ఈ సంవత్సరం ప్రథమ త్రైమాసికంలో మన దేశం 7.6 శాతం వృద్ధి రేటును సాధించింది. ఈ వృద్ధికి ఉత్పత్తి సేవల రంగాలు చోదకాలుగా ఉన్నాయి. మొదటి త్రైమాసికంలో పెట్టుబడులు 11.9 శాతం చొప్పున, గృహస్తుల వినిమయం 7.1శాతం, ఎగుమతులు 12శాతం పెరిగాయి. అయితే ఈ గణాం కాల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ ప్రతిపక్షాలు, మరికొందరు ఆర్థికవేత్తలు, ప్రతిష్ఠిత వ్యక్తులు ఈ అంశాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో లేనంతగా, వృద్ధిరేటుపై వివాదం సృష్టించే ప్రయత్నం ఎందుకు జరుగుతుందనే సందేహం ఎవరికైనా కలగవచ్చు. అంతర్జాతీయ పరిణామాలు (యుద్ధం కారణంగా చమురు సరఫరా ఇబ్బందులు సహా అనేక కారణాలవల్ల) అనుకూలంగా లేనప్పటికి మన అర్థవ్యవస్థ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించే రీతిలో వృద్ధి చెందిందంటే, అందులో పాలకుల కృషికి మన్ననలు లభిస్తాయి కనుక రాజకీయపరమైన ఈర్ష్యవల్ల కొందరు దీంట్లో లోపాలు వెదకటం సహజంగా భావించవచ్చు. కానీ ఇదెంతవరకూ సమంజసం?
చమురు ధరల అనిశ్చితి ప్రభావం మన వ్యవస్థపై పెద్దగా పడకుండా, ఎంతోమంది అంచనాలను తలక్రిందులు చేస్తూ మనం ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో 7.8శాతం వృద్ధిని సాధించటంలో పాలకుల పాత్ర హర్షణీయం. మన స్థూల జాతీయ ఉత్పత్తి స్థిరధరల ఆధారంగా గణిస్తే 81.36 లక్షల కోట్లగా, ప్రస్తుత ధరల ప్రకారం 88.27 లక్షల కోట్ల రూపాయలు నమోదైంది. ఈ సంవత్సరం మన ఉత్పత్తిరంగం 9.2 శాతం వృద్ధిని సాధించింది. అందులో విద్యుత్ పరికరాల ఉత్పత్తి అత్యధికంగా 27శాతం వృద్ధిని సాధించింది. అలాగే మన వస్తు సేవల ఎగుమతుల విలువ 80.36 లక్షల కోట్లుగా, ప్రస్తుత ధరల ప్రకారం 88.27 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది. అలాగే మన వస్తు సేవల ఎగుమతులు 13.31 శాతం వృద్ధిని సాధించినట్లుగా గుర్తించాలి. ఇటువంటి గణాంకాల విశ్వసనీయతను ప్రశ్నించే రీతిలో, మన వృద్ధిరేటు 7.8 శాతం కాదు కేవలం 2.6 శాతం మాత్రమేనంటూ విపక్షాలు కొంతమంది మాజీ అధికారుల సాయంతో దీనిపై గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
అసలు ఇంతకీ ఈ గణాంకాల విషయంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే సందేహం కలగవచ్చు. మన స్థిరధరల రేటు గణనలో గతంలో బేస్ ఇయర్ 2011`12గా ఉండేది. మారిన కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఈ బేస్ ఇయర్‌ని 2022-23గా మార్చారు. అలా మార్చినంత మాత్రాన స్థూల జాతీయ ఉత్పత్తి గణనలో పెద్దగా వ్యత్యాసాలు రాకుండా జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వ సాధికారిక వివరణ ప్రకారం 2011- 12ని బేస్ ఇయర్‌గా తీసుకుని ఈ సంవత్సర తొలి త్రైమాసిక స్థూల జాతీయ ఉత్పత్తిని గణించినప్పుడు 86.05 లక్షల కోట్లకు చేరింది, అదే 2022-23 ప్రకారం చేస్తే మన స్థూల జాతీయ ఉత్పత్తి 80.32 లక్షల కోట్లుగా గణించారు. ఇలా గణించే విధానం మార్చి నందువల్ల ప్రభుత్వం వృద్ధిని ఎక్కువగా చూపించిందనే వాదనలో లోపం ఏంటో ఎవరికైనా అర్థమౌతుంది.
అయితే ఈ విషయాన్ని మరుగున పడేయటానికి అనేక వాదనలను తెరపైకి తీసుకువస్తున్నారు. ప్రభుత్వం ఈ వృద్ధిరేటును గణించేటప్పుడు ద్రవ్యోల్బణం వేరుగా తీసుకుందనే వాదనను కొందరు మాజీ అధికారులు తాము నమ్ముకున్న నాయకులకు తెలియజేశారు. సామాన్య ప్రజలను తప్పుదోవ పట్టించటానికి ఈ వృద్ధిరేటు గణనలో ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని 2.5శాతంగా తీసుకుందని, వాస్తవానికి వినిమయదారుల ధరల సూచీ ప్రకారం ద్రవ్యోల్బణం 3.9 శాతంగా, టోకు ధరల సూచి ప్రకారం 9శాతం ఉందని ఆ మాజీ అధికారులు చూపే ప్రయత్నం చేశారు. వాస్తవంగా వృద్ధిరేటు గణించే విధానంలో ద్రవ్యోల్బణం వినిమయ ధరల సూచీని, టోకు ధరల సూచీని ఎప్పుడూ తీసుకోరు. ఎందుకంటే వినిమయ ధరల సూచీ కేవలం కొన్ని వస్తువుల ధర ఆధారంగా మాత్రమే గణిస్తారు. దానిలో సమగ్రత లేనందున దానిని ఎప్పుడూ పరిగణనలోకి స్థూల జాతీయ ఉత్పత్తి గణనలోకి తీసుకోరు. ఇక టోకు ధరల సూచీని, వస్తువులు పారిశ్రామిక ఉత్పత్తులు, వాటికి అవసరమైన ముడి సరకుల టోకు ధరల ఆధారంగా గణిస్తారు. కాబట్టి అది కూడా స్థూల జాతీయ ఉత్పత్తి గణనలో సమగ్రతను సూచించదు. కనుక, దానిని కూడా యథాతథంగా తీసుకోరు. స్థూల జాతీయ ఉత్పత్తి గణనలో, గృహస్తుల ఖర్చులు, పెట్టుబడులు, ప్రభుత్వ వ్యయం, ఎగుమతుల విలువ, సేవలవిలువ కూడా ఉంటాయి. కాబట్టి, ఈ స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధి రేటుకు తీసుకునే ద్రవ్యోల్బణాన్ని వేరుగా గణిస్తారు. ఈ విషయం ఆ మాజీ అధికారులకి కూడా తెలుసు. అయినా తాము నమ్ముకున్న నాయకులు ప్రజలకు సులభంగా చెప్పటానికి వీలుపడే విధంగా దీనిని తెరపైకి తెచ్చారు.
గత ఏడాది తొలి త్రైమాసికం మన ఆర్థికవ్యవస్థ 6.9శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సంవత్సరం మన వృద్ధిరేటు దాదాపు 7శాతం వరకు ఉండవచ్చని గతంలో భారతీయ రిజర్వు బ్యాంకు అంచనా వేసింది. అయితే అంతర్జాతీయ అనిశ్చితి, ప్రతికూల వాతావరణం, డాలర్‌తో రూపాయ మారక విలువ, చమురు ధరలు వంటి అనేక కారణాలవల్ల రిజర్వు బ్యాంక్ అంచనాలు చేరుకోవడం కష్టమని ఈ అధికారులూ, నాయకులే గతంలో తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. అయితే వారి అంచనాలకు మించి 7.8 శాతం వృద్ధిరేటును సాధించినట్టు గణాంకాలను విడుదల చేయటం వారిని ఆశ్చర్యానికి గురిచేసి ఉండవచ్చు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఐటి, ఉత్పత్తిరంగం, వృత్తిపరమైన సేవలు, రియల్ ఎస్టేటు పలు రంగాలు ఈ వృద్ధికి ఊతమిచ్చినట్టుగా స్పష్టమౌతుంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వస్తువుల, సేవల విలువను సూచించే నామినల్ జిడిపి ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 10.3 శాతం వృద్ధిని నమోదు చేసింది.
గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఈ వృద్ధి 8.1 శాతం. ఎన్‌డీఏ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించటం వంటి చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విశ్లేషించారు. ఒకవైపు ప్రధానమంత్రి, మరోవైపు ఆర్థిమంత్రి చేసిన వ్యాఖ్యలను కొందరు జీర్ణించుకోలేక, ఈ వృద్ధిని తక్కువచేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించటంలో ఆశ్చర్యంలేదు. గత ఆరుమాసాలుగా మన వృద్ధిరేటును పెంచటానికి ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నది. పరోక్ష పన్నుల రేట్లలో మార్పులు` ముఖ్యంగా జీఎస్‌టీ రేట్ల తగ్గింపు, వినిమయవస్తువులపై పన్నుల భారం తగ్గించటం, వడ్డీరేట్ల సవరణలు, అంతర్జాతీయ పరిణామాలవల్ల మన చమురు సరఫరా అంతగా ప్రభావితం కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వంటి అనేక చర్యల ఫలితాలు వృద్ధికి దోహదపడ్డాయని చెప్పటానికి పెద్ద ఆర్థికవేత్త అవ్వాల్సిన అవసరంలేదు.
ఒకవైపు అమెరికా వంటి దేశాల సుంకాల అనిశ్చితి ఉన్నప్పటికి డాలర్‌తో రూపాయి మారకం బలహీనపడటాన్ని అవకాశంగా మార్చుకుని మన ఎగుమ తులను పెంచుకునే ప్రయత్నం చేశాం. మన రూపాయి విలువ బలహీనపడటంవల్ల డాలర్లలో చూసుకున్నప్పుడు మన వస్తువులు చౌకగా అనిపిస్తాయి. ఉదాహరణకు ఒక వస్తువు ధర మన దేశంలో 25 రూపాయలు అనుకుంటే డాలర్ విలువ 75 రూపాయలు ఉన్నప్పుడు ఒక డాలర్‌కి 3 వస్తువులు వచ్చేవి. అదే డాలర్ విలువ 90 రూపాయలు దాటినప్పుడు ఒక డాలర్ కంటే తక్కువకే 3 వస్తువులు వస్తాయి. ఇలా మన రూపాయి 15శాతం బలహీనపడటాన్ని అవకాశంగా మార్చుకుని మన ఎగుమతులను 12 శాతం పెంచుకోగలిగాం. అలాగే గత కొన్ని నెలలుగా మన దేశంలో నూతన పెట్టుబడులు పెరగడం, ముఖ్యంగా సంప్రదాయేతర ఇంధన రంగంలో, మెటల్స్ రంగంలో, డాటా సెంటర్ల రంగంలో పెట్టుబడులు వేగం పుంజుకోవడం కూడా వృద్ధిరేటుపై కొంత సానుకూల ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ఒక రకంగా చూస్తే ప్రభుత్వం గతంతో పోలిస్తే చాలా వేగంగా స్పందిస్తోంది. ఉదాహరణకు, పంచదార, ఉల్లిపాయల ధరలు పెరగటం మొదలవ్వగానే ప్రభుత్వం ప్రత్యేక రైళ్ల ద్వారా అవసరమైన చోట్లకి వాటి సరఫరాను పెంచి ధరల పెరుగుదలను నిలువరించే ప్రయత్నం చేసింది. ప్రభుత్వ చర్యలు సరిపోతున్నాయా? అవి ఆశించిన ఫలితాలు ఇస్తున్నాయా? వంటి అంశాలపై భిన్నమైన అభిప్రాయాలు ఉండవచ్చు. మన స్థూల జాతీయ ఉత్పత్తి గణాంకాలు, మన దేశంలో ఏ రంగాలు ఏ స్థితిలో ఉన్నాయి, కార్పొరేటు సంస్థల ఆదాయాలు పెరుగుతున్నాయా? ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం) ఎలా ఉంది? ఈ ద్రవ్యోల్బణ ప్రభావం వడ్డీరేట్ల ఆదాయాలపై ఏ విధంగా ఉంది వంటి అనేక అంశాలకు ఇది సూచికగా పనిచేస్తుంది. సాధారణ పరిభాషలో చెప్పాలంటే మన దేశంలో ఆర్థిక కార్యకలాపాలు ఎలా ఉన్నాయనే అంశాన్ని తెలియ జెప్పటానికి ఇటువంటి గణాంకాలు ఉపయోగ పడతాయి. మన స్థూల జాతీయ ఉత్పత్తి వృద్ధిరేటు ఒక కొలమానం మాత్రమే. అది సమగ్రంగా మన అర్థవ్యవస్థను ఆవిష్కరించదనే అంశాన్ని గుర్తించాలి.
ఇలా చెబితే కొంతమంది ఆర్థికవేత్తలకి బాధకలుగవచ్చు. దేశంలో కొంతమంది గృహస్తుల వినిమయం తగ్గి వారు అవస్థలు పడుతున్నా, కొన్ని రంగాలలో పరిశ్రమలు ఇబ్బందులకు లోనై లాభాలు, ఆదాయాల క్షీణతను అడ్డుకోలేక ఉక్కిరిబిక్కిరి అవ్వవచ్చు. కొన్ని రంగాలలో కార్యకలాపాలు గతం కంటే తగ్గవచ్చు. అయినా సరే, ఒక్కొక్కసారి జీడీపీ మంచి వృద్ధిరేటును సూచించ వచ్చు. అందుకే ఈ గణాంకాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. జీడీపీకీ, జీవీఏకి మధ్యలో ఉండే తేడాని కూడా మనం గమనించాలి. జీడీపీ గణనలో పన్నులు, సబ్సిడీలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అదే జివిఏ గణనలో కేవలం వస్తుసేవల విలువను మాత్రమే తీసుకుంటారు. ఏ రంగంలో జీవీఏ ఎంత పెరిగింది అనే వివరాలు మనకు మెరుగైన అవగాహనకు ఉపయోగ పడతాయి. ఈ వివరాల లోకి వెళ్లినపుడు మన వ్యవసాయరంగం కేవలం 3.6 శాతం వృద్ధిపొందగా, మైనింగ్ రంగం వృద్ధి గతంకంటే తగ్గి 22.4గా నమోదైంది. అందుకని మన ప్రాథమిక రంగం వృద్ధిరేటు 2.4గా నిలిచింది. ప్రాథమిక రంగంలో వ్యవసాయం, పశుసంపద, అటవీ ఉత్పత్తులు, మత్స్యసంపద, మైనింగ్, క్వారీ కలిసి ఉంటాయి. ఈ రంగాలలో వృద్ధి ఎక్కువ లేనప్పుడు, జీడీపీ వృద్ధిలో మన జనాభా మొత్తం భాగస్వామ్యం ఒకేరీతిలో లేదని అర్థం చేసుకోవచ్చు. అలాగే కేవలం ప్రజల వినిమయం, లేక ప్రభుత్వ ఉత్ప్రేరకాల వల్ల మాత్రమే మన జీడీపీ వృద్ధి చెందిందని చెప్పలేం. ఎందుకంటే మన పెట్టుబడులు 11.9 శాతం చొప్పున పెరిగాయి. ప్రైవేటు వినిమయం 7.1శాతం చొప్పుని వృద్ధి చెందింది. ప్రభుత్వ వ్యయం 4.3శాతం పెరిగింది. మన గణాంకాల విశ్లేషిస్తున్నప్పుడు మన ఉత్పత్తి పెరిగి, దానికి తగ్గట్టుగా వినిమయం పెరగకపోతే, ఉత్పత్తి దారుల వద్ద స్టాక్ పెరుగుతున్నదా అనే అంశాన్ని కూడా చూసుకోవాలి.
ఈ త్రైమాసికంలో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం మన స్టాక్ అంతగా పెరగలేదు. ఉత్పత్తి పెరిగి, దానికి తగ్గట్టు వినిమయం పెరగనప్పుడు స్టాక్ ఎలా పెరగకుండా ఉంటుందనే అనుమానం కలగవచ్చు. మన ఎగుమతులు 12 శాతం పెరిగి వాస్తవ దిగుమతులు 1.1 శాతం తగ్గాయి కాబట్టి గణాంకాలను విశ్వసనీయమైనవిగా భావించవచ్చు. అయితే మన వృద్ధిరేటు ఎక్కువగా సేవల రంగం నుంచి వచ్చిందని గుర్తించాలి. సేవలరంగం వృద్ధి దీర్ఘకాలంలో స్థిరమైన వృద్దిని అందించగలదా అనే అంశంపై భిన్నమైన వాదనలు ఉన్నాయి. అలాగే మన వృద్ధిరేటుకు తగ్గట్టుగా మన ఉపాధి అవకాశాలు మెరుగుపడటంలేదు. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో 15ఏళ్లకి పైబడిన కార్మిక శక్తిలో రెగ్యులర్ వేతనజీవుల వాటా స్వల్పంగా పెరగటం శుభసూచకంగా భావించినా, నిరుద్యోగం రేటు గ్రామీణ ప్రాంతంలోనూ, పట్టణ ప్రాంతంలో కూడా పెరిగింది. అలాగే మన జనాభా కార్మిక నిష్పత్తి కూడా 52.8 శాతం నుంచి 51.7 శాతానికి తగ్గింది. మొత్తంమీద చూసుకుంటే కార్మిక శక్తి,ఉపాధి కల్పన వంటి వాటిల్లో ఫలితాలు ఆశాజనకంగా లేవు. వృద్ధిరేటు పెరిగిన స్థాయిలో మన దేశంలో ఉపాధి అవకాశాలు పెరగకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉపాధి అవకా శాలు పెంచటానికి తీసుకోవలసిన చర్యలపై నిపుణుల సూచనల మేరకు అనేక సంస్కరణలను ప్రవేశపెట్టటం జరిగింది. అందులో భాగంగానే ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన అమలు జరిగి, ఉపాధి కల్పిస్తున్న యాజమాన్యాలకు ప్రోత్సాహకాలు ఇవ్వటం మొదలుపెట్టారు. మన దేశంలో ప్రధానమైన సమస్యలలో ఒకటి నిరుద్యోగం. చాలా మంది విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు అందుకున్నా ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతు న్నారు. పరిశ్రమ లకు, ఉపాధి కల్పించే సంస్థలకు అవసరమైన నైపుణ్యాలు మన విద్యా విధానంలో సరిగా లేకపోవడమని చాలామంది అభిప్రాయం. అందుకే, నైపుణ్యం పెంచటానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ విధానపరమైన మార్పులు చేశారు. స్కిల్ ఇండియా మిషన్ క్రింద ఆధునిక పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలను మెరుగు పరచటానికి భారీ కార్యక్రమాన్ని అమలుచేశారు. అలాగే దేశంలో ఐఐటీలలో మెరుగైన పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకున్నారు.
ఉత్పత్తిరంగంలో ఉపాధి పెంచినవారికి (సంస్థలకు) వారు చెల్లిస్తున్న వేతనాల ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వటం మొదలుపెట్టారు. PMVBRY క్రింద గత సంవత్సరం రూ.99446 కోట్లను ప్రోత్సాహకాలు ఇవ్వటానికి ఖర్చుచేశారు. ఇన్నిరకాల ప్రయత్నాలు చేసినప్పటికి 15 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారి నిరుద్యోగ రేటు 12 శాతం వరకు ఉన్నది. పట్టభద్రులైన పురుషులలో దాదాపు 30శాతం, మహిళలలో 37 శాతం నిరుద్యోగులుగా ఉన్నారు. ఇటీవల నీతీ ఆయోగ్ జరిపిన అధ్యయనం ప్రకారం మన దేశంలో 87 కోట్లమంది15 నుంచి 29 సంవత్సరాల వయసులోని వారు అటు ఉపాధి, నైపుణ్య శిక్షణ లేక నిరుద్యోగులుగా ఉన్నారు. ఒకప్పుడు పట్టభద్రులను సమాజం ఎంతో గౌరవంగా చూసేది. వారికి ఏదో ఒక ఉద్యోగం కూడా వచ్చేది. ఇప్పుడు వారే అత్యధిక శాతం నిరుద్యోగులుగా ఉంటున్నారు. అలా అని ఇంజనీరింగ్ చదివినవారి పరిస్థితి బాగుందా అంటే ప్రతి అయిదుగురు ఇంజనీరింగ్ పట్టభద్రులలో కనీసం ఒక్కరు నిరుద్యోగులుగా ఉన్నారు.
అన్ని రంగాలలో యాంత్రీకరణ పెరగడం, రోబోలు, ఏఐ వంటి వినియోగం పెరగటం, అనేక సంస్థలలో ప్రవేశస్థాయి ఉద్యోగాలు తగ్గటం, వ్యాపారంలో విపరీతమైన పోటీ, సమాజంలో విలువలు తగ్గి అవినీతిపెరగటం వంటి అనేక కారణాలవల్ల క్రమంగా ప్రవేశ స్థాయి ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు చిన్న, సూక్ష్మ సంస్థలలో యాంత్రీకరణ వంటివి అంతగా లేకపోవటంవల్ల వాటిలో ఉపాధి అవకాశాలు ఉన్నా, వాటిల్లో పనిచేయడానికి చాలామంది ఇష్టపడటం లేదని ఇటీవల జరిపిన అధ్యయనంలో తేలింది. ఈ సంస్థలలో చేరినవారు దాదాపు అన్నీ తామై పని చేయాల్సిన అవసరం ఉండటం, సాంఘిక భద్రత లేకపోవడం, ఇందులో పనిచేసే వారికి సమాజంలో పెద్దగా గుర్తింపులేక పోవడం, తక్కువ వేతనం వంటి అనేక కారణాలవల్ల ఈ సూక్ష్మ సంస్థలలో ఉపాధి పొందటానికి యువత ఇష్టపడటంలేదు. ఇలాంటి సమస్యలపై అధ్యయనాలు జరిపించి పరిష్కారాలు కనుగొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నా, ఆశించిన ఫలితాలు సమాజానికి అందటంలేదు. ఈ కారణంవల్ల దేశం సాధించిన వృద్ధిరేటును అంగీకరించమనే ధోరణి మంచిది కాదు.
ప్రభుత్వం ఈ వృద్ధిరేటు గణించటానికి పరిగణనలోకి తీసుకుని బేస్ ఇయర్‌ని మార్చటం ఇదే తొలిసారి కాదు అనే విషయం తెలిసినదే. స్వాతంత్య్రానంతరం దీనిని 9 సార్లు మార్చారు.
బేస్ ఇయర్ ఎప్పుడు మార్చారు
1948-49 1959
1960-61 1967
1970-71 1978
1980-81 1998
1993-94 1999
1999-2000 2006
2004-2005 2010
2011-2012 2015
2022 -23 2026
పైన పేర్కొన్న పట్టికలోని వివరాలు చూసినప్పుడు ఇది కాలానుగుణంగా జరిగే సర్దుబాటు అనే విషయం అందరికీ అర్థమౌతుంది. పోనీ ఇలాంటి మార్పులు కేవలం మన దేశంలోనే జరుగుతు న్నాయా? అంటే అదీలేదు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో ఇది సాధారణంగా జరిగే అంశమే. అయినా ఈసారి దానిని ఒక వివాదంగా మలిచే ప్రయత్నం జరిగింది. దేశం గణనీయమైన వృద్ధిరేటును సాధించి విషయం కొంతమందికి మింగుడు పడకపోవచ్చు. ఇలా వృద్ధిరేటు గణాంకాలను ప్రశ్నించటం, వృద్ధిరేటు పెరగడాన్ని తక్కువ చేయాలనే ప్రయత్నం చేయటం, ఈ అంశంపై వివాదాన్ని రేపే ప్రయత్నం చేయటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఎన్‌డీఏ పాలనలో హెచ్చు వృద్ధిరేటును సాధించిన ప్రతిసారీ చిదంబరం, జైరాంరమేశ్ ఇలా ఎవరో ఒకరి నాయకత్వంలో ఇటువంటి సంఘటనలు జరిగాయి. ప్రజలకు వాస్తవాలు సరిగా తెలియజెప్పే ప్రయత్నం చేయకపోతే ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఈసారి వివాదాన్ని రేపడానికి మాజీ అధికారులను వాడుకున్నారని చెప్పక తప్పదు. మరో మాజీ అధికారి రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్‌గా కూడా చేసిన రఘురామ్ రాజన్ మన అర్థవ్యవస్థ ఇంత పటిష్టంగా వృద్ధి చెందుతున్నా యువతకు ముఖ్యంగా పట్టభద్రులకి మంచి ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించలేక పోతున్నాం? విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు ఎందుకు గణనీయంగా పెరగటంలేదు? ఇలా ప్రశ్నలని సంధిస్తూ ప్రభుత్వం చిప్స్‌తయారీకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడాన్ని కూడా తప్పుపట్టారు.
అంతటితో ఆగక మన సాంకేతిక ముఖ్యంగా సమాంతర సాంకేతికకు అవసరమైన ఉత్పత్తులకు భారత్‌లో తయారుచేయాలనే ప్రభుత్వ విధానాన్ని హేళన చేస్తూ మైక్రోచిప్స్ చాలా ఉన్నాయి కనుక, వాటిని సునాయాసంగా విదేశాల నుంచి స్మగ్లింగ్ చేసుకోవచ్చని కూడా వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యాఖ్యలనుబట్టి వారి ప్రాధాన్యతలేంటో స్పష్ట మౌతుంది. వాస్తవంగా దేశ హితంతో ఆలోచించే మాజీ అధికారులెవరైనా ఈ వృద్ధిని విమర్శించ దలుచుకుంటే వేరే విధంగా ప్రభుత్వానికి సూచనలు చేయవచ్చు.
అంతేకానీ, ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్న అంశాన్ని అనవసర వివాదాలలోకి లాగి గణాంకాల విశ్వసనీయలను ప్రశ్నించటం మాజీ అధికారుల స్థాయికి తగదు. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ఎంతో ఉన్నత స్థాయిలో పనిచేసినా కొంతమంది ఆలోచనలు అంతా ఉన్నతంగా ఉండవనే భావన ప్రజలకు బలపడుతుంది.
– సాయి, ఆర్థిక నిపుణులు