పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం నమోదు చేసిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సువేందు అధికారి నాయ కత్వంలో మే 9వ తేదీన కొలువు దీరడం తెలిసిందే. బెంగాల్‌కు ఇది చారిత్రాత్మక ఉదయం ‘సోనార్ బంగ్లా యుగానికి శ్రీకారం చుట్టినట్లు సువేందు అధికారి ప్రకటించారు. ‘‘స్వాతంత్య్రం తర్వాత ఆ రాష్ట్రంలో బీజేపీ తొలి ప్రభుత్వం ఏర్పాటు ద్వారా మన స్థాపకుల కలలను సాకారం చేస్తున్నాం. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగిన దుర్వినియోగ పాలనకు ముగింపు పలుకుతున్నాం. ఇక నుంచి అభివృద్ధి, శాంతి, సుసంపన్నత లక్ష్యంగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పనిచేస్తుంది. ‘సోనార్ బంగ్లా’ యుగానికి అధికారిక ఆరంభం’’ అని ప్రకటించారు సువేందు.
దేశ ప్రజల దృష్టి పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వంపై ఉంది. తృణవ•ల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఓడించి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సువేందు అధికారి, ఇక ఏమాత్రం జాప్యం లేకుండా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోపే తొలి మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
నూతన ప్రభుత్వం సుపరిపాలన, భద్రతను అందిస్తుందని సీఎం సువేందు అధికారి హామీ ఇచ్చారు. తమ ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వం దేశంలోని ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు అనుసరిస్తున్న అభివృద్ధి మార్గంలోనే ముందుకు సాగుతుందని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆదర్శాలకు, ‘ప్రజల కోసం- ప్రజల ద్వారా-ప్రజలచేత’• అనే సూత్రానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని వివరించారు. సుదీర్ఘ కాలం తర్వాత రాష్ట్రంలో భయం, హింసకు తావులేని, నిష్పాక్షిక ఎన్నికలు జరిగాయని, ఈ పక్రియలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ మంత్రివర్గం కృతజ్ఞతలు తెలిపిందని పేర్కొన్నారు.
సరిహద్దులో కంచె నిర్మాణం
బాంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయడానికి, కంచె నిర్మాణానికి అవసరమైన భూములను 45 రోజుల్లోగా సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్‌ఎఫ్) బదిలీ చేయాలన్నది కొత్త ప్రభుత్వ నిర్ణయాల్లో ముఖ్యమైనది. ప్రాథమి కంగా 27 కి.మీ. మేర సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన భూమిని అందజేశారు.సరిహద్దు భద్రతను మెరుగుపరిచేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం కేవలం ప్రారంభం మాత్రమేనని, అవసరమైతే అక్కడ మరింత భూమిని కేటాయిస్తా మని చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దులో ఇంకా చాలా భాగం కంచె లేకుండానే ఉంది. బెంగాల్, బాంగ్లాదేశ్ మధ్య మొత్తం 2,200 కి.మీ సరిహద్దు ఉంది. ఇప్పటికే సుమారు 1600 కి.మీ మేర కంచె నిర్మించగా, దాదాపు 600 కి.మీ మేర సరిహద్దు ఎలాంటి కంచె లేదు. మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు విధానాలతో సరిహద్దు మౌలిక సదుపాయాల కల్పనకు సహకరించలే•దని విమర్శించారు సువేందు. పైగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకించారన్నారు.
చొరబాటుదారులను నేరుగా బీఎస్‌ఎఫ్‌కు అప్పగించే విషయమై గతేడాది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఒక లేఖ పంపింది. అయితే ఆనాటి సర్కార్ ఈ కీలకమైన నిబంధనను అమలు చేయడంలో విఫలమైంది. ఓటు బ్యాంకు రాజకీయాలు, బుజ్జగింపు విధానాల కారణంగా భూమి ఇవ్వలేదు. అంతేకాదు గత కొన్ని సంవత్సరాలుగా సరిహద్దు ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసులు, బీఎస్‌ఎఫ్ దళాలకు, పాలనా యంత్రాంగం మధ్య సమన్వయ సమా వేశాలు జరగలేదు. ఇకపై ఇలాంటి సమావేశాలు క్రమం తప్పకుండా జరుగుతాయని సువేందు అధికారి స్పష్టం చేశారు.
సీఏఏ అమలు
బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేస్తామని ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. ‘అక్రమ వలసదారులపై మరింత కఠిన విధానాన్ని అనుసరిస్తాం. సీఏఏ పరిధిలోకి రాని వారిని చొరబాటుదారులుగా పరిగణిస్తాం. రాష్ట్ర పోలీసులు వారిని అరెస్టు చేసి బీఎస్‌ఎఫ్‌కు అప్పగిస్తారు. తరువాత దేశం నుంచి బహిష్కరిస్తాం’’ అని తేల్చి చెప్పారు. పౌరసత్వ చట్టంలోని నిబంధన లను ప్రస్తావిస్తూ, ‘సీఏఏ పరిధిలోకి వచ్చే ఏడు సామాజిక వర్గాలకు చెందినవారు, నిర్ణీత గడువు తేదీకి ముందు (2024 డిసెంబర్ 31 లోపు) భారత్‌లోకి ప్రవేశించినవారికి మాత్రం మినహా యింపు ఉంటుంది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకోలేరు. పౌరసత్వ సవరణ చట్టం పరిధిలోకి రాని వారిని దేశ బహిష్కరణ చేస్తాం. ఈ పక్రియను ప్రారంభించేందుకు బీఎస్‌ఎఫ్ అధికారులు, బాంగ్లాదేశ్ సరిహద్దు భద్రత సంస్థతో సమన్వయం చేసుకుంటారు. ఈ చట్టం వెంటనే అమలులోకి వస్తుంది’’ అని సీఎం వివరించారు.
రాష్ట్రంలో అక్రమంగా నివాసం ఉంటున్న బాంగ్లాదేశీయులను న్యాయస్థానాల ముందు హాజరు పరచకుండా, నేరుగా బీఎస్‌ఎఫ్‌కు అప్పగించాలని పోలీసులకు, రైల్వే రక్షక దళం అధికారులకు సీఎం సువేందు అధికారి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సీఏఏ పరిధిలోకి రాని బాంగ్లాదేశ్ చొరబాటుదారుడినీ ఇకపై కోర్టులకు తరలించవద్దని, వారికి సరైన ఆహారం, సంరక్షణ కల్పించిన తర్వాత నేరుగా బీఎస్‌ఎఫ్ సరిహద్దు అవుట్‌పోస్టుకు అప్పగించాలని పేర్కొన్నారు.
గత 15 ఏళ్లలో తృణవ•ల్ కాంగ్రెస్ గూండాల చేతిలో హత్యకు గురైన 321 మంది బీజేపీ కార్యకర్తల కుటుంబాలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బాధిత కుటుంబాలు కోరుకుంటే ప్రభుత్వం విచారణ ప్రారంభిస్తుందని ముఖ్యమంత్రి తె•లిపారు.
కాగా, గతంలో ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులను తిరిగి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021 అసెంబ్లీ, 2023 పంచాయతీ ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ కేసులను అప్పటి మమత ప్రభుత్వం వ•సివేసింది. సంబంధిత కేసులను తిరిగి తెరవాలని సీనియర్ పోలీసు అధికారులను ముఖ్యమంత్రి సువేందు ఆదేశించారు. డీఐజీ, అదనపు డైరెక్టర్ జనరల్స్, జోనల్ ఇన్‌స్పెక్టర్ జనరల్స్, రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్స్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తదితరు లతో సహా సీనియర్ పోలీసు అధికారుల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో మతహింసను ప్రేరేపించే వారిపై బెయిల్‌కు అవకాశం లేని నేరాల కింద కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి పోలీసులను ఆదే శించారు. పోలీసులు నిర్భయంగా పని చేయాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. నేరచరితులకు భద్రత ఉపసంహరణమరో కీలక పరిణామం. ఇందులో భాగంగా మమత మేనల్లుడు, టీఎంసీ కీలక నాయకుడు అభిషేక్ బెనర్జీకి ఉన్న భారీ భద్రతను అధికారిక హోదా, ముప్పు అంచనా ఆధారంగా సమీక్షించనున్నారు.
నాడు రక్షకులే భక్షకులు
ఆర్జీకర్ హత్యాచార ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో, దర్యాప్తు చేయడంలో తీవ్రమైన పరిపాలన లోపాలు, నిర్లక్ష్యం, బాధితురాలి కుటుంబా నికి లంచాలు ఇవ్వజూపిన ఆరోపణలపై ఐపీఎస్ అధికారులు ముగ్గురిని (వినీత్ గోయల్, ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాపై) ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వారిపై కఠిన చర్యలు తీసుకుంటు న్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆగస్టు 9, 2024 రాత్రి ఆర్జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించి నాటి మమతా బెనర్జీ ప్రభుత్వం, సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిందని, ప్రధాన నిందితులను రక్షించడానికి ప్రయత్నించిందని ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తులో లోపాలు ఉన్నాయని హైకోర్టు కూడా తప్పు పట్టింది. వాస్తవాలను వెలికితీయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. తాజా ఎన్నికల్లో ఆర్జీ కర్ హత్యాచార బాధితురాలి తల్లి రత్నా దేవనాథ్‌ను బీజేపీ పానీహట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు.
పశువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం
పశువుల అక్రమ రవాణా అరికట్టడానికి బీజీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. బాంగ్లాదేశ్‌లో గొడ్డు మాంసానికి విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో బెంగాల్, బిహార్, జార్ఘండ్ రాష్ట్రాల నుంచి దొంగిలించిన పశువులను సరిహద్దు దాటించి అమ్ముకునే ముఠాలు చాలా ఉన్నాయి. ఈ అక్రమ రవాణా స్మగ్లింగ్, సిండికేట్ నెట్‌వర్క్‌లను పూర్తిగా అంతం చేస్తామని సువేందు ప్రభుత్వం ప్రకటించింది. సరిహద్దులోని దినాజ్‌పూర్, మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో అక్రమ పశువుల మార్కెట్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. చట్టబద్ధమైన, లైసెన్స్ పొందిన పశువుల మార్కెట్లు మాత్రమే పనిచేయాలి.
మతపర వేతనాలు రద్దు
రాష్ట్రంలో మతపరమైన ప్రోత్సాహకాలను నిలిపివేస్తూ మరో సంచలన ప్రకటన చేశారు సువేందు అధికారి. ఇకపై ఇమామ్‌లు, ముయజ్జిన్‌లు, ఆలయ పూజారులకు ఇచ్చే నెలవారీ గౌరవ వేతనం నిలిపివేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయిం చింది. మమతా బెనర్జీ ప్రభుత్వ కాలంలో నిధుల పంపిణీలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయడానికి రిటైర్డ్ జస్టిస్ బిశ్వజిత్ దాస్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేశారు. రహదారులపై నమాజును నిషేధించింది. మతపరమైన ప్రదేశాలలో లౌడ్ స్పీకర్ల వాడకంపై కూడా ఆంక్షలు విధించింది. లౌడ్ స్పీకర్ల శబ్దం ఆయా ప్రార్థనా మందిరాల ప్రాంగణాన్ని దాటి బయటకు రాకూడదని ఆదేశించింది.
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రతిరోజూ ఉదయం జరిగే అసెంబ్లీ ప్రార్థనల్లో ‘వందేమాతరం’ ఆలపించడాన్ని తప్పనిసరి చేశారు. ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందుతున్న (ఎయిడెడ్), గుర్తింపు పొందిన మదర్సాలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ గీతం ఆలపించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఉద్యోగాలకు గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది. గత ప్రభుత్వం చేసిన జాప్యం కారణం, నోటిఫికేషన్లు రావడం ఆలస్యం కావడం, పరీక్షలు వాయిదా పడటం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు పరీక్ష రాయకుండానే వయోపరిమితి దాటిపోయారు. ఈ వయెపరిమితి పెంపు మే 11 నుంచి అమల్లోకి వచ్చాయి.
బిస్వా బంగ్లా తొలగింపు
జాతీయ చిహ్నం స్థానంలో మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన ‘బిస్వా బంగ్లా’ లోగోను తొలగిస్తూ సువేందు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా దేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బెంగాలీ అక్షరం ‘బ’ చుట్టూ రూపొందించిన ఈ లోగోను తృణవ•ల్ కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ వెబ్‌సైట్‌లు,మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల్లో ఉపయోగించారు. దీనికి బదులుగా భారతదేశ జాతీయ చిహ్నమైన అశోక స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పలు ప్రభుత్వ విభాగాలు, సేవలకు లింక్‌లను అందించే ‘ఎగియే బంగ్లా’ పోర్టల్‌లో ఇప్పుడు బిస్వా బంగ్లా లోగో స్థానంలో అశోక స్తంభాన్ని ఏర్పాటు చేశారు.
అక్రమ కట్టడ్డాలపై బుల్‌డోజర్
ప్రభుత్వం స్థలాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న అక్రమ కట్టడాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా కోల్‌కతా, దాని పరిసర మెట్రోపాలిటన్ ప్రాంతాల్లోని అక్రమ కట్టడాల కూల్చివేతలు ప్రారంభించింది. హౌరా, సీల్దా రైల్వేస్టేషన్ల దగ్గర బుల్డోజర్లతో వందల దుకాణాలను తొలగించారు.