‘‘‌పడగొట్టేది కాదు నిలబెట్టేది భాష విడగొట్టేది కాదు కలిపి కుట్టేది భాష’’ (సి.నారె). ‘‘శబ్దమనే పేరు గల ఈ తేజస్సు సృష్టి ప్రారంభం నుండి ప్రకాశించ కున్నట్లయితే ఈ సమస్తమైన లోకత్రయం కటిక చీకటిగా అయి ఉండేది’’ (దండి కావ్య దర్శనం). ‘వాక్కు సర్వ ప్రాధాన్యం కలది. వాక్కు లేనిచో సృష్టి లేదు. మనోభావములు చెప్పలేము. చెప్పలేనిచో పశువులము.మనలను పశువులుగా నుండనీయని దేవత సరస్వతి. ఆమె మనకు వాక్కును ప్రసాదించుచున్నది. ప్రధానంగా రెండే కనిపిస్తున్నవి. లోనున్న శక్తి, వెలికి వచ్చెడు మాట, మూడవది యింకొకటి యేమియును లేదు. సర్వదేవతలు ఈ రెండు శక్తుల యొక్క విభాగములే. మనుష్యుడు-మాట, ఈ రెంటి తరువాత ప్రపంచకమున్నది. సృష్టియున్నది’’ అని విశ్వనాథ• తన సాహిత్య సురభిలో అంటారు.

మన భావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగించే ప్రధాన సాధనం భాష. శాస్త్రాలన్నిటికీ మూలం భాష. శాస్త్రాభ్యాసానికి, కళాసాధనకూ ముఖ్యసాధనం భాష. వర్ణించడంలో నైపుణ్యం కలవాడు కవి. రస భావాలను చక్కగా పరిశీలించే వాడు కవి కాబట్టి ఆతని వర్ణన హృద్యంగా ఉంటుంది. ఆ వర్ణనకు సహృదయ పాఠకుడు ఆనందిస్తాడు. కవిత్వం ఒక కళ, అందాన్ని కొలిచేది, జీవితాన్ని శోభాయమానం చేసేది, నేర్పుతో చేసేది కళ. ‘దేవతలను మాట్లాడమని అడిగితే ఇంగ్లిషులోనే మాట్లాడతారు’(If angels are asked to speak, they speak poetry) అని ఒక ఆంగ్లకవి అన్నాడు.

జగన్నాథ పండితరాయలు తన రసగంగా ధరంలో ‘‘రమణీయమైన అర్థాన్ని ప్రతిపాదించే శబ్దం కావ్యం’’ అన్నారు. కవిత్వం సౌందర్యం లయబద్ధ్దమైన సృష్టి అన్నాడు ఎడ్గర్‌ ఎలన్‌ ‌పో అనే అమెరికన్‌ ‌రచయిత. కావ్యం ఎందుకు చదవాలి? అని ప్రశ్నించే వాళ్లకు, మమ్మూటాచార్యుడు తన కావ్య ప్రకాశములో..‘కావ్యం యశసేర్థకృతే వ్యవహారనిదే శివేతరక్షతయే సద్యః పర నిర్వ్రతయే కాంతా సంమిత తమోదేశయుజే’’ అని కావ్య ప్రయోజనాలను చెప్పాడు.

కవి కావ్యంలో విభిన్న పాత్రలను సృజించడం ద్వారా మానవుడు ఎలా ప్రవర్తించాలో తెలుపుతాడు. కావ్యాలలో మహాపురుషుల చరిత్రలను కవి వర్ణిస్తాడు. ఆ వర్ణన చదువుతున్నప్పుడు పాఠకులకు వ్యవహార జ్ఞానం కలుగుతుంది. “There are more men ennobled by study than by nature” పుట్టుకతో కంటే అధ్యయనం వలన ఉదాత్తీకరించబడ్డ వాళ్లే అనేకులు అన్నాడు సిసిరో (Iron sharpens Iron Scholar the Scholar) కావ్యం పాఠకులను సంస్కరిస్తుంది. వారిపై ప్రభావాన్ని చూపుతుంది.

కావ్యం వలన ఉపదేశం, హితోపదేశం కలుగుతాయి. ప్రియురాలు ప్రియుని మనస్సు నొప్పించకుండా సుకుమారమైన హావభావాలతో తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చమత్కారంగా ఆనందదాయకంగా, ‘శ్రీరామునిలా ఉండాలి కాని, రావణుని లా కాదు’ అని హితబోధ చేసి సన్మార్గంలో నడిచేటట్టు చేస్తుంది.

‘‘సుతజల పూరితంబులగు నూతులు నూఱి•టికంటే సూనృత / వ్రత! మొక బావి మేలు, మఱి బావులు నూఱిటికంటె నొక్క స త్క్రతువది మేలు, తత్క్రతు శతంబున కంటె సుతుండ మేలు; త / త్చత శతకంబు కంటెనొక సూనృత వాక్యము మేలు సూడగన్‌.’’

(ఆం‌ధ్ర మహాభారతం-ఆది పర్వం 4-94)

దుష్యంతుడు శకుంతలను నిరాకరించినప్పుడు అతనికి ధర్మ ప్రభోదం చేస్తూ, సత్యవాక్యం గొప్పతనాన్ని వివరిస్తుంది. ‘‘సత్యవ్రతం గల ఓ రాజా! మంచినీళ్లున్న నూతులు నూరు కంటే ఒక బావి మేలు, నూరు బావులకంటే ఒక యజ్ఞం మేలు. అలాంటి నూరు యజ్ఞాల కంటే ఒక పుత్రుడు మేలు, అట్టి నూరుగురు పుత్రులకంటే ఒక సత్యవాక్యం మేలు’’ అని శకుంతలోపాఖ్యానంలో ఈ పద్యం తాత్పర్యం.

కనుగొని కోపవేగమున గన్నుల నిప్పులురాల, సంగము / లనలంగ సాంద్ర ఘర్మసలిలమ్ములు గ్రమ్మ నితాంత దంతపీ డన రట దాస్యరంగ వికట భ్రుకుటీచటుల ప్రవృత న / ర్తన ఘటనా ప్రకార భయద స్పురణా పరిణద్దమూర్తియై

(విరాటపర్వం ద్వితీయ-133)

విరాటుని కొలువులో ద్రౌపదికి జరిగిన అవమానాన్ని, కీచకుని పొగరు బోతుతనాన్ని చూసిన భీముని మనస్సులో కోపం తీవ్రంగా రేగడం వల్ల అతని కళ్ల నించి నిప్పులు రాలాయి.ఒళ్ల్లంతా ఉడికి పోయింది.దట్టంగా చెమట చుక్కలు కమ్ముకున్నాయి. కోపంతో పళ్లు పటపటమనే ధ్వనులు. భీముని కోపాతిశయాన్ని ప్రదర్శించే ఈ పద్యం చదివితే రసానందం కలుగుతుంది.

 ఎరాప్రగడ,సరస్వతీదేవికి నమస్కరించి ఆమెను స్తుతిస్తూ రాసిన పద్యం.

‘‘అంబ! నవాంబు జోజ్జ్వల కరాంబుజ శారదచంద్ర చంద్రికా / డంబర చారుమూర్తి! ప్రకటస్పుట భూషణరత్నరోచిరా చుంభిత దిగ్విభాగ! శ్రుతి సూక్త వివిక్త నిజప్రభావభా / వాంబర వీది విశ్రుత విహారి! ననుంగ్రుపజూడు భారతీ

(ఆంధ్రమహా భారతం అరణ్య 4-215)

‘అమ్మా సరస్వతిదేవీ. కొత్త పద్మాలలాగా ప్రకాశించే చేతులు గలదానా, శరత్కాలంలోని వెన్నెల వెలుగువలె మిలమిలలాడే మనోహరమైన ఆకారంగల దానా, దిగ్దింతాల వరకు కాంతులు వెల్లివిరియజేసే రత్నభూషణలు కలదానా, వేదాలలోని సూక్తులలో చక్కగా వెల్లడించబడిన మహిమ కలదానా, భావాలు అనే ఆకాశవీధుల్లో ప్రశస్త రీతిలో విహరించేదానా నన్ను దయతో చూడు’’ అని దీని తాత్పర్యం.

శ్రీకృష్ణ దేవరాయలు తమ ఆమూక్తమాల్యద’ (విష్ణుచిత్తీయము) ప్రబంధంలో…

‘‘తెలుగదేల యన్న? దేశంబు తెలుగేను

తెలుగు వల్లభుండ దెలుగొకండ

యెల్ల నృపులు గొలువ నెరుగవేబాసాడి

దేశ భాషలందు దెలుగు లెస్స’’..అన్నాడు.

‘ప్రబంధాన్ని తెలుగులో ఎందుకు రాస్తున్నావు’ అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం అది.

ఆధునిక యుగకర్తలలో ఒకరైన గురజాడ అప్పారావు…

‘మంచి చెడ్డలు మనుజులందున

ఎంచి చూడగ రెండె కులములు

మంచి యన్నది మాలయైతే

మాల నేనగుదున్‌ (‌లవణరాజు కల)అనే ముత్యాలసరం గేయం, గురజాడ సంఘ సంస్కరణ దృష్టికి ఉదాహరణ

మరో యుగకర్త రాయప్రోలు సుబ్బారావు రాసిన..

‘‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా

ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా

పొగడరా నీతల్లి భూమి భారతిని

నిలుపరా నీ జాతి నిడు గౌరవము’’ వంటి గేయాలు జాతీయ భావాన్ని రేకెత్తించాయి.

తెలుగు భాష, తెలుగు జాతి, తెలుగుదేశం గర్వించగల మహాకవి, కవి సమ్రాట్‌ ‌విశ్వనాథ సత్యనారాయణ. తెలుగులోజ్ఞానపీఠ పురస్కార ప్రథ•మ గ్రహీత.

‘‘అంతగా నోటితో నందుము వ్రాయుదు

మంతగా నంతందమైన భాష

భాసించు వారి యుచ్ఛ్వాస నిశ్వాసముల్‌

‌వెలయించి యాయువు పెంచు భాష

పలు మాటలయ్యు సవ్వడి చేత జనముల

శీలమ్ము సవరించు మేలి భాష

చెట్ట యెంతగ పాడు చేయ నెంచిన

నైన నావంత మొక్కవోనట్టి భాష…..’’ పలుకులు మన భాష ఉన్నతిని, మాధుర్యాన్ని చాటిచెబు తున్నాయి.

‘‘భరత ఖండంబు చక్కని పాడియావు

హిందువులు లేగదూడలై యేడ్చుచుండ

తెల్లవారను గడుసరి గొల్లవారు

పితుకు చున్నారు మూతులు బిగియగట్టి’’

 తెలుగు సాహిత్యంలో ప్రసిద్దులైన దేశభక్త కవి చిలకమర్తి లక్ష్మీ నరసింహరావు రాసిన ప్రఖ్యాత పద్యమిది. 1905లో బెంగాలు విభజన అనంతరం బిపిన్‌ ‌చంద్రపాల్‌ ‌రాజమండ్రిలో పర్యటన సందర్భంగా సభలో ఆయన ఈ పద్యాన్ని సభలో చదివారు.

‘‘ప్రతీ మనిషీ నడిచే దైవం

ప్రతీ పులుగూ ఎగిరే దైవం.

అడుగడుగున గుడి ఉంది

అందరిలో గుడి వుంది’’ దేవులపల్లి కృష్ణశాస్త్రి గేయమది.

అభ్యుదయ కవి శ్రీశ్రీ….

‘‘ఊరుకుంటానా నేను / కసిగా కసాయిగా-

ఉపద్రవంలాగ ఉవ్వెత్తుగ లేచి …. సాయుధ విప్లవ బీభత్ససారథి•నై/ భారత కురుక్షేత్రంలో / నవయుగ భగవద్గీతా ఝుంఝుని ప్రసరిస్తాను / మంటలచేత మాట్లాడించి-రక్తం చేత రాగాలాపన చేయిస్తాను’’ (ఝంఝ).

ఆధునికాంధ్రా కవిత్వంలో వచన కవితా పితామహుడు కుందుర్తి ఆంజనేయులు..

ప్రయోజనం తండ్రిగా

పరమసౌందర్యం తల్లిగా

పలికే ప్రతీవాక్కు రసానంద కల్పవల్లిగా

నాదారినాది.

దీనిలో ‘‘పరమ సౌందర్యం’’ అనే సమాసం కవిత్వం ఆనందాన్ని అందిచాలనే విషయం చెపుతున్నది ‘‘నాదారి నాది’’ అనే పంక్తి సృజనాత్మకతను సూచిస్తున్నది.

‘ఓ నిజాము పిశాచమా! కానరాదు

నిన్ను బోలిన రాజు మాకెన్నడేని

తీగలను తెంపి అగ్నిలో దింపినావు

నా తెలంగాణ కోటి రతనాల వీణ’ (అగ్నిధార).

కవిసింహం డా।। దాశరథి పలికిన పల్కులివి. దానివలన జనంలో కలిగిన చైతన్యమే స్వేచ్ఛా సిద్ధికి దోహదం చేసింది.

‘‘ఆరబోని దివ్వె నీవు వెలిగించాలి

వాడబోని తోట నీవు మొలిపించాలి

జాతి కొరకు నీ తనువును అర్పించేసి

చావును నీ బ్రతుకు నుండి తొలగించాలి’’ (దాశరథి రుబాయి)

 జ్ఞానపీఠ పురస్కార గ్రహీతశ్రీ సి.నారాయణరెడ్డి గారు వ్రాసిన కవిత ఇది.

ఏది చూసినా లోతును ఇట్టే పసికట్టాలి

ఏది గీసినా కంటిని ఇట్టే చరపట్టాలి

ఏదో పరవాలేదని ఎందుకు ఆ గిట్టింపు

ఏది రాసినా గుండెను ఇట్టే గిలకొట్టాలి

ఏది చేసినా లోకం ఇట్టే జై కొట్టాలి (ప్రపంచ పదులు)

సాహిత్యం చదివితే హృదయాలూ మరింత సుందరంగా మధురంగా గంభీరంగా విశాలంగా ఉన్నతంగా వెలుగుతాయి. ఇంతకంటే లాభం ఏం కావాలి? చదివిన వాళ్లు విద్వాంసులై విశేష యశోవిరాజితులై శ్రీమంతులై సుఖమనుభవిస్తారు. ఇంతకంటే లాభం ఏం కావాలి? సాహిత్యం చదివితే అన్నీ లాభాలే. మనం చేసే తపస్సు వల్ల మనకు తేజస్సు కలుగుతుంది. సాహిత్యం చదవడమంటే ఒక తపస్సే. ‘‘తప: స్థితానాం సులభం హి సర్వమ్‌’’ ‌తపస్సులో ఉన్నవాళ్లకి అన్నీ సులభమే. ‘‘తపో మూల మిదం సర్వం దైవ మానుషకం సుఖమ్‌’’ ‌లోకంలో మానవులకు కలిగే దైవిక సుఖమైనా మానుష సుఖమైనా అతడు చేసుకున్న తపస్సు వల్లనే కలుగుతుంది.

మూలం:

  1. సాహిత్యం ఎందుకు చదవాలి బై తిరుమల రామచంద్ర (యువభారతి ప్రచురణ) పేజి-1 టు 31

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor