కాలం మారుతోంది, నగల పెట్టెలో నిక్షిప్తమై ఉండాల్సిన బంగారం ఇప్పుడు సరికొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు లాకర్లకే పరిమితమైన ‘స్త్రీ ధనం’ ఇప్పుడు డిజిటల్‌ ‌సావరిన్‌ ‌బాండ్లుగా, బ్యాంక్‌ ‌వడ్డీ పథకా లుగా మారి… దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్ను దన్నుగా నిలిచేందుకు సిద్ధం అవుతోంది.

‌ప్రాచీన సంప్రదాయ, సంస్కృతులను కొనసాగించడంలో బంగారానిది ప్రముఖ పాత్ర. అందం, ఆహార్యం, ఆరోగ్యం ఇలా అన్నింటా మహిళకు అండగా ఉండేదీ బంగారమే. అంతటి ప్రాముఖ్యత కలిగిన బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ• చేయొద్దు అంటూ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు, కొందరిలో ఆందోళన రేకెత్తిస్తోంది. అత్యవసరాల్లో ఆదుకునే నగలు అక్కరకు రాకుండా పోతాయని మహిళలు దిగులు చెందుతున్నారు. బ్యాంకుల్లో సైతం రుణాలకు పరిధులు విధించడం మధ్య తరగతి మహిళలు శరాఘాతంగా భావిస్తున్నారు. ప్రధాని పిలుపులో అంతరార్థం తెలియక పరేషాన్‌ అవుతున్నారు.

భారతీయ సంస్కృతిలో బంగారం కేవలం ఒక నగ కాదు. అది మహిళల సమాంతర బ్యాంకింగ్‌ ‌వ్యవస్థ. దీన్నే స్త్రీ ధనం అంటారు. ఆపత్కాలంలో మహిళకు ధైర్యాన్నిచ్చే ఏకైక ఆస్తి ఇది. మహిళకు పూర్తి హక్కు ఉండే ఆస్తి ఉన్న బంగారం. భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభం వచ్చి, ఉద్యోగాలు పోయినా మెడికల్‌ ఎమర్జెన్సీ వచ్చినా… కుటుంబాన్ని ఆదుకోవడానికి మొదట తాకట్టు పెట్టేది, అత్యవసరం అయితే అమ్మేది మహిళల బంగారాన్నే. ఆ బంగారం చేజారిపోతే, మహిళలు తమ ఆర్థిక స్వయంప్రతిపత్తిని కూడా కోల్పోతారు. భారతీయ మహిళలకు బంగారానికి ఉన్న అనుబంధం కేవలం ఒక లోహంతో ఉన్నది కాదు. అది ఒక సెంటిమెంట్‌. ‌బంగారం భారతీయ మహిళల ఆత్మగౌరవం. బంగారం అంటే ఒంటిపై మెరిసే నగ మాత్రమే కాదు, పుట్టింటి జ్ఞాపకం, మెట్టినింటి పరువు, ప్రతిష్ట.

బంగారం,పెట్రోల్‌, ఆర్థిక సంక్షోభాలకు… మన దేశంలోని మహిళల జీవితాలకు అత్యంత బలీయమైన, విడదీయరాని బంధం ఉంది. ఆర్థిక వ్యవస్థలో పెట్రోల్‌ ‌ధరలు పెరిగినప్పుడు వచ్చే నిత్యావసరాల ధరల పెరుగుదల, బంగారానికి పెరిగే డిమాండ్‌… ఇవన్నీ మహిళల జీవితాలనే ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ధరలు విపరీతంగా పెరిగితే, ఆ భారం పరోక్షంగా ఇంట్లో ఉండే మహిళలపైనే పడుతుంది. పెట్రోల్‌ ‌ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి పాలు, కూరగాయలు, కిరాణా సామాగ్రి, వంటగ్యాస్‌ అన్ని ఆకాశాన్ని తాకుతాయి. మధ్య తరగతి, పేద కుటుంబాల్లో బడ్జెట్‌ను నిర్వహించేది మహిళలే కాబట్టి… ఆదాయం సరిపోనప్పుడు, మహిళలు కుటుంబం కోసం తమ బంగారు నగలను ఆర్థికవనరుగా వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధాని పిలుపుతో ఆ అవకాశం ఇక ముందు ఉండదేమోనని మధ్యతరగతి మహిళలు భయపడుతున్నారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మహిళలు బ్యాంకులు లేదా ప్రైవేట్‌ ‌ఫైనాన్స్ ‌సంస్థల్లో గోల్డ్ ‌లోన్స్ ‌తీసుకుంటారు. సంక్షోభం సుదీర్ఘంగా కొనసాగి, వడ్డీలు కట్టలేకపోతే బ్యాంకులు ఆ బంగారాన్ని వేలం వేస్తాయి. దీనివల్ల తరతరాలుగా వచ్చే కుటుంబ సంపద శాశ్వతంగా చేజారిపోతుంది. అంతర్జాతీయ మార్కెట్‌ ఒడుదొడుకుల వల్ల బంగారం ధరలు విపరీతంగా పెరిగితే, మధ్యతరగతి, పేద కుటుంబాల మహిళలు భవిష్యత్తు కోసం కనీస మొత్తంలో కూడా బంగారాన్ని కొనుగోలు చేయలేరు.

ముఖ్యంగా పెట్రోల్‌ ‌ధరల వల్ల పెరిగిన ద్రవ్యోల్బణంతో మహిళలు నడిపే చిన్న వ్యాపారాల లాభాలు తుడిచిపెట్టుకుపోతాయి. ఇటు వ్యాపారాన్ని కాపాడుకోవడానికి, అటు ఇంటి ఖర్చుల కోసం వ్యక్తిగత బంగారాన్ని తాకట్టు పెడతారు. సంక్షోభం తీవ్రమైతే, అటు రుణాలు తీర్చలేక, ఇటు బంగారాన్ని విడిపించుకోలేక తీవ్ర రుణభారంలో మునిగిపోతారు. అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలను, నిబంధనలను అమల్లోకి తెస్తోంది.

అంతర్జాతీయంగా యుద్ధభయాలు నెలకొన్న ప్పుడు,  ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు షేర్‌ ‌మార్కెట్ల నుంచి  డబ్బులు తీసేసి అత్యంత సురక్షిత మైన బంగారంపై పెట్టుబడి పెడతారు. దీనివల్ల ధరలకు రెక్కలొస్తాయి. అలాంటి పరిస్థితుల్లో మహిళలు భవిష్యత్తు రక్షణ కోసం కనీస మొత్తంలో కూడా బంగారాన్ని కొనలేరు. ఒకవేళ ఇంట్లో పెళ్లిళ్లు, అత్యవసరాలు ఉంటే, అధిక ధరలకు కొనలేక అప్పులపాలు కావాల్సి వస్తుంది. బంగారం అమ్మకా లపై తొందరపడకూడదు. రేట్లు పెరుగుతున్నాయని కంగారుపడి చేతిలో ఉన్న బంగారాన్ని ప్రైవేట్‌ ‌వడ్డీ వ్యాపారులకు అమ్మేయడం లేదా తాకట్టు పెట్టడం చేయకూడదు. అత్యవసర పరిస్థితుల్లో చిన్న మొత్తాల కోసం బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవడం మంచిది. అలాగే ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం అనుకున్నవారు బ్యాంకుల నిబంధనలకు లోబడి రుణాలు తీసుకుంటే అన్నివిధాలుగాను శ్రేయస్కరం.

ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు, కుటుంబంలో అన్నిటి కంటే ఎక్కువ ఒత్తిడిని, ఇబ్బందులను ఎదుర్కొనేది మహిళలే. పరిమితమైన ఆదాయంతో ఇల్లు గడపడం, పిల్లల చదువులు, ఆరోగ్యం చూసు కోవడం మహిళల చేతుల్లోనే ఉంటుంది. ఆర్థికంగా తమను తాము కాపాడుకొనేందుకు మెళకువలను పాటించాలి. విలాసాలు, అవసరాలు రెండు భాగాలుగా విభజించి… ఆచితూచి ఖర్చు చేయాలి. వెచ్చాలు, పాలు, మందులు వంటి తప్పనిసరి అవసరాలను గుర్తించి, అవి మాత్రమే జరిగేలా చూసుకోవాలి. ఆర్థికం సంక్షోభం రాకముందే అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలంటూ ప్రధాని పిలుపునివ్వడం గమనార్హం.

 బంగారం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు లోని అంతరార్థం తెలియక చాలామంది ఆందోళన చెందుతున్నారు. అయితే అన్నది, మహిళలు ఒంటిపై వేసుకునే నగలనో, దాచుకునే కొద్దిపాటి బంగారం గురించో కాదు. కొందరు కిలోల కొద్దీ బంగారాన్ని బిస్కెట్లు, కాయిన్ల రూపంలో లాకర్లలో పెట్టేస్తారు. అది దేశ ప్రగతికి ఉపయోగపడేలా పెట్టుబడిగా మారాలన్నదే ప్రభుత్వం ఆలోచన. అంతేకాక బ్యాంకుల్లో బంగారు రుణాలపై నిబంధనలు కఠినతరం చేయడానికి కారణం మహిళలను ఇబ్బంది పెట్టడం కాదు.

ధరలు అకస్మాత్తుగా పడిపోతే బ్యాంకులు నష్టపోకుండా ఉండేందుకు రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌కొన్ని నిబంధనలు పెడుతుంది. ప్రభుత్వ ప్రయత్నం మధ్యతరగతి వారిని అడ్డుకోవాలని కాదు. కేవలం బంగారం కొనొద్దు అన్నదే ప్రమాణంగా తీసుకోకూడదు. దానికి బదులు మహిళలకు లాభం చేకూర్చే అద్భుతమైన ప్రత్యామ్నాయాలను తీసుకొస్తుందన్న విషయాన్ని కూడా గమనించాలి. మహిళల ఆర్థిక భద్రతను కాపాడుతూనే, భౌతిక బంగారం కొనుగోలును తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పథకాలను ప్రవేశపెట్టింది. అందులో భాగంగా… ప్రభుత్వం జారీ చేసే గోల్డ్ ‌బాండ్లను కొనుగోలు చేయ వచ్చు. వీటికి లాకర్‌ ‌రుసుం  కట్టక్కర్లేదు. తయారీ ఖర్చులు, తరుగు ఉండవు. బంగారం ధర పెరిగితే వచ్చే లాభంతో పాటు, ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2.5 శాతం అదనపు వడ్డీని నేరుగా బ్యాంక్‌ ‌ఖాతాలో జమ వేస్తుంది. అలాగే ఇళ్లలో పాత బంగారు నగలు లేదా నాణేలను ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకుల్లో డిపాజిట్‌ ‌చేయవచ్చు. మీ బంగారం బరువు ఆధారంగా ప్రభుత్వం మీకు వడ్డీ చెల్లిస్తుంది. గడువు ముగిసిన తర్వాత మీ బంగారాన్ని తిరిగి నగదు రూపంలో లేదా కొత్త కాయిన్స్ ‌రూపంలో పొందవచ్చు.

మహిళలు తమ ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం కొనుక్కునే నగల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు.అత్యవసర పరిస్థితుల్లో మీ నగలు ఎప్పుడూ మీకు అండగానే ఉంటాయి. ప్రభుత్వం కోరుకునేదల్లా ఒక్కటే… బంగారాన్ని కేవలం లాకర్లలో దాచకుండా, బాండ్ల రూపంలోనో లేదా బ్యాంక్‌ ‌స్కీముల రూపంలోనో పెడితే.. అటు దేశానికి, ఇటు మీ కుటుంబానికి రెట్టింపు లాభం ఉంటుంది.

మహిళల ఆర్థిక రక్షణ కవచమైన బంగారాన్ని మరింత శక్తిమంతంగా మార్చడం. భవిష్యత్తు ఆర్థిక సంక్షోభాలను తట్టుకోవడానికి మహిళలు కేవలం నగలు కొని దాచుకోవడమే కాకుండా, ప్రభుత్వ గోల్డ్ ‌బాండ్స్ ‌వంటి పథకాల వైపు అడుగులు వేయాలి. దీనివల్ల అటు కుటుంబానికి అదనపు ఆదాయం రావడమే కాకుండా, ఇటు దేశానికి చమురు, ఇతర అత్యవసర వస్తువులను దిగుమతి చేసుకోవడానికి అవసరమైన విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది.


బంగారం కొనాలన్నా అమ్మాలన్నా, సకాలంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. అందుకు కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు పాటించడం అవసరం. బంగారం అలంకరణకే కాకుండా ఒక మంచి పెట్టుబడి కూడా ఉపకరిస్తుందనుకొనేవారు, దాని ధర• పెరుగుదల, తగ్గుదలలను గమనిస్తూండాలి. తగ్గినప్పుడల్లా కొద్దికొద్దిగా కొనుగోలు చేయాలి. అది కూడా హాల్‌ ‌మార్కింగ్‌ ఉన్న బంగారాన్ని మాత్రమే కొనాలి.
బంగారంపై పెట్టుబడి మీరు ఏ రకంగానూ నష్టపోకుండా ఉండాలి. కొనాలి అనుకున్న బంగారాన్ని ధరించేందుకా, దాచుకునేందుకా.. అనేది ముందుగానే నిర్ణయించుకోవాలి. దాచుకునేందుకు అయితే, నాణేలు లేదా బిస్కెట్లు రూపంలో కొనుగోలు చేయడం ఉత్తమం. ఎందుకంటే వీటిపై చేతకూలి (మేకింగ్‌ ‌ఛార్జీ) తక్కువగా ఉంటాయి. ఆభరణాలు కొనుగోలుపై సుమారు ఎనిమిది నుంచి ఇరవై ఐదు శాతం వరకు తరుగు ఉంటుంది.చేత కూలి, వస్తువు తయారీ, నగిషీలకు పోగా మీరు కొన్న బంగారం బరువు కన్నా తక్కువ విలువ కలిగి ఉంటుంది. బంగారం కొనాలి అనుకుంటే.. తిరిగి అమ్మాలి అనుక్నుప్పుడు ఆ ఆభరణం విలువ అప్పటి మార్కెట్‌ ‌రేటుతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. కొన్న సమయం కన్నా అమ్మే సమయానికి రేటు పెరిగితే కొంత నష్టపోకుండా ఉంటారు.
బంగారాన్ని నగలు,నాణేల రూపంలో భద్రపరచుకోవడం కష్టం అనుకునే వారికి, డిజిటల్‌ ‌గోల్డ్ ‌రూపంలో దాచుకునే అవకాశం ఇటీవల అందు బాటులోకి వచ్చింది. గోల్డ్ ఈటీఎఫ్‌, ‌సావరిన్‌ ‌గోల్డ్ ‌బాండ్స్‌గా భద్రపరచుకోవచ్చు. వీటితో భద్రతకు తోడు, వడ్డీ లాభం కూడా లభిస్తుంది.
ఆభరణాలు, నాణేలు అమ్మి నగదుగా మార్చుకోవాలి అనుకున్నపుడు కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. ముందుగా మీ వద్ద ఉన్న బంగారం క్యారట్ల విలువ తెలుసుకోండి. స్వచ్ఛతను తెలుసుకోడానికి హాల్మార్క్ ‌ముద్రను ఆభరణంపై పరీక్షించుకోవాలి. కొన్నప్పటి బిల్లులు ఉంటే, తరుగు విషయంలో మంచిధర లభించే అవకాశం ఉంటుంది. అమ్మే రోజున మార్కెట్‌లో ఉన్న కచ్చితమైన ధరను తెలుసుకోండి. కొనుగోలు,అమ్మకపు ధరలకు మధ్య కొంత వ్యత్యాసం ఉంటుందని గమనించండి. వీలయినంత వరకు మీరు కొన్న షాప్‌లోనే అమ్మేందుకు ప్రయత్నిస్తే మంచి ధర వచ్చే అవకాశం ఉంటుంది
స్వచ్ఛత పరీక్ష
ప్రభుత్వం హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసింది. నగపై ఉండే చిన్న ముద్రల ద్వారా స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. బంగారాన్ని కొనేటప్పుడు లేదా ఇంట్లో ఉన్న పాత బంగారం విలువ కట్టేటప్పుడు స్వచ్ఛతను తెలుసుకోవాలి. ఆభరణం స్వచ్ఛతను (బీఐఎస్‌ ‌కేర్‌) అధికారిక యాప్‌ ‌ద్వారా తెలుసుకోవచ్చు. నగపై ఉండే కోడ్‌ ‌ను బీఐఎస్‌ ‌కేర్‌ ‌యాప్‌లో టైపు చేస్తే ఆ నగ ఎక్కడ తయారైంది, దాని స్వచ్ఛత ఎంత అనే పూర్తి వివరాలు వస్తాయి. బంగారు షాపుల్లో లేదా తాకట్టు పెట్టే కేంద్రాల్లో యాసిడ్‌ ‌టెస్ట్ ‌చేస్తారు. బంగారాన్ని ఒక రాయిపై గీసి, ఆ గీతపై నైట్రిక్‌ ‌యాసిడ్‌ ‌వేస్తారు. రంగు మారకుండా ఉంటే అది స్వచ్ఛమైన బంగారం. రంగు మారితే అందులో ఇతర లోహాలు కలిసినట్లు అర్థం. నీటి ద్వారా కూడా పరీక్ష చేయవచ్చు. ఒక గ్లాసు నీటిలో బంగారాన్ని వేసినప్పుడు అది పూర్తిగా అడుగుకు వెళ్లాలి. బంగారం సాంద్రత ఎక్కువ కాబట్టి అది నీటిపై తేలదు. ఇది శాస్త్రీయమైన పద్ధతి. ఈ పద్దతిలో బంగారం కోటింగ్‌ ఉన్న వాటిని కనిపెట్టడం కొంచెం కష్టం. బంగారానికి అయస్కాంత తత్వం ఉండదు. కాబట్టి అయస్కాంతంతో కూడా పరీక్షించవచ్చు. ఆభరణం ఆకర్షితమైతే అందులో ఇనుము లేదా ఇతర లోహాలు కలిశాయని అర్థం. అయితే ఇటువంటి ఇంటి పరీక్షల కంటే దగ్గరలోని షాపుల్లో మెషిన్‌ ‌పరీక్ష చేయించడమే మెరుగయిన పద్ధతి.

జయశ్రీ ఆచంట
సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE