భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
కె.రాజేశ్వరి
కారు దిగి లోపలికి వస్తున్న నన్ను చూడగానే ‘‘వచ్చారా… సార్! మీ కోసమే ఎదురు చూస్తున్నాము. మూడు రోజుల నుండి మీరు రాకపోయేసరికి మీమీద దిగులు పెట్టుకున్నారేమో, మేడంగారు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టటం లేదు. మీకు ఫోన్ చేస్తుంటే ‘నాట్ రీచ్‌బుల్…’ అని వస్తుంది. మేడంగారిని చూస్తుంటే చాలా భయమేస్తుందండీ… చాలా ‘వీక్’ అయ్యారు…’’ సిస్టర్ మాటలకి.
‘‘ఓ.. సారీ అండి… అర్జెంట్ పనిమీద ‘బోంబే’ వెళ్లాను. అక్కడ వర్షాలు ఎక్కువగా ఉండటాన ‘సిగ్నల్స్’ అందక ఫోన్ కలవలేదేమో..’’ అంటూ ఆవిడ వెంట రాగా హడావిడిగా మాధురి ఉన్న గదిలోకి నడిచాను.
పక్కకి తిరిగి పడుకొని ఉన్న మాధురిని చూస్తూ ‘‘మధూ…!’’అంటూ పిలిచాను.
నాగస్వరం విన్న ‘నాగిని’లా ఒక్కసారిగా ఇటు తిరిగింది.
కళ్లకింద నల్లటి వలయాలు… లోపలికి పోయిన కళ్లు, బుగ్గలు… పీక్కుపోయిన మొహంతో పదిరోజుల నుండి తిండిలేని దానిలా నీరసంగా ఉన్న మధుని చూడగానే జాలి, కోపం రెండూ ఒకేసారి కలిగాయి.
‘‘తనకి తినిపించటానికి ఏదైనా పంపించండి… నేను దగ్గరుండి తినిపిస్తాను…’’ అని సిస్టర్‌కి చెప్పి…. ఆమె వెళ్లగానే…
‘‘ఏమిటి మధూ ఈ పిచ్చి పని…. రెండ్రోజులు వీలుకాక రాలేకపోతే తిండి మానేయాలా..? చూడు.. ఎలా అయిపోయావో…’’ అంటూ ప్రేమగా మందలించాను.
ఇంతలో సిస్టర్ భోజనం తీసుకురావటంతో మధుని మెల్లగా లేపి దిండుకి ఆనుకొని కూర్చోబెట్టి సిస్టర్ చేతిలోని ప్లేటు తీసుకొని స్ఫూన్‌తో కలిపి కొంచెం…. కొంచెంగా తినిపించసాగాను. బాగా ఆకలి మీదుందేమో నా మొహంలోకి దీక్షగా చూస్తూ పెట్టినదంతా తినేసింది.
మంచినీళ్లు తాగించి, మూతి తుడిచి ‘‘చూడు మధూ…! ఇంకెప్పుడు ఇలా పిచ్చి వేషాలేయకు. నీ ఎదురుగా కూర్చుని నీకు సేవలు చేయాలంటే కుదరకేగా ఎంత ఖర్చైనా నిన్నిక్కడ చేర్చింది. ఇక్కడ అందరూ నిన్ను ఎంతో బాగా… జాగ్రత్తగానే చూసుకుంటున్నారు కదా! ఇంకేం కావాలి నీకు? త్వరగా కోలుకొని ఇంటికి రావాలని లేదా ఏమిటి…? పనులుండి వీలుకాక రాకపోతే ఇలా తిండి తినకుండా కూర్చుంటావా….? అస్తమానం నీ ఎదురుగా కూర్చోటానికి నాకు వేరే పనేం లేదా? నేనెంత బిజీగా ఉంటానో నీకు తెలుసు కదా? అన్నీ తెలిసి కూడా ఎందుకు ఇట్లా మూర్ఖంగా ప్రవర్తించి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు? ఎవర్ని బెదిరించటానికి? ఏం సాధిద్దామని..?’’
ఒక్క క్షణం తెల్లబోయింది నా మాటలకి… తర్వాత నన్ను చూడటం ఇష్టం లేనిదానిలా మొహం పక్కకి తిప్పుకుంది.
‘‘మధూ…! నువ్విలా మొండిగా ప్రవర్తిస్తే ఎప్పటికి కోలుకుంటావు? జీవితాంతం ఇక్కడే ఉండి పోవాలనుకుంటున్నావా ఏమిటి….? ఇదుగో… ఇప్పుడే చెబుతున్నా… ఇంకోసారి ఇలా తిండి, నీళ్లు మానేసి చిన్న పిల్లలా అలకలు సాగించావంటే నీ దగ్గరికి రాను కూడా రాను….’’ కోపంగా బెదిరిం చాను.
అంతే…ఎడం చేత్తో స్టూలు మీదున్న గ్లాసుని కిందికి విసిరి కొట్టింది. చివ్వున నావైపు తిరిగింది. ఆవేశంతో గుండెలెగసి పడుతున్నాయి. ఆ కళ్లల్లో కోపంతో కూడిన ఎర్రటి జీరలు మా నలభై ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్నడూ చూడని ఆ కోపం, ఆవేశం చూసి ఒక్క క్షణం బిత్తరపోయాను. అంతలోనే తమాయించుకొని అక్కడుండటం ఇష్టం లేనివాడిలా బయటకు నడిచాను.
‘‘సార్… డాక్టర్‌గారు మిమ్మల్నోసారి వచ్చి కలవమన్నారు…’’
సిస్టర్ చెప్పటంతో డాక్టర్‌గారి రూంలోకి వెళ్లాను.
‘‘నమస్తే డాక్టర్…’’ అని విష్ చేయగానే ‘‘రండి… రమాకాంత్‌గారూ…! కూర్చోండి…’’ అన్నారు.
బుద్ధిగా వెళ్లి ఆమెకి ఎదురుగా ఉన్న ఛైర్లో కూర్చున్నాను.
‘‘చూడండి… నాకు తెలిసి మీ భార్య తన జీవితంలో ఇప్పటి వరకు ఎటువంట• అనారోగ్యానికి గురికాలేదు కదూ…?’’
అన్నీ తెలిసి అలా ఎందుకు అడుగుతున్నారో అర్థంకాక అయోమయంగా చూస్తూ ‘‘అవునండి…’’ అన్నాను.
ఇంట్లో అన్ని పనులు బాధ్యతగా చూసుకొంటూ, ఎంతో చలాకీగా…ఉత్సాహంగా ఉండే మీభార్య ఒక్కసారిగా ‘పెరాలసిస్’ వచ్చి కాలు చెయ్యి పనిచేయకపోతే ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోగలరా? తన బాధ చెప్పుకోవటానికి మాట స్పష్టత లేదు. కాలు, చెయ్యి సరిగా వస్తాయో రావో తెలియదు. ‘ఎన్నాళ్లకి లేచి తిరగగలుగుతానో! ఇలా ఇతరుల చేత సేవలు చేయించుకొంటూ జీవితాంతం మంచానికే అంకితమైపోతానా.? ‘అన్న ఆలోచనలతో, దిగులుతో మీభార్య ఎంతగా కృంగిపోతుందో, మానసికంగా ఎంత వేదనపడుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా…?’
ఆమె అలా సూటిగా అడిగేసరికి ఏం మాట్లాడాలో తెలియక తలొంచుకున్నాను.
‘ఒక్క మీ భార్యే కాదు, ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఏ పేషెంటు మానసిక స్థితి అయినా ఇలానే ఉంటుంది. జీవితం మీద విరక్తి కలుగుతుంది. మృత్యువు కోసం ఎదురు చూస్తుంటారు.
వాళ్లు త్వరగా కోలుకోవాలంటే వాళ్లని విసుక్కోకుండా, పసిపిల్లల్లా… లాలనగా, ప్రేమగా చూడాలి. ‘మీకు మేమున్నాం..’ అంటూ మానసిక ధైర్యాన్నివ్వాలి. మా డాక్టర్లు… సిస్టర్స్ ఎంత మంచి ‘ట్రీట్‌మెంట్ ఇచ్చి, ఎంత బాగా చూసుకున్నా ‘నా’ అనే వాళ్ల ప్రేమ, ఆప్యాయతలే వాళ్లని బాగా కోలుకొనేలా చేస్తాయి.
ఇంటి దగ్గరైతే మీరు రోజూ కనిపిస్తూ, పలకరిస్తూ ఉంటారు. అలవాటైన ఇంటి పరిసరాలు, ఆ వాతావరణం తనకి మానసికంగా ఎంతో బలాన్ని, ధైర్యాన్ని, ఊరటనిస్తాయి. పైగా, హాస్పిటల్ వాతా వరణంలో అందరూ మనశ్శాంతిగా, స్థిమితంగా ఉండలేరు. మీరు రోజూ రావాలన్నా మీకుండే పనుల వలన కుదరకపోవచ్చనే ‘ఇక్కడున్నా చేసేదేం లేదు. ఇంటికి తీసికెళ్లి ‘ఫిజియోథెరపి’ చేయిస్తూ మందులు కంటిన్యూ చేస్తాను’ అని ఇంటికి తీసుకువెళ్లారు.
మీరు గమనించారో, లేదో కాని ఇంటి దగ్గరున్న వారం రోజుల్లోనే తనలో ఎంతో మార్పు వచ్చింది. ఆ మొహంలో ఏదో తెలియని మెరుపు. ప్రశాంతత, పెదవుల మీద చిరునవ్వు. బుగ్గల్లో నిగారింపు చూసి నేనే ఆశ్చర్యపోయాను. అయితే మీకు ఇంట్లో ఇబ్బందిగా ఉంటుందని మళ్లీ తీసుకొచ్చి ఇక్కడే జాయిన్ చేస్తిరి. వచ్చి కూడా వారం దాటింది. ఈ వారంలో ఆమె ఎలా అయిపోయారో గమనించారా మీరు? ఆ కళ్లల్లో దిగులు తప్ప, ఆ మొహంలో చిరునవ్వుని చూడగలిగారా? మూడు రోజులుగా మీరు కనిపించకపోయే సరికి తిండి, నీళ్లు, నిద్ర మానేసి జీవంలేని దానిలా, ఓ పిచ్చిదానిలా ఎలా తయారయ్యారో మీరే చూశారు కదా! ఆమెనిలా చూస్తుంటే మీకెలా ఉందోకాని, మేము మాత్రం తట్టుకోలేకపోతున్నాము.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఇంతకు ముందు సీరియస్‌గా ఉన్న ఒక పేషెంట్‌ని చూసి వస్తూ….మీ గది ముందుకి రాగానే అనుకోకుండా మీరు మీ భార్యతో అంటున్న మాటలు విన్నాను. మీ పర్సనల్ సమస్యలు ఎన్ని ఉన్నా తన ముందు ఇలా చిరాకుపడకూడదండీ! అయిన వాళ్ల ప్రేమ, అభిమానం, ఆత్మీయమైన పలకరింపులే మందుల కన్నా ఇలాంటి పేషెంట్ల మీద త్వరగా ప్రభావితం చూపించి కోలుకొనేలా చేస్తాయి. ఒకరి నెల రోజులు మీ పనులన్నీ పక్కనపెట్టి దగ్గరుండి ఆమెని జాగ్రత్తగా చూసుకోండి. తనలో ఎంత మార్పు వస్తుందో మీరే చూస్తారు. ఆమె మానసిక పరిస్థితి తెలిసిన మీ ఫ్యామిలీ డాక్టరుని కాబట్టి ఇంతగా చెబుతున్నాను. ఇలా చెప్పానని మరోలా భావించకండి….’’
* * *
ఇంటికి రాగానే ఏదో నీరసం,నిస్సత్తువ ఆవహించినట్లైంది. తలంతా ఏదో దిమ్ముగా, మనసంతా తెలియని ఆందోళనతో నిండిపోయింది. బట్టలు కూడా మార్చుకోకుండానే అలాగే పడుకుండి పోయాను. ఇల్లంతా ఏదో శూన్యంగా, వెలితిగా అనిపించింది. డాక్టర్ చెప్పిన మాటలు పదే పదే గుర్తొచ్చి నిద్ర కూడా కరువైంది.
సడెన్‌గా నా చూపు ఎదురుగా గోడమీదున్న మా పెళ్లి ఫొటోమీద పడింది.
ఎంతో అమాయకంగా,అరవిచ్చిన మందా రంరా, ముగ్ధ మనోహరంగా మెళ్లో పూలదండతో నా పక్కన నిలబడి ఉన్న మాధురిని చూడగానే ఒక్కసారిగా గతమంతా కళ్లముందు నిలిచింది.
ఇరవై ఏళ్ల వయసులో నా చిటికెనవేలు పట్టుకొని నా అడుగులో అడుగేసు కొంటూ నా ఇంట్లో కాలు పెట్టింది మాధురి. అప్పటి నుండి అమ్మతో పాటు చీకటితోనే నిద్రలేచి, ప్రతి పనిలో అమ్మకి ఎంతో సాయంగా ఉంటూ, ఇంట్లో అందరితో స్వంత మనిషిలా కలిసిపోయింది. తమ్ముడి, చెల్లి పెళ్లిళ్లు, సీమంతాలు, బారసాలలు, నోములు, వ్రతాలు అంటూ ఒకటేమిటి….ఇంట్లో ఏ వేడుక జరిగినా అలుపనేది లేకుండా, ఎంతో చలాకీగా ప్రతి పనిలో తానే ముందుండేది. తమకి పుట్టిన ఇద్దరి పిల్లల ఆలనా, పాలనా, చదువులు, స్కూలు ఫీజులు, ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్‌కి తీసికెళ్లటం దగ్గర్నుండి… అంతా తానే చూసుకుంది. ఆఖరికి పిల్లలకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసే విషయంలో కూడా తనే బాధ్యత తీసుకుంది. ఇంట్లోకి అవసరమైన డబ్బులిస్తూ, సెంటర్‌లో ఉన్న తన ‘గోల్డు షాపు’ని చూసుకోవటం తప్ప ఇంటి విషయాలు ఏనాడూ పట్టించుకోలేదు నేను.
‘హార్ట్ ఎటాక్’తో సడెన్‌గా అమ్మ చనిపోతే ఆ దిగులుతో మంచాన పడ్డ నాన్నను కూడా పసి పిల్లవాడిని చూసినట్లు చూసుకుంది. స్నానం చేయించటం దగ్గర్నుండి, టైముకి భోజనం తినిపించి మందులేయటం వరకు అన్నీ తనే చూసుకుంది.
‘‘ఒక్కదానివే చేయలేవు. ఎవరినైనా మనిషిని ఏర్పాటుచేస్తా….’’ అంటే జీతానికి చేసేవాళ్లు స్వంత మనుషుల్లా, బాధ్యతగా ఎందుకు చూసుకుంటా రండీ? మా నాన్నగారికైతే చెయ్యనా ఏమిటి…? మామయ్యగారు నా తండ్రిలాంటి వారు… నాకేం ఇబ్బంది లేదు.. ఇంకెప్పుడూ మీరలా మాట్లాడకండి…’’ అన్నది.
అంతదాకా ఎందుకు. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగి నా కుడికాలి తొంటికి ఆపరేషన్ జరిగితే నెలరోజుల వరకు మంచం మీద నుండి దిగనీయకుండా ఎంత సేవ చేసింది! ‘బెడ్‌పాన్’ పెట్టి మలమూత్రాలు ఎత్తిపోసి క్లీన్ చెయ్యటం, వీల్ ఛెయిర్లో కూర్చోబెట్టి బాత్‌రూంకి తీసికెళ్లి స్నానం చేయించటం, వేళకి టిఫిను, భోజనం, మందులు వేయటం దగ్గర్నుండి విసుగనేది లేకుండా, నవ్వుతూ… ఎంత ప్రేమగా సేవలు చేసింది. వాకర్‌తో మెల్లిమెల్లిగా నాలుగడుగులు వేయిస్తూ, కాలు బాగా తగ్గి నా అంతట నేను నడిచేవరకు నా వెన్నంటే ఉండి నాకెంత ధైర్యాన్నిచ్చింది.
ఎప్పుడు చూసినా గలగలా మాట్లాడుతు ఇల్లంతా ఎంతో హుషారుగా తిరుగుతూ అన్ని పనులు తనే చూసుకొనే మధు ఇప్పుడలా సడెన్‌గా ‘పెరాలసిస్’ వచ్చి కాలు, చెయ్యి పడిపోయి మంచానికి అంకిత మవటం అంటే నిజంగా ఎంత బాధ•!. ఎంత నరకం! తన బాధ ఎవరికైనా చెప్పుకోవటానికి నోరు కూడా పడిపోయిందే! అలాంటి మధుని దగ్గర్నుండి ఎంతో ప్రేమగా, జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఎంత మూర్ఖంగా, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాను… ఇంట్లో ఉన్న వారం రోజుల్లోనే ‘కేర్ టేకర్’ వచ్చి ‘డైపర్’ మార్చటం ఓ అరగంట లైటేతే ఎంతగా విసుక్కొనేవాడినో! నాకు, నా కుటుంబానికి ఇంత చేసిన మధుకి నేనేం చేశాను? నా బిజినెస్ పనుల మీద ఊళ్లు తిరగాల్సి వస్తుందని… ఇంట్లో ఒకదాన్నే ఉంచలేక మళ్లీ హాస్పిటల్‌కి తీసుకొచ్చాను.
తనకి ‘పెరాలసిస్’ వచ్చిందని తెలిసి అమెరికాలో ఉన్న కూతురు, కొడుకు వచ్చి ఓ పదిరోజులుండి వెళ్లారు. బంధువులు వచ్చి చూసి వెళ్లిపోయారు…. ఎవరు మాత్రం వాళ్ల వాళ్ల పనులు మానుకొని ఎన్నాళ్లని వచ్చి ఉంటారు? కట్టుకున్న వాడిని నేనే నా బిజినెస్ పనుల కోసం తనని సరిగా పట్టించుకో పోతే బంధువులకి, బయటవాళ్లకి ఏం అవసరం? అయినా, ఇంకా ఈ వయసులో నాకీ బిజినెస్ అవసరమా;? సంపాదించి ఏం చెయ్యాలి? ఎవరికి ఇవ్వాలి? పిల్లలిద్దరు అమెరికాలో కోట్లు గడిస్తున్నారు. వాళ్లకి ఇక్కడున్న నా ఆస్తులు అవసరం కూడా లేదు. అలాంటప్పుడు ఇంకా నాకెందుకీ డబ్బు తాపత్రయం? ఎంత సంపాదిస్తే తృప్తి అనేది ఉంటుంది? ఉద్యోగస్తులైతే ఈ పాటికి ఎప్పుడో రిటైరై ఇంట్లో కూర్చుని ప్రశాంత జీవనం గడిపేవారు. మా వ్యాపారస్తులకి రిటైర్మెంట్ అనేవి ఉండదుగా. బతికినన్నాళ్లు ఇంకా… ఇంకా సంపాదించాలనే కోరుకుంటాము. ఈ సంపాదనకి మితం, అంతం అనేవి ఉండవేమో! రెండు తరాలు తిన్నా తరగనంత ఆస్తి ఉంది. ఇంకా నాకెందుకీ తాపత్రయం?డబ్బు సంపాదనలో పడి ఇన్నాళ్లు మా కోసం తన సర్వస్వాన్ని ధారవోసిన ‘నా మధు’ని ఎందుకు దూరం చేసుకోవాలి? పుట్టింటికి వెళ్లినా ‘నాకు ఇబ్బంది…’ అని రెండ్రోజులు కూడా ఉండకుండా వచ్చేసేది. ఏనాడూ కూడా తనకి ‘ఇది కావాలి..’ అని అడిగింది లేదు. ఈ రోజు కూడా తనున్న పరిస్థితి ‘నేను ఎదురుగా ఉంటే చాలు…’ అనుకుంటుంది. ఇప్పుడు కూడా ఒకరికొకరం అండగా ఉండకపోతే పెళ్లి నాటి ప్రమాణాలకి విలువేం ఉంటుంది? భార్యాభర్తల అనుబంధానికి అర్థమేం ఉంటుంది?
ఇప్పుడు నాకు డెబ్బై. తనకి అరవై ఐదు. దాదాపు జీవితపు చరమాంకానికి వచ్చినట్లే. ఎవరు ముందో! ఎవరు వెనకో! అలాంటప్పుడు ఉన్నన్నాళ్లు ఒకరి కోసం ఒకరం ఎంతో ప్రేమగా, బాధ్యతగా ఉంటే… అంతకన్నా ఈ జన్మకింక ఏం కావాలి…?
మధూ లేని ఇల్లు ఎంతో బోసిగా… శ్మశాన వైరాగ్యాన్ని తలపిస్తుంది. ఒంటరితనం భరించలేక పోతున్నాను. ఒంటరితనాన్ని మించిన నరకం లేదేమో. అది అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. అలవాటైన ఇంట్లోనే నేనింత ఒంటరితనాన్ని అనుభవిస్తుంటే అక్కడ… ఆ హాస్పటల్లో ‘నా’ అనే వాళ్లు లేక… దిక్కులేని దానిలా మధు ఎన్నాళ్లని ఉంటుంది? ఒకవేళ… ఒకవేళ…. మధు పరిస్థితిలో నేనే ఉంటే… తను నన్నిలాగే వదిలేసి ఉండేదా…?
ఆ ఆలోచన నా మనసుని అతలాకుతలం చేసింది. కాసేపు దీర్ఘంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాను. అవును… అలాగే చేయాలి.
రేపే వెళ్లి నా మధుని ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్తగా చూసుకోవాలి. తను ఇంట్లో ఉంటే నాకూ తోడుగా ఒకరున్నారన్న ధైర్యం ఉంటుంది. నేను తన పక్కనే ఉండి ఏదో ఒకటి మాట్లాడుతుంటే మధు ఎంతో సంతోషిస్తుంది. తనకంటే నాకీ బిజినెస్ ఎక్కువేం కాదు. తెల్లారగానే మేనేజర్‌కి ఫోన్ చేసి చెప్పేయాలి. ‘‘షాపు అమ్మేస్తానని, రేపటి నుండి షాపుకి రానని, అమ్ముడు పోయేవరకు తననే జాగ్రత్తగా చూసుకోమని….’’ అసలు ఈ నిర్ణయం మధుకి బాగా లేనప్పుడే తీసుకోవాల్సింది. ఆలస్యం చేసి చాలా తప్పు చేశాను….
ఈ నిర్ణయం తీసుకోగానే తలమీద నుండి ఏదో పెద్ద భారం దిగిపోయినట్లు మనసంతా ఎంతో తేలిగ్గా…హాయిగా…ప్రశాంతంగా అయింది.
ఆనందంగా పెళ్లి ఫోటోవైపు చూస్తూ ‘‘మధూ…! తెల్లారగానే నీ కోసం వచ్చేస్తున్నా…నిన్ను ఇంటికి తీసుకొచ్చి నా గుండెలకి హత్తుకొని పసి పాపలా చూసుకుంటాను. నేనే స్వయంగా నీ కాలికి, చేతికి మసాజ్ చేసి, వాకర్‌తో నడిపిస్తాను. రోజంతా నీ ఎదురుగా కూర్చుని బోలెడన్ని కబుర్లు చెబుతాను. సాయంత్రాలు ‘వీల్ ఛెయిర్లో’ కూర్చోబెట్టి బోలెడన్ని కబుర్లు చెబుతాను. ‘వీల్ ఛెయిర్లో’ కూర్చోబెట్టి పెరట్లో నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకొంటున్న మొక్కల దగ్గరకి తీసికెళ్తాను… నువ్వు కాస్త కోలుకున్నాక తీర్థయాత్రలన్నీ తిరిగి వద్దాము. నిం మధూ…. నీ మీద ఒట్టు… నన్ను నమ్ము….’’
పట్టలేని ఆనందంతో మనసులోనే మధుతో మాట్లాడుతూ… మాట్లాడుతూ.. ‘ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా….’ అని ఎదురు చూస్తూ నాకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయాను.
సెల్ మోగటంతో ఉలిక్కిపడి లేచాను. కిటికీలో నుండి పడుతున్న సూర్య కిరణాలని చూసి ‘అమ్మో…. బాగా తెల్లారిపోయిందే! ఇంతసేపు పడుకున్నా నేమిటి…?’’ అనుకొంటూ గబగబా మంచం దిగి డ్రెస్సింగ్ టేబుల్‌మీదున్న సెల్ తీసుకొని
‘‘హలో….’’ అన్నాను.
‘‘సార్…! రాత్రి మీరు వెళ్లిపోయిన దగ్గరుండి మేడంగారు ఒకటే ఏడుపు. ఎంత మందిమి, ఎంతగా ఓదార్చినా వినలేదు. మీరు తినిపించిన భోజనం కూడా వాంతి చేసుకున్నారు. ఇప్పుడు ‘బ్రష్’ చేయించి మెడిసిన్స్ ఇద్దామని వచ్చి లేపుతుంటే మేడం గారు లేవలేదు.వెంటనే డాక్టర్ గారిని పిలిస్తే వచ్చి చూసి…’’ ప్రాణం పోయి ఒక గంటైంది…’’ అన్నారు.
అంతే…అవతల ఏం చెబుతున్నారో… నా చేతిలో నుండి సెల్ ఎప్పుడు జారిపోయిందో తెలీదు… నా నోటి నుండి ‘మధూ….’’ అన్న ఒక్క వెర్రి కేక తప్ప.