‘‘‌బళ్లు ఓడలు అవుతాయోలేదో తెలియదు కాని ఓడలు బళ్లు అవుతాయి మహారాజా. అందుకు నా జీవితమే ఉదాహరణ. నేను ఈ స్థితికి రావడానికి కారణం కొందరు వణిజులు. ముఖ్యంగా అప్పరుసు శెట్ట్టి.’’

‘‘అంటే.. అవును అప్పుడెప్పుడో నలభై ఏళ్లనాడు డిండిమ..??’’ అన్నాడు గణపతిదేవుడు.

‘‘అవును. ఆనాడు డిండిమ ఇతని కోష్టాగారాన్ని పగులగొట్టడం మీకు గుర్తుందన్నమాట. అది వాడికి కూడా గుర్తుంది. కాలం ఖర్మం కలసిరాని రోజున దేవుడు కూడా మనల్ని ఏమీ చేయలేడు మహారాజా! ఎప్పుడో ఖర్మ దొంగచూపు చూసిననాడు మనం కొంచం వంగితే చాలు.. అన్నిశక్తులు మనపై పిడిగుద్దులు కురిపించి అతఃపాతాళానికి తొక్కేస్తాయి. వాడు ఆ అప్పరసు అప్పటి నుంచి.. నలభై ఏళ్లుగా నన్ను వెంటాడుతూనే ఉన్నాడు. సమయం దొరికింది. వేటు వేశాడు.. సమస్త ఆస్తులు పోయెలా చేసి.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా చేశాడు. నావల్ల బాగు పడిన ఓ పెరికమిత్రుడు జాలిపడి ఇచ్చిన ఎడ్లబండిలో ఉప్పు అమ్ముకునే స్థాయికి తెచ్చాడు..’’

గణపతిదేవునితోపాటు రుద్రమదేవి కూడా అతి జాగ్రత్తగా వింటోంది. ఇది కేవలం అంకాలశెట్టి అనే కాకతీయ వణిజుని సమస్యలా లేదు. మొత్తం రాజ్య వాణిజ్య వ్యవస్థ సమస్యలా కనిపిస్తోంది.. అనుకుందామే.

‘‘ఇటీవల మన నౌకా వ్యాపారం దారుణంగా క్షీణించింది.. తెలుసుకదా..’’ అన్నాడు అంకాల మరేదో పెద్ద సంగతి చెప్పబోతున్నట్లుగా.

తండ్రీ కూతురు ముఖాముఖాలు చూసుకున్నారు. నౌకావాణిజ్య పన్నుల ఆదాయం బాగా తగ్గిందని యువరాజు మురారిదేవుడు కూడా అనేకసార్లు గోల పెడుతున్నాడు. ఇటీవల చాలామంది పరదేశీ వణిజులు కూడా వచ్చి ఏవేవో సమస్యలు చెబుతు న్నారు. వాళ్ల ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. వాణిజ్య శ్రేణిసంస్థలు కూడా గతంలోలా బలిష్టంగా లేవు. ప్రాంతీయ భావాలు పెచ్చు మీరాయి.

‘‘వణిజులు తమ వ్యక్తిగత కక్షల కోసం అవసర మైన అన్ని దుర్మార్గాలు, సన్మార్గాలు చేస్తున్నారు. అందులో పక్కవాని వాణిజ్యాన్ని నాశనం చేయడం చాలా నీచం. అందుకు నా బతుకే ఉదాహరణ.’’

వాణిజ్య వైరములు ఎంత దారుణంగా ఉంటాయో వివరిస్తున్నాడు అంకాల.

* **

సాగర తీరం.. మోటుపల్లె రేవు..

నింగి నేలను ఏకంచేసిన మహాసముద్రం ఫ•ర్ణిళ్లుతోంది. తరంగాలు బరువుగా నెమ్మదిగా పైకి లేచి ఆగి కిందికి జారుతున్నాయి కొన్ని. ఘళ్లున అరచి దబ్బున పడుతున్నాయి కొన్ని. సముద్రంలో దూరంగా ఒకటో రెండో మహానౌకలు.. వాటికి దగ్గరగా వందలాది చిన్నచిన్న పడవలు.. వాటిల్లో కదలాడుతూ నల్లచీమల్లా మనుష్యులు..

రేవు అంతా సందడి.. కిటకిటలాడుతోంది. జనాల అరుపులు.. కేకలు.. నవ్వులు.. తిట్లు.. మహామహా ధనవంతుల నుండి సాధారణ బానిసల వరకు.. సముద్రపు కార్యకలాపాలలో, వృత్తి వ్యాపారాలతో జీవనం గడుపుతున్నవారెందరో అక్కడున్నారు. అదొక భౌగోళం..

ఎన్నో దేశాల మహావణిజులు, ఎన్నో రాజ్యాల అవదేసీలు, పరదేసీలు, స్థానిక నౌకా నిర్మాతలు.. వారి వారి ఉద్యోగులు, కూలీలు, సేవకులతో ఆ రేవు అంతా హడావిడిగా ఉంది. మోటుపల్లె రేవుకు రాత్రి పగలు లేవు. తెల్లవార్లూ సరుకులు ఎత్తడం, దించడం నిర్విరామంగా జరుగుతూనే ఉంటాయి.

ఆ రేవు దాదాపు నాలుగు యోజనాల పొడవునా తీరం వెంబడి ఉంటుంది లోపలికి పది యోజనాల లోని పాతిక గ్రామాల వరకు విస్తరించి ఉంటుంది. కాస్త అటూ ఇటుగా నౌకా నిర్మాణం, నౌకల మరమ్మతుల కేంద్రాలు ఉంటాయి. ఇక సరుకుల కోష్టాగారలైతే నదీ తీరం వెంబడి, కాలువల వెంబడి.. పాతికపైగా గ్రామాలలో ఒకటి రెండు పట్టణాలలో, పది పదిహేను కరగ్రహారాలలో విస్తరించి ఉన్నాయి. ఈ కోష్టాగారాలను ఎల్లప్పుడూ సరుకులతో నింపుతూనే ఉంటారు. నౌక వచ్చినప్పుడు వీటిల్లోని సరుకులు ఎత్తుతూ.. తెచ్చిన సరుకులు దించుతూ శ్రామికులు చమటలు కక్కుకుంటూ పని చేస్తూనే ఉంటారు.

ఈ రేవు తీరం వెంబడి దూరంగా రేవు కార్యకలాపాలకు ఆవలగా పోయి పోయి సుదూరంగా ఇసుకపర్రలతో దట్టమైన సర్వీ తోటలున్న నిర్జన ప్రదేశంలో కాస్త ఎత్తుగా ఉన్న బండపై కూర్చుని దూరంగా సముద్రం కేసి చూస్తున్నాడు గాలప్ప.

నలభై ఏళ్ల గాలప్ప బాగా నాచుపట్టిన సముద్రపు సొర చేపలా బలిష్టంగా పొడవుగా ఉంటాడు. రేవు దగ్గరలో. నున్న అనేక జాలరి గ్రామాలలో ఒకదానిలో పుట్టాడు. పెరిగాడు. అక్కడే.. సముద్రమే ఆలంబనగా జీవిస్తున్నాడు. కండలు తిరిగిన జబ్బలు, సముద్ర తీరంలా విశాలంగా విస్తరించిన చాతితో ఒడ్డుకు కొట్టుకొచ్చిన మహా తిమింగలంలా కనిపిస్తాడు.

గాలం లేకుండా కేవలం నీట్లోకి తొంగి చూస్తూ చటుక్కున చేయి గుచ్చి పెద్ద చేపను పట్టి తీయగల కొడుకు ప్రజ్ఞ చూసిన తండ్రి మురిపెంగా గాలప్ప అని పేరు పెట్టుకున్నాడు. సముద్రం తప్ప మరేమీ తెలియని గాలప్ప ఆ ఒడ్డునే తింటాడు. అక్కడే పడుకుంటాడు. అక్కడే పెళ్లి చేసుకున్నాడు. అక్కడే పిల్లల్నికన్నాడు. అక్కడే ఇల్లు లాంటిది కట్టుకున్నాడు.

సముద్ర రేవుల్లో రకరకాల వృత్తులు చేసి అనుభవం గడించిన గాలప్ప ప్రస్తుతం మహానౌకల్లో దోపిడీదారుగా.. సరుకులు దించిన పడవలను దోచుకునే సముద్రదొంగ వృత్తిని పవిత్రంగా నిర్వహిస్తున్నాడు.

అందులో భాగంగానే ఇప్పుడక్కడ కూర్చుని తదేకంగా దూరంగా రెప్ప వేయకుండా చూస్తున్నాడు.

రేవు హడావిడి వినిపించడం లేదు. ఉదయపు ఎండ చుర్రుమంటోంది. ఉండి ఉండి వీస్తున్న సముద్రపు గాలికి ఇసుక సర్రున లేచి గింగరాలు తిరిగి పడుతోంది. అప్పుడు కళ్లు వ•సుకోకపోతే ఇసుక కళ్లనిండా చేరిపోతుంది. ఇక్కడున్న ఇసుక ప్రతి రేణువూ క్షుణ్ణంగా తెలిసిన గాలప్ప కన్నులు చెప్పకుండానే సహజంగా వ•సుకుంటూ తెరచుకుంటూ దూరంగా చూస్తూనే ఉన్నాయి.

నాలుగు నెలల, పది రోజుల, పది గంటల నిరీక్షణ ఫలించింది.

ముందుగా నీటిపై సుదూరంలో చిన్న పిత్తపరికెలా కనిపించింది. లిప్తల కాలంలో అది కాస్త ఎగసిపడిన సొరచేప పిల్లలా అనిపించింది. ఆ తర్వాత కర్రలతో చేసిన త్రికోణంలా ఊగుతూ కనిపించింది.

అది నౌక.. పరదేశీ నౌక! కపోతం అంటారు అలాంటి పెద్ద నౌకలను. అది మహాకపోతం!!

మరి కొన్ని గంటలకు నీటి నుండి లేచిన మహామత్స్యంలా.. గండ భేరుండంలా.. కదలాడుతూ కనిపిస్తోంది.

రెక్కలు చాచిన గరుత్మంతుడిపై కూర్చున్న విష్ణువును చూస్తున్నట్లు తలెత్తి ఆ మహానౌకను అర్ధ నిమీలిత నేత్రుడై గాలప్ప రెప్పార్పకుండా చూడసాగాడు. పరదేశీ నౌకలంటే దేవుడంత మోజు గాలప్పకు. ఒక్క పరదేశీ నౌక చాలు పదేళ్లు సరిపడా సంపాదించుకోవడానికి..

సాధారణంగా పెద్ద విదేశీ నౌకలు రేవులకు చేరవు. సముద్రంలోనే చాలా దూరంలోనే ఆగిపోతాయి. అయితే వాటిని ఆపడానికి నౌక సరంగులు నానా యాతన పడాలి. ప్రాచీన కాలపు నౌకలు గాలివాటుకు ప్రయాణిస్తాయి. సింధు (భారత) దేశానికి సంబంధించిన తీరపు రేవులు తూర్పు పడమరలుగా చాలా ఉన్నాయి. అందులో దక్షిణావర్తంలోనే ఎక్కువ ఉన్నాయి. ప్రాచీన కాలంలో నౌకలు గాలివాటానికి వచ్చి వచ్చి ప్రతి తీరం దగ్గర రేవులు ఏర్పడ్డాయి.

ఏ మహారాజు దేవాలయాలు, కోటలు నిర్మించి నట్లు ఏ నౌకా రేవూ నిర్మించ లేదు. రేవు అద్భుతంగా నిర్మించినా ఇప్పటికీ ఏ నౌక కూడా కచ్చితంగా తీరం వద్ద ఆగడం జరగదు.

అదే సముద్రపు దొంగలకు వరంలా మారింది. అక్కడో కొన్ని క్రోసుల యోజనాల దూరంలోనే సముద్రంలో కదలాడే నౌకలను గాలప్పలాంటివాళ్లు గుర్తించగలరు. అక్కడి నుండి దానిని అనుసరించ గలరు. అది ఎక్కడ ఆగినా తన బృందంతో వెళ్లి దోచుకోగలరు. నౌకా ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా చంపేయగలరు.

ఒకప్పుడు నౌకల నుండి పడవల్లోకి సరుకులను మార్చే సమయంలో కిందపడిన వస్తువులను నౌక యజమానికి చెప్పకుండా వదిలేసి ఆనక సముద్రపు లోతుల్లో వాటిని వెదికి పట్టుకుని బయటకు తెచ్చి అమ్ముకునేవారు. అలా అలా నైపుణ్యం పెరిగినకొద్దీ నౌకను ఆసాంతం ముంచేసి సరుకులన్నీ ఎత్తుకు పోగల గుండెలు తీసిన బంటులుగా మారారు.

ఒకప్పుడు మోటుపల్లి రేవు దాపుల్లో ఒకటో రెండో ఇలాంటి బృందాలు ఉండేవి. ఇప్పుడు పాతిక బృందాలున్నాయని చెప్పుకుంటారు. అలాంటి బృందాల నాయకుల్లో గాలప్ప అరివీరభయంకరుడు. అంటే శత్రు బృందాలు కూడా గాలప్ప దృష్టి పడిన నౌక దగ్గరకు రావడానికి వెనుకంజ వేస్తాయి.

ఆ నౌకను చూసి గుర్తించిన గాలప్ప వెనుదిరిగి నోటితో ఈల వేశాడు. అది విన్న వాళ్లేవరో తిరిగి ఈల వేశారు.

అలా లిప్తల కాలంలో ఈలలు అనేకం వినపడు తున్నాయి. అప్పటికే తన మనుష్యులు కొందరు తన వైపు పరుగున రావడం చూసిన గాలప్ప ఒక్కసారిగా చిరుతపులిలా పరుగు లంకించుకున్నాడు. సముద్రపు ఇసుకలో నడకే కష్టం. కానీ గాలప్ప అతని బృందం నీటిలో సుదూరంగా కనిపిస్తున్న నౌకను చూస్తూ అనాయాసంగా తూనీగల్లా చిరుతపులుల్లా దూసుకు పోతున్నారు. గాలప్ప పోతున్నకొద్దీ.. అతని బృంద సభ్యులు అతని వెనకే పరుగు పరుగున వచ్చేస్తున్నారు. ఎవరో ఒకరు ఈల వేయడం.. మరికొందరు వచ్చి చేరడం.. అలా బృందం పెరిగిపోతూ అందరూ నౌక కదలికలను బట్టి పరుగులు పెడుతున్నారు.

మరి కాసేపటికి కింద నీటిలో కొన్ని పడవలు కూడా గాలప్పతో పాటు నీటిలో వేగంగా వస్తున్నాయి. తీరంపైన గాలప్ప బృందం పరుగులు.. నీటి అంచులో పడవల పరుగులు.. దూరంగా నౌక కదలికలు..

అంతా వేగంగా ఇసుక, గుట్టలు, గోతులు, చెట్లు, చేమలు, మహావృక్షాలు, దట్టంగా పెరిగిన పిచ్చిజెముడు మొక్కలు, కాకులు దూరని మడ అడవులు, అనేకానేక విషప్పురుగులు.. అన్నింటిని సునాయాసంగా ఒడుప్పుగా దాటుకుంటూ తప్పు కుంటూ నౌక వేగంతో సరిసమానంగా పరుగులు పెడుతున్నారు పడవలు, మనుష్యులు.

ఉన్నట్టుండి నౌక గమనం నెమ్మదించడం గుర్తించాడు గాలప్ప.

అప్పటికి చీకటి ఆవరించింది. చీకటి •.•లప్ప బృందానికి మంచి సహాయ కురాలు. చీకట్లో ఏ దుర్మార్గం, దౌర్జన్యం, కిరాతకం కూడా నవ్వుతూ చేయవచ్చన్నది అతని అనుభవం నేర్పిన సిద్దాంతం.

మరి కొద్ది సమయానికి దాదాపు వందమంది అనుచరులు గాలప్పకు కనిపించగా అందరిని చూసుకుని సంతోషించాడు. అంతా నీటిలోకి వెళ్లి పడవలు ఎక్కారు. పైన చంద్రుని మసక వెలుగే ఆ చీకటిలో వెయ్యి దివిటీల వెలుగులా భాసిస్తోంది.

పడవలు మౌనంగా కదిలాయి. వాటిలోని పరికరాల గురించి నడిపేవారిని అడిగి తెలుసుకుని.. చెప్పినవన్నీ సిద్ధ్దం చేసినందుకు ఆమోదంగా తల ఊపాడు. అందరికి కేవలం నడుముకు వరకు పలుచని పంచె.. కేవలం మర్మాంగాలు దాచుకోవ డానికే ఆ పంచే ముక్క. అదనపు బరువులు లేని మొప్పలున్న సొరచేపల్లా ఉన్నారంతా. అందరికి నడుముకు తోలు పటక ఉంది. అందులో చిన్నచిన్న ఇనుప వస్తువులున్నాయి. వాటిని సహాయ పరికరాలుగా వాడతారు. అవసరం అయితే ఆయుధాలుగా వాడతారు. గలప్ప పడవలన్నీ మెత్తగా కెరటాలపై తేలుతూ జారుతూ మహానౌకను చుట్టిముట్టి కాస్త ఆవలగా నిలిచాయి. అందరూ గాలప్ప సౌంజ్ఞల కోసం అతనినే చూస్తున్నారు. గాలప్ప ఉన్న పడవ మాత్రం కదిలి మొత్తం నౌక చుట్టూ తిరుగుతుండగా గాలప్ప అంత దూరం నుండే నౌకలో ఉన్నవారి కదలికలు గుర్తిస్తున్నాడు. లోపల అందరూ భోజనాలు చేసుండగా.. చేసినవారు నిద్రించడానికి ఉపక్రమించడం.. గాలప్ప కళ్లముందు తోలు బొమ్మలాట ఆడుతుంటే చూస్తు న్నట్లు ఊహించగలడు.

కాసేపు ఆగుదాం అన్నట్లు చేయెత్తి అందరికి ఆదేశ సౌంజ్ఞ చేశాడు.

అక్కడే మరో గంట కాలం.. అవకాశం కోసం ఎంతసేపైనా ఓపిగ్గా ఎదురు చూసే చిరుతపులుల్లా అలా నౌకను, గాలప్పను చూస్తూ ఉన్నారంతా. గంట అనంతరం గాలప్ప చేయి ఊపగా పడవలు కదిలి నౌకను దగ్గరగా చుట్టు ముట్టాయి.ప్రతి పడవలో ఒకడు నాయకుల్లా పడవలో ఉన్న పెద్ద పెద్ద మోకు తాళ్లను అందుకున్నాడు. తాళ్లతో పాటు ఉన్న ఉడుములను రెండు చేతులతో పట్టుకుని వాటి వీపు నిమిరి.. వాటి నోటికి పడవలో ఉన్న తోలుతిత్తులను వదులు చేసి.. అందున్న తేనెను ఉడుములకు తాగించి.. లిప్తకాలంలో ఆ మోకులను ఇతరులు చివర్లు పట్టుకోగా.. వొడుపుగా లాఘవంగా నౌక మీదికి విసిరి వేశారు. ఒక్కొక్కరుగా అందరూ అన్ని పడవలనుండి ఉడుములు, మోకులు పైకి ఎగరడం గాలప్ప చూశాడు. దాదాపు పాతిక పడవల నుండి మోకులు ఎగరగా ఒకటి రెండు విఫలమై క్రిందికి పడిపోయాయి. వాటిని మళ్లీ విసరగ ఈసారి విజయవంతంగా నౌక అంచులను పట్టుకున్నాయి.

అంతే.. అందరూ వాయువేగంతో ఆ మోకులు పట్టుకుని మోకు వెంట నల్లచీమ పాకినంత వేగంగా పాకుతూ నౌక అంచుకు చేరిపోయి అక్కడ ఆగి గాలప్ప వైపు చూడసాగారు. అతడు కూడా అక్కడికి చేరి ఆగి లోపల నుండి వినవస్తున్న శబ్దాలు ఏమైనా ఉన్నాయోమో మరోసారి విని ఏమీ వినరావడం లేదని నిర్దారించుకున్నాక చివ్వున ఊగి పైకి ఎగిరి నౌకలోకి దూకాడు. శబ్దం రాకుండా ఉరకడంలో అందరూ నిష్ణాతులే. ఒకరొకరుగా అందరూ నౌకలోకి చేరిపోయారు. చిరుతలా అడుగులు వేస్తూ లోపల అంతా చుట్టి చూశారు. రెండు వ•డు చోట్ల ఉన్న తలుపులు సరిగా వ•సి లేవు. ఆ నడి సంద్రంలో ఎవరు వస్తారులే అనే ఉదాసీనత..

నౌక తలుపులు తోసి లోపలికి తొంగి చూసి సంతోషంతో పొంగిపోయాడు గాలప్ప.

పైన విశాల ఆకాశానికి, క్రింద అనంత సాగరానికి నమస్కరించాడు. ఊహాతీంగా అది వ•డు అంతర్వుల మహానౌక. అంటే విలువైన మణిమాణిక్యాలు, రత్నరాసులు, బంగారు నాణేలు.. పైన అంతర్వులో మనుష్యులతో పాటు ఉంటాయి. రెండవ అంతర్వులో మత్తగజాలు, పారశీక గుర్రాలు ఉంటాయి. క్రింద వ•డవ అంతర్వులో పడవ తెడ్డు వేసే కూలీలు.. వ•డు అంచెల్లో పనిచేస్తూ దాదాపు వందమంది ఉంటారు. బృందం ముంగాళ్లపై పిల్లుల్లా కదులుతూ మొదటి అంతర్వులో అంతా పరిశీలిస్తున్నారు.

అంతా తాగి తిని మత్తుగా నిద్రపోవడం గాలప్ప బృందానికి ముచ్చట గొలి పింది.

నిజానికి నౌక యజమాని వేరు. నౌకలో ఉన్న సరుకు యజమాని వేరు. వీరిద్దరికీ నౌక వచ్చినట్లు తెలియదు.

ఉదయాన్నే నౌక సరంగు కొందరు సహాయకు లతో కలిసి అట్టడుగు అంతర్వులో ఉన్న పడవను బయటకు తీసి దానిపై ఒడ్డుకు వెళ్లి నౌక యజమా నికి, సరుకు హక్కుదారు అయిన అవదేసీ వణిజుని కలిసినప్పుడే వాళ్లకు నౌక వచ్చిందని తెలుస్తుంది.

గాలప్ప లిప్తల కాలంలో నౌక పరిస్థితిని ఆకళింపు చేసుకుని అందరికి సౌంజ్ఞ చేశాడు. అందరూ తమ నడుము కున్న తోలుపటకా నుండి పిడికిట్లో ఇమిడి పోయే చురక తీసి పట్టుకుని నిద్రిస్తున్నవారిపై కురికి ఓ చేత్తో నోరు వ•స్తూ మరో చేత్తో మెడవద్ద చురకను అతివేగంగా దింపసాగారు. నిద్రలోనున్న వారు కళ్లు తెరచేసరికే వారి ప్రాణాలు గిలగిల కొట్టుకోవడం.. కళ్లు మళ్లీ పూర్తిగా వ•సుకుపోవడం జరుగుతోంది.

దాదాపు అరవైమంది అవదేసీ ఉద్యోగులు, నౌక ఉద్యోగులు.. వేగంగా ప్రాణాలు కోల్పోసాగారు.

అప్పుడు జరిగింది గాలప్ప ఊహించని సంగతి..

ఓ బలిష్టమైన పారశీక కుక్క.. భౌభౌమని అరుస్తూ ఇంతెత్తున ఎగిరి గాలప్ప మనుషుల్లో ఒకరి పైకి దూకింది. క్షణాల్లో వాడి పీకను కొరికేసింది. వాడు గిలగిల కొట్టుకుంటూ మంచాలపై నిద్రిస్తున్న వారిపై పడ్డాడు. వాళ్లు భయంతో పిచ్చి కేకలు వేశారు.

కుక్క యజమాని బహుశా నౌక సరంగు కావచ్చు. వేగంగా కదిలి మంచం పక్కనున్న చేతి గొడ్డలి తీసి ఒకడిపై వేటు వేశాడు. ఈ హఠాత్పరిణా మాలు గాలప్ప బృందానికి తెలుసు. గాలప్ప, మరి ఇద్దరు అంతే వేగంగా స్పందించి ఆ సరంగును వెనగ్గా నాలుగైదు కత్తిపోట్లు నిర్దాక్షిణ్యంగా పొడిచారు. సరంగు కిందికి జారిపోయాడు.

అయితే ముఖ్య నౌకా ఉద్యోగులు పైఅంతర్వులో ఉండగా కింది అంతర్వులో జంతువుల పక్కగా చిన్న గదిలాంటి దాంట్లో మరికొందరు ఉద్యోగులు నిద్రిస్తు న్నారు కాబోలు..వాళ్లంతా కుక్క అరుపుకు లేచారు. గొడ్డళ్లు, కత్తులతో పైకి వచ్చారు. ఒక్కసారిగా సంకుల సమరం. అతి దుర్మార్గులైన ఓడదొంగల్లా ఓడ ఉద్యోగులు పోరాడలేరు. ఒకరిద్దరు దొంగలకు గాయాలయ్యాయి కానీ ఓడ ఉద్యోగులంతా దారుణంగా హతమయ్యారు..

జరగబోయే పరిణామం ఊహించిన గాలప్ప కొందరిని రెండవ అంతర్వులో పని చూడమని చెప్పి కొందరితో వెళ్లి అట్టడుగు అంతర్వు తలుపులు బంధిం చేశాడు. అప్పటికే పైన జరుగుతున్న మారణకాండను ఊహించిన తెడ్డు బానిసలు కదిలారు. కానీ గాలప్ప తలుపులు బిడాయించేసరికి గొడ్డళ్లతో తలుపులను కొట్టసాగారు. అప్పటికి కొందరు గాలప్ప మనుష్యులు రెండవ అంతర్వు చెక్క గోడలను నిర్విరామంగా కొట్టికొట్టి పగుల కొట్టారు. ఏనుగులు, గుర్రాలు క్రిందికి జారి సముద్రంలోకి పడిపోయాయి. అవి ఈదుకుంటూ వెళతాయి కానీ మునిగి చనిపోవు. గాలప్ప బృందమంతా అప్పటికే పైఅంతర్వులో ఉండే గొడ్డళ్లు, తదితర ఆయుధాలను వెదికి పుచ్చుకున్నారు. పగిలిన నౌక రెండవ అంతర్వు నుండి నిర్విరామంగా కింది అంతర్వును పగలగొట్ట సాగారు. వాళ్ల శక్తి ముందు తెడ్డు బానిసల శక్తి సరిపోలేదు.

నౌక అట్టడుగు అంతర్వు మొత్తంగా ఊడి నీటికి అడుక్కు వేగంగా వెళ్లిపోతోంది.

తెడ్డు బానిసలు హాహాకారాలు చేస్తుండగా.. గాలప్ప బృందం విజయ వికటాట్ట మహాసాలు చేయసాగారు.

ఆ మహానౌక గాలప్ప శక్తికి దాసోహమంది. వేల యోజనాలు ప్రయాణించి వచ్చిన ఆ మహానౌక పైభాగం మాత్రమే మిగిలి నీళ్లల్లో తేలియాడుతోంది.

చనిపోయినవారిని నిర్దాక్షిణ్యంగా నీటిలోకి తోసేస్తున్నారు దొంగలు.

గాలప్ప మరికొందరు అందున్న విలువైన వస్తువులను.. బంగారు నాణాలను.. వెదుకుతూ స్వాధీనపరుచుకుంటూ నౌకను సర్వం దోచుకుని.. ఆ నౌక చెక్క భాగాలనే పట్టుకుని బయటకు వచ్చి వికటాట్టహాసాలు చేస్తూ తమ పడవలను అధిరోహిం చారు. తేలియాడుతున్న శవాలను ప్రక్కకు తోస్తూ పడవల్ని ముందుకు నడిపిస్తున్నారు.

గాలప్ప మరికొందరు దోచుకున్న విలువైన వస్తువులతో ఐదు పడవల్లో దూరంగా పారిపోతు న్నారు. మిగిలిన వారు ఏనుగులు, గుర్రాల కోసం అన్వేషించసాగారు. అవి నీటిలో మునిగిపోవు. ఈదుకుంటూ ఎటో వెళ్లిపోతాయి. వాటిని వెదికి పట్టుకోవడం మరో ముఖ్య కార్యక్రమం.

మరునాడు గాలప్ప వేషం మార్చి మంచి బట్టలు ధరించి కన్నడ వణిజుని రూపంలో వెళ్లి ఓ వణిజుని కోష్టాగారంలోకి ప్రవేశించాడు. అతన్ని చూసి ఆ వణిజుడు ముఖం ముందు సందేహంతో కళ్లు చికిలించి చూసి గాలప్ప ముఖంలో కదలాడే సంతోష చారికలు గుర్తించి ఆనందంతో వెలిగిపోయింది.

‘‘ఓహో.. నీ వేషధారణ నీ ముఖంలో వెలుగు చెబుతున్నాయి. నువ్వు అనుకున్నది సాధించావని.. సేబ్బాష్‌..’’ ‌లేచి వచ్చి గాలప్పను హత్తుకున్నాడు.

వినయంగా నమస్కరించిన గాలప్ప తన వెంట తెచ్చిన తోలు సంచులను ఆయన ముందు పెట్టాడు.

ఆ వణిజుడు నవ్వి, ‘‘చెప్పింది చెప్పినట్లు చేశావ్‌. ‌చాలు. నా పగ చల్లారింది. అది చాలు నాకు. ఆ రత్నరాసులు, మణిమాణిక్యాలు నీవే. నువ్వూ నీ మనుషులు పంచుకోండి. పొండి..’’

ఆ వణిజుడు అప్పరుసుశెట్టి.

ఇంతవరకు చెప్పిన అంకాలశెట్టి అప్పుడన్నాడు.

‘‘ఆ నౌక.. దాంట్లో ఉన్న సరుకూ అంతా నాదే మహారాజా!. కేవలం కొన్ని చెక్కముక్కలు మాత్రమే నాకు మిగిలాయి. గాలప్ప అనే సముద్రపు దొంగతో నా నౌకను నాశనం చేయించాడు అప్పరుసు. గాలప్ప అనేవాడు కాకుండా మరో నలుగురుని చేరదీశాడు అప్పరుసు. కేవలం ఏడాది కాలంలో నా నౌకలు సరుకులతో వెళ్లి సరుకులు అమ్మి కోట్లాది రత్నరాసులతో వస్తున్నప్పుడు వాటిని సర్వనాశనం చేయించాడు. నాకు సరుకులు అందించిన సరఫరాదారులకు సొమ్ము చెల్లించలేకపోయాను. వాళ్లందరిని నాపై ఉసిగొల్పాడు. వాళ్లు నన్ను నానా దుర్భాషలాడి నా కోష్టాగారాలను కొల్లగొట్టారు. ఇళ్లు, వాకిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. నాకు ఎవ్వరి దగ్గరా అప్పు పుట్టకుండా చేశాడు. సర్వం నాశనం. కట్టుగుడ్డలతో మిగిలాను. నేను నాశనమైనా పర్వాలేదు మిత్రమా. కాని చిన్ననాటినుండి బంగారు ఊయలలో పుట్టి పెరిగిన నా కొడుకు ఇవ్వాళ కేవలం ఉప్పుశెట్టిగా మిగిలాడు. వాడు ముఖం చూడాలంటేనే బాధగా ఉంది. వాడు నన్నోక్క మాట అనలేదు. అదే మరీ దుఃఖ భాజనం.. ఏట్లో దూకి చనిపోవాలనుంది గణా..’’

తండ్రీకొడుకులు ఒకరినొకరు హత్తుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నారు.

సింహాసనం నుండి లేచి వారిద్దరిని దగ్గరకు తీసుకున్నాడు గణపతిదేవుడు.

* * *

‘‘ఇది నేను ఎప్పటినుండో మీకు చెబుతూనే ఉన్నాను. మీరు కాపులకు వ్యవసాయంపై చాలా పన్నులు తొలగించారు. ఉన్నవి కూడా కరవు కాలం నుండి వసూలు కావడంలేదు. మీకు చెబితే పోన్లే పాపం పంట పండటం లేదు కాబోలు.. వచ్చే వర్షాల నుండి వసూలు చెయ్యి అంటారు. అలాంటప్పుడు మనకు రాజ్య నిర్వహణకు కావాల్సిన ఆదాయం అందించేవి పరదేశీ వర్తక సుంకాలు మాత్రమే. వాటిని కూడా రాకుండా చేస్తోన్న వణిజులు, సముద్రపు దొంగలు. అంతా కలిసికట్టుగా నౌకలను దోస్తూ మనకు పన్నులు కట్టడంలేదు. ఇక విదేశీ వణిజులు మన రేవులకు రావడానికే సుముఖంగా లేరు. కింద తమిళదేశానికి, లేదా పైన కళింగానికి పోతున్నారు. ఇలా అయితే మన ఆదాయం సున్నకు పడిపోతుంది తండ్రీ..’’

ఇది మురారిదేవుడు తండ్రితో తెగించి చెప్పిన వైనం.

(సశేషం)


     మత్తి భానుమూరి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE