ప్రకృతితో మమేకమై జీవించడం మానవ ధర్మం. మరి ప్రకృతి విపత్తులతో మమేకమై జీవించడం మానవుల దౌర్భాగ్యం. ప్రకృతికి దగ్గరగా మనుగడ సాగించవలసిన మనం ప్రకృతికి దూరంగా పారిపోవలసిన రోజులు వస్తున్నాయి. దీనికి ఇటీవల నేపాల్‌లోని త్రిశూలి నది, కాళీ, గండకి లోయలో వరదలు నిదర్శనంగా నిలిచాయి. దీనిని భౌగోళిక అపాయంగా అభివర్ణించవచ్చు. ప్రకృతి మనకు ఎంత సుఖాన్ని, సాంత్వనను ఇస్తుందో అంతే ప్రకోపించగలదు కూడా. అదే ప్రకృతి ధర్మం. అలాంటి ప్రకృతిని గౌరవించడం మానవ ధర్మం. ప్రకృతిని పరిరక్షిస్తేనే మానవ మనుగడ సుసాధ్యం.
మానవాళి ముఖ్యంగా “battle with nature ends in battle for life” అన్నది (ప్రకృతితో పోరాటం జీవనపోరాటంతో ముగుస్తుంది) గుర్తుంచుకోవాలి. ప్రకృతిని పరిరక్షించుకుందాం అని పర్యావరణ ప్రేమికులు గత కొన్ని దశాబ్దాలుగా గగ్గోలు పెడుతున్నా ఆచరించేవారు కొందరే ఐతే, పెడచెవిన పెట్టేవారే ఎక్కువ కదా! అందుకే ఈ విపరీతాలు. “When anger raises think of consequences” (ఆగ్రహం పెరిగినప్పుడు దాని పరిణామాలను గురించి ఆలోచించాలి)అన్నారు పెద్దలు. మనము ప్రకృతిని మన సుఖాలు, సౌలభ్యాలకోసం నాశనం చేస్తున్నాము. కానీ దాని పరిణామాలు ఒక రోజు దారుణంగా ఉంటాయన్న సంగతిని ఎప్పటికప్పుడు అలక్ష్యం చేస్తున్నాము కదా! మరి ఇదేకదా పర్యావరణ విఘాతమంటే!
వరదల వెనుక కారణం
ఉపగ్రహం ద్వారా సేకరించిన సమాచారాన్నిబట్టి అతి పెద్ద మంచు కొండ విరిగింది. అది కాస్త కరిగి దగ్గరలోనే ఉన్న మంచు ,నీటితో నిండిన విస్తారమైన సరస్సులోకి చేరుకుంది. ఆ సరస్సులోని నీరు పెల్లుబికి బయటకు పారింది.అది తనతోపాటు మట్టిని, చెట్లను, బండరాళ్లను తీసుకుని అతి వేగంగా వరదలా ప్రవహించింది.దిగువన ఉన్న ఊళ్లను ముంచెత్తింది. ఇందులో మనం ఊహించలేక పోయింది ఏమిటంటే ఎన్నడూ లేనంతగా అంత పెద్ద పరిమాణంలో మంచు కొండ విరిగిపడడం. తదనంతర పరిణామాలన్నీ మనం ఊహించదగ్గవే. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ మంచుకొండ ఇంత పెద్ద పరిమాణంలో విరగడం కూడా మానవ తప్పిదమే. దాన్నే వాతావరణ మార్పు`గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఆ కారణంగానే కొండ విరిగిపడిందని కొందరు శాస్త్రవేత్తల, పర్యావరణవేత్తల అంచనా. విపరీతమైన వాతావరణ మార్పులతో కొన్ని దశాబ్దాలు లేదా శతాబ్దాల తరువాత జరగాల్సిన ప్రకృతి విపత్తులు ఇప్పుడే చోటు చేసుకోవడం మనం చూస్తున్నాము. కాబట్టి చివరికి పలు మానవ తప్పిదాలు, అలాగే మానవుడింకా శాస్త్ర విజ్ఞానం ద్వారా తెలుసుకోలేని మంచుకొండల గర్భాలలో జరిగే మార్పులు, మానవ మేధకు బహుశా ఎప్పటికీ అందని భౌగోళిక అంశాలు ఇలా అన్నీ కలిసి ఈ పెనుముప్పునకు కారణం అని అనుకోవచ్చు.
