వ్యవసాయ ప్రధానమైన మన దేశంలోని గ్రామాల్లో హెచ్చుమందికి జీవనోపాధి కల్పనకు, వ్యవసాయాధారిత పరిశ్రమలను ఇతోధికంగా ప్రోత్సహిస్తూ, రైతుల ఆర్థిక స్వావలంబన ద్వారా దేశ ఆర్థిక ప్రగతికి కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలుచేస్తోంది. అందులో భాగంగా రైతులు సాగుచేసే పంటలకు గిట్టుబాటు ధరలను నిర్ణయించి అమలు చేస్తోంది.
కేంద్రంలో నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి, వ్యవసాయ రంగం బలోపేతానికి చర్యలు తీసుకుంటోంది. పంట సాగుకు అయ్యే ఖర్చులు, శ్రమశక్తిని కలుపుకొని 50 శాతానికి తక్కువ లేకుండా హెచ్చుగా మద్దతు ధరలను నిర్ణయిస్తోంది. ఈ సంవత్సరం ఖరీఫ్ పంట కాలంలో సాగుచేసే 14 పంటలకు కనీస మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది.ఆ ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులు వాతావరణ, వ్యవసాయ పరిస్థితులకు, భూములకు, ప్రాంతాలకు, అనువైన పంటలను వేసి లబ్ధి పొందాలన్నది ప్రభుత్వ సంకల్పం.
దిగువ ఇచ్చిన పట్టికలోని కనీస మద్దతు ధరలను పరిశీలిస్తే, ఇవి గత సంవత్సరం కన్నా హెచ్చుగానే ఉన్నాయి. వరి పంటకు మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.72 పెంచడం ద్వారా రూ. 2,441లకు పెంచారు. ‘ఏ’ గ్రేడ్ ధాన్యానికి రూ.2,461 ప్రకటించారు. సాగుకయ్యే ఖర్చు కన్నా 50 శాతం అధికంగా రాబడి వచ్చేలా మద్దతు ధరలు నిర్ణయించారు.

ప్రస్తుతం దేశంలో నూనెగింజల దిగుబడి పెరుగుతున్నప్పటికీ, మన అవసరాలకు సరిపోక ఇతర దేశాల నుండి హెచ్చు స్థాయిలో దిగుమతులు చేసుకోవలసి వస్తోంది. దాంతో విదేశీ మారకద్రవ్యం అదే స్థాయిలో (ఏటా రూ.60-70 వేల కోట్లకు పైనే) ఖర్చు అవుతోంది. ఈ ఖర్చును తగ్గించే ఉద్దేశ్యంతోను, దేశీయంగా నూనెగింజల దిగుబడిని పెంచేందుకు నూనె గింజలకు కనీస మద్దతు ధరలను గణనీయంగా పెంచింది. ప్రొద్దు తిరుగుడు గింజలకు అత్యధికంగా క్వింటాలుకు రూ.622 పెంచి రూ.8,343లుగా నిర్ణయించారు. అలాగే పిచ్చినువ్వులు (చీఱస్త్రవతీ)కు క్వింటాల్‌కు రూ.515, నువ్వులకు రూ.500 పెంచడంతో ఆ ధరలు వరుసగా,రూ. 10,052, రూ.10,346 పెరిగాయి. వేరుశనగ క్వింటాల్‌కు రూ.254 హెచ్చుతో రూ.7,517 గా నిర్ణయించారు. పెంచిన ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రొద్దు తిరుగుడు, నువ్వులు, వేరుశనగ, పిచ్చి నువ్వులు పంటల సాగును ఇతోధికంగా ప్రోత్సహించి, సాగుచేసి రైతులు లబ్ధి పొందగలరని ఆశించవచ్చు.
ఇక అటు నూనె పంటగాను, పప్పు ధాన్యపు పంటగాను పరిగణిస్తున్న సోయా చిక్కుడు మద్దతు ధరను గత సంవత్సరం కన్నా క్వింటాల్‌కు రూ.380లు పెంచి రూ.5,708గా ప్రకటించడం మంచి నిర్ణయమే. అదే తరహాలో ఇతర పప్పుధాన్యాలు కంది, పెసర, మినుముకు గతంలో కన్నా అధికంగా మద్దతు ధరలు నిర్ణయించారు. కందికి క్వింటాలుకు రూ.450 పెంచి రూ.8,450గాను, పెసరకు రూ.12 పెంచి రూ.8,780, మినుముకు రూ.400 పెంచి, క్వింటాలుకు రూ.8,200గా నిర్ణయించారు. ఈ పెంపుతో రైతులు పప్పు ధాన్యాల పంటలను ఇతోధికంగా సాగుచేసి లబ్ధి పొందగలరని ప్రభుత్వం భావిస్తోంది.
వాణిజ్య పంట ప్రత్తి ….మధ్యస్థ పొడవు (Medium Staple) పింజకు క్వింటాల్‌కు రూ.557 పెంచడం వల్ల కనీస మద్దతు ధర రూ.8,267కు పెరిగింది. పొడవు పింజ (Long Staple) కు క్వింటాల్ రూ.8,667గా నిర్ణయించారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం, మంచి పోషక విలువలు కలిగి, తక్కువ నీటితోనూ సాగయ్యే చిరుధాన్యాలను ‘సిరి’ ధాన్యాలుగా (Nutricereals) గుర్తించింది వాటికి ప్రధాని నరేంద్రమోదీ ‘శ్రీ అన్న’ అని నామకరణం చేశారు.
అంతర్జాతీయంగా విశేషంగా ప్రాచుర్యం పొందిన జొన్న, సజ్జ, రాగి, మొక్కజొన్నలకు ప్రభుత్వం కనీస మద్దతు ధరలను గతంలో కన్నా గణణీయంగా పెంచి ప్రోత్సహిస్తోంది. ఈ ఖరీఫ్ పంటకాలానికి హైబ్రిడ్ జొన్నలు క్వింటాల్‌కు రూ. 324ల పెంపుతో దాని మద్దతు ధర రూ.4,023 పెరిగింది. మాల్‌దండి జొన్న రకానికి క్వింటాల్ రూ.4,073గా నిర్ణయించారు. మంచి పోషకాలతో ఇతోధికంగా సాగులో ఉన్న రాగికి క్వింటాల్‌కు రూ.319 పెంచి రూ.5,205గా, సజ్జకు రూ.125 పెంచి రూ.2,900గా, మొక్కజొన్నకు రూ.10 మాత్రమే పెంచి రూ.2,410గా మద్దతు ధరలను నిర్ణయించారు. మంచి పోషక విలువలు కలిగి, తక్కువ నీటితో,తక్కువ ఎరువులతో పండే ఈ చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
చాలావరకు పంటల దిగుబడి వ్యయం కన్నా రాబడి అధికంగా ఉండేలా మద్దతుధరలు నిర్ణయించారు. పెసరకు 61 శాతం, సజ్జకు 56 శాతం, మొక్కజొన్నకు 56 శాతం, కందికి 54 శాతం ధరలు పెరిగాయి. మిగతా పంటల్లో రాబడి 50 శాతంగానే ఉంది.రైతులకు ఉపయు క్తంగా, ఆయా వాతావరణ పరిస్థితులకు అనువుగా ఉండేలా, తక్కువ నీటి వనరులు, పోషకాల వినియోగాలున్న పంటలను, చిరుధాన్యా లను (సజ్జ, రాగి,జొన్న, మొక్కజొన్న….) పప్పుధాన్యాలను (కంది, పెసర మినుము, సోయా చిక్కుడు….) నూనె గింజలను (నువ్వులు, పిచ్చినువ్వులు ప్రొద్దు తిరుగుడు, వేరుశనగను ఇతోధికంగా సాగుచేసి అబ్ధి పొందాలని కోరుకుందాం. ఆయా ప్రాంతాలలోని వాతావరణ సానుకూల తలను బట్టి పంటలను చేయటం మంచిది.
ఈ సంవత్సరం ఎల్-నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తాయని, రుతుపవనాల రాక కూడా రెండు వారాల వరకు ఆలస్యమవు తుందని, రసాయనిక ఎరువులు కొంతమేరకే అందుబాటులో ఉంటాయనే ప్రకటనల నేపథ్యంలో వాతావరణ పరిస్థితులకు, భూములకు అనువైన పంటలనే వేయాలి. చిరుధాన్యాలను, అపరాలను, నూనెగింజలను, సేంద్రియ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేయాలి.
ప్రధానమైన ప్రోత్సాహకాలు :
సేంద్రియపు సాగు ద్వారా పండించిన పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలకు అదనంగా క్వింటాలుకు కనీసం రూ. వెయ్యి వరకు పెంచాలి.
చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజల ఉత్పత్తులను ప్రతి గింజను నిర్ణయించిన ధరలకు (కనీస మద్దతు ధర + ప్రోత్సాహక ధర) ప్రభుత్వం మిన్నగా సేకరించాలి. ఇలా చేయటంవల్ల పోషక విలువలతో కూడిన ఆహార పంటల లభ్యతతోపాటు, నూనెగింజల దిగుమతులను కొంతమేరకైనా తగ్గించవచ్చు.
వరిని వెంటవెంటనే సాగు చేయడం వల్ల నీటి వినియోగం ఎక్కువ కావడంతో పాటు ఎరువుల వాడకంతో నేల ఆరోగ్య స్థితి దెబ్బతింటూ, వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని, వరి సాగు విషయంలో సంయమనం పాటించాలి.
ప్రొ. పి.రాఘవరెడ్డి
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ
విశ్వవిద్యాలయం, మాజీ ఉపకులపతి