ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరాలు..రంగు రంగుల కుసుమాలు. వాటి నుంచి వెదజల్లే సుగంధ పరిమళాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంత తను చేకూరుస్తాయి. శారీరక, మానసిక అలసటకు ఔషధంగా పని చేస్తాయి. అందాన్ని, ఆరోగ్యాన్నిచ్చి కాపాడుతాయి. అలంకారంలోను ప్రత్యేకతను చాటుతాయి.
ఉదయాన్నే తోటలో పూలు కోయడం భారతీయ నారీమణుల దినచర్యలో ఒక భాగం. పూజ గదిలో దేవుడి పాదాల చెంత చేరే పుష్పాలు కేవలం భక్తికి మాత్రమే కాదు, మహిళల భౌతిక, మానసిక ఆరోగ్యానికి కూడా దివ్యౌషధాలు. ఉదయాన్నే పూల సువాసనలను ఆస్వాదించడం వల్ల లభించే ప్రశాంతత, ఒత్తిడిని దూరం చేసి రోజంతా సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.
ఆరోగ్యం, శారీరక ఉల్లాసంలో పూలు చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. మన సంప్రదాయంలో మహిళలు తలలో పూలు ముడుచుకోవడం వెనుక కేవలం అందమే కాదు, ఎంతో సైన్స్, ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో వచ్చే చర్మ సమస్యలు, ఒంటివేడి, నీరసం వంటి వాటి నివారణకు పువ్వులు మంచి ఔషధంగా పని చేస్తాయి. రసాయనాలతో తయారైన ఉత్పత్తులను పక్కనపెట్టి, పూల పరిమళాలతో, సహజమైన పద్ధతులతో ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవచ్చు. ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలు పువ్వులు.
మల్లెల సువాసన మనసును ప్రశాంతంగా ఉంచడానికి అద్భుతంగా పని చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని తగ్గిస్తుంది. ఈ సువాసన మహిళల్లో హార్మోన్ల విడుదలను క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. మానసిక ప్రశాంతతకు, చలువకు సహకరిస్తుంది. అద్భుతమైన ఆరోమా థెరపీలా పనిచేసి ఒత్తిడితో పాటు తలనొప్పిని తగ్గిస్తుంది. మల్లెపూల రసాన్ని లేదా మల్లెపూల నీటిని ముఖానికి రాసుకోవడం వల్ల ఎండ వల్ల వచ్చే నల్లదనం తగ్గి, చర్మం చల్లబడుతుంది.
చర్మ సౌందర్యం, నెలసరి సమస్యలు
గులాబీ పువ్వులు చర్మ సమస్యల నివారణకు అద్భుతంగా పని చేస్తాయి. గులాబీ రేకులతో చేసే రోజ్ వాటర్ చర్మానికి సహజమైన టోనర్‌గా పనిచేస్తుంది. చర్మంపై మచ్చలను తగ్గించి, మంచి మెరుపుని ఇస్తుంది. రోజ్ వాటర్ వాడకంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. గులాబీ రేకుల టీ తాగడం వల్ల నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి, మానసిక స్థితిలో వచ్చే మార్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. గులాబీ రేకుల స్నానం శరీరాన్ని చల్లబరచి, తాజాగా ఉంచుతుంది. ఎండలో తిరగడం వల్ల ముఖంపై వచ్చే మంట, ఎరుపుదనాన్ని తగ్గించడానికి రోజ్ వాటర్ మంచి ఔషధంగా పనిచేస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గులాబీ రేకులతో చేసే గుల్‌కండ్ వేసవిలో మహిళ లకు ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు ఒక చెంచా గుల్‌కండ్ తినడం వల్ల ఒంటి వేడి తగ్గుతుంది, కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు మాయమవుతాయి.
అంటువ్యాధుల నివారణ
అందంగా, ఆకర్షణీయంగా కనిపించే చామంతి పూలలో క్రిములను నాశనం చేసే గుణాలు ఎక్కువ. వీటిని చర్మవ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. చామంతి పూలు అంటువ్యాధుల నివారణలో కూడా బాగా పని చేస్తాయి. చామంతి పూల టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
తామరపూల గుబాళింపు ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మారుస్తుంది. తామర రేకుల సువాసన గుండె వేగాన్ని నియంత్రించి, మహిళల్లో ఉండే మానసిక ఆందోళన,ఒత్తిడిని తగ్గిస్తుంది. పూజ గదిలో ఈ పూలను ఉంచడం వల్ల వీటి నుంచి వచ్చే సహజ సిద్ధమైన సువాసనలు తలనొప్పి, మైగ్రేన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పూజ గదిలో రసాయనాలతో తాయారు చేసే ఫ్రెషనర్లు వాడటం కంటే, సహజమైన పూలను ఉంచడం వల్ల మహిళల శారీరక రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, మానసిక ఉల్లాసం కూడా సిద్ధిస్తుంది. పూజ కోసం ఏరికోరి తెచ్చే తులసి, బిల్వ పత్రాలు, గన్నేరు, చామంతి పూలు ఇల్లంతటికీ సహజమైన శానిటైజర్‌గా పనిచేస్తాయి.
పూజ చేయడం వల్ల మహిళలకు ఎన్నో ఇతర ఆరోగ్య లాభాలు కూడా కలిగిస్తాయి. ఉదయాన్నే లేచి పూజ కోసం తోటలో పూలు కోయడం వల్ల శరీరానికి తాజా గాలి, సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ డి అందుతాయి. ఇది ఎముకల బలానికి చాలా అవసరం.
జుట్టు సమస్యలు, హార్మోన్ల ఆరోగ్యం
మందారపూలు మహిళల ఆరోగ్యానికి, అందానికి ఎంతగానో సహకరిస్తాయి. అందం, ఆహార్యం విషయంలో ప్రధాన పాత్ర పోషించేది శిరోజాలు. తలకట్టు ఒత్తుగా నల్లగా ఉంటే మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. జుట్టు సంరక్షణకు మందారపూలు, ఆకులు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి.ఈ పూలను కొబ్బరి నూనెలో వేడి చేసి తయారు చేసుకున్న నూనెను తలకు రాసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు నివారణకు ఇది చిట్కా వైద్యంగా చెబుతారు. మందార పూలను నలిపి ఆ రసాన్ని తలకు రాయడం వల్ల కూడా జుట్టు నల్లబడేందుకు దోహదపడుతుంది. వేసవి ఎండలవల్ల జుట్టు పొడి బారి, విపరీతంగా రాలుతుంటుంది. దీనికి మందారపూలు చక్కటి పరిష్కారం. అలాగే వీటిని పేస్ట్‌లా చేసి తలకు ప్యాక్‌గా వేసుకుంటే జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. ఎండబెట్టిన మందార పూల టీ తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది రక్తపోటు అదుపులో ఉంటుంది.
తలపోటు నివారణ
సువాసన లేకపోయినా, మంచి త్రిచూర్ణం రంగులో ఆకర్షణీయంగా కనిపించే కనకాంబరాలు తలలో పెట్టుకోవడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. కనకాంబరాలలో మాచిపత్రి, మరువం వంటి ఆకులను కలిపి మాల కడుతుంటారు. మాచిపత్రి, మరువం ఆకుల నుంచి వెదజల్లే పరిమళాలు మన సుకు ఆహ్లాదాన్ని, ప్రశాంతతను ఇస్తాయి. తలనొప్పి తగ్గేందుకు కూడా సహకరిస్తుంది.
సన్నజాజి మాలలు ధరించేందుకు మహిళలు ఎంతగానో ఇష్టపడతారు. పరిమళభరితంగా ఉండటమే కాకుండా తేలిగ్గా ఉండి జడలో ముడుచు కునేందుకు వీలుగా ఉంటాయి. ఈ పూల నుంచి వచ్చే సహజమైన సువాసనలు పార్శ్వపు తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
బంతిపూలు ఎక్కువగా పూజలకు, అలంకరణ చేయడానికే వాడుతుంటారు. కానీ వాటిని తలలో ముడుచుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నివారణకు సహకరిస్తుంది. ఈ పూలు క్రిమి సంహారిణిగా, నొప్పులు, వాపులను తగ్గించే గుణాలు ఎక్కువగా కలిగి ఉంటాయి. చెమట కాయలు, చర్మవ్యాధులు, చర్మంపై దద్దుర్లు రావడం సహజం. అటువంటి చర్మ సంబంధిత సమస్యలు వచ్చినపుడు బంతిపూల రేకుల పేస్ట్‌ను దద్దుర్లు లేదా ఇన్ఫెక్షన్లు ఉన్నచోట రాస్తే త్వరగా ఉపశమనం లభిస్తుంది. పారిజాతపూల సువాసన మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మోకాళ్ల , కీళ్ల నొప్పులకు పారిజాత ఆకులు, పుష్పాల కషాయం అద్భుతంగా పనిచేస్తుంది.
మన సంస్కృతిలో పువ్వులకు, పూమాలలకు విడదీయరాని బంధం ఉంది. పూలమాలలు కట్టడం కేవలం ఒక అలవాటు లేదా పూజా విధానం మాత్రమే కాదు. దాని వెనుక ఎన్నో ఆరోగ్య రహస్యాలు, అందచందాలు, నేటి ఆధునిక ఫ్యాషన్ దాగి ఉన్నాయి. చాలామంది పూలు కట్టడాన్ని ఒక సాధారణ పనిగా చూస్తారు, కానీ అది ఒక అద్భుత మైన థెరపీలా పనిచేస్తుంది. మాల కట్టేటప్పుడు దారంతో పూలను సున్నితంగా ముడివేయాలి. దీనికి ఎంతో శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. ఇది ఒక రకమైన ధ్యానం లాంటిది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. రంగు రంగుల పూలను చూస్తూ, వాటిని మాల కట్టేందుకు అమరుస్తున్నప్పుడు కంటి చూపు మెరుగవుతుంది. అలాగే చేతి వేళ్లకు, మెదడు సమన్వయానికి ఇది మంచి వ్యాయామం.
మల్లెలు, కనకాంబరాలు, గులాబీలు వంటి పూలను చేత్తో పట్టుకుని కడుతున్నప్పుడు వాటి నుండి వచ్చే సహజసిద్ధమైన పరిమళం నేరుగా మన శ్వాస ద్వారా మెదడుకు చేరి, ఆహ్లాదకరమైన హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇది మన మానసిక స్థితిని వెంటనే ఆహ్లాదంగా మార్చేస్తుంది. పూలలోని సహజ రంగులు ఎరుపు, తెలుపు, పసుపు, నారింజ మహిళల చర్మ ఛాయకు అదనపు కాంతిని ఇస్తాయి. ముఖంలో ఒక తెలియని కళ కనిపిస్తుంది. మార్కెట్లో దొరికే కృత్రిమ కేశాలంకరణ వస్తువుల కంటే తలలో సహజమైన పూలు పెట్టుకోవడం వల్ల జుట్టుకు, మెదడుకు ఎలాంటి నష్టం జరగదు, పైగా ఎంతో ఆరోగ్యం లభిస్తుంది.
ప్రస్తుతం సంప్రదాయ వస్త్రధారణలోనే కాక, ఇండో-వెస్ట్రన్ గాగ్రాలు, మోడరన్ లెహంగాలు, చివరికి జీన్స్-కుర్తీల కాంబినేషన్‌లో కూడా జుట్టును సైడ్ బన్‌లా చుట్టి, దానికి ఒకే ఒక్క గులాబీ లేదా చిన్న మల్లెమాలను చుట్టి అందంగా కనిపిస్తున్నారు యువతులు. పెళ్లిళ్లలో మెహందీ, హల్దీ వేడుకలకైతే పూల నగలదే హవా. పూలమాలలతో చేసిన హారాలు, గాజులు, వంకీలు, పాపిడి బిళ్లలు ధరించడం నేడు ఫ్యాషన్. జడ చుట్టూ రింగులు రింగులుగా పూలమాలలు తిప్పడం లేదా కేవలం జడ చివరన మాత్రమే పూల గుత్తులను అమర్చడం వంటివి నేటి యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.
పూర్వ కాలం నుండి మహిళలు గర్భాశయ ఆరోగ్యానికి, హార్మోన్ల సమతుల్యతకు పూల సువాసనలను ఒక థెరపీ లాగా ఉపయోగించేవారు. కాబట్టి కేవలం పండుగలు, ఫంక్షన్లప్పుడే కాకుండా, వీలైనప్పుడు ఇంట్లో సహజమైన పూలను ఉంచుకోవడం తలలో పెట్టుకోవడం మహిళల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మంచిది.
సరికొత్త పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించేలా చాలా మంది మహిళలు జుట్టును కొప్పులాగా ముడి వేసుకుంటున్నారు.ఈ పద్ధతిలో కొప్పు చుట్టూ దట్టంగా మల్లెపూలు లేదా మొగ్గలను చుట్టడం ప్రత్యేక ఫ్యాషన్. దీన్ని గజరా స్టైల్ అంటున్నారు. కేవలం మల్లెపూలే కాకుండా, చిన్న చిన్న రంగు రంగుల గులాబీలు లేదా విదేశీ ఆర్కిడ్స్ కొప్పుకు ఒక వైపు మాత్రమే పిన్‌చేయడంవల్ల రాజసం ఉట్టిపడుతుంది.
తెలంగాణలో బతుకమ్మ, కేరళం ఓనం వంటి మన పండుగలు కూడా కొన్ని పూర్తిగా పువ్వులు, ఆకులతోనే ముడిపడి ఉండటం వెనుక సంప్ర దాయంతో పాటు ఆరోగ్యం కూడా దాగి ఉంటుంది. ఉదయాన్నే సూర్యరశ్మిలో ఈ పూలను సేకరించడం వల్ల మహిళలకు లభించే వివిత్రమైన విటమిన్లు, వాటి సువాసనల వల్ల కలిగే మానసిక ఉల్లాసం వర్ణనాతీతం. నిత్యం పూలను ధరించడం వల్ల నెగెటివ్ ఆలోచనలు దూరమై, రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఇన్ని ప్రయోజనాలున్నపుడు మహిళలు పూలను ధరించే అలవాటును పెంచుకోవాలి.
జయశ్రీ ఆచంట
సీనియర్ జర్నలిస్ట్