ప్రకృతికి ఆవిష్కరణల గొడ్డలిపెట్టు
రోజురోజుకు కొత్త ఆవిష్కరణలు చేస్తూ తన మేధమీద మానవుడు మురిసిపోతున్నాడు. ఈ ఆవిష్కరణలలో కొన్ని ప్రకృతికి సరిపడవని తెలిసినా నిర్లక్ష్యం వహిస్తున్నాడు. అందుకే విపరీతాలు సంభవిస్తున్నాయన్న విషయాన్ని ఒప్పుకోవడానికి వెనుకాడుతున్నాడు. ఈ పోకడలిలాగే కొనసాగితే చివరకు వచ్చేది పెద్ద ప్రళయం. ప్రకృతిలో చివరకు మిగిలేది శూన్యం.. ఇది తథ్యం. ఎందుకంటే ప్రపంచమంతా శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఒకే పోకడతో దూసుకుపోతోంది. అలాగే ఈ దేశం, ఆ దేశం అని లేకుండా దాదాపు అన్నిదేశాలలోనూ విపత్తులు సంభవిస్తున్నాయి. ఇప్పటికైనా మానవాళి మేల్కొనక తప్పదు.
ధర్మో రక్షతి రక్షితః
ఇక్కడ ధర్మం అంటే మానవుడు ప్రకృతి పట్ల పాటించవలసినది. అదే ప్రాకృతిక ధర్మం. దాన్ని పాటించనప్పుడు వినాశనం తప్పదు కదా! సైన్స్ అభివృద్ధి దాదాపు 400 ఏళ్లనుంచి జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవలి రెండు శతాబ్దాలలో శరవేగంతో జరుగుతోంది. దీంతో ప్రకృతిలో ఎన్నో భౌతిక మార్పులు చోటు చేసుకున్నాయి. వాటిలో ఆనకట్టల నిర్మాణం, అరణ్యాలు, వృక్షాలు తొలగించి నగరాల ఆవిర్భావం, బొగ్గు, ఖనిజాలు, పెట్రోల్, సహజ వాయువు వెలికితీసి భూమిని గుల్ల చేయడం, ఇంధనాన్ని విపరీతంగా దహించివేయడంతో వాయు కాలుష్యం, వేల రకాల రసాయనాల ఆధారిత అనేక వస్తువుల ఉత్పాదన,ప్లాస్టిక్ తయారీ, ప్లాస్టిక్ వ్యర్థాలతో భూగర్భ పొరలలో శాశ్వత కాలుష్యం, కొండలు తవ్వి రహదారులు, సొరంగాల నిర్మాణం వంటి అత్యంత వేగంతో, ఎక్కువ సంఖ్యలో చేపడుతున్న ప్రకృతి విధ్వంసకారక చర్యలు ఉన్నాయి. ఇవి మానవాళికి ఉపయోగకరమే కానీ, ఇంత పెద్ద ఎత్తున అవసరం లేదేమో! యుగాంతంలో ప్రళయం గురించి చదివాము. కానీ ఈ కలియుగంలోనే వయనాడ్, నేపాల్ వరదల్లాంటి ప్రళయాలను చూస్తున్నాము. వీటిని ఎప్పుడైనా వచ్చే మహా ప్రళయానికి సంకేతాలుగా పరిగణించాలి. “థా కచా కచ్ భరా సోనా రావణ్ కి లంకా కి దీవార్ మే-ఏక్ రద్దీ భీ నహీమిలా రావణకో చల్తీ వార్ మే”(అంటే రావణుడి లంకలో గోడలన్నీ స్వర్ణమయమంట, అయినా ఆయన మరణింటప్పుడు ఏమీ ఉపయోగపడలేదట) అని ఒక స్వామీజీ అన్నట్టుగా మానవుడు అనేక శాస్త్రీయ ఆవిష్కరణల ద్వారా ఎంతో సంపత్తిని పెంచుకుంటున్నాడు. అయితే మనం ప్రకృతి విపత్తులలో చిక్కుకున్నప్పుడు ఇవన్నీ గడ్డిపరక మందం కూడా పనికి రావు. అందుకే మనం కృత్రిమ అభివృద్ధిని నిదానంగా, అత్యవసరమైన మేరకే చేపట్టి, ప్రకృతిని గౌరవించి, బతకడం నేర్చుకోవాలి. ఒక విషయం సుస్పష్టం. శాస్త్ర ఆవిష్కరణలు, శాస్త్రాభివృద్ధి ఇలాంటి ఘోర ప్రాకృతిక ఉత్పాతాలను కనిపెట్టి హెచ్చరించగలవేమో గాని అవి జరిగినప్పుడు వాటిని, వాటి ప్రభావాలను ఆపలేవు. అందుకే ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవడంతో పాటు పర్యావరణాన్ని విపరీతమైన ఒత్తిడికి గురిచేయకుండా మానవాళి చూసు కోవాలి. ఇప్పటికే హిమాలయ ప్రాంతంలో చాలాచోట్ల మంచు ఫలకాలు` గ్లాసియర్ల విస్తీర్ణం గణనీయంగా తగ్గుతున్నట్లు అంచనాలు తెలియచేస్తున్నాయి. హిమనీనదాలు తగ్గడమంటే అవి కరిగి, నదుల ద్వారా వరదల రూపంలో ప్రవహించడమే కదా! పర్యావరణ పరిరక్షణపై సరియైన దృక్పథంతో పరిరక్షించుకున్నప్పుడే ఇటువంటి ఘోర విపత్తులు సంభవించకుండా ఉండే అవకాశాలు మెండుగా ఉంటాయి. దీనికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి. 2014లో కేదారనాథ్‌లో వచ్చిన ఆకస్మిక వరదలు, ఆ తరువాత ఉత్తరాఖండ్‌లో, అస్సాంలో, పలుమార్లు కేరళలోని వయనాడ్‌లో వచ్చిన వరదలు మనకెన్నో పాఠాలు నేర్పాయి. ఇలాంటి ఎన్నో ఘటనలు పర్యావరణహిత జీవనాన్ని నొక్కి వక్కాణిస్తున్నాయి. ఆ చేదు అనుభవాల తర్వాత నిజంగా మనమెన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నది ఆలోచించవలసిన విషయం. “ఆశ్వవేగంలో పథకాలు వేసుకుని అవ్వలాగా నెమ్మదిగా ఆచరిస్తే లాభం ఉండదుకదా!” పర్యావరణ పరిరక్షణలో ఇక ఏ మాత్రం అలక్ష్యం కుదరదని ఇటీవలి నేపాల్ ఉదంతం మనల్ని హెచ్చరిస్తోంది. IPL మ్యాచ్‌లు, బాక్సాఫీస్ హిట్ సినిమాలు, టీజర్లను కాదు మనం విశ్లేషించాల్సింది. పెద్ద పెద్ద పార్టీలు, బహుళ అంతస్తుల భవనాలలో విలాసవంతమైన నివాసాలు, 5 నక్షత్రాల వారసత్వాలు కాదు మనకు కావాల్సింది. ప్రకృతి విపత్తుల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రభావవంతమైన కార్యాచరణలు ఏమేమి అమలుపరుస్తున్నాము? మనలో ప్రతి ఒక్కరు పర్యావరణ పరిరక్షణలో ఎంత పాలుపంచుకుంటు న్నాము అన్నది మనమందరమూ ఆత్మ విమర్శ చేసుకోవలసిన సమయం ఆసన్నమయిందని తరచుగా మన దేశంలో సంభవించే పర్యావరణ విపత్తులు సంకేతాలిస్తున్నాయి. ఇకపై ఇలా పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తూ వృథా చేసే సమయం లేదు మానవాళికి. సామాన్యమైనదైనా పర్యావరణ హిత జీవనమే మనకు ముఖ్యమైనదిగా భావించి ఆచరించినప్పుడే ఇటువంటి విపత్తులు సంభవించే అవకాశాలు తక్కువవుతాయి. ఇదే మనల్ని పరిరక్షించే జీవన సూత్రం. జీవన వేదం. నిజంగా జరగాల్సిందే మిటంటే మానవులు ఇంతకు ముందు జరిగిన ఇలాంటి విపత్తులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అనేక సమగ్ర విపత్తు నివారణ, నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ప్రతిసారీ విపత్తు జరిగిన కొన్ని రోజుల తరువాత విపత్తు నివారణ, నిర్వహణ చర్యల వేగం తగ్గిపోతోంది. ముఖ్యంగా విచ్చలవిడి పారిశ్రామీ కరణ, తద్వారా విపరీతంగా రసాయనాలతో, ఖనిజ లోహాలతో ఆడుకుంటున్నాం. ఇవన్నీ పర్యావరణానికి విఘాతం కలిగించేవే కదా! రాకుండా ఉండాలే కానీ ఏ పరికరం ఇలాంటి విపత్తులను ఆపగలదు? ఇది మనం తక్షణమే ఆలోచించాల్సిన విషయం. “మానవ తప్పిదాలు” అన్నది ఈమధ్య ప్రతి పర్యావరణ విపత్తుకి ట్యాగ్‌లైన్‌గా మారింది.
ఈ సందర్భంలో హిమాలయ శ్రేణుల్లో జరుగు తున్న ఎటువంటి ప్రాజెక్టులయినా తాత్కాలికంగా ఆపి వాటిని పునః సమీక్షించాలి. భవిష్యత్తులో ఎవరు ఏమి చేయాలన్నా ఆచి తూచి అడుగులు వేయాలి. భారత్‌కు నీటి గండాలు నలువైపులా పొంచి ఉన్నాయన్నది నివేదికలలో చూస్తున్నాము. పెరుగుతున్న నీటి మట్టాలతో సముద్రాలు ముంబై, కోల్‌కతా నగరాలను భవిష్యత్తులో ముంచెత్తే ప్రమాదముందటున్నారు శాస్త్రవేత్తలు. మన దేశం చుట్టూ విస్తారంగా ఉన్న సముద్ర తీరప్రాంతాలకు కూడా ప్రమాదం ఉండవచ్చు అంటున్నారు. ముఖ్యంగా అత్యంత సారవంతమైన తీరప్రాంతాలు లవణభరితమైన సముద్ర జలాలతో కలుషితమె,® పంటభూములు సారాన్ని కోల్పోయి, వ్యవసాయం కష్టతరమవచ్చు. తీరాలలాగే హిమాలయాలలోని హిమనీనదాలు కరిగి, మనకు ఆకస్మిక వరదలు రావడం పరిపాటి అయింది. ఈ సందర్భాలలో శ్రీమద్భాగవతంలోని “పదం పదం యద్ విపదం” అనే ఒక వాక్యం గుర్తుకొస్తుంది. అంటే మానవాళికి అడుగడుగునా విపత్తులుంటాయి అని అర్థం. అందుకే ఇంకా అనేక సమగ్ర అధ్యయనాలుచేపట్టి, పర్యావరణ విపత్తులనుండి మనలను మనం కాపాడుకోవడం ఎంతైనా అవసరం. విపత్తు కలిగించే అవకాశమున్న 47 హిమనీనదసరస్సులను (స్త్రశ్రీacఱవతీ శ్రీakవs) హిమాలయ ప్రాంతాలలో గుర్తించినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. దీన్నిబట్టి సమస్య ఎంత తీవ్రమైనదో మనం అంచనా వేయొచ్చు. నేపాల్ కోసి నది వరద ఉదంతం లాంటి మరో ప్రమాదం పునరావృతం కాకూడదని ఆశిద్దాం. ఇదే చివరి ప్రకృతి విపత్తు కావాలి. ఇలాంటి ఇంకో విపత్తు సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవ డానికి, పర్యావరణాన్ని అకుంఠితదీక్షతో కాపాడుకోవ డానికి మానవాళి అంతా ఏకమై నడుం కట్టాలి.
విపత్తులను అదిగమించడానికి సూచనలు
- ముందుగా హిమాలయాలనుంచి ప్రభావిత దేశాలలోని అన్ని నదీ పరీవాహక ప్రాంతాలలో వరద ముప్పు ప్రాంతాలను గుర్తించాలి. అక్కడి ప్రజలకు దూరంగా పునరావాసం కల్పించగలగాలి.
- ఉపగ్రహం ద్వారా మంచుకొండలను, నదీపరీవాహక ప్రాంతాలను నిరంతరం గమనిస్తూ, ఏ చిన్న మార్పు కనిపించినా అంటే మంచు కరగడం, కొండచరియలు విరిగిపడడం, నీటి ప్రవాహానికి తాత్కాలిక అడ్డంకులేర్పడి నీరు ఎక్కువ జమ అవుతూ ఉండడం లాంటివి గమనించి తగు జాగ్రత్తలను హెచ్చరికలుగా చేయాలి.
- కొండచరియల్లో, నదీ పరివాహక ప్రాంతా లకు దగ్గరలో ఎటువంటి భారీ తవ్వకాలు, నిర్మాణాలు చేయకపోవడం, పెద్ద పెద్ద ఆనకట్టలు, సొరంగాలు, ఆనకట్టలు, జలవిద్యుత్పాదక ప్రాజెక్టలు చేపట్టరాదు.
- పర్వత సానువుల మధ్యగా సాగే నదులకు కొండచరియలు విరిగిపడి ఆకస్మిక వరదలొచ్చే ప్రమాదం మెండుగా ఉంటుంది. కనుక అలాంటి నదీ పరీవాహక ప్రాంతాలలో కొత్త గ్రామాలు, నగరాల నిర్మాణాన్ని అనుమతించకూడదు.
- వాతావరణ మార్పులకు దారి తీసే ఆధునిక విపరీత పోకడలను చాలావరకు ఆచరించరాదు.
- హిమాలయ పర్వత, లోయ ప్రాంతాలలో తీర్థయాత్రలు, విహార యాత్రలు సంవత్సరంలో బహు కొద్ది సురక్షిత సమయాల్లోనే అనుమతించాలి.
- వరదలు వచ్చే ప్రాంతాలలో కొన్ని శాశ్వత పునరావాస కేంద్రాలను నిర్మించి, వాటిని ఖాళీగా ఉంచాలి. అత్యవసర పరిస్థితులలో ప్రజలు వెంటనే ఆ సురక్షిత ఆవాసాలకు వెళ్ళగలగాలి.
- వరదలు వచ్చే నదులమీద ఉన్న ఆనకట్టలు, వంతెనలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టాలి.
మానవ సాంకేతిక ప్రగతి గతి తప్పకుండా పరిమితిలో ఉంటే పరిస్థితి మనచేతిలోనే ఉంటుంది. అలా కాకుండా పరిమితి మించితే, మానవ మనుగడ చివరకు అధోగతి పాలవుతుంది అన్న నిజాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు.
“లోకాః సమస్తా సుఖినోభవంతు”
మహావాది రామకృష్ణ