భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


– ‌డాక్టర్‌ ‌చిత్తర్వు మధు

‌ప్రశాంత సముద్రం. చందగ్రహం. Mare Tranquillitattis. -8.5- డిగ్రీస్‌ N 31.4‌డిగ్రీస్‌ ‌E.
చంద్రుని మధ్య భాగంలో ఉన్న విశాలమైన మైదానం ఇది. సముద్రం కాదు. చంద్ర ఉపరితలమే. పూర్వం భూమి నుంచి వచ్చిన అపోలో మిషన్‌ అం‌తరిక్ష నౌకలు ఇక్కడే దిగి పరిశోధన చేసి వెళ్లి పోయేవి. ఇక్కడి నుంచి సుమారు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నది అమృతా కాలనీ. ఇది చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గరగా షాకిల్టన్‌ ‌క్రేటర్‌ ‌సమీపంలోవుంది. లాటిట్యూడ్‌ 89.67.S 129.78E. క్రేటర్‌ అం‌టే ఒక పెద్ద గొయ్యి అనుకోవచ్చు. దీని అంచు సూర్యకాంతితో ధగధగా మెరిసిపోతూ ఉంటుంది. క్రేటర్‌ ‌లోపల చీకటిగా ఉంటుంది. చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతంలో ఈ షాకిల్టన్‌ ‌క్రేటర్‌ ‌దగ్గర సంవత్సరం పొడుగునా సూర్యకాంతి పడుతూ ఉంటుంది కూడా. అందువల్ల ఇక్కడ సౌరశక్తితో విద్యుత్‌ ‌శక్తిని నిరంతరంగా చేసుకోవచ్చు. చంద్ర మధ్యభాగంలో అయితే 15 రోజులు పగలు 15 రోజులు రాత్రి. అక్కడ అలా కుదరదు. ఇదికాక దక్షిణ ప్రాంతంలో క్రేటర్ల అడుగున గల మంచును కరిగించి ఆక్సిజన్‌ ‌తయారు చేసుకోవచ్చు. కాలనీకి నీటి సరఫరా చేసుకోవచ్చు.ఈ కారణాల వల్లే ఇక్కడ భారతదేశపు అమృతా కాలనీ ఏర్పడింది. కాలనీలో కొన్ని నివాసాలు చంద్రుని నేలపైన కొన్ని నేల కింద నిర్మితమయ్యాయి. ‘‘సోలార్‌ ‌కోర్‌’’అని పిలిచే సూర్యశక్తి నుంచి విద్యుత్‌శక్తి తయారయ్యే సౌరశక్తి కేంద్రాన్ని, దానిలోని ప్యానల్స్‌ని మేజర్‌ ఆదిత్య పరిశీలిస్తున్నాడు.

‘‘మళ్లీ ఎనర్జీ లెవల్స్ ‌బాగా తగ్గాయి. కనీసం 25 శాతం శక్తిని ఎవరో తీసుకుంటున్నారు.’’ బిగ్గరగా అన్నాడు ఆదిత్య. సోలార్‌ ఆరే 7, (Solar Array7) నుంచి ఎవరో ఈ శక్తిని దొంగతనం చేస్తున్నారేమో!

‘‘ఎస్‌ ‌మాస్టర్‌! ఇది మొదటిసారి కాదు. నాలుగోసారి.ఇలా అయితే అమృతా కాలనీలో మనకి ఒక సంవత్సరంలో పూర్తిగా ఎనర్జీ తగ్గిపోతుంది, పనులు జరగవు’’ యాంత్రిక స్వరంతో అంది లూనా.

ఇది స్త్రీ ఆకారంలోని కృత్రిమ మేధ.అన్ని లెక్కలనూ పరిశీలిస్తూ అన్ని మానిటర్లు పరిశీలించి చూస్తూ ఉంటుంది.సలహాలు ఇస్తుంది. ప్రణాళికలు రచిస్తుంది. కాలనీ వాసులందరినీ గుర్తు పట్టగలదు. కంట్రోల్‌ ‌రూమ్‌ ‌షాకిల్టన్‌ ‌క్రేటర్‌కి దగ్గరగా సుమారు ఏభై కిలోమీటర్ల లోపు ఉంది.బరువుగా ఉన్న లోహపు తలుపుని పాస్‌ ‌వర్డ్ ఉన్న కంప్యూటర్‌ ‌కార్డుతో తెరిచి తీసుకుని లోపలికి వచ్చింది కెప్టెన్‌ ‌రోహిణి.

వస్తూనే ‘‘ఆదుర్దాగా ఉంది. టెక్నీషియన్‌ ‌మీరా కనబడటం లేదు. నలభై ఎనిమిది చంద్ర స్టాండర్డ్ ‌టైం గంటల నుంచి ఆమె జాడ లేదు. మన భారత్‌ ‌హీలియం మైనింగ్‌ ‌ప్లాంట్‌ ‌వైపు వెళ్లినట్లు మాత్రం లాగ్‌బుక్‌లో ఉంది. ఆమె ఎక్కడ ఉందో ఎలా కనిపెట్టాలో! ఏమైందో!’’ గబగబా మాట్లాడింది.

‘‘నేను మానవ శరీర ఉష్ణోగ్రత సంకేతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని క్రేటర్‌లలో వెదుకుతాను.’’ ల్యూనా అంది.

అన్ని జీవరాశులకు శరీరం నుంచి వేడి ఎర్రని బింబాలుగా థర్మల్‌ ‌సిగ్నల్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. వాటిని కనిపెట్టడానికీ, వాటి గురించి తెలుసుకోవడానికీ చంద్రుడి దట్టమైన క్రేటర్‌ ‌నీడల్లో థర్మల్‌ ‌సిగ్నల్‌ ‌కనిపెట్టడం చాలా అవసరం. దీనినే ‘బయోలూమినినెన్స్’ అం‌టారు. మేజర్‌ ఆదిత్య, కెప్టెన్‌ ‌రోహిణి ,కృత్రిమ మేధ ల్యూనా…మీరా జాడ కోసం, శరీర ఉష్ణోగ్రత తరంగాల జాడల కోసం మానిట లలో పరిశీలించసాగారు.

*  * *

2075వ సంవత్సరం. సాధారణ శకం.

చంద్రుడి మీద మానవ ఆవాసాలు ఏర్పడటమే కాదు,విపరీతంగా అభివృద్ధి కూడా చెందాయి.ఈ అభివృద్ధి కి కారణం వ్యాపార ప్రయోజనాలు కావచ్చు. కొన్ని నివాసాలు చంద్రుడి ప్రశాంత సముద్రం మధ్యనా, కొన్ని నివాసాలు చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గరా ఏర్పడ్డాయి. 2030- 35 ప్రాంతాల్లో అమెరికా ప్రభుత్వపు నాసా, ‘ఆర్టెమిస్‌’ అనే కార్యక్రమంలో చంద్రుడి మీద కాలనీలు ఏర్పరిచింది. ప్రైవేట్‌ ‌కంపెనీలైన స్పేస్‌ఎక్స్ ‌లాంటివి కూడా చంద్రుడి మీద నివాస కాలనీలు బాగా అభివృద్ధి చేశారు. దీనికి కారణం భూమి మీద ఖనిజాల నుంచి వచ్చిన ఇంధనాలు (fossil fuels) వాటివల్ల వచ్చే శక్తి తగ్గిపోతుండటం, వాతావరణ కాలుష్యంతో భూమి పరిస్థితులు దారుణంగా మారిపోవడం కూడా. చంద్రుడిపై విరివిగా కాలనీలు ఏర్పడడానికి మరో కారణం, సౌరశక్తి వినియోగం ఎలా చేసుకోవాలో అనే సాంకేతికతలో విప్లవాత్మకమైన అభివృద్ధి జరగటం ఒకటి అని చెప్పవచ్చు. షాకిల్టన్‌ ‌క్రేటర్‌ ‌గల దక్షిణ ధ్రువం దగ్గర సూర్యుడి కాంతి ఎప్పుడూ ఆగకుండా పడుతూ ఉంటుంది. చంద్రుడి మధ్య ప్రాంతాల్లో అయితే 15 రోజులు పగలు, 15రోజులు చీకటి పెరిగిన రాత్రి. అందువల్ల కొంత ఇబ్బంది ఉంది.ధ్రువ ప్రాంతంలో అయితే నిరంతరంగా ప్రసరించే సూర్య కిరణాల నుండి విద్యుచ్ఛక్తి తయారు చేసుకుని కాలనీలలో అవసరాలకు ఉపయోగించు కోవచ్చు. అందువల్లనే ఈ క్రేటర్‌ ‌దగ్గర కాలనీలు ఎక్కువగా ఏర్పరచుకున్నారు. సూర్యకాంతి నుంచి శక్తిని తయారు చేసుకొనే ఒక ‘బేసిక్‌ యూనిట్‌’ ‌ని ‘ఫొటోవోల్టాయిక్‌’ ‌సెల్‌ అం‌టారు. ఇలాంటి సెల్స్ ఎన్నో కలిస్తే ఒక సౌర ఫలకం, ‘‘సోలార్‌ ‌ప్యానెల్‌’’ ఏర్పడుతుంది. ఎన్నో ఇలాంటి సోలార్‌ ‌ప్యానెళ్లు కలిపి ‘‘సోలార్‌ ఆరే (Array)µ’ అంటే సౌర విద్యుత్‌ ఉత్పత్తి సముదాయాలు తయారు చేసే టెక్నాలజీ అభివృద్ధి అయింది. ఇలాంటి ఎన్నో సౌరశక్తి సముదాయాలు కలిసి ఒక ‘‘సోలార్‌ ‌కోర్‌’’అనే మహా సౌర విద్యుత్‌ ‌కేంద్రం తయారు చేసినవాడు భారత శాస్త్రజ్ఞుడు ఆదిత్య.

ఇదివరకు ఇతర దేశాలు ఇక్కడ కాలనీలు తయారుచేసుకున్నా అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, చైనా, రష్యాతో పాటు భారతదేశం కూడా ఇక్కడ స్వంతంగా అమృతాకాలనీ ఏర్పాటు చేసుకోడానికి ముఖ్య కారణం ఆదిత్య రూపొందించిన ఈ టెక్నాలజీనే. 2030-50 సంవత్సరాల మధ్యలో అమృతాకాలనీలో సోలార్‌ ‌కోర్‌ ఏర్పరిచాడు. దీని వల్ల చంద్రుడి మీద పడే సూర్యకిరణాల నుంచి సంవత్సరం పొడుగునా నిరంతరంగా విద్యుత్‌ ‌వస్తూనే ఉంటుంది. ప్రపంచ దేశాల మధ్య అంగీ కారం, పొందిన ‘లూనార్‌ ఎకార్డ్’ అనే ఒప్పందం కింద అన్ని దేశాలతో పాటు భారతదేశం కూడా అమృతాకాలనీని ఏర్పరచుకొంది. ఈ ఒప్పందం ప్రకారం చందగ్రహంమీద ఏ ప్రాంతంలో ఎవరు ముందు అడుగు పెడితే ఆ ప్రాంతం వారి అధీనంలోకి వస్తుంది. అమృతాకాలనీని ఆ ఒప్పందం కిందనే ఏర్పరచుకున్నారు.

ఈ కాలనీకి ఈ మధ్యనే కెప్టెన్‌ ‌రోహిణి కూడా వచ్చింది. జీవశాస్త్ర నిపుణురాలు. ఈమె చంద్రుడి మట్టిలో జీవ రాశులున్నాయేమోననే అంశంపై అధ్యయనం చేస్తోంది. ఇంతకీ చంద్రుని మీద ఈ కాలనీల వల్ల ఉపయోగాలేమిటి? ముఖ్యమైన ఉపయోగం…హీలియం-3 అనే మూలక వాయువుని చంద్రుని నేలలోని గనుల్లో నుంచి తవ్వి తీయటం. చంద్రుడి మట్టిని ‘రిగోలిథ్‌’ అం‌టారు. హీలియం-3 మూలకం నుంచి శుభ్రం చేసి దానిని ఘన పదార్థ స్థితిలో, వెండి తాపడం పూసిన ‘‘సీల్‌ ‌వేసిన స్టీల్‌ ‌కంటైనర్లు భూమికి రెండు నెలలకొకసారి అంతరిక్ష సామాన్ల నౌకలలో ఎగుమతి చేస్తారు. ఈ సరకుల నౌకలు ప్రశాంత సముద్రంలోని లాంచ్‌ ‌ప్యాడ్ల నుంచి బయలుదేరి రెండు రోజులలో భూమికి చేరుకుంటూ ఉంటాయి. హీలియం-3 ఎంతో ఖరీదైనది. ఇదీ, డ్యుటీరియం అనే మరో వ•లకం కలిస్తే ఫ్యూజన్‌ ‌టెక్నాలజీ వల్ల ఎంతో శక్తి వెలువడుతుంది. ఈ శక్తిని భూమిలో అనేక పరిశ్రమలకు ఫాసిల్‌ ‌ఫ్యూయల్‌ అం‌టే శిలజ ఇంథనాలైన పెట్రోలియం, సహజవాయువు, విద్యుత్‌ ‌శక్తి బదులు వాడుకోవచ్చు. ఇది ఎంతో ఖరీదైన మూలకం. చంద్రునిపైన కొన్నివేల టన్నుల రెగోలిత్‌ ఉం‌ది. ‘‘ఏ దేశం ముందు చంద్రుడి మీద కాలు పెడితే ఆ ప్రాంతం వారిది కాబట్టి వారు దాన్ని హీలియం-3 తవ్వకాలకి, ఇతరత్రా అంతరిక్ష పరిశోధనా ప్రయోజనాలకోసం కూడా ఉపయో గించుకోవచ్చు.’’ అనే చందగ్రహ అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం భారతదేశం తనకు చెందిన ఈ ప్రాంతంలో అమృతా కాలనీని నిర్మించుకుంది.

ఇంతకీ మేజర్‌ ఆదిత్య 2060 నుంచి సోలార్‌ ‌కోర్‌ ‌కేంద్రాన్ని పర్యవేక్షించే శాస్త్రజ్ఞుడిగా పని చేస్తున్నాడు. ఈ సౌరశక్తిని, గనులు తవ్వే యంత్రాలు, (అంటే lunar excavators), చంద్రుడి ఉపరితలం మీద ప్రయాణించే రోవర్‌ ‌వాహనాలు, సరుకుని అంతరిక్ష నౌకలలోకి చేర్చే పెద్ద పెద్ద వాహనాలు,  గతుకులు నిండిన చంద్ర ఉపరితలం మీద దొర్లుకుంటూ వెళ్లే పెద్ద పెద్ద ట్రక్కులూ, వాటిని నడిపే రోబోట్‌ ‌డ్రైవర్లను పని చేయించటానికి వాడుకుంటారు. పెద్ద క్రేన్లు స్పేస్‌షిప్‌లలో సరుకులు లోడ్‌ ‌చేయడానికి కూడా వాడుతారు. ఈ సౌరశక్తి నంతా ఉత్పత్తి చేసేది సోలార్‌ ‌కోర్‌. ఇదే షాకిల్టన్‌ ‌క్రేటర్‌ ‌దగ్గర ఉంది. షాకిల్టన్‌ ‌క్రేటర్‌ అని పిలిచే ఈ చంద్రుడి పెద్ద కందకం లాంటి గోతిలో ఎల్లప్పుడు సూర్యకాంతి పడుతూ ఉంటుంది. ధ్రువ ప్రాంతం గనుక ఇక్కడ మంచు గడ్డలు కూడా కనుగొన్నారు. ఈ ప్రాంతాల్లోని హిమాన్ని కరిగించి నీరు కూడా ఉత్పత్తి చేసి పైపుల ద్వారా సరఫరా చేస్తున్నారు. నీటి (H2o) నుంచి ఆక్సిజన్‌ ‌కూడా ఉత్పత్తి చేసి వాడుకోవచ్చు.

ఈ కాలనీ చంద్రుడి నేల అడుగున 3-డీ ప్రింటింగ్‌ ‌ద్వారా నిర్మించారు. ఇక్కడ అనుక్షణం ఉండే ఉల్కాపాతం, రాళ్ల వర్షం, రేడియో థార్మికకి రణాలూ, దుమ్ము తుపానులను తట్టుకోవడానికి చంద్రుడి నేల అడుగున కాలనీలు, నివాసాలు నిర్మించడమే మార్గం. చాలా తక్కువగా కొన్ని కాలనీలు మాత్రమే ఉపరితలంలో డోమ్స్ ‌కింద కూడా నిర్మించారు. ఈ డోమ్‌ ‌లోపల భూమిలో వలెనే ఆక్సిజన్‌ ‌సరఫరా భూ వాతావరణాన్ని పోలిన ఉదయం, సాయంత్రం, రాత్రి కాంతులను సూచించే కృత్రిమ కాంతి ఉంటాయి.

ఐనా అమృతాకాలనీలో జీవితం అంత తేలిక కాదు. చాలా ధైర్యం, సాహసం, క్రమశిక్షణతో పాటు మనోనిబ్బరం కావాలి. అమృతాకాలనీలో భూగర్భ కాలనీ లలో సుమారు వందమంది దాకా వివిధ రకాల శాస్త్రజ్ఞులు, అంతరిక్ష యాత్రికులు, ఇతర రక్షణ, పారిశుద్ధ్య పనులు చేసే వారు ఉన్నారు. ముఖ్య పరిశోధనా బృందానికి, చంద్రుని దక్షిణ ధ్రువం ప్రాంతంలో ఉన్న షాకిల్టన్‌ ‌క్రేటర్‌ ‌దగ్గర చంద్రుడి రెగోలిత్‌లో నిర్మించిన మోడ్యులర్‌ ‌గృహాల్లో నివాసం. ఒకవైపు పరిశోధనకు, మరోవైపు అనుకోకుండా వచ్చే ఉపద్రవాలకీ, కఠినమైన వాతావరణంలో బతకడానికి మధ్య జరిగే సంఘర్షణే ఇక్కడ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడూ వచ్చే ఉల్కాపాతం, రేడియేషన్‌ ‌ప్రభావం తగలకుండా గట్టి గోడలు నిర్మించారు. తలుపులకి ఎయిర్‌ ‌లాకులు ఉంటాయి. లోపల నిద్రించేవారు స్లీపింగ్‌ ‌బ్యాగులలో నిద్రపోవాలి. గాలీ, నీరూ 99% పరిశుభ్రంగా ధ్రువ ప్రాంతాల్లో మంచు నుంచి తయారై, పంపిణీ అవుతాయి. ‘హైడ్రోపోనిక్‌’ అం‌టే నీటి జల్లులతో పెంచే వ్యవసాయ క్షేత్రాల్లో నుంచి ఎల్‌ఈడీ లైట్ల వెలుగులో పండించిన ఆల్గే పుట్టగొడుగులు, ఆకుపచ్చని కూరలు ఆహారంగా వాడుకోవచ్చు. ఇదికాక భూమి నుంచి తీసుకొచ్చిన ప్రొటీన్‌ ‌బార్‌లు, ఇతర నిల్వ చేసిన ఆహార పదార్థాలను కూడా వాడుకుంటారు. వారి నిత్యజీవితం హీలియం-3 వ•లకాన్ని గనుల్లోంచి తవ్వటం చుట్టూ తిరుగుతుంది. ఉదయం 6:00 గంటలు చంద్రుడి టైమ్‌కి మేలుకొని అల్పాహారం, తదితర కార్యక్రమాలు ముగించి ‘ఎక్సోసూట్లు’ వేసుకొని కంట్రోల్‌ ‌రూములకి వెళ్తారు. టెక్నీషియన్స్ అక్కడ నుంచి మానిటర్లలో కృత్రిమ మేధతో పనిచేసే ఎక్స్‌కవేటర్‌ అం‌టే మట్టి తవ్వే యంత్రాలపే రోబోట్‌లతో పర్యవేక్షిస్తారు. కాలనీవాసులు ఎక్కువగా బయట ఉపరితలానికి వెళ్లరు. ఎందుకంటే ఇక్కడ ఉష్ణోగ్రత పగలు 127 డిగ్రీల నుంచి నీడలో -173 డిగ్రీల వరకు ఉంటుంది. అవసరమైతే ప్రత్యేకమైన సూట్‌ను ధరించి వెళ్లాలి. డ్రోనును బాగు చేయడానికి హీలియం శుద్ధి కర్మాగారాలకి పరిశీలనకు మరమ్మతులకి వెళ్లాలి. రోబోట్‌ ‌డ్రైవర్స్ ‌హీలియం క్యాన్లు నింపుకుని చంద్రుడి మీద ఉన్న అంతరిక్ష వేదిక అంటే ప్రశాంత సముద్రం మధ్య ప్రాంతానికి సుమారు 2000 కిలోమీటర్ల వరకు తీసుకుపోతూ ఉంటారు. అక్కడి నుంచి నెలకొకసారి కార్గో నౌకలు భూమికి లోడ్‌ ‌తీసుకుని వెళ్తుంటాయి.

సాంఘిక జీవితం బాగానే ఉంటుంది. కానీ తక్కువమందే ఉండటం వల్ల అందరికీ ఒకరి గురించి ఒకరికి తెలుస్తుంది. కాలనీ మధ్యభాగంలో గ్లాస్‌ ‌డోమ్‌ ‌కింద చంద్రుడి నేల మీది దృశ్యాలు కనిపిస్తుండగా, మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తూ ఉంటారు. ఒకరి అనుభవాలు ఒకరికి కాఫీ తాగుతూ చెప్పుకుంటూ ఉంటారు.

ఎప్పుడైనా వినోదానికి వీఆర్‌ ‌కళ్లజోడుతో భూమిలోని బీచ్‌ల లాగా, అడవులు, కొండలు లాగా సృష్టించిన దృశ్యాలు చూస్తూ తిరుగుతూ, లేదా ఏమైనా సినిమాలు చూస్తూ, మంచి సంగీతం వింటూ గడుపుతారు. భూమితో సమాచారం 2.5 సెకన్లు ఆలస్యంగా ప్రయాణం అవుతుంది. మానసిక ఆరోగ్యం క్షీణించకుండా కృత్రిమ మేధ కౌన్సెలింగ్‌ ‌చేస్తూ ఉంటుంది. ఇక్కడ తక్కువ గ్రావిటీ ఉండటం వల్ల ఎముకలు అరిగిపోకుండా తక్కువ భూమ్యాకర్షణ శక్తి ఉండే వ్యాయామశాలలు, అయస్కాంత పాదరక్షలు ఇతర వ్యాయామ సాధనాలు ఉంటాయి.

ఇది ఒక రకమైన విలక్షణమైన జీవితం. ఇక్కడ ఎక్కువ కాలం నివసించే వారికి మనోవ్యాధి రావడానికి చాలా అవకాశం ఉంది. ఎక్కడికీ పారిపోవడానికి వీలు లేదు. విశాలమైన చంద్రుడి ఎడారిలాంటి ఏకాంతం. కాలనీల బయట గోతులు, రాళ్లు,కొండలు నిండి ఉంటాయి. చంద్రుడిపై నీడలలో గతుకులలో సాగిపోయే ట్రక్కులను చూస్తూ ఆకాశంలో ఉదయిస్తున్న మాతృగ్రహం భూమి ఉదయాస్తమయాల్ని, నక్షత్రాల్ని, చూస్తూ రోజులు నెలలు గడిచిపోవాలి. మళ్లీ డ్యూటీ ముగించి భూమి నుంచి మరొక జట్టు వచ్చేదాకా అంకిత భావంతో కర్తవ్యం నిర్వహిస్తారు. దీనిని మానవజాతికీ భారతదేశపు శక్తి అవసరాలకీ చేయవలసిన కృషిగా భావిస్తుంటారు.

‘‘సోలార్‌ ‘ఆరే -7’ లో శక్తి క్షీణించి పోతోంది. ఎక్కడో పవర్‌ ‌లీక్‌ అయి పోతోంది. ఎంత చెక్‌ ‌చేసినా తప్పు ఎక్కడో దొరకటం లేదు. సాధారణ పర్యవేక్షణ కోసం ఛాయా క్రేటర్‌కి వెళ్లిన టెక్నిషియన్‌ ‌మీరా కనబడటం లేదు!’’ రోహిణి అంది ఆదిత్యతో.

‘‘బయోలుమినిసెన్స్ అం‌టే జీవరాశుల నుంచి వచ్చే ఒక వెలుగుని ఇన్ఫ్రారెడ్‌ ‌కిరణాల ద్వారా కనిపెట్టి వెదకవచ్చు’’ అంది ఏఐ లూనా.

మొత్తం 12, వున్నసోలార్‌ ఆరేలు (సౌరశక్తి సముదాయాలన్నీ) వెతికింది లూనా.

‘‘నాకేదో అనుమానంగా ఉన్నది.కొన్ని రోజుల క్రితం ‘‘సోలార్‌ ఆరే 5’’లో అక్కడక్కడా జీవరాశి ఉష్ణోగ్రత తరంగాలు కనిపించాయి మానిటర్లలో. అది ఏదో రెగోలిథ్‌ (‌చంద్రుని మట్టి)లో ఉన్న క్రిస్టల్స్ ఏమో అనుకున్నాము. మీరా లేనప్పుడు కూడా అక్కడ ఏవో జీవరాశులు తిరుగుతున్నాయి అనిపిస్తోంది’’’ అంది రోహిణి.

‘‘మరి మీరా?’’

మానిటర్స్ అన్నీ వెతికారు. ఛాయా క్రేటర్‌ ‌దగ్గర నిర్జీవంగా దాని ముఖద్వారం దగ్గర మీరా తల మీది హెల్మెట్‌ ‌పడిపోయి సూట్లోని శరీరం నేలమీద పడి ఉంది. చుట్టూ బయోలుమినిసెన్స్ ‌లేదు. కృత్రిమమేధ లూనా తెల్లని వెలుగులో మెరిసినా దాని కళ్లలో నీళ్లు విచారభావం కొద్దిగా కనిపించాయి, అనిపించింది. ఎంత యంత్రమైనా దానికి ఎమోషన్స్ ఉన్నాయేమో చెప్పడం కష్టం.

‘‘మీరాని ఎవరో చంపేసారు! ఏదో జీవరాశి సిగ్నల్స్ ‌లోపల సొరంగాలలో ఉన్నాయి. ఇది ఇక్కడే ఎవరైనా మన కాలనీ వాళ్లు చేసి ఉండవచ్చు. లేదా వేరే దేశపు చంద్రకాలనీల వారు ఎవరైనా చేసి ఉండవచ్చు. ఏదైనా శక్తిని దొంగిలించడం మాత్రమే వారి ధ్యేయంగా కనిపిస్తోంది.

రోహిణిలోని జీవశాస్త్ర (బయాలజిస్ట్) ‌జిజ్ఞాస ఒక్కసారి తిరిగి మొదలైంది. ఇలాంటి సిగ్నల్స్ ‌కొన్ని రోజులక్రితం ‘‘ఆరే ఫైవ్‌’’‌లో కనిపించినప్పుడు చంద్రుని రెగోలిత్లోని మెరిసే వస్తువులు ఏమో లోహాలేమో అనుకున్నాను కానీ కాలనీవాసులు అందరూ ఆ సమయానికి లోపలే ఉన్నారు. ఇది నిశ్చయంగా మనకి తెలియని వేరే కాలనీ వాళ్లు కానీ…’’ తటపటాయించింది.

‘‘లేదా, ఇతర గ్రహం నుంచి వచ్చిన దొంగ కానీ…!’’ గంభీరంగా అందుకున్నాడు ఆదిత్య.

‘‘ఇది చూడాల్సిందే. ఛాయా క్రేటర్‌కి వెళదాం!’’ రోహిణీ అప్రయత్నంగా నడుము మీద బిగించిన లేజర్‌ ‌గన్నును తడుముకుంది. ఛాయా క్రేటర్‌ ఆరే-7 దగ్గర ఉన్న ఒక లోతైన చీకటి నిండిన క్రేటర్‌. అక్కడి నుంచే బయోలుమినిసెన్స్ ‌సిగ్నల్స్ ‌వస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన ప్రాంతం. 2062లో ఒక ప్రమాదంలో ఇలానే సోలార్‌ ‌కోర్‌ అనే సౌరశక్తి కేంద్రంలో అగ్నిప్రమాదం జరగడం,కొందరు చనిపోవడం గుర్తు వచ్చింది ఆదిత్యకి. అతని గుండె ఆ జ్ఞాపకాలతో వేగంగా కొట్టుకుంది. పెదవులు వణికాయి.

‘‘మనం ముగ్గురం ఛాయా క్రేటర్‌కి వెళ్లాల్సిందే’’ రోహిణి అంది. ధైర్యంగా ఉన్నట్లు కనిపించిన ఆమె గొంతు వణికింది. కుజగ్రహంలో ఒకసారి తన అన్న కుటుంబం గుర్తు తెలియని గ్రహాంతరవాసుల దాడిలో చనిపోవడం ఆమె ఇంకా మర్చిపోలేదు.

‘‘నేనూ వస్తాను మాస్టర్‌!’’ అం‌ది ల్యూనా.

రోవర్‌ ‌దుమ్ము రేపుకుంటూ ఛాయా క్రేటర్‌ ‌వైపు దూసుకుని పోయింది.

* * *

ఎప్పుడూ చీకటిగా ఉండే ఛాయా క్రేటర్‌! ‌క్రేటర్‌ అం‌చులో కాంతి, లోపల సొరంగాల్లో చీకటి. అందు వలనే దీనికా పేరు వచ్చింది. (Shadow Crater అంటారు.) దీని ముఖద్వారం నుంచి లోపలికి మెలికలు తిరిగి ఉన్న సొరంగం లాంటి మార్గంలో గ్రావిటీ సూట్లు ఆక్సిజన్‌ ‌సిలిండర్‌ ‌కనెక్ట్ అయి ఉన్న మాస్కులు ధరించి నడుస్తున్నారు రోహిణి, ఆదిత్య. ఆ వెనుక కృత్రిమ మేధతో ల్యూనా ఏఐ రోబోట్‌.ఈ ‌క్రేటర్‌ ‌లోనే ఉపరితలంలో సోలార్‌ ‌ప్యానల్స్లు గ్రహించిన సౌరశక్తి ఈ క్రేటర్‌ ‌లోపలి వివిధ రకాల జనరేటర్లలో నిక్షిప్తమై ఉంటుంది.

‘‘హా…’’ అని అరిచింది రోహిణి. ఆమె కాలికి ఏదో తగిలింది. ముగ్గురూ టార్చ్‌లైట్లు వెలిగించి ఫోకస్‌ ‌చేసి చూశారు.

చలనం లేకుండా పడి ఉన్న మీరా!

‘‘అయ్యో మీరా ఎవరో తనని చంపేశారు.’’

దూరాన ఏదో అదృశ్య వ్యక్తి పరిగెత్తుకుని వెళ్లిపోతున్న పాదాల చప్పుడు. ఆదిత్య, రోహిణి బయోలుమినిసెన్స్ ‌పరిశోధించే పరికరాలతో క్రేటర్‌ ‌లోపలికి పరిగెత్తారు. ఏదో తెలియని జీవరాశి?

మరొక గ్రహం నుంచి వచ్చిన జీవో, జంతువో మీరాని చంపేసి పారిపోతూందా? ముగ్గురూ ఆ ఆకారాన్ని వెంబడించి కొద్దిసేపటికి తమ దగ్గర ఉన్న లేజర్‌ ‌గన్స్‌తో దానిపై ఎర్రటి బుల్లెట్ల వర్షం కురిపించారు. ఎర్రటి దారాల మధ్య చిక్కుకున్న తెల్లటి పెద్ద కీటకంలా ఉన్న ఆ జీవి బందీ అయిపోయి కీచుకీచుమని ఏలియన్‌ ‌భాషలో ధ్వనులు చేయసాగింది. ఆశ్చర్యంగా దాని ముఖం మీరా ముఖంలానే ఉంది. దాని చేతిలో ఒక పొడుగాటి ట్యూబ్‌ ‌లాంటి పరికరాన్ని ‘‘ఎనర్జీ ప్యానల్స్’’‌కి కనెక్ట్ ‌చేసి వంగి నిలబడి ఉంది.

‘‘నన్ను ఏమీ చేయొద్దు. నేను మీ మనిషిని చంప లేదు. ఆమె ముఖం తాత్కాలికంగా పెట్టుకున్నాను. అంతే! ఆమె బతికే ఉంది. మీరు ఎయిర్‌ అం‌బులెన్స్ ‌తెప్పించి ఆక్సిజన్‌ ఇస్తే బతుకుతుంది.’’ ఈసారి మానవులకి అర్థమయ్యే ఇంగ్లిష్‌లో మాట్లాడింది ఆ జీవి.

‘‘నువ్వు ఎవరు? ఏం చేస్తున్నావ్‌ ఇక్కడ?’’అని అరిచింది గట్టిగా రోహిణి. ‘‘మా సోలార్‌ ఎనర్జీని దొంగిలిస్తున్నావా? ఇందువల్లనే మాకు ఎనర్జీ రిజర్వులు తగ్గిపోతున్నాయి. ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు?’’

ఆమె అలా అడుగుతుండగానే ఏ.ఐ లూనా ‘‘కాలనీ కంట్రోల్‌ ‌సెంటర్‌’’‌కి సందేశం పంపింది. ‘‘త్వరగా ఎయిర్‌ అం‌బులెన్స్‌లో ఆక్సిజన్‌, ఎ‌డ్రినలిన్‌, ‌హైడ్రోకార్టిసోన్‌ ‌లాంటి ఎమర్జెన్సీ మందులతో డాక్టర్లని పంపండి! మీరా పరిస్థితి సీరియస్‌గా ఉంది.’’

లేజర్‌ ‌బంధాల మధ్య చిక్కిన ఆ జీవి హీన స్వరంతో అంది. ఆ గ్రహాంతర జీవి టెక్నాలజీకి ఏ భాష అయినా మాట్లాడే నేర్పు..కష్టమైన విషయం కాదు అని తెలుస్తూనే ఉంది.

‘‘నేను… నా పేరు ధ్రువ. సుదూర కెప్లర్‌ ‌సిస్టమ్‌లోని క్లైరా అనే గ్రహం మాది. మాకు శక్తినిచ్చే నక్షత్రం కెప్లర్‌ ‌బి ఆరిపోతోంది. మాకు ఆ నక్షత్ర శక్తి రావడం లేదు. మా గ్రహం అంతా క్రమక్రమంగా చనిపోతోంది. అందుకని ఈ సోలార్‌ ‌టెక్నాలజీని పరిశీలించి, మా గ్రహంలోని ప్రజలను,పట్టణాలనీ పునరుజ్జీవనం చెయ్యడానికి కుదురుతుందేమో అని మీ ఎనర్జీని తీసుకు వెళుతున్నాను. నాలా మరి కొందరు మా గ్రహవాసులు ఇతర గ్రహాల్లో ప్రత్యామ్నాయ శక్తికోసం, ఉన్న నివాసాలు వెతుకుతున్నారు.’’

ఆ మాటలు వింటే భారతీయ పురాణాల్లోని ధ్రువ నక్షత్రం గుర్తుకొచ్చింది రోహిణికి. ‘‘అబద్ధం! నువ్వు ఇక్కడే ఏదో ఇతర దేశపు చంద్రుడి మీది కాలనీ వాసివి!’’

ధ్రువ అనే గ్రహాంతర జీవి తన తెల్లని అస్థిపంజరంలోని ఎముకలాంటి చేతులతో అక్కడి శూన్యతలో వర్తులాకారంగా ఊపింది. ఒక హోలో గ్రాములో క్లైరా గ్రహపు దృశ్యాలు కనపడుతున్నాయి. శిథిలమైన భవనాలు, బలహీనంగా కదులుతున్న అస్థిపంజరాల లాంటి ప్రాణులు. నగరాల దీపాలు చాలా మసకగా వెలుగుతూ కనిపించాయి. చెట్లు మాడిపోయి నిశ్చలంగా ఉన్నాయి. గ్రహాంతర జంతువుల కళేబరాలు, బలహీనంగా నడుస్తున్న ప్రాణులూ, శిథిలమైన భవనాలు, ఎండిన పంట పొలాలు, నదులు ఆ గ్రహం చనిపోతున్న నిజాన్ని కళ్ల ముందు చూపించాయి. ‘‘ఇది మా గ్రహం.అది మా నక్షత్రం కెప్లర్‌ -321 ఆరిపోతుండటం వల్ల క్రమంగా శక్తి లేక అంధకారంలో మునిగి పోతోంది. మీ శక్తీ, మీ సాంకేతికతా మాకు కావాలి.’’

‘‘నువ్వు మా మీరాని గాయపరిచావు. చంపావు. నిన్ను బంధిస్తున్నాం!’’

‘‘లేదు. మీ కెమెరాలలో కనపడకుండా ఆమె ముఖాన్ని కొంచెం సేపు పెట్టుకున్నాను. ఆకారం ఇతర జీవుల నుంచి తీసుకుని ‘‘షేప్‌ ‌షిఫ్టింగ్‌’’ ‌టెక్నాలజీ మా గ్రహంలో సాధారణంగా ఉండే శక్తి. ఛాయా క్రేటర్‌లోకి మందులతో డాక్టర్‌, ‌నర్సు పరిగెత్తుకుంటూ వచ్చారు. మీరాకి ఇంజెక్షన్లు ఇచ్చి ఆక్సిజన్‌ ‌మాస్క్ ‌పెట్టారు. ధ్రువ అనే ఆ గ్రహాంతర జీవి ముఖం మళ్లీ వింతైన అస్థిపంజరంలోని కపాలంలా తయారైంది. దాని తలపై రెండు ఏంటెనాలు ఉన్నాయి. తెల్లటి ముఖంలో కనుబొమ్మలు లేని కళ్లు ఎర్రగా మెరుస్తున్నాయి.తెల్లటి అస్థిపంజరం లాంటి దాని శరీరం అంతా ఇప్పుడు దొంగిలించిన శక్తితో ఎర్రటి నీలపుచారల రక్తనాళాలతో మెరుస్తోంది. సెక్యూరిటీ టీమ్‌ ‌కూడా వచ్చారు.ఈ ‘‘ఏలియన్‌’’‌ని బంధించండి. ఎనర్జీ లీక్‌ ‌కారణం తెలిసింది. ఈ గ్రహాంతర జీవిపైన మన లాబ్‌లో పరిశోధిద్దామని రోహిణి అన్నది.

* * *

అమృతాకాలనీలో సోలార్‌ ‌మేట్రిక్స్ ‌లేబొరేటరీలో…

శాస్త్రజ్ఞుడు ఆదిత్య, జీవ విజ్ఞాన పరిశోధకురాలు రోహిణి ఎన్నో చంద్రుని గంటల సమయం బాటు గ్రహాంతర జీవి ‘‘ధ్రువ’’ మీద పరిశోధనలు జరిపారు. దాని శరీరం అంత మెరిసే క్రిస్టల్స్(‌స్ఫటికాలు) తో నిండి ఉంది. అవి గ్రహాంతర స్ఫటికాలు. భూమి లోనూ చంద్ర గ్రహంలోనూ మానవాళికి ఎక్కడా పరిచయం లేనివి. భూమి మానవులకి లేని అద్భుత శక్తులు ఆ స్ఫటికాలకి ఉన్నాయి. ‘‘భూమిలో సూపర్‌ ‌మాన్‌ ‌సినిమాలో తప్ప ఎక్కడా ఇంత శక్తి గల స్ఫటికాలు చూడలేదు’’ అన్నాడు ఆదిత్య.

‘‘మా గ్రహం చనిపోతోంది. మా గ్రహంలో చివరి నగరమే మిగిలి ఉంది. అందుకని కొత్త శక్తి కోసం వెతుక్కుంటూ వచ్చాను. నేను దొంగను కాను. శరణార్థి అనుకోండి. మీ టెక్నాలజీ మాకిస్తే మా క్రిస్టల్‌ ‌టెక్నాలజీ మీకు ఇస్తాము. ఇద్దరం కలిసి మన గ్రహాలని అభివృద్ధి చేసుకోవచ్చు’’ అని ప్రార్థిస్తోంది ధ్రువ. అది తన చేయి ఊపి క్లైరా గ్రహంలో మిగిలిన ఆరిపోతున్న నగరం, ఆరిపోతున్న బింబం లాంటి వారి ఎర్రరంగులోని కెప్లర్‌ 321 ‌నక్షత్ర దృశ్యాలు చూపించింది. అమృతా కాలనీ డైరెక్టర్‌ ‌డాక్టర్‌ ‌రావు ఈ విషయం సీరియస్‌గా తీసుకున్నాడు. ఆ ఏలియన్‌ని నిర్మూలించండి. దాని మాటలు నమ్మలేము. అది మనని మన కాలనీని మాయలు చేసి నాశనం చేస్తుంది.’’

‘‘ఈ జీవి అద్భుతమైన క్రిస్టల్‌ ‌టెక్నాలజీ కలిగి ఉంది. మనకి అర్థం కాని శక్తి దాని నుంచి ఉత్పత్తి అవుతోంది. ఆ శక్తిని మనం వాడుకోవచ్చు’’రోహిణి వినయంగా రావు గారికి చెప్పింది.

మన ‘‘సోలార్‌ ఎనర్జీ మాడ్యూల్‌’’ ‌నుంచి ఆ గ్రహానికి ఒక ‘‘క్వాంటం బీమ్‌’’ ఏర్పాటుచేసి సౌరశక్తిని పంపవచ్చు. క్వాంటం బీమ్‌ ఎం‌త దూరమైనా క్వాంటం టెక్నాలజీతో సౌరశక్తిని కాంతి వేగంతో ఫోటాన్లలో రూపంలో తీసుకుని వెళ్లగలదు. ఖరీదైన వ్యవహారమే.కానీ వాళ్లకు కనీసం ఒక నగరం అయినా మిగులుతుంది’’ ఆదిత్య అన్నాడు

అతను ఒక సోలార్‌ ‌పవర్‌ ‌మాడ్యూల్‌కి మోడల్‌ ‌తయారు చేసి క్వాంటం బీమ్‌ ‌ద్వారా సుదూర క్లైరా గ్రహానికి పంపే టెక్నాలజీని ప్రదర్శించాడు.డైరెక్టర్‌ ‌రావు గారు అయిష్టంగానే దీనికి ఒప్పుకున్నారు. కొన్ని గంటల తరువాత తర్వాత ధ్రువ ఏలియన్‌ ‌శరీరపు స్ఫటికాలు ఎక్కువ వెలుగుతో మెరిశాయి. అది సృష్టించిన దృశ్యంలోని దూరపు క్లైరా గ్రహపు ఆఖరి నగరంలో లెట్లు మళ్లీ కాంతివంతంగా వెలిగాయి. వాహనాలు నడవ సాగాయి.

ధ్రువ తన గ్రహపు క్రిస్టల్‌ ‌టెక్నాలజీ చంద్రుడికి పంపి, సరకులను తీసుకువెళ్లే వాహన నౌకలకి పనికొస్తుందని చెప్పింది. క్రిస్టల్‌ ‌టెక్నాలజీని వాడుకునే యంత్రాలనీ 10 వేల టన్నుల గ్రహాంతర క్రిస్టల్స్నీ పంపుతానని వాగ్దానం చేసింది. ఈ టెక్నాలజీ ఆదిత్యకి, రోహిణికే కాకుండా ఇతర భూమి శాస్త్రజ్ఞులకీ కూడా తెలియని కొత్త విషయం. చనిపోయిందనుకున్న టెక్నియన్‌ ‌మీరా క్రమంగా కోలుకుంది.

ఆమె కేవలం ‘‘సస్పెండెడ్‌ ‌యానిమేషన్లో’’ అంటే జీవసమాధిలో ఉంది. ఆమె ముఖం తిరిగి ఏర్పడింది. ముందు కోప్పడినా డైరెక్టర్‌ ‌రావు గారు ఈ సాంకేతిక మార్పిడికి అనుమతిం చారు. ఇది మనకు లాభమే అన్నారు.ఒక వాహన నౌకలో ధ్రువ అనే ఏలియన్‌ అమృతా కాలనీ నుంచి సైనికులతోనూ, శాస్త్రవేత్తలతోనూ,క్లైరాకి వెళ్లారు. క్వాంటమ్‌ ‌బీమ్‌ ‌టెక్నాలజీతో చంద్రుడి అమృతా కాలనీ నుంచి సుదూర క్లైరా గ్రహానికి సౌరశక్తిని పెద్ద ఎత్తున పంపించే విధానం ఆదిత్య ఇంకా అభివృద్ధి చేయసాగాడు. ఇలా రెండు సుదూర నాగరికతలు ఒకటి భూమి ఉపగ్రహం చంద్రుడి మీది అమృత కాలనీ, మరొకటి కెప్లర్‌ ‌సిస్టమ్‌లోని క్లైరా గ్రహంలోని ఆఖరి నగరం ఐరావతి. ఈ రెండింటి సహకారంతో గ్రహాంతర సహకారానికీ అభివృద్ధికీ మరొక నూతన అధ్యాయం మొదలైంది.

చంద్రుడిపై క్రేటర్లు, రాళ్లు, గతుకులదారులూ 15 రోజుల సూర్యకాంతిలో పొడుగవుతున్న నీడలూ, మళ్లీ జీవరాశికి అవి ఎక్కడున్నా ఏ గ్రహంలో వున్నా సరే,కొత్త ఆశాకిరణాలు అయ్యాయి.

About Author

By editor