భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


– ‌వారణాసి భానుమూర్తి రావు

నేనూ, రాఘవరెడ్డి చిన్ననాటి స్నేహితులం. ఒకటో తరగతి నుండి పదవ తరగతి దాకా ఒకే స్కూల్లో చదివినాము. కలిసి తిరిగి నాము. మా ఊరికి రెండు మైళ్ల దూరంలో రాఘవ రెడ్డి వారుండే పల్లె ఉండేది. స్కూలుకు ఇద్దరూ తోడుగా పోయి చదువు కొనే వాళ్లం.

రాఘవరెడ్డి పైచదువులు చదవడానికి ఆర్థిక స్థోమత లేక తండ్రికి చేదోడు వాదోడుగా సేద్యం మీద దృష్టి సారించాడు. ఉన్న పది ఎకరాలు మాగాణిని నమ్ముకుని జీవనం సాగించాడు. తండ్రి చెప్పినట్లుగా వ్యవసాయంలో మెలకువల్ని నేర్చుకుని మంచి రైతుగా పంటలు బాగా పండించసాగాడు.

పదో తరగతి తరువాత నేను వాయల్పాడులో ఇంటర్‌ ‌చదివి మదనపల్లెలో గ్రాడ్యుయేషన్‌ ‌చేసి టీచర్‌గా ఉద్యోగం సంపాదించాను. నా ఆనందానికి అవధుల్లేవు. మా నాయన ఒక కిరాణా కొట్టు నడిపేవాడు. కొన్ని రోజులు ఉత్తరాల ద్వారా రాఘవరెడ్డి క్షేమ సమాచారాలు కనుక్కునేవాడిని . ఆ తర్వాత నాకు ఉద్యోగ బాధ్యతలు, బదిలీల దృష్ట్యా చిత్తూరు జిల్లా అంతా వివిధ పాఠశాలల్లో పనిచేయాల్సి వచ్చింది. నా వివాహం తర్వాత పిల్లలు వారి చదువులు స్కూల్‌లో బాధ్యతలు ఇలా నా జీవితం నాలుగు దశాబ్దాలు గడిచిపోయింది. దాదాపు నేను రిటైరయ్యాక కూడా నాకు రాఘవరెడ్డి ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో అని తెలుసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. ఒక ఉపాధ్యాయుడిగా నా జీవితం నాకు ఎంతో సంతృప్తి నిచ్చింది. రిటైరయ్యే సమయానికి నేను కూడా ప్రమోషన్‌ ‌పొంది జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యా యుడుగా ఒక ఐదారేళ్లు పని చేశాను.

నా కెందుకో ఈ మధ్య నా చిన్ననాటి స్నేహితుడు రాఘవరెడ్డిని చూడాలి అని నా మనసు తెగ ఆరాటపడుతోంది. మా బాల్య స్మృతులను తలుచుకుంటూ ప్రతిరోజు గడిపేవాడిని. రాత్రిపూట రాఘవరెడ్డి కలల్లో కనపడేవాడు. వాడిని చూడాలని తహతహలాడిపోయేది నా మనస్సు. నాకిప్పుడు డెబ్బయి ఏళ్లు. కాకతాళీయంగా ఇద్దరమూ ఒకే రోజు పుట్టాము . ఆ కాలంలో మాకు జన్మదిన పండగలు ఉండేవి కావు. ఇప్పటిలాగా ఆడంబరంగా పార్టీలు గట్రా చేసుకునే వాళ్లం కాదు. అసలు జన్మదినానికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. పండగలప్పుడే కొత్త బట్టలు వేసుకునేవాళ్లం. జన్మదినం ఎప్పుడో గూడా కూడా మాకు తెలిసేది కాదు. అలా గడిచిపోయాయి ఆ రోజులు.

రిటైర్మెంట్‌ ‌తర్వాత నేను నా శ్రీమతి మా కొడుకుతోనే ఉన్నాము. మా వాడు చాలా బుద్ధి మంతుడు. వాడు కూడా మదనపల్లె దగ్గర ఒక ఊర్లో గవర్నమెంట్‌ ‌హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. చిన్నప్పట్నుండి వాడు చదువు మీద చాలా శ్రద్ధ చూపేవాడు. నాలాగే వాడికి ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం. పిల్లలకు చదువు చెప్పి వాళ్లను ప్రయోజకులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి కంటే మించిన వృత్తి లేదంటాడు. ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవారు. కానీ ఇప్పుడు అన్ని ఉద్యోగాల కన్నా బడి పంతుళ్లే హాయిగా ఉన్నారు. ఉద్యోగంలో తృప్తి, మంచి జీతాలు, సెలవులు. అంతే కాకుండా రిటైర్‌ అయిన తర్వాత కూడా మంచి పెన్షన్‌ ‌వస్తోంది. జీవితం ఎలాంటి ఒత్తిడి లేకుండా జరిగిపోతోంది. బడి పిల్లలతో రోజంతా గడపడం వల్ల ఎంతో ఉల్లాసాన్ని , తృప్తిని ఇస్తుంది. ఈ రోజు పిల్లలే రేపటి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడంలో టీచర్ల బాధ్యత ఎంతో ఉన్నది. ఉపాధ్యాయులు సమాజానికి దివిటీలు వంటి వారు. నా కుమారుడు  కూడా నా ఆశల్ని పుణికి పుచ్చుకున్నాడు. స్కూల్‌లో కూడా వాడికి మంచి టీచర్‌ అనే పేరు వచ్చింది. ఇంతకీ నా పేరు చెప్పనే లేదు కదూ! శ్రీనివాసులు. నా కుమారుడి పేరు రామాంజనేయులు.

నేను నా చిన్ననాటి స్నేహితుడ్ని చూడాలని వాడున్న ఊరికి పోయి తిరిగి వస్తానని ఇంట్లో వారికి చెప్పినాను.వాళ్లు సరే అన్నారు. ఒక రోజు ఉదయం. నేనొక్కడినే మా రాఘవరెడ్డి ఊరికి బస్సులో బయలు దేరాను. మదనపల్లికి ముప్పయి కిలోమీటర్ల దూరంలో వాడి పల్లె ఉంది. ఆ ఊరు చేరుకునే సరికి ఉదయం పదకొండు గంటలు దాటింది. ఆ పల్లెలోని వారిని అడిగి రాఘవరెడ్డి ఇల్లు చేరినాను. పదంకణాల రాతి మిద్దె. ఇంటి ముందర తీగమల్లె చెట్టు వరండా మీదకు పాకి వుంది. అలాగే వేప చెట్టు ఇంకొక పక్క ఉన్నాయి. చల్లగా గాలి వీస్తోంది. ఇంటికి ముందర వరండా విశాలంగా ఉంది. ఒకమూల ధాన్యపు బస్తాలు పేర్చినారు. ఇంటికి ఎడమ వైపు పశువుల కొట్టం. కుడిచేతి వైపు ఇంకో కొట్టం. అక్కడ వంటలు చెయ్యడానికి మట్టి పొయ్యిలు. గడ్డితో కప్పిన కొట్టం అంతా మసితో నల్లగా మారింది. గోడలు కూడ మసి బారి నట్లున్నాయి. భోజనాలు చేయడానికి రెండు చెక్క బల్లలు, నాలుగు కుర్చీలు ఉన్నాయి. పాత పడిపోయి, పొగకు నల్లగా మసక బారిన ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఇంటి ముందర తల్లి కోడితో పాటు పది కోడి పిల్లలు చిన్న చిన్న పురుగుల్ని ఏరుకొని తింటూ తిరుగుతున్నాయి. పశువుల కొట్టంలో తెల్లని బలిష్టమైన ఎద్దులు, రెండు మూడు ఆవులు మేత మేస్తున్నాయి. వాటి మెడలోనున్న గంటల శబ్దం వినబడుతోంది. ఒక ప్రక్కగా కుడితి నీరు తొట్టె ఉన్నది. ఇంటి వెనకాల దిబ్బ కనబడుతోంది. ఆ దిబ్బలో చెత్తా చెదారం వేస్తారు. అలాగే పశువుల కొట్టం శుభ్రం చేసినప్పుడు ఆ పేడా వగైరా అంతా దిబ్బలో వేసి కుళ్ల బెడతారు. అదే ఎరువుగా తయారయి చేలకు, మడులకు వాడుతారు.

‘రాఘవ రెడ్డి ఉన్నాడా ?’ అని అడిగాను. నన్ను పోల్చుకొంటాడో, లేదో అన్న సంశయంతో, మళ్లీ రాఘవరెడ్డీ అని పిలిచాను.

పూర్లోని పిల్లలు పది మంది నా వెనకాలే వచ్చి నన్ను ఏదో వింత మనిషిని చూసినట్లు చూస్తున్నారు. నాకేసి నవ్వుతూ నన్ను ఎగాదిగా చూస్తున్నారు. నా బ్యాగ్‌లోని పది చాక్లెట్లను తీసి పిల్లలందరికీ పంచి ఇచ్చాను..వారి ఆనందానికి అవధుల్లేవు. పిల్లలు తలా ఒకవైపు పరిగెత్తారు.

‘‘నువ్వు… నువ్వు ఎవరు? ఎప్పుడూ నేను చూసినట్లు లేదే ?’’ అన్నాడు రాఘవరెడ్డి తన కళ్లద్దాలు తుడుచుకుంటూ.

లోపలికి రమ్మన్నట్లు సైగ చేశాడు. ఇంటి ముందర వరండాలో ఇద్దరమూ కూర్చున్నాము.

‘‘ నేనెవరో గుర్తుపట్టుకో – చూద్దాం!’’ అన్నాను నవ్వుతూ.

రాఘవరెడ్డిని చూడగానే నా అంతరంగం ఆనందడోలికల్లో మునిగిపోయింది. కళ్ల నిండా ఆనందభాష్పాలు. వయసు మీద పడింది కదా ఇద్దరమూ గుర్తుపట్ట లేనంతగా శరీరంలో, ముఖంలో మార్పులు. నా జుట్టు తెల్లబడిపోయింది. పెంచిన గుబురు గడ్డం తెల్లగా ఉంది. నా ముఖంలో మడతలు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. రాఘవరెడ్డి శరీరంలో కూడా వృద్ధాప్య ఛాయలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. అతని మీసాలు తెల్లగా మెరుస్తున్నాయి. జుట్టంతా ఊడిపోయి తెల్లని గుండు మెరుస్తోంది. ముతక బట్టలు వేసుకుని చేతికర్ర సాయంతో నన్ను ఎగాదిగా చూస్తూ పోల్చుకోలేక పోతున్నాడు.

అంతలో వాడు శ్రీమతి వంటింట్లోంచి బయటికొచ్చింది.

‘‘నేను… నేను … నన్ను గుర్తుపట్ట లేదా? అన్నాను నేను నవ్వుతూ.

వాడు తల అడ్డంగా ఉపాడు గుర్తుకు రాలేదంటూ.

‘‘ఒరేయ్‌ … ‌రాఘవ! నేను రా… నీ బాల్య స్నేహితుడ్ని. శ్రీనివాసుల్ని’’ అన్నాను నేను వాడి చేయి పట్టుకుంటూ.

రాఘవరెడ్డి ఒక్కసారిగా చేతికర్ర వదిలి లేచి నన్ను గట్టిగా హత్తుకొని చిన్న పిల్లోడిలా ఏడ్చినాడు. నేను కూడా లేచి వాడ్ని ఆలింగనం చేసుకుని గట్టిగా హత్తుకొన్నాను. నాకు గూడా ఏడుపు ఆగడం లేదు.జలజలమని కన్నీళ్లు జారి నా గుబురు గడ్డం మీద పడుతున్నాయి.

‘‘శ్రీనివాసులు… నువ్వా? ఎన్ని రోజులు అయిందిరా నిన్ను చూసి… యాభై ఏళ్లు దాటిందను కొంటాను. అవునులే ! పెద్ద గవర్నమెంట్‌ ఉద్యోగం చేస్తున్నావు. ఈ బీదరైతు బిడ్డను మర్చిపోయినావు’’ అన్నాడు రాఘవరెడ్డి. కళ్లలో వస్తున్న కన్నీటిని కండువాతో తుడుచుకున్నాడు.

‘‘అబ్బే… అదేం లేదురా!’’ ‘అని ఇద్దరమూ నులక మంచం మీద కూర్చుని ఒకరి నొకరు క్షేమ సమాచారాలు కనుకున్నాము.

రాఘవరెడ్డి సతీమణి వద్దన్నా భోజనానికి బలవంత పెట్టింది. రాగి సంగటి తిని ఎన్ని రోజుల య్యిందో? రాగిసంగటి, చేపల పులుసు, ఇంటి నెయ్యి,గడ్డ పెరుగుతో భోజనం ఇద్దరికీ వడ్డించింది.

రాఘవరెడ్డి చిన్న నాటి విషయాలు, మేము చేసిన అల్లరి గురించి అన్నీ చెప్పి నవ్వించాడు. అతని అన్ని విషయాలు ఎట్లా జ్ఞాపకం పెట్టుకొన్నాడో అని అనిపించింది.

భోజనాలయ్యాక, రాఘవరెడ్డి మూడు ఫొటో ఫ్రేములు, కొన్ని పెళ్లి ఆల్బములు నా ముందర తెచ్చిపెట్టాడు.

‘‘వీడు నా పెద్ద కొడుకు కేశవ రెడ్డి. తిరుపతి కాలేజీలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. వీడు నా రెండో కొడుకు. పేరు గురవారెడ్డి. హైదరాబాద్‌లో ఒక పెద్ద డాక్టర్‌. ఇక వీడు నా చిన్న కొడుకు.పేరు ధనుంజయరెడ్డి. ఉత్తరప్రదేశ్‌లో కలెక్టర్‌గా పని చేస్తున్నాడు.’’

ఆశ్చర్యపోయాను నేను.

ఒక రైతుగా ఇదే పల్లెలో భూమి తల్లిని నమ్ముకుని కొడుకుల్ని ఇంత ప్రయోజకుల్ని చేశాడు. అదెలా సాధ్యం? అనుకొన్నాను..

‘‘కొడుకుల్ని ఇంత గొప్ప వాళ్లని చేశావు.ఎలారా? నేను నమ్మలేక పోతున్నాను.’’ అన్నాను.

‘‘అవునురా !నే నెట్లా చదువుకోలేకపోయాను. నా కొడుకుల్ని బాగా చదివించాలని రెక్కలు ముక్కలు చేసుకుని, ఈ సేద్యాన్ని, భూమి తల్లిని నమ్ముకుని చదివించినాను. వాళ్లు కూడా ఇక్కడే గురుకుల హైస్కూల్‌లో చేరి బుద్ధిగా చదువుకొన్నారు.

పెద్దోడికి లెక్చరర్‌ ఉద్యోగం వచ్చిన తరువాత, ఇద్దరు తమ్ముళ్లను చేరదీసి చదివించినాడు. రెండవవాడు ఎంబీబీఎస్‌ ‌తిరుపతిలో గవర్నమెంటు కాలేజీలో మెరిట్‌ ‌కోటాలో సీటు సంపాయించు కొన్నాడు. చిన్నోడిని ఐఏఎస్‌ ‌చదవమని హైదరాబాద్‌ ‌పంపాడు. పెద్దోడు తమ్ముళ్లని మంచి ప్రయోజకుల్ని చేసినాడు. అందరికీ పెళ్లిళ్లు అయిపొయినాయి. వారికి పిల్లలు కూడా!’’ చెప్పాడు రాఘవరెడ్డి.

‘రాఘవా! నువ్వు నిజంగా అదృష్టవంతుడివిరా! మరి పిల్లలు అంత పెద్ద పెద్ద కొలువుల్లో ఉన్నారు కదా! మరి మీరెందుకు ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతూ ఇలా ఇంకా ఈ పల్లెలోనే ఉన్నార్రా!’’ అని అడిగాను.

‘నాకిష్టం లేదు రా! వాళ్లను ప్రయోజకులను చేయడమే మన బాధ్యత.’’ అన్నాడు వాడు.

‘‘వయసు మీద పడుతోంది కదా! ముగ్గురూ రత్నాల్లాంటి కొడుకుల్ని కన్నావు. ప్రయోజకుల్ని చేశావు. హాయిగా ‘కృష్ణా! రామా !’ అంటూ వారితో ఉండి మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ శేష జీవితం గడపవచ్చు కదా? అన్నాను ‘‘ఒరే! శ్రీనివాసులు… ఈ పల్లెలో హాయిగా ప్రశాంత జీవితం గడుపుతున్నాను. నా పశువులతో కాలక్షేపం చేస్తున్నాను. పాడీపంట చూసుకొంటున్నాను. నాకు ఇక్కడ ఉన్న స్వేచ్ఛ, సంతృప్తి నా కొడుకులతో ఉంటే రాదు. వారి బాధ్యతలు, హడావిడి, ఉరుకుల పరుగుల జీవితం మనకు సరిపోదు. మనం అక్కడ ఇమడలేము. ప్రభుత్వం వారు వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నారు. మా భూముల్లో పండే ధాన్యం, కూరగాయలు మాకు తినడానికి సరిపోతాయి. ఇంకా మా పిల్లోళ్లకు కూడా ధాన్యం పంపిస్తాను. పాలు డెయిరీ ఫామ్‌కు అమ్ముతాను. నెలకు పది, పదిహేను వేలు వస్తుంది. ఇంకా మాకు డబ్బులతో పనేముందిరా? నా పల్లె తల్లి నాకు అన్నీ ఇచ్చింది. తాతముత్తాతలు ఇచ్చిన ఆస్తిని,నా పల్లె తల్లిని వదిలి ఎక్కడికి పోను. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడే ఉంటాను. ఇక్కడే చస్తాను’’ అన్నాడు రాఘవరెడ్డి.

వాడి ఆత్మాభిమానానికి, ఆత్మస్థైర్యానికి వాడి పాదాలకు నమస్కరించాలి అనిపించింది. తను ఈ విషయంలో చాలా తప్పు చేశాడు. రిటైర్‌ అయిన వెంటనే తన హక్కని కొడుకు దగ్గరికి వెళ్లిపోయాడు. అన్ని విషయాలకు కొడుకు మీద ఆధార పడిపోయాడు. తల్లీతండ్రీ తమకి ఒంట్లో శక్తి ఉన్నంత వరకు తమ పనులు తాము నిర్వర్తించుకోవాలి. కొడుకుల మీద పొలోమని పడిపోయి వారికి ఇబ్బంది కలిగించ కూడదు. వీలైతే వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆర్థికంగా, భౌతికంగా వారికి సహాయం చేయాలి. వారి వెన్నంటే ఉండి వారికి సలహాలు ఇస్తూ, ధైర్యం చెబుతూ వారి పిల్లల్ని కూడా ప్రయోజకులుగా చేయాలి.

నా అంతరంగంలో పరిపరి విధాల పోతున్నాయి ఆలోచనలు. ఎదురుగా ఉన్న రాఘవ రెడ్డి నిలువెత్తు ఆత్మాభిమానం కలిగిన అపురూప వ్యక్తిగా నాకు కనపడ్డాడు. మళ్లీ ఒక్కసారి రాఘవరెడ్డిని గట్టిగా హత్తుకొని ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ బరువెక్కిన హృదయంతో వీడ్కోలు చెబుతూ తిరుగు ప్రయాణమయ్యాను.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE