పన్ను వసూలు నియోగాధికారులతో కలసి వచ్చి మహారాజుతో నిండు పెరోలగంలో చెప్పాడు మురారి.
అప్పటికే మోటుపల్లి స్థల పాలకుడు భీమయ దేవరను రాజధానికి పిలిపించింది రుద్రమదేవి. ఆర్థ్ధిక నియోగ నిపుణుడు సదగామభట్టును కూడా పిలిపించాడు మహారాజు.
‘‘మేము.. అంటే రుద్రమదేవి, మురారిదేవుడు, నేను, పన్ను వసూలు అధికారులు, పరదేశీ వణిజశ్రేణి ముఖ్యులు.. అందరం ఆందోళన చెందుతోంది మోటుపల్లి రేవు గురించే మహారాజా! అక్కడ జరుగుతున్న అకృత్యాలు ఇన్నీఅన్నీ కావు. దాదాపు వందమంది సముద్రపు దొంగలు అక్కడ ఉన్నారు. ఒక్కొక్కడి వద్ద వందలమంది కిరాతకులున్నారు. ‘కడవంత గుమ్మడికాయ కత్తిపీట’కు లోకువ అన్నట్లు ఆకాశమంత ఎత్తున్న మహానౌకలను కూడా వీళ్లు నీటిలో ముంచేయగలరు. అందున్న సమస్తం దోచుకోగలరు. కొందరు వణిజులు తోటి వణిజుల నాశనం కోరుతూ ఇలాంటి సముద్రపు దొంగలను పెంచి పోషిస్తున్నారు.’’
‘‘ఒకప్పుడు ఎప్పుడు చూసిన పది విదేశీనౌకలు మోటుపల్లిరేవులో లంగరు వేసి ఉండేవి.ఈ మాసంలో ఒక్కటంటే ఒక్క విదేశీనౌక వస్తే ఒట్టు. గత ఆరు నెలలుగా ఇదే పరిస్థితి.’’ చెప్పాడు మరొక అధికారి.
‘‘మనం భరించలేనంత విపరీతమైన పన్నులు విధిస్తున్నామని, మనకంటే దంతపుర (కళింగ) రేవు వారు విధించే పన్నులు తక్కువ అని,దిగువన పుదుక (పుదుచ్చేరి)రేవులో పన్నులు కూడా మనకంటే సగానికి సగం తక్కువ అని.. విదేశీ వణిజుల ప్రతినిధులు చెబుతున్నారు మహారాజా..!’’ చెప్పాడు మరొక రేవు అధికారి.
వినివిని చిరాకు పడిపోయాడు మహారాజు గణపతిదేవుడు.
‘‘అబ్బబ్బబ్బా.. ఆపండి. వినలేక చెవులు చిల్లులు పడిపోతున్నాయి. సరే! నేనొక నిర్ణయానికొచ్చాను. అక్కడున్న కిరాతక వ•కలను ఏరి పారేయాలి. విదేశీ వణిజుల ఆత్మవిశ్వాసం పెరిగి వాళ్లు తిరిగి మన రేవుకు వచ్చేలా వారికీ అభయం ఇద్దాం. నష్టపోతే ఆ సరకు మొత్తాన్ని లెక్కకట్టి తిరిగి చెల్లిస్తామని శాసనం వేయిద్దాం. సరేనా?!’’ అన్నాడు.
అందరి ముఖాలలో ప్రసన్నత ద్యోతక మాడింది. సిద్దయదేవర ముఖాన మాత్రం విషాదరేఖల్లో మార్పులేదు.
‘‘సిద్దయా! ఆ కిరాతక సముద్ర దొంగలను అణచి వేయడానికి మీకు కొందరు రక్షణ భటులను పంపుతాను. సరిపోతుందా??’’ అన్నాడు సిద్దయను చూస్తూ.
‘‘క్షమించాలి మహారాజా! మావ•లు రక్షకభటులవల్ల ఆ కిరాతకుల నిర్మూలన కష్టం. దయచేసి ఎవరైనా ప్రముఖ మందడి నాయకత్వంలో సైనికుల పటాలం ఒకటి దాడి చేస్తేనే..’’
‘‘ఆగాగు.. మందడి నాయకత్వంలో దాడి..అంటే మెరుపుదాడి? ఓ పటాలం సైన్యం మెరుపుదాడి చేస్తేనే వాళ్ల నిర్మూలన సాధ్యమంటావ్‌?!!’’
‘‘అవును మహారాజా..’’ అన్నాడు చేతులు జోడించి దీనంగా సిద్దయ.
