పేరుకు తగ్గట్టు ఊరికి వ•లగా ముప్పై ఇళ్లున్న ఒక చిన్న పేట వ•లపేట. ఊరికి తెల్లారాలంటే ముందుగా ఆ పేటలో జనం లేవాలి. కొందరు మరుగుదొడ్లు శుభ్రం చేస్తే మరికొందరు ఇళ్ల ముందున్న కాల్వల్లోని మురుగునీరుని తోడితే, ఇంకొందరు ఇళ్లలోని వాళ్లు రోడ్లపై పడేసిన చెత్తాచెదారం ఎత్తుతారు. ఒక మనిషి వ్యర్థాలని వేరొక మనిషి శుభ్రం చెయ్యడం చాలా హేయమైనది. అయినా పాపం ఆ పేట ప్రజలు అందుకు వెనుకాడేవారు కాదు. ఎప్పుడైనా ఎవరైనా టీ తాగడానికని రెండు రూపాయలిస్తే మురిసిపోయేవారు. ఏ ఇంటావిడయినా పాత చీర ఇచ్చినా, ఇళ్లలోని పిల్లల బట్టలు పొట్టయి పోయాయని ఇచ్చినా,పండక్కి పబ్బాలకి కొంచెం పులిహార, బూరెలు పెట్టినా చాలా సంతోషిం చేవారు.చేసే పనిబట్టీ వాళ్లని ఊరి ప్రజలు దూరంగా ఉంచేవారు, కానీ వాళ్లల్లో కూడా కన్నుముక్కు తీరుగా ఉన్నవాళ్లెందరో. పక్షుల కంటే ముందే లేచే ఆ జనాలు పొద్దుగూకుతూనే నులక మంచాలెక్కేస్తారు.
* * *
అర్ధరాత్రి పేటలో కొంచెం అలికిడి కావడంతో పేట మొత్తం లేచింది. కిరోసిన్ దీపాలలో ఆ పేట పెద్ద అప్పారావు, వీరిగాణ్ణి పట్టుకుని ‘తాగుబోతు నాయాల… ఆ మాట చెప్పడం తప్పనిపించలేదురా… నోటికొచ్చినట్టు పేలుతావా?…’ అంటూ తిడుతూంటే అందరూ పేట మధ్యలో గుమ్మిగూడి ‘ఏం జరిగింది’ అని ప్రశ్నించేటప్పటికి ‘దేవుల్లాటి’ మన పంతులుగారు సచ్చిపోనారని వాగుతున్నాడు… ఎదవ’ అనేసరికి అందరూ వీరిగాణ్ణి తిడుతూ ‘‘ఆ మగానుబావుడు గూర్సి అలా మాటాడ్డం తప్పురా ఈరిగా.నువ్వు తాగుతున్నావని, నిన్ను మంచిగా మార్సాలని ఆయన నిన్ను తిట్టినందుకు, అలా మాటాడ్డం తప్పురా?’’ అంటూ అందరూ వీరిగాణ్ణి తిట్టడం మొదలెట్టారు.
పక్కనే ఉన్న కిట్టిగాడు కల్పించుకొని అప్పారావు వైపు తిరిగి ‘‘లేదు మావా, వీరిగాడు సెప్పింది నిజమే. మేమిద్దరం రెండో ఆట సినిమాకెళ్లి వత్తూంటే పంతులుగారి ఇంటికాడ జనాలు వ•గున్నారు. ఏటయ్యిందని పంతులుగారి అబ్బాయినడిగితే, ఆ బాబే సెప్పాడు మావా’’ అంటూంటే, వీరిగాడు ‘‘అవును మావ… నేను పంతులుగారు తిట్టిన కాణ్ణుండి ఈరోజు వరకు మందెయ్యలేదు తెలుసా! సూడు కావాలంటే’’ అని అప్పారావు దగ్గరగా వీరిగాడు నోటి వాసన చూపిస్తూంటే అప్పారావుకి మందు వాసన వెయ్యలేదు.
అయితే వీరిగాడు చెప్పింది నిజమేనన్నమాట అని పేటంతా నమ్మారు. కానీ వారి పేటకు దేవుడులాంటి పంతులుగారు చనిపోయారని తెలిసి పేటంతా కన్నీరు మున్నీరై కుమిలిపోయారు.
* * *
బిక్కవిల్లి సూర్యనారాయణ శాస్త్రి ఆ ఊళ్లోని బ్రాహ్మణుల్లో ఒకరు. ఆయన్ని ఎరిగినవారు ‘బుచ్చిబాబుగారు’ అని కూడా పిలిచేవారు. ఆ ఊరి శివాలయంలో ఐదారుగురు పూజారుల్లో ఆయనొకరు. వృత్తిరీత్యా ఎవరే పని చేసినా మనుషులంతా ఒక్కటే అని నమ్మే సామ్యవాది. ఒకించుక ముక్కోపి. వ•లపేటలోని వాళ్లు చేసుకునే అక్షరాభ్యాసాలు, అన్నప్రాశన, పూజలకి, పెళ్లిళ్లకి మిగతా వాళ్లు వెళ్లకపోయినా ఆ పేట జనాలకి ఆయనే పౌరోహిత్యం చేసేవారు. తెల్లగా పొడుగ్గా ఉండేవారు. పంచె కట్టుకొని పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ నడిచేవారు. జనాలిచ్చే స్వయంపాకాలు పట్టుకెళ్లడానికి వీలుగా ఉంటుందని ప్లాస్టిక్ బకెట్, గుడ్డ సంచి పట్టుకెళుతూండడంతో వీధిలోని ఆకతాయి కుర్రాళ్లు ఆయన్ని బకెట్ పంతులు అని పిలిచేవారు. సాటివారు అతన్ని నీచంగాను, నిర్లక్ష్యంగాను చూసినా తాను చేసేది తప్పుకాదని, పౌరుల హితం కోరేవాడే పురోహితుడని, అందరి లోనూ ఉన్నది ఆ భగవంతుడేనని అర్థం చెప్పి అన్ని విధాలుగా వాళ్లకి అండగా ఉంటానని తెగేసి చెప్పి తలెత్తుకుని తిరిగేవారు. ఆయన ఆ పేటకి పౌరోహిత్యమే కాదు… వాళ్ల బాగోగులు చూసే పెద్ద దిక్కు కూడా. ఆ పేట వాళ్లని శుభ్రంగా ఉండమని, మగ పిల్లల్ని, ఆడపిల్లల్ని చదువుకోమని ప్రోత్సహించేవారు. అప్పుడప్పుడు సాయంత్రం వేళ వాళ్ల స్థాయికి దిగి పురాణాల లోని కథలు చెప్పేవారు. ఆ పేటలోని సూరయ్యని చదివించి మున్సిపల్ ఆఫీసులో గుమస్తాగా ఉద్యోగం ఇప్పించారు.
* * *
కొంతకాలానికి పేటలోని రెండవ తరం పిల్లల్ల వేషభాషల్లో చాలా మార్పు వచ్చింది. ఆడ మగా చదువుకోవడం, అన్నింటా ఫస్ట్ మార్కులు తెచ్చు కోవడం, పోటీ పరీక్షల్లో ఏ విధమైన మినహా యింపులు పొందకుండా అగ్రస్థానాల్లో నిలవడం ఆయన చలవే.
* * *
అంతటి మంచి వ్యక్తి ఇకలేరని తెలిసిన వెంటనే పేటలోని వాళ్లందరికీ ఏం చెయ్యాలో తోచలేదు. అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.రాత్రికిరాత్రే పేటపేటంతా కదిలి బుచ్చిబాబుగారింటి వీధి చివర నిలబడ్డారు. వాళ్లు విన్న వార్త నిజమేనని తెలిసి పేటకి పెద్దదిక్కు, తమ బతుకులకు మార్గదర్శనం చేసే వ్యక్తి కోల్పోయి నందుకు తమలోతాము మాట్లాడుకుంటూ ఎంతగానో కుమిలిపోయారు.
* * *
తెల్లవారింది. పిల్లలు, బంధువులు వెంట నడుస్తుంటే పంతులుగారి అంతిమ యాత్ర ఉదయం తొమ్మిది గంటలకి మొదలయ్యింది. ఆయన శవానికి కొద్ది దూరంలో నడుస్తూ పేట జనమంతా శ్మశానం వరకు వెళ్లి తమ పెద్ద దిక్కుకు నివాళులర్పించి వెనుదిరిగారు.
* * *
పంతులుగారి చేతుల మీద చేయించిన ఆఖరి పెళ్లి అప్పారావు కూతురిది. కొద్ది రోజుల తరువాత అప్పారావుకి మనవరాలు పుట్టింది. ఇప్పుడు ఆ పిల్లకి బారసాల చేయించవలసి ఉంది. ఇప్పుడు అదే పెద్ద సమస్య. పంతులుగారు కాలం చేసేక వాళ్లకి పూజలు, పునస్కారాలు, శుభకార్యాలు చేయించే దిక్కు కరవైపోయింది. సలహా కోసం పంతులుగారి అబ్బాయిని వెళ్లి కలిశాడు అప్పారావు. పంతులుగారి చిన్న కొడుకులిద్దరూ వేరే ఉద్యోగాలు చేసు కుంటుండడం వల్ల వాళ్లు కూడా ఏమి సలహా ఇవ్వలేకపోయారు. కానీ పెద్దబ్బాయి రవి సోమనాథ శర్మ పంచాంగం చూసి ఒక మంచి రోజున ముహూర్తం నిర్ణయించాడు.
* * *
పదిహేను రోజులు పోయిన తరువాత ఆరోజు రానే వచ్చింది. ఏం చెయ్యాలో ఎవ్వరికి తోచలేదు. పంతులుగారున్నప్పుడు ‘‘మనలో మనకి సంబంధాలు కుదర్చడం, పెళ్లిళ్లు చేయించడం, సీమంతాలకి ముహూర్తం పెట్టడం, నక్షత్ర దోషాలేమైనా ఉంటే చెప్పడం, పిల్లలకి ఏ పేరుపెట్టాలో చెప్పేవారు. ఫలానా అక్షరాలతో మొదలయ్యే పేరుపెట్టండి అని సలహా ఇచ్చినప్పుడు, ఎవరైనా ఎదురు ప్రశ్న వేస్తే కోపంగా ‘నా పేరు పెట్టండర్రా…నా పేరు పెట్టండి’’ అని కోప్పడేవారు. పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయించేవారు. వినాయకచవితి నవరాత్రుల్లో వినాయకుణ్ణి నిలబెట్టి రోజు పూజలు చేయించే వారు.’’ అంటూ ఆ రోజు పేటలో పంతులుగారిని తలుచుకోని వారు లేరు. కార్యక్రమం ఎలా జరుగుతుందోనని ఆందోళన పడుతూంటే పంతులుగారిని పోలిన రవిబాబు పంచె కట్టుకొని, తండ్రిలాగే చేతిలో సంచీ పట్టుకొని వచ్చి తన తండ్రికి, ఆ పేటకు వారసుడిగా నిలబడి తనకి తెలిసిన విధంగా కార్యక్రమం జరిపించాడు. ఆ రోజునుండి ఆ పేటకి పెద్ద దిక్కుగా నిలబడ్డాడు.