యూఎస్-ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో రోజుకు 1.3 కోట్ల నుండి 2 కోట్ల బారెళ్ల ముడి చమురు సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఇంధన సంక్షోభంలో కూరుకు పోయాయి. ఈ సంక్షోభానికి ప్రధాన కారణం హార్ముజ్ జలసంధి పూర్తిగా మూతపడటం! ప్రపంచ చమురు వ్యాపా రంలో 20% వాటా ఈ సముద్ర మార్గం ద్వారానే జరుగుతుంది. ఇరాన్ సైనిక ఆంక్షలు, డ్రోన్ దాడుల వల్ల ఈ మార్గంలో ఓడల ప్రయాణం పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, యూఏఈ తదితర దేశాల నుంచి చమురు సరఫరా నిలిచిపోయింది.
యుద్ధానికి ముందు బ్యారల్‌కు 70 డాలర్లు ఉన్న బ్రెంట్ ముడి చమురు ధర, ఏప్రిల్ నాటికి రికార్డు స్థాయిలో 120-122 డాలర్లకు చేరినా, మే నాటికి, యూఎస్-ఇరాన్ మధ్య జరుగుతున్న సంధి చర్చల వల్ల మార్కెట్ ఒత్తిడి కొద్దిగా తగ్గింది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 100 డాలర్లకు పైనే కొనసాగుతోంది. హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురులో 90% ఆసియా దేశాలకే వెళ్తుంది. భారత్ తన వంటగ్యాస్‌లో 90% పైగా, రోజుకు 25 లక్షల బ్యారెళ్ల చమురును ఈ మార్గం ద్వారానే దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ మార్గం మూతపడటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైనే ఉండటం వల్ల మనదేశంలో రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. దీనివల్ల దేశంలో పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయి. చమురు దిగుమతుల కోసం భారత్ ఎక్కువ మొత్తంలో డాలర్లను చెల్లించాల్సి వస్తోంది. డాలర్లకు డిమాండ్ పెరగడంతో, అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. దేశంలోకి వచ్చే విదేశీ మారక ద్రవ్యం కంటే, బయటకు వెళ్లే ద్రవ్యం (ముఖ్యంగా చమురు బిల్లుల రూపంలో) ఎక్కువగా ఉండటం వల్ల బడ్జెట్ లోటు, కరెంట్ ఖాతా లోటు భారీగా పెరిగాయి. పరిస్థితిని అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం వైజాగ్, మంగళూరు, పాడూరులలో ఉన్న భూగర్భ వ్యూహాత్మక చమురు నిల్వల నుండి చమురును విడుదల చేస్తోంది. రష్యా, బ్రెజిల్, ఆఫ్రికా దేశాల నుండి హార్ముజ్ జలసంధితో సంబంధం లేని సురక్షిత మార్గాల ద్వారా చమురు దిగుమతులను పెంచడానికి భారత్ చర్చలు జరుపుతోంది. ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 90% చైనాకే వెళ్తుంది. ప్రస్తుతానికి చైనా తన అత్యవసర నిల్వలు, సరఫరాలపై ఆధారపడుతోంది. ఇంధన ధరలు భారీగా పెరగడంతో యూరప్‌లో తయారీ రంగం దెబ్బతిని ఆర్థిక వ్యవస్థ క్షీణించింది. అమెరికా స్వంతంగా చమురు ఉత్పత్తి చేసుకుంటున్నప్పటికీ, అంతర్జాతీయ ధరల ప్రభావం వల్ల అక్కడ గ్యాసోలిన్ (పెట్రోల్) ధర 4 ఏళ్ల గరిష్టానికి అంటే గ్యాలన్‌కు 4.56 డాలర్లకు చేరింది. ఈ పరిణామాలను స్థూలంగా పరిశీలిస్తే ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం, గల్ఫ్ ప్రాంతం నుండి వచ్చే ఇంధనంపై ప్రపంచం ఎంతగా ఆధారపడి ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది. ఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి, చమురు ధర విపరీతంగా పెరిగింది. నౌకా రవాణా, ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన వైమానిక దాడులు, అలాగే ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతును మోసుకెళ్లే కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేయడం ముడి చమురుధర పెరగడానికి ప్రధాన కారణం.
దెబ్బతిన్న సముద్ర వ్యాపారం
ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాలో 20%, ఎల్‌ఎన్‌జీ సరఫరాలో 19% హార్ముజ్ జలసంధి దిగ్బంధం వల్ల నిలిచిపోయింది. మధ్యప్రాచ్యంలోని 80కి పైగా ఇంధన కేంద్రాలపై ఇరాన్ జరిపిన దాడుల వల్ల రోజుకు 13 మిలియన్ బ్యారళ్ల చమురు ఎగుమతులు నిలిచిపోయాయి. సూయజ్ కాల్వ, బాబ్ ఎల్-మండెబ్ మార్గాల్లో దాడుల వల్ల ప్రపంచ సముద్ర వ్యాపారంలో మూడోవంతు నిలిచి పోయింది. దీంతో పెద్ద షిప్పింగ్ కంపెనీలు తమ సేవలను నిలిపేశాయి. ముడిచమురుతో పాటు, పెట్రోకెమికల్స్, ఎరువులు, ప్లాస్టిక్ వంటి పారిశ్రామిక ఉత్పత్తుల తయారీ, రవాణా కూడా నిలిచిపోయిం ది. యూరోపియన్ గ్యాస్ ధరలు 100% పెరిగాయి. ముడి చమురు దిగుమతులపై ఆధారపడే ఆసియా/యూరప్ దేశాల కరెన్సీ విలువలు పడిపోయి, ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరుకుంది. యుద్ధం వల్ల అమెరికా ఎగుమతి ఆదాయం గణనీయంగా పెరిగింది. దేశ జీడీపీ స్థిరమైన వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం అంచుకు చేరుతుండగా, అమెరికా మాత్రం యుద్ధం నెగళ్లలో చక్కగా చలి కాచు కుంటోంది. అక్కడి చమురు ఉత్పత్తి కంపెనీలు విపరీతంగా లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ సగటు అమెరికన్లు పెరిగిన ధరలతో ఇక్కట్లు పడుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం 0.6% నుంచి 0.7%కు పెరిగింది. నిత్యావసరాల ధరలు పెరిగి అన్ని దేశాల్లో సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఐరోపా దేశాల కరెన్సీ విలువలు పడిపోయాయి. ఈ దేశాల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచడంతో వ్యాపారాలు కష్టమై, ఆర్థిక మాంద్యం ప్రమాదం పెరిగింది. విమాన ఇంధన ధరలు రెట్టింపు కావడం, సముద్ర ప్రయాణ బీమా ప్రీమియంలు పెరగడంతో అంతర్జాతీయ వ్యాపారంలో లాభాలు లేక, కొన్ని మార్గాలను మూసివేశారు.
ఆసియాలో తీవ్రం
ప్రస్తుత ఇంధన సంక్షోభ ప్రభావం ఆసియాలో ఉన్నంత తీవ్రంగా మరెక్కడా లేదు. గత ఏడాది హోర్ముజ్ జలసంధి గుండా రవాణా అయిన మొత్తం చమురు, గ్యాస్‌లో దాదాపు 90% ఈ ప్రాంతానికే కావడం గమనార్హం. పర్షియన్ గల్ఫ్ సంక్షోభం వల్ల ముఖ్యంగా ఆగ్నేయా సియా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాయి. మలేషియా, ఇండోనేషియా వంటి స్వయంగా చమురును ఉత్పత్తి చేసే దేశాలు కూడా గత దశాబ్ద కాలంలో క్రమంగా ఉత్పత్తిని తగ్గించి, దిగుమతులను పెంచుకోవడం ప్రారం భించాయి. మధ్యప్రాచ్యంలో ఉత్పత్తి అయ్యే చమురు రకం, అలాగే ఆ ప్రాంతం లోని దేశాలు దానిని శుద్ధి చేసే విధానం కూడా ఈ పరిస్థితికి పాక్షికంగా కారణం. మధ్యప్రాచ్య ముడి చమురు సాధారణంగా ‘హెవీ సోర్’ లేదా ‘మీడియం సోర్’ రకానికి చెందింది. ఆగ్నేయాసియాలోని రిఫైనరీలు ఈ రకమైన ముడి చమురును శుద్ధి చేయడానికే ఏర్పాటు చేయడంవల్ల, అమెరికా వంటి మరో సరఫరాదారుకు మారడం అంత సులభం కాదని నిపుణులు పేర్కొం టున్నారు. ఎందుకంటే రిఫైనరీ స్పెసిఫికేషన్లను మార్చడానికి గణనీయమైన పెట్టుబడి అవసరం అవుతుందనేది వారు చెప్పేమాట!
పెరిగిన పెట్రోల్ ధరలు
ఆసియాలో కనిపించినంత స్థాయిలో కాకపోయినా, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. అమెరికాలో నెల రోజుల క్రితంతో పోలిస్తే సగటు పెట్రోల్ ధరలు 23% పెరగ్గా, డీజిల్ ధరలు వ•డో వంతు పెరిగాయి. యూకేలో డీజిల్ ధర 9% పెరిగింది. ప్రభుత్వాలు ఈ విషయంపై నిఘా ఉంచుతున్నాయి.పెరుగుతున్న చమురు ధరలపై ఆందోళనను తగ్గించడానికి దక్షిణ కొరియా ఇంధన ధరలపై తాత్కాలిక పరిమితిని విధించింది. రిటైల్ పెట్రోల్ ధరలను అదుపులో ఉంచడానికి, చమురు టోకు వ్యాపారులకు సబ్సిడీలు అందిస్తామని జపాన్ ప్రభుత్వం తెలిపింది. ఆసియాలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా, ఈ సంక్షోభాన్ని తట్టుకునే స్థితిలో ఉంది. సంవత్సరాలుగా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను నిర్మించుకుంది. ఈ నిల్వలు కొన్ని నెలలపాటు చైనా ఇంధన అవసరాలను తీరుస్తాయి. అనధికారికంగా, అమెరికా ఆంక్షల పరిధిలో ఉన్న ఇరాన్ చమురును కూడా చైనా లక్షలాది బ్యారెళ్ల మేర కొనుగోలు చేస్తున్నది. నౌకల కదలికలను గమనించే డేటా ప్రకారం, ఇందులో కొంత చమురు ఇంకా సరఫరా అవుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి అదనంగా, ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో 4.6 కోట్ల బ్యారెళ్లకు పైగా ఇరాన్ ముడి చమురును తేలియాడే విధానంలో నిల్వ చేసింది. గమనించాల్సిన విషయమేంటంటే చైనాలో అమ్ముడయ్యే కొత్త కార్లలో వ•డింట ఒక వంతు ఎలక్ట్రిక్ కార్లే కాబట్టి, పెట్రోల్ ధరల పెరుగుదల ప్రభావం అక్కడ అంత తీవ్రంగా ఉండదు. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే, విద్యుత్ ఉత్పత్తి విషయంలో చైనా చమురుపై చాలా తక్కువగా ఆధారపడుతుంది. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో అధిక భాగం బొగ్గుతోనే జరుగుతుంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇటీవల ప్రకటించిన ఒప్పందానికి అనుగుణంగా, ఆసియా ఖండంలోని ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన జపాన్, దక్షిణ కొరియా, తమ జాతీయ నిల్వల నుండి లక్షలాది బ్యారెళ్లను విడుదల చేయడానికి అంగీకరించాయి.అయినప్పటికీ, 2022లో ఉక్రెయిన్‌పై దాడి జరిగిన నేపథ్యంలో రష్యా చమురు, గ్యాస్ కొనుగోలును తగ్గించాలని నిర్ణయించుకున్నప్పటి నుండి, ఈ రెండు దేశాలు మధ్యప్రాచ్య ఇంధనంపై ఆధారపడటం పెరిగింది.
యూరప్‌కు గ్యాస్ సమస్య
యూకే, ఈయూ ఇప్పుడు తమ ద్రవీకృత సహజ వాయువులో ఎక్కువ భాగాన్ని నార్వే, యూఎస్ నుండి దిగుమతి చేసుకుంటున్నాయి. ఒక అంచనా ప్రకారం ఈయూ తన గ్యాస్‌లో కేవలం 10% మాత్రమే ఖతార్ నుండి నేరుగా పొందుతుండగా, యూకే సుమారు 2% పొందుతోంది. కానీ యూరప్‌లోని దేశాలు గల్ఫ్ నుండి గ్యాస్ సరఫరాలో తగ్గుదల ప్రభావానికి తక్కువగా గురైనప్పటికీ, ప్రపంచంలోని అతిపెద్ద ఎగుమతి దారులలో ఒకటైన ఖతార్ ఎనర్జీ, తన ప్లాంట్లపై జరిగిన ‘‘సైనిక దాడుల’’ కారణంగా ఇటీవల ఉత్పత్తిని నిలిపివేసింది. దీని ప్రభావం యూరప్‌పై కొంతమేర పడిందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. గల్ఫ్ దేశాల గ్యాస్‌ను పొందలేని ఆసియా వినియోగదారులు ఇతర మార్గాలకు మరలడంతో గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. అయితే ఇందుకు అమెరికా మినహాయింపనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవలి సంవత్సరాలలో అది సొంత గ్యాస్ ఉత్పత్తిని పెంచుకోవడమే ఇందుకు కారణం. ప్రస్తుత షాక్ నుంచి ఆమెరికా సురక్షితంగా ఉండ టానికి ఇదే ప్రధాన కారణం. అయితే గ్యాస్‌ను ఎగుమతి చేసే సామర్థ్యం విషయంలో అమెరికాకు కొన్ని పరిమితులున్నాయి. కానీ గల్ఫ్ దేశాలనుంచి సరఫరాల నష్టాన్ని పూడ్చడానికి ఈ ప్రత్యామ్నాయాలు సరిపోవన్నది మాత్రం సుస్పష్టం.
ఇజ్రాయెల్ కీలకం
ఇరాన్‌తో యూఎస్, ఇజ్రాయెల్ దేశాలు జరుపుతున్న యుద్ధానికి ముగింపు పలికితేనే ప్రపంచం చమురు సంక్షోభం నుంచి బయట పడగలుగుతుంది. ఈ విషయంలోనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుల మధ్య దాదాపు గంటసేపు వాగ్వాదం జరిగిందని వార్తలు వచ్చాయి. జరుగు తున్న పరిణామాలను పరిశీలిస్తే, గల్ఫ్ సంక్షోభం ఇప్పుడే ముగిసేలా లేదు. అబ్రహామిక్ ఒప్పందాలపై సంతకాలు పెట్టాలని డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా వంటి ముస్లిం దేశాలపై ఒత్తిడి తీసుకురావడం వెనుక ఇజ్రాయెల్ ఉన్నదన్నది వేరే చెప్పాల్సిన పనిలేదు. 60 రోజుల తాత్కాలిక అవగాహనా ఒప్పందంపై అమెరికా, ఇరాన్ ప్రతి నిధులు ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒప్పందం అమల్లోకి వస్తే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చి, ఇరు వర్గాలు మళ్లీ చర్చలు ప్రారం భించే అవకాశముంది. అట్లాగని పశ్చిమాసియాలో శాంతి వీచికలు వీస్తాయనుకోవడం కూడా భ్రమే! ఎందుకంటే ఈ యుద్ధానికి కీలకం ఇజ్రాయెల్! ఆ దేశం అంగీకరించకుండా యుద్ధం ఒక కొలిక్కి రావడం కష్టమే! ఎందుకంటే ఇజ్రాయెల్- హిజ్ బుల్లాల పరస్పర దాడులు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. యూఎస్, ఇరాన్‌లు ఒక ఒప్పందానికి వచ్చినా అది తాత్కాలికమే కానీ, శాశ్వత ప్రాతిపదికన వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. అందువల్ల పశ్చిమాసియా సంక్షోభం కొనసాగే అవకాశాలే అధికం!

జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్