం, రసాయన శాస్త్రాలకు సంబంధించిన ప్రయోగశాలలు గురుకులంలో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. కార్పోరేట్ సామాజిక బాధ్యత (సీఎసఆర్)లో భాగంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ), జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎనఎండీసీ) వాటిని సమకూర్చాయి. ఈ ప్రయోగ శాలల్లో సాధారణ పాఠ్య ప్రణాళికతో పాటుగా అధునాతన నైపుణ్యాలను విద్యార్థులకు నేర్పిస్తున్నాం.

గురుకులంలో విద్యార్థులకు సామూహిక ఉపనయనం చేయిస్తారని విన్నాము. విద్యాభ్యాసంలో దానికి అంతటి ప్రాముఖ్యత ఉందా?

గురుకులం విద్యార్థులు 12 సంవత్సరాలపాటు బ్రహ్మచర్య దీక్ష చేపట్టాల్సి ఉంటుంది. మా గురు కులంలో చేరిన విద్యార్థులు బ్రహ్మచర్యాన్ని అవలం బిస్తారు కాబట్టి కులమతాలకు అతీతంగా కొత్తగా నాల్గవ తరగతిలో చేరిన విద్యార్థులతో గురుపూర్ణిమ నాడు సామÖహిక ఉపనయనం చేయిస్తాము. ఆ రోజున తల్లిదండ్రులు, గురువులు ఇలా అందరి ఆశీస్సులతో వారు ఆ దీక్షకు నాంది పలుకుతారు.   ఇక్కడ కులాలు, మతాల పట్టింపు ఉండదు. వాటిని గురించి పిల్లలను అడిగే ప్రసక్తి ఉండదు. కేవలం ప్రభుత్వానికి సమర్పించే రిజిస్టర్‌లో మాత్రమే పిల్లల కులం, మతం వివరాలు ఉంటాయి. గురుకులానికి సంబంధించిన రిజిస్టర్‌లో వాటి ఊసే ఉండదు. విద్యార్థులకు ఎలాంటి ఫీజులు ఉండవు. విద్యార్థుల ఆసక్తి ప్రధానంగా ఇక్కడ విద్యాబోధన ఉంటుంది.

గురుకులంలో ప్రవేశాల ప్రక్రియ ఎలా ఉంటుంది?

సాందీపని గురుకులంలో ప్రతి సంవత్సరం కేవలం నాల్గవ తరగతిలోకి మాత్రమే విద్యార్థుల ప్రవేశ ప్రక్రియను ఇప్పటివరకు మేం నిర్వహిస్తూ వస్తున్నాం. 40 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రతిసంవత్సరం అక్టోబర్, నవంబర్ మాసాలలో దసరా సెలవులలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అవుతుంది. మొదటగా అభ్యర్థులకు పరీక్ష ఉంటుంది. ఇక్కడి గురుకులం బాలురకు ఉద్దేశించినది అయితే విజయవాడలో మాకు అనుబంధ సంస్థ అయిన నివేదిత గురుకులం బాలికల కోసం నడుస్తున్నది. రెండు గురుకులాలకు కలిపి ప్రవేశ పరీక్ష ఉంటుంది. పరీక్ష రాయడానికి దాదాపు 700 మంది దరఖాస్తు చేసుకుంటారు. దరఖాస్తుల వడపోత తర్వాత ఎంపికైన వారు పరీక్ష రాస్తారు. ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తాము. సాందీపని గురుకులానికి సంబంధించి తల్లిదండ్రులు, బాలుడు, నివేదిత గురుకులం విషయానికి వస్తే తల్లిదండ్రులు, బాలిక ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. వారి ఆలోచనాధోరణి ఎలా ఉంది? పిల్లవాడి మనోగతి ఎలా ఉంది? తెలుసుకోవడానికి ఈ ఇంటర్వ్యూ జరుగుతుంది. విద్యార్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇదే ప్రాంగణంలో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహిస్తాము. విద్యార్థుల భావజాలం, వారిలో ఎంతవరకు సర్దుకొనిపోయే మనస్తత్వం ఉన్నది తెలుసుకోవడమే శిబిరం ముఖ్యోద్దేశ్యం. ఆ తర్వాత జూన్‌లో గురుకులంలో తరగతులు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం నాల్గవ తరగతిలో మూడవ బ్యాచ్ విద్యార్థులు చేరారు. ఈ బ్యాచ్‌లో 42 మంది విద్యార్థులు ఉన్నారు.

ఏకలవ్య సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల గురించి చెప్పండి

పదవ తరగతి తర్వాత రెండేళ్ల కోర్సు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కోర్సు చేసిన మొదటి, రెండవ బ్యాచులకు చెందిన విద్యార్థులు మా దగ్గరే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ ఉత్తీర్ణులై ఆ తర్వాత అగ్రికý్చర్ బీఎస్సీ చేసిన వారిలో కొందరు సైతం ఈ ప్రాంగణంలో ఉపాధి పొందుతున్నారు. అలా కాకుండా కళాశాల నుంచి బైటకు వెళ్లిన మిగిలిన వారు కూడా ఫౌండేషన్ కార్యకలాపాల్లో ఏదో రూపంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అయితే కళాశాల స్థాయి నుంచి కాకుండా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులలో భారతీయతను పాదుగొల్పడానికే సాందీపని గురుకులం నెలకొల్పాము.

దేశీయ ఉత్పత్తులకు సంబంధించి నిరామయ ఉత్పాదన ఎలాంటి పాత్రను పోషిస్తున్నది?

విదేశీ ఉత్పత్తులపైన, నగరంలో దొరికే వస్తువులపై ఆధారపడటానికి బదులుగా నిరామయ ఉత్పాదన కేంద్రంగా మనకు స్థానికంగా లభించే కుంకుడుకాయలు, శీకకాయ వంటి వాటితో సబ్బులు, షాంపూలు, తలనూనె, పళ్ల పొడి లాంటి 25 దేశీయ ఉత్పత్తులను తయారుచేస్తున్నాము. వాటిని తయారుచేసే విధానాన్ని చుట్టుపక్కల గ్రామాలవారికి నేర్పుతున్నాము. వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ మార్గాన్ని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ చూస్తున్నది. అలొవెరా సబ్బులకు సంబంధించిన తయారీ ప్రక్రియను కృషి విజ్జాన్ కేంద్రంలో చేస్తున్నాం. ఇందులో స్థానిక మహిళల భాగస్వామ్యం మిన్నగా ఉంది. ఆ విధంగా చూసి నప్పుడు నిరామయ ఉత్పాదన విషయంలో మేం అనతికాýంలోనే విజయాన్ని సాధించాము.

ఈ ప్రాంగణంలో వేర్వేరు వృత్తి,వ్యాపకాల్లో ఎక్కువగా జెన్‌జెడ్, యువతీయువకులు కనిపిస్తున్నారు.  మీరు యువకులు కావడం వల్ల ఇక్కడ జెన్‌జెడ్ పాత్ర ప్రముఖంగా ఉన్నదని భావించవచ్చా?

ఇప్పటి జెన్‌జెడ్ ఇలా ఆలోచిస్తున్నదంటే(గ్రామీణ వికాసం, భారతీయత) మున్ముందు తరాలు ఇంకెంత గొప్పగా ఆలోచించాలి అనే ఆశయంతో మా పెద్దలు చేపట్టిన మహా యజ్ఞమిది(ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్). అలా మేమంతా  ఆకర్షితులయ్యాము. నేను కూడా కార్పొరేట్ ఉద్యోగాన్ని కాదనుకొని ఇక్కడకు వచ్చేశాను. ఒక స్ఫూర్తిగా మేమంతా ఇక్కడి పనులలో పాలుపంచుకుంటున్నాము. జెన్‌జెడ్ మాత్రమే కాదు జెన్‌జెడ్ ప్లస్ కూడా ఇక్కడ ఉన్నారు. మా గురుకులం విద్యార్థులు కూడా ఇందులో భాగస్వాములే. భారతీయత అంటే ఇదే. సమష్టి పాలన (కలెక్టివ్ గవర్నెన్స్), సామాజిక బాధ్యత (సోషల్ రెస్పాన్స్‌బిలిటీ)ల మేలు కలయిక.

ఎక్కడాలేని సమీకరణ ఇక్కడ ఎలా సాధ్యమైంది?

ఆలోచన గట్టిదైతే సమీకరణ దానంతట అదే సాధ్యమవుతుంది. ఇక్కడ మనుషుల కన్నా ధ్యేయం గొప్పది. మనుషులు మారతారు. ఆ బాధ్యత (సమష్టి పాలన, సామాజిక బాధ్యత) అలా ఇచ్చారు. అది మా పెద్దల సంకల్ప బలం తప్ప మరొకటి కాదు.

కార్పొరేట్ ఉద్యోగాన్ని కాదనుకున్న మీ నేపథ్యం గురించి చెబుతారా?

నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదివాను. 2009లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశాను.ఆ తర్వాత చాలా కంపెనీల్లో పని చేశాను. చివరగా భారత్ ఫోర్జ్ కంపెనీలో కార్పొరేట్ ఎఫైర్స్‌లో విధులు నిర్వర్తించాను. మా పెద్దల ప్రోద్బలంతో దీంట్లోకి (ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్) అడుగుపెట్టాను. ఒక విధంగా నాకు ఇది కల్చర్ షాక్ (సాంస్కృతిక ఆఘాతం.. పూర్తిగా కొత్త రంగంలోకి అడుగుపెట్టడం). చాలా దేశాల్లో తిరిగాను. విదేశాýలో పనిచేశాను. ఇక్కడ లేని అభివృద్ధి అక్కడ(విదేశాలు) ఎలా వచ్చిందంటే అక్కడి వారు వారి గ్రామాలను మర్చిపోలేదు. భారత్ కూడా ఎప్పుడూ మర్చిపోలేదు (గ్రామాలను). మనదేశం మళ్లీ తన పూర్వ వైభవానికి చేరుకుంటుంది అనేందుకు నిదర్శనమే ఈ ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆవిర్భావం.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క ఆలోచనకు ప్రచారం కీలకంగా మారింది. మీ ఫౌండేషన్‌ను ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు?

ప్రస్తుతానికి మేము ఆ దిశగా ఆలోచన చేయలేదు. అంటే అందరినీ కలుపుకొనిపోవాలనే ఆలోచన ఐతే మాకు వచ్చింది కానీ మేం చేస్తున్న పనిని ప్రచారం చేసుకోవాలనే ఆలోచనైతే ఇప్పటి వరకు రాలేదు. అలాంటి ఒక ఆలోచన మా వ్యవస్థాపకులకు రాలేదు.. మాకూ రాలేదు. కానీ మాకు సంబంధించిన ప్రచారం అంతా కూడా నోటి మాట ద్వారానే జరుగుతున్నది. మీడియా, ప్రచురణ కర్తలు ద్వారా కొంత ప్రచారం లభిస్తున్నది. కానీ మేము ఫలానా పని చేస్తున్నాము అని చెప్పుకోవడంలో కన్నా కూడా ఎలాంటి ప్రచారం లేకుండా గుర్తింపు పొందడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. మేం చేస్తున్న కృషిని గుర్తించండి. మేం మీతో కలిసి నడుస్తాము. మీరూ మాతో కలిసి నడవండి. అందరం కలిసే నడుస్తాం కదా. అయితే మా ఉత్పత్తులకు సంబంధించినంతవరకు మార్కెటింగ్ చేయకతప్పదు. అది కూడా చేయడం ఎందుకు అంటే చుట్టుపక్కల గ్రామాలలో మేం చేస్తున్న ఉత్పత్తుల పట్ల ఆసక్తి కలిగిన ప్రజలు వాటిని స్వయంగా తయారు చేసి నప్పుడు వాటికి మార్కెట్ సృష్టించాలి. లేకపోతే ఉత్పత్తి దారుడు మోసపోయాను అనే భావనలో మిగిలి పోతాడు. అలాంటి భావన కుదరదు.. కుదిరించ కూడదు అని మార్కెటింగ్ వైపు కృషి మాత్రం చాలానే చేస్తున్నాము. చుట్టుపక్కల గ్రామాలకు, హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్లా నిరామయ ఉత్పాదనలను విక్రయిస్తున్నాము. కృషి విజ్జాన్ కేంద్ర ఉత్పత్తులను కూడా విక్రయిస్తున్నాము. అలాగే దేశీయ పసుపును ఇక్కడే పండిస్తున్నాము. ఇక్కడే పసుపును చూర్ణంగా చేసి నగరానికి చేరవేస్తున్నాము. మా కళాశాల, గురుకులం.. ఇలా ఇక్కడ ఉన్న అన్ని శాఖలు కూడా ఇక్కడ తయారయ్యే వాటినే వినియోగిస్తున్నాయి. వాటితోనే సరిపెట్టుకుంటు న్నాయి. తద్వారా భారతీయతను, గ్రామీణ జీవనాన్ని త్రికరణశుద్ధితో పాటిస్తున్నాయి.

ఫౌండేషన్ కార్యకలాపాలపై వలసల ప్రభావం ఎలా ఉంది?

ఈ ఫౌండేషన్ పెట్టిందే రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ (వలస పోయిన వారిని తిరిగి రప్పించే ప్రక్రియ) చేయడానికి. ఉన్నచోటనే చేసి చూపించాలి కానీ.. దీనిని(గ్రామీణ వికాసం) నగరంలో ఉండి చేసి చూపిస్తానంటే అది ఎంతవరకు సమంజసం అవుతుంది? ఇది (జింగుర్తి ప్రాంగణం) హైదరాబాద్ నగరానికి 120 కి.మీ.ల దూరంలో ఉంది. ఎంతో ప్రశాంతమైన జీవనం ఇక్కడ ఉంది. నగరాలకు వలసవెళ్లిన రైతులు అక్కడ ఆత్మాభిమానంతో జీవిస్తున్నారా? ఇక్కడే ఉండి ఆత్మాభిమానంతో జీవించడానికి ఇదే దారి అని చూపించడమే ఈ ఫౌండేషన్ ముఖ్యోద్దేశ్యం. ఇక్కడ ఉండి కూడా సంపాదన చేయవచ్చు.

దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు లభిస్తున్నాయి?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎసఆర్)గా పలు కంపెనీలు మాకు సంపూర్ణ సహాయ, సహకారాలను అందిస్తు న్నాయి. ఆలోచన ఒకటే అయినప్పుడు సహాయ సహకారాలకు కొదవ ఉండదు.

భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తారా?

చుట్టుపక్కల 100 గ్రామాలతో పాటుగా మా అనుబంధ సంస్థలతో కలిసి మేం చేస్తున్న పనిని ఒక రోల్ మోడల్ (ఆదర్శ నమÖనా)గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పెట్టుకున్నాము. ఇదే మోడల్‌ను మీరు ఎక్కడైనా అమలు చేయవచ్చు. ఇప్పటికే మేం చేస్తున్న దాంట్లో విజయం సాధించాము. సాధించాల్సింది ఇంకా  ఎంతో ఉంది. వైద్య, ఆరోగ్య సేవల రంగం లోకి అడుగుపెట్టాము. వైద్య శిబిరాలను నిర్వ హిస్తున్నాము. వైద్య సేవలు అందుబాటులో లేని గ్రామాలలోకి కూడా మా సేవలను విస్తరిస్తున్నాము. ఇదే జింగుర్తి ప్రాంగణంలో హృద్రోగాలకు సంబంధించిన వైద్య శిబిరాలను నిర్వహించాము. ప్రతి నెలా రెండవ, నాల్గవ మంగళవారాల్లో నేత్ర శిబిరాలను చేపడుతున్నాము. కంటిలో శుక్లాలతో ఇబ్బందిపడేవారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తున్నాము. ఆ క్రమంలో వారిని ఇంటి నుంచి ఆస్పత్రికి సురక్షితంగా తీసుకొని వెళ్లి, శస్త్ర చికిత్స అనంతరం వారిని ఇంటకి తిరిగి చేర్చే బాధ్యతను కూడా మేమే తీసుకుంటున్నాము.మా తదుపరి కార్యాచరణగా మహిళలు, బాలికల ఆరోగ్యంపై దృష్టిని కేంద్రీకరించనున్నాము. మÖత్రపిండాలకు సంబంధించిన వైద్య, ఆరోగ్య కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకుంటున్నాము. ఈ విధంగా ఒక గ్రామాన్ని ఎన్ని విధాలుగా ఆదుకో గలమో అన్ని విధాలుగా ఆదుకుంటూ, అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలనేదే ఈ ఫౌండేషన్ ధ్యేయం.

ఇంటర్వ్యూ: మహేష్ ధూళిపాళ్ళ

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.