ఆర్ఎస్ఎస్-100
‘ఏకాత్మతా స్తోత్రం’ కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదు. అది ఒక నాగరికతాపరమైన ప్రకటన. సత్యాన్ని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయని, స్త్రీ,పురుషులు కలిసి సమాజాన్ని తీర్చిదిద్దుతారని, అలాగే భారతదేశం అనే విశాలమైన జీవన ప్రవాహంలో ప్రతి వర్గం, ప్రాంతం, సంప్రదాయం తమకంటూ ఒక స్థానాన్ని పొందినప్పుడు జాతీయ సమైక్యత బలపడుతుందనే భారతీయ దృక్పథాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
అస్తిత్వం, జాతీయవాదం, లౌకికవాదం, సాంస్కృతిక అనుబంధం వంటి అంశాలు బహిరంగ చర్చలలో ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రస్తుత తరుణంలో, ఆరఎసఎస్ స్ఫూర్తితో రచించిన ఏకత్మతా స్తోత్రం కన్నా మిన్నగా భారతదేశ నాగరికతా స్ఫూర్తిని వివరించే గ్రంథాలు చాలా తక్కువగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వేలాది శాఖలలో ప్రతిరోజూ పఠించే ఏకత్మతా స్తోత్రాన్ని, కేవలం ఒక భక్తి గీతంగానే అర్థం చేసుకుంటారు. వాస్తవానికి, ఇది భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రకటించే ఒక నాగరికతా ప్రకటన. ఇది భారతదేశపు సాంస్కృతిక పటం. సమగ్రంగా చదివిన పక్షంలో ఇది ఏ ఒక్క వర్గానికో, దేవతకో, లేదా సిద్ధాంతానికో అంకితమైన గీతం కాదనేది అవగతమవుతుంది. దానికి బదులుగా ఇది భారతీయ నాగరికత అనే విశాల సముద్రాన్ని ఏర్పరిచే విభిన్న ప్రవాహాల మేలు కలయిక. స్తోత్రం నిర్మాణమే ఈ సమ్మిళితత్వాన్ని ప్రదర్శిస్తుంది. “సచ్చిదానంద రూపాయ నమోస్తు పరమాత్మనే” అంటూ ఈ స్తోత్రమ్ పరమ సత్యానికి నమస్కరిస్తూ ప్రారంభమవుతుంది. ఇది ఏ వర్గానికీ చెందిన దేవత కాదు. ఇది సంకుచిత సరిహద్దులను అధిగమించే విశ్వ చైతన్యం. అక్కడి నుంచి ఈ స్తోత్రం భౌగోళికం, ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం, సాహిత్యం, సామాజిక సంస్కరణ, విజ్ఞానశాస్త్రం, ప్రజా జీవనం వంటి అనేక రంగాలను స్పృశిస్తుంది. పర్వతాలు, నదులు, నగరాలు, పవిత్ర గ్రంథాలు, సాధువులు, తత్వవేత్తలు, కవులు, యోధులు, శాస్త్రవేత్తలు సంస్కర్తలు ఇలా అందరూ ఒకే నాగరికతా గీతంలో ఇమిడిపోయారు. వేదాలు, ఉపనిషత్తులు, రామాయణం, మహా భారతం, భగవద్గీతతో పాటు ఇది జైన ఆగమాలు, బౌద్ధమత త్రిపీటకాలు, సిక్కుమత గురుగ్రంథ్ సాహిబ్‌లకు కూడా గౌరవాన్ని ప్రకటిస్తుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిన చేరిక కాదు. భారతదేశపు ఆధ్యాత్మిక వారసత్వాన్ని కేవలం ఒకే మార్గానికి పరిమితం చేయలేమన్న అవగాహనను ఇది ప్రతిబింబిస్తుంది. భారతీయ నేల నుండి ఉద్భవించి, ఇక్కడి నాగరికతా చైతన్యాన్ని సుసంపన్నం చేసిన వివిధ సంప్రదాయాల కృషిని ఈ స్తోత్రం గుర్తిస్తుంది.
స్తోత్రంలో స్త్రీలకు ఇచ్చిన స్థానం కూడా అంతే ముఖ్యమైనది. సమకాలీన చర్చలలో పితృస్వామ్య సంస్థ అనే ఆరోపణను ఆరఎసఎస్ ఎదుర్కొంటున్నది. అయితే, ఏకాత్మతా స్తోత్రం అటువంటి ఆరోపణకు శక్తివంతమైన సమాధానం ఇస్తుంది. ప్రధానంగా పురుషులపైనే దృష్టి సారించే అనేక సాంప్రదాయ గీతాలకు భిన్నంగా, ఈ స్తోత్రం భారత చరిత్రలోని వివిధ కాలాలకు చెందిన ఎందరో అసాధారణ మహిళలను ఉద్దేశపూర్వకంగా స్మరించుకుని గౌరవిస్తుంది. అలా గౌరవానికి నోచుకున్నవారిలో అరుంధతి, అనసూయ, సావిత్రి, సీత (జానకి), ద్రౌపది, కన్నగి, గార్గి, మీరాబాయి, రాణి దుర్గావతి ఉన్నారు. ఈ జాబితా ఇంతటితో ఆగదు. ఇందులో ఇంకా అహల్య, రాణి చెన్నమ్మ, రుద్రమాంబ, సోదరి నివేదిత, శారదాదేవి కూడా ఉన్నారు. ఈ మహిళలు వివిధ ప్రాంతాలు, వర్గాలు, చారిత్రక కాలాలు, విభిన్న రంగాలలోని శ్రేష్ఠతకు ప్రతీకగా నిలుస్తారు. కొందరు ఆధ్యాత్మిక జ్ఞానానికి, కొందరు నైతిక స్థైర్యానికి, కొందరు రాజకీయ నాయకత్వానికి, కొందరు సాంఘిక సేవకు, మరికొందరు మేధోపరమైన విజయాలకు ప్రతీకగా నిలుస్తారు. ఈ చేర్పు ప్రాముఖ్యత అపారమైనది. గార్గి ప్రాచీన భారతదేశపు తాత్విక సంప్రదాయానికి, మేధో స్వేచ్ఛకు ప్రతీకగా నిలుస్తుంది. సావిత్రి సంకల్పానికి, భక్తికి ప్రతీక. మీరాబాయి సామాజిక కట్టుబాట్లకు అతీతమైన ఆధ్యాత్మిక స్వాతంత్య్రానికి, భక్తికి ప్రతిరూపం. రాణి దుర్గావతి, చెన్నమ్మ అణచివేతకు వ్యతిరేకంగా ప్రతిఘటనకు, రాజకీయ ధైర్యానికి ప్రతీకగా నిలుస్తారు. స్వామి వివేకానంద శిష్యురాలు సోదరి నివేదిత ఐర్లాండ్‌లో జన్మించింది. భారతీయ నాగరికత పట్ల సార్వత్రిక ఆకర్షణకు, దేశ సేవకు ప్రతీకగా ఆమె నిలిచింది. శారదాదేవి ఆధ్యాత్మిక మాతృత్వానికి, కరుణకు ప్రతిరూపం. ఈ మహిళలందరినీ ఒకే సామూహిక స్మరణ పీఠంపై ఉంచడం ద్వారా దేశ నిర్మాణం, నాగరికతాభివృద్ధి కేవలం పురుషుల విజయాలు మాత్రమే కావు. భారత నిర్మాణంలో మహిళలు సమాన భాగస్వాములు అనే ఒక స్పష్టమైన సందేశాన్ని ఈ ఏకాత్మతా స్తోత్రం ఇస్తుంది.