శతాబ్దాలుగా హిందువులకు జరుగుతున్న అన్యాయానికి మధ్యప్రదేశ్‌ ‌హైకోర్టు తెరదింపుతూ భోజ్‌శాల తీర్పు వెలువరించింది. ధార్‌ ‌నగరంలోని కమాల్‌ ‌మౌలా కాంప్లెక్స్ ‌ముమ్మాటికీ వాగ్దేవీ ఆలయమనీ, సంస్కృత విద్యా కేంద్రమని తీర్పులో స్పష్టం చేసింది. పరమార్‌ ‌రాజవంశీకుడైన భోజరాజుకు చెందినదిగా న్యాయస్థానం తేల్చింది. భారత పురావస్తు శాఖ (ఎఎన్‌ఐ) ‌సమర్పించిన ఆధారాలను పరిశీలించిన హైకోర్టు భోజ్‌శాలపై తీర్పు ఇచ్చింది. గతంలో హైకోర్టు ఆదేశాలతో పురావస్తు శాఖ భోజ్‌శాల ప్రాంతంలో పరిశోధనలు చేసింది. సరస్వతీదేవి ఆలయాన్ని సాధారణ శకం 1034లో నిర్మించినట్టు ఆధారాలున్నాయని, ముస్లిం దండయాత్రల సమయంలో మసీదుగా మార్చినట్టు న్యాయస్థానం స్పష్టం చేసింది.

తీర్పు సందర్భంగా న్యాయస్థానం కొన్ని కీలక పరిశీలనలు చేసింది. ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకున్నా… హిందువులు మొక్కవోని దీక్షతో తమ విశ్వాసాలను కాపాడుకుంటూ దైవారాధన చేశారని కోర్టు పేర్కొంది. భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నందున, ఆర్కియలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా నిబంధనలు ఉంటాయి కాబట్టి, భోజ్‌శాల విషయంలో ప్రార్థనా స్థలాల చట్టం-1991 వర్తించదని తేల్చి చెప్పింది.

భారత రాజ్యాంగంలోని 25,26 అధికరణాల ప్రకారం ప్రభుత్వానికి హిందువుల విశ్వాసాలను, దైవారాధనను కాపాడే బాధ్యత ఉంటుందని తెలిపింది. రామజన్మభూమి విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వల్ల భోజ్‌శాల విషయంలో హిందువుల వాదనకు బలం చేకూరింది. 2003 ఏప్రిల్‌లో ముస్లింలకు శుక్రవారం నమాజ్‌ ‌చేసుకోవచ్చంటూ ఏఎస్‌ఐ ఇచ్చిన ఉత్తర్వులను సైతం హైకోర్టు తీర్పు సందర్భంగా రద్దు చేసింది.

తాను భోజ్‌శాల-కమాల్‌ ‌మౌలా మసీదు ప్రాంగణంపై కేవలం యాజమాన్య హక్కుల కోసం కోరడం లేదని, భోజ్‌శాలలో దైవారాధన చేసుకునే హక్కు కేవలం హిందువులకు ఉందని, భోజ్‌శాల ప్రాంగణంలో ముస్లింలు మతపరమైన కార్యక్రమాల కోసం ఉపయోగించుకోవడానికిగాని, ప్రార్థనలు చేసుకోవడానికిగాని హక్కులేదని పిటిషనర్‌ ‌కోర్టుకు తెలిపారు.

రాజ్యాంగంలోని 25వ అధికరణం ప్రకారం మతపరమైన హక్కును, సాంస్కృతిక వారసత్వ సంపదను కాపాడే 29వ అధికరణాన్ని భోజ్‌శాల విషయంలో అమలు చేయాలని పిటిషనర్‌ ‌న్యాయ స్థానానికి విన్నవించారు. సాధారణ శకం 1034లో ఆలయాన్ని నిర్మాణ ప్రధాన ఉద్దేశం, సంస్కృత విద్యను, సాహిత్యాన్ని, వ్యాకరణాన్ని నేర్పడం, జ్యోతిశ్శాస్త్రం, ఖగోళం సహా వేద విద్యను ప్రోత్సహించడమే భోజరాజు లక్ష్యమని పిటిషనర్‌ ‌కోర్టుకు తెలిపారు. సరస్వతీదేవి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

భోజ్‌శాల ఆలయం, సంస్కృత పాఠశాల పాలన, నిర్వహణ కోసం ప్రభుత్వం ఓ ట్రస్టును ఏర్పాటు చేయాలని, భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా పిటిషనర్‌ ‌హైకోర్టును కోరారు. ప్రాచీన, పురావస్తు సంపద రక్షణ చట్టం-1958 ప్రకారం చర్యలకు ఆదేశించా లని పిటిషనర్‌ ‌హైకోర్టుకు విన్నవించారు.

హిందువుల ప్రధాన అభ్యంతరాలుః

ముస్లిం రాజుల దండయాత్రల కాలంలో వాగ్దేవీ రూపంలో కొలువైన సరస్వతీ అమ్మవారి ఆలయ విధ్వంసం హిందూ భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపరిచింది. రాజ్యాంగంలోని అధికరణం 13(1) ప్రకారం హిందువుల ధార్మిక జీవనాన్ని పరిరక్షించాలి. విగ్రహ ఆరాధనను ద్వేషించే ముస్లిం పాలకుల దండయాత్రలు, దాడుల వ•లంగా హిందువులు సుమారు 7 శతాబ్దాలుగా నిత్యం గాయపడుతూనే ఉన్నారు. ఆలయ ప్రాంగణాన్ని అన్యాక్రాంతం చేసుకుని మసీదుగా మార్చుకున్నా, శుక్రవారం ప్రార్థనలకు అనుమతి కోరినా ప్రభుత్వం అంగీకరించడం అన్యాయం.

అధికరణం 51(•) ప్రకారం భారతదేశ ప్రాచీన సాంస్కృతిక సంపద పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. 25వ అధికరణంతో సంబంధం లేకుండా దీన్ని అనువర్తింపచేయాలి.

భారత ఉప ఖండంపై దాడి చేసిన ముస్లీం దురాక్రమణదారులు భోజ్‌శాలతో పాటు వేలకొద్ది ఆలయ సంపదను ధ్వంసం చేసి హిందువుల ధార్మిక విశ్వాసాలను గాయపరిచారు. అల్లావుద్దీన్‌ ‌ఖిల్జీ భోజ్‌శాలపై తొలిదాడి చేశారు. సుమారు 12వందల మంది సంస్కృత విద్యార్థులు, ఉపాధ్యాయులు ఖిల్జీ దండయాత్రలో మతమార్పిడిని తిరస్కరించడంతో హత్యకు గురయ్యారు.

హిందూ రాజైన మహల్‌ ‌దేవ్‌ ‌ముస్లిం దురాక్రమణదారులతో వీరోచితంగా పోరాడి యుద్ధభూమిలో ప్రాణార్పణ చేశారు. ఈ దాడి తర్వాత భోజ్‌శాల ప్రాంగణంలోని ఓ భాగాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని, దేవీదేవతల విగ్రహాలను ధ్వంసం చేశారు. 1401లో దిలావర్‌ ‌ఖాన్‌ ‌సరస్వతీ మాత ఆలయాన్ని మసీదుగా మార్చే ప్రయత్నం చేసి ఘోరంగా విఫలమయ్యాడు. 1514లో మరోసారి భోజ్‌శాలపై పెద్ద ఎత్తున దాడి జరిగింది. సరిగ్గా ఈ సమయంలోనే వాగ్దేవీ అమ్మవారి ఆలయం స్థానంలో ఓ సమాధి వంటి స్మారకాన్ని నిర్మించారు.

బ్రిటీష్‌ ‌పాలన ఉచ్ఛదశలో ఉన్న సమయంలో 1875లో మేజర్‌ ‌జనరల్‌ ‌విలియం కిన్‌ ‌కెయిడ్‌ ‌భోజ్‌శాల ప్రాంగణంలో తవ్వకాలు జరిపించి, ముస్లిం రాజులు భూమట్టం చేసిన వాగ్దేవీ అమ్మవారి విగ్రహాలను వెలికితీశారు. 1903లో లార్డ్ ‌కర్జన్‌ ‌సరస్వతీ అమ్మవారి విగ్రహాన్ని ఇంగ్లాండ్‌కు బట్వాడా చేశారు. వాగ్దేవీ విగ్రహంతో పాటు సరస్వతీ అమ్మవారి మరో రూపమైన అంబ విగ్రహం కూడా లండన్‌ ‌వ్యజియంలో ఉంది.

2024 మార్చిలో మధ్యప్రదేశ్‌ ‌హైకోర్టు ఆదేశాలతో భోజ్‌శాల ప్రాంగణంలో ఆర్కియలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా శాస్త్రీయ పద్ధతిలో పరిశోధనలు, తవ్వకాలు జరిపింది. శాస్త్రీయ, పురావస్తు ఆధారాలను హైకోర్టుకు సమర్పించింది. భోజ్‌శాల ప్రాంగణంలో వ•డు తరహాల నిర్మాణ శైలిని ఏఎస్‌ఐ ‌గమనించింది. ప్రస్తుతం భోజ్‌శాలలో నిర్మాణ శైలి చిట్టచివరదిగా ఏఎస్‌ఐ ‌పేర్కొంది.

అంతకు ముందున్న నిర్మాణాన్ని ధ్వంసం చేసిన తర్వాత చివరిసారిగా నిర్మించినట్టు ఏఎస్‌ఐ ‌తేల్చింది. అయితే నిశితంగా పరిశోధన చేస్తే గత నిర్మాణ శైలులు సైతం భోజ్‌శాల ప్రాంతంలో కనిపిస్తాయని ఏఎస్‌ఐ ‌హైకోర్టుకు సమర్పించిన పరిశోధనా పత్రాల్లో వివరించింది. ఆలయ ఆనవాళ్లు కనపడకుండా పటిష్ఠమైన బేస్‌మెంట్‌లను ఏర్పాటు చేసినట్టు ఏఎస్‌ఐ ‌తెలిపింది.

పురావస్తు శాఖ తన పరిశోధనల క్రమంలో కనుగొన్న కళాకృతుల ఆధారంగా భోజ్‌శాల నిర్మాణం పరమార రాజవంశీకులు 10-11 శతాబ్దాల్లో నిర్మించినట్టు ఒక అంచనాకు వచ్చింది. స్తంభాల నిర్మాణ శైలిని చూస్తే అత్యంత ప్రాచీనమైనవిగా తేల్చింది. ప్రాచీన స్థపతులు చెక్కిన విగ్రహాలను ధ్వంసం చేసినట్టుగా ఏఎస్‌ఐ ‌తేల్చింది.

గణపతి, బ్రహ్మ, నరసింహ అవతారం, భైరవుడు వంటి దేవీదేవతల విగ్రహాలు, దేవతల సమక్షంలో ఉండే సింహం, ఏనుగు, అశ్వం, వానరం, హంస, సర్పం వంటి విగ్రహాలను సైతం దురాక్రమణ క్రమంలో ధ్వంసం చేసినట్టు ఆర్కియలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా కనుగొంది. భారతీయ ఆలయ నిర్మాణ శైలిలో కనిపించే కీర్తిముఖ ఆకారాలు సైతం భోజ్‌శాల ప్రాంగణంలో కనిపించాయని ఏఎస్‌ఐ ‌తన పరిశోధనలో తేల్చింది.

భోజ్‌శాల ఆలయ ప్రాంగణంలో తూర్పు, పశ్చిమ ద్వారాలను నిశితంగా పరిశీలిస్తే అవి ధ్వంసమైన తీరు కనిపిస్తుందని కూడా పురావస్తు శాఖ స్పష్టం చేసింది. ఆలయ తూర్పు భాగంలోని స్తంభంపై ప్రాకృత భాషలో రెండు పద్యాలు కనిపిస్తాయి. 109 వాక్యాల ఈ ప్రాకృత పద్యాలు భోజరాజు కాలంలో జరిగిన సంస్కృత బోధనను రూఢీ చేస్తాయి.

పురావస్తు శాఖ పరిశోధనలు నిష్పాక్షికంగా ఉన్నాయని మధ్యప్రదేశ్‌ ‌హైకోర్టు విశ్వసించింది. పరిశోధనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘భోజ్‌శాలను సరస్వతి అమ్మవారి ఆలయంగా అంగీకరించక పోవడం అర్థరహితం’ అంటూ తీర్పులో వ్యాఖ్యా నించింది. హిందూ ఆగమాల ప్రకారం ఒక్కసారి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత…విగ్రహ విధ్వంసం జరిగినా ఆ స్థలానికి ఉండే ధార్మిక ప్రాధాన్యత పోదనే పిటిషనర్‌ ‌వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. ‘ప్రాణప్రతిష్ఠ’’ అనేది హిందువుల ఆలయ ఆరంభ ఘట్టాల్లో అత్యంత పవిత్రమైంది.

పురావస్తు శాఖ సమర్పించిన చారిత్రక, ప్రాచీన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం..అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును ప్రాతిపదికగా చేసుకుని తీర్పు వెలువరించింది. పురావస్తు పరిశోధన అనేది బహుముఖీనమైన, శాస్త్రీయ పరిశోధన కాబట్టి ఏఎస్‌ఐ ఆధారాలను పునాదిగా చేసుకుంటున్నట్టు హైకోర్టు తీర్పు సందర్భంగా చెప్పింది. ప్రాథమిక హక్కులకు హామీ పడే రాజ్యాంగంలోని  25,26 అధికరణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటు న్నట్టు తీర్పులో స్పష్టం చేసింది. చారిత్రక, ప్రాచీన ప్రాధాన్యత గల నిర్మాణాలనే కాదు ఆలయాలను కూడా సంరక్షించడం ప్రభుత్వాల బాధ్యత అని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఆలయాన్ని సందర్శించే భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించడం, శాంతి భద్రతలను పరిరక్షించడం వంటి పనులు ప్రభుత్వాలు విధిగా చేయాలని సూచించింది. ఏఎస్‌ఐ ‌సమర్పించిన చారిత్రక, సాహిత్య ఆధారాలను పరిశీలించిన తర్వాత భోజరాజు స్థాపించిన సంస్కృత విద్యాపీఠంగా భావిస్తున్నామని న్యాయస్థానం తేల్చింది. ఇకపై ఆర్కియలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా (ఎఎన్‌ఐ) ఆధ్వర్యంలోనే భోజ్‌శాల నిర్వహణ ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. లండన్‌ ‌వ్యజియంలోని సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని తిరిగి తెచ్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని సూచించింది. వేరే చోట మసీదును నిర్మించు కునేందుకు ముస్లింలకు స్థలం ఇవ్వాలని కూడా న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఎ. ‌సూర్యప్రకాశ్‌
‌మాజీ చైర్మన్‌, ‌ప్రసారభారతి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE