తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష, వరంగల్ ప్రాంత ప్రజల చిరకాల డిమాండ్, రైల్వే ఉద్యోగుల నిరంతర పోరాటం, బీజేపీ నాయకుల పట్టుదల ఫలితంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ స్వప్నం సాకారమైంది. ఇప్పటివరకు కేవలం రైల్వే జంక్షన్‌గా గుర్తింపు పొందిన కాజీపేట, ఇప్పుడు దేశ రైల్వే తయారీ రంగంలో కీలక కేంద్రంగా అవతరించబోతోంది. అత్యాధునిక రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు నెలవుగా మారనుంది. రూ.716 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైల్వే రోలింగ్ స్టాక్ తయారీ యూనిట్, రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో మైలురాయిగా నిలవనుంది.
కాజీపేట పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది రైల్వే. ఇది బ్రిటిష్ కాలం నుంచే దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో అత్యంత కీలకమైన కూడలి. (రైల్వే జంక్షన్). దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ప్రాంతాలను కలిపే రైల్వే మార్గాల మధ్యలో ఉంది. హైదరాబాద్-విజయవాడ, ఢిల్లీ-చెన్నై, నాగ్‌పూర్-కాజీపేట వంటి ప్రధాన మార్గాలన్నీ ఈ కూడలి మీదుగానే వెళతాయి. ఫలితంగా లాజిస్టిక్స్ పరంగా ఇది అనువైన స్థానం. ముడిసరుకు రవాణా మొదలుకొని, తయారైన రైళ్లను పంపిణీ చేయడం వరకు అన్ని విషయాల్లోనూ కాజీపేట అనుకూలమైన భౌగోళిక స్థానంలో ఉంది. ఇక్కడి రైల్వే వర్క్‌షాప్ దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. రైల్వే నిర్వహణ, మరమ్మతులు, సాంకేతిక పనుల్లో కాజీపేటకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇలాంటి ప్రాంతంలో రైల్వే తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉంది. ముడిసరుకు రవాణా, తయారైన రైళ్ల పంపిణీ, సాంకేతిక నిపుణుల లభ్యత, రైల్వే మౌలిక వసతులు.. అన్నీ ఒకే చోట అందుబాటులో ఉండటం కాజీపేటకు ప్రత్యేక బలం.
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ ఉమ్మడి ఆంధప్రదేశ్ నాటి నుంచే ఈ వినిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో ఈ డిమాండ్ మరింత బలంగా ముందుకు వచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ అంశం చర్చల్లో నిలిచి, పార్లమెంట్‌లో పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. అయితే, అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్‌ను పెద్దగా పట్టించుకోలేదు.
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం విషయం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. రూ.716 కోట్లు కేటాయించడం మాత్రమే కాదు…ఈ యూనిట్‌కు దేశవ్యాప్తంగా సరఫరా చేయాల్సిన 200 ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ బాధ్యత అప్పగించడం అంటే.. తెలంగాణకు లభించిన అసాధారణ గౌరవంగా చెప్పుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు ఉన్నతాధికారులతో కలిసి కాజీపేట •••నిట్ నిర్మాణ పురోగతిపై నేరుగా సమీక్ష నిర్వహించారు. ఈ యూనిట్‌ను రైల్వే శాఖ దేశంలోని అత్యాధునిక తయారీ కేంద్రాల్లో ఒకటిగా అభివర్ణిస్తోంది.
అత్యాధునిక సాంకేతికత
కాజీపేటలో తయారయ్యే ఇంటర్‌సిటీ రైళ్లు భారతీయ రైల్వే ఆధునికీకరణలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఒక్కో రైలులో 20 కోచ్‌లు ఉంటాయి. గంటకు గరిష్ఠంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటాయి. దేశవ్యాప్తంగా 300 కిలోమీటర్లలోపు దూరాలను వేగంగా, సౌకర్యవంతంగా కలిపే లక్ష్యంతో ఈ రైళ్లను రూపొందిస్తారు. పట్టణాలు-నగరాల మధ్య షటిల్ సర్వీసుల మాదిరిగా పని చేస్తాయి. విద్యార్థులు, ఉద్యోగులు, ఆరోగ్య సేవల కోసం వెళ్లే సామాన్య ప్రజలకు, పండుగుల సమయంలో అధిక రద్దీని తట్టుకు నేందుకు ఇవి అత్యంత ఉపయుక్తంగా ఉంటాయి. సాంకేతికంగా ఈ రైళ్లలో చాలా విశేషాలున్నాయి. ఆటోమేటిక్ డోర్ వ్యవస్థ అంటే.. రైలు కదులుతున్న సమయంలో తలుపులు స్వయంచాలకంగా వ•సుకుపోతాయి. ఇది ప్రమాదాలను తగ్గిస్తుంది. తక్కువ కుదుపులు, తక్కువ శబ్దం, మెరుగైన వెంటిలేషన్‌తో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భద్రతా వ్యవస్థలు అమర్చనున్నారు. ప్రతి కోచ్‌లో రెండు ఆధునిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తారు. ఈ రైళ్లలో డిజిటల్ సమాచార వ్యవస్థను అందుబాటులోకి తెస్తారు. ప్రయాణికులకు స్టేషన్లు, సమయాలు, ఇతర వివరాలు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటాయి.
పర్యావరణ హితం
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థలకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో,కాజీపేటలో తయారయ్యే రైళ్లు కూడా అదే దిశగా రూపుదిద్దుకుంటాయి. రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా బ్రేకులు వేసిన సమయంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ని తిరిగి గ్రిడ్‌కు పంపుతారు. ఈ విద్యుత్ ను తిరిగి వినియోగించుకోవచ్చు. ఫలితంగా విద్యుత్ వినియోగం, నిర్వహణ ఖర్చులు, కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇది భారతీయ రైల్వే గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ రైల్వేలు గత కొన్నేళ్లుగా వేగంగా ఆధునికీకరణ దిశగా సాగుతున్నాయి. వందే భారత్, అమృత్ భారత్ స్టేషన్లు, ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు, హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు వంటి కార్యక్రమాల సరసన ఇప్పుడు కాజీపేట రైల్వే తయారీ కేంద్రం కూడా చేరింది. ఈ యూనిట్‌లో రాబోయే ఐదేళ్లలో 200 ఆధునిక ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించడం, కాజీపేటకు దేశీయ రైల్వే రంగంలో ఎంత కీలకమైన స్థానం లభించిందో స్పష్టం చేస్తోంది. ఇది కేవలం ఒక పరిశ్రమే కాదు… తెలంగాణ ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన, పారిశ్రామిక విస్తరణ, సాంకేతిక పురోగతి, ప్రాంతీయ సమతుల అభివృద్ధికి కేంద్రంగా మారబోయే ఒక మహత్తర ప్రాజెక్టు.
ఈ యూనిట్ విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని విభాగాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కోచ్ ఆధునికీ కరణ కేంద్రాలు, హైస్పీడ్ రైలు భాగాల తయారీ, ఎలక్ట్రిక్ రైలు సాంకేతిక యూనిట్లు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ సంస్థలు స్థాపించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కాజీపేట దేశంలోని ప్రముఖ రైల్వే పారిశ్రామిక నగరాల్లో ఒకటిగా ఎదిగేందుకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
ఇప్పటివరకు వరంగల్‌ను కాకతీయుల చరిత్ర, విద్యా కేంద్రం, సాంస్కృతిక వారసత్వం, వ్యవసాయ ప్రాంతంగా గుర్తించేవారు. కానీ.. రాబోయే రోజుల్లో.. దీనిని రైల్వే తయారీ కేంద్రం, ఇంజినీరింగ్ హబ్, పారిశ్రామిక పెట్టుబడుల కేంద్రం, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి కేంద్రం వంటి కొత్త గుర్తింపులు కూడా జత కానున్నాయి.
రాష్ట్ర ఆర్థిక రంగానికి ఊతం
కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ కేవలం రైళ్లు తయారు చేయడానికి మాత్రమే పరిమితం కాదు. స్థానికులకు, అలాగే, నిపుణులకు ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. ఇంజినీర్లు, టెక్నీషియన్లు, వెల్డర్లు, మెకానికల్ సిబ్బంది, పరిపాలనా ఉద్యోగులు వంటి వందలాది మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. అంతేకాకుండా, అనుబంధ పరిశ్రమలు, ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్, హోటళ్లు, సేవా రంగాలు అభివృద్ధి చెందడంతో వేలాది మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. రైల్వే భాగాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, లోహ ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్ సేవలు అందించే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పెద్ద మార్కెట్ లభిస్తుంది. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది.ప్రాంతీయ అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. వరంగల్ – హన్మకొండ – కాజీపేట ట్రైసిటీ ప్రాంతం కొత్త పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి చరిత్రలో, వరంగల్ ప్రాంత ఆర్థిక పురోగతిలో, భారతీయ రైల్వే ఆధునికీకరణలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిపోనుంది.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం
కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు ఏర్పాటు శుభవార్తపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ యూనిట్‌కు 200 ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ బాధ్యత అప్పగించడం తెలంగాణకు గొప్ప గౌరవమని సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
జూ‘రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకారం అందిస్తుంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు. అది తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షకు ప్రతీక. కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ అద్భుతమైన అవకాశం, తెలంగాణను జాతీయ రైల్వే తయారీ మ్యాప్‌లో శాశ్వతంగా నిలిపే చారిత్రక మైలురాయి’ అని కిషన్ రెడ్డి అభివర్ణించారు.