సంపాదకీయం
శాలివాహన 1948 శ్రీ పరాభవ అధిక జ్యేష్ఠ బహుళ అష్టమి – 08 జూన్ 2026, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
ఎన్నికల కమిషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఓటర్ల జాబితా సమగ్ర సవరణ-సర్’’ పక్రియపై దేశ సర్వోన్నత న్యాయస్థానం మే 27న సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల కమిషన్ చట్ట బద్ధతపై, ‘సర్’ పక్రియ నిర్వహణపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు ఓటర్ల జాబితా సవరణపై ఈసీకి సర్వహక్కులు ఉన్నాయని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాలా బాగ్జీ ధర్మాసనం స్పష్టం చేసింది.
‘సర్’’ను సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లనూ కొట్టివేసిన సుప్రీం కోర్టు స్వేచ్చాయుత, పారదర్శక, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణే ధ్యేయంగా ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయాలు చట్టబద్ధమేనని తీర్పులో పేర్కొంది. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ చివరకు ఓట్ల లెక్కింపు సిబ్బంది నియామకాన్ని సైతం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. కేంద్ర ప్రభుత్వ సిబ్బందిని ఎలా నియమిస్తారంటూ వాదించింది. సుప్రీం కోర్టు మమతా బెనర్జీ వాదనలను తోసిపుచ్చింది. సిబ్బంది నియామకం పూర్తిగా ఎన్నికల కమిషన్ విచక్షణే అని తీర్పులో స్పష్టం చేసింది.
సర్ పక్రియలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో సుమారు 90 లక్షల అక్రమ ఓటర్లను ఈసీ తొలగించింది. బిహార్‌లో రమారమి 69లక్షలమంది ఓటర్లను, కేరళలో 53 లక్షల ఓటర్లను తొలగించింది. దీంతో దేశంలోని విపక్షాల పార్టీలతో పాటు వామపక్ష మేధావులు ‘సర్’ పక్రియపై అనుమానాలు లేవనెత్తారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ చట్టబద్ధతను సవాలు చేస్తూ… నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి.
1960ల నాటి ప్రాతినిథ్య చట్టాన్ని ఈసీ ఉల్లంఘిస్తోందంటూ పిటిషనర్లు వాదించారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం ఈ వాదనలను తోసిపుచ్చింది. బిహార్, బెంగాల్లో విపక్షా పార్టీలకు ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లిం ఓటర్ల ఏరివేతే లక్ష్యంగా ఇది సాగిందన్నది ప్రధానమైన విమర్శ. గడచిన దశాబ్ద కాలంగా ఎన్నికల కమిషన్ పై, ఎన్నికల నిర్వహణ, విశ్వసనీయత, పారదర్శకతపై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పునకు ప్రాధాన్యత ఏర్పడింది.
ఏటా జరిగే ఓటర్ జాబితా సవరణకంటే సర్ భిన్నంగా ఉన్నంత మాత్రాన దానిని వద్దనలేమని, మొదట్లో ఎక్కువమంది ఓటర్లను తొలగించినట్టుగా సర్ కనిపిస్తుంది కానీ, తగిన రక్షణచర్యలతో దీనిని రాజ్యాంగబద్ధంగా నిర్వహించవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. ఆధార్, ఓటరు కార్డు తిరస్కరణ సహా అర్హత పత్రాల నిర్ణయంలో ఈసీ అధికారాలను కోర్టు పూర్తిగా సమర్థించడం విశేషం.
‘సర్’ రాజ్యాంగబద్ధం, దానిని నిర్వహించే హక్కు, అధికారం ఈసీకి ఉన్నాయి, అది ఏ చట్టాలనూ అతిక్రమించలేదు, రాష్ట్రాల్లో ‘సర్’ నిర్వహణ ఆవశ్యకత ఉందన్న ఈసీ వాదన సమర్థనీయం, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరగాలన్న రాజ్యాంగ ఆదేశాలను, ఆకాంక్షలను సర్ నెరవేరుస్తుంది అంటూ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాలా బాగ్జీ ధర్మాసనం తమ నూటపాతిక పేజీల తీర్పులో నిర్ధారించింది.
ఎన్నికల కమిషన్‌పై ఇటీవలి కాలంలో అనేక వివాదాలు తలెత్తాయి. ఎన్నికల కమిషనర్, కమిషనర్ల నియామక పక్రియపై సైతం సుప్రీం కోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. బిహార్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను విచారించిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
పదహారు రాష్ట్రాలు, వ•డు కేంద్రపాలిత ప్రాంతాల్లో వ•డోవిడత ‘సర్’’కు ఉపక్రమిస్తున్న తరుణంలో, జాబితాల ప్రక్షాళన విషయంలో ఎన్నికల సంఘానికి ఈ తీర్పు సర్వాధికారాలనూ దఖలుపరిచింది. బిహార్లో చేపట్టిన ‘సర్’’ సరిగ్గానే ఉందని కోర్టు నిర్ధారించిన నేపథ్యంలో ఇక దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ పక్రియ అమలు చేయడంలో ఈసీకి ఏ అడ్డంకులూ ఉండబోవు.
ఓటరు జాబితాలో పేరు లేనంతమాత్రాన పౌరసత్వం కోల్పోయినట్టు కాదని కూడా సుప్రీం తన తీర్పులో భరోసా ఇచ్చింది. దేశ పౌరులు కాదన్న అనుమానంతో రెండు దశాబ్దాల నాటి ఆ జాబితాల నుంచి తొలగించిన వ్యక్తులపేర్లను నాలుగు వారాల్లోగా పౌరసత్వాన్ని నిర్ధారించే యంత్రాంగానికి పంపించాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. ఓటరు జాబితాలో తీసివేతలు, చేరికలను నిర్ణయించే పరిధి మాత్రమే ఎన్నికల సంఘానిది కానీ, పౌరసత్వాన్ని మాత్రం అది నిర్ధారించలేదన్నది దీని సారాంశం.
ఇదే ధర్మాసనం గతేడాది ఆగస్టులో ఆధార్ సాధికారతపై సైతం తీర్పు వెలువరించింది. ఎన్నికల కమిషన్ ఆధార్ కార్డును పౌరసత్వ రుజువుగా అంగీకరించకపోవడం సరైనదేనని కోర్టు సమర్థించింది. ఆధార్ కార్డు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సేవలు పొందేందుకు గుర్తింపు డాక్యుమెంట్‌గా ఉపయోగపడుతుంది.. కానీ ఇది ఒక వ్యక్తి జాతీయతను నిర్ధారించే సాక్ష్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. మొత్తంగా ఇటీవలి కాలంలో రాజ్యాంగబద్ధ సంస్థలపై, వాటి సాధికారత, నిష్పాక్షికత, పారదర్శకత, విశ్వసనీయతపై రాజకీయ పార్టీలు, సంస్థలు అనేక ప్రశ్నలు సంధిస్తున్న నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు సర్ పక్రియ నిర్వహణపై అనుమానా లను నివృత్తి చేస్తూ..స్పష్టమైన తీర్పు వెలువరించడం ముదావహం.