సంఘర్షణల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రాధాన్యత లేని దిగుమతులను వాయిదా వేసుకోవాలి. డాలర్ ఆధారిత వాణిజ్య లావాదేవీలు, కరెన్సీ మార్పిడులు, డాలరేతర ఒప్పందాలపై భారీగా దృష్టి పెట్టాలి.
భారతీయ రూపాయి దాడికి గురవుతోందా? ఒక అమెరికన్ డాలర్‌కు రూ.100 అనే మానసిక అవరోధాన్ని మారకం నిష్పత్తి దాటుతుందా? దానివల్ల భారత ఆర్థిక వ్యవస్థ బాహ్య కరెన్సీ మార్కెట్ కదలికలకు మరింత సున్నితంగా లేదా బలహీనంగా మారుతుందా? లేక, చమురు, సమరం కారణమా?
ఈ రోజుల్లో విపరీతంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న రూపాయి విలువను ఎలా అర్థం చేసుకోవాలి? రూపాయి నిరంతర పతనాన్ని అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఆర్‌బీఐ అనుసరిస్తున్న వ్యూహంపై భారతదేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పదహారవ ఆర్థిక సంఘం ఛైర్మన్ డాక్టర్ అరవింద్ పనగరియా నేతృత్వంలోని ఒక పెద్ద వర్గం, ఒక అమెరికన్ డాలర్‌కు రూపాయి విలువ 100 రూపాయల మార్కును దాటడాన్ని అంత తీవ్రంగా పరిగణించకూడదని వాదిస్తోంది. రూపాయి స్వేచ్ఛా పతనం లేదా విలువ తరుగుదల కోసం ఒత్తిడి చేస్తూ, ఇటీవల రాసిన తన కాలమ్‌లో డాక్టర్ పనగరియా ‘‘అది కేవలం ఒక సంఖ్య మాత్రమే’’ అని పేర్కొన్నారు.
ముడి చమురు కొరత కొనసాగుతున్నందున, డాలర్‌కు ఫార్వర్డ్ మార్కెట్ రేటును ఒక్కో మారకం విలువకు రూ.100గా నిర్ణయించడం, భారతీయ కరెన్సీ భవిష్యత్తుపై పెద్ద చర్చకు దారితీసింది.
మార్కెట్లలో జోక్యం చేసుకుని, తన వద్ద ఉన్న భారీ విదేశీ మారక నిల్వలతో రూపాయిని కాపాడవద్దని ఆర్‌బీఐకి డాక్టర్ పనగరియా సలహా ఇచ్చారు. చమురు కొరత, రిటైల్ స్థాయిలో అధిక ద్రవ్యోల్బణం, వీటికి తోడు ఆరోగ్యకరమైన వడ్డీ రేట్లు కలిసి రూపాయి స్వేచ్ఛా పతనానికి కారణమవు తున్నాయి, దీంతో రూపాయి విలువ డాలర్‌కు 97 రూపాయలను దాటింది.
రూపాయి విలువ విషయంలో మరింత సంప్రదాయబద్ధమైన విధానాన్ని అనుసరించాలని ఒక ముఖ్యమైన బృందం సిఫార్సు చేసింది. రూపాయి విలువ మరింతగా పడిపోయి డాలర్‌ను 100 రూపాయల వద్దకు చేర్చవద్దని ఆర్‌ఎస్‌ఎస్ స్ఫూర్తితో ఏర్పడిన స్వదేశీ జాగరణ్ మంచ్-ఎస్‌జేఎం ఆర్‌బీఐని కోరింది.
ఎస్‌జేఎం వాదన ప్రకారం అలా జరిగిన పక్షంలో దేశీయ పరిశ్రమలకు, వ్యాపార వర్గానికి దిగుమతులు ఖరీదైనవిగా మారతాయి. ఉత్పత్తులు, సేవల ధరలు వేగంగా పెరిగి, తద్వారా వినియోగ డిమాండ్‌పై ప్రభావం పడి, చివరికి వృద్ధి దెబ్బతింటుంది. ఒకవేళ రూపాయి విలువ డాలర్‌కు 100కి మించి పడిపోతే, స్వావలంబన లేదా స్వదేశీ అనే నినాదంతో సాగుతున్న ‘మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్’ ప్రచారానికి ఆటంకం కలుగుతుంది.
ఫార్వర్డ్ మార్కెట్లలో అమెరికన్ డాలర్ విలువ ఇప్పటికే రూ. 100 దాటి ఉన్నందున, రూపాయి విలువ మరింత పడిపోవడం రాజకీయంగా కూడా ఆమోదయోగ్యం కాకపోవచ్చు. భారతదేశపు వైవిధ్యభరితమైన ఇంధన విభాగంలో ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడం కూడా దాని ప్రభావాన్ని చూపింది.
ఉదాహరణకు, ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2026 మధ్య ముడి చమురు ధరలు 70 శాతానికి పైగా పెరగడం భారత్ ఇంధన దిగుమతుల బిల్లుపై తీవ్ర ప్రభావం చూపింది. గత సంవత్సరంలో బ్యారెల్‌కు 67.62 డాలర్లుగా ఉన్న ముడి చమురు మొత్తం ధర ప్రస్తుత కాలంలో 114.48 డాలర్లకు చేరింది. బ్యారెల్‌కు ముడి చమురు ధరలో పెరిగే ప్రతి డాలర్, భారతదేశానికి ఒక బిలియన్ డాలర్లకు పైగా దిగుమతుల బిల్లుకు దారితీస్తుంది.
ద్రవ్యలోటు పెరగడం, ఇంధనంపై సబ్సిడీ బిల్లు విపరీతంగా పెరగడం, అలాగే వ•లధన పెట్టుబడులు, అభివృద్ధి ప్రాజెక్టులపై వ్యయాన్ని తగ్గించాల్సి రావడం వంటి కారణాల వల్ల, బ్యారెల్‌కు మొత్తం ధర 85 డాలర్లకు చేరినా కూడా 2026-27 బడ్జెట్ అంచనాలపై ఒత్తిడి పడవచ్చు. ఇటీవల అమలు చేస్తున్న పొదుపు చర్యల కోసం ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు వెనుక ఉన్న తర్కం, కారణం, హేతుబద్ధతను ఇది అందిస్తుంది.
ఈ నేపథ్యంలో, డాక్టర్ పనగరియా వంటి వారి నేతృత్వంలోని ఉదారవాదులు, నిల్వలను పెంచడానికి డాలర్లలో ప్రభుత్వ పత్రాలను జారీ చేయడం లేదా అధిక వ్యయంతో కూడిన ఎన్నారై డిపాజిట్ల ద్వారా డాలర్లను సమీకరించడం వంటి చర్యలను వ్యతిరేకించారు. కరెన్సీ విలువలో పెరుగుదలలకు అనుగుణంగా చెల్లింపులను వాయిదా వేయడం లేదా కరెన్సీ లాభాలను ఎన్నారైలకు బదిలీ చేయడం సరైన మార్గం కాదని వారు వాదించారు.
దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించడం, ప్రాధాన్యత లేని దిగుమతులను వాయిదా వేయడం, ‘వ్యాపార సౌలభ్యం’ పరంగా భారతదేశంలోని వస్తు, సేవల పరిశ్రమను ఆకర్షణీయంగా మార్చడం ఉత్తమమైన మార్గం.
మార్చి, 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, భారతదేశం 95 బిలియన్ డాలర్ల స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను-ఎఫ్‌డీఐ ఆకర్షించింది. కానీ, పెట్టుబడుల నిష్క్రమణలు, లాభాల తరలింపు, పెట్టుబడుల ఉపసంహరణలు మొదలైనవి, వడ్డీ చెల్లింపులను మినహాయించిన తర్వాత నికర పెట్టుబడులు కేవలం 7.7 బిలియన్ డాలర్లుగా మాత్రమే నమోదయ్యాయి. నికర ఎఫ్‌డీఐ పెట్టుబడులను వేగంగా విస్తరించేందుకు ప్రయత్నిం చాల్సిన అవసరం ఉంది. మొదటగా, ఈ ఆర్థిక సంవత్సరంలో నికర ఎఫ్‌డీఐ ప్రవాహాలను 25 బిలియన్ డాలర్లకు లక్ష్యంగా పెట్టుకోగలమా?
రెండవది, మధ్యకాలికం నుండి దీర్ఘకాలికం వరకు కరెన్సీ మార్పిడులు అనే ఆలోచనను బ్యాంకర్లు, విధాన రూపకర్తలు విస్మరించలేరు. కరెన్సీ మార్కెట్‌లోని అస్థిరతను ఉపయోగించు కోవడం, పొజిషన్లు తీసుకోవడం అనేది ఒక ప్రణాళికాబద్ధమైన పద్ధతిలో చేయవలసిన విషయం.
గత ఏడాది కాలంలో యూఎస్ డాలర్ల అమ్మకంపై ఆర్‌బీఐ మంచి లాభాలను ఆర్జించిందని కరెన్సీ వ్యాపారులు ఇప్పటికే నివేదించారు. కరెన్సీ నష్టాలను తగ్గించే మార్పిడులతో పాటు, మార్కెట్లలోని అస్థిరత ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి ఆర్‌బీఐ, అగశ్రేణి భారతీయ బ్యాంకులు డాలర్ వ్యాపారాన్ని కొనసాగించాలి. ఏప్రిల్ 1, 2026తో ముగిసిన గత ఏడాది కాలంలో, రూపాయిని కాపాడటానికి లేదా లాభాలను ఆర్జించడానికి ఆర్‌బీఐ 53 బిలియన్ డాలర్ల్లను విక్రయించింది. నేటి వరకు, భారతదేశ విదేశీ మారక నిల్వలు 688.9 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు నివేదితమైంది.
యూఎస్ డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించి, భారతదేశ విదేశీ మారక ద్రవ్య బాస్కెట్‌ను విస్తరించడం, వైవిధ్యపరచడం ఒక ప్రత్యామ్నా యంగా ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా భారతదేశం, తమ ఆర్థిక వ్యవస్థను ‘డీ-డాలరైజింగ్’ చేయాలనే ఆలోచనను అధ్యక్షుడు డొనాల్డ్ జె ట్రంప్ వ్యతిరేకించవచ్చు. కానీ, వాణిజ్య ఒప్పందాలను స్థానిక కరెన్సీలలో పరిష్కరించు కోవడం ఒక పెద్ద అవకాశంగా మారవచ్చు. బ్రిక్స్ గ్రూపునకు అతీతంగా, ఆయా కరెన్సీలలో వస్తు, సేవల వాణిజ్య పరిష్కారాలను పరిగణించవచ్చు.
బంగారం, వెండి దిగుమతులను ఒక సంవత్స రానికి వాయిదా వేయడం కూడా చెడ్డ ప్రత్యామ్నాయం కాదు. 2025-26 సంవత్సరంలో, 702 టన్నుల బంగారం దిగుమతులపై ఏకంగా 71.98 బిలియన్ డాలర్ల భారీ మొత్తం ఖర్చయింది. 2024-25తో పోలిస్తే బంగారం దిగుమతుల బిల్లులో 24 శాతం పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల కలిగే భారీ ఆర్థిక వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని, కుటుంబాలు తమ బంగారం, వెండి కొనుగోళ్లను విడతల వారీగా చేసుకోవడంలో ఏమాత్రం నష్టం లేదు.
విదేశీ మారక ద్రవ్య వినియోగం కోసం ప్రాధాన్యతా రంగాలను పునఃసమీక్షించడం లేదా పునఃనిర్వహించడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించవచ్చు. ఉదాహరణకు, ఫార్మాస్యూటికల్ రంగం విదేశీ మారక ద్రవ్యాన్ని అధికంగా వినియోగించే రంగాలలో ఒకటి. ముఖ్యంగా, తుది వినియోగ ఫార్ములేషన్ల ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల కోసం దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక్కడ కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రాణరక్షక మందులకు, పునఃఎగుమతి ప్రయోజనాల కోసం ఉత్పత్తి చేసిన మధ్యంతర, ఫార్ములేషన్లకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు.
సంఘర్షణ పరిస్థితులను ఎదుర్కోవడానికి కరెన్సీ నిల్వలతో ఒక ప్రత్యేక ‘యుద్ధ నిధి’ని సృష్టించడం ఒక గొప్ప ఆలోచన కావచ్చు. వ్యూహాత్మక చమురు నిల్వల తరహాలోనే, సంఘర్షణ కరెన్సీ నిల్వలను ఎందుకు నిర్మించకూడదు? ఇటీవలే, ప్రధానమంత్రి మోదీ తన సంక్షిప్త పర్యటనలో, వ్యూహాత్మక చమురు నిల్వలను 36 మిలియన్ బ్యారెళ్ల మేర పెంచడానికి ఒక ఒప్పందం కుదిరింది.
ప్రతి సంవత్సరం, ఆర్‌బీఐ మిగులు నిధులలో కొంత భాగాన్ని యుద్ధ నిధి నిల్వలకు కేటాయించ వచ్చు. ఇది, ఆర్‌బీఐ ముడి చమురు నిల్వల వలె నిర్వహించే సాధారణ విదేశీ మారక నిల్వలకు అదనం. ఉదాహరణకు, రూ. 2.87 లక్షల కోట్ల మిగులు నిధులను ఆర్‌బీఐ ప్రభుత్వానికి డివిడెండ్‌గా బదిలీ చేస్తుంది. ఒకవేళ ప్రతి సంవత్సరం ఆర్‌బీఐ మిగులు నిధుల నుండి రూ. లక్ష కోట్లను ప్రత్యేక యుద్ధ నిధికి బదిలీ చేస్తే, బహుశా దీనిని సంఘర్షణ సంబంధిత ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉపయోగించుకో వచ్చు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కరెన్సీల విషయంలో బహుళ మార్గాలను అనుసరించాల్సి రావచ్చు.