సిద్దయకు సంఘీభావంగా మురారి సహా మొత్తం అందరూ చేతులు జోడించారు.
అప్పటికి గాని గణపతిదేవునికి మోటుపల్లి రేవులో జరుగుతున్న ఘోరకలి అర్థ్ధం కాలేదు.
‘‘ఔరా..! అంటే సాధారణ రక్షకభటులు కూడా నియంత్రించలేని అకృత్యాలు అక్కడ జరుగు తున్నాయా!?.. నిజమే అయితే సహించరాని నేరం.’’ అన్నాడు.
అనంతరం మందడి దుర్గిరెడ్డి నేతృత్వంలో ఓ పటాలం అశ్వికదళం ఓ రాత్రికి రాత్రి మోటుపల్లి స్థల గ్రామాలపై విరుచుకుపడి దాదాపు అందరూ సముద్ర దొంగలను కిరాతకంగా హతమార్చింది.
గాలప్ప తదితర దొంగలు తమను అప్పరుసుశెట్టి నియమించినట్లు అంగీకరించగా వారందరికి ఉరిశిక్ష విధించి అప్పరసు కోష్టాగారాలను ఉన్నపళంగా అంకాలశెట్టికి స్వాధీనం చేసి అప్పరుసును రాజ్యం విడిచి వెళ్లిపోవలసినదిగా రేవు న్యాయస్థానం తీర్పు చెప్పింది.
అనంతరం విదేశీవణిజులశ్రేణి సభ్యులను అనుమకొండకు పిలిపించి పట్టు వస్త్రాలతో సత్కరించి మోటుపల్లి రేవులో తిరిగి వారంతా ప్రశాంతంగా వాణిజ్యం నిర్వహించుకోవాలని కోరుతూ.. ప్రస్తుతమున్న పన్నులలో వ•డు వంతులు తగ్గించి, కేవలం నామమాత్రపు పన్నులను నిర్ణయిస్తూ.. వారి సరకు మొత్తానికి బాధ్యత కాకతీయ రాజ్యపాలనా వ్యవస్థ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అలా మోటుపల్లి రేవులోని వీరభద్రస్వామి గుడి మండప కుడ్యంపై శాసనం వేయించాడు గణపతిదేవుడు.
1.ఎగుమతులు, దిగుమతులపై కొత్తగా 1/30 వంతు సుంకంగా చెల్లించాలి. (గతంలో ఇది ఒక వంతు ఉంటే ఇప్పుడు కేవలం అందులో 30వ వంతు చెల్లిస్తే చాలు.)
2.ఒక గద్యాణం విలువ కలిగిన పన్నీరు,దంతం, జవ్వాది, కర్పూర తైలం, రాగి, సీసం, పట్టుదారాలు, పగడాలు, సుగంధ ద్రవ్యాలపై,1/2, 1/8 వంతుల సుంకాన్ని రూకలలో (నాణేలు) చెల్లించాలి.
3.ఒక గద్యాణం విలువ కలిగిన మిరియాలపై 3/4 వంతు, 1/16 వంతు రూకలలో చెల్లిస్తే సరిపోతుంది.
4.ఒక వ•ట (స్వరూపం) పట్టుబట్టలపై 1/2 వంతు పన్ను రూకలలో చెల్లించాలి.
5.ఒక గద్యాణం విలువ కలిగిన పోకచెక్కలపై 1/2 వంతు శిస్తును రూకలలో చెల్లించాలి.
ఇలా మొత్తం రెండువందల వస్తువులపై పన్నులను నామ మాత్రంగా ఉంచి ఆ శాసనంలో విపులంగా ప్రకటించాడు. దానిని కాకతీయ అభయశాసనంగా తూర్పు పశ్చిమ తీరరేవులలో ప్రముఖంగా చెప్పుకున్నారు. దాంతో తిరిగి మోటుపల్లి రేవు పూర్వవైభవంతో కళకళలాడుతోందని వార్తలు రావడంతో మురిసి పోయేలోగా మరో కొత్త సమస్య తలయెత్తింది.

* * *
ముసురు.. మాసం రోజులుగా వర్షాలు..
వర్షం మొదలయిన రోజు రైతులు తలపైకెత్తి దేవుడ్ని తలచుకుని ‘కనికరించావా దేవయ్యా..’ అనుకున్నారు.
కానీ దినవ• వర్షాలు కురుస్తుండటంతో ఇప్పుడు తిట్టుకుంటున్నారు.
వర్షాలు.. వర్షాలు.. దాంతో కాలువలు, వాగులు, వంకలు, ఏరులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. మరి కొన్ని రోజులు ఇలాగే కురిస్తే ఎదిగిన పైరు మునిగిపోయే ప్రమాదం ఉంది.
నదులపై ముఖ్యంగా తెలుగు రాజ్యాలలో నదులపై ఆనకట్టలు లేవు. కారణం ఒక్కటే..అన్ని చిన్నచిన్న రాజ్యాలు.ఎవరికీ పక్కవాడిపై అభిమానం లేదు. శత్రుత్వమే. పక్కరాజ్యాన్ని ఆక్రమించుకోవాలనే ప్రణాళికలు తప్ప ప్రజలకు కలుగుతున్న నష్టాన్ని నివారించడానికి కలిసికట్టుగా పనిచేద్దామనే అంశమే తెలియని కాలం.
పడమర ఉదయించి తూర్పునకు ప్రవహించే మహానదీ మతల్లులున్న తూర్పు ప్రాంత రాజ్యాలకు, ఏటేటా వరదలు వచ్చి రైతులు పంటలు కోల్పోతున్నా, ప్రాణాలు పోతున్నా రాజులు పట్టించుకోరు.పైగా, ‘అయ్యో మా పన్నుల వసూలు తగ్గిపోతుందేమో’ అన్న బెంగ వారిది పాపం.
స్థానిక సమయం వారే ఆయా గ్రామాలలో అందరూ కలిసికట్టుగా నష్టనివారణ చర్యలు చేపడతారు తప్ప రాజుల సహాయం ఉండదు. ఇటీవల స్థల సమయం వారు, నాడు లేదా విషయ సమయం వారు కలసికట్టుగా కొంత శ్రమించి కాలువలకు గట్లు నిర్మించుకోవడం చేస్తున్నారు. అవి కూడా తాత్కాలికమే. నదికి వరద వస్తున్నప్పుడు, అతి వర్షాలు కురుస్తున్నప్పుడు మాత్రమే. సాధారణ పరిస్థితుల్లో ఎవ్వరూ ఏమీ చేయరు. భవిష్యత్‌ ఏమిటి? రేపటి సంగతి, వచ్చే ఏడాది, వచ్చే పదేళ్లు, వందేళ్లు….ఇలా ఆలోచించడం అసలు తెలియదు.
ఇప్పుడిప్పుడే ఆ ధోరణి పెరుగుతోంది. అన్నిం టికీ మహారాజువైపు చూడటం మొదలయ్యింది. గణపతిదేవుని పాలనలో అన్ని అంశాలు మహారాజు వద్దకు తీసుకు వెళ్లడం అనే సంప్రదాయం వచ్చింది.
ఆయనకు నివేదించాడు వ్యవసాయ నియోగామాత్యుడు పరవులనాయడు.
వెంటనే నీటి పారుదల నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయమన్నాడాయన. సమావేశంలో, ముగ్గురు నిపుణులు, సంబంధిత నియోగులు.. మొత్తంగా పదిమందితో చర్చ జరిగింది.
గతంలో ఎప్పుడో నలభై ఏళ్లనాడు జరిగిన చింతనా శిబిరంలో ప్రస్తావనకు వచ్చిన అంశాలే ఇక్కడ.. ఇప్పుడు కూడా ప్రస్తావనకు వచ్చాయి.
‘‘అసలు ఎక్కడో పడమట కొండలలో పుట్టి వేల యోజనాలు ప్రవహించి చివరగా తూర్పున మన రాజ్యాల గుండా పోయి సముద్రంలో కలుస్తాయి. కానీ ఎగువన ఎక్కడా ఒక్కటంటే ఒక్క ఆనకట్ట లేదు మహారాజా! అందువల్ల ఎగువన కురిసిన నీరంతా ప్రవహించి ప్రవహించి మన రాజ్యాలను ముంచెత్తు తున్నాయి. మన పంటలను నాశనం చేస్తున్నాయి. వందలాది మంది బీదాబిక్కి ప్రాణాలు కోల్పోతు న్నారు. బతికినవాళ్లు ఎగువనుండి వచ్చిపడిన ఒండ్రు మట్టితో తిరిగి పంటలు బాగా పండించుకుంటున్నారు కాని తక్షణ మరణాలు, పంట నాశనాన్ని పాపం వాళ్లు గుర్తించడం లేదు.’’
‘‘మరి పాలకులో?? రాజులేమి చేస్తున్నారు??’’
‘‘పాపం.. పన్నులు వసూలు తగ్గుతాయని కోటలో కూర్చుని బాధ పడుతుంటారు ప్రభూ.’’
‘‘కానీ.. కానీ ఈ ఏడాది కొందరు సామంతులు వచ్చి నన్ను సంప్రదించారు అమాత్యా..!’’
‘‘అదే నిజమైతే అంతకంటే సంతోషం మరొకటిలేదు ప్రభూ! అది కూడా మీరు ప్రజాపక్షం వహిస్తున్నారు కాబట్టి వాళ్లు కూడా వచ్చారని నా అభిప్రాయం ప్రభూ..’’
‘‘సరే సరే.. తక్షణ కర్తవ్యం?’’
నదులు మన తెలుగు రాజ్యాలలోకి మొదలయినచోటు నుండి నదుల గట్లను, కాలువల కట్టలను పటిష్టపరిస్తే కనీసం ప్రవాహం పక్కకు పోకుండా సరాసరి సముద్రంలోకి పోతుంది. ఆ పని వెనువెంటనే ప్రారంభించాలి.’’ అమాత్యుడు అన్నాడు.
‘‘ఆ పని స్థానిక సమయం వాళ్లు ఏటేటా చేస్తూనే ఉన్నారు కదా స్వామీ..’’
‘‘నా అభిప్రాయం ఏవిటంటే వాళ్లు వాళ్ల గ్రామాల వరకు,లేదా స్థల, నాడు వరకు గట్లు పటిష్టపరచుకుంటున్నారు. కానీ ఒక్కొక్కసారి కృష్ణమ్మ, గోదావరమ్మ లేదా బోలెడన్ని ఉపనదులు ఉధృతంగా వస్తే ఇవేవీ ఆగడంలేదు. గత ఏడాది అదేగా జరిగింది..’’
‘‘అవన్నీ మట్టి ప్రాకారాలు.. వరద వస్తే గట్లు తెగుతున్నాయి..’’
గణపతిదేవుడు కలగజేసుకున్నాడు. ‘‘మట్టితో నిర్మించడం ఏవిటి?రాళ్లతో నిర్మిస్తే శాశ్వతంగా ఉంటుంది కదా..’’ అందరూ ఆగిపోయారు.
మరో నిపుణుడు అన్నాడు. ‘‘ఈ అభిప్రాయం.. అంటే కొండరాళ్లతో నిర్మిస్తే గట్టిగా ఉంటుంది అని ఓ స్థల నాయకునికి చెప్పాను ప్రభూ! కానీ ‘దగ్గరలో కొండలు లేవు కదా? దూరం నుండి తేవాలి అంటే ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. మా వద్ద అంత సొమ్ము లేదు కదా’.. అంటూ ఆ ప్రయత్నం చేయలేదు ప్రభూ!’’
‘‘సరే సరే. నదులు మన సామంత రాజ్యాలలోకి ప్రవేశించిన చోటు నుండి సముద్రంలో కలిసే వరకు అన్ని నదులకు రెండువైపులా గట్లు పూర్తిగా కొండరాళ్లతో చాలా ఎత్తున.. తాడిచెట్టు ఎత్తున కట్టించండి. అందుకు అయ్యే ఖర్చు మొత్తం రాజ్య భాండాగారం నుండి తీసుకోండి. సరిపోకపోతే మహారాజు భాగం నుండి తీసుకోండి. ఒక్క ప్రాణ నష్టం, పంట నష్టం జరగకూడదు. ఇది మా ఆజ్ఞ..’’
అద్భుతం.. అంతా బానే ఉంది కాని సమస్య కొండరాళ్ల వద్ద వచ్చింది.

* * *
గంపలపల్లె స్థల. విసురునాడు రాజ్యం..
వ్యవసాయ పని పాటలు మొదలయ్యే ఏరువాక పున్నమి నాటికి ఈ గ్రామంలో తయారయ్యే గంపలకు గిరాకి ఎక్కువ. కొత్త గంపలతో ఏరువాక పండుగ చేసుకుంటారు రైతులు.
గంపలపల్లె, గురిందలగూడెం, నామంపల్లె, పంగుళ్లపాడు, నటేశగుళ్ల. ఐదు గ్రామాలున్న స్థల.
గోదావరినది ప్రవేశించిన తొలి తెలుగురాజ్యం. నది వెళుతున్నదారిలో వ•డో రాజ్యం విసురునాడు. దానిలోనిది ఈ స్థల. వర్షపాతం అధికంగా నమోదయ్యే రాజ్యాలలో ఒకటి. బంగారు పంటలు పండే రాజ్యంగా ఇతరులు ఈర్ష్య పడతారు కాని వర్షాకాలంలో అక్కడ నష్టమయ్యే పంటల గురించి, వరదలకు చనిపోయే ప్రజల గురించి ఆ ఇతర గ్రామవాసులు చెప్పుకోరు.
గొప్పలు చెప్పుకోవడం ధనవంతులకంటే పేదలకే ఎక్కువ సరదా.
గంపలపల్లె దగ్గర గోదావరి వెడల్పు ఎక్కువ. ఆవలి తీరం చూడాలంటే కళ్లపై చేయి పెట్టుకోవలసిందే.
నది ఒకానొక ఏడాది ఉధృతంగా దూకుడుగా ప్రవహిస్తుంది. అప్పుడు వర్షాలు తక్కువ ఉండొచ్చు. కాని ఎగువన కురిసిన వర్షం సముద్రంవైపు వచ్చే స్తుంది. దారిలో అక్కడక్కడా కాలువలు తవ్వారు కాని ఆనకట్టలు లేవు. ఆ వచ్చే గోదావరి గంపలపల్లె దగ్గర మరింత వేగంగా ప్రళయ తాండవం చేస్తుంది. ఖర్మ కొద్ది ఆ స్థల, గ్రామ సమయసెట్టిలు దుర్బలురు. నిమ్మకు నీరెత్తినట్లుంటారు. ‘‘అంతా ఆ శివుడి దయ..’’ అనేది వారి ఊతపదం.
ఆ ఊళ్లో ఉన్న అతి బలవంతుడు మార్తాండ భట్టారకుడు. ఆయన స్థానిక శివాలయ పూజారి. ఇప్పుడు ఆయన రుద్రునికి దేవాలయం నిర్మిస్తున్నాడు. ఆ ఊరివాడైన నకులశెట్టి గొప్ప పరదేశీ వర్తకుడు. వేలకోట్ల ధనరాసులకు అధిపతి. ఆయన మార్తాండ భట్టారకుని ప్రియశిష్యుడు. మార్తాండుడు ఎప్పుడు కోరితే అప్పుడు కోరిన ధనసహాయం చేస్తాడు. ఆ ధన సహాయంతో మార్తాండుడు ఈ గుడి నిర్మిస్తున్నాడు.
‘‘గురువర్యా! ప్రపంచమంతా తరలివచ్చి చూసేటంత పెద్ద దేవాలయం మన గ్రామంలో నిర్మించాలి. మనం చెల్లించే పన్నులు, కప్పాలు అన్ని తీసుకుపోయి వాళ్ల రాజ్యాలలో పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మిస్తున్నారు చోళ, చాళుక్య పాలకులు. మన సొమ్ముతో మనం నిర్మించుకుంటే తప్పేముంది.. మీకు నేనున్నాను.. ఆ రుద్రునికి అద్భుతమైన దేవాలయం నిర్మించండి..’’
శిష్యుని అభయంతో మార్తాండభట్టు ఆనందంతో రెచ్చిపోయాడు. మహా విశాలమైన దేవాలయానికి రూపకల్పన చేసి ప్రారంభించాడు. నదీతీరంలో ఉన్న ఈ గ్రామానికి దగ్గరలో కొండలు, పర్వతాలు లేవు. శిల్పులు కోరిన బండలను, రాళ్లను చాలా దూరం నుండి వ్యయప్రయాసల కోర్చి తెప్పిస్తున్నాడు. దేవాలయ నిర్మాణం ఉధృతంగా సాగుతోంది. నివాసం గ్రామంలో ఉండగా గుడి నిర్మాణం నిమిత్తం శిల్పులతో పాటు తాత్కాలికంగా చిన్నపాటి నివాసాన్ని అక్కడే ఏర్పర చుకుని ఉన్నాడు.
ఓ రోజు ఉదయం ఆయన రుద్రదేవుని వ•ల విరాట్టు విగ్రహరూపంపై ఆగమశాస్త్రం, ప్రతిమాశాస్త్ర గ్రంథాలను పరిశీలిస్తూ.. చాలా ఏకాగ్రతతో ప్రధాన స్థపతులతో చర్చిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో నివాసం బయట గుర్రాలు ఆగిన కలకలం వినపడింది. ఆయన సహాయకులు చూసి వచ్చి చెప్పారు.
‘‘మన స్థల సమయశెట్టి పరమేష్టి.. మరికొందరు స్థల, మండల నియోగులు వచ్చారు స్వామీ..’’
మార్తాండుడు ఆశ్చర్యపోయాడు. ఈ స్థానిక సమయాల వాళ్లతో, నియోగులతో తానెప్పుడూ ఏ సహాయం కోరలేదే.. ఎందుకు వచ్చారబ్బా! అనుకుంటూ బయటకు వచ్చాడు.
దాదాపు పాతిక మంది. అధికార నియోగ ముఖ్యులు..సమయసెట్టి వినయంగా నమస్కరించి చెప్పాడు.
‘‘స్వామీ! మహామండలేశ్వరుల విధాన నిర్ణయం. గోదావరి నదికి రెండు వైపులా తాడిఎత్తు కట్టలు నిర్మించాలని ఆదేశం పంపించారు. మన స్థల ప్రాంతం పొడవునా ఈ కుడివైపు మన బాధ్యత. గట్టును ప్రతి ఏడాదీ మట్టితో నిర్మిస్తున్నాం. కాని ఈసారి మట్టి వాడవద్దని.. కొండరాళ్లతో నిర్మించ వలసినదిగా ఆదేశించారు మహారాజులవారు. ఎక్కడా రాళ్లు దొరకడం లేదు. అవతల వర్షాలు ఆగకుండా కురుస్తున్నాయి. రేపోమాపో వరద రావచ్చునని పెద్దలు అంచనా వేస్తున్నారు. కాబట్టి మీరు గుడికోసం తరలించి తెచ్చిన కొండరాళ్లను గట్టు నిర్మించడానికి తీసుకువెళతాం. అనుమతిం చండి..’’
విషయం అర్థ్ధమై కోపంతో కంపించి పోయాడు మార్తాండుడు.
లిప్తల కాలంలో తన కోపాన్ని అణచుకున్నాడు. అవతల మండలాధికారులున్నారు. వాళ్లకు కోపం తెప్పిస్తే ఏ న్యాయస్థానానికి నివేదిస్తారో.. ఏ శిక్ష వేయిస్తారో తెలియదు.
‘‘అవి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తెప్పించిన శిలలు, బండలు, రాళ్లు. స్థపతులు అనేక ప్రాంతాలు తిరిగి ఉలులతో కొండలను కొట్టి చూసుకుని దేవతల విగ్రహాల కోసం, వ•లవిరాట్టు కోసం ఎంపిక చేయగా లక్షలాది నాణేలు ఖర్చుచేసి వందల ఎడ్లబళ్లపై ఇక్కడికి చేర్పించిన శిలలు. అవి మీకు సాధారణ రాళ్లుగా కనిపిస్తున్నాయా సెట్టి.. వాటిని ఇవ్వను గాక ఇవ్వను.’’అని చెప్పాడు.
వచ్చిన వారంతా ముఖాముఖాలు చూసు కున్నారు. మహారాజుల ఆదేశాలను ధిక్కరిస్తే తక్షణ శిక్షగా పైస్థాయి అధికారులు.. అక్కడే గుంజకు కట్టి కాసేపు కొరడా ఝుళిపించి రాళ్లను తరలించు కుపోగలరు.
కానీ ఇక్కడ ఉన్నది రాజ్యంలో గుర్తింపు ఉన్న ప్రముఖ పండిత పూజారి. అందులోనూ నకులసెట్టి లాంటి ప్రముఖ వణిజునికి గురువు. మరోవైపు ఆయన రాళ్లను సేకరించింది దేవాలయ నిర్మాణం కోసం. అలాంటి వాడితో ఆచి తూచి మాట్లాడాలని వాళ్లకు తెలుసు.
మండలాధికారి అన్నాడు. ‘‘తమరు గుడి నిర్మాణం కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు మాకు తెలుసు స్వామీ. కాని అవతల వరద భయపెడు తోంది. వరద వస్తే ప్రజలు.. ముఖ్యంగా రాజ్యానికి అన్నంపెట్టే రైతులు చనిపోతారు. పంటలు నాశనం అవుతాయి..’’
‘‘ఈ పరిస్థితి మనం చేస్తున్న పాపాల ఫలితమే మహానుభావా! గోదారమ్మకు కోపం తెప్పిస్తే పరిస్థితి అలాగే ఉంటుంది. ఈ కలియుగంలో నిత్యవ• మనం ఎన్నెన్నో పాపాలు చూస్తున్నాం. అయినా మేము యజ్ఞయాగాల ద్వారా మన ప్రాంతాన్ని పరిరక్షిస్తున్నామని మహామండలేశ్వరులకు మా మాటగా నివేదించండి. రేపటి నుండే వరుణ యజ్ఞం ప్రారంభిస్తానని పెద్దలకు తెలియజేయండి. ఇక బయలుదేరండి..’’ లేచి లోపలికి వెళ్లిపోయాడు.
వచ్చిన అధికారులంతా నిలబడిపోయారు. ఏమి చేయడానికి వారికి తోచలేదు. మహామండలేశ్వరుల కార్యాలయానికి నివేదించడం తప్ప తక్షణం వాళ్లు చేయగలిగింది ఏమీ లేదు. అదే చేశారు.
వారికి తగిన జవాబు వచ్చింది.
మరునాటి నుండి ఆ గుడినిర్మాణ ప్రాంగణంలోనే వరుణ యజ్ఞం ప్రారంభిం చాడు మార్తాండ భట్టారకుడు.
దేవుడిని బూచిగా చూపి ఎవరినైనా అడ్డుకోవడం ప్రతి పూజారికి పెద్ద కవచం.. ఆనాడయినా.. ఈనాడయినా..
వర్షం కురుస్తూనే ఉంది. మబ్బులు పరుగులు పెడుతూనే ఉన్నాయి. మెరుపులు, ఉరుములు రెచ్చిపోతూనే ఉన్నాయి. గోదావరమ్మ పరుగుల వేగం రోజు రోజుకీ ఉధృతం అవుతూనే ఉంది.
తెలుగు రాజ్యాలలోని అన్ని ప్రధాన నదులు, ఉపనదులు, పెద్ద కాలువలు, అప్పటికే తవ్విన సముద్రాల్లాంటి చెరువులు. అన్నింటికి.. అన్ని రాజ్యాలలో యుద్ధ ప్రాతిపదికన ఇరువైపులా కొండరాళ్లతో కొండలంత ఎత్తున గట్లు, కట్టలు.. నిర్మిస్తున్నారు. కొన్ని చోట్ల నిర్మించేశారు. అన్ని కట్టలు, గట్టులపై అమ్మవార్ల విగ్రహాలు.. ఎవరికి నచ్చిన గ్రామదేవత.. మైసమ్మ, బాలమ్మ, కైసమ్మ, గంగానమ్మ, మారెమ్మ, మాంకాళమ్మ..
గంపలపల్లె స్థలలో గోదారమ్మ పారుతున్న ప్రాంతమంతా రెండువైపులా గట్ల నిర్మాణం.. వాటిపై అమ్మవార్ల, వరుణదేవుని విగ్రహాలు, కొన్ని చోట్ల చిన్న చిన్న గుళ్లు నిర్మిస్తున్నారు కూడా. కేవలం గంపలపల్లె గ్రామం వద్ద.. ఎడమవైపున గట్టు నిర్మాణం పూర్తికాగా గుడి నిర్మిస్తున్న కుడివైపు మాత్రమే నిర్మాణం జరగ డంలేదు.
గుడి నిర్మాణాన్ని కొనసాగిస్తూనే మార్తాండుడు పాలకుల నుండి వచ్చే ముప్పును ఊహించి ఎదురుదాడికి తగిన కార్యకలాపాలు చేశాడు. వీరశైవ బృందాలను, భక్తులైన అమాయక గ్రామీణులను పెద్ద ఎత్తున తరలించి గ్రామానికి ఆమడ దూరంలోనే రక్షణకోటలా నిలబెట్టాడు.
వారం రోజుల అనంతరం కొన్ని వందల ఎడ్లబళ్లు దేవాలయం వద్దకు తరలి వచ్చాయి,గట్టు నిర్మించడానికి కావలసిన రాళ్లను తరలించడానికి. మార్తాండుడు రెచ్చగొట్టి పొలిమేర వద్ద నిలబెట్టిన వీరశైవ బృందాలు ఆ ఎడ్లబళ్లను అడ్డుకున్నాయి. రాళ్ల తరలింపు కోసం వచ్చిన ఎడ్లబళ్లు అక్కడే ఆగిపోయాయి.
వరుణయజ్ఞం విఘ్నం లేకుండా జరుగుతోంది. కాని ఆ రాత్రి ఉన్నట్టుండి ఈదురుగాలులు పెరిగాయి. వర్షం తీవ్రరూపం దాల్చింది. అన్ని నదులు వరదలతో పోటెత్తాయి. తాడేత్తున రాతి గట్లు పూర్తయిన చోట ఏ నదీ దారి తప్పి గ్రామాలపై పడలేక పోయింది. అన్ని నదులు, వాటి పాయలు సరాసరి సాగిపోయి సముద్రంలోని పరుగులు పెడుతున్నాయి. కేవలం ఒక్కచోట మాత్రమే గోదారమ్మ గట్టు లేకపోవడంతో కట్టు తప్పింది.
అది గంపలపల్లె వద్ద!!
కుడివైపు..గుడి నిర్మాణం వైపు, వరుణ యజ్ఞశాల వైపు.. గోదారమ్మ ఉవ్వెత్తున ఉత్సాహంతో ఎగిరెగిరి దూకిదూకి తన సరదాలను తీర్చుకుంది. ఫలితం.. యజ్ఞశాలే కాదు స్థలలోని ఐదు గ్రామాలను ముంచెత్తింది. యజ్ఞశాల వద్ద అందరూ వరద ఉధృతికి చనిపోయారు. శవాలు అక్కడున్న బండరాళ్లకు తాకి నిలిచి పోయాయి. ఆ వరద నీటిలో తేలియాడు తోంది మార్తాండ భట్టారకుని శరీరం.. శవం!!
ప్రజలు తమ సమస్యలకు కేవలం దేవుళ్లను నమ్మడం తగ్గించి మహారాజులను నిలదీయడం, వారు బాధ్యతగా ప్రవర్తించి తెలుగు రాజ్యాలను ఏకరాజ్యంగా భావించి, నిపుణులతో చర్చించి.. తగిన నిర్మాణాలు చేపట్టడం మొదలయ్యింది.. దానికి ఆరంభకుడు కాకతీయ మన్మహామండలేశ్వరుడు గణపతిదేవుడు!!

* * *
సబ్బినాడు రాజ్యం..
ఛామనపల్లె గ్రామంవైపుగా రెండెడ్ల బండి పోతోంది. లోపలున్న ఇద్దరు ఆ బండి కుదుపులకు, ఎడ్ల మెడల్లోని గంటల శబ్దాలకు, రివ్వురివ్వున వీస్తున్న గాలుల జానపద పాటలకు, అటూఇటూ ఎటు తలతిప్పి చూసినా కనిపించే పంట పొలాల పచ్చ దనానికి.. రెప్పవేయకుండా చూస్తూ అనుభూతిస్తు న్నారు.
చూస్తుంటే వారిద్దరూ పట్టణవాసులని.. బలిష్టమైన వారి శరీరాలు వారిని మహాయోధులుగా.. వారు ధరించిన దుస్తులు వారిని సాధారణ పౌరులుగా చూపుతున్నా వారి చుట్టూ కనిపించనిదేదో శక్తి వారిని మహాపురుషులుగా ప్రకటిస్తోంది.
వారిద్దరి మాటలను బట్టి బావ బావమరదులని.. తెలుస్తోంది.
వారిద్దరూ సాధారణ పట్టణ పౌరులుగా మారువేషాల్లాంటి రూపాలలో కనిపిస్తున్నవారు. కాకతీయ మహామండలేశ్వరుడు గణపతిదేవుడు, ఆయన స్వయానా బావమరిది, మహాయోధుడు, గజసాహిణి, అపూర్వ నాట్యవేత్త జాయచోడుడు.. అని మాత్రం ఎవ్వరూ గుర్తించలేరు.
కారణం వారు ప్రయాణిస్తున్న మార్గం పూర్తిగా పట్టణ వాసనలకు దూరం.
అనుమకొండ నుండి పూర్తి రాజలాంఛ•నాలతో సబ్బునాడు మండలేశ్వరుని రాజప్రాసాదానికి వచ్చారు కానీ అక్కడి నుండి సాధారణ పౌరులుగా వెళ్లాలన్న చిలిపి ఆలోచన గణపతిదేవునికి కలిగింది. బావగారి కోరికను ఏనాడూ త్రోసి పుచ్చని పరమ విధేయ బావమరిది జాయచోడుడు. సరే..!అంటూ తనూ ఉత్సాహం చూపాడు.
కాకతీయ రాజ లాంఛనాలను, అంగరక్షకులను అక్కడే వదిలేసి సాధారణ దుస్తులు ధరించిన వారిరువురిని విభ్రమంగా చూస్తున్న సబ్బినాడు మండ లేశ్వరుని.. ‘ఎడ్లబండి కట్టించమని.. బండి పెరికవానికి కూడా తమ గురించి చెప్పవద్ద’ని ఆదేశించి ఆ ప్రకారమే ఎడ్ల బండెక్కి గ్రామీణ అందచందాల మధ్యగా తిలకిస్తూ పులకిస్తూ సాగిపోతున్నారు.

సశేషం

